సాక్షి, వరంగల్ రూరల్: ఇన్నాళ్లు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ను ఢీకొనేందుకు ప్రతిపక్ష పార్టీలు జట్టుకట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, మిగతా ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. అయితే పొత్తు కుదిరితే కొందరు ఆశావహులకు మొండి చేయి తప్పేలా లేదు. దీంతో ఎవరి సీట్లు గల్లంతవుతాయోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరితే టీడీపీ నాయకులు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒకటి నుంచి రెండు సీట్లు అడుగుతున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణ జన సమితి సైతం ఉమ్మడి జిల్లాలో రెండు సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది.
పొత్తులో ఈ పార్టీలకు కేటాయించే సీట్లతో కాంగ్రెస్‌లో ఏ స్థానం గల్లంతవుతుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో తమ సీటు పొత్తులో గల్లంతయితే తమ పరిస్థితి ఏమిటని ఆశావహుల్లో ఆందోళన ప్రారంభమైంది. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరితే వారు అడుగుతున్న టికెట్లు ఇస్తే ఆయా నియోజకవర్గాల్లో ఆశావహుల ఆశలు గల్లంతైనట్లేనని భావించవచ్చు.
పరకాల నియోజకవర్గం..
పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, గండ్ర జ్యోతి, ఆవేళి దామోదర్ టికెట్లు ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు. తర్వాత టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నా టీడీపీ గెలుపొందిందని టీడీపీ వారు పరకాల టికెట్‌ను అడిగే అవకాశం ఉంది.
వరంగల్ పశ్చిమ
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వేం నరేందర్ రెడ్డి టికెటుఆశిస్తున్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సభ్యుడు పుల్లూరు అశోక్ కుమార్, టీజేఎస్ నుంచి శ్యాంసుందర్ రెడ్డి, తిరునహరి శేషు పోటీపడుతున్నారు. సీపీఐ వారు పొత్తులో భాగంగా టికెట్ ఈ అడిగే అవకాశం ఉంది.
జనగామ
జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు ప్రసాద్ బాబు, బొట్ల శ్రీనివాస్, కత్తుల రాజిరెడ్డి, టీజేఎస్ నుంచి తీగల సిద్ధుగౌడ్ టికెట్ అశిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వారు జనగామ టికెట్ తప్పక కావాలని కోరుతున్నట్లు సమాచారం.
పాలకుర్తి
పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీడీపీ నుంచి జాటోత్ ఇందిర టికెట్ ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా పాలకుర్తి టికెట్ కాంగ్రెస్‌కే అడిగినట్లు సమాచారం. ఈ టికెట్ కోసం టీజేఎస్, సీపీఐ పోటీ పడడంలేదని తెలిసింది.
డోర్నకల్
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రామచంద్రునాయక్, మాలోత్ నెహ్రూ నాయక్, టీజేఎస్ నుంచి తేజ నాయక్ టికెట్లు ఆశిస్తున్నారు. టీడీపీ, సీపీఐ నుంచి పోటీలో ఎవరు లేరని తెలుస్తోంది. దీంతో పొత్తులో భాగంగా రామచంద్రునాయక్‌కు టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మహబూబాబాద్
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా పోటీ ఉంది. కాంగ్రెస్ నుంచి మున్సిçపల్ చైర్‌పర్సన్ ఉమా మురళీనాయక్ దంపతులు, మాజీ ఎంపీ బలరాం నాయక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుచిత్ర, పీసీసీ సభ్యుడు దస్రూ నాయక్, నునావత్ రమేశ్, టీడీపీ నుంచి భూక్యా సునీత, మోహన్‌లాల్, రాధ, టీజేఎస్ నుంచి పోరిక అభినందన టికెట్ ఆశిస్తున్నారు.
స్టేషన్ ఘన్‌పూర్
స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి గుండె విజయరామరావు, సింగపురం ఇందిర, టీడీపీ నుంచి శాగ రాజు, టీజేఎస్ నుంచి చింతం సాంబమూర్తి టికెట్ అశిస్తున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ టికెట్ కోసం పట్టుబట్టే అవకాశముంది.
భూపాలపల్లి..
కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, టీడీపీ నుంచి చాడ రఘునాథ రెడ్డి టికెట్ అశిస్తున్నారు. సీపీఐ, టీజేఎస్ నుంచి టికెట్ ఎవరు ఆశించడం లేదని తెలుస్తోంది. ఈ టికెట్‌ను పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఇవ్వాలని పట్టుబడుతున్న తెలిసింది.
ములుగు
ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే సీతక్క, పొదెం వీరయ్య, టీడీపీ నుంచి భూక్య జవహర్ నాయక్, నర్సయ్య ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌లోనే ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ స్థానాన్ని టీజేఎస్, సీపీఐ నుంచి ఎవరూ ఆశించడం లేదని సమాచారం.
వర్ధన్నపేట
వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్, నమిండ్ల శ్రీనివాస్ తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నుంచి తూల కుమారస్వామి, కొమ్ముల యాకయ్య ప్రయత్నిస్తున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఈ స్థానం కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment