సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కారు’ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు జట్టు కట్టిన మహా కూటమి ఇక సీట్ల పంపకాల మీద దృష్టి పెట్టింది. కూటమిగా ఏర్పడిన తర్వాత సీట్ల కోసం కొట్లాడుకుని విడిపోవడం కంటే ముందే మాట్లాడుకుని దోస్తీ కడితే బాగుంటుందనే ఆలోచనలతో ఆయా పార్టీల అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు స్థానిక రాజకీయ సమీకరణాలు, పార్టీల బలాబలాల వివరాలను రాష్ట్ర నాయకత్వం తెప్పించుకుని కసరత్తు చేస్తోంది. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఇటీవలే చర్చలు జరిపారు. గెలిచే స్థానాలు మినహా మిగతా చోట్ల ఇతర పార్టీలకు కేటాయించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ సూచిం చిన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీడీపీ మూడు సీట్లు, టీజేఎస్ రెండు సీట్లను అడుగుతున్నట్లు తెలిసింది.
నర్సంపేటపైనే..
జిల్లాలో టీడీపీ బలాబలాలపై వారం రోజుల క్రితం ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇంటెలిజెన్సీ అధికారులతో ఆ పార్టీ సర్వే చేయించింది. పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాలో సర్వే కొనసాగినట్లు సమాచారం. ఇందులో కనీసం మూడు సీట్లు కావాలని అడుగుతోంది. కాంగ్రెస్ మాత్రం కేవలం ఒకే ఒక సీటు ఇస్తామని సూచన ప్రాయంగా చెప్పినట్లు సమాచారం. ఒకే ఒక్క సీటు ఇస్తే అది కచ్చితంగా నర్సంపేట కావాలని టీడీపీ పట్టుబడుతోంది. ఇక్కడ నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చంద్రబాబునాయుడికి సన్నిహితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకా శ్‌రెడ్డి పోటీలో ఉన్నారు.
ఆయన కోసం నర్సంపేట సీటును టీడీపీ అడుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉం డడంతో సీటు వదులుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ససేమిరా అంటోంది. గతంలో ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అనంతరం తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చారు. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వకుం డా ఉండలేమని కాంగ్రెస్ పార్టీ తెగేసి చెప్పింది. దీంతో మరో దఫా చర్చలకు కూర్చోవాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ జన సమితి..
తెలంగాణ జన సమితి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంతో పాటు జనగామ టికెట్‌ను అడుగుతున్నట్లు సమాచారం. వరంగల్ పశ్చిమ నుంచి టీజేఎఫ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ టీజేఎస్ అంతగా వేళ్లూనుకోకపోవడం, సంస్థాగతంగా నాయకులు, కార్యకర్తలు లేక బలహీనంగా ఉండడం వంటి కారణాలతో మంచిర్యాల నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కోదండరామ్ సొంత ఊరు నెన్నెల మండలం జోగాపూర్. ప్రస్తుతం ఇది మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో ఉంది.
25న హైదరాబాద్‌లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం
కాంగ్రెస్ పార్టీలో జిల్లా నుంచి ఢిల్లీ వరకు జరుగుతున్న కసరత్తు ఆ పార్టీ నాయకుల అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల నుంచి పోటాపోటీగా అధిష్టానానికి దరఖాస్తు చేస్తున్నారు. పొత్తుల నేపథ్యంలో చెరొకటి చొప్పున టీడీపీ, టీజేఎస్‌కు ఇస్తే మిగిలిన 10 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది. కాగా, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
చైర్మన్‌గా భక్తచరణ్‌దాస్, సభ్యులుగా శర్మిష్ఠముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమైలతో స్కీన్రింగ్ కమిటీ వేసింది. ఈ కమిటీ 25న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశం కానుండడంతో ఆశావహుల్లో అలజడి మొదలైంది. ముఖ్యనేతలు, డీసీసీ కమిటీలు సిఫారసు చేసిన పేర్లపై ఈ కమిటీ చర్చించి.. పోటీ ఉన్న సెగ్మెంట్లలో ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున పేర్లను ఎంపిక చేసి అధినేత రాహుల్‌గాంధీకి సిఫారసు చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment