కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
జీపీఎస్ గెజిట్ రద్దు చేసి.. పాత పెన్షన్ విధానం తేవాలని డిమాండ్
16, 17 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు ఏపీటీఎఫ్ వెల్లడి
సాక్షి, అమరావతి/నూజివీడు/సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం(జీపీఎస్) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కూటమి పార్టీలు మాట తప్పి తమను నిలువునా మోసం చేశాయని మండిపడ్డాయి. వెంటనే గెజిట్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం తీసుకురావాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించాయి.
ఇది దుర్మార్గం: ఎస్‌జీటీఎఫ్
ఎన్నికల ప్రచారంలో జీపీఎస్ దుర్మార్గమని ప్రచారం చేసి.. ఇప్పుడు అంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తారా? అని కూటమి ప్రభుత్వంపై సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్(ఎస్‌జీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెరగడ్డ సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం జీపీఎస్‌పై ముందుకు వెళ్లలేదన్నారు. కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు సరైన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చాయన్నారు. కానీ ఇప్పుడు ఏకపక్షంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసం చేశాయని మండిపడ్డారు.
మాట తప్పడం అన్యాయం: సీపీఎస్ ఉద్యోగుల సంఘం
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సీపీఎస్, జీపీఎస్‌పై సమీక్ష జరిపి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామంటూ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు ఎలాంటి సమీక్ష లేకుండా గెజిట్ జారీ చేశారని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు గార్లపాటి సునీల్ మండిపడ్డారు. గెజిట్ రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
సహనాన్ని పరీక్షించొద్దు: ఆప్టా
ఉద్యోగుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న జీపీఎస్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం(ఆప్టా) డిమాండ్ చేసింది. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి ప్రకా‹Ùరావు ఓ ప్రకటనలో హెచ్చరించారు.
మేం కోరుకున్నది ఓపీఎస్: బీటీఏ
కూటమి ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ప్రభుత్వంపై బహుజన టీచర్స్ అసోసియేషన్(బీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మనోజ్ కుమార్, సీహెచ్.రమేశ్ మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుకున్నది పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్) మాత్రమేనన్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పిన కూటమి పారీ్టలు.. అధికారంలోకి వచ్చాక జీపీఎస్ గెజిట్ జారీ ద్వారా ముంచేసిందని మండిపడ్డారు.
16, 17 తేదీల్లో నిరసన: ఏపీటీఎఫ్
జీపీఎస్ గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని.. 2004లోపు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన టీచర్లు, పోలీసులు, ఉద్యోగులకు ఓపీఎస్‌ను పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈనెల 16, 17 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేయనున్నట్టు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి తెలిపారు. బాలికలపై అత్యాచారాలను అరికట్టే లా, పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని, 12వ పీఆర్సీ ప్రక్రియ మొదలుపెట్టాలని, ఆలోగా 30 శాతం మధ్యంతర భృతి విడుదల చేయాలన్నారు.
పాత పెన్షన్ విధానమే కావాలి: పీఆర్టీయూ ఏపీ
పాత పెన్షన్ విధానమే కావాలని.. జీపీఎస్ గెజిట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ–ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా క్రిష్ణయ్య డిమాండ్ చేశారు. 2023 జూలై నుంచి నూతన పీఆర్సీ అమలు చేయాలని, అంతవరకు ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment