Engineering graduates
-
ఉపాధి ఓకే.. నైపుణ్యాలేవి..?
సాక్షి, అమరావతి: దేశంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉపాధికి తగిన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. ఇంజనీరింగ్ రంగంలో గ్లోబల్ పవర్‌హౌస్‌గా భారతదేశం కీర్తి గడిస్తున్నా.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడం లేదు. పారిశ్రామిక, ఐటీ సంస్థల డిమాండ్ తీర్చడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సాధించలేకపోతున్నారు. ఏటా దేశంలో 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు డిగ్రీ పట్టాలు తీసుకుని బయటకు వెళ్తుంటే.. వారిలో కొందరికే ఉపాధి దొరుకుతోంది. ఈ క్రమంలోనే దేశంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్యకు, ఉపాధికి మధ్య గణనీయమైన అంతరం కొనసాగుతోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రోగ్రామ్‌ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, నాణ్యమైన విద్య లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. లాభాపేక్షతో కూడిన యాజమాన్యాలు, నైపుణ్య విద్య లేకపోవడం, రోట్–లెర్నింగ్ పద్ధతులపై దృష్టి పెట్టడం, అధ్యాపకుల కొరత ఉన్నత విద్యను వేధిస్తున్న ప్రధాన సమస్యలుగా మారాయి. నైపుణ్య లేమికి కారణాలివీ..» పాత సిలబస్‌తోనే పాఠాలు: కోర్సు కంటెంట్ ఉపాధి తర్వాత ఉద్యోగ పరిశ్రమలో వాస్తవికతకు సహాయపడేలా ఉండటం లేదు. మార్కెట్‌కు ఏది అవసరమో భారతీయ విద్య అందించలేకపోతోంది. » నాణ్యమైన అధ్యాపకుల కొరత: భారతదేశంలో 33వేల కంటే ఎక్కువ కళాశాలలు ఇంజనీరింగ్ డిగ్రీలు మంజూరు చేస్తున్నాయి. ఈ విద్యాసంస్థలన్నిటికీ నాణ్యమైన ఉపాధ్యాయులు లేరు. బహుళజాతి కంపెనీలు, చిన్న ఇంజనీరింగ్ కంపెనీల్లో వడపోత తర్వాత అధ్యాపకుల ఎంపిక జరుగుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో మాదిరిగా కాకుండా భారతీయ అధ్యాపకులు తెలివైన విద్యార్థులను సృష్టించే నైపుణ్యాలను అందించలేకపోతున్నారు. విద్యావంతులైన ఇంజనీర్లు ఉపాధ్యాయ వృత్తిలో అభిరుచితో కాకుండా జీవనోపాధి కోసమే చేరుతున్నారు. » ఆవిష్కరణలు, పరిశోధన లేకపోవడం: విద్యార్థులు తమను తాము నిరూపించుకునేందుకు, ఆలోచించడానికి తగినంతగా ప్రేరణ లభించడం లేదు. » తప్పు విద్యా విధానం: సెమిస్టర్ విధానంతో నిరంతరం విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టడానికే పరిమితమై మూల్యాంకన ప్రక్రియపైన, నిరంతర అభ్యాసంపైన ఆసక్తి చూపడం లేదు. వారు మంచి గ్రేడ్లను మాత్రమే కోరుకుంటున్నారు. » నైపుణ్యం–ఆధారిత విద్య లేకపోవడం: నైపుణ్యం ఆధారిత విద్య ఉండటం లేదు. ఇంజనీరింగ్ విద్యార్థులు వాస్తవ ప్రపంచంలో ఎదుర్కొనే సమస్యల ఆధారంగా శిక్షణ పొందటం లేదు. » సరైన ఆంగ్ల నైపుణ్యాలు లేకపోవడం: ఇంగ్లిష్ కమ్యూనికేటివ్ నైపుణ్యాలు లేకపోవడం, విశ్లేషణాత్మక, పరిమాణాత్మక నైపుణ్యాలు నిరుద్యోగానికి కారణం అవుతున్నాయి. అంతర్జాతీయ కస్టమర్లతో కమ్యూనికేట్ చేయాల్సిన ఐటీ ఉద్యోగులకు ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రస్తుత ఉద్యోగ పరిశ్రమలో సాఫ్ట్ స్కిల్స్ చాలా ముఖ్యమైనవిగా మారాయి. అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్ అనివార్యంఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి వృత్తిపరమైన శిక్షణతోనే సాంకేతిక విద్యను జత చేయాలని టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. తద్వారా యువ ఇంజనీర్లు తొలిరోజు నుంచీ పరిశ్రమల్లో పని చేయడానికి సిద్ధంగా ఉంటారని చెబుతోంది. అందుకే అప్రెంటిస్ షిప్, ఇంటర్న్‌షిప్ అనివార్యంగా చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వాస్తవానికి కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసుకున్న తర్వాత శిక్షణ కోసం వారిపై ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తున్నాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లోని సమస్యలతో పాటు ఇంగ్లిష్ భాషకు సంబంధించిన సమస్యలు ఉద్యోగానికి అడ్డంకిగా మారుతున్నాయి. ఇక్కడ టైర్–1 నగరాల నుంచి వచ్చే విద్యార్థులతో పోలిస్తే టైర్–2 నగరాల నుంచి వచ్చిన విద్యార్థులకు తక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. టైర్–2 నగరాల్లోని విద్యార్థులకు 24 శాతం తక్కువ ఉద్యోగ అవకాశాలతో పాటు జీతంలోనూ చాలా వ్యత్యాసం ఉంటోంది. 15 లక్షల్లో 10 శాతం మందికే ఉద్యోగాలుప్రముఖ రిక్రూటింగ్ కంపెనీ టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్íÙప్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకొస్తుంటే.. వారిలో కేవలం 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయని పేర్కొంది. దేశంలో ఇంజనీరింగ్ రంగంలో 60 శాతం కంటే ఎక్కువగా ఉద్యోగావకాశాలు ఉంటే.. వాటిలో 45 శాతం మందికి పైగా పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. వాస్తవానికి పరిశ్రమలు సైబర్ సెక్యూరిటీ, ఐటీ, రో»ొటిక్స్, డేటా సైన్స్ వంటి డొమైన్లలో నైపుణ్యాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాయి. దీనికితోడు కృత్రిమ మేధ (ఏఐ)తో పోటీపడి పని చేయాల్సిన పరిస్థితుల్లో విద్యార్థులు సంప్రదాయ విద్య ఒక్కటే నేర్చుకుంటే సరిపోదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే రెండు మూడేళ్లలో ‘ఏఐ’, కట్టెడ్జ్ సాంకేతికతలో అధునాతన నైపుణ్యాలు కలిగిన సుమారు 10 లక్షల మంది ఇంజనీర్లు అవసరమని ప్రభుత్వేతర ట్రేడ్ సంస్థ ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్–సర్వీస్ కంపెనీస్’ (నాస్కామ్) అంచనా వేసింది. డిజిటల్ ప్రతిభలో డిమాండ్–సరఫరా అంతరం ప్రస్తుతం 25 శాతం నుంచి 2028 నాటికి 30 శాతానికి పెరుగుతుందని అభిప్రాయపడింది. ఏఐ, ఆటోమేషన్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో వస్తున్న మార్పులు సైతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు సాధించడంలో సవాల్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్: కోటి ఉద్యోగాలున్నాయ్!
సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ ముప్పు మళ్లీ ముంచుకొస్తోందన్న ఆందోళనల మధ్య తాజా రిపోర్టు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు,ఐటీ నిపుణులకు శుభవార్త అందించింది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా వార్, అంతర్జాతీయంగా చమురు ధరల ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకుంటున్నాయన్న ఆందోళన నేపథ్యంలో టీమ్ లీజ్ నివేదిక వారికి భారీ ఊరటనిస్తోంది. ఐటీ, బీపీఎం(బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్) రంగాల్లో భారీ ఉద్యోగాలు రానున్నాయని "డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్"లో పేర్కొంది. మూడు లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనతో దేశీయ ఐటీ, బీపీఎం ఉద్యోగాలు 2023లో 7 శాతం వృద్ది నమోదుకానుందని సోమవారంతెలిపింది. అంతేకాదు మొత్తంమీద భారతదేశ ఐటీ ఉద్యోగాలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో 5 మిలియన్ల నుండి 10 మిలియన్లకు (కోటి) పెరగనుందని అంచనావేసింది. ఇండియాలో ఐటీ,బీపీఎం పరిశ్రమల వృద్ధి కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. ప్రైవేట్ రంగంలో సుమారు 3.9 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది, అలాగే దేశ జీడీపీలో 8 శాతానికి పైగా తోడ్పడుతోందని టీమ్ లీజ్ తెలిపింది. గ్లోబల్ అవుట్సోర్సింగ్ మార్కెట్లో 55 శాతం వాటాను సొంతం చేసుకుందని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ సీ వెల్లడించారు. తాజా రిపోర్టు ప్రకారం 2022 చివరి నాటికి డిజిటల్ నైపుణ్యాల డిమాండ్ 8.4 శాతం పుంజుకోనుంది. హెడ్‌కౌంట్ 5.1 మిలియన్ల నుంచి 5.45 మిలియన్లకు పెరుగుతుందని టీమ్‌లీజ్ తన ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్‌లో పేర్కొంది. అలాగే ఈ ఇండస్ట్రీలో అట్రిషన్ తదుపరి త్రైమాసికాల్లో కూడా అత్యధికంగానే ఉంటుంది, 2023లో కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు కనీసం 49 శాతం నుండి 50 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అయితే లింగ సమానత్వం మెరుగుపడుతోంది. ప్రస్తుతం 20 శాతం నుంచి 2023 ఆర్థిక సంవత్సరానికి 25 శాతానికి పెరగబోతోందని తెలిపింది. పెట్టుబడులు, కంపెనీలు కొత్త టెక్నాలజీలను ఇన్స్టాలింగ్తో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 21 శాతం పెరుగుతుందని అంచనా. ఐటీ సేవల కంపెనీలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCC), ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీలు ఈ ట్రెండ్‌లో 70 శాతానికి పైగా దోహదపడుతున్నాయని నివేదించింది. 2023లో టాప్-10 ఐటీ కంపెనీలు డిజిటల్ నైపుణ్యాలకు సంబంధించి చిన్న నగరాల అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయట. మార్కెటింగ్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డిమాండ్ వరుసగా 5 -7 శాతం, 4-6 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. అంతేకాదు ఉద్యోగాలు వెతుక్కోవడానికి ఐటీ మేధావులు నగరాలకు వెళ్లాల్సిన రోజులు పోయాయని పేర్కొంది. ముఖ్యంగా వర్క్‌ఫ్రం హోం విధానం, డిజిటల్ నైపుణ్యాలున్న వారు మెట్రోయేతర నగరాల్లో లభిస్తున్న తరుణంలో కంపెనీలే ఉద్యోగాలను వారి వద్దకే తీసుకువెళుతున్నాయని సునీల్ వెల్లడించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ఊపందుకున్నప్పటికీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 33 శాతం మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు.. ఇందులో 35 శాతం గ్రాడ్యుయేట్లు టాప్ 500 నగరాల నుంచే వస్తున్నారని టీమ్ లీజ్ నివేదించింది. -
ఇంజనీరింగ్ చదివారు.. గంజాయి అమ్ముతూ బుక్కయ్యారు!
బనశంకరి: ఇద్దరూ ఇంజనీరింగ్ పట్టభద్రులు. కష్టపడితే మంచి భవిష్యత్తు. కానీ తప్పుదోవ తొక్కి కష్టాల్లో పడ్డారు. ప్రియుని ఒత్తిడితో గంజాయి అమ్ముతూ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రేణుక (25) యువతి బెంగళూరు సదాశివనగర పోలీసులకు పట్టుబడింది. ఆమె ప్రియుడు సిద్ధార్థ్ పరారీలో ఉన్నాడు. చెన్నైలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన రేణుక, కడప జిల్లావాసి సిద్ధార్థ్ ఇద్దరూ ఒకే బ్యాచ్. కాలేజీలో ప్రేమలో పడ్డారు. చదువు ముగిశాక రేణుక చెన్నైలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. సిద్ధార్థ్ మాత్రం విలాసవంత జీవితంపై మోజుతో డ్రగ్స్ ముఠాలతో కలిశాడు. నేను కొత్త వ్యాపారాన్ని ప్రారంభించానని, ఇందులో చాలా డబ్బు వస్తుందని రేణుకకు చెప్పాడు. సరేనని ఆమె ఉద్యోగం వదిలిపెట్టి ప్రియునితో కలిసి డ్రగ్స్ దందాలోకి దిగింది. లాక్డౌన్లో గంజాయి విక్రయాలు గతేడాది కరోనా లాక్డౌన్ సమయంలో రేణుకను గంజాయి విక్రయానికి బెంగళూరుకు పంపించాడు. ఆమె మారతహళ్లి సమీపంలోని పీజీ హాస్టల్లో ఉండేది. బిహార్‌కు చెందిన సుధాంశు అనే వ్యక్తితో కలిసి గంజాయి విక్రయాలు ప్రారంభించింది. ప్రియుడు సిద్ధార్థ్ పెద్దమొత్తంలో గంజాయిని తీసుకువస్తే రేణుక చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మేది. మంగళవారం రాత్రి సదాశివనగర ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నట్లు తెలిసి సీఐ ఎంఎస్ అనిల్‌కుమార్, ఎస్ఐ లక్ష్మీలు దాడి చేసి రేణుక, సుధాంశును అరెస్ట్ చేశారు. ఇద్దరినీ పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ప్రియుని మాటలను నమ్మి తప్పు చేశానని రేణుక విలపించింది. సిద్ధార్థ్ కోసం గాలిస్తున్నారు. చదవండి: బాబోయ్ కుళ్లిన శవం వాసన.. సెల్ఫీలకు క్యూ కట్టిన జనం -
గుడ్‌న్యూస్: ప్రముఖ ఐటీ కంపెనీలో కొలువుల జాతర
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని ఈ ఏడాది భారత్‌లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. 2021లో భారతదేశంలో సుమారు 30,000 మందిని ఐటీ ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్టు క్యాప్ జెమిని సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్, 5జీ, సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డి లాంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యాలలో తాజా నియమాకలను చేపడతామన్నారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరిగిందని తెలిపారు. కోవిడ్-19 నేపథ్యంలో డిజిటల్ సొల్యూషన్కు పెరిగి భారీ డిమాండ్ తమవ్యాపార అవకాశాలను మెరుగుపర్చిందన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో క్యాప్ జెమిని ఆదాయంలో 65 శాతం వాటా క్లౌడ్ బిజినెస్, డిజిటల్ సొల్యూషన్స్‌దే కావడం గమనార్హం. కరోనానుంచి కోటుకుంటున్న సమయంలో వ్యాపారి తిరిగి పుంజుకుంటుందని, భారీ డీల్స్ సాధిస్తామనే అంచనాలతో భవిష్యత్తు మరిన్ని నియామకాలు చేపట్టాలని కూడా భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు, ఏప్రిల్ 2020 లో, మహమ్మారి పీక్ సమయంలో కూడా తాము వేతన పెంపును ప్రకటించామని వెల్లడించారు. దేశీయంగా మొత్తం 125,000 మంది ఉద్యోగులతో ఉన్నగత ఏడాది భారతదేశంలో దాదాపు 24 వేల నియామకాలను చేపట్టింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ నియామకాలు భారగా పుంజుకున్నాయి. ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ 15 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమింకోగా, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, 2021లో దాదాపు 23,000 మందిని నియమించుకోవాలని ఆశిస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువ. -
ఉద్యోగ నైపుణ్యాలపై కోవిడ్ దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: విద్యా, ఉద్యోగ అవకాశాలపై కరోనా దెబ్బ తీవ్రంగా పడింది. ముఖ్యంగా ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు, సామర్థ్యాలపై ప్రభావం చూపనుంది. దీంతో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 2.18 శాతం మేరకు ఉద్యోగ సామర్థ్యాలు తగ్గినట్లు వీబాక్స్ సర్వే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, టాగ్డ్ సంస్థ రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2021’లో వెల్లడించింది. కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా పరిశ్రమల అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల్లో అందుకు అవసరమైన సామర్థ్యా లు, వాటిపై కరోనా ప్రభావం వంటి అంశాలపై వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులు, 15 పరిశ్రమలను, 150కి పైగా కార్పొరేట్ సంస్థలను సంప్రదించింది. పలు అంశాలపై అధ్యయనం చేసి ఐఎస్ఆర్–2021ను రూపొందించింది. కరోనా ప్రభావం, ఇతరత్రా కారణాలతో 2020 కంటే 2021లో ఉద్యోగ అర్హత ఉన్నవారు దేశ వ్యాప్తంగా 0.31 శాతం తగ్గనున్నట్లు పేర్కొంది. 2019లో 47.38 శాతం ఉద్యోగ అర్హులున్నట్లు అంచనా వేయగా, 2020లో ఉద్యోగార్హత ఉన్నవారు 46.21 శాతం ఉండగా, 2021లో 45.9 శాతం ఉంటారని పేర్కొంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు దెబ్బ.. కరోనా ప్రభావం ఎంబీఏ గ్రాడ్యుయేట్లపైనా తీవ్రంగా పడింది. ఉద్యోగ సామర్థ్యాలు ఎంబీఏ విద్యార్థుల్లో 2020లో 54 శాతం ఉంటే 2021లో 46.59 శాతానికి తగ్గిపోతాయని అంచనా వేసింది. ఆ తర్వాత బీకాం గ్రాడ్యుయేట్లపైనా అధిక ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 2.18 శాతం ఉద్యోగ నైపుణ్యాలు తగ్గిపోనున్నట్లు వెల్లడించింది. 2020లో 49 శాతం మంది బీఈ/బీటెక్ విద్యార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాలు ఉండగా, 2021లో 46.82 శాతం మంది విద్యార్థుల్లోనే ఉద్యోగ సామర్థ్యాలు ఉంటాయని అంచనా వేసింది. ముందు వరుసలో హైదరాబాద్.. అత్యధిక ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులున్న పట్టణాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు, పుణే, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, కోయంబత్తూరు, నెల్లూరు, గుర్గావ్, మంగళూరు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉన్నాయి. తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న పట్టణాల జాబితాలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, కర్ణాటక ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ కల్పన అవకాశాలను పెంచుకున్నట్లు వెల్లడించింది. ఉద్యోగ, ఉపాధి వనరులు ఎక్కువ కలిగిన నగరాల్లో ముంబై ముందు వరుసలో ఉండ గా, 60 శాతానికిపైగా స్కోర్‌తో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. అధిక ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులున్న రాష్ట్రాలు రాష్ట్రం ఉద్యోగ నైపుణ్యాలున్న వారి శాతం మహారాష్ట్ర 64.17 తమిళనాడు 60.97 ఉత్తరప్రదేశ్ 56.55 కర్ణాటక 51.21 ఆంధ్రప్రదేశ్ 48.18 ఢిల్లీ 42.57 తెలంగాణ 41.31 గుజరాత్ 36.68 పశ్చిమబెంగాల్ 35.72 రాజస్తాన్ 31.87 కోర్సుల వారీగా ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు (శాతం) కోర్సు 2019 2020 2021 బీఈ/బీటెక్ 57.09 49 46.82 ఎంబీఏ 36.44 54 46.59 బీఏ 29.3 48 42.72 బీకాం 30.06 47 40.3 బీఎస్సీ 47.37 34 30.34 ఎంసీఏ 43.19 25 22.42 పాలిటెక్నిక్ 18.05 32 25.02 బీఫార్మసీ 36.29 45 37.24 -
టెకీలకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : పరిశ్రమ అవసరాలకు, సిలబస్‌కు మధ్య నెలకొన్న గ్యాప్‌ను తొలగించేందుకు ఏఐసీటీఈ చొరవ తీసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచేందుకు ఆయా కరిక్యులమ్‌ను పాఠ్యాంశాల్లో జోడించాలని కళాశాలలకు సూచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీలను సిలబస్‌లో పొందుపరిచేందుకు కసరత్తు సాగుతోంది. ఏఐసీటీఈ నిర్ణయంతో దేశంలోని 3000 ఇంజనీరింగ్, సాంకేతిక కళాశాలల్లో నూతన కరిక్యులమ్ అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స వంటి నూతన టెక్నాలీజీలపై ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు పట్టు ఉండేలా నూతన సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ, పంజాబ్ టెక్ యూనివర్సిటీ, వైఎంసీఏ ఫరీదాబాద్ సన్నాహాలు చేస్తున్నాయి. అన్ని ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్ స్ధాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పూర్తి సెమిస్టర్ ఉంటుందని, ఇతర ఇంజనీరింగ్ కాలేజీలు సైతం నూతన టెక్నాలజీలపై దృష్టిసారిస్తున్నాయని మానవ వనరుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇక ఐఐటీలు, ఎన్ఐటీలు సహా అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఇంజనీరింగ్ కాలేజీల నుంచి బయటకు వచ్చే నూతన గ్రాడ్యుయేట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దీటుగా పనిచేయగల సామర్థ్యం అందిపుచ్చుకుంటారని చెప్పారు. నూతన టెక్నాలజీలపై ఫ్యాకల్టీలకు శిక్షణ ఇచ్చేందుకు ఏఐసీటీఈ ఈ-కోర్సులను రూపొందిస్తోందని చెప్పారు. మరోవైపు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు నూతన టెక్నాలజీలపై అవగాహన కల్పించే కోర్సులు ప్రవేశపెడుతుండటం పట్ల ఐటీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. -
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లపై కన్నేసిన శాంసంగ్
శాంసంగ్ ఇండియా భారీగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. దేశవ్యాప్తంగా టాప్ కాలేజీలనుంచి వీరిని ఎంపిక చేయనుంది. 5 జీ నెట్వర్క్, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ సహా వివిధ కేటగిరీల్లో దాదాపు వెయ్యిమందిని నియమించుకోనుంది. 2018నాటికి టాప్ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి వీరిని ఎంపిక చేయాలని యోచిస్తోందని శాంసంగ్ అధికారి ఒకరు ప్రకటించారు. ముఖ్యంగా ఐఐటీలతోపాటు ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బిట్స్ పిలాని, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలు ఇందులో ఉన్నాయని తెలిపారు. 5జీ నెట్వర్క్ సహా ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్, బయోమెట్రిక్స్, సహజ భాషా ప్రాసెసింగ్, రియాలిటీ, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అగ్మెంటెడ్ రియల్టీ నెట్వర్క్లకోసం ఈ ఇంజనీర్లను నియమించాలని భావిస్తోంది. -
ఆ ఎలక్ట్రానిక్స్ దిగ్గజంలో 2500 ఉద్యోగాలు
ముంబై : శాంసంగ్ ఇండియా భారీగా ఉద్యోగ నియామకం చేపడుతోంది. దేశంలో అతిపెద్ద ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి 2500 మంది గ్రాడ్యుయేట్లను వచ్చే మూడేళ్లలో నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఈ నియామకం తన అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో ఒకటిగా కంపెనీ అభివర్ణించింది. కొత్తగా తీసుకునే నియామకాలు ఎక్కువగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా, బయోమెట్రిక్స్ వంటి వాటిలో ఉండనున్నట్టు శాంసంగ్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దిపేశ్ షా తెలిపారు. ఈ ఏడాది బెంగళూరు, నోయిడా, ఢిల్లీలోని కంపెనీ ఆర్ అండ్ డీ సెంటర్లకు ఆఫ్ క్యాంపస్ ద్వారా 1000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. ఎన్ఐటీల్లో, బిట్స్ పిలానీ, మనిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ వంటి వాటిల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నైపుణ్యమున్న విద్యార్థులను ఇప్పటికే ఈ కంపెనీ ఎంపిక చేసుకుంది. శాంసంగ్ ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతోంది. ఈ సెగ్మెంట్లో 2016లో 13 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది. గతేడాది కంటే ఈ ఏడాది 25 శాతం జంప్ కూడా చేసింది. గతేడాది ఐఐటీల్లో అతిపెద్ద రిక్రూటర్ శాంసంగ్ కంపెనీనే. తమకు అతిపెద్ద మొత్తంలో నైపుణ్యం అవసరమని, కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, మేథమ్యాటిక్స్, కంప్యూటింగ్, అప్లయిడ్ మెకానిక్స్ వంటి స్ట్రీమ్స్‌లో తాము నియామకాలు చేపట్టనున్నట్టు శాంసంగ్ ఇండియా తెలిపింది. దక్షిణ కొరియా వెలుపల కంపెనీ అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ బెంగళూరులోనే ఉంది. స్మార్ట్ డివైజ్‌లు, సెమీ కండక్టర్లు, ప్రింటర్లు, మోడమ్స్, ఇంటర్నెట్ ప్రొటోకాల్స్, నెట్వర్క్స్ వాటికి ఇక్కడ రీసెర్చ్ చేపడతారు. ఢిల్లీలో హైఎండ్ టెలివిజన్లు, ఇతర కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్‌లు, ఆపరేటింగ్ సిస్టమ్ టిజెన్లకు సంబంధించి రీసెర్చ్ చేపడతారు. నోయిడాలో బయోమెట్రిక్స్, మొబైల్ సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్, మల్టిమీడియా, డేటా సెక్యురిటీ వంటి వాటిపై రీసెర్చ్ చేస్తారు. ఈ మూడు సెంటర్లలో కలిపి మొత్తంగా 8000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. -
95 శాతం ఇంజనీర్లకు కోడ్ రాయడం కూడా రాదు!
ఇంజనీరింగ్ పూర్తి చేశాం.. నాలుగేళ్లు అవుతోంది గానీ ఇంకా ఉద్యోగం లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఓ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరిపోతున్నాం.. ఇలా చెప్పేవాళ్లు మనకు చాలామందే కనిపిస్తున్నారు. అయితే అందుకు కారణం ఏంటో తెలుసా? ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తున్నవాళ్లలో 95% మంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు అస్సలు పనికిరారట. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. యాస్పైరింగ్ మైండ్స్ అనే ఒక సంస్థ యువతీ యువకుల్లో ఉద్యోగార్హత నైపుణ్యాలు ఎంతవరకు ఉన్నాయని అంచనా వేస్తుంది. ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం, కేవలం 4.77% మంది మాత్రమే ఒక ప్రోగ్రాంకు సరైన లాజిక్ రాయగలుగుతున్నారని తెలిసింది. ప్రోగ్రామింగ్ ఉద్యోగాలు వేటికైనా ఇది కనీసం ఉండాల్సిన అర్హత. సరైన లాజిక్‌తో ప్రోగ్రాం రాయలేకపోతే అసలు వాళ్లు ఆ ఉద్యోగాలకు ఏమాత్రం పనికిరారని అర్థం. మొత్తం 500 కాలేజీలకు చెందిన ఐటీ సంబంధిత బ్రాంచీలలో చదివే 36వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నైపుణ్యాలకు సంబంధించిన ఆటోమేటా అనే ఒక టెస్ట్ పెట్టారు. వాళ్లలో మూడింట రెండొంతుల మంది అసలు కనీసం ఇచ్చిన సమస్యకు సరిపోయే కోడ్ కూడా రాయలేకపోయారు. కేవలం 1.4% మంది మాత్రమే దానికి సరిగ్గా సరిపోయి, పనిచేసే కోడ్ రాశారని తెలిసింది. మన దేశంలో విద్యార్థులకు తగిన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు లేకపోవడం ఐటీ, డేటా సైన్స్ పరిస్థితిని దారుణంగా దెబ్బ తీస్తోందని యాస్పైరింగ్ మైండ్స్ సీటీఓ, సహ వ్యవస్థాపకుడు వరుణ్ అగర్వాల్ చెప్పారు. ప్రపంచమంతా ప్రోగ్రామింగ్‌లో ఎక్కడికో దూసుకెళ్తుంటే మన పరిస్థితి మాత్రం ఇలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధాన కారణం కళాశాలల్లో ప్రోగ్రామింగ్ గురించి సరిగా చెప్పకపోవడమేనని, వేర్వేరు రకాల సమస్యలకు సరిపోయే ప్రోగ్రాంలు రాయించడం అలవాటు చేయట్లేదని అన్నారు. ప్రోగ్రామింగ్‌కు కావల్సిన మంచి అధ్యాపకులు కూడా ఉండట్లేదని, మంచి నైపుణ్యం ఉన్న ప్రోగ్రామర్లకు ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు రావడంతో వాళ్లు అటు వెళ్లిపోతున్నారని.. కాలేజీలలో చెప్పేవారికి కూడా ప్రోగ్రాంలు రాయడం, వాటిని ఎగ్జిక్యూట్ చేసి చూపించడం సరిగా తెలియట్లేదని చెప్పారు. సర్వే చేసిన వారిలో టాప్ 100 కాలేజీల నుంచి వచ్చినవాళ్లలో 69% మంది కనీసం కాస్త కోడ్ రాస్తున్నారని, మిగిలిన కాలేజీలలో అయితే కేవలం 31% మంది మాత్రమే సరిపడ కోడ్ రాస్తున్నారని ఆయన వివరించారు. -
'కేవలం 40 శాతం మందికే ఉద్యోగాలు'
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల కొరత ఏ మేర ఉందో మరోసారి స్పష్టమైంది. కేవలం 40 శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ప్లేస్మెంట్లలో ఉద్యోగం సంపాదిస్తున్నారని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. రాజ్యసభలో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్లేస్మెంట్ దృక్పథాన్ని మరింత మెరుగుపర్చాల్సి ఉందని జవదేకర్ చెప్పారు. కనీసం 75 శాతం మంది విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ అందించాలని ఏఐసీటీఈ నిర్ణయించిందని ఆయన తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కనీసం 60 శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జవదేకర్ ఉద్ఘాటించారు. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ, ట్రైనింగ్ కాలేజీల టీచర్ల విషయంపై ప్రశ్నోత్తరాల సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. సభ్యుల ఆందోళన అనంతరం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన స్టడీలో కేవలం 40 శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికైనట్టు తెలిసిందని జవదేకర్ అన్నారు. వచ్చే ఐదేళ్లలో కచ్చితంగా ఈ శాతాన్ని పెంచుతామని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ లు ఇవ్వడానికి పరిశ్రమ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. -
జాబ్ లేని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇంతమందా?
న్యూఢిల్లీ : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత ఏ ఏడాదికాఏడాది పెరిగిపోతుంది. గ్రాడ్యుయేట్ పట్టా పొంది కాలేజీ నుంచి బయటికి వచ్చే వారిలో అరకొరమందికే ఉద్యోగాలు లభ్యమవుతున్నాయి. మిగతా వారందరూ నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఎంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారనే విషయంపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గణాంకాలు విడుదల చేసింది. ఈ వివరాల్లో దేశవ్యాప్తంగా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వారిలో 60 శాతం మందికి పైగా అంటే ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులేనని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలిపింది. ఒక శాతం మంది కంటే తక్కువమందే సమ్మర్ ఇంటర్న్ షిప్ లో పాల్గొంటున్నారని పేర్కొంది. కేవలం 15 శాతం ఇంజనీరింగ్ ప్రొగ్రామ్స్ నే ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయని వెల్లడైంది. ఈ పరిస్థితిని మార్చడానికి మానవ వనరుల అభివృద్ధి శాఖా టెక్నాలజీ ఎడ్యుకేషన్ ను పునరుద్ధరించడానికి ప్లాన్ చేస్తోంది. 2018 జనవరి నుంచి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికీ కలిపి ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని భావిస్తోంది. ఎంహెచ్ఆర్డీ సీనియర్ అధికారుల ప్రకారం పూర్తిగా కంప్యూటర్ ఆధారితంగా నేషనల్ టెస్టింగ్ సర్వీసు ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ ప్రొగ్రామ్స్ కు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ మాదిరిగా.. మెడికల్ కోర్సులకు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)ను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
చెత్త ఉద్యోగాలకు ఇంజనీర్లా!
⇒ దురదృష్టవశాత్తు విద్యావ్యవస్థ తప్పుదారిన పయనిస్తోంది ⇒ విజ్ఞానానికి నైపుణ్యం తోడైతేనే మెరుగైన కెరీర్ అవకాశాలు ⇒ ‘టాలెంట్ స్ప్రింట్’ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రారంభోత్సవంలో గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: ‘‘చెత్త ఉద్యోగాలకు సైతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేస్తుండటం దురదృష్టకరం. కంపెనీల అవ సరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్లలో విజ్ఞానం కొరవడటంతో ఇంటర్వూ్యలను ఎదుర్కోలేకపోతున్నారు. విద్యాబోధనలో నాణ్యత లేనందున ఏటా వేలాది మంది గ్రాడ్యుయేట్లు జీరో నాలెడ్జ్ తోనే బయటకు వస్తున్నారు. దురదృష్టవశాత్తు విద్యావ్యవస్థ తప్పుదారిలో పయనిస్తోంది. దీనిలో మార్పు లు తీసుకురావాల్సిన అవసరమేర్పడిం ది’’అని గవర్నర్ నరసింహన్ అన్నారు. ‘టాలెంట్ స్ప్రింట్’సంస్థ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (నైపుణ్యాభివృద్ధి సంస్థ)ను మంగళవారం ఆయన ప్రారంభించారు. గవర్నర్ మాట్లా డుతూ.. డిజిటల్ ప్రపంచంలోకి వెళుతున్న మనం మేధాశక్తిని వినియోగించడం మానేసి మెషీన్లుగా మారిపోతున్నామన్నారు. విద్యా ర్థులకు గ్యాడ్జెట్లను అందించడం వల్ల చేతి రాత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకతను కోల్పో తున్నారన్నారు. పాతరోజుల్లో ఎక్కాలను, ఉపనిషత్తులను జ్ఞాపకం ఉంచుకునేవార మని, నేటి తరం వారు కూడికలకు కూడా కాలుక్యులేటర్లను వినియోగిస్తున్నారన్నారు. నగరానికి ‘ఎన్పీసీఐ’సముదాయం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (ఎన్పీసీఐ) అతిపెద్ద సముదాయాన్ని త్వరలో హైదరాబాద్‌లో నెలకొల్పాలని నిర్ణ యించినట్లు ఆ సంస్థ చైర్మన్ బాలచంద్రన్ తెలిపారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేయబో తున్న ఎన్పీసీఐ ప్రాంగణంలో సంస్థ కార్యక లాపాలతో పాటు పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనుందన్నారు. కాలేజీల నుంచి బయటకు వస్తున్న గ్రాడ్యు యేట్లకు, ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్యకు ఎంతో వ్యత్యాసం ఉంటోంద న్నారు. నాణ్యమైన విద్యతోనే ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నైపు ణ్యాలను అందించేందుకు ప్రభుత్వం టాస్క్ ను ఏర్పాటు చేసిందని, టాస్క్ ద్వారా మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమా లను అందించేందుకు టాలెంట్ స్ప్రింట్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. జాతీ య స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ మనీష్ కుమార్ మాట్లాడుతూ.. టాలెంట్ స్ప్రింట్ ప్రవేశపెడుతున్న యూత్ కెరీర్ ద్వారా ఉద్యోగార్థులకు వ్యక్తిగత అధ్యయన అనుభవాన్ని అందించడంతో పాటు నైపు ణ్యాలను సాధించాలనుకునే వారిని ఆశా జనకంగా తయారు చేస్తుందన్నారు. కొత్త క్యాంపస్ ద్వారా పదేళ్లలో పది లక్షల మంది ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చి, కొలువులను సాధించేందుకు సహాయపడతామని టాలెం ట్ స్ప్రింట్ సీఈవో శంతన్‌పాల్ అన్నారు. ఏది కావాలన్నా గూగుల్‌లో వెతికే పరిస్థితి.. ఏదైనా సమాచారం కావాలంటే ఠక్కున గూగుల్‌లో వెతుకుతున్న పరిస్థితి కనిపి స్తోందని, ప్రతి దానికి టెక్నాలజీపై ఆధారపడటం భారతీయ సంస్కృతి కాదని నరసింహన్ అన్నారు. విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన తరగతి గదిలో నాణ్యమైన విద్యాబోధన ఉండటం లేదన్నారు. విజ్ఞానానికి నైపుణ్యం తోడైతేనే మెరుగైన కెరీర్ అవకాశాలు ఉంటాయన్నారు. గ్రాడ్యుయేట్లకు నైపుణ్యాలను అందించేందుకు టాలెంట్ స్ప్రింట్ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఐటీ, ఐటీయేతర రంగాల ఉద్యోగులకు రీస్కిల్లింగ్ శిక్షణ ఇస్తున్న సంస్థలు, మంత్రులు, అధికారులకు కూడా శిక్షణ రీస్కిల్లింగ్ ఇచ్చేందుకు ముందుకు రావాలన్నారు. -
‘పోటీ’లో ఇంజనీరింగ్ అభ్యర్థులు
♦ ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి ♦ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ♦ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నదీ 6.75 లక్షలు ♦ అందులో రెండు లక్షలకు పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే ♦ తరువాత స్థానంలో బీకాం, బీఎస్సీ నిరుద్యోగులు ♦ నాలుగు, ఐదు స్థానాల్లో బీఏ, ఎంబీయే అభ్యర్థులు ♦ అందరి దృష్టి గ్రూప్స్‌పైనే! సాక్షి, హైదరాబాద్: ఉన్నత సాంకేతిక కోర్సులు చదివిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారు. సాంకేతికపరమైన పోస్టులతో పాటు సాధారణ పోస్టులకూ పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. బీఏ, బీకాం వంటి సాంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసినవారికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. అసలు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేయించుకున్న 6.75 లక్షల మందిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వారే 2,06,406 మంది ఉండటం గమనార్హం. ఇంజనీరింగ్ అర్హతతో పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించకపోవడం, అవసరమైన దానికన్నా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేస్తుండడం, ప్రభుత్వ కొలువులపై ఆశ వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పోగా.. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీలు చేసిన వారు 2,60,825 మంది, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినవారు 1,61,620 మంది ఓటీఆర్ చేసుకున్నారు. ఇక ఇతర కేంద్ర ప్రభుత్వ, బ్యాంకింగ్ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ఇందుకు అదనం. ఇక గ్రూప్స్ నోటిఫికేషన్లు జారీ అయితే ఓటీఆర్ చేయించుకునే వారి సంఖ్య బాగా పెరగనుంది. కోర్సుల వారీగా చూస్తే.. కోర్సుల వారీగా పరిశీలిస్తే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారిలో బీకాం గ్రాడ్యుయేట్లు అత్యధికంగా ఉన్నారు. మొత్తంగా బీకాం గ్రాడ్యుయేట్లు 1,17,817 మంది ఓటీఆర్ చేసుకోగా.. అందులో సాధారణ బీకాం వారు 65,571 మంది, బీకాం కంప్యూటర్స్ చేసినవారు 52,246 మంది ఉన్నారు. ఇక బీఎస్సీ (వివిధ కోర్సులు) పూర్తి చేసినవారు 91,691 మంది, బీఏ పూర్తి చేసిన వారు 51,317 మంది ఓటీఆర్ చేసుకున్నారు. పోస్టుల సంఖ్యే కీలకం.. నిరుద్యోగులందరి చూపూ భర్తీ చేసే పోస్టుల సంఖ్యపైనే ఉంది. ఇప్పటివరకు ఇంజనీర్, ఏఎంవీఐ, అగ్రికల్చర్ ఆఫీసర్, ఫైనాన్స్ అసిస్టెంట్, వాటర్ వర్క్స్ మేనేజర్ వంటి సాంకేతిక, ప్రత్యేక కోర్సుల అర ్హతతో పరీక్షలు నిర్వహించిన పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. గ్రూప్స్ కేటగిరీల్లో పోస్టులు చాలాతక్కువగా ఉన్నాయి. గ్రూప్-1లో 52 పోస్టులకు, గ్రూప్-2లో 434 పోస్టులకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రూప్-3, గ్రూప్-4, ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి అనుమతే రాలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపిన ఫైలులోని దాదాపు 10 వేల పోస్టుల్లో ఇవే ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. -
కథలో ప్రత్యేకత లేకున్నా... కథనంలో వైవిధ్యత!
నేను 2002 నుంచి మల్లాది గారి నవలల్ని దొరికినవి అన్నీ చదువుతున్నాను. ఆయన రాసిన మిగిలిన వాటికన్నా త్రీమంకీస్ విభిన్నంగా ఉంది. కథగా చూస్తే ప్రత్యేకత పెద్దగా లేదు. నిరుద్యోగులైన ముగ్గురు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నేరస్తులై జైల్లో కలుసుకుంటారు. ఓ సొరంగం లోంచి పారిపోయి, మరో సొరంగంలోంచి ఓ బేంక్ దొంగతనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో దొంగల బృందం విఫలం కాకుండా బేంక్ సొమ్ము దొరకడం ఓ మలుపైతే, ఆ దొరికిన డబ్బు చేజారడం ఇంకో మలుపు. తిరిగి వారు దాన్ని సంపాదిస్తారనే పాజిటివ్ (నెగెటివ్?) నోట్‌తో నవలని ముగిస్తూ, ఎలా అన్నది పాఠకుల ఊహకే వదిలేశాడు. రేపటి కొడుకు కూడా మల్లాది పాఠకుల ఊహకి వదిలేసి ముగించడం గుర్తొచ్చింది. కామెడీ నవలల్లో మల్లాది తమాషా పాత్రలని ప్రవేశపెడతారు. ‘ష్... గప్‌చుప్’లో కోపం వస్తే చెట్టెక్కేసే తండ్రి, ‘రెండు రెళ్ళు ఆరు’లో వంట చేసే భర్త, ‘నీకూ నాకూ పెళ్ళంట’లో అబద్ధాలని అమ్మే వ్యాపారస్తుడైన హీరో, ‘ఒక నువ్వు - ఒక నేను’లో ఆటోబయోగ్రఫీ రాయించుకోవాలనే పిచ్చి గల సినీ నిర్మాత, ‘కల్నల్ ఏకలింగం ఎడ్వెంచర్స్’లో ఆడపిచ్చి గల హీరో.. ఇలా! త్రీ మంకీస్‌లో చిన్న పాత్రలని కూడా విభిన్నంగా మలిచాడు. భార్యా ద్వేషి అయిన మేజిస్ట్రేట్, ఆధ్యాత్మిక పిచ్చి గల వేమన, అంత్యాక్షరి పిచ్చి గల పట్టయ్య, శుభ్రత పిచ్చిగల శుభ్రజ్యోత్స్న స్వచ్ఛ, కుక్కల్ని ప్రేమించే వైతరణి మొదలైనవి. పాత్రల పేర్లు కూడా నవ్వొచ్చేవే పెట్టారు... ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్‌కి వెళ్లిన కుటుంబరావు, ఒబేసిటీ సెంటర్‌కి వెళ్లిన లావణ్య... ఇలా! అసలు హీరో పేర్లే కోతికి చెందినవి అయి ఉండడం, పేర్లుగానే అనిపించడం విశేషం. ఈ వ్యాసం రాయడానికి కట్‌చేసి దాచిన త్రీ మంకీస్ మళ్లీ చదివితే నాకు విసుగు అనిపించకపోవడానికి కారణం షార్ట్ అండ్ షార్ప్ పంచ్ డైలాగ్సే. మెక్‌డొనాల్డ్స్‌లో ఫ్రీ కోక్ కొట్టేయడం ఎలా, ఫేస్బుక్ హాస్యాలు, పాస్వర్డ్ పంచెస్, కోక్2హోమ్డాట్కామ్ (నేనీ సైట్లోకి వెళ్లి షాపు ధరలో పది శాతం డిస్కౌంట్‌తో కోక్ జీరోని ఇంటికే ఉచితంగా తెప్పించుకున్నాను) లాంటివి నేటి సమాజానికి ప్రతిబింబం. సావిరహే, చంటబ్బాయ్, రెండు రెళ్ళు ఆరు లాంటి హాస్య నవలల్లో హీరో, హీరోయిన్స్ మధ్య ప్రేమ చాలా బలంగా రాశారు. ఈ తరం యువతీ యువకుల మధ్య ప్రేమ ఎంత బలహీనంగా ఉంటుందో హాస్యంగా ముగ్గురు యువకులు, ఆరుగురు యువతులతో చెప్పారు. కాలంతోపాటు రచయిత మారడం అంటే ఇదేనేమో? మొత్తంమీద చక్కటి సీరియల్స్ కోసం మొహం వాచిపోయిన నాలాంటి వారికి సాక్షి ఓ సీరియల్‌ని అందించి మంచి పని చేసింది. - డి. కృష్ణ తేజస్విని ధర్మారెడ్డి కాలనీ, ఫేజ్-1, కెపిహెచ్బి, హైదరాబాద్ - 500 072. -
హోంగార్డు పోస్టుకు ఇంజనీర్ల పోటీ
32 హోంగార్డుల పోస్టులకు 24,353 మంది దరఖాస్తు కంప్యూటర్ ఆపరేటర్లుగా బీటెక్‌ల పోటీ అనూహ్య స్పందనతో ఎంపిక వాయిదా నేర పరిశోధన విభాగం(సీఐడీ) 32 హోంగార్డు పోస్టులకు గత నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు 24,353 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 761 మంది చొప్పున పోటీ పడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: హోంగార్డులు పేరుకు పోలీసు విభాగంలో పని చేస్తున్నా సాధారణ కార్మికుల కంటే దారుణమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. దినసరి వేతనం మినహా మరే ఇతర సదుపాయాలు, అలవెన్సులు వారికి ఉండవు. హోంగార్డుల్లో అత్యధికులు ఉన్నతాధికారుల కనుసన్నల్లో ఆర్డర్లీలుగానే బతుకెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. నెలవారీగా జీతమంటూ లేని వీరికి రోజు వేతనం కింద రూ.300 చొప్పున చెల్లిస్తున్నారు. పని చేసిన రోజులకు మాత్రమే వేతనం దక్కుతుంది. వారాంతపు సెలవుల సహా మరే ఇతర సౌకర్యాలు వీరికి ఉండవు. మహిళా హోంగార్డులకు కనీసం ప్రసూతి సెలవులు కూడా ఉండవు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, కనీస అవసరాల కోసం హోంగార్డులు ఎన్నోసార్లు వేడుకున్నా ఫలితం దక్కలేదు. ఇదంతా ఒక ఎత్తు కాగా గత నెలలో 32 హోంగార్డుల పోస్టుల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్‌కు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి సైతం దరఖాస్తులు రావటంతో అధికారులు కంగుతిన్నారు. కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన సీఐడీలో 32 హోంగార్డు పోస్టుల భర్తీకి గత నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది. బి-క్యాటగిరీలో ఉండే ఈ ఉద్యోగులు హైదరాబాద్‌తోపాటు 13 జిల్లాల్లో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నా అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. కేవలం ఏడో తరగతి మాత్రమే కనీస విద్యార్హతగా నిర్ణయించినా టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన వారూ హోంగార్డుల పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారు. 32 పోస్టులకు 24,353 దరఖాస్తులు వచ్చాయి. కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో 12 పోస్టులకు 9,810 దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యధికులు బీటెక్ పూర్తి చేసిన వారున్నారు. గత నెల 27, 28వ తేదీల్లోనే విజయవాడ బందర్ రోడ్లో ఉన్న స్వరాజ్ మైదాన్‌లో ఎంపిక ప్రక్రియను నిర్వహించాలని భావించినా భారీగా అందిన దరఖాస్తులను చూసి వాయిదా వేశారు. ప్రస్తుతం దరఖాస్తుల్ని పరిశీలించటంపై దృష్టి సారించారు. ‘వెయిటేజీ’ ఆశతోనే భారీగా దరఖాస్తులు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలు, కుప్పలుతెప్పలుగా సీట్లు పేరుకుపోవటంతో ఇంజనీరింగ్ చదివిన వారి సంఖ్య పెరుగుతోంది. పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా చాలామందికి నైపుణ్యాలు లేకపోవటం, ఫ్రెషర్స్‌గా పరిగణించటంతో వీరికి ఏ రంగంలో చూసుకున్నా గరిష్టంగా రూ.8 వేలకు మించి జీతాలు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే కాస్త జీతం తక్కువైనా పోలీసు విభాగంలో చేరాలనే ఉద్దేశంతోనే బీటెక్ పూర్తి చేసిన వాళ్లూ హోంగార్డు పోస్టులకు దరఖాస్తు చేసి ఉంటారని అధికారులు విశ్లేషిస్తున్నారు. ‘హోంగార్డులుగా పని చేస్తే పోలీసు విభాగం అనే గౌరవంతోపాటు కాని స్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయినప్పుడు వెయిటేజ్ లభిస్తుందనే ఉద్దేశంతో పలువురు ఉన్నత వి ద్యావంతులు దరఖాస్తు చేసినట్లు భావిస్తున్నాం’ అని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
ఈ-కామర్స్‌లో ఉద్యోగాల ‘క్లిక్’
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగ కంపెనీల్లో పనిచేసేందుకు ఇంజనీరింగ్, బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఎఫ్ఎంసీజీ, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, టెలికం, రియల్ ఎస్టేట్, విద్యుత్, మౌలిక రంగాలతో పోలిస్తే ఇ-కామర్స్ వైపు అత్యధికులు మొగ్గు చూపుతున్నారని అసోచాం చెబుతోంది. సెప్టెంబర్-అక్టోబర్‌లో ఐఐఎం, బిట్స్, ఇక్ఫాయ్ వంటి కళాశాలలకు చెందిన 500 మందికిపైగా విద్యార్థులపై అసోచాం సర్వే నిర్వహించింది. వీరిలో 71 శాతం మంది ఈ-కామర్స్‌ను ఇష్టపడ్డారు. అలాగే ఈ రంగంలో పెట్టుబడి పెట్టి విజయవంతంగా వ్యాపారం చేయాలనే అభిప్రాయాన్నీ వ్యక్తం చేశారు. పలు బిజినెస్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులను ఆన్లైన్ కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకోవడం 65 శాతం పెరిగింది. గత సీజన్లో ఇది 35 శాతమేనని అసోచాం సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ తెలిపారు. 2010-14 కాలంలో ఆన్లైన్ వ్యాపారం అసాధారణ రీతిలో 60 రెట్లు పెరిగిందని వెల్లడించారు. భారత ఇ-కామర్స్ రంగంలో 30 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే పరిశ్రమకు అనుబంధంగా మార్కెటింగ్, ఐటీ, సరుకు రవాణా, చెల్లింపులు తదితర విభాగాల ద్వారా మరో 1.8 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగిందని అసోచాం తెలిపింది. నియామకాల వృద్ధి 60-65 శాతం వృద్ధి చెందుతుందని, తద్వారా 3-5 ఏళ్లలో 5 నుంచి 8 లక్షల నూతన ఉద్యోగాలను ఈ రంగం సృష్టిస్తుందని వెల్లడించింది. ఉద్యోగులకు మంచి ప్యాకేజ్.. ఈ-కామర్స్ కంపెనీలు రూ.10-25 లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేస్తున్నాయని అసోచాం తెలిపింది. 2013తో పోలిస్తే ఇది 15-45 శాతం అధికమని వెల్లడించింది. ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు, ద్వితీయ శ్రేణి బిజినెస్ స్కూళ్ల విద్యార్థులకు ప్రైవేటు రంగంలో సరాసరి వేతనం రూ.4-7 లక్షలుందని వివరించింది. ఐటీ, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, అనలిటిక్స్, బ్యాక్ ఆఫీస్, మార్కెటింగ్, కంటెంట్ రైటర్స్, స్టైలిస్ట్స్, ఫోటోగ్రాఫర్స్, ఫ్యాషన్ డిజైనర్లకు మంచి అవకాశాలు ఉన్నాయని గుర్తు చేసింది. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ వంటి విధుల్లో ఫ్రెషర్లకు వార్షిక ప్యాకేజీ రూ.2-3.5 లక్షలు ఉంది. మేనేజ్మెంట్, టెక్నికల్ విభాగాల్లో ప్రారంభ వేతనం రూ.8-14 లక్షల మధ్య ఉందని అసోచాం తెలిపింది. భారీగా నిధులు..: అమ్మకాల బూస్ట్కుతోడు విదేశీ పెట్టుబడులతో భారత ఈ-కామర్స్ కంపెనీలు జోరుమీదున్నాయి. మౌలిక వసతులు, రవాణా, గిడ్డంగుల ఏర్పాటుకు ఈ-కామర్స్ కంపెనీలకు ఇప్పటికిప్పుడు రూ.3,000 కోట్లు, 2017 నాటికి రూ.5,700-11,400 కోట్లు అవసరమవుతాయి. త్వరలోనే పబ్లిక్ లిస్టింగ్‌కు ఈ కంపెనీలు వెళ్తాయని ప్రైస్‌వాటర్‌హౌజ్ కూపర్స్ ఆపరేషన్స్ డెరైక్టర్ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. మిగిలేవి రెండు మూడే.. 2019కల్లా దేశంలో ఆర్థికంగా బలంగా ఉన్న రెండు మూడు దిగ్గజ సంస్థలు మాత్రమే ఈ రంగంలో నిలుస్తాయని స్పైర్ రీసెర్చ్, కన్సల్టింగ్ సీనియర్ డెరైక్టర్ జప్నిత్ సింగ్ అంటున్నారు. చిన్న చిన్న కంపెనీలు పెద్ద సంస్థల్లో విలీనం అవుతాయని జోస్యం చెప్పారు. భారత్‌లో 24.3 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదార్లున్నారు. ఈ-కామర్స్ పరిశ్రమ 38 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. రూ.90 వేల కోట్లుగా ఉన్న పరిశ్రమ ఐదేళ్లలో రూ.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. -
ఇంజనీరింగ్ పట్టభద్రులకు భారత సైన్యం ఆహ్వానం
భారతీయ సైన్యం 2015 జనవరి నుంచి ప్రారంభమయ్యే 120వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) కోసం అర్హులైన ఇంజనీరింగ్ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు అవివాహితులై ఉండాలి. అర్హత: విభాగాన్ని బట్టి నిర్దేశించిన ఇంజనీరింగ్ డిగ్రీ. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు (ఇటువంటి విద్యార్థులు ఐఎంఏలో శిక్షణ ప్రారంభానికి 12 వారాల ముందు డిగ్రీని అందజేయాలి). వివరాలు.. ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇలా షార్ట్ లిస్ట్ చేసిన వారికి అలహాబాద్, భోపాల్, బెంగళూరులలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ బోర్డులో సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు. ఇందులో నిర్దేశించిన విధంగా అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాత దశలో ఉండే సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్బీ ఇలా: సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ ప్రక్రియను ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో స్టేజ్-1, స్టేజ్-2 అనే రెండు దశలు ఉంటాయి. స్టేజ్-1ను విజయవంతంగా పూర్తి చేసిన వారిని మాత్రమే స్టేజ్-2కు అనుమతిస్తారు. ఈ పరీక్షలు ప్రధానంగా అభ్యర్థులు విశ్లేషణాత్మక సామర్థ్యం, మానసిక దృఢత్వం, తార్కిక వివేచన, పరిశీలనా సామర్థ్యం వంటి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. వివరాలు.. మొదటి రోజు: మొదటి రోజున స్టేజ్-1 దశను నిర్వహిస్తారు. ఇందులో మూడు రకాల పరీక్షలు ఉంటాయి. అవి.. ఇంటెలిజెన్స్ టెస్ట్ (వెర్బల్ అండ్ నాన్ వెర్బల్), పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్, డిస్కషన్ ఆఫ్ ది పిక్చర్. ఇంటెలిజెన్స్ టెస్ట్ (వెర్బల్ అండ్ నాన్ వెర్బల్)లో కంప్లీషన్ ఆఫ్ సిరీస్, కోడింగ్-డికోడింగ్, రిలేషన్షిప్, జంబుల్డ్ స్పెల్లింగ్, బెస్ట్ రీజన్, సేమ్ క్లాస్ టెస్ట్, డెరైక్షన్స్, కామన్సెన్స్, సీక్వెన్సెస్, వర్డ్ బిల్డింగ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవి కొంత వరకు సులభంగా ఉన్నప్పటికీ..నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాల్సి రావడమనే అంశం ఈ విభాగాన్ని క్లిష్టం చేస్తుంది. పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లో 30 సెకన్లపాటు ఒక చిత్రం (పిక్చర్) ఫ్లాష్ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించి.. క్యారెక్టర్స్ (characters), ఏజ్ (age), లింగం (sex), మూడ్ (mood), యాక్షన్ రిలేటింగ్ టు పాస్ట్(action relating to past), ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఫర్ ఈచ్ క్యారెక్టర్ (present and future for each character) వంటి వివరాలను నిమిషం వ్యవధిలో నమోదు చేసుకోవాలి. తర్వాత వీటి ఆధారంగా నాలుగు నిమిషాల్లో కథను రాయాలి. డిస్కషన్ ఆఫ్ ది పిక్చర్ విభాగానికి 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇందుకోసం అభ్యర్థులను గ్రూపులుగా విభజిస్తారు. ప్రతిగ్రూప్‌లో 15 మంది ఉంటారు. ప్రతి సభ్యుడు తాను రాసిన కథను వినిపించాలి. ఈ విధంగా సభ్యులందరూ చర్చించుకుని ఆ కథ నేపథ్యం, పాత్రల మీద ముగింపునకు రావాలి. ఈ దశలో నిర్దేశించిన విధంగా అర్హత సాధించిన వారిని మాత్రమే రెండో దశకు అనుమతిస్తారు. రెండో రోజు: రెండో రోజు నుంచి రెండో దశ స్టేజ్-2 పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో రెండో రోజు నాలుగు టెస్ట్‌లు ఉంటాయి. అవి.. 1) థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్, 2) వర్డ్ అసోసియేషన్ టెస్ట్, 3) సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్, 4) సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్. థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్‌లో 12 చిత్రాలను వరుసగా చూపిస్తారు. వీటిల్లో ఒక్కోటి 30 సెకన్లపాటు ఫ్లాష్ అవుతుంది. వీటి ఆధారంగా 4 నిమిషాల్లో ఒక కథను రాయాలి. అయితే ఈ క్రమంలో 12 చిత్రాల్లో ఏదో ఒక చిత్రాన్ని ఖాళీ(బ్లాంక్)గా ఉంచుతారు. ఈ ఖాళీ చిత్రంలో.. రావల్సిన చిత్రాన్ని ఊహించి.. దాని ఆధారంగా కథను రూపొందించాలి. వర్డ్ అసోసియేషన్ టెస్ట్‌లో ఒక దాని తర్వాత ఒకటి చొప్పున 60 పదాలను చూపిస్తారు. అభ్యర్థులు వాటి ఆధారంగా తమకు వచ్చిన ఆలోచన/కథను రాయాలి. సిచ్యువేషన్ రియాక్షన్ టె్స్ట్లో దైనందిన జీవితంలో ఎదురయ్యే 60 సంఘటనలను పొందుపరుస్తూ ఒక బుక్‌లెట్‌ను అభ్యర్థులకు అందజేస్తారు. అభ్యర్థులు సదరు సంఘటనల పట్ల తమ ప్రతిస్పందనలను బుక్‌లెట్‌లో నిర్దేశించిన ప్రదేశంలో రాయాలి. సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లో తల్లిదండ్రులు/సంరక్షకులు, స్నేహితులు, ఉపాధ్యాయులు/ పర్యవేక్షకులకు సంబంధించి వేర్వేరుగా ఐదు వ్యాసాలు రాయాలి. మూడో రోజు: మూడో రోజు నిర్వహించే పరీక్షలు.. 1) గ్రూప్ డిస్కషన్, 2) గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్, 3)ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్, 4) గ్రూప్ ఆబ్స్టకెల్ రేస్, 5) హాఫ్గ్రూప్ టాస్క్, 6) లెక్చరేట్. గ్రూప్ డిస్కషన్లో సామకాలీన అంశం లేదా సాంఘిక/సామాజిక ప్రాధాన్యత ఉన్న అంశంపై ఇష్టాగోష్టిగా చర్చించాల్సి ఉంటుంది. దీనికి 20 నిమిషాల సమయం కేటాయిస్తారు. చర్చకు అర్ధవంతమైన ముగింపు ఉండనవసరం లేదు. గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్లో ఐదు దశలు ఉంటాయి. అవి..ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ది మోడల్, రీడింగ్ ఆఫ్ ది నారేటివ్ బై జీటీవో, సెల్ఫ్ రీడింగ్ (5 నిమిషాలు), ఇండివ్యుడ్వాల్ రిటెన్ సొల్యూషన్స్ (10 నిమిషాలు), గ్రూప్ డిస్కషన్ (20 నిమిషాలు). ఈ విభాగానికి సంబంధించిన చర్చకు అర్థవంతమైన ముగింపు తప్పనిసరి. ప్రొగ్రెసివ్ గ్రూప్ టాస్క్‌ను అవుట్‌డోర్‌లో నిర్వహిస్తారు. ఇందులో క్రమక్రమంగా పెరుగుతున్న క్లిష్టతను అధిగమించి అడ్డంకులను 40 నుంచి 50 నిమిషాల్లో పూరించాలి. గ్రూప్ ఆబ్స్టకెల్ రేస్‌లో నిర్దేశించిన విధంగా గ్రూప్‌ల వారీగా అడ్డంకులను దాటాలి. హాఫ్గ్రూప్ టాస్క్ దశ..ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో సభ్యులను సబ్గ్రూప్లుగా విభజిస్తారు. ఒక గ్రూప్ అడ్డంకులను పూరిస్తుంటే మరో గ్రూప్ ఆటంకం కలిగిస్తూంటుంది. ఇందులో ప్రతి సబ్ గ్రూప్‌నకు 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. లెక్చరేట్లో అభ్యర్థులు గ్రూప్‌ను ఉద్దేశించి నాలుగు నిమిషాలపాటు చిన్న ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంటుంది. అంశాన్ని ఎంపిక చేసుకోవడానికి, ప్రిపేర్ కావడానికి మూడు నిమిషాల సమయం ఇస్తారు. నాలుగో రోజు: నాలుగో రోజు నిర్వహించే పరీక్షలు.. 1) ఇండివ్యుడ్వాల్ ఆబ్స్టకెల్, 2) కమాండ్ టాస్క్, 3) ఫైనల్ గ్రూప్ టాస్క్. ఇండివ్యుడ్వాల్ ఆబ్స్టకెల్లో ఒకటి నుంచి పది సంఖ్యలతో కూడిన అడ్డంకులు ఉంటాయి. ప్రతి అడ్డంకిని అధిగమించా లి. ఒక్కో అడ్డంకికి ఒక్కో విధంగా మార్కులు కేటాయిస్తారు. ఇందుకు మూడు నిమిషాల సమయం కేటాయిస్తారు. కమాండ్ టా్స్క్లో ఒక్కొక్కరు ఒక గ్రూప్‌నకు కమాండర్‌గా వ్యవహరించాలి. ఇందులో ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ వలె 15 నిమిషాల్లో అడ్డంకిని అధిగమించాలి. ఫైనల్ గ్రూప్ టాస్క్‌లో కూడా ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ మాదిరిగా ఉండే అడ్డంకిని 15-20నిమిషాల్లో పూర్తి చేయాలి. ఐదో రోజు: ఐదో రోజులో క్లోజింగ్ అడ్రస్, కాన్ఫరెన్స్, ఫలితాల వెల్లడి వంటి అంశాలు ఉంటాయి. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఆధారం గా సబ్జెక్ట్‌ల వారీగా మెరిట్ లిస్ట్‌ను రూపొందిస్తారు. ఎస్ఎస్ బీ ఇంటర్వ్యూ దశను విజయవంతంగా పూర్తి చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఐఎంఏలో ప్రవేశం కల్పిస్తారు. ఫిజికల్ ఫిట్నెస్: కేవలం విద్యార్హతలేకాకుండా నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. ఎత్తు 157.5 సెం.మీ. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. చక్కటి కంటి చూపు తప్పనిసరి. ఐఎంఏలో శిక్షణను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు నిర్దేశించిన కొన్ని ఫిజికల్ ఈవెంట్లను ప్రాక్టీస్ చేయడం మంచిది. అవి.. 2.4 కిలోమీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో పరుగెత్తాలి. పుష్ అప్స్-13, సిట్ అప్స్-25, చిన్ అప్స్-6, రోప్ క్లైంబింగ్: 3 నుంచి 4 మీటర్లు. ఐఎంఏలో శిక్షణ ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ)-డెహ్రాడూన్‌లో శిక్షణ ఉంటుంది. వీరికి మొదట ప్రొబేషన్ సమయంలో షార్ట్ సర్వీస్ కమిషన్ హోదా ఇస్తారు. కోర్సు ప్రారంభమైన తేదీ లేదా ఐఎంఏలో రిపోర్ట్ చేసిన తేదీ నుంచి లెఫ్టినెంట్ ర్యాంక్ ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి లెఫ్టినెంట్ ర్యాంక్‌తో పర్మినెంట్ కమిషన్ హోదా ఇస్తారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు రూ.21,000 స్టైఫండ్ చెల్లిస్తారు. హోదాలు-వేతనాలు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారి కెరీర్ లెఫ్టినెంట్ ర్యాంక్‌తో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో లెఫ్టినెంట్ హోదాకు లభించే జీతభత్యాలను అందజేస్తారు. అంతేకాకుండా మెడికల్, నివాస, సబ్సిడీ రేట్ల మీద కారు/గృహ రుణాలు వంటి సౌకర్యాలను కూడా కల్పిస్తారు. లెఫ్టినెంట్ తర్వాత ఉండే హోదాలను, వేతనాలను పరిశీలిస్తే.. కెప్టెన్ (వేతనం: రూ.15,600-39,100+ గ్రేడ్‌పే: రూ.6,100+ ఎంఎస్పీ:రూ.6,000), మేజర్ (వేతనం: రూ.15,600-39,100 + గ్రేడ్‌పే: రూ.6,600 + ఎంఎస్పీ: రూ. 6,000), లెఫ్టినెంట్ కల్నల్ (వేతనం: రూ.37,400-67,000 + గ్రేడ్‌పే: రూ.8,000 + ఎంఎస్పీ: రూ. 6,000), కల్నల్ (వేతనం: రూ. 37,400-67,000 + గ్రేడ్‌పే: రూ.8,700 + ఎంఎస్పీ: రూ. 6,000), బ్రిగేడియర్ (వేతనం: రూ.37,400-67,000 + గ్రేడ్‌పే:రూ.8,900 + ఎంఎస్పీ: రూ. 6,000), మేజర్ జనరల్ (వేతనం: రూ.37,400-67,000 + గ్రేడ్‌పే: రూ. 10,000), లెఫ్టినెంట్ జనరల్/ హెచ్ఏజీ (వేతనం: రూ.67,000-79,000, ఏడాది 3 శాతం ఇంక్రిమెంట్), హెచ్ఏజీ + స్కేల్ (వేతనం: రూ.75,500 - 80,000, ఏడాది 3 శాతం ఇంక్రిమెంట్) వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్/ఆర్మీ కేడర్/లెఫ్టినెంట్ జనరల్-ఎన్ఎఫ్ఎస్జీ (వేతనం: రూ.80,000, ఫిక్స్డ్) , చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (వేతనం: రూ.90,000, ఫిక్స్డ్) వంటి హోదాలు ఉంటాయి. వీటికి అలవెన్స్‌లు అదనం.