సాక్షి, ముంబై: ముంబై నగరపాలక సంస్థ (బీఎంసీ) తమ వాహనాలన్నింటినీ ట్రాక్ చేయడానికి జీపీఎస్‌ను అమర్చాలని నిర్ణయించింది. కార్పొరేషన్‌కు సొంతంగా 2 వేల వాహనాలు ఉన్నప్పటికీ వీటిలో 8 వందల వాహనాలకు ఈ వ్యవస్థను అమర్చి పర్యవేక్షిస్తున్నారు. ఇకపై ఐటీ విభాగం అభివృద్ధి చేసిన వెహికిల్ ట్రాకింగ్ సిస్టిమ్ (వీటీఎస్)ను కార్పొరేషన్‌కు చెందిన అన్ని విభాగాల వాహనాలకు అమర్చనున్నారు. దీంతో కార్పొరేషన్‌కు చెందిన అన్ని వాహనాలు పూర్తి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయంపై అధికారులు నిఘాపెట్టనున్నారు.
కొంత మంది కాంట్రాక్టర్లు చెత్త, మట్టిని తరలించేందుకు వాహనాలను ఉపయోగించడం లేదు. తద్వారా రవాణ ఖర్చు పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు సదరు వాహనాలపై నిఘా పెట్టేందుకు జీపీఎస్ అనుసంధానిత వీటీఎస్‌ను వాహనాలలో ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీని ద్వారా పనిలో పారదర్శకత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌కు చెందిన సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ విభాగంలో చాలా వాహనాలు ఉన్నాయి.
స్టార్మ్ వాటర్ డ్రెయిన్ విభాగం, ఇతర విభాగంలో చాలా వాహనాలు ఉన్నాయి. వీటన్నింటికి కూడా ఈ వ్యవస్థను అమర్చనున్నారు. ఈ ప్రాజెక్టుకు గాను రూ.23 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనను ఇటీవలె స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదించింది. కాగా వాహనాలకు సెన్సార్‌లను అటాచ్ చేస్తారు.
వీటిని జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారని అధికారి తెలిపారు. ఈ వ్యవస్థతో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించిన కాంట్రాక్టు పనులను కూడా పర్యవేక్షించవచ్చని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు చెత్తను సక్రమంగా తరలించడం లేదనే ఫిర్యాదులు గతంలో వెల్లువెత్తాయి. ప్రయోగాత్మకంగా ఎఫ్-సౌత్, పీ-నార్త్ వార్డులలో జీపీఎస్ వెహికిల్-ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రారంభించనున్నారు. వాహనాలలో ఈ వ్యస్థను ఏర్పాటు చేయడంతో వాహనాల కదలికలతోపాటు కేటాయించినమార్గాలను కూడా పర్యవేక్షించనున్నారు.
బీఎంసీ వాహనాలకు జీపీఎస్
Published Mon, Oct 6 2014 10:18 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement