కేటీఆర్‌ చేతిలో స్టీరింగ్‌ | K Ramachandra Murthy Trikalam On KTR Appointed As TRS Working President | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 16 2018 1:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

K Ramachandra Murthy Trikalam On KTR Appointed As TRS Working President - Sakshi

ఇందిరాగాంధీ, ఎన్‌టి రామారావు, అటల్‌ బిహారీ వాజపేయి, చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి నిండా మునిగారు. కల్వకుంట్ల చంద్ర శేఖరరావు (కేసీఆర్‌) మాత్రం విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఎన్ని కలలో గెలుపోటములు సర్వసాధారణం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అసెంబ్లీ ఎన్నికలలో పోరాడి గెలుపొందిన విధం విశేషమైనది. టీఆర్‌ఎస్‌ విజయంపై అధిక సంఖ్యాకులకు అనుమానం లేదు. కొందరు రాజకీయ పరిశీలకులూ, మీడియా ప్రవీణులూ వ్యక్తిగతంగా కేసీఆర్‌ పట్ల ఆగ్రహం కారణంగా టీఆర్‌ఎస్‌ ఓడిపోవాలని కోరుకున్నారు. ఓడిపోతుందని తీర్మానించుకున్నారు.

ఆకాంక్షకూ, అంచనాకూ మధ్య సరిహద్దురేఖ చెదిరిపోయి గందరగోళానికి గురైనారు. కేసీఆర్‌ పట్ల కినుక వహించడానికి తగిన కారణాలు ఉండవచ్చు. ప్రజల ఆలోచనా ధోరణి çపసికట్టడంలో అది అవరోధం కాకూడదు. టీఆర్‌ఎస్‌కు అసాధారణ మెజారిటీ లభించడానికి కారణాలు స్పష్టంగా కని పిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ తప్పిదాలు చేయకుండా ఉంటే ఆ పార్టీకి ఇంత ఘోర పరాజయం ఉండేది కాదు. కేసీఆర్‌ ఉద్యమ సమయంలో మాట్లాడినట్టు కటువుగా మాట్లాడితేనే ప్రజలు మెచ్చుకుంటారనే భావనతో కాంగ్రెస్‌ నాయ కులు స్థాయి మరచి టీఆర్‌ఎస్‌పైనా, కేసీఆర్‌పైనా పరుషపదజాలం ప్రయోగిం చారు.

కేసీఆర్‌ మాత్రం ఉద్యమభాషకు భిన్నంగా, ఆవేశరహితంగా ప్రజలకు తేలికగా అర్థమయ్యే విధంగా మాట్లాడారు. తనకు కాంగ్రెస్‌ అందించిన ఆయు ధాలతో సమర్థంగా పోరాడారు. ‘కేసీఆర్‌ కావాలా, చంద్రబాబు కావాలా?’ అన్న ప్రశ్న ప్రజల హృదయాలను సూటిగా తాకింది. త్యాగాలు చేసిన సాధించుకున్న తెలంగాణపైన అమరావతి ఆధిపత్యం అవాంఛనీయమని భావించిన ఓటర్లు క్యూలు కట్టి మూకుమ్మడిగా కారు బటన్‌ నొక్కారు. టీఆర్‌ఎస్‌ ఖాతాలో 88 స్థానాలు నమోదైనాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సంసి ద్ధత వెలిబుచ్చారు. చేర్చుకుంటే కాంగ్రెస్‌ నుంచి రావడానికి పది మంది సిద్ధంగా ఉన్నారని భోగట్టా.

ఫలించిన కేసీఆర్‌ వ్యూహం
ఏ ఫలితం ఆశించి కేసీఆర్‌ గడువు కంటే ఏడు మాసాల మందుగానే శాసన సభను రద్దు చేయించారో అది దక్కింది. అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ లభించింది. 1983లో, 1994లో ఎన్‌టిఆర్‌ కూడా పెద్ద మెజారిటీలు సాధిం చారు. ఈ సారి టీఆర్‌ఎస్‌ విజయంలోని విశేషం ప్రతిపక్షానికి చెందిన అతిరథమహారథులు మట్టికరవడం. పీసీసీకి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నవారు ఎన్నికల బరిలో రాణించలేకపోయారు. పొన్నం ప్రభాకర్, రేవంత్‌ రెడ్డి ఓడిపోవడమే కాకుండా పాత కరీంనగర్, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని ఇసుమంతైనా నిలువరించలేకపోయారు.

ముఖ్య మంత్రి అభ్యర్థులుగా భావించిన జానారెడ్డి, డికె అరుణ, దామోదర రాజ నరసింహ వంటివారూ పరాజయం పాలైనారు. ఈ స్థాయికి చెందినవారిలో భట్టి విక్రమార్క ఒక్కరే తాను గెలుపొందడమే కాకుండా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కూటమి అభ్యర్థుల విజయానికి కారకుడైనారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రి మండలిలో పని చేసిన మహిళలు గీతారెడ్డి, సునీతా లక్షా్మరెడ్డి, అరుణ, సురేఖ ఓడిపోయారు. ఒక్క సబిత మాత్రం గెలిచారు. కూటమికి ప్రచారం చేయడం పేరు మీద చంద్రబాబు మొదటి పాదం ఖమ్మం జిల్లాలోనే మోపినా భయ పడినంత నష్టం కాంగ్రెస్‌ అభ్యర్థులకు జరగలేదు.

చంద్రబాబు ప్రభావం ఇతర జిల్లాలపైన విపరీతంగా పడింది. ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా, వారి ఆకాంక్షలనూ, అనుభవాలనూ పట్టించుకోకుండా, చంద్రబాబు పట్ల తెలంగాణలో ఎంతటి వ్యతిరేకత ఉన్నదో అర్థం చేసుకోకుండా కాంగ్రెస్‌ నాయకత్వం టీడీపీతో, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజెఎస్‌)తో, సీపీఐతో కలసి కూటమి కట్టి భంగపడింది. చంద్రబాబు పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఒక్కటే కాదు, టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడంలోని అనైతికతను కూడా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. టీడీపీ ప్రతినిధిగా కంభంపాటి రామమోహనరావు ఢిల్లీలో రాహుల్‌గాంధీ కార్యాలయానికి వెళ్ళడం, కాంగ్రెస్‌ అధిష్ఠానం దూతగా అశోక్‌ గహ్లోత్‌ అమరావతికి రావడం, ఆ తర్వాత కాంగ్రెస్‌ జాబితా ఖరారు కావడం వంటివి అనేక అనుమానాలు రేకెత్తించాయి. ప్రజల ఆలోచనలను ప్రభావితం చేశాయి.

టీఆర్‌ఎస్‌తో పొత్తుకోసం చంద్రబాబు ప్రయత్నించి విఫలమైన తర్వాతనే కాంగ్రెస్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారనే సంగతి విస్మరించకూడదు. చంద్రబాబుకు టీఆర్‌ఎస్‌ అయినా, కాంగ్రెస్‌ అయినా, బీజేపీ అయినా ఎటు వంటి అభ్యంతరం లేదు. సిద్ధాంతాలూ, సూత్రాలూ, విధానాలతో నిమిత్తం లేకుండా అవకాశవాద కూటములు కట్టే చంద్రబాబు వంటి నాయకుడితో  స్నేహం చేస్తే బీజేపీకి ఎటువంటి పరాభవం జరిగిందో కాంగ్రెస్‌కూ అదే అను భవం ఎదురవుతుంది. లోక్‌సభ ఎన్నికలు కొద్ది నెలలోనే జరగబోతున్నాయి. పొత్తుల గురించీ, ఎత్తుల గురించీ, జిత్తుల గురించీ పునరాలోచించుకోవలసిన సమయం, సందర్భం ఇదే. 

కేటీఆర్‌కి ఉన్నత పదవి
ఇదే మంచి సమయం అనుకొన్న  కేసీఆర్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్‌ ప్రెసిడెంట్‌)గా కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌)ను నియమించారు. ఇది కూడా అనూహ్య పరిణామం కాదు. ఇది కేసీఆర్‌ సమయజ్ఞతకు నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్‌ తర్వాత ఎక్కువ సభలలో మాట్లాడిన నాయకుడు కేటీఆర్‌. గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎక్కువ స్థాయిలో గెలిపించిన ఘనత కేటీఆర్‌దే. మరో యువ నాయకుడు హరీష్‌రావు అవిభక్త మెదక్‌ జిల్లాపైన దృష్టి కేంద్రీకరించి మొత్తం పది స్థానాలలో తొమ్మి దింటిని టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేయడంతోపాటు మహ బూబ్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి, డికె అరుణ వంటి ఉద్దండులను ఓడించే బాధ్యత కూడా జయప్రదంగా నెరవేర్చారు.

కేటీఆర్‌ విద్యాధికుడు, మూడు భాషలలో ప్రతిభావంతమైన వక్త. ఆయనను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేయడాన్ని ఎవ్వరూ ఆక్షేపించజాలరు. కేసీఆర్‌ చెప్పినట్టు కేటీఆర్‌ సమర్థుడూ, నమ్మ కస్తుడూ. ఇంతవరకూ నగర ప్రజల మనసులు గెలుచుకున్న కేటీఆర్‌కు పార్టీ నిర్మాణ క్రమంలో పంచాయతీ ఎన్నికలలో, పార్లమెంటు ఎన్నికలలో  గ్రామీణ ప్రాంతాలలోని నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. నాయకుడిగా ఎది గేందుకు దోహదం చేస్తాయి.

లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కేసీఆర్‌ పోషించవలసిన పాత్ర ఏమైనా నిర్దిష్టంగా ఉంటే హైదరాబాద్‌లో కేటీఆర్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతార ని జనాభిప్రాయం. హరీష్‌ని అనుమానించకుండా, అవమానించకుండా సముచితమైన ఆదరణ, గౌరవం ఇచ్చినంతవరకూ కేటీఆర్‌కు ఇబ్బంది ఉండదు. పార్టీ అంతా అండగా ఆయన వెంటే నిలబడుతుంది. ఈ సంగతి కేటీఆర్‌కీ తెలుసు. వివేకంతో వ్యవహరిస్తారు. టీఆర్‌ఎస్‌తోనే తన గతం, వర్తమానం, భవిష్యత్తు ముడివడి ఉన్నాయనే స్పృహ హరీష్‌కూ ఉన్నది. 

ఫెడరల్‌ ఫ్రంట్‌ అవకాశాలు
ఫలితాలు వెల్లడైన రోజునే మీడియా సమావేశంలో కేసీఆర్‌ చెప్పినట్టు ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది కాంగ్రెస్, బీజేపీల ప్రమేయంలేని మూడో కూటమి. రెండు జాతీయ పార్టీల వల్లా దేశానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. కానీ సమాఖ్యస్ఫూర్తి కోసం పోరాడాలని పథక రచన చేస్తున్న ప్రాంతీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఎంతవరకు పాటిస్తున్నాయనేది ప్రశ్న. స్థానిక సంస్థలకూ, పంచాయతీరాజ్‌ సంస్థలకూ నిధులనూ, విధులనూ ఏ మేరకు వికేంద్రీకరిస్తున్నాయనేదీ ప్రశ్నే. పైగా కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికలలో ఎంత లేదన్నా వందకు పైగా సీట్లు వస్తాయి. బీజేపీకి రెండువందల కంటే తగ్గక పోవచ్చు.

మిగిలిన 245 స్థానాలలో కొత్తగా ఏర్పడబోయే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎన్ని గెలుచుకోగలదు? రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సంగతి ఏమిటి? ఒక రాష్ట్రం నుంచి ఏదో ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే కొత్త ఫ్రంట్‌లో ఉండగలదు. ఉదాహరణకు టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ ఒకే ఫ్రంట్‌లో ఉండవు. తమిళనాడులోనూ అంతే. కాంగ్రెస్, బీజేపీ కూటములను నిలువ రించడానికి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఉపకరించవచ్చు.  

ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు లేకుండా స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి ఫ్రంట్‌కు ఉండదు. వీపీ సింగ్‌  ప్రభుత్వంలాగా బీజేపీ మద్దతునూ, దేవెగౌడ, గుజ్రాల్‌ లాగా కాంగ్రెస్‌ బాసటనూ తీసుకొని బలహీన ప్రభుత్వాలను ఏర్పాటు చేయవలసిందే కానీ ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసి నిలదొక్కుకోవడం కష్టం. అయినా సరే,  అటువంటి ప్రయత్నం జరగడం మంచిదే. 

కాంగ్రెస్‌కు కొత్త కళ
ఇటువంటి సమయంలో మూడు హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం విశేషం. బీజేపీకి 2014లో అత్యధిక స్థానాలు సమకూర్చిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పుంజుకున్నది. బలమైన ప్రాంతీయ పార్టీలు లేని రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే ఉంటుంది.  మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్‌ గెలుపొందింది.  మాయావతి, అఖిలేశ్‌ సహకారంతో మధ్యప్రదేశ్‌లో అందలం ఎక్కబోతోంది.

పదిహేనేళ్ళు అధికారంలో ఉన్న బీజేపీని చిత్తుగా ఓడించవలసిన కాంగ్రెస్‌ బొటా బొటి మార్కులతో పాస్‌ కావడాన్ని ఘనవిజయంగా భావించనక్కరలేదు. ఛత్తీస్‌గఢ్‌లో అనూహ్యంగా కాంగ్రెస్‌కు పెద్ద మెజారిటీ లభించింది. ఛత్తీస్‌గఢ్‌ తొలి ముఖ్యమంత్రి అజిత్‌జోగీ, మాయావతి కలసి ఏర్పాటు చేసిన కూటమి వల్ల కాంగ్రెస్‌కు చేటు కలుగుతుందని అత్యధికులు ఊహించారు. జోగీ బీజేపీకి నష్టం కలిగించి కాంగ్రెస్‌కు అసంకల్పితంగా ఉపకారం చేశారు. మూడు విడతలు వరుసగా ముఖ్యమంత్రులుగా పని చేసిన శివరాజ్‌సింహ్‌ చౌహాన్, రమణ్‌సింగ్‌ల ఓటమిని అర్థం చేసుకోవచ్చు.

పదవీ విరమణ చేసిన తర్వాత చౌహాన్‌ నవ్వుతూ హాయిగా మాట్లాడటం అభినందించవలసిన విషయం. రాజస్థాన్‌లో చిత్తు చిత్తుగా ఓడిపోతుందని అనుకున్న బీజేపీ గట్టిగా ప్రతిఘటించడం బీజేపీ కార్య కర్తల బలాన్నీ,  కాంగ్రెస్‌ పరిమితులనూ వెల్లడిస్తున్నది. మూడు హిందీ రాష్ట్రా లలో కాంగ్రెస్‌ విజయం వెనుక టీడీపీ కృషి ఉన్నదంటూ  చంద్రబాబు చెప్పు కుంటున్నారు. అది ఆర్థిక ప్రమేయం కావచ్చునంటూ ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. మూడు రాష్ట్రాలనూ చంద్రబాబు సందర్శించ కుండా కాంగ్రెస్‌ నెత్తిన పాలు పోశారు.  

మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో రాహుల్‌గాంధీ వ్యవహరించిన తీరు ప్రశంసార్హం. ఇంతవరకూ కాంగ్రెస్‌ ఏ రాష్ట్రంలో గెలిచినా ఢిల్లీ నుంచి అధిష్ఠానవర్గం దూతలు వెళ్ళడం, ఎంఎల్‌ఏలతో మాట్లాడటం, అక్కడి నుంచి పార్టీ అ«ధినేతతో ఫోన్‌లో మాట్లాడి ఆదేశం తీసుకోవడం లేదా ఢిల్లీ వెళ్ళి అంతా నివేదించి ఒక కవరుతో వచ్చి పార్టీ అధినేత నిర్ణయం ప్రకటించడం రివాజు. ఈ సారి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులను ఢిల్లీకి పిలిపించుకొని సోనియా, రాహుల్, ప్రియాంక (కుటుంబ వ్యవహారమని నిందించవచ్చు) సుదీర్ఘ సమాలోచనలు జరిపి, ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ను నిర్ణయించి,  పదవి లభించని జ్యోతిరాదిత్య సింధియాను  సముదాయించి, సంతృప్తిపరిచి భోపాల్‌కు పంపించారు.

కమల్‌నాథ్‌ సోమవారం ప్రమాణం చేస్తారు. జ్యోతిరాదిత్య ఢిల్లీలోనే రాహుల్‌కు సహాయకుడుగా ఉంటారు. రాజ స్థాన్‌లో కూడా ఇదే విధమైన రాజీ కుదిరింది. గహ్లోత్‌ ముఖ్యమంత్రిగా, సచిన్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు.  పదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన దిగ్విజయ్‌సింగ్‌ బీజేపీకి అధికారం అప్పగించి పదిహేను సంవత్సరాలు గడచిన తర్వాత  మొదటిసారి కాంగ్రెస్‌ నాయకుడు కమల్‌నా«ద్‌ ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చోబోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిని ఈ రోజు నిర్ణయిస్తారు.

ముఖ్య మంత్రి పదవికి నాయకులను నిర్ణయించే క్రమంలో కార్యకర్తల అభిప్రాయాలు కనుక్కునేందుకు కూడా రాహుల్‌ సర్వే పద్ధతి ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియవల్ల ఎంపికలో జాప్యం జరగవచ్చు. కానీ అందరినీ సంప్రదించారనే సంతృప్తి ఉంటుంది.  మూడు రాష్ట్రాలలో విజయం కాంగ్రెస్‌కు ఆక్సిజెన్‌ అందించింది. రాహుల్‌ ప్రతిష్ఠ ఎంతో కొంత పెరిగింది. అయినప్పటికీ మోదీకి సమ ఉజ్జీ కాగలరా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం 2019 మే వరకూ వేచి ఉండాలి. అప్పుడే తెలంగాణలోనూ నాటకీయమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నది.


వ్యాసకర్త:  కె. రామచంద్రమూర్తి
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement