Vehicle tracking system
-
సాంకేతికతతో వాహన చోరీకి చెక్
గుడ్లవల్లేరు: మన ఇంటి ఎదుట సీసీ కెమెరాలున్నా.. లాక్ చేసిన వాహనాలు సైతం చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాల చోరీని అరికట్టవచ్చు. ఒకవేళ వాహనాలు చోరీకి గురైనా దొంగలను ఇట్టే పట్టించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుంది. అదే వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే విజయవంతమైంది. మన దేశంలో పట్టణాల్లో ఉపయుక్తమవుతోంది. లక్షల వ్యయంతో లారీలు, కార్లు, బైకులు కొనుగోలు చేసే వాహనదారులు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కొంతఖర్చుతో అమర్చుకోవాలని పోలీసు, రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. జీపీఎస్ శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ జీపీఎస్ శాటిలైట్ నుంచి సిగ్నల్స్ వీటీఎస్కు వచ్చి అక్కడి నుంచి సెల్ టవర్ ద్వారా సర్వర్‌కు వస్తాయి. వీటీఎస్ పూర్తిగా వెబ్ ద్వారా పని చేస్తుంది. మన వాహనంలో జీపీఆర్ఎస్, ఆర్ఎఫ్డీ యూనిట్‌ను అమర్చుకోవాలి. సర్వర్ నుంచి యూజర్‌కు వివరాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. వీటిని కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్లకు అనుసంధానం చేసుకోవచ్చు. తద్వారా వాహనం ఎక్కడికి వెళ్తున్నా.. మొబైల్లో చూసుకోవచ్చు. మార్కెట్లో సెక్యూర్టీ డివైజ్లుటూ వీలర్స్‌కు సైతం సెక్యూర్టీ డివైజ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా వెహికల్ డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాహనాలకు అమర్చితే చోరీలకు కళ్లెం వేసినట్లే. చోరీ చేసినా డివైజ్ యాక్టివేట్ అయి ఇంజిన్ స్టార్ట్ కాకుండా పోతుంది. ఒకవేళ బైక్‌లో డివైజ్‌ను తొలగించినా బైక్ హారన్ మోగటంతో పాటు బండి స్టార్ట్ అవ్వదు. జీపీఆర్ఎస్ ద్వారా బైకిస్ట్ ఫోనుకు అనుసంధానం చేయటం వలన ఆ మొబైల్‌కు సమాచారం వెళుతుంది. ఫోనుకు అలెర్ట్ మెసేజ్ వచ్చేస్తుంది. ఎన్నెన్నో ప్రయోజనాలు...👉మహిళల ప్రయాణంలో వెహికల్ ట్రాకింగ్‌తో ఎంతో మేలు చేకూరుతుంది. ప్రయాణంలో వారు ఎక్కడ ఉన్నదీ తెలుస్తుంది. గమ్యస్థానం చేరేంతవరకు ఆందోళన చెందకుండా ఉండవచ్చు. 👉 బ్యాంకులకు భారీ మొత్తం నగదును తరలించేటపుడు ఆ వాహనం ఎక్కడుందో బ్యాంకర్లు తెలుసుకోవచ్చు. 👉 దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు, కార్లు, విలువైన వస్తువులు తీసుకువెళ్లే భారీ కంటైనర్లు ఎక్కడి వరకు వెళ్లాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.దొంగల్ని ఇట్టే పట్టేయవచ్చు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ దొంగల్ని సైతం ఇట్టే పట్టించేస్తుంది. కార్లు, లారీల యజమానులంతా రక్షణగా సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్ముకుంటే చోరీలను అరికట్టవచ్చు. మా శాఖతో పాటు రవాణా శాఖ వారు కూడా అన్ని వాహనాలకు సాంకేతికతను వినియోగించుకోవలసిందిగా ప్రచారం చేస్తున్నాం. – ఎన్.వి.వి.సత్యనారాయణ, గుడ్లవల్లేరు ఎస్.ఐ -
ప్రతి కదలిక.. తెలిసిపోతుందిక..
సాక్షి, అమరావతి: అక్రమ రవాణాను అరికట్టడం, రహదారి భద్రత దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రయాణ, సరుకు రవాణా వాహనాల గమనాన్ని ట్రాకింగ్ చేసే వ్యవస్థను నెలకొల్పనుంది. అందుకోసం అన్ని వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. వాహనాల ట్రాకింగ్‌ను పర్యవేక్షించేందుకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. రాష్ట్రంలో దాదాపు 1.52 కోట్ల వాహనాలున్నాయి. వాటిలో రవాణాయేతర (వ్యక్తిగత) వాహనాలు 1.35 కోట్ల వరకు ఉంటాయని అంచనా. మిగిలిన దాదాపు 17 లక్షల వాహనాలు వాణిజ్య వాహనాలు. వాటిలో ప్రయాణ వాహనాలు, సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. ఈ 17 లక్షల వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. కేంద్ర రవాణాశాఖ తాజా మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది. వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును 2023 ఏప్రిల్ నుంచి దశలవారీగా అమలు చేయాలని రవాణాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదట ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల బస్సులకు ట్రాకింగ్ పరికరాలు అమరుస్తారు. ట్రాకింగ్ విధానాన్ని పర్యవేక్షిస్తారు. లోటుపాట్లు ఉంటే సరిచేసిన అనంతరం అన్ని ప్రయాణ, సరుకు రవాణా వాహనాలకు ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటుచేస్తారు. 2024 జనవరి నాటికి రాష్ట్రంలో అన్ని వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటు పూర్తిచేయాలని రవాణాశాఖ భావిస్తోంది. 24/7 పర్యవేక్షణ ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేసిన వాహనాల ట్రాకింగ్‌ను 24/7 పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐసీతో రవాణాశాఖ త్వరలో ఒప్పందం చేసుకోనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు రూ.20 కోట్లు వెచ్చించనున్నారు. వాహనాల ట్రాకింగ్‌ను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు అవసరమైన ఆధునిక సమాచార సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు అక్కడ విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఎన్ఐసీ శిక్షణ ఇస్తుంది. అక్రమాలు, నేరాలకు అడ్డుకట్ట అక్రమ రవాణాను అరికట్టడం, రహదారి భద్రత కోసమే ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాకింగ్ పరికరం ఏర్పాటుతో వాహనాలు ఏ మార్గంలో ఏ సమయంలో ఎంతవేగంతో ప్రయాణిస్తోంది పర్యవేక్షించవచ్చు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తించి సంబంధిత ప్రాంతంలోని పోలీసు, రవాణాశాఖ అధికారులను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయమై ఆ వాహనాల యజమానులకు సమాచారం ఇస్తారు. దీంతో యజమానులు తమ డ్రైవర్‌కు ఫోన్‌చేసి వేగాన్ని నియంత్రించమని ఆదేశించేందుకు అవకాశం ఉంటుంది. వాహనాల యజమానులు కూడా తమంతట తాముగా ఆ వాహనాల ట్రాకింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఇక అక్రమ రవాణాను సమర్థంగా అరికట్టేందుకు ఈ ట్రాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. స్మగ్లింగ్, ఇతర దందాల్లో ఉపయోగించే వాహనాలు ఏయే మార్గాల్లో ప్రయాణించిందీ, అక్రమంగా తరలించే సరుకును ఇతర వాహనాల్లోకి మార్చినా ఇట్టే కనిపెట్టవచ్చు. అక్రమ రవాణా దందాకు కేంద్రస్థానం, వాటి గమ్యస్థానాన్ని కూడా గుర్తించవచ్చు. ఇక కిడ్నాప్‌లు, ఇతర నేరాల్లో నేరస్తులు ఉపయోగించే వాహనాల గమనాన్ని గుర్తించి సంబంధిత ప్రాంతంలో పోలీసులను అప్రమత్తం చేయవచ్చు. కేసు విచారణలో ట్రాకింగ్ రికార్డును సాక్ష్యాధారాలుగా సమర్పించవచ్చు. ఇది దోషులకు శిక్షలు విధించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే విక్రయం రాష్ట్రంలో ప్రయాణ, సరుకు రవాణా వాహనాలకు అవసరమైన ట్రాకింగ్ పరికరాల సరఫరాకు రవాణాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. వాహన యజమానులు తమ వాహనాలకు ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. గుర్తింపు పొందిన డీలర్ల నుంచే ట్రాకింగ్ పరికరాలు కొనుగోలు చేయాలని స్పష్టం చేయనుంది. తగిన నాణ్యత ప్రమాణాలతో ట్రాకింగ్ పరికరాలను సరఫరాచేసే డీలర్లకు రవాణాశాఖ గుర్తింపునిస్తుంది. ఒక ట్రాకింగ్ పరికరం ధర రూ.4 వేల నుంచి రూ.5 వేలలోపు ఉండేలా చూడాలని భావిస్తోంది. వాహన యజమానులకు పెద్దగా ఆర్థికభారం లేకుండానే ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేయాలన్నది రవాణాశాఖ ఉద్దేశం. -
కొత్త టెక్నాలజీతో జియో వెహికల్ ట్రాకింగ్
ఢిల్లీ : ఆటోమోటివ్ ఇండస్ట్రీ టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న వేళ రిలయన్స్ జియో మరో అడుగు ముందుకేసింది. ఆటోమోటివ్ రంగంలో సూపర్ మెకానిక్స్ ద్వారా మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ), టెలిమాటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా కూడా నడుస్తుంది. ఢిల్లీలో జరగనున్నఆటో ఎక్స్పో2020లో భాగంగా రిలయన్స్ జియో తన జియో నెట్‌వర్క్‌ను వాహనాలకు కనెక్టివిటీ చేసింది. జియో ప్రవేశపెట్టిన కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోమొబైల్ రంగం సహా పరిశ్రమలలో డిజిటల్ స్వీకరణకు,కస్టమర్ అనుభవాలను వివరించడానికి జియో కృషి చేయనుంది.ఆటో ఎక్స్పో 2020లో వెహికల్ కనెక్టివిటీతో ఆటోమోటివ్ కనెక్టివిటీ సొల్యూషన్స్, సర్టిఫైడ్ డివైజెస్ & హార్డ్‌వేర్ , ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ & సర్వీసెస్ ప్లాట్‌ఫామ్, ఇండియా వైడ్ సర్వీసెస్ & సపోర్ట్ నెట్వర్క్ సేవలను జియో అందించనుంది. -
వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఎంతో సేఫ్
ఓ వాహనం ఎక్కడ ఉందో గుర్తించేందుకు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఎంతో ఉపయుక్తంగా మారింది. విలువైన గూడ్స్‌ను ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాహనాలను మార్గమధ్యంలో హైజాక్ చేసే అవకాశాలుంటాయి. లారీలేకాదు ఏవాహనానికికైనా జీపీఎస్‌ను అమర్చుకుంటే తమవాహనం ఎక్కడుందో తెలుసుకోవడం సులభంగా ఉంటుంది. ఇదే స్మార్ట్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్. జీపీఎస్‌ను వాహనాలకు అమర్చుకోవాలని ఎంవీఐ అధికారులు సూచిస్తున్నారు. చిత్తూరు: స్మార్ట్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అభివృద్ది చెందిన దేశాల్లో ఇప్పటికే విజయవంతంగా అమలవుతోంది. మన ప్రాంతంలోనూ ఎంవీఐ అధికారులు జీపీఎస్‌ను వాహనాలకు అమర్చుకోవాలంటూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే పలు కార్పొరేట్ స్కూల్స్, కళాశాల బస్సులకు దీన్ని అమలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు బస్సు సర్వీసులు సైతం వెబ్ ఆధారిత సేవలను ప్రారంభించాయి. ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఇసుక రవాణా చేసే వాహనాలకు జీపీఎస్, వీటీఎస్ పరికరాలను పెట్టుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఇదెలా పనిసేస్తుందంటే... ఇది పూర్తిగా వెబ్‌ఆధారంగా పనిసేస్తుంది. మనం ఎంచుకున్న వాహనంలో ఓ జీపీఆర్ఎస్, ఆర్ఎఫ్ఐడీ యూనిట్‌ను అమర్చుకోవాలి. జీపీఎస్ శాటిలైట్ నుంచి సిగ్నల్స్ ఆ యంత్రానికి వచ్చి, అక్కడినుంచి సెల్‌టవర్ ద్వారా సర్వర్‌కు వస్తాయి. సర్వర్నుంచి యూజర్‌కు వివరాలు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటాయి. వీటిని కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, ఐప్యాడ్లకు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఎన్నో రకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తద్వారా వాహనం ఎక్కడ వెళుతోందో చూసుకోవచ్చు. ఎన్నో లాభాలు పాల ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వాహనాలకు ఎంతగానో ఉపయోగం. అంబులెన్స్‌లకు సంబంధించి ఫోన్ చేసినపుడు వాహనం ఎక్కడ వస్తుంది, ఆస్పత్రికి ఎంతసేపట్లో చేరుతుందో తెలుసుకోవచ్చు. బ్యాంకుల సంబంధించి భారీ మొత్తంలో నగదును తరలించేటప్పుడు ఆ వాహనం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అమర్చుకుంటే మంచిది వాహన యజమానులు లక్షలు పెట్టి వాహనాన్ని కొంటున్నారు. మూడువేలు పెట్టి జీపీ ఎస్‌ను పెట్టుకోవడం లేదు. దీన్ని అమర్చుకుంటే వాహనం చోరీకి గురైనా సిగ్నళ్ల ఆధారంగా వెంటనే ట్రేస్ చేయొచ్చు. అందుకే వాహనాలకు జీపీఎస్ అమర్చుకోవాలని సూచిస్తున్నాం. –శేషాద్రిరెడ్డి, ఎంవీఐ, పలమనేరు అవగాహన కల్పిస్తున్నాం వాహనాలకు జీపీఎస్ ఉంటే అదెక్కడుందో ఇట్టే తెలిసిపోతుంది. అందుకే జీపీఎస్ అమర్చుకోవాలని సూచిస్తున్నాం. ఏ వాహనానికైనా జీపీఎస్ పెట్టుకోవడం చాలా ఉపయోగం. ముఖ్యంగా చోరీలకు గురవకుండా ఉండేందుకు వీలుంటుంది. –శ్రీధర్, సీఐ, పలమనేరు -
బీఎంసీ వాహనాలకు జీపీఎస్
సాక్షి, ముంబై: ముంబై నగరపాలక సంస్థ (బీఎంసీ) తమ వాహనాలన్నింటినీ ట్రాక్ చేయడానికి జీపీఎస్‌ను అమర్చాలని నిర్ణయించింది. కార్పొరేషన్‌కు సొంతంగా 2 వేల వాహనాలు ఉన్నప్పటికీ వీటిలో 8 వందల వాహనాలకు ఈ వ్యవస్థను అమర్చి పర్యవేక్షిస్తున్నారు. ఇకపై ఐటీ విభాగం అభివృద్ధి చేసిన వెహికిల్ ట్రాకింగ్ సిస్టిమ్ (వీటీఎస్)ను కార్పొరేషన్‌కు చెందిన అన్ని విభాగాల వాహనాలకు అమర్చనున్నారు. దీంతో కార్పొరేషన్‌కు చెందిన అన్ని వాహనాలు పూర్తి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయంపై అధికారులు నిఘాపెట్టనున్నారు. కొంత మంది కాంట్రాక్టర్లు చెత్త, మట్టిని తరలించేందుకు వాహనాలను ఉపయోగించడం లేదు. తద్వారా రవాణ ఖర్చు పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు సదరు వాహనాలపై నిఘా పెట్టేందుకు జీపీఎస్ అనుసంధానిత వీటీఎస్‌ను వాహనాలలో ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీని ద్వారా పనిలో పారదర్శకత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌కు చెందిన సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ విభాగంలో చాలా వాహనాలు ఉన్నాయి. స్టార్మ్ వాటర్ డ్రెయిన్ విభాగం, ఇతర విభాగంలో చాలా వాహనాలు ఉన్నాయి. వీటన్నింటికి కూడా ఈ వ్యవస్థను అమర్చనున్నారు. ఈ ప్రాజెక్టుకు గాను రూ.23 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనను ఇటీవలె స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదించింది. కాగా వాహనాలకు సెన్సార్లను అటాచ్ చేస్తారు. వీటిని జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారని అధికారి తెలిపారు. ఈ వ్యవస్థతో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించిన కాంట్రాక్టు పనులను కూడా పర్యవేక్షించవచ్చని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు చెత్తను సక్రమంగా తరలించడం లేదనే ఫిర్యాదులు గతంలో వెల్లువెత్తాయి. ప్రయోగాత్మకంగా ఎఫ్-సౌత్, పీ-నార్త్ వార్డులలో జీపీఎస్ వెహికిల్-ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రారంభించనున్నారు. వాహనాలలో ఈ వ్యస్థను ఏర్పాటు చేయడంతో వాహనాల కదలికలతోపాటు కేటాయించినమార్గాలను కూడా పర్యవేక్షించనున్నారు.