వచ్చే 5 ఏళ్లలో 80 వేల వరకు కొత్త ఉద్యోగాలు
టీమ్‌లీజ్ సర్వీసెస్ సీఎస్‌వో సుబ్బురత్నం వెల్లడి
ముంబై: అగ్రిటెక్ రంగంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 60–80 వేల పైచిలుకు కొలువులు రాగలవని టీమ్‌లీజ్ సర్విసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ (సీఎస్‌వో) సుబ్బురత్నం తెలిపారు. ఏఐ డెవలప్‌మెంట్, టెక్నాలజీ, పర్యావరణహిత వ్యవసాయ సొల్యూషన్స్, సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉండగలవని పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశీయంగా అగ్రిటెక్ రంగంలో సాంకేతిక నిపుణులు, ఆపరేషన్స్ సిబ్బంది, మేనేజర్లు మొదలైన హోదాల్లో 1 లక్ష పైగా ఉద్యోగులు ఉన్నట్లు సుబ్బురత్నం వివరించారు. వ్యవసాయం ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉండగలవన్నారు. ఇక హైదరాబాద్, బెంగళూరు, పుణె, గురుగ్రామ్‌లాంటి నగరాలు అగ్రిటెక్ స్టార్టప్‌లకు కీలక కేంద్రాలుగా మారగలవని సుబ్బురత్నం చెప్పారు.
హైబ్రిడ్ ఉద్యోగాలు..
అగ్రిటెక్ రంగం ప్రధానంగా సాంకేతిక ఆవిష్కరణలు, అనలిటిక్స్ వంటి అంశాలపై దృష్టి పెడుతుంది కాబట్టి ఈ ఉద్యోగాలు సీజనల్‌గా ఉండవని పేర్కొన్నారు. సీజన్‌లో నాట్లు వేయడం నుంచి కోతల వరకు వివిధ రకాల పర్యవేక్షణ కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బంది .. ఆఫ్–సీజన్‌లో డేటా విశ్లేషణ, పరికరాల నిర్వహణ మొదలైన వాటిపై పని చేస్తారని చెప్పారు. సాధారణంగా అగ్రిటెక్ ఉద్యోగాలు హైబ్రిడ్ విధానంలో ఉంటాయన్నారు.
సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, డేటా అనలిటిక్స్, పర్యవేక్షణ బాధ్యతలను ఎక్కడి నుంచైనా నిర్వర్తించవచ్చని .. కానీ మెషిన్ ఆపరేటర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వారు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుందని సుబ్బురత్నం చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థ ఈవై నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశీయంగా వ్యవసాయంలో కేవలం 1.5 శాతమే టెక్నాలజీ వినియోగం ఉంటోందని, ఈ నేపథ్యంలో అగ్రిటెక్ కంపెనీలకు 24 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రకారం 2022 నాటికి భారత్‌లో సుమారు 450 అగ్రిటెక్ స్టార్టప్‌లు ఉన్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment