ఓ వాహనం ఎక్కడ ఉందో గుర్తించేందుకు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఎంతో ఉపయుక్తంగా మారింది. విలువైన గూడ్స్‌ను ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు వాహనాలను మార్గమధ్యంలో హైజాక్ చేసే అవకాశాలుంటాయి. లారీలేకాదు ఏవాహనానికికైనా జీపీఎస్‌ను అమర్చుకుంటే తమవాహనం ఎక్కడుందో తెలుసుకోవడం సులభంగా ఉంటుంది. ఇదే స్మార్ట్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్. జీపీఎస్‌ను వాహనాలకు అమర్చుకోవాలని ఎంవీఐ అధికారులు సూచిస్తున్నారు.
చిత్తూరు: స్మార్ట్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అభివృద్ది చెందిన దేశాల్లో ఇప్పటికే విజయవంతంగా అమలవుతోంది. మన ప్రాంతంలోనూ ఎంవీఐ అధికారులు జీపీఎస్‌ను వాహనాలకు అమర్చుకోవాలంటూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే పలు కార్పొరేట్ స్కూల్స్, కళాశాల బస్సులకు దీన్ని అమలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు బస్సు సర్వీసులు సైతం వెబ్ ఆధారిత సేవలను ప్రారంభించాయి. ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఇసుక రవాణా చేసే వాహనాలకు జీపీఎస్, వీటీఎస్ పరికరాలను పెట్టుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది.
ఇదెలా పనిసేస్తుందంటే...
ఇది పూర్తిగా వెబ్‌ఆధారంగా పనిసేస్తుంది. మనం ఎంచుకున్న వాహనంలో ఓ జీపీఆర్‌ఎస్, ఆర్‌ఎఫ్‌ఐడీ యూనిట్‌ను అమర్చుకోవాలి. జీపీఎస్ శాటిలైట్ నుంచి సిగ్నల్స్ ఆ యంత్రానికి వచ్చి, అక్కడినుంచి సెల్‌టవర్ ద్వారా సర్వర్‌కు వస్తాయి. సర్వర్‌నుంచి యూజర్‌కు వివరాలు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటాయి. వీటిని కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, ఐప్యాడ్‌లకు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఎన్నో రకాల సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తద్వారా వాహనం ఎక్కడ వెళుతోందో చూసుకోవచ్చు.
ఎన్నో లాభాలు
పాల ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వాహనాలకు ఎంతగానో ఉపయోగం. అంబులెన్స్‌లకు సంబంధించి ఫోన్ చేసినపుడు వాహనం ఎక్కడ వస్తుంది, ఆస్పత్రికి ఎంతసేపట్లో చేరుతుందో తెలుసుకోవచ్చు. బ్యాంకుల సంబంధించి భారీ మొత్తంలో నగదును తరలించేటప్పుడు ఆ వాహనం ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
అమర్చుకుంటే మంచిది
వాహన యజమానులు లక్షలు పెట్టి వాహనాన్ని కొంటున్నారు. మూడువేలు పెట్టి జీపీ ఎస్‌ను పెట్టుకోవడం లేదు. దీన్ని అమర్చుకుంటే వాహనం చోరీకి గురైనా సిగ్నళ్ల ఆధారంగా వెంటనే ట్రేస్ చేయొచ్చు. అందుకే వాహనాలకు జీపీఎస్ అమర్చుకోవాలని సూచిస్తున్నాం. –శేషాద్రిరెడ్డి, ఎంవీఐ, పలమనేరు
అవగాహన కల్పిస్తున్నాం
వాహనాలకు జీపీఎస్ ఉంటే అదెక్కడుందో ఇట్టే తెలిసిపోతుంది. అందుకే జీపీఎస్ అమర్చుకోవాలని సూచిస్తున్నాం. ఏ వాహనానికైనా జీపీఎస్ పెట్టుకోవడం చాలా ఉపయోగం. ముఖ్యంగా చోరీలకు గురవకుండా ఉండేందుకు వీలుంటుంది. –శ్రీధర్, సీఐ, పలమనేరు
Comments
Please login to add a commentAdd a comment