దేశంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నైపుణ్యాల లేమి
ఇంజనీరింగ్ రంగంలో 60 శాతం కంటే ఎక్కువగా ఉద్యోగావకాశాలు
ప్రముఖ రిక్రూటింగ్ కంపెనీ టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉపాధికి తగిన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. ఇంజనీరింగ్ రంగంలో గ్లోబల్ పవర్‌హౌస్‌గా భారతదేశం కీర్తి గడిస్తున్నా.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడం లేదు. పారిశ్రామిక, ఐటీ సంస్థల డిమాండ్ తీర్చడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సాధించలేకపోతున్నారు.
ఏటా దేశంలో 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు డిగ్రీ పట్టాలు తీసుకుని బయటకు వెళ్తుంటే.. వారిలో కొందరికే ఉపాధి దొరుకుతోంది. ఈ క్రమంలోనే దేశంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్యకు, ఉపాధికి మధ్య గణనీయమైన అంతరం కొనసాగుతోంది.
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రోగ్రామ్‌ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, నాణ్యమైన విద్య లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. లాభాపేక్షతో కూడిన యాజమాన్యాలు, నైపుణ్య విద్య లేకపోవడం, రోట్–లెర్నింగ్ పద్ధతులపై దృష్టి పెట్టడం, అధ్యాపకుల కొరత ఉన్నత విద్యను వేధిస్తున్న ప్రధాన సమస్యలుగా మారాయి.
నైపుణ్య లేమికి కారణాలివీ..
» పాత సిలబస్‌తోనే పాఠాలు: కోర్సు కంటెంట్ ఉపాధి తర్వాత ఉద్యోగ పరిశ్రమలో వాస్తవికతకు సహాయపడేలా ఉండటం లేదు. మార్కెట్‌కు ఏది అవసరమో భారతీయ విద్య అందించలేకపోతోంది.
» నాణ్యమైన అధ్యాపకుల కొరత: భారతదేశంలో 33వేల కంటే ఎక్కువ కళాశాలలు ఇంజనీరింగ్ డిగ్రీలు మంజూరు చేస్తున్నాయి. ఈ విద్యాసంస్థలన్నిటికీ నాణ్యమైన ఉపాధ్యాయులు లేరు. బహుళజాతి కంపెనీలు, చిన్న ఇంజనీరింగ్ కంపెనీల్లో వడపోత తర్వాత అధ్యాపకుల ఎంపిక జరుగుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో మాదిరిగా కాకుండా భారతీయ అధ్యాపకులు తెలివైన విద్యార్థులను సృష్టించే నైపుణ్యాలను అందించలేకపోతున్నారు. విద్యావంతులైన ఇంజనీర్లు ఉపాధ్యాయ వృత్తిలో అభిరుచితో కాకుండా జీవనోపాధి కోసమే చేరుతున్నారు.
» ఆవిష్కరణలు, పరిశోధన లేకపోవడం: విద్యార్థులు తమను తాము నిరూపించుకునేందుకు, ఆలోచించడానికి తగినంతగా ప్రేరణ లభించడం లేదు.
» తప్పు విద్యా విధానం: సెమిస్టర్ విధానంతో నిరంతరం విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టడానికే పరిమితమై మూల్యాంకన ప్రక్రియపైన, నిరంతర అభ్యాసంపైన ఆసక్తి చూపడం లేదు. వారు మంచి గ్రేడ్‌లను మాత్రమే
కోరుకుంటున్నారు.
» నైపుణ్యం–ఆధారిత విద్య లేకపోవడం: నైపుణ్యం ఆధారిత విద్య ఉండటం లేదు. ఇంజనీరింగ్ విద్యార్థులు వాస్తవ ప్రపంచంలో ఎదుర్కొనే సమస్యల ఆధారంగా శిక్షణ పొందటం లేదు.
» సరైన ఆంగ్ల నైపుణ్యాలు లేకపోవడం: ఇంగ్లిష్ కమ్యూనికేటివ్ నైపుణ్యాలు లేకపోవడం, విశ్లేషణాత్మక, పరిమాణాత్మక నైపుణ్యాలు నిరుద్యోగానికి కారణం అవుతున్నాయి. అంతర్జాతీయ కస్టమర్లతో కమ్యూనికేట్ చేయాల్సిన ఐటీ ఉద్యోగులకు ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రస్తుత ఉద్యోగ పరిశ్రమలో సాఫ్ట్ స్కిల్స్ చాలా ముఖ్యమైనవిగా మారాయి.
అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్ అనివార్యం
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి వృత్తిపరమైన శిక్షణతోనే సాంకేతిక విద్యను జత చేయాలని టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. తద్వారా యువ ఇంజనీర్లు తొలిరోజు నుంచీ పరిశ్రమల్లో పని చేయడానికి సిద్ధంగా ఉంటారని చెబుతోంది. అందుకే అప్రెంటిస్ షిప్, ఇంటర్న్‌షిప్ అనివార్యంగా చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
వాస్తవానికి కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసుకున్న తర్వాత శిక్షణ కోసం వారిపై ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తున్నాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లోని సమస్యలతో పాటు ఇంగ్లిష్ భాషకు సంబంధించిన సమస్యలు ఉద్యోగానికి అడ్డంకిగా మారుతున్నాయి.
ఇక్కడ టైర్–1 నగరాల నుంచి వచ్చే విద్యార్థులతో పోలిస్తే టైర్–2 నగరాల నుంచి వచ్చిన విద్యార్థులకు తక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. టైర్–2 నగరాల్లోని విద్యార్థులకు 24 శాతం తక్కువ ఉద్యోగ అవకాశాలతో పాటు జీతంలోనూ చాలా వ్యత్యాసం ఉంటోంది.
15 లక్షల్లో 10 శాతం మందికే ఉద్యోగాలు
ప్రముఖ రిక్రూటింగ్ కంపెనీ టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్íÙప్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకొస్తుంటే.. వారిలో కేవలం 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయని పేర్కొంది. దేశంలో ఇంజనీరింగ్ రంగంలో 60 శాతం కంటే ఎక్కువగా ఉద్యోగావకాశాలు ఉంటే.. వాటిలో 45 శాతం మందికి పైగా పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.
వాస్తవానికి పరిశ్రమలు సైబర్ సెక్యూరిటీ, ఐటీ, రో»ొటిక్స్, డేటా సైన్స్ వంటి డొమైన్‌లలో నైపుణ్యాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాయి. దీనికితోడు కృత్రిమ మేధ (ఏఐ)తో పోటీపడి పని చేయాల్సిన పరిస్థితుల్లో విద్యార్థులు సంప్రదాయ విద్య ఒక్కటే నేర్చుకుంటే సరిపోదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే రెండు మూడేళ్లలో ‘ఏఐ’, కట్టెడ్జ్ సాంకేతికతలో అధునాతన నైపుణ్యాలు కలిగిన సుమారు 10 లక్షల మంది ఇంజనీర్లు అవసరమని ప్రభుత్వేతర ట్రేడ్ సంస్థ ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్–సర్వీస్ కంపెనీస్’ (నాస్కామ్) అంచనా వేసింది.
డిజిటల్ ప్రతిభలో డిమాండ్–సరఫరా అంతరం ప్రస్తుతం 25 శాతం నుంచి 2028 నాటికి 30 శాతానికి పెరుగుతుందని అభిప్రాయపడింది. ఏఐ, ఆటోమేషన్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో వస్తున్న మార్పులు సైతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు సాధించడంలో సవాల్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment