TJC
-
తేలని సిట్ల కేటాయింపు,కాంగ్రెస్ నేతల్లో అయోమయం
-
కూటమి శ్రేణుల్లో నైరాశ్యం
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల తీరు ఆయా పార్టీల శ్రేణులను నైరాశ్యంలోకి నెటేస్తోంది. ఓ వైపు టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే.. అధికార పార్టీని గద్దె దించుతామంటూ సవాల్ విసురుతున్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. దీంతో కూటమిలోని ఏ పార్టీకి ఎక్కడెక్కడ సీట్లు వస్తాయో.. ఎవరి పేరుతో ప్రచారం చేయాలో అర్థంకాక.. ఆ పార్టీల కార్యకర్తలు నిరాశలో కూరుకుపోతున్నారు. దీనికి తోడు పలు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులం తామేనంటూ.. రెండు, మూడు పార్టీల నేతలు ప్రచారం చేసుకుంటుండటం కూడా కార్యకర్తల్లో, ప్రజల్లో గందరగోళానికి దారితీస్తోంది. ఎల్బీనగర్లో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి (కాంగ్రెస్), సామ రంగారెడ్డి (టీడీపీ)లు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ తమకంటే తమకే వస్తుందనే ధీమాతో వారిద్దరూ ప్రజల్లోకి వెళ్తున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని 20, 30 నియోజకవర్గాల్లో నెలకొంది. సెప్టెంబర్ 6.. నవంబర్ 6 సంచలనం కోసమా.. వ్యూహాత్మకంగానా? అనే విషయాన్ని పక్కనపెడితే.. 105 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించి 53 రోజులు గడిచాయి. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తులను ఒక్కొక్కరుగా బుజ్జగిస్తూ.. నాలుగేళ్లలో ఏం చేశామనే విషయాన్నే శ్రేణులు ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు. కానీ.. టీఆర్ఎస్ను గద్దెదించే లక్ష్యంతో ఒక్కటైన మహాకూటమి పార్టీలు నెలల తరబడి చర్చలు జరుపుతున్నా ఇంతవరకూ.. ఓ నిర్ణయానికి మాత్రం రాలేకపోయారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘వాళ్లు సీట్లు పంచుకునేలోపు.. మేం స్వీట్లు పంచుకుంటాం’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాగా, కూటమిలోని నాలుగు పార్టీల కేడర్‌లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. ఏ పార్టీకి సీటు ఇస్తారు? ఇస్తే తమ నాయకుడికే వస్తుందా? లేక మరెవరికైనా ఇస్తారా? అని తెలియక కార్యకర్తలకు పాలుపోవడం లేదు. ‘మా నాయకుల వ్యూహం ఏంటో అర్థం కావడం లేదు. కేసీఆర్ ప్రకటించగానే అభ్యర్థులను ప్రకటించాలని మా కేడర్ అడగలేదు. కానీ, ఎన్నికలు తరుముకొస్తున్నా ఇంకా అభ్యర్థుల ఖరారు, సీట్ల సర్దుబాటులో మా పార్టీ నేతలు తాత్సారం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకో 40 రోజుల సమయం మాత్రమే మిగిలుంది. వీలైనంత త్వరగా కూటమి సీట్ల విషయం కొలిక్కి వస్తేనే మంచిది. లేదంటే మాపుట్టి మునగటం ఖాయం’అని నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీపీ ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, నిన్నటివరకు నవంబర్ 1న కాంగ్రెస్ తొలిజాబితా వస్తుందని ప్రచారం జరిగగా.. ఇప్పుడు అది నవంబర్ 6కు మారిందన్న ప్రచారం కార్యకర్తల్లో మరింత నిరాశను రేపింది. ముందు కొన్నయినా ప్రకటించండి! కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు కొలిక్కి రానప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోసం ధ్రువీకరణ అయిన స్థానాల్లో అభ్యర్థులను అయినా ప్రకటించుకునేందుకు వెసులుబాటుంది. దాదాపు 40 స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న దానిపై అన్ని స్థాయిల్లోనూ స్పష్టత ఉంది. ఆయా స్థానాలను కూటమిలోని ఇతర పార్టీలు కూడా అడగడం లేదు. ఈ నేపథ్యంలో కనీసం వారి పేర్లయినా ప్రకటించి ఉంటే.. శ్రేణుల్లో ఈ స్థాయిలో నైరాశ్యం ఉండేది కాదు. ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం కూడా పట్టించుకోవడం లేదని క్షేత్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌లోనే మకాం వేసి చర్చల మీద చర్చలు జరుపుతోంది. నాలుగురోజులుగా ఇక్కడే మకాం వేసి పార్టీ ముఖ్యులతో చర్చలు జరుపుతున్న భక్తచరణ్‌దాస్ బృందం.. సోమవారం నాటి భేటీలోనూ.. టికెట్ల కేటాయింపు విషయంలో ఉండాల్సిన నిబంధనలపైనే చర్చించడం కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళానికి అద్దం పడుతోంది. మరోవైపు, నియోజకవర్గాల్లో ఎవరికి ఓటేయాలో చెప్పలేక ప్రచార కార్యక్రమాలు కూడా వాయిదా పడుతున్నాయి. ఈ నెల 20 రాహుల్ పర్యటనపై చర్చించేందుకు ఆగిన ప్రచారం 10 రోజులైనా తిరిగి ప్రారంభం కాలేదు. జానారెడ్డి అసంతృప్తి కూటమి సీట్ల సర్దుబాటు, టికెట్ల ఎంపికలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ.. కాంగ్రెస్ నేత జానారెడ్డితోపాటు ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం కూటమి సీట్ల సర్దుబాటు బాధ్యతను జానారెడ్డి కమిటీకి అప్పగించాలని అనుకున్నప్పటికీ.. దీనికి అనుగుణంగా ఏమీ జరగడం లేదు. దీనికి తోడు రాజకీయాలకు కొత్తయిన.. టీజేఎస్ చీఫ్ కోదండరాంకు ఈ బాధ్యతలు అప్పగించడం జానారెడ్డి గ్రూప్‌కు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో కొందరు కాంగ్రెస్ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పొత్తులు, టికెట్ల కేటాయింపులో పీసీసీ చీఫ్‌తోపాటు సీఎల్పీ అధ్యక్షుడికి సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇదే కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. కానీ జానారెడ్డికి ఈ గౌరవం దక్కడం లేదని తెలుస్తోంది. -
పొత్తు ముప్పు
సాక్షి, వరంగల్ రూరల్: ఇన్నాళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను ఢీకొనేందుకు ప్రతిపక్ష పార్టీలు జట్టుకట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, మిగతా ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. అయితే పొత్తు కుదిరితే కొందరు ఆశావహులకు మొండి చేయి తప్పేలా లేదు. దీంతో ఎవరి సీట్లు గల్లంతవుతాయోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరితే టీడీపీ నాయకులు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒకటి నుంచి రెండు సీట్లు అడుగుతున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణ జన సమితి సైతం ఉమ్మడి జిల్లాలో రెండు సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులో ఈ పార్టీలకు కేటాయించే సీట్లతో కాంగ్రెస్‌లో ఏ స్థానం గల్లంతవుతుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో తమ సీటు పొత్తులో గల్లంతయితే తమ పరిస్థితి ఏమిటని ఆశావహుల్లో ఆందోళన ప్రారంభమైంది. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరితే వారు అడుగుతున్న టికెట్లు ఇస్తే ఆయా నియోజకవర్గాల్లో ఆశావహుల ఆశలు గల్లంతైనట్లేనని భావించవచ్చు. పరకాల నియోజకవర్గం.. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, గండ్ర జ్యోతి, ఆవేళి దామోదర్ టికెట్లు ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు. తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నా టీడీపీ గెలుపొందిందని టీడీపీ వారు పరకాల టికెట్‌ను అడిగే అవకాశం ఉంది. వరంగల్ పశ్చిమ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వేం నరేందర్ రెడ్డి టికెటుఆశిస్తున్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సభ్యుడు పుల్లూరు అశోక్ కుమార్, టీజేఎస్ నుంచి శ్యాంసుందర్ రెడ్డి, తిరునహరి శేషు పోటీపడుతున్నారు. సీపీఐ వారు పొత్తులో భాగంగా టికెట్ ఈ అడిగే అవకాశం ఉంది. జనగామ జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు ప్రసాద్ బాబు, బొట్ల శ్రీనివాస్, కత్తుల రాజిరెడ్డి, టీజేఎస్ నుంచి తీగల సిద్ధుగౌడ్ టికెట్ అశిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వారు జనగామ టికెట్ తప్పక కావాలని కోరుతున్నట్లు సమాచారం. పాలకుర్తి పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీడీపీ నుంచి జాటోత్ ఇందిర టికెట్ ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా పాలకుర్తి టికెట్ కాంగ్రెస్‌కే అడిగినట్లు సమాచారం. ఈ టికెట్ కోసం టీజేఎస్, సీపీఐ పోటీ పడడంలేదని తెలిసింది. డోర్నకల్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రామచంద్రునాయక్, మాలోత్ నెహ్రూ నాయక్, టీజేఎస్ నుంచి తేజ నాయక్ టికెట్లు ఆశిస్తున్నారు. టీడీపీ, సీపీఐ నుంచి పోటీలో ఎవరు లేరని తెలుస్తోంది. దీంతో పొత్తులో భాగంగా రామచంద్రునాయక్‌కు టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహబూబాబాద్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా పోటీ ఉంది. కాంగ్రెస్ నుంచి మున్సిçపల్ చైర్పర్సన్ ఉమా మురళీనాయక్ దంపతులు, మాజీ ఎంపీ బలరాం నాయక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుచిత్ర, పీసీసీ సభ్యుడు దస్రూ నాయక్, నునావత్ రమేశ్, టీడీపీ నుంచి భూక్యా సునీత, మోహన్‌లాల్, రాధ, టీజేఎస్ నుంచి పోరిక అభినందన టికెట్ ఆశిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి గుండె విజయరామరావు, సింగపురం ఇందిర, టీడీపీ నుంచి శాగ రాజు, టీజేఎస్ నుంచి చింతం సాంబమూర్తి టికెట్ అశిస్తున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ టికెట్ కోసం పట్టుబట్టే అవకాశముంది. భూపాలపల్లి.. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, టీడీపీ నుంచి చాడ రఘునాథ రెడ్డి టికెట్ అశిస్తున్నారు. సీపీఐ, టీజేఎస్ నుంచి టికెట్ ఎవరు ఆశించడం లేదని తెలుస్తోంది. ఈ టికెట్‌ను పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఇవ్వాలని పట్టుబడుతున్న తెలిసింది. ములుగు ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే సీతక్క, పొదెం వీరయ్య, టీడీపీ నుంచి భూక్య జవహర్ నాయక్, నర్సయ్య ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌లోనే ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ స్థానాన్ని టీజేఎస్, సీపీఐ నుంచి ఎవరూ ఆశించడం లేదని సమాచారం. వర్ధన్నపేట వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్, నమిండ్ల శ్రీనివాస్ తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నుంచి తూల కుమారస్వామి, కొమ్ముల యాకయ్య ప్రయత్నిస్తున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఈ స్థానం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. -
కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం
మంచిర్యాలక్రైం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దెదించడమే లక్ష్యంగా తెలంగాణ జన సమితి అవిర్భవించిందని జిల్లా కన్వీనర్ మందల శ్యాంసుందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చేస్తే రాలేదన్నారు. రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ కోదండరాం అన్ని వర్గాల ప్రజలను, విద్యార్థ సంఘాల నాయకులను, ఉద్యోగ సంఘాల నాయకులను ఏకతాటిపై తెచ్చి ఉద్యమం నడపడం ద్వారానే రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. అనేక మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు, త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన విద్యార్థుల ఆశయాలను, ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పట్టం కడుతున్నాడని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్నిన హామీలను మరిచి స్వార్థపూరితమైన పథకాలను అమలు చేస్తూ తమ ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు కలలు గన్న రాష్ట్రం ఇది కాదన్నారు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు మలిదశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తెలంగాణ జన సమితి నిర్మాణంలో భాగంగానే జిల్లా విద్యార్థి విభాగం అడ్‌హక్ కమిటీని నియమించినట్లు తెలిపారు. కేసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ విద్యను నీరుగార్చే కుట్రకు పూనుకున్నాడన్నారు 4800 పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని అరోపించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అంటూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. అనంతరం జిల్లా అడ్‌హక్ కమిటీని, మందమర్రి పట్టణ కన్వీనర్‌ను నియమించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం వెంకటేష్, జిల్లా సలహాదారు బాబన్న, జిల్లా కో కన్వీనర్ ఒడ్డెపల్లి మనోహర్, దుర్గం నరేష్, గోపాల్, క్యాతం రవికుమార్, ఎర్రబెల్లి రాజేష్, కుర్సింగ వెంకటేష్, రవికుమార్, కనకరాజు పాల్గొన్నారు. టీజేఎస్వీ అడ్‌హక్ కమిటీ తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా అడ్‌హక్ కమిటీని నియమించారు. కన్వీనర్‌గా చిప్పకుర్తి శ్రీనివాస్, కో కన్వీనర్లుగా పూరెల్ల నితిన్, గొడిసెల సురేందర్, సభ్యులుగా మామిడాల అరుణ్, ఆవునూరి ప్రసాద్, చిలుక శ్రావణ్, జక్కె ప్రశాంత్, భూక్య కిరణ్‌కుమార్, రమేష్, రామగిరి సాగర్లను నియమించారు. టీజేఎస్ మందమర్రి పట్టణ కన్వీనర్‌గా బండారి రవికుమార్‌ను నియమించారు. -
ఇంజనీరింగ్ పట్టభద్రులకు భారత సైన్యం ఆహ్వానం
భారతీయ సైన్యం 2015 జనవరి నుంచి ప్రారంభమయ్యే 120వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) కోసం అర్హులైన ఇంజనీరింగ్ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు అవివాహితులై ఉండాలి. అర్హత: విభాగాన్ని బట్టి నిర్దేశించిన ఇంజనీరింగ్ డిగ్రీ. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు (ఇటువంటి విద్యార్థులు ఐఎంఏలో శిక్షణ ప్రారంభానికి 12 వారాల ముందు డిగ్రీని అందజేయాలి). వివరాలు.. ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇలా షార్ట్ లిస్ట్ చేసిన వారికి అలహాబాద్, భోపాల్, బెంగళూరులలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ బోర్డులో సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు. ఇందులో నిర్దేశించిన విధంగా అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాత దశలో ఉండే సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్బీ ఇలా: సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ ప్రక్రియను ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో స్టేజ్-1, స్టేజ్-2 అనే రెండు దశలు ఉంటాయి. స్టేజ్-1ను విజయవంతంగా పూర్తి చేసిన వారిని మాత్రమే స్టేజ్-2కు అనుమతిస్తారు. ఈ పరీక్షలు ప్రధానంగా అభ్యర్థులు విశ్లేషణాత్మక సామర్థ్యం, మానసిక దృఢత్వం, తార్కిక వివేచన, పరిశీలనా సామర్థ్యం వంటి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. వివరాలు.. మొదటి రోజు: మొదటి రోజున స్టేజ్-1 దశను నిర్వహిస్తారు. ఇందులో మూడు రకాల పరీక్షలు ఉంటాయి. అవి.. ఇంటెలిజెన్స్ టెస్ట్ (వెర్బల్ అండ్ నాన్ వెర్బల్), పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్, డిస్కషన్ ఆఫ్ ది పిక్చర్. ఇంటెలిజెన్స్ టెస్ట్ (వెర్బల్ అండ్ నాన్ వెర్బల్)లో కంప్లీషన్ ఆఫ్ సిరీస్, కోడింగ్-డికోడింగ్, రిలేషన్షిప్, జంబుల్డ్ స్పెల్లింగ్, బెస్ట్ రీజన్, సేమ్ క్లాస్ టెస్ట్, డెరైక్షన్స్, కామన్సెన్స్, సీక్వెన్సెస్, వర్డ్ బిల్డింగ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవి కొంత వరకు సులభంగా ఉన్నప్పటికీ..నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాల్సి రావడమనే అంశం ఈ విభాగాన్ని క్లిష్టం చేస్తుంది. పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లో 30 సెకన్లపాటు ఒక చిత్రం (పిక్చర్) ఫ్లాష్ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించి.. క్యారెక్టర్స్ (characters), ఏజ్ (age), లింగం (sex), మూడ్ (mood), యాక్షన్ రిలేటింగ్ టు పాస్ట్(action relating to past), ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఫర్ ఈచ్ క్యారెక్టర్ (present and future for each character) వంటి వివరాలను నిమిషం వ్యవధిలో నమోదు చేసుకోవాలి. తర్వాత వీటి ఆధారంగా నాలుగు నిమిషాల్లో కథను రాయాలి. డిస్కషన్ ఆఫ్ ది పిక్చర్ విభాగానికి 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇందుకోసం అభ్యర్థులను గ్రూపులుగా విభజిస్తారు. ప్రతిగ్రూప్‌లో 15 మంది ఉంటారు. ప్రతి సభ్యుడు తాను రాసిన కథను వినిపించాలి. ఈ విధంగా సభ్యులందరూ చర్చించుకుని ఆ కథ నేపథ్యం, పాత్రల మీద ముగింపునకు రావాలి. ఈ దశలో నిర్దేశించిన విధంగా అర్హత సాధించిన వారిని మాత్రమే రెండో దశకు అనుమతిస్తారు. రెండో రోజు: రెండో రోజు నుంచి రెండో దశ స్టేజ్-2 పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో రెండో రోజు నాలుగు టెస్ట్‌లు ఉంటాయి. అవి.. 1) థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్, 2) వర్డ్ అసోసియేషన్ టెస్ట్, 3) సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్, 4) సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్. థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్‌లో 12 చిత్రాలను వరుసగా చూపిస్తారు. వీటిల్లో ఒక్కోటి 30 సెకన్లపాటు ఫ్లాష్ అవుతుంది. వీటి ఆధారంగా 4 నిమిషాల్లో ఒక కథను రాయాలి. అయితే ఈ క్రమంలో 12 చిత్రాల్లో ఏదో ఒక చిత్రాన్ని ఖాళీ(బ్లాంక్)గా ఉంచుతారు. ఈ ఖాళీ చిత్రంలో.. రావల్సిన చిత్రాన్ని ఊహించి.. దాని ఆధారంగా కథను రూపొందించాలి. వర్డ్ అసోసియేషన్ టెస్ట్‌లో ఒక దాని తర్వాత ఒకటి చొప్పున 60 పదాలను చూపిస్తారు. అభ్యర్థులు వాటి ఆధారంగా తమకు వచ్చిన ఆలోచన/కథను రాయాలి. సిచ్యువేషన్ రియాక్షన్ టె్స్ట్లో దైనందిన జీవితంలో ఎదురయ్యే 60 సంఘటనలను పొందుపరుస్తూ ఒక బుక్‌లెట్‌ను అభ్యర్థులకు అందజేస్తారు. అభ్యర్థులు సదరు సంఘటనల పట్ల తమ ప్రతిస్పందనలను బుక్‌లెట్‌లో నిర్దేశించిన ప్రదేశంలో రాయాలి. సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లో తల్లిదండ్రులు/సంరక్షకులు, స్నేహితులు, ఉపాధ్యాయులు/ పర్యవేక్షకులకు సంబంధించి వేర్వేరుగా ఐదు వ్యాసాలు రాయాలి. మూడో రోజు: మూడో రోజు నిర్వహించే పరీక్షలు.. 1) గ్రూప్ డిస్కషన్, 2) గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్, 3)ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్, 4) గ్రూప్ ఆబ్స్టకెల్ రేస్, 5) హాఫ్గ్రూప్ టాస్క్, 6) లెక్చరేట్. గ్రూప్ డిస్కషన్లో సామకాలీన అంశం లేదా సాంఘిక/సామాజిక ప్రాధాన్యత ఉన్న అంశంపై ఇష్టాగోష్టిగా చర్చించాల్సి ఉంటుంది. దీనికి 20 నిమిషాల సమయం కేటాయిస్తారు. చర్చకు అర్ధవంతమైన ముగింపు ఉండనవసరం లేదు. గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్లో ఐదు దశలు ఉంటాయి. అవి..ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ది మోడల్, రీడింగ్ ఆఫ్ ది నారేటివ్ బై జీటీవో, సెల్ఫ్ రీడింగ్ (5 నిమిషాలు), ఇండివ్యుడ్వాల్ రిటెన్ సొల్యూషన్స్ (10 నిమిషాలు), గ్రూప్ డిస్కషన్ (20 నిమిషాలు). ఈ విభాగానికి సంబంధించిన చర్చకు అర్థవంతమైన ముగింపు తప్పనిసరి. ప్రొగ్రెసివ్ గ్రూప్ టాస్క్‌ను అవుట్‌డోర్‌లో నిర్వహిస్తారు. ఇందులో క్రమక్రమంగా పెరుగుతున్న క్లిష్టతను అధిగమించి అడ్డంకులను 40 నుంచి 50 నిమిషాల్లో పూరించాలి. గ్రూప్ ఆబ్స్టకెల్ రేస్‌లో నిర్దేశించిన విధంగా గ్రూప్‌ల వారీగా అడ్డంకులను దాటాలి. హాఫ్గ్రూప్ టాస్క్ దశ..ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో సభ్యులను సబ్గ్రూప్లుగా విభజిస్తారు. ఒక గ్రూప్ అడ్డంకులను పూరిస్తుంటే మరో గ్రూప్ ఆటంకం కలిగిస్తూంటుంది. ఇందులో ప్రతి సబ్ గ్రూప్‌నకు 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. లెక్చరేట్లో అభ్యర్థులు గ్రూప్‌ను ఉద్దేశించి నాలుగు నిమిషాలపాటు చిన్న ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంటుంది. అంశాన్ని ఎంపిక చేసుకోవడానికి, ప్రిపేర్ కావడానికి మూడు నిమిషాల సమయం ఇస్తారు. నాలుగో రోజు: నాలుగో రోజు నిర్వహించే పరీక్షలు.. 1) ఇండివ్యుడ్వాల్ ఆబ్స్టకెల్, 2) కమాండ్ టాస్క్, 3) ఫైనల్ గ్రూప్ టాస్క్. ఇండివ్యుడ్వాల్ ఆబ్స్టకెల్లో ఒకటి నుంచి పది సంఖ్యలతో కూడిన అడ్డంకులు ఉంటాయి. ప్రతి అడ్డంకిని అధిగమించా లి. ఒక్కో అడ్డంకికి ఒక్కో విధంగా మార్కులు కేటాయిస్తారు. ఇందుకు మూడు నిమిషాల సమయం కేటాయిస్తారు. కమాండ్ టా్స్క్లో ఒక్కొక్కరు ఒక గ్రూప్‌నకు కమాండర్‌గా వ్యవహరించాలి. ఇందులో ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ వలె 15 నిమిషాల్లో అడ్డంకిని అధిగమించాలి. ఫైనల్ గ్రూప్ టాస్క్‌లో కూడా ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ మాదిరిగా ఉండే అడ్డంకిని 15-20నిమిషాల్లో పూర్తి చేయాలి. ఐదో రోజు: ఐదో రోజులో క్లోజింగ్ అడ్రస్, కాన్ఫరెన్స్, ఫలితాల వెల్లడి వంటి అంశాలు ఉంటాయి. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఆధారం గా సబ్జెక్ట్‌ల వారీగా మెరిట్ లిస్ట్‌ను రూపొందిస్తారు. ఎస్ఎస్ బీ ఇంటర్వ్యూ దశను విజయవంతంగా పూర్తి చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఐఎంఏలో ప్రవేశం కల్పిస్తారు. ఫిజికల్ ఫిట్నెస్: కేవలం విద్యార్హతలేకాకుండా నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. ఎత్తు 157.5 సెం.మీ. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. చక్కటి కంటి చూపు తప్పనిసరి. ఐఎంఏలో శిక్షణను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు నిర్దేశించిన కొన్ని ఫిజికల్ ఈవెంట్లను ప్రాక్టీస్ చేయడం మంచిది. అవి.. 2.4 కిలోమీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో పరుగెత్తాలి. పుష్ అప్స్-13, సిట్ అప్స్-25, చిన్ అప్స్-6, రోప్ క్లైంబింగ్: 3 నుంచి 4 మీటర్లు. ఐఎంఏలో శిక్షణ ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ)-డెహ్రాడూన్‌లో శిక్షణ ఉంటుంది. వీరికి మొదట ప్రొబేషన్ సమయంలో షార్ట్ సర్వీస్ కమిషన్ హోదా ఇస్తారు. కోర్సు ప్రారంభమైన తేదీ లేదా ఐఎంఏలో రిపోర్ట్ చేసిన తేదీ నుంచి లెఫ్టినెంట్ ర్యాంక్ ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి లెఫ్టినెంట్ ర్యాంక్‌తో పర్మినెంట్ కమిషన్ హోదా ఇస్తారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు రూ.21,000 స్టైఫండ్ చెల్లిస్తారు. హోదాలు-వేతనాలు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారి కెరీర్ లెఫ్టినెంట్ ర్యాంక్‌తో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో లెఫ్టినెంట్ హోదాకు లభించే జీతభత్యాలను అందజేస్తారు. అంతేకాకుండా మెడికల్, నివాస, సబ్సిడీ రేట్ల మీద కారు/గృహ రుణాలు వంటి సౌకర్యాలను కూడా కల్పిస్తారు. లెఫ్టినెంట్ తర్వాత ఉండే హోదాలను, వేతనాలను పరిశీలిస్తే.. కెప్టెన్ (వేతనం: రూ.15,600-39,100+ గ్రేడ్‌పే: రూ.6,100+ ఎంఎస్పీ:రూ.6,000), మేజర్ (వేతనం: రూ.15,600-39,100 + గ్రేడ్‌పే: రూ.6,600 + ఎంఎస్పీ: రూ. 6,000), లెఫ్టినెంట్ కల్నల్ (వేతనం: రూ.37,400-67,000 + గ్రేడ్‌పే: రూ.8,000 + ఎంఎస్పీ: రూ. 6,000), కల్నల్ (వేతనం: రూ. 37,400-67,000 + గ్రేడ్‌పే: రూ.8,700 + ఎంఎస్పీ: రూ. 6,000), బ్రిగేడియర్ (వేతనం: రూ.37,400-67,000 + గ్రేడ్‌పే:రూ.8,900 + ఎంఎస్పీ: రూ. 6,000), మేజర్ జనరల్ (వేతనం: రూ.37,400-67,000 + గ్రేడ్‌పే: రూ. 10,000), లెఫ్టినెంట్ జనరల్/ హెచ్ఏజీ (వేతనం: రూ.67,000-79,000, ఏడాది 3 శాతం ఇంక్రిమెంట్), హెచ్ఏజీ + స్కేల్ (వేతనం: రూ.75,500 - 80,000, ఏడాది 3 శాతం ఇంక్రిమెంట్) వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్/ఆర్మీ కేడర్/లెఫ్టినెంట్ జనరల్-ఎన్ఎఫ్ఎస్జీ (వేతనం: రూ.80,000, ఫిక్స్డ్) , చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (వేతనం: రూ.90,000, ఫిక్స్డ్) వంటి హోదాలు ఉంటాయి. వీటికి అలవెన్స్‌లు అదనం.