ఇంజనీరింగ్ పట్టభద్రులకు భారత సైన్యం ఆహ్వానం | Engineering graduates to the Indian Army | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ పట్టభద్రులకు భారత సైన్యం ఆహ్వానం

Published Thu, May 29 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

ఇంజనీరింగ్ పట్టభద్రులకు భారత సైన్యం ఆహ్వానం

ఇంజనీరింగ్ పట్టభద్రులకు భారత సైన్యం ఆహ్వానం

భారతీయ సైన్యం 2015 జనవరి నుంచి ప్రారంభమయ్యే 120వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) కోసం అర్హులైన ఇంజనీరింగ్ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు అవివాహితులై ఉండాలి.
 
 అర్హత:
 విభాగాన్ని బట్టి నిర్దేశించిన ఇంజనీరింగ్ డిగ్రీ. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు (ఇటువంటి విద్యార్థులు ఐఎంఏలో శిక్షణ ప్రారంభానికి 12 వారాల ముందు డిగ్రీని అందజేయాలి). వివరాలు..

 ఎంపిక విధానం:
 వచ్చిన దరఖాస్తులను మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇలా షార్ట్ లిస్ట్ చేసిన వారికి అలహాబాద్, భోపాల్, బెంగళూరులలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ బోర్డులో సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు. ఇందులో నిర్దేశించిన విధంగా అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాత దశలో ఉండే సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
 
 ఎస్‌ఎస్‌బీ ఇలా:
 సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ప్రక్రియను ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో స్టేజ్-1, స్టేజ్-2 అనే రెండు దశలు ఉంటాయి. స్టేజ్-1ను విజయవంతంగా పూర్తి చేసిన వారిని మాత్రమే స్టేజ్-2కు అనుమతిస్తారు. ఈ పరీక్షలు ప్రధానంగా అభ్యర్థులు విశ్లేషణాత్మక సామర్థ్యం, మానసిక దృఢత్వం, తార్కిక వివేచన, పరిశీలనా సామర్థ్యం వంటి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. వివరాలు..
 
 మొదటి రోజు:
 మొదటి రోజున స్టేజ్-1 దశను నిర్వహిస్తారు. ఇందులో మూడు రకాల పరీక్షలు ఉంటాయి. అవి.. ఇంటెలిజెన్స్ టెస్ట్ (వెర్బల్ అండ్ నాన్ వెర్బల్), పిక్చర్ పర్‌సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్, డిస్కషన్ ఆఫ్ ది పిక్చర్. ఇంటెలిజెన్స్ టెస్ట్ (వెర్బల్ అండ్ నాన్ వెర్బల్)లో కంప్లీషన్ ఆఫ్ సిరీస్, కోడింగ్-డికోడింగ్, రిలేషన్‌షిప్, జంబుల్డ్ స్పెల్లింగ్, బెస్ట్ రీజన్, సేమ్ క్లాస్ టెస్ట్, డెరైక్షన్స్, కామన్‌సెన్స్, సీక్వెన్సెస్, వర్డ్ బిల్డింగ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవి కొంత వరకు సులభంగా ఉన్నప్పటికీ..నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాల్సి రావడమనే అంశం ఈ విభాగాన్ని క్లిష్టం చేస్తుంది. పిక్చర్ పర్‌సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లో 30 సెకన్లపాటు ఒక చిత్రం (పిక్చర్) ఫ్లాష్ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించి.. క్యారెక్టర్స్ (characters), ఏజ్ (age), లింగం  (sex), మూడ్ (mood), యాక్షన్ రిలేటింగ్ టు పాస్ట్(action relating to past), ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఫర్ ఈచ్ క్యారెక్టర్ (present and future for each character) వంటి వివరాలను నిమిషం వ్యవధిలో నమోదు చేసుకోవాలి. తర్వాత వీటి ఆధారంగా నాలుగు నిమిషాల్లో కథను రాయాలి. డిస్కషన్ ఆఫ్ ది పిక్చర్ విభాగానికి 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇందుకోసం అభ్యర్థులను గ్రూపులుగా విభజిస్తారు. ప్రతిగ్రూప్‌లో 15 మంది ఉంటారు. ప్రతి సభ్యుడు తాను రాసిన కథను వినిపించాలి. ఈ విధంగా సభ్యులందరూ చర్చించుకుని ఆ కథ  నేపథ్యం, పాత్రల మీద ముగింపునకు రావాలి. ఈ దశలో నిర్దేశించిన విధంగా అర్హత సాధించిన వారిని మాత్రమే రెండో దశకు అనుమతిస్తారు.
 
 రెండో రోజు:
 రెండో రోజు నుంచి రెండో దశ స్టేజ్-2 పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో రెండో రోజు నాలుగు టెస్ట్‌లు ఉంటాయి. అవి.. 1) థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్, 2) వర్డ్ అసోసియేషన్ టెస్ట్, 3) సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్, 4) సెల్ఫ్ డిస్‌క్రిప్షన్ టెస్ట్. థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్‌లో 12 చిత్రాలను వరుసగా చూపిస్తారు. వీటిల్లో ఒక్కోటి 30 సెకన్లపాటు ఫ్లాష్ అవుతుంది. వీటి ఆధారంగా 4 నిమిషాల్లో ఒక కథను రాయాలి. అయితే ఈ క్రమంలో 12 చిత్రాల్లో ఏదో ఒక చిత్రాన్ని ఖాళీ(బ్లాంక్)గా ఉంచుతారు. ఈ ఖాళీ చిత్రంలో.. రావల్సిన చిత్రాన్ని ఊహించి.. దాని ఆధారంగా కథను రూపొందించాలి. వర్డ్ అసోసియేషన్ టెస్ట్‌లో ఒక దాని తర్వాత ఒకటి చొప్పున 60 పదాలను చూపిస్తారు. అభ్యర్థులు వాటి ఆధారంగా తమకు వచ్చిన ఆలోచన/కథను రాయాలి. సిచ్యువేషన్ రియాక్షన్ టె్‌స్ట్‌లో దైనందిన జీవితంలో ఎదురయ్యే 60 సంఘటనలను పొందుపరుస్తూ ఒక బుక్‌లెట్‌ను అభ్యర్థులకు అందజేస్తారు. అభ్యర్థులు సదరు సంఘటనల పట్ల తమ ప్రతిస్పందనలను బుక్‌లెట్‌లో నిర్దేశించిన ప్రదేశంలో రాయాలి. సెల్ఫ్ డిస్‌క్రిప్షన్ టెస్ట్‌లో తల్లిదండ్రులు/సంరక్షకులు, స్నేహితులు, ఉపాధ్యాయులు/ పర్యవేక్షకులకు సంబంధించి వేర్వేరుగా ఐదు  వ్యాసాలు రాయాలి.
 
 మూడో రోజు:
 మూడో రోజు నిర్వహించే పరీక్షలు.. 1) గ్రూప్ డిస్కషన్, 2) గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్‌సైజ్, 3)ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్, 4) గ్రూప్ ఆబ్‌స్టకెల్ రేస్, 5) హాఫ్‌గ్రూప్ టాస్క్, 6) లెక్చరేట్. గ్రూప్ డిస్కషన్‌లో సామకాలీన అంశం లేదా సాంఘిక/సామాజిక ప్రాధాన్యత ఉన్న అంశంపై ఇష్టాగోష్టిగా చర్చించాల్సి ఉంటుంది. దీనికి 20 నిమిషాల సమయం కేటాయిస్తారు. చర్చకు అర్ధవంతమైన ముగింపు ఉండనవసరం లేదు. గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్‌సైజ్‌లో ఐదు దశలు ఉంటాయి. అవి..ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ది మోడల్, రీడింగ్ ఆఫ్ ది నారేటివ్ బై జీటీవో, సెల్ఫ్ రీడింగ్ (5 నిమిషాలు), ఇండివ్యుడ్వాల్ రిటెన్ సొల్యూషన్స్ (10 నిమిషాలు), గ్రూప్ డిస్కషన్ (20 నిమిషాలు). ఈ విభాగానికి సంబంధించిన చర్చకు అర్థవంతమైన ముగింపు తప్పనిసరి. ప్రొగ్రెసివ్ గ్రూప్ టాస్క్‌ను అవుట్‌డోర్‌లో నిర్వహిస్తారు. ఇందులో క్రమక్రమంగా పెరుగుతున్న క్లిష్టతను అధిగమించి అడ్డంకులను 40 నుంచి 50 నిమిషాల్లో పూరించాలి. గ్రూప్ ఆబ్‌స్టకెల్ రేస్‌లో నిర్దేశించిన విధంగా గ్రూప్‌ల వారీగా అడ్డంకులను దాటాలి. హాఫ్‌గ్రూప్ టాస్క్ దశ..ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో సభ్యులను సబ్‌గ్రూప్‌లుగా విభజిస్తారు. ఒక గ్రూప్ అడ్డంకులను పూరిస్తుంటే మరో గ్రూప్ ఆటంకం కలిగిస్తూంటుంది. ఇందులో ప్రతి సబ్ గ్రూప్‌నకు 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. లెక్చరేట్‌లో అభ్యర్థులు గ్రూప్‌ను ఉద్దేశించి నాలుగు నిమిషాలపాటు చిన్న ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంటుంది. అంశాన్ని ఎంపిక చేసుకోవడానికి, ప్రిపేర్ కావడానికి మూడు నిమిషాల సమయం ఇస్తారు.
 
 నాలుగో రోజు:  

 నాలుగో రోజు నిర్వహించే పరీక్షలు.. 1) ఇండివ్యుడ్వాల్ ఆబ్‌స్టకెల్, 2) కమాండ్ టాస్క్, 3) ఫైనల్ గ్రూప్ టాస్క్. ఇండివ్యుడ్వాల్ ఆబ్‌స్టకెల్‌లో ఒకటి నుంచి పది సంఖ్యలతో కూడిన అడ్డంకులు ఉంటాయి. ప్రతి అడ్డంకిని అధిగమించా లి. ఒక్కో అడ్డంకికి ఒక్కో విధంగా మార్కులు కేటాయిస్తారు. ఇందుకు మూడు నిమిషాల సమయం కేటాయిస్తారు. కమాండ్ టా్‌స్క్‌లో ఒక్కొక్కరు ఒక గ్రూప్‌నకు కమాండర్‌గా వ్యవహరించాలి. ఇందులో ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ వలె 15 నిమిషాల్లో అడ్డంకిని అధిగమించాలి. ఫైనల్ గ్రూప్ టాస్క్‌లో కూడా ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ మాదిరిగా ఉండే అడ్డంకిని 15-20నిమిషాల్లో పూర్తి చేయాలి.
 
 ఐదో రోజు:
 ఐదో రోజులో క్లోజింగ్ అడ్రస్, కాన్ఫరెన్స్, ఫలితాల వెల్లడి వంటి అంశాలు ఉంటాయి. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ఆధారం గా సబ్జెక్ట్‌ల వారీగా మెరిట్ లిస్ట్‌ను రూపొందిస్తారు. ఎస్‌ఎస్ బీ ఇంటర్వ్యూ దశను విజయవంతంగా పూర్తి చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఐఎంఏలో ప్రవేశం కల్పిస్తారు.
 
 ఫిజికల్ ఫిట్‌నెస్:
 కేవలం విద్యార్హతలేకాకుండా నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. ఎత్తు 157.5 సెం.మీ. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. చక్కటి కంటి చూపు తప్పనిసరి. ఐఎంఏలో శిక్షణను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు నిర్దేశించిన కొన్ని ఫిజికల్ ఈవెంట్లను ప్రాక్టీస్ చేయడం మంచిది. అవి.. 2.4 కిలోమీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో పరుగెత్తాలి. పుష్ అప్స్-13, సిట్ అప్స్-25, చిన్ అప్స్-6, రోప్ క్లైంబింగ్: 3 నుంచి 4 మీటర్లు.
 
 ఐఎంఏలో శిక్షణ
 ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ)-డెహ్రాడూన్‌లో శిక్షణ ఉంటుంది. వీరికి మొదట ప్రొబేషన్ సమయంలో షార్ట్ సర్వీస్ కమిషన్ హోదా ఇస్తారు. కోర్సు ప్రారంభమైన తేదీ లేదా ఐఎంఏలో రిపోర్ట్ చేసిన తేదీ నుంచి లెఫ్టినెంట్ ర్యాంక్ ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి లెఫ్టినెంట్ ర్యాంక్‌తో పర్మినెంట్ కమిషన్ హోదా ఇస్తారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు రూ.21,000 స్టైఫండ్ చెల్లిస్తారు.
 
 హోదాలు-వేతనాలు
 శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారి కెరీర్ లెఫ్టినెంట్ ర్యాంక్‌తో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో లెఫ్టినెంట్ హోదాకు లభించే జీతభత్యాలను అందజేస్తారు. అంతేకాకుండా మెడికల్, నివాస, సబ్సిడీ రేట్ల మీద కారు/గృహ రుణాలు వంటి సౌకర్యాలను కూడా కల్పిస్తారు. లెఫ్టినెంట్ తర్వాత ఉండే హోదాలను, వేతనాలను పరిశీలిస్తే.. కెప్టెన్ (వేతనం: రూ.15,600-39,100+ గ్రేడ్‌పే: రూ.6,100+ ఎంఎస్‌పీ:రూ.6,000), మేజర్ (వేతనం: రూ.15,600-39,100 + గ్రేడ్‌పే: రూ.6,600 + ఎంఎస్‌పీ: రూ. 6,000), లెఫ్టినెంట్ కల్నల్ (వేతనం: రూ.37,400-67,000 + గ్రేడ్‌పే: రూ.8,000 + ఎంఎస్‌పీ: రూ. 6,000), కల్నల్ (వేతనం: రూ. 37,400-67,000 + గ్రేడ్‌పే: రూ.8,700 + ఎంఎస్‌పీ: రూ. 6,000), బ్రిగేడియర్ (వేతనం: రూ.37,400-67,000 + గ్రేడ్‌పే:రూ.8,900 + ఎంఎస్‌పీ: రూ. 6,000), మేజర్ జనరల్ (వేతనం: రూ.37,400-67,000 + గ్రేడ్‌పే: రూ. 10,000), లెఫ్టినెంట్ జనరల్/ హెచ్‌ఏజీ (వేతనం: రూ.67,000-79,000, ఏడాది 3 శాతం ఇంక్రిమెంట్), హెచ్‌ఏజీ + స్కేల్ (వేతనం: రూ.75,500 - 80,000, ఏడాది 3 శాతం ఇంక్రిమెంట్) వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్/ఆర్మీ కేడర్/లెఫ్టినెంట్ జనరల్-ఎన్‌ఎఫ్‌ఎస్‌జీ (వేతనం: రూ.80,000, ఫిక్స్‌డ్) , చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (వేతనం: రూ.90,000, ఫిక్స్‌డ్) వంటి హోదాలు ఉంటాయి. వీటికి అలవెన్స్‌లు అదనం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement