trikalam
-
పూటకో మాట.. రోజుకో బాట!
‘అసూయాపరులంతా ఒక్కటై రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారు. గద్దల్లా వాలు తున్నారు. అవినీతి గొంగళిపురుగును కేసీఆర్ కౌగలించుకున్నారు.’ ఇవి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నోటినుంచి వెలువడిన మాటలు. ఎవరు అసూయపడుతున్నారు చంద్రబాబు నాయుడిని చూసి? నరేంద్రమోదీనా? కల్వకుంట్ల చంద్రశేఖరరావా (కేసీఆర్)? వైఎస్ జగన్ మోహన్‌రెడ్డా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్స రాలూ, సువిశాల దేశానికి ప్రధానిగా సుమారు అయిదేళ్ళూ పని చేసిన రాజకీయ నాయకుడు మోదీ. చంద్రబాబును చూసి ఆయన ఎందుకు ఈర్ష్య పడాలి? 2019 ఎన్నికలలో బీజేపీకి ఎన్ని స్థానాలు దక్కుతాయో, మోదీ మళ్ళీ ప్రధానిగా ప్రమాణం చేస్తారో లేదో తెలియదు. కానీ ఇప్పటికీ దేశంలో అత్యంత ప్రాబల్యం కలిగిన నేత మోదీ అని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. తమ కంటే గొప్ప భాషాపరిజ్ఞానం కలిగిన వక్త చంద్రబాబును చూసి మోదీ, కేసీఆర్ అసూయ చెందుతున్నారా? ఆయన తమ కంటే సమర్థ పాలకుడనీ, పరిపాలనా దక్షుడనీ మోదీ, కేసీఆర్ అసూయతో రగిలిపోతున్నారా? తమ కంటే ఎక్కువ విశ్వనీయత ఉన్నదనీ, ప్రజాదరణ ఉన్నదనీ మోదీ, కేసీఆర్, జగన్మోహన్రెడ్డీ ఈర్ష్యతో కుమిలిపోతున్నారా? జీవితంలో పొత్తులు లేకుండా ఒక్కసారి కూడా ఎన్నికలలో పోటీ చేయలేని టీడీపీ అధినేతను చూసి ఒంటరిగా పోరాడి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కూటమిపైన ఇటీవలనే ఘనవిజయం సాధించిన కేసీఆర్ ఉడుక్కుంటారా? ఎవరు గద్దలో, ఎవరు సింహాలో ప్రజలకు తెలి యదా? జగన్మోహన్రెడ్డిపైన కేసులు ఎవరు పెట్టించారో, కాంగ్రెస్ నాయకుడు శంకరరావు వేసిన పిటిషన్లో ఎర్రన్నాయుడు ఎట్లా ఇంప్లీడ్ అయ్యారో ఎవరికి తెలియదు? అది బహిరంగ రహస్యం కాదా? సోనియాగాంధీ, చిదంబరంలతో చేతులు కలిపి బూటకపు కేసులు పెట్టించిన సంగతీ, జైలులో పెట్టించి బెయిల్ రాకుండా 16 మాసాలు మేనేజ్ చేసిన విషయం ప్రత్యేకించి ఎవ్వరూ చెప్పక్క రలేదు. ఎవరు అవినీతి గొంగళి పురుగు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 1984 నుంచి 1995 వరకూ ఎన్టీఆర్ ‘నమ్మిన’ బంటుగా పనిచేసిన చంద్ర బాబుకి అవినీతికి ఒడిగట్టే అవకాశం ఉన్నదా లేక ఒక్కరోజైనా అధికారంలో లేకుండా, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో హైదరా బాద్‌కు రాకుండా బెంగుళూరులోనే తన మానాన తాను వ్యాపారం చేసుకుంటూ ఉన్న జగన్మోహన్రెడ్డికి అవకాశం ఉన్నదా? గుజరాత్, కర్ణాటక, రాజస్థా¯Œ , మధ్యప్రదేశ్, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌కి ఆర్థిక సహాయం చేయడానికి బాబుకు అన్ని వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో ప్రజలు ఊహించు కోలేరా? ఇవన్నీ అసహ్యించుకోవలసిన పనులే కానీ అసూయపడవలసిన ఘన కార్యాలైతే కాదు కదా! సంపద తప్ప ఏమున్నది చంద్రబాబు దగ్గర ఇతరులు ఈర్ష్యపడేందుకు? స్వవచోవ్యాఘాతాలు లెక్కలేనన్ని పరస్పర విరుద్ధమైన ప్రకటనలూ, స్వవచోవ్యాఘాతాలూ, అస త్యాలూ దేశంలో మరే ఇతర రాజకీయ నాయకుడి నోటి నుంచైనా వచ్చాయా? గతంలో కానీ వర్తమానంలో కానీ ఇన్ని యూ–టర్న్‌లు తీసుకున్న మరో రాజ కీయ నాయకుడు దేశ చరిత్రలో ఉన్నాడా? 1995 ఆగస్టులో వైస్రాయ్ డ్రామా జరి గినప్పుడు టీవీలు లేవు. ఉన్న నాలుగు పత్రికలూ చంద్రబాబు చెప్పుచేతలలో ఉండేవి. ఎన్‌టిఆర్‌కు అనుకూలమైన వార్తలు, వ్యాఖ్యలు పత్రికలలో కానీ రేడి యోలో కానీ వచ్చేవి కావు. అందుకనే సింహంలాంటి ఎన్టీఆర్‌ని బోనులో పెట్ట గలిగారు. ఇప్పుడు ఆ ఆట సాగదు. అబద్ధాలు అతకవు. మీడియాలో బహు ళత్వం ఉన్నది. నాణేనికి రెండో పార్శ్వం చూపించే పత్రికలూ, చానళ్ళూ ఉన్నాయి. టీవీలు వచ్చిన తర్వాత నేతలు మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు అవు తుంది. ఆ రికార్డులు న్యూస్‌చానళ్ళ లైబ్రరీలలో భద్రంగా ఉంటాయి. టీవీ తెర మీద ముఖకవళికలను కూడా వీక్షకులకు గమనిస్తారు. ఎవరు నిజం చెబుతు న్నారో, ఎవరు బొంకుతున్నారో ఇట్టే పసిగట్టగలుగుతారు. చంద్రబాబు ఈ రోజు ఏమి మాట్లాడినా అందుకు విరుద్ధంగా గత నాలుగు సంవత్సరాల ఎని మిది మాసాలలోనే మాట్లాడి ఉంటారు. టీడీపీలో అధ్యక్షులవారే అందరికంటే ఎక్కువ మాట్లాడతారు. జన్మభూమి కమిటీల నుంచి ఐక్యరాజ్య సమితి వరకూ అన్ని విషయాలపైనా శ్రీవారే వ్యాఖ్యానిస్తారు. నిర్ణయాలు అప్పటికప్పుడే, అక్క డికక్కడే ప్రకటించేస్తారు. వ్యూహరచన చేస్తారు. ఎత్తుగడలు వేస్తారు. తక్కిన వారంతా ఆయన చెప్పినట్టు చేయవలసిందే. అందుకని ప్రతి పరిణామం పైనా చంద్రబాబు ‘బైట్’ ప్రతి టీవీ న్యూస్చానల్లోనూ ఉంటుంది. యజమానులకు ఇష్టం లేకపోతే చంద్రబాబుకి ఇబ్బంది కలిగించే సన్నివేశాలు చూపించరు. అది వేరే విషయం. చూపించాలని అనుకున్న చానళ్ళ దగ్గర బోలెడు సామగ్రి ఉంటుంది. తాజాగా చంద్రబాబు నిగ్రహం కోల్పోవడానికి దారి తీసిన పరిణామం వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కలుసుకొని ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం గురించి ప్రాథమిక చర్చలు జరపడం. దీనికి చంద్రబాబు వక్రభాష్యాలు చెప్పారు. రాష్ట్ర ద్రోహులు కుట్ర చేస్తున్నారంటూ నిందించారు. గద్దల్లా వాలుతు న్నారన్నది ఈ సందర్భంలోనే. ఈ విమర్శలకు సమాధానంగా ఆయన చర్యలను గుర్తు చేస్తే చాలు. నానారాష్ట్ర సందర్శనం ఆంధ్రప్రదేశ్‌లో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రత్యేక విమానంలో కోల్ కతా, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ వెళ్లి బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మాణానికి ప్రయ త్నాలు చేయడం గుర్తు చేయవచ్చు. ఆ పర్యటనలో చంద్రబాబు పోలవరం నిర్మా ణాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలుసు కున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాను వ్యతిరేకిస్తున్న స్టాలిన్ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్ళి ఆయనతో కరచాలనం చేసినప్పుడు రాహుల్‌ని ‘పప్పు’ అంటూ అవహేళన చేయడం, సోనియాను ఇటలీ రాక్షసి అంటూ నిందించడం చూపించవచ్చు. కేటీఆర్–జగన్మోహన్ రెడ్డిల భేటీని ఆక్షేపించినప్పుడు కేసీఆర్‌ని చంద్రబాబు కౌగలించుకున్న దృశ్యం, తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిం చినప్పటి సన్నివేశం, హరికృష్ణ పార్థివదేహం ఉండగానే తెలంగాణ ఎన్నికలలో పొత్తు గురించి కేటీఆర్‌తో ప్రస్తావించిన వైనం సచిత్రంగా గుర్తు చేయవచ్చు. 2009 ఎన్నికలతో టీఆర్ఎస్తో కలసి మహాకూటమి నిర్మించడం, ఎన్నికలలో ఓడిపోగానే కేసీఆర్‌ని తూలనాడటం గురించి చెప్పవచ్చు. అంతకు ముందు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభ్యంతరం లేదంటూ అనుచరుల కమిటీతో చెప్పించి, ఆ మేరకు టీడీపీ పొలిట్‌బ్యూరో చేత తీర్మానం చేయించి, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాసిన సంగతి దృశ్యసహితంగా చెప్పవచ్చు. పరిటాల సునీత కుమారుడి వివాహానికి కేసీఆర్ హాజరైనప్పుడు ఆయనకు స్వాగతం చెప్పిన తెలుగు తమ్ముళ్ళ ఆనందోత్సాహాలను ప్రస్తావిం చవచ్చు. మోదీతో కుమ్మక్కు అయ్యారని విమర్శిస్తే, మోదీకి తిరుపతి లడ్టూల సంచీ అందిస్తూ అతివినయం ప్రదర్శించిన చంద్రబాబు దృశ్యం ఎన్ని విడత లైనా ప్రదర్శించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ప్రతి పక్ష నాయకుడు నాలుగున్నరేళ్ళుగా చేసిన పోరాటాల వివరాలు చెప్పవచ్చు. ప్రత్యేకప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి అర్ధరాత్రి మీడియా సమావేశం పెట్టి ధన్యవాదాలు చెప్పడం, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్య వాదాలు చెబుతూ అసెంబ్లీతో తీర్మానం చేయించడం, ప్యాకేజీ ఇప్పించినందుకు వెంకయ్యనాయుడినీ, ఇచ్చినందుకు అరుణ్‌జైట్లీని ఘనంగా సన్మానించడం, హోదా సంజీవని కాదంటూ దబాయించడం, హోదా కోసం ఉద్యమిస్తే జైలుకు పంపిస్తానంటూ యువతను హెచ్చరించడం గుర్తు చేయవచ్చు. సత్తెనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన మాటలకు సమాధానంగా 1995లో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఏమి మాట్లాడారో, ఆయన గురించి ఎన్టీఆర్ ఏమన్నారో పత్రికలలో రాయవచ్చు. టీవీలలో చూపించవచ్చు. తప్పించుకోలేరు. ‘బైట్స్’ క్షేమంగా ఉన్నాయి. కోల్‌కతాలో నారావారి భేరీ శనివారం కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన ‘యునైటెడ్ ఇండియా’ బహిరంగ సభకు మోదీనీ, బీజేపీనీ వ్యతిరేకించే నేతలలో చాలామంది హాజరైనారు. 2018 మార్చి వరకూ మోదీతో స్నేహం చేసిన చంద్రబాబు కూడా వెళ్ళారు. సమాజ్‌వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ అధినేత తేజస్వియాదవ్ వంటి యువకులు మోదీని విమర్శిస్తే ఎవ్వరూ తప్పు పట్టరు. వారు మోదీతో అంటకాగలేదు. ప్రధానిగా మోదీ తప్పులు చేయలేదని కాదు. ఆయన ఒప్పులకుప్ప కాదు. కానీ విమర్శించేవారికి విశ్వసనీయత ఉండాలి. మోదీ వంటి అద్భుతమైన ప్రధాని ఈ దేశానికి చారిత్రక అవసరమని చంద్రబాబు అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చిన విషయం ఆయన విస్మరించవచ్చు కానీ ప్రజలు ఎట్లా మరచిపోతారు? అంతగా పొగిడి ఇప్పుడు కేవలం ప్రచారంపైన ఆధారపడిన ప్రధాని అనీ, పని బొత్తిగా చేయడం లేదనీ విమర్శిస్తే నప్పుతుందా? కర్ణాటకలో పార్టీ ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహించడాన్ని ప్రస్తావిస్తూ, ఎంఎల్ఏలను పశువులను కొన్నట్టు కొనుగోలు చేస్తున్నారనీ, మోదీ తగిన మూల్యం చెల్లించుకోవాలనీ చంద్రబాబు గర్జించారు. తన పనుపున తెలంగాణ ఎంఎల్ఏ ఎల్విస్ స్టీఫెన్సన్కు అప్పటి టీడీపీ ఎంఎల్ఏ రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షల నగదు చెల్లిస్తూ కెమెరాకు చిక్కిన ఉదంతం ఫలితంగా పదేళ్ళు ఉండవలసిన హైదరాబాద్ నగరం నుంచి ఆకస్మికంగా నిష్క్రమించి చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులతో సహా లేని అమరావతికి వెళ్ళవలసి వచ్చింది. అంతకు ముందు తెలంగాణలో టీడీపీ అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్లో చేరి మంత్రి అయిన తలసాని శ్రీనివాసయాదవ్పైన ధ్వజమెత్తిన సంగతి మరచి పోయారు. అందుకే తలసాని ఇటీవల విజయవాడ, ఏలూరు వెళ్ళినప్పుడు చంద్రబాబుపై రెచ్చిపోయి విమర్శలు గుప్పించారు. ‘ఓటుకు కోట్లు’ కేసుతో గుణపాఠం నేర్చుకున్నా టీడీపీ అధినేత పరువు కృష్ణాలో కలిసేది కాదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని అడ్డగోలుగా, పశువుల కంటే హీనంగా కొనుగోలు చేశారు. రవ్వంత సంకోచం కానీ, పిసరంత బిడియం కానీ లేకుండా పార్టీ ఫిరాయించిన నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి, పంచాయితీలను నిర్వీర్యం చేసి, స్థానిక సంస్థల అధికారాలన్నింటినీ అస్మదీయులతో నిండిన జన్మభూమి కమిటీలకు అక్రమంగా అప్పగించిన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని రక్షించేం దుకు ఉద్యమించాలంటూ పిలుపునిస్తే ఇదేం బూటకమంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకోరా? ‘నన్ను మించిన నటుడు చంద్రబాబు,’ అంటూ జీవిత చర మాంకంలో గుండె పగిలి ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను జనం గుర్తు చేసుకోరా? పెద్దనోట్లు రద్దు చేయాలని మోదీకి సలహా ఇచ్చింది తానేనంటూ గొప్పగా చెప్పు కున్న ముఖ్యమంత్రే అది ఘోరమైన తప్పిదమంటూ నిందించారు. ఒక ప్రధాని లేదా ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టిన సందర్భాలు అనేకం ఉంటాయి. నిజాయితీపరుడైన నాయకుడైనా, విమర్శకుడైనా, సంపాదకుడైనా ఏమి చేయాలి? సదరు చర్య సత్ఫలితాలు ఇస్తుందని తాము కూడా ఆశిం చామనీ, అందుకే మొదట్లో స్వాగతించామనీ, అమలు క్రమంలో అది ఆర్థిక వ్యవస్థకు హానికరంగా పరిణమించిందనీ చెప్పాలి. తప్పు ఒప్పుకోవాలి. అంతటి నిజాయితీ ఎక్కడుంది? అటువంటి విలువలు ఎక్కడున్నాయి? గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) విషయంలోనూ ఇదే అవకాశవాద ధోరణి. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు స్వాగతించి ఎన్డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత అదే పనిగా విమర్శించడం సీనియర్ రాజకీయ నాయకుడికి శోభ నిస్తుందా? అక్షరం బలి కోరుతుందని ప్రముఖ కవి అజంతా తరచూ అనేవారు. తన అనుభవానికీ, వయస్సుకీ, హోదాకీ తగినట్టు ఆచితూచి మాట్లాడితే చంద్రబాబు మరింత నవ్వులపాలు కాకుండా మర్యాద కాపాడుకుంటారు. వైఖరి మార్చుకోవాలో లేక ఇదే విధంగా ముందుకు సాగిపోవాలో నిర్ణయిం చుకోవలసింది ఆయనే. కె. రామచంద్రమూర్తి -
విజయోత్సవంలో అపశ్రుతులేల?
చర్విత చర్వణమే అయినప్పటికీ తప్పు జరుగుతున్నప్పుడు ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. బధిరశంఖారావమైనా కళ్ళ ఎదుట జరుగుతున్న ఘోరాన్ని ఎత్తిచూపకపోవడం నేరం. అంచనాలకు మించిన విజయం సాధించిన తర్వాత పార్టీ ఫిరాయింపులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రోత్సహించరనే ఆశ అడియాసై వెక్కిరిస్తున్నది. పార్టీ ఫిరాయించిన వారు సిగ్గుపడకుండా సగర్వంగా తిరుగాడుతున్నారు. ఎన్నికల తతంగం ముగిసి రెండు వారాలు కాలేదు. శాసనసభ్యులుగా ప్రమాణం చేయలేదు. అప్పుడే ఇద్దరు ఇండిపెండెంట్లు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరి పోయారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ ర హిత ఫెడరల్ ఫ్రంట్‌ను నిర్మిం చేందుకు నడుం బిగించిన కేసీఆర్‌ను చూసి గర్వించాలో లేక విందు ఆరగించిన వెంటనే చిరుతిండ్లకు ఆశపడుతున్నందుకు నిందించాలో తెలియని పరిస్థితి తెలంగాణ ప్రజలది. మొత్తం 119 స్థానాలలో సొంతంగా 88 స్థానాలు గెలుచుకు న్నారు. మిత్రుడిగా చెప్పుకునే అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం ఏడు స్థానాలు కైవసం చేసుకున్నది. గతంలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర జరుగుతున్నదనే అనుమానంతో ఎడాపెడా ఫిరాయింపులకు తెరలేపినప్పుడు అనేకులం ఆక్షేపించాం. అయినా బాధ్యులెవరూ పట్టించుకోలేదు. శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులు కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్‌లు పార్టీ ఫిరాయించి అధికార టీఆర్ఎస్లో చేరినప్పుడే వారిపై అనర్హత వేటు వేయాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ నాయకులు అధ్యక్షుడు స్వామిగౌడ్‌కు మహజరు సమర్పించుకొని ఏడాదిన్నర గడిచిపోయింది. స్వామిగౌడ్ స్పందించ లేదు. ఆకుల లలిత కాంగ్రెస్ శాసనసభ్యుల మద్దతుతో మండలి సభ్యురాలుగా గెలుపొందారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆమెకు టిక్కెట్టు ఇచ్చి అభ్యర్థిగా నిలబెట్టి గౌరవిస్తే ఓడిపోయిన పది రోజులకే అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఏ రాజనీతి కిందికి వస్తుంది? లలిత, సంతోష్‌కుమార్‌లు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకొని, లోగడ ఎప్పుడో ఆ పార్టీలో చేరి ఆ పార్టీకి అనుబంధ సభ్యులుగా వ్యవహరిస్తున్న దామోదర్‌రెడ్డి, ప్రభాకర్‌లను కలుపుకొని కాంగ్రెస్ లెజిస్టేచర్ పార్టీ నిర్వహించుకున్నామనీ, పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని నిర్ణయించామనీ తెలియజేస్తూ లేఖ సమర్పించిన క్షణాలలో సభా ధ్యక్షుడు స్వామిగౌడ్ స్పందించడం, కాంగ్రెస్ పక్షం టీఆర్ఎస్లో విలీనమైనట్టు ప్రకటించడం, శనివారంనాడు గెజెట్నోటిఫికేషన్ విడుదల చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తున్న పరిణామాలు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరాడిన స్వామిగౌ డ్కు ఇది శోభాయమానమైన పరిణామం కాదు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ అదే సభాధ్యక్షుడిని కలుసుకొని ఫిరాయించిన సభ్యులపైన వేటు వేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం, దాన్ని స్వామిగౌడ్ స్వీకరించడం ప్రజా స్వామ్య వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా తయారైనదో, ఎంత హాస్యాస్పదంగా మారిందో, ఎంత కపటంగా దిగజారిందో సూచిస్తున్నది. పార్టీ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది పార్టీని చీల్చాలని తీర్మానిస్తే వారి సభ్యత్వం గల్లంతు కాకుండా ప్రత్యేక గ్రూపుగా పరిగణించవచ్చు. కానీ పార్టీ విలీనం కావా లంటే మరికొన్ని అదనపు ప్రక్రియలు అవసరం. మనకున్నది ఒకటే రాజ్యాంగం. పార్టీ ఫిరాయించినవారిపైన సభాపతులు అనర్హత వేటు వేయాలని చెబుతున్నది అదే రాజ్యాంగం. 1985లో రాజీవ్‌గాంధీ, 2003లో అటల్‌బిహారీ వాజపేయి చొరవ తీసుకొని తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం, దాని సవరణ ఫిరాయిం పుల నిరోధానికి ఉద్దేశించినవి. ఏ రాజ్యాంగం నిర్దేశించిన ఎన్నికల ప్రక్రియను అనుసరించి మన నేతలు అధికారంలోకి వచ్చారో అదే రాజ్యాంగంలో ఉన్న ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అధికారానికి గులాములు ఖమ్మం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) టిక్కెట్టుపైన గెలిచిన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చానాగేశ్వర రావు సైతం కారెక్కడానికి సిద్ధంగా ఉన్నట్టు వస్తున్న వార్తలు ప్రజాస్వామ్య ప్రియులకు బాధ కలిగిస్తాయి. ‘ఓటుకు కోట్లు’ కేసులో నగదు అందజేస్తూ కెమేరాకు చిక్కిన రేవంత్‌రెడ్డిని చేర్చుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో గౌరవించిన కాంగ్రెస్ పార్టీనీ ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ నాయకులు అదే కేసులో నిందితుడైన సండ్రను తమ పార్టీలోకి ఎట్లా ఆహ్వా నిస్తారో చూడాలి. ఈ సారి టీడీపీతో కూటమి కట్టి వ్రతం చెడినా ఫలం దక్కని కాంగ్రెస్ పార్టీకి చిక్కినవి కేవలం 19 స్థానాలు. అప్పుడే కాంగ్రెస్ ఎంఎల్ఏలు టీఆర్ఎస్ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారనీ, దూకడానికి సిద్ధంగా ఉన్నారనీ సమాచారం. తొమ్మిదిమంది ఎంఎల్ఏలను కొనుగోలు చేయగలిగితే శాసనసభలో కాంగ్రెస్ బలం పదికి పడిపోతుంది. ప్రతిపక్ష హోదా సైతం దక్కదు. ఆ విధంగా కాంగ్రెస్‌ను ‘బొంద పెట్టాల’ని కేసీఆర్ నిర్ణయించుకున్న ట్టున్నారు. ఎందుకంటే సోనియాగాంధీ హాజరైన ఎన్నికల సభలో ఉత్తమకుమా ర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ని ‘బొంద పెట్ట’వలసిందిగా ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారో అందరికీ తెలుసు. అదే ప్రజల నిర్ణ యాన్ని వమ్ము చేస్తూ పార్టీలు మారుతున్న శాసనసభ్యులను ఎంత అవహేళన చేసినా, ఎంత నిందించినా తక్కువే. కొనుగోలు చేయడం అంటే కేవలం రొక్కం ఇచ్చి కొనడం కానవసరం లేదు. పదవి ఆశతోనో, మరే ఇతర ప్రలోభాలతోనో పార్టీ ఫిరాయించినవారు అమ్ముడు పోయినట్టే లెక్క. రోషం ఉన్న వారైతే చీటికీ మాటికీ పార్టీలు మారరు. విలువలకు పాతరేసి కేవలం అధికారానికి గులాము లుగా వ్యవహరించేవారిని ప్రజాప్రతినిధులంటూ గౌరవించడం పొరపాటు. కొత్త శాసనసభ నిర్మాణం జరగడానికి ముందే దొంగ చూపులు చూసే వారినీ, అడ్డదారులూ తొక్కేవారినీ ఏమని నిందించినా తప్పులేదు. నైతికత ఎవరికుంది? ప్రశంసార్హమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకూ, సుస్థిరమైన పరి పాలనను అందజేస్తున్నందుకూ, శాంతిభద్రతలనూ పరిరక్షిస్తున్నందుకూ అభి నందనలు అందుకుంటూ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కేసీఆర్ జాతీయ రాజకీయాలపైన ప్రభావం వేసేందుకు జైత్రయాత్ర ప్రారంభిస్తున్న సందర్భంలో చట్టసభలలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న పంతంతో రాజ్యాంగాన్ని ఉల్లం ఘించడం వంటి అపస్వరం అవసరమా? ఇదంతా రాబోయే లోక్‌సభ ఎన్ని కలలో అనుకున్నది సాధించేందుకే అంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో కోలుకోలేని దెబ్బ తినిన కాంగ్రెస్‌ను చావగొట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రతిపక్షం లేకపోతే అది చట్టసభ అనిపించుకుంటుందా? దౌర్భాగ్యం ఏమంటే ఏ పార్టీ సభ్యులు ఫిరాయించినా వారిని మందలించే నైతిక అధికారం ఎవ్వరికీ లేదు. ఉదాహరణకు పార్టీ ఫిరాయింపులను దేశవ్యాప్తంగా అడ్డగోలుగా సాగించిన కాంగ్రెస్ పార్టీకి లలితను కానీ, సంతోష్‌కుమార్‌ను కానీ తప్పు పట్టే నైతిక హక్కు ఉండదు. రేపు ఇద్దరు టీడీపీ ఎంఎల్ఏలు టీఆర్ఎస్లో చేరిపోయి టీడీపీఎల్పీని రద్దు చేస్తే ఆక్షేపించే అధికారం టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడికి ఉండదు. తలసాని శ్రీనివాసయాదవ్ 2014లో టీడీపీ టిక్కెట్టు పైన గెలిచి టీఆర్ఎస్లో చేరి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినందుకు హైదరాబాద్ వచ్చి హుంకరించిన చంద్రబాబు స్వయంగా 23 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలను కొనుగోలు చేసిన తర్వాత పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎంఎల్ ఏలను కానీ, ఎంఎల్సీలను కానీ మందలించే నైతిక స్థాయి కోల్పోయారు. జాతీయ స్థాయిలోనూ రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రశ్నించే నాధులు లేరు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విషయంలో అడపాదడపా ఖేదం వెలి బుచ్చుతూ ఉంటారు కానీ చట్టంలో ఉన్న లోపాన్ని సవరించాలని ప్రధాన మంత్రికి గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మనస్తాపం వెలిబుచ్చుతున్న ఏకైక జాతీయ నాయకుడిగా ఆయనను చెప్పు కోవాలి. అంతవరకూ మెచ్చుకోవాలి. ప్రధాని నరేంద్రమోదీ సైతం ఈ విష యంలో నిరపరాధి కారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ అనారోగ్యం కారణంగా పదవీబాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారు. కొత్త ముఖ్యమంత్రిని నియమించే సాహసం బీజేపీ జాతీయ నాయకత్వం చేయలేకపోతోంది. ఎందు కైనా మంచిదని ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్ఏలను కొనుగోలు చేసి వారిని విమా నంలో ఢిల్లీకి రప్పించుకొని కాషాయ కండువాలతో సత్కరించారు. అటువంటి పార్టీ నాయకులకు ఇతర పార్టీలకు చెందినవారిని ఆక్షేపించే అర్హత ఏముంటుంది? జాతీయ స్థాయి మీడియా సంస్థలు కూడా ఫిరాయింపులను ప్రశ్నించడం మానుకున్నాయి. టీఆర్పీ రేటింగులు రావనో, అధికారంలో ఉన్న పార్టీని దుయ్యపట్టడం ఎందుకనో తెలియదు. ఎన్డీటీవీ, ఇండియా టుడే వంటి చానళ్ళు సైతం రెండు తెలుగు రాష్ట్రాలలో యధేచ్ఛగా సాగిన ఫిరాయింపులను ఆక్షేపించలేదు. ఢిల్లీలో చిన్న ఘటన జరిగినా, కేజ్రీవాల్ తుమ్మినా, దగ్గినా రోజంతా కథనాలు నడిపే చానళ్లు రెండు రాష్ట్రాలలో కలిపి దాదాపు 50 మంది ఎంఎల్ఏలు ఫిరాయించినా, ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు కట్టబెట్టినా అదేమని అడిగిన పాపాన పోలేదు. న్యాయస్థానాలు ఫిరాయింపుల చట్టాన్ని అక్షరాలా పాటిస్తున్నారే కానీ అందులోని స్ఫూర్తిని పట్టిం చుకోవడం లేదు. సభాపతి నిర్ణయమే ఖరారనీ, అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదనీ 91 రాజ్యాంగ సవరణ స్పష్టం చేసింది. సభాపతులపైన అటువంటి గురుతరమైన బాధ్యత పెట్టడం, అంతటి విశ్వాసం వారిపైన ఉంచడం నాటి పార్లమెంటు చేసిన పొరబాటు. దాన్ని సవరించుకోవాలనే సదు ద్దేశం ఎన్డీఏ నాయకత్వానికి ఉంటే అవసరమైన మెజారిటీ ఉన్నది. ఆ ఉద్దేశమే లేదు. ఈ లోపాన్ని సరిదిద్దుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ద్రోహం చేసి నట్టే భావించాలి. తడబాటు లోగుట్టు ఇది ఇలా ఉంటే, చంద్రబాబునాయుడు తనకు తోచిన విధంగా ముందుకు పోతున్నారు. 2004లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నట్టే ఇప్పుడు ఎన్నికలు నాలుగు మాసాలు కూడా లేని తరుణంలో కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారట. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవితాశయమట. ఉత్తరాంధ్ర రైల్వే జోన్‌కోసం తన పార్టీ ఎంపీలు పోరాడుతున్నారంటూ శ్రీకాకుళం ‘ధర్మపోరాటం’ సభలో ఊదరగొట్టారు. నాలుగేళ్ళు బీజేపీ పరిష్వంగంలో మైమరచి ప్రత్యేక హోదా అడగలేదు. ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ప్యాకేజీ కాదంటే జైళ్ళలో కుక్కుతానంటూ ప్రతిపక్ష సభ్యులనూ, నిరసనకారులనూ బెదిరించారు. పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. సింగపూరును కలవరించి అమరావతిని డిజైన్ స్థాయి దాటకుండా గ్రాఫిక్స్‌తో ప్రజలను అలరిస్తున్నారు. సింగపూరు సినిమా చూపిం చడానికి ఒక థియేటర్ సైతం ప్రభుత్వ ఖర్చుతో నిర్మించాలని ప్రయత్ని స్తున్నారు. బయోస్కోప్ చూపించి మరోసారి ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టే ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణలో వ్యూహం బెడిసి పరువు మూసీలో కలి సినా హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయం వెనుక తన కృషి ఉన్నదని చాటుకుంటున్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌కి చేసిన మేలు ఏమిటంటే ఆ మూడు రాష్ట్రాలలో అడుగుపెట్టకపోవడం. తెలంగాణలో ప్రవేశించకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి మరో పది స్థానాలైనా దక్కేవని పరి శీలకుల అభిప్రాయం. తన మనుషులపైన కేంద్ర సంస్థలతో దాడులు చేయి స్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీని ‘కోడికత్తి’ పార్టీ అంటూ వెకిలిగా మాట్లాడటం ఆపలేదు. ఆయన మానసిక స్థితికి ఇది నిదర్శనం. తెలం గాణ దెబ్బతో మనోవ్యాధి మరింత ముదిరింది. చంద్రబాబు ధోరణికి భిన్నంగా కేసీఆర్ ఆగమేఘాల మీద దూసుకుపోతున్నారు. తెలంగాణలో సాధించిన అఖండ విజయం ఆయనకు కొత్త కాంతి ప్రసాదించింది. ఉరవడి పెరిగింది. కుమారుడికి పార్టీ పెత్తనం అప్పగించారు. మంత్రి వర్గ నిర్మాణం పూర్తి కాకుండానే ఫెడరల్ యాత్ర ఆరంభిస్తున్నారు. పెరిగిన ప్రతి ష్ఠతో ప్రాంతీయ పార్టీల నాయకులను కలుసుకోబోతున్నారు. ఎన్నికలకు ముందు జరిపిన యాత్రకీ, ఈ రోజు ప్రారంభం కానున్న యాత్రకూ తేడా ఉన్నది. అప్పటి కంటే ఇప్పుడు హెచ్చిన ఉత్సాహంతో అడుగు ముందుకు పడు తోంది. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి ఎంత బలహీనమైతే కేసీఆర్ నిర్మి స్తున్న ఫ్రంట్‌కు అంత బలం పెరుగుతుంది. ఎన్డీఏ కాకుండా రెండు కూట ముల నిర్మాతలూ తెలుగు నాయకులు కావడం, వారిలో ఒకరు ఇటీవల ఘన విజయం సాధించడం, మరొకరు పరాజయం చవిచూడటం విశేషం. ఇద్దరు చంద్రులలో ఒక్కరే ప్రకాశిస్తారు. ఇద్దరూ ప్రకాశించడానికి అవకాశం లేదు. ఒకరు క్షీణచంద్రుడైతే మరొకరు పూర్ణచంద్రుడు అవుతారు. ప్రస్తుతానికి తెలం గాణ చంద్రుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో స్పష్ట మైన పరాజయ సంకేతాలూ, అటు జాతీయ స్థాయిలో పరాభవ సూచనలూ చంద్రబాబును వేధిస్తున్నాయి. అందుకే మాటపైన అదుపు తప్పుతోంది. కె. రామచంద్రమూర్తి -
కేటీఆర్ చేతిలో స్టీరింగ్
ఇందిరాగాంధీ, ఎన్‌టి రామారావు, అటల్ బిహారీ వాజపేయి, చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి నిండా మునిగారు. కల్వకుంట్ల చంద్ర శేఖరరావు (కేసీఆర్) మాత్రం విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఎన్ని కలలో గెలుపోటములు సర్వసాధారణం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసెంబ్లీ ఎన్నికలలో పోరాడి గెలుపొందిన విధం విశేషమైనది. టీఆర్ఎస్ విజయంపై అధిక సంఖ్యాకులకు అనుమానం లేదు. కొందరు రాజకీయ పరిశీలకులూ, మీడియా ప్రవీణులూ వ్యక్తిగతంగా కేసీఆర్ పట్ల ఆగ్రహం కారణంగా టీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకున్నారు. ఓడిపోతుందని తీర్మానించుకున్నారు. ఆకాంక్షకూ, అంచనాకూ మధ్య సరిహద్దురేఖ చెదిరిపోయి గందరగోళానికి గురైనారు. కేసీఆర్ పట్ల కినుక వహించడానికి తగిన కారణాలు ఉండవచ్చు. ప్రజల ఆలోచనా ధోరణి çపసికట్టడంలో అది అవరోధం కాకూడదు. టీఆర్ఎస్కు అసాధారణ మెజారిటీ లభించడానికి కారణాలు స్పష్టంగా కని పిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ తప్పిదాలు చేయకుండా ఉంటే ఆ పార్టీకి ఇంత ఘోర పరాజయం ఉండేది కాదు. కేసీఆర్ ఉద్యమ సమయంలో మాట్లాడినట్టు కటువుగా మాట్లాడితేనే ప్రజలు మెచ్చుకుంటారనే భావనతో కాంగ్రెస్ నాయ కులు స్థాయి మరచి టీఆర్ఎస్పైనా, కేసీఆర్‌పైనా పరుషపదజాలం ప్రయోగిం చారు. కేసీఆర్ మాత్రం ఉద్యమభాషకు భిన్నంగా, ఆవేశరహితంగా ప్రజలకు తేలికగా అర్థమయ్యే విధంగా మాట్లాడారు. తనకు కాంగ్రెస్ అందించిన ఆయు ధాలతో సమర్థంగా పోరాడారు. ‘కేసీఆర్ కావాలా, చంద్రబాబు కావాలా?’ అన్న ప్రశ్న ప్రజల హృదయాలను సూటిగా తాకింది. త్యాగాలు చేసిన సాధించుకున్న తెలంగాణపైన అమరావతి ఆధిపత్యం అవాంఛనీయమని భావించిన ఓటర్లు క్యూలు కట్టి మూకుమ్మడిగా కారు బటన్ నొక్కారు. టీఆర్ఎస్ ఖాతాలో 88 స్థానాలు నమోదైనాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు టీఆర్ఎస్లో చేరడానికి సంసి ద్ధత వెలిబుచ్చారు. చేర్చుకుంటే కాంగ్రెస్ నుంచి రావడానికి పది మంది సిద్ధంగా ఉన్నారని భోగట్టా. ఫలించిన కేసీఆర్ వ్యూహం ఏ ఫలితం ఆశించి కేసీఆర్ గడువు కంటే ఏడు మాసాల మందుగానే శాసన సభను రద్దు చేయించారో అది దక్కింది. అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ లభించింది. 1983లో, 1994లో ఎన్టిఆర్ కూడా పెద్ద మెజారిటీలు సాధిం చారు. ఈ సారి టీఆర్ఎస్ విజయంలోని విశేషం ప్రతిపక్షానికి చెందిన అతిరథమహారథులు మట్టికరవడం. పీసీసీకి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నవారు ఎన్నికల బరిలో రాణించలేకపోయారు. పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి ఓడిపోవడమే కాకుండా పాత కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలలో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఇసుమంతైనా నిలువరించలేకపోయారు. ముఖ్య మంత్రి అభ్యర్థులుగా భావించిన జానారెడ్డి, డికె అరుణ, దామోదర రాజ నరసింహ వంటివారూ పరాజయం పాలైనారు. ఈ స్థాయికి చెందినవారిలో భట్టి విక్రమార్క ఒక్కరే తాను గెలుపొందడమే కాకుండా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కూటమి అభ్యర్థుల విజయానికి కారకుడైనారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి మండలిలో పని చేసిన మహిళలు గీతారెడ్డి, సునీతా లక్షా్మరెడ్డి, అరుణ, సురేఖ ఓడిపోయారు. ఒక్క సబిత మాత్రం గెలిచారు. కూటమికి ప్రచారం చేయడం పేరు మీద చంద్రబాబు మొదటి పాదం ఖమ్మం జిల్లాలోనే మోపినా భయ పడినంత నష్టం కాంగ్రెస్ అభ్యర్థులకు జరగలేదు. చంద్రబాబు ప్రభావం ఇతర జిల్లాలపైన విపరీతంగా పడింది. ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా, వారి ఆకాంక్షలనూ, అనుభవాలనూ పట్టించుకోకుండా, చంద్రబాబు పట్ల తెలంగాణలో ఎంతటి వ్యతిరేకత ఉన్నదో అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ నాయకత్వం టీడీపీతో, ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజెఎస్)తో, సీపీఐతో కలసి కూటమి కట్టి భంగపడింది. చంద్రబాబు పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఒక్కటే కాదు, టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంలోని అనైతికతను కూడా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. టీడీపీ ప్రతినిధిగా కంభంపాటి రామమోహనరావు ఢిల్లీలో రాహుల్‌గాంధీ కార్యాలయానికి వెళ్ళడం, కాంగ్రెస్ అధిష్ఠానం దూతగా అశోక్ గహ్లోత్ అమరావతికి రావడం, ఆ తర్వాత కాంగ్రెస్ జాబితా ఖరారు కావడం వంటివి అనేక అనుమానాలు రేకెత్తించాయి. ప్రజల ఆలోచనలను ప్రభావితం చేశాయి. టీఆర్ఎస్తో పొత్తుకోసం చంద్రబాబు ప్రయత్నించి విఫలమైన తర్వాతనే కాంగ్రెస్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారనే సంగతి విస్మరించకూడదు. చంద్రబాబుకు టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఎటు వంటి అభ్యంతరం లేదు. సిద్ధాంతాలూ, సూత్రాలూ, విధానాలతో నిమిత్తం లేకుండా అవకాశవాద కూటములు కట్టే చంద్రబాబు వంటి నాయకుడితో స్నేహం చేస్తే బీజేపీకి ఎటువంటి పరాభవం జరిగిందో కాంగ్రెస్‌కూ అదే అను భవం ఎదురవుతుంది. లోక్‌సభ ఎన్నికలు కొద్ది నెలలోనే జరగబోతున్నాయి. పొత్తుల గురించీ, ఎత్తుల గురించీ, జిత్తుల గురించీ పునరాలోచించుకోవలసిన సమయం, సందర్భం ఇదే. కేటీఆర్‌కి ఉన్నత పదవి ఇదే మంచి సమయం అనుకొన్న కేసీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్ ప్రెసిడెంట్)గా కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను నియమించారు. ఇది కూడా అనూహ్య పరిణామం కాదు. ఇది కేసీఆర్ సమయజ్ఞతకు నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ తర్వాత ఎక్కువ సభలలో మాట్లాడిన నాయకుడు కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఎక్కువ స్థాయిలో గెలిపించిన ఘనత కేటీఆర్‌దే. మరో యువ నాయకుడు హరీష్‌రావు అవిభక్త మెదక్ జిల్లాపైన దృష్టి కేంద్రీకరించి మొత్తం పది స్థానాలలో తొమ్మి దింటిని టీఆర్ఎస్ ఖాతాలో వేయడంతోపాటు మహ బూబ్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి, డికె అరుణ వంటి ఉద్దండులను ఓడించే బాధ్యత కూడా జయప్రదంగా నెరవేర్చారు. కేటీఆర్ విద్యాధికుడు, మూడు భాషలలో ప్రతిభావంతమైన వక్త. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడాన్ని ఎవ్వరూ ఆక్షేపించజాలరు. కేసీఆర్ చెప్పినట్టు కేటీఆర్ సమర్థుడూ, నమ్మ కస్తుడూ. ఇంతవరకూ నగర ప్రజల మనసులు గెలుచుకున్న కేటీఆర్‌కు పార్టీ నిర్మాణ క్రమంలో పంచాయతీ ఎన్నికలలో, పార్లమెంటు ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలోని నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. నాయకుడిగా ఎది గేందుకు దోహదం చేస్తాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కేసీఆర్ పోషించవలసిన పాత్ర ఏమైనా నిర్దిష్టంగా ఉంటే హైదరాబాద్‌లో కేటీఆర్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతార ని జనాభిప్రాయం. హరీష్‌ని అనుమానించకుండా, అవమానించకుండా సముచితమైన ఆదరణ, గౌరవం ఇచ్చినంతవరకూ కేటీఆర్‌కు ఇబ్బంది ఉండదు. పార్టీ అంతా అండగా ఆయన వెంటే నిలబడుతుంది. ఈ సంగతి కేటీఆర్కీ తెలుసు. వివేకంతో వ్యవహరిస్తారు. టీఆర్ఎస్తోనే తన గతం, వర్తమానం, భవిష్యత్తు ముడివడి ఉన్నాయనే స్పృహ హరీష్‌కూ ఉన్నది. ఫెడరల్ ఫ్రంట్ అవకాశాలు ఫలితాలు వెల్లడైన రోజునే మీడియా సమావేశంలో కేసీఆర్ చెప్పినట్టు ఫెడరల్ ఫ్రంట్ అనేది కాంగ్రెస్, బీజేపీల ప్రమేయంలేని మూడో కూటమి. రెండు జాతీయ పార్టీల వల్లా దేశానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. కానీ సమాఖ్యస్ఫూర్తి కోసం పోరాడాలని పథక రచన చేస్తున్న ప్రాంతీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఎంతవరకు పాటిస్తున్నాయనేది ప్రశ్న. స్థానిక సంస్థలకూ, పంచాయతీరాజ్ సంస్థలకూ నిధులనూ, విధులనూ ఏ మేరకు వికేంద్రీకరిస్తున్నాయనేదీ ప్రశ్నే. పైగా కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికలలో ఎంత లేదన్నా వందకు పైగా సీట్లు వస్తాయి. బీజేపీకి రెండువందల కంటే తగ్గక పోవచ్చు. మిగిలిన 245 స్థానాలలో కొత్తగా ఏర్పడబోయే ఫెడరల్ ఫ్రంట్ ఎన్ని గెలుచుకోగలదు? రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సంగతి ఏమిటి? ఒక రాష్ట్రం నుంచి ఏదో ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే కొత్త ఫ్రంట్‌లో ఉండగలదు. ఉదాహరణకు టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఒకే ఫ్రంట్‌లో ఉండవు. తమిళనాడులోనూ అంతే. కాంగ్రెస్, బీజేపీ కూటములను నిలువ రించడానికి ఫెడరల్ ఫ్రంట్ ఉపకరించవచ్చు. ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు లేకుండా స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి ఫ్రంట్‌కు ఉండదు. వీపీ సింగ్ ప్రభుత్వంలాగా బీజేపీ మద్దతునూ, దేవెగౌడ, గుజ్రాల్ లాగా కాంగ్రెస్ బాసటనూ తీసుకొని బలహీన ప్రభుత్వాలను ఏర్పాటు చేయవలసిందే కానీ ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసి నిలదొక్కుకోవడం కష్టం. అయినా సరే, అటువంటి ప్రయత్నం జరగడం మంచిదే. కాంగ్రెస్‌కు కొత్త కళ ఇటువంటి సమయంలో మూడు హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం విశేషం. బీజేపీకి 2014లో అత్యధిక స్థానాలు సమకూర్చిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పుంజుకున్నది. బలమైన ప్రాంతీయ పార్టీలు లేని రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే ఉంటుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ గెలుపొందింది. మాయావతి, అఖిలేశ్ సహకారంతో మధ్యప్రదేశ్‌లో అందలం ఎక్కబోతోంది. పదిహేనేళ్ళు అధికారంలో ఉన్న బీజేపీని చిత్తుగా ఓడించవలసిన కాంగ్రెస్ బొటా బొటి మార్కులతో పాస్ కావడాన్ని ఘనవిజయంగా భావించనక్కరలేదు. ఛత్తీస్‌గఢ్‌లో అనూహ్యంగా కాంగ్రెస్‌కు పెద్ద మెజారిటీ లభించింది. ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్‌జోగీ, మాయావతి కలసి ఏర్పాటు చేసిన కూటమి వల్ల కాంగ్రెస్‌కు చేటు కలుగుతుందని అత్యధికులు ఊహించారు. జోగీ బీజేపీకి నష్టం కలిగించి కాంగ్రెస్‌కు అసంకల్పితంగా ఉపకారం చేశారు. మూడు విడతలు వరుసగా ముఖ్యమంత్రులుగా పని చేసిన శివరాజ్‌సింహ్ చౌహాన్, రమణ్సింగ్ల ఓటమిని అర్థం చేసుకోవచ్చు. పదవీ విరమణ చేసిన తర్వాత చౌహాన్ నవ్వుతూ హాయిగా మాట్లాడటం అభినందించవలసిన విషయం. రాజస్థాన్‌లో చిత్తు చిత్తుగా ఓడిపోతుందని అనుకున్న బీజేపీ గట్టిగా ప్రతిఘటించడం బీజేపీ కార్య కర్తల బలాన్నీ, కాంగ్రెస్ పరిమితులనూ వెల్లడిస్తున్నది. మూడు హిందీ రాష్ట్రా లలో కాంగ్రెస్ విజయం వెనుక టీడీపీ కృషి ఉన్నదంటూ చంద్రబాబు చెప్పు కుంటున్నారు. అది ఆర్థిక ప్రమేయం కావచ్చునంటూ ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. మూడు రాష్ట్రాలనూ చంద్రబాబు సందర్శించ కుండా కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో రాహుల్‌గాంధీ వ్యవహరించిన తీరు ప్రశంసార్హం. ఇంతవరకూ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో గెలిచినా ఢిల్లీ నుంచి అధిష్ఠానవర్గం దూతలు వెళ్ళడం, ఎంఎల్ఏలతో మాట్లాడటం, అక్కడి నుంచి పార్టీ అ«ధినేతతో ఫోన్లో మాట్లాడి ఆదేశం తీసుకోవడం లేదా ఢిల్లీ వెళ్ళి అంతా నివేదించి ఒక కవరుతో వచ్చి పార్టీ అధినేత నిర్ణయం ప్రకటించడం రివాజు. ఈ సారి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులను ఢిల్లీకి పిలిపించుకొని సోనియా, రాహుల్, ప్రియాంక (కుటుంబ వ్యవహారమని నిందించవచ్చు) సుదీర్ఘ సమాలోచనలు జరిపి, ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ను నిర్ణయించి, పదవి లభించని జ్యోతిరాదిత్య సింధియాను సముదాయించి, సంతృప్తిపరిచి భోపాల్‌కు పంపించారు. కమల్‌నాథ్ సోమవారం ప్రమాణం చేస్తారు. జ్యోతిరాదిత్య ఢిల్లీలోనే రాహుల్‌కు సహాయకుడుగా ఉంటారు. రాజ స్థాన్లో కూడా ఇదే విధమైన రాజీ కుదిరింది. గహ్లోత్ ముఖ్యమంత్రిగా, సచిన్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన దిగ్విజయ్‌సింగ్ బీజేపీకి అధికారం అప్పగించి పదిహేను సంవత్సరాలు గడచిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ నాయకుడు కమల్‌నా«ద్ ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చోబోతున్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని ఈ రోజు నిర్ణయిస్తారు. ముఖ్య మంత్రి పదవికి నాయకులను నిర్ణయించే క్రమంలో కార్యకర్తల అభిప్రాయాలు కనుక్కునేందుకు కూడా రాహుల్ సర్వే పద్ధతి ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియవల్ల ఎంపికలో జాప్యం జరగవచ్చు. కానీ అందరినీ సంప్రదించారనే సంతృప్తి ఉంటుంది. మూడు రాష్ట్రాలలో విజయం కాంగ్రెస్‌కు ఆక్సిజెన్ అందించింది. రాహుల్ ప్రతిష్ఠ ఎంతో కొంత పెరిగింది. అయినప్పటికీ మోదీకి సమ ఉజ్జీ కాగలరా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం 2019 మే వరకూ వేచి ఉండాలి. అప్పుడే తెలంగాణలోనూ నాటకీయమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నది. వ్యాసకర్త: కె. రామచంద్రమూర్తి -
నవ్యాంధ్రలో మరో నాటకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకో భయపడు తున్నారు. భయం లేదని ప్రజలను నమ్మించేందుకు ఎనలేని ధైర్యం, పోరాట పటిమ ఉన్నట్టు నటిస్తున్నారు. ఉదారస్వభావులైన నాయకులూ, స్వశక్తిలేని అర్భకులూ ఢిల్లీ సింహాసనంపైనlఉన్నప్పుడు మాయోపాయం చేసి స్వప్రయో జనాలు నెరవేర్చుకోవడం, ప్రత్యర్థులకు అపకారం చేయడం తెలిసిన చంద్ర బాబు పప్పులు ఇప్పుడు ఉడుకుతున్నట్టు లేదు. చంద్రబాబూ, ఆయన మిత్రులూ ఒక పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో వ్యవహారం చేశారు. ఢిల్లీలో బలమైన యంత్రాంగం ఏర్పాటు చేసుకున్నారు. వాజపేయి అధికారంలో ఉన్నం తకాలం ఆయననూ, ఉపప్రధాని లాల్‌కృష్ణ అడ్వాణీనీ సేవించి తమ ప్రయో జనాలు నెరవేర్చుకునేవారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉండగా చిదంబరం, గులాంనబీ ఆజాద్ వంటి నాయకుల ద్వారా తమకు అవసరమైన పనులు చేయించుకున్నారు. వారితో కలసి కుట్రలు చేశారు. అదే కార్యాచరణ నరేంద్ర మోదీ హయాంలో నాలుగేళ్ళు కొనసాగించారు.. వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్నంత కాలం ఆయన సహకారంతో కొన్ని పనులు చేయించుకున్నారు. ఆయనకు ఉపరాష్ట్రపతిగా పదోన్నతి లభించిన అనంతరం నరేంద్రమోదీని చంద్రబాబు కలుసుకోవడమే అసాధ్యంగా కనిపించింది. అరుణ్‌జైట్లీని ప్రసన్నం చేసుకున్నప్పటికీ చంద్రబాబు కోరికలు తీర్చమని మోదీకి చెప్పే చొరవ ఆయనకు లేదు. ఎత్తులూ, పైఎత్తులే రాజకీయంగా, కుట్రలూ, కుతంత్రాలే యుద్ధవ్యూహాలుగా పరిగణించి ‘చక్రం’ తిప్పే క్రమంలో చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారు. ఎన్నికల వ్యయాన్ని విపరీతంగా పెంచడం ఆయన దేశానికి చేసిన అపకారాలలో ప్రధానమైనది. భారీగా ఖర్చు చేసి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన నాయకులు జరిగిన ఎన్నికలలో పెట్టిన ఖర్చునూ, జరగబోయే ఎన్నికలలో పెట్టవలసిన ఖర్చునూ దృష్టిలో పెట్టుకొని ప్రజాధనం కైంకర్యం చేస్తున్నారు. ఈ జాడ్యం కర్ణాటక, తమిళనాడు మీదుగా ఇతర రాష్ట్రా లకూ పాకింది. అడ్డదారులు తొక్కి అర్ధంతరంగా సంపన్నులైన క్రోనీ కేపిట లిస్టులకు రాజకీయాలలో పెద్దపీట వేయడం కూడా చంద్రబాబు ప్రారంభించిన ఆనవాయితీనే. రాజకీయ విలువలకు సమాధికట్టిన నాయకులలో అగ్రగణ్యుడు ఆయన. విలువలు లుప్తమైన ప్రస్థానంలో చంద్రబాబుపైన అనేక అవినీతి అరో పణలు వచ్చాయి. న్యాయస్థానాలలో దాఖలైన కేసులపైన విచారణ జరగకుండా ‘స్టే’ తెచ్చుకోగలిగారు. ఒక సందర్భంలో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని హైకోర్టు ఆదేశించినా ఆ సంస్థ వెనువెంటనే కదలలేదు. ఈలోగా చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. బహుశా దేశంలో మరెక్కడా ఇటువంటి పరిణామం సంభవించి ఉండదు. కాంగ్రెస్ నాయకులతో అపవిత్రమైత్రి కాంగ్రెస్ నాయకులతో సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని, కాంగ్రెస్‌కు చెందిన శంకరరావూ, టీడీపీకి చెందిన ఎర్రంనాయుడూ వేసిన పిటిషన్‌ను పురస్క రించుకొని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపైన సీబీఐని ప్రయోగించి కేసులు బనాయించారు. ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా దర్యాప్తు పేరుతో జగన్‌ను జైలులో పెట్టించి 16 మాసాలు బెయిల్ రాకుండా పకడ్బందీగా కథ నడిపించారు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత జరిగిన ఎన్నికలలో బీజేపీతో, జనసేనతో పొత్తు పెట్టుకొని అతి ప్రయాసతో గట్టెక్కారు. కడచిన నాలుగున్నర సంవత్సరాలలో అనేక అక్రమాలు జరిగాయి. అవినీతి జడలు విచ్చుకొని నాట్యం చేసింది. గవర్నర్‌కూ, ప్రధానికీ, రాష్ట్రపతికీ ప్రతిపక్షం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం శూన్యం. తన నిగూఢమైన డిమాండ్లు నెరవేర్చని కారణంగా మార్చిలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించినప్పటి నుంచీ చంద్రబాబుకు భయం పట్టుకుంది. తానూ, చిదంబరం కలిసి సీబీఐని జగన్మోహన్రెడ్డిపైన ఉసిగొల్పినట్టు మోదీ అదే సీబీఐని తనపైన ప్రయోగిస్తారేమోనన్న భయం వెన్నా డుతున్నట్టున్నది. అటువంటిదే జరిగితే ప్రజలు తన చుట్టూ రక్షణవలయంగా ఏర్పడి తనను రక్షించాలంటూ విజ్ఞప్తి కూడా చేశారు. సుజనాచౌదరి, సీఎం రమేష్‌లకు చెందిన సంస్థలలో ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడాన్ని ఖండించారు. గుజరాత్, కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్‌కు చంద్ర బాబు నిధులు అందజేసినట్టు మోదీకి సమాచారం అందిందని అంటారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడమే కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు నిధులు సమకూర్చడానికి చంద్రబాబు సన్నాహాలు చేశారని మోదీ అనుమానం. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో రాహుల్‌గాంధీతో కర చాలనం, అనంతరం ఎన్డీఏకి ప్రత్యామ్నాయం నిర్మిస్తున్నట్టు ప్రకటనలూ, తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలో కూటమి, ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళి మీడియాతో మాట్లాడి రావడం, మరోసారి వెళ్ళి రాహుల్‌తో భేటీ కావడం, బెంగళూరూ, చెన్నై సందర్శన, మీడియాలో బ్రేకింగ్ న్యూస్ మోదీకి ఆగ్రహం కలిగించి ఉంటాయి. చంద్రబాబు ఆర్థిక మూలాలను నియంత్రించకపోతే ఆయన లోక్‌సభ ఎన్నికలలో మాయావతికీ, మమతాబెనర్జీకి, ఇతర బీజేపీ ప్రత్యర్థులకూ నిధులు సమకూర్చగలరనే ఆందోళన మోదీ, షాలను కదిలించినా ఆశ్చర్యం లేదు. మోదీ మెతక వైఖరి మోదీ ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ఎంత దూరమైనా వెడతారనే పేరు ఉన్నది. కానీ చంద్రబాబు విషయంలో మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ఆయన కవ్వించినా స్పందించడం లేదు. మోదీతో యుద్ధం చేయాలన్న అభిలాష చంద్రబాబుకు ఉన్నది కానీ ఆయన తనకు దీటైన ప్రత్యర్థి అనే అభిప్రాయం కలిగించడం మోదీకి ఇష్టం లేనట్టు కనిపిస్తున్నది. అవినీతి ఆరోపణలు వచ్చినా దర్యాప్తు చేయించే ప్రయత్నం చేయలేదు. బాధితుడిగా ప్రజల సానుభూతికి చంద్రబాబు పాత్రుడు కావడం బీజేపీకి నష్టదాయకమని భావించి ఉంటారు. చంద్రబాబు మోదీనీ, ఎన్డీఏ సర్కార్‌నీ ఎంత ఘాటుగా విమర్శించినా పట్టించుకున్న దాఖలా లేదు. చంద్రబాబును ఆయన పల్లెత్తు మాట అనలేదు. తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశంసించడమే తనను అభిశంసించడంగా చంద్ర బాబు చెప్పుకుంటున్నారు తప్పితే మోదీ నోటి నుంచి ఒక్క పరుషవాక్యమైనా వెలువడలేదు. చంద్రబాబుకు నష్టం, కష్టం కలిగించే చిన్నపాటి చర్య కూడా తీసుకోలేదు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రతిష్టంభనను తొలగించే ప్రయత్నం చేయలేదు. 23మంది శాసనసభ్యులను కొనుగోలు చేసినా ఆక్షేపించలేదు. వారిలో నలుగురిని మంత్రులుగా నియమించినా తప్పు పట్టలేదు. కేంద్ర నిధులకు లెక్క చెప్పకపోయినా మందలించలేదు. అందుకే, ఇప్పటికీ బీజేపీతో చంద్రబాబుకు రహస్య మైత్రి కొనసాగుతున్నదనే సందేహం వెలిబుచ్చేవారు అనేకమంది. టీడీపీ, బీజేపీల మధ్య దోబూచులాట కొనసాగుతుండగానే, అక్టోబర్ 25న విశాఖపట్టణం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయ కుడిపైన హత్యాయత్నం జరిగింది. మొదట డీజీపీ, తర్వాత ముఖ్యమంత్రి నేలబారుగా మాట్లాడిన తర్వాత వివరాలు ఒకటి తర్వాత ఒకటి వెలుగు చూడసాగాయి. కోడిపందేలలో ఉపయోగించే వాడైన కత్తితో జగన్‌పైన హత్యా యత్నం చేసిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒంటరి కాడనీ, అతని వెనుక గూడు పుఠానీ చేసిన పెద్దలు ఉన్నారనీ, పటిష్టమైన వ్యూహంతో జగన్మోహన్రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నించారనీ నిర్ధారించే నిజాలు క్రమంగా వెల్లడ వుతున్నాయి. డీజీపీ ఠాకూర్ నాయకత్వంలోని పోలీసుల దర్యాప్తులో తమకు విశ్వాసం లేదనీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ చేత దర్యాప్తు జరిపించాలనీ కోరుతూ జగన్మోహన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ ఆరోపణలను సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని రాష్ట్రపతి కానీ ఉన్నత న్యాయస్థానం కానీ ఆదేశిస్తే పరిస్థితులు తలకిందులు అవుతాయనే ఆదుర్దాతో చంద్రబాబు సీబీఐకి ఆగస్టు 3న ఇచ్చిన అనుమతిని నవంబర్ 8న ఉపసంహరించుకున్నారు. భయభ్రాంతులతో తీసుకున్న ఈ చర్యను సైతం ఎన్డీఏ ప్రభుత్వంపైన పోరాటంగా చిత్రించడానికి వీలుగా రేపు కోల్‌కతా వెడుతున్నారు. 22న ఢిల్లీలో ప్రతిపక్ష నేతల సమావేశం నిర్వహి స్తున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా సీబీఐకి 1989లో వామపక్ష సంఘటన ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటు న్నట్టు ప్రకటించారు. అవినీతి ఆరోపణలు అనేకం చంద్రబాబుపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా, సన్నిహితులపైనా తాజా అరోపణలే అనేకం ఉన్నాయి. 1)సీబీఐలో చిచ్చు పెట్టిన సానా సతీశ్ చంద్ర బాబుకు సన్నిహితుడు. సీబీఐ ఉన్నతాధికారికి ముడుపులు చెల్లించారనే ఆరోపణ సతీశ్ ఎదుర్కొంటున్నారు. 2) చంద్రబాబు, లోకేశ్‌ల అక్రమార్జనపైన సీబీఐ దర్యాప్తును ఆదేశించాలని కోరుతూ రిటైర్డ్ న్యాయాధికారి శ్రావణ్‌కుమార్ సెప్టెం బర్లో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. మరిన్ని సాక్ష్యాధా రాలతో మరో పిటిషన్ వేయవలసిందిగా హైకోర్టు కోరింది. 3) 2013లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఆస్తులపైన దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌ల ఆస్తులపైన కూడా పరిశీలన జరిపించాలని కోరింది. 4) లోకేశ్ 80 ఎకరాల భూమిని కబ్జా చేశారనే అరోపణపైన విచారణ జరిపించాలని సీబీఐకి వైఎస్ఆర్సీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. లోకేశ్ భార్య బ్రాహ్మణిపైన సైతం 2011లో ఆరోపణలు వచ్చాయి. 5) సీఎం రమేశ్‌కు చెందిన కంపెనీలపైన ఐటీ దాడులలో లభించిన సాక్ష్యాధారాలు పరిశీలనలో ఉన్నాయి. 6) ‘ఆపరేషన్ గరుడ’ అనే హాస్యభరి తమైన నేరకథనంపైన దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ ఉండనే ఉన్నది. ఇవి కాక అనేక కేసులలో విచారణ జరగకుండా ‘స్టే’ తెచ్చుకున్నారు. ఏ ఒక్క కేసులోనైనా సీబీఐ దర్యాప్తు జరిగినా, ‘స్టే’ ఎత్తివేసినా చంద్రబాబుకు సమస్యలు ఎదురవుతాయి. సీబీఐ సోదాలను అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఆగస్టు3 జారీ చేసిన జీవో నంబర్ 109ని ఉపసంహరించుకుంటూ మరో జీవో జారీ చేయడం వల్ల వాస్తవంగా ఏమి జరుగుతుంది? సీబీఐ రంగంలో ఎప్పుడు దిగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు లేదా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆదేశించిన ప్పుడు. ఆదాయంపన్ను సోదాలు చేసినా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ దాడులు చేసినా, సీబీఐ దర్యాప్తు జరిపినా రాష్ట్ర ప్రజలపైన దాడి చేసినట్టుగా అభివర్ణిస్తూ ఆవేశం రగిలించడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు స్వయంగా సీబీఐ దర్యా ప్తును కోరే అవకాశం లేదు. ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తే సీబీఐని అడ్డుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ సంగతి తెలిసి కూడా అనుమతి ఉప సంహరించుకుంటూ జీవో ఎందుకు జారీ చేశారు? తనపైన వచ్చిన ఆరో పణలన్నీ రాజకీయ లక్ష్యంతో, ప్రతీకారేచ్ఛతో చేసినవేనని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. ఉత్తరోత్తరా తాను భయపడుతున్నట్టు సీబీఐ దర్యాప్తు జరిగినా దానికి రాజ కీయరంగు పులమటం తేలిక. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల దృష్టిని మౌలిక సమస్యలపై నుంచీ, టీడీపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచీ, పెచ్చరిల్లిన అవినీతి నుంచీ మళ్ళించడానికి ఏదో ఒక నాటకీయమైన ఉదంతం సాగుతూ ఉండాలి. కొంతకాలం అమరావతి అనే అద్భుతమైన నగరం గురించి అందమైన కథలు చెప్పారు. అస్మదీయులతో కలసి విదేశీ పర్యటనలు చేశారు. ప్రత్యేక తరగతి హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఎంత అభిలషణీయమో వివరిస్తూ ప్రసంగాలు చేశారు. ప్యాకేజీ ప్రసాదించినవారికి దండాలు పెట్టారు. సన్మానాలు చేశారు. మోదీ గ్రాఫ్ పడిపోతోందని భావించి, కొత్త కూటమి కట్టడం అనివార్య మనిపించి సరికొత్త నాటకానికి తెరతీశారు. ఎన్డీఏ నుంచి వైదొలిగారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకీ, లోక్‌సభకూ జరిగే ఎన్నికల సమయంలో దీనిని పతా కస్థాయికి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం. అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్, కడప సిమెంట్ ఫ్యాక్టరీ, దుర్గగుడి ఎదుట ఫ్లయ్‌ఓవర్, కరువు జిల్లాలలో సహాయ, పునరావాస చర్యలు, వ్యవసాయదారుల అగచాట్లు, నిరుద్యోగుల నిర్వేదం, డ్వాక్రామహిళల ఆక్రందనల ప్రస్తావన ఎక్కడా కనపడకుండా, వినప డకుండా మీడియాలో మత్తెక్కించే నాటకీయ రాజకీయ సమాచారం దట్టించడం తాజా వ్యూహం. కె. రామచంద్రమూర్తి -
ఎటు చూస్తే అటు స్వర్గం!
ప్రజాస్వామ్య ప్రక్రియ వికృతంగా మారి ప్రాణవాయువును క్రమంగా హరి స్తోంది. ఢిల్లీ పర్యావరణం లాగానే దేశమంతటా ప్రజాస్వామ్య వ్యవస్థ ఊపిరాడక కొట్టుమిట్టాడుతోంది. కొంతకాలంగా సంభవిస్తున్న విపరిణామాలు గమనిస్తున్నవారిని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపించి కలవరపెడుతున్నది. ఎన్నికలు జూదంగా మారినప్పుడు, అర్థబలం, అంగబలం ఉన్నవారు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయగల పరిస్థితులు దాపురించినప్పుడు, వ్యాపారులే రాజకీయవాదులూ, రాజకీయవాదులే వ్యాపారులూ అయినప్పుడు అంబేడ్కర్ ఆశించిన రాజ్యాంగబద్ధమైన పరిపాలన, స్వాతంత్య్ర సమరయోధులు అభిలషించిన స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లుప్తమైనప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది. కీలకమైన ఎన్నికలు తెలంగాణతోపాటు నాలుగు రాష్ట్రాల శాసనసభలకు నవంబర్, డిసెంబర్ మాసాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఆరు మాసాలలో లోక్‌సభకూ, ఆంధ్రప్రదేశ్‌తో సహా మరికొన్ని రాష్ట్రాల శాసనసభలకూ ప్రజాప్రతినిధులను ఎన్నుకోబోతున్నాం. పోటీ చేసే అభ్యర్థులలో కొంతమంది మొదటిసారి బరిలో దిగబోతున్నవారు. అనుభవజ్ఞులు మరికొందరు. శాసనసభ్యుల విధులూ, విధానాలు ఏమిటో చాలా తక్కువమంది అభ్యర్థులకు తెలుసు. భారత రిపబ్లిక్ ఏర్పడి 1952లో తొలిసారి ఎన్నికలు జరిగిన దరిమిలా తొలి రెండు తరాల ప్రజాప్రతినిధులకు తమ విధ్యుక్తధర్మం ఏమిటో తెలిసేది. ఆ తర్వాత రాజకీయాలు క్రమంగా మేధావులనూ, సామాజిక సేవకులనూ, నిజాయితీపరులనూ పక్కన పెట్టి వ్యాపారులకూ, పారిశ్రామికవేత్తలకూ, నేరచరితులకూ, అక్రమార్కులకూ పెద్దపీట వేశాయి. ప్రజలకు చట్టసభలలో ప్రాతినిధ్యం వహించవలసిన ఎంఎల్ఏలు చట్టాలు చేయడంలో, పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములు కాకపోతే వారు కర్తవ్య నిర్వహణలో విఫలమైనట్టే. ప్రజలు కూడా తమ కష్టాలకీ, సమస్యలకూ ప్రభుత్వాలు కారణమని నిరసన వెలిబుచ్చుతారు కానీ తమకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిని ప్రశ్నించరు. తెలంగాణవాదానికి మద్దతు ప్రకటించవలసిందిగా అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులపైనా ఉద్యమకారులు ఒత్తిడి తెచ్చిన ఫలితంగా ఆందోళన ఊపందుకున్నది. కేశవరావు, నాగం జనార్దనరెడ్డి, మధుయాష్కీ వంటి నాయకులపైన ఉద్యమకారులు తీవ్రమైన విమర్శల వర్షం కురిపించారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజాప్రతినిధుల రాజీనామాని ఒక అస్త్రంగా వినియోగించింది. ఇతర పార్టీలు సైతం ఉద్యమబాట పట్టవలసి వచ్చింది. ప్రజాప్రతినిధుల పాత్ర అద్వితీయమైనది. వారిని ఎన్నుకునే ప్రక్రియ పవిత్రమైనది. దాన్ని భ్రష్టుపట్టకుండా చూసుకోవలసిన గురుతర బాధ్యత ప్రజలది. అలవికాని వాగ్దానాలు శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పార్టీ ఎన్నికల ప్రచారం ఆరంభించారు. భైంసా, కామారెడ్డి, హైదరాబాద్ సభలలో తనదైన ధోరణిలో మాట్లాడారు. ప్రతి రైతు కుటుంబానికీ రెండులక్షల రూపాయల రుణం మాఫ్ చేస్తామనీ, ప్రతి నిరుద్యోగికీ రూ. 3000 నెలసరి భత్యం చెల్లిస్తామనీ వాగ్దానం చేశారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) సైతం ఇదే తరహా వాగ్దానాలు నాలుగు రోజుల కిందట పాక్షిక ఎన్నికల ప్రణాళిక పేరుతో చేశారు. ప్రతి రైతు కుటుంబానికీ లక్ష రూపాయల రుణం మాఫ్ చేస్తామనీ, ప్రతి నిరుద్యోగికీ రూ. 3016లు నెలనెలా చెల్లిస్తామనీ హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామనీ, డబుల్ బెడ్రూం ఇళ్ళు కట్టించి ఇస్తామనీ, రాష్ట్ర ఆదాయం పెంచుతూ, దాన్ని ప్రజలకు పంచుతూ పోతామనీ వాగ్దానం చేశారు. రైతుల కోసం ప్రవేశపెట్టే 15 పథకాలలో 72 లక్షల మంది రైతులకు కనీసం మూడు పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ చెప్పారు. పకడ్బందీగా లెక్కలు వేసిన తర్వాతే వాగ్దానాలు చేస్తున్నామంటూ నాయకులు చెప్పినా ప్రజలకు వారి అనుభవం నుంచి పుట్టిన అనుమానాలు ఉంటాయి. అమలు అసాధ్యమని తెలిసినా శక్తికి మించిన వాగ్దానాలు చేస్తున్నారనే విషయం గ్రహిస్తారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలు బొత్తిగా అమలు చేయని పార్టీలు ఉన్నాయి. పాక్షికంగా అమలు చేసిన పార్టీలూ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వాగ్దానాలు అమలు చేయాలంటే దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్లు అన్నీ కలిపినా నిధులు సరిపోవని ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు. ఆ తర్వాతనే కేసీఆర్ నిరుద్యోగభృతి వాగ్దానం చేశారు. కేసీఆర్ 2014 నుంచి నాలుగు వాయిదాలలో రైతు రుణమాఫీ చేశారనీ, అట్లా కాకుండా కాంగ్రెస్‌ని గెలిపిస్తే మొత్తం రుణమాఫీ ఒకే విడతలో చేస్తావ«ుని రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని వాగ్దానం చేసి 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం నాలుగున్నర సంవత్సరాలు నయాపైసా చెల్లించకుండా ఇప్పుడు నెలకు రూ. 1,000 చొప్పున ఇస్తానని చెబుతున్నది. దానిలో కూడా అనేక మినహాయింపులతో లబ్ధిదారుల సంఖ్యను కుదించవలసి వస్తున్నది. ఇది బూటకపు వాగ్దానంగానే మిగి లిపోతున్నది. రైతు రుణమాఫీ వాగ్దానం సరేసరి. ఏ పార్టీ అయినా చేస్తున్న వాగ్దానాలు అమలుకు యోగ్యమైనవా, కావా అని నిర్ణయించవలసిన బాధ్యత ఎన్నికల సంఘం స్వీకరించాలి. ప్రజల హృదయాలను ఏదో ఒక విధంగా గెలుచుకోవాలనే ఆరాటంలో అలవికాని వాగ్దానాలు పార్టీలు చేస్తాయి. వాగ్దానాలు అమలు చేయని పార్టీలను అయిదేళ్ళ తర్వాత ప్రజలు శిక్షించవలసిందే కానీ వాగ్దానాలను అమలు చేయించే వ్యవస్థ లేదు. ఆర్థిక నిపుణులతో, సామాజికవేత్తలతో ఉన్నతస్థాయి సంఘాన్ని నియమించి, వివిధ పార్టీలు చేస్తున్న వాగ్దానాల అమలు సాధ్యమో కాదో నిర్ణయించవలసిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశించాలి. అమలు సాధ్యం కానివి ఎన్నికల ప్రణాళిక నుంచి తొలగించాలని పార్టీలను కట్టడి చేయాలి. వాగ్దానాలు సంపూర్ణంగా అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ రాష్ట్ర బడ్జెట్ ఎంత? ఉద్యోగుల జీతభత్యాలూ, ఇతర ప్రభుత్వ ఖర్చులకు ఎంత కేటాయించాలి? మిగిలిన మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎంత ఖర్చు చేయాలి? అభివృద్ధి వ్యయానికీ, సంక్షేమ వ్యయానికీ మధ్య సమతౌల్యం పాటిస్తూ సంక్షేమంకోసం ఎంత ఖర్చు చేయవచ్చు? సంక్షేమం కోసం కేటాయించిన మొత్తంలో పార్టీలు చేస్తున్న వాగ్దానాల అమలు సాధ్యమేనా? వైద్య, విద్యా రంగాల నుంచి ప్రభుత్వాలు పూర్తిగా నిష్క్రమించి, ప్రత్యామ్నాయ సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదా లేక ప్రభుత్వ ఆసుపత్రులనూ, విద్యాలయాలనూ పటిష్టం చేయడం ఉత్తమమా అనే అంశం కూడా ఎన్నికల ప్రచారంలో చర్చకు పెట్టాలి. పన్నులు పెంచుతూ, ఆదాయాన్ని సంక్షేమం పేరు మీద పంచుతూ పోతే అభివృద్ధి ఎట్లా సాధ్యం? తమ జేబులో నుంచి తీసి రైతులకూ, నిరుద్యోగులకూ ఇస్తామన్నట్టు మాట్లాడుతున్న నేతలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పెద్దగా వివరించడం లేదు. రాష్ట్రాల వనరులు ఏమిటో, వాటిని వినియోగించి అభివృద్ధికి సోపానాలు ఏట్లా వేయాలని పార్టీలు ఆలోచిస్తున్నాయో తెలియదు. పౌరులు తమ కాళ్ళపైన తాము నిలబడే విధంగా ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులు కల్పించగలదో తెలియజేయడం లేదు. విదేశాలలో దాచిన నల్లధనం తెచ్చి ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రెండున్నర లక్షలు డిపాజిట్ చేస్తానంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ వాగ్దానం చేసి అభాసుపాలు కాలేదా? గెలుపు ముఖ్యం. అందుకోసం అరచేతిలో వైకుంఠం చూపిద్దాం. గెలిచిన తర్వాత చూసుకుందాం అనే ధీమా పార్టీల చేత చాంతాడంత వాగ్దానాలు చేయిస్తున్నది. ఫిరాయింపుల నిరోధం మరో అత్యంత ప్రమాదకరమైన అంశం ఫిరాయింపు. ఫిరాయింపుల నిరోధం కోసం రాజీవ్‌గాంధీ, వాజపేయి ఎంత కృషి చేసినా చట్టం చట్టుబండలై ఫిరాయింపుల వ్యాపారం నిస్సిగ్గుగా సాగిపోతోంది. రాజ్యాంగాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తుంటే రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులలో ఉన్నవారు ఆక్షేపించడం కూడా మానివేశారు. కొన్ని సందర్భాలలో ఉన్నత పదవులలో ఉన్నవారే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఏకంగా మంత్రివర్గాలే ఫిరాయిం చడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో చెప్పుకోదగిన విశేషం. ఈ ఆత్మహననం నిర్నిరోధంగా కొనసాగుతోంది. ఉదాహరణకు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యం కారణంగా అక్కడ కొత్త ముఖ్యమంత్రికి పగ్గాలు అందించాలి. అందుకు అవసరమైన మెజారిటీ అధికార బీజేపీకి లేదు. అందుకని ఒక రోజు ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్ఏలను ఢిల్లీకి విమానంలో రప్పించుకొని కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి పీయూష్‌గోయెల్ బీజేపీ కండువాలు దర్జాగా కప్పేశారు. ఆ విధంగా మెజారిటీ లేమి సమస్యను అధిగమించారు. ఆ క్రమంలో రాజ్యాంగాన్ని మరోసారి కుళ్ళబొడిచారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి తన ఎంఎల్ఏలను ‘కొనుగోలు’ చేస్తుంటే కాంగ్రెస్ కూడా గట్టిగా ప్రశ్నించకపోవడం, ఇది సర్వసాధారణమైనట్టు మీడియా సైతం మిన్నకుండటం దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ పెద్ద ప్రశ్నార్థకంగా మారిందనడానికి ప్రబల నిదర్శనం. ప్రజాస్వామ్య రక్షణకు తక్షణ చర్యలు ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి బట్టకట్టాలంటే కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం అత్యవసరం. 1. ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎన్నికలకు ఇంకా నెలన్నర సమయం ఉండగానే తెలంగాణలో రూ. 59 లక్షల నగదుతో వెళ్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి కరా>్ణటకకు కారులో తీసుకొని వెడుతున్న రూ. 2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడకపోతే ఇది బహుశా రాయలసీమకు వెళ్ళి ఉండేది. పోలీసులు పట్టుకోలేనివి ఇంతకు అనేక రెట్లు ఉంటాయి. అసలు ఇంత నల్లధనం ఎట్లా ఉత్పత్తి అవుతున్నదో తెలుసుకోవాలి. ఒక ప్రాంతీయ పార్టీ ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడి పార్టీలకు నిధులు ఎట్లా సమకూర్చుతున్నదో తెలుసుకోవాలి. 2. నల్లధనం వనరులలో ముఖ్యమైనవి నీటిపారుదల ప్రాజెక్టులూ, రోడ్ల నిర్మాణం, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణవ్యయాన్ని పెంచడం పారదర్శకంగా జరిగే విధంగా చూసేందుకు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు కావాలి. దానికి సమాంతరంగా పౌరసమాజం తరఫున కూడా ఒక నిఘావ్యవస్థ నిర్మాణం జరగాలి. ఇరిగేషన్, రోడ్డు నిర్మాణం వంటి పనుల కాంట్రాక్ట్ ఏ రకంగా ఇస్తున్నారో పరిశీలించాలి. టెండర్లు పిలుస్తున్నారా లేక నామినేషన్ పద్ధతిలో అస్మదీయులకు కట్టపెడుతున్నారో గమనించాలి. ఇది కేవలం అధికారపార్టీకి వదిలివేయవలసిన అంశం కాదు. ప్రాజెక్టుల పేరు మీద అప్పులు చేస్తున్నారు. అవి ఏ రకంగా ఖర్చు అవుతున్నాయో ప్రజలు తెలుసుకోవాలి. 4. సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడమే కాకుండా అడగకుండానే వివరాలు ఇచ్చే పద్ధతి (డ్యూటీ టు రిపోర్ట్) ప్రవేశపెట్టాలి. 5. గ్రామపంచాయతీలకూ, స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు విధిగా జరిపించాలి. స్థానిక సంస్థలకు విధులూ, నిధులూ వికేంద్రీకరించాలి. జన్మభూమి కమిటీల వంటి సమాంతర పక్షపాత వ్యవస్థను రద్దు చేయాలి. ఇలాంటి కమిటీలు ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధం. 6. ఫిరాయింపుల నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. 2003లో ఆ చట్టానికి చేసిన సవరణలు సరిపోవని తేలిపోయింది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అధికారం సభాపతుల నుంచి తొలగించాలి. ఒక వేళ దాన్ని మార్చకూడదనుకుంటే ఫలానా గడువులోగా నిర్ణయం తీసుకోవాలనే నిబంధన పెట్టాలి. స్పీకర్ నిర్ణయాన్ని పరిశీలించి తిరస్కరించే లేదా ఆమోదించే అధికారం హైకోర్టుకు ఉండాలి. గడువులోగా సభాపతి నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రుల దగ్గర ‘జోహుకుం’ అనే స్పీకర్లకు నిర్ణయాధికారాలు ఇవ్వడం, ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదంటూ ఆంక్ష విధించడంతో ఫిరాయింపులు పగ్గాలు తెంచుకొని జోరుగా సాగుతున్నాయి. నైతిక విలువలు లుప్తమైన పార్టీలు అధికారంలో ఉండటంతో అవి నీతి రాజకీయానికి హద్దూపద్దూ లేకుండా పోతున్నది. ఈ విశృంఖలత్వాన్ని అరి కట్టకపోతే దేశంలో ప్రజాస్వామ్యం నేతిబీరకాయలో నేతిచందం అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
క్షీణ సంస్కృతికి ఆనవాళ్లు!
మన వైఖరి మనం ఎక్కడున్నామనే అంశంపైన ఆధార పడి ఉంటుందని దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర సమరయోధుడు నెల్సన్ మండేలా అనేవారు.'Where you stand depends on where you sit.' కొంతకాలంగా రాజకీయా లను పరిశీలిస్తున్నవారికి మండేలా మాటలు అక్షరసత్యా లుగా అగుపిస్తాయి. ప్రధాని నరేంద్రమోదీ గురించి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్డీఏ భాగ స్వామిగా ఉండగా ఏమని అన్నారో, ఎన్డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత ఏమంటున్నారో గమనిస్తే మండేలా ఆంతర్యం సులభంగా అర్థం అవుతుంది. ఎన్డీఏ భాగస్వా మిగా ఇద్దరు టీడీపీ మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో, ఇద్దరు బీజేపీ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నంత కాలం మోదీ సమర్థుడైన నేత. తెగతెంపులు చేసుకున్నట్టు ప్రపంచాన్ని నమ్మించాలి కనుక ఇప్పుడు మోదీ ఆంధ్రులకు ఎనలేని ద్రోహం చేసిన పరమదుర్మార్గుడు. కేంద్రస్థాయిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు, రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ప్రభృతులు చంద్రబాబు నిజస్వరూపం ఇప్పుడే తెలుసుకున్నట్టు విమర్శలు గుప్పిస్తున్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ‘మోదీ దొంగ’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణిస్తే ‘రాహుల్ అబద్ధాలకోరు’ అంటూ మోదీ జవాబు చెప్పారు. దిగజారిన రాజకీయ సంస్కృతి అన్ని రాష్ట్రాలలో మాదిరే తెలుగు రాష్ట్రాలలోనూ కనిపిస్తున్నది. కంపరం కలిగి స్తున్నది. ఇప్పుడు వార్తలలోని వ్యక్తి రేవంత్‌రెడ్డి ఎవరు? ఒక మాజీ శాసనసభ్యుడు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు. రేవంత్‌రెడ్డి పేరు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మార్మోగడానికి ఆయన చేసిన ఘన కార్యం ఏమిటి? ‘ఓటుకు కోట్లు’ కేసులో టీఆర్ఎస్ శాసన సభ్యుడు ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ. 50 లక్షల నగదు లంచంగా ఇస్తూ కెమేరాకు దొరికిపోయారు. కుమార్తె వివా హానికి ముహూర్తం పెట్టుకున్న తరుణంలో ఈ అనైతిక వ్యవహారంలో ఇరుక్కొని జైలుకు వెళ్ళవలసి వచ్చింది. శాసనమండలి ఎన్నికలలో వేం నరేంద్రరెడ్డి అనే టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునే వ్యూహంలో భాగంగా మొత్తం అయిదు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి బయానాగా రూ. 50 లక్షలు చెల్లించిన సందర్భం. ఈ వ్యవహారంలో వ్యూహకర్త, సూత్రధారి చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యం. ఏసీబీ ద్వారా రేవంత్‌ని పట్టించింది, స్టీఫె న్సన్తో ‘మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన మాటలను రికార్డు చేయించిందీ తెలం గాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అనే విషయంలో సైతం ఎవ్వరికీ అనుమానాలు లేవు. ఇద్దరు చంద్రుల మధ్య జరిగిన ఆధిపత్యపోరులో కేసీఆర్ విజయం సాధించారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి పలాయనం చిత్తగించారు. టేపులో గొంతు తనది కాదని చెప్పలేదు (ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా అది చంద్రబాబు స్వర మేనంటూ ధ్రువీకరించింది). ‘మీకు పోలీసులు ఉంటే మాకూ పోలీసులు ఉన్నారు. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటే మాకూ ఉన్నది’ అంటూ ‘ఓటుకు కోట్లు’ వ్యవహా రాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చి దబాయిం చడానికి ప్రయత్నించారు. రేవంత్‌రెడ్డిపైన తెలంగాణ ఏసీబీ అభియోగపత్రం దాఖలు చేసింది. అందులో చంద్ర బాబు పేరు అనేక విడతలు రాశారు. తన ఫోన్ సంభాష ణను ట్యాప్ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వంపైన చంద్రబాబు కేసు పెట్టారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఏసీబీని ఆదేశించారు. రేవంత్ కుమార్తె వివాహానికి సకుటుంబ సమేతంగా హాజరై తన శిష్యుడికి పూర్తి మద్దతు ప్రకటించారు. రేవంత్‌కి సీబీఐ కోర్టు బెయిల్ నిరాకరించింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రద్దు చేయవలసిందిగా తెలంగాణ ఏసీబీ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత రేవంత్ విజయోత్సవ సభ నిర్వహించారు. కేసీఆర్‌పైన తీవ్రపదజాలంతో దాడి చేశారు. ఆయన మళ్ళీ వెనక్కు తిరిగి చూడలేదు. పని చేయని చట్టం నిగూఢమైన కారణాలు వల్ల ‘ఓటుకు కోట్లు కేసు’ ఒక దశలో ఆగిపోయింది. ఎవరో పెద్దలు చంద్రబాబుకీS, కేసీఆ ర్కీ మధ్య రాజీ కుదిర్చారని వదంతులు వినిపించాయి. యదార్థంగా ఏమి జరిగిందో తెలియదు. చట్టం తన పని తాను చేసుకొనిపోవడం లేదని మాత్రం తెలుసు. లేకపోతే స్పష్టమైన దృశ్యశ్రవణ ఆధారాలు ఉన్న ఈ కేసులో రేవంత్ రెడ్డికీ, మరికొందరికీ శిక్షలు పడేవి. చంద్రబాబు అభిశం సన అనివార్యమయ్యేది. కథ అంత దూరం వెళ్ళలేదు. ఈ లోగా టీడీపీ టిక్కెట్టుపైన తెలంగాణ శాసనసభకు గెలిచిన వారిలో చాలామంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోకి అట్టహాసంగా ప్రవేశిం చారు. ఒక కేసులో ప్రథమ నిందితుడిగా ఉన్న రాజకీయ నాయకుడికి కాంగ్రెస్ ఎర్రతివాచీ పరిచి ఎందుకు ఘన స్వాగతం చెప్పింది? ఆ పార్టీకి విలువల పట్ల గౌరవం లేదు. కనీసం గౌరవం ఉన్నట్టు నటించాలన్న స్పృహసైతం లేదు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ప్రభుత్వానికి దూరంగా ఉన్న మేధావులూ, వివిధ వృత్తు లలో పని చేసినవారూ, రాజకీయాలలో ఆసక్తి ఉన్నవారూ చాలా మంది ఉన్నారు. వారిలో ఒక్కరిని కూడా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేయలేదు. యువ తీయువకులకు పార్టీలోకి స్వాగతం చెప్పి వారికి ప్రాధా న్యం ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు. పదేళ్ళు కాంగ్రెస్ పాలనలో వివిధ పదవులు అనుభవించి, అందినంత సంపాదించుకున్నవారు గత నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేసేందుకు ఒక్క రూపాయి ఖర్చు చేయ డానికి ముందుకు రాలేదు. చంద్రబాబుకి కాంగ్రెస్‌తో రహస్యానుబంధం తొలి నుంచీ కొనసాగుతూనే ఉన్నది. రాహుల్‌గాంధీకి సలహాదారులుగానో, సన్నిహితులుగానో చెలామణి అవుతున్నవారితో మాట్లాడి దేనికైనా ఒప్పించ గల సౌలభ్యం ఉంది. చంద్రబాబుతో కలసి పని చేయాలని కోరుకునే కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలం గాణలో ఎక్కువ ఉన్నారు. వారికి సహచరులపైన విశ్వాసం లేదు. ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించడానికి మరొకరు ఇష్టపడరు. అందుకు తాము మాత్రమే సమర్థుల మంటూ త్రికరణశుద్ధిగా భావిస్తున్నవారు కనీసం అరడ జను మంది ఉన్నారు. రేవంత్‌ను పార్టీలోకి ఆహ్వానించడం అంటే చంద్రబాబు అండదండలు అందుకోవడమే అన్న అవగాహన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఉంది. టీఆర్ఎ స్ను ఎదుర్కోవడంలో నిధుల కొరతతో బెంగటిల్లుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు చంద్రబాబుతో స్నేహం కొండంత బలం. ఆయన అన్ని విధాలా ఆదుకుంటారన్న ఆశ. తమ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ఆవి ర్భవించిన టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ నాయకులు సంకోచించలేదు. తమ అధినేత సోనియాగాంధీని అనరాని మాటలు అంటూ కాంగ్రెస్‌ను ముక్కలు ముక్కలుగా నరకాలంటూ టీడీపీ శ్రేణులను ప్రేరేపించిన చంద్రబాబు పరిష్వంగం వారికి అభ్యంతర కంగా తోచలేదు. ఎట్లాగైనా టీఆర్ఎస్ను ఓడించి అధి కారం హస్తగతం చేసుకోవాలి. అందుకోసం అడ్డదారులు తొక్కినా పర్వాలేదు. ఇదే సూత్రాన్ని రాహుల్‌తో చెప్పి ఒప్పించి ఉంటారు. అందుకే రేవంత్‌రెడ్డిని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఆ విధంగా చంద్ర బాబుకి ‘మహాకూటమి’లో నిర్ణాయక పాత్ర ఇచ్చారు. సుమన్ ధ్వజం సీట్ల సర్దుబాట్లు చేసుకొని, ఎన్నికల ప్రణాళిక రూపొందిం చుకొని సమరశంఖం పూరించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో గురువారంనాడు రేవంత్‌రెడ్డి నివాసంపైనా, ఆయన బంధువుల ఇళ్ళపైనా, వ్యాపార సంస్థలపైనా ఆదా యంపన్ను శాఖ అధికారులు దాడులు ఆరంభించారు. శనివారం సాయంత్రం వరకూ సోదాలు సాగాయి. అధికా రులు ఎటువంటి ప్రకటన చేయకపోయినా రకరకాల కథ నాలు మీడియాలో వస్తున్నాయి. సోదాలలో లభించే నిధులు చంద్రబాబువేన నీ, రేవంత్ టీడీపీ అధినేత బినామీ అనీ వ్యాఖ్యలు వినిపించాయి. ప్రధానినీ, ముఖ్యమంత్రినీ, మీడియానూ దుయ్యపడుతూ రేవంత్ చెలరేగిపోయారు. అంతే కటువుగా, అంతకంటే మొరటుగా టీఆర్ఎస్ లోక్ సభ సభ్యుడు బాల్క సుమన్ స్పందించారు. ఎంత రెచ్చ గొట్టినా కేసీఆర్ రేవంత్‌తో ముఖాముఖికి దిగరు. అది తన స్థాయి కాదని ఆయన అభిప్రాయం. అందుకని సుమన్‌ను ప్రయోగించారు. ఆదాయంపన్ను అధికారులు దాడులు చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఇది మోదీ, కేసీఆర్ కలిసి కుట్రపన్ని చేసిన పని అంటూ దుయ్య పట్టారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఇదే విధంగా చేస్తున్నా రనీ, ఉత్తరప్రదేశ్‌లో, తమిళనాడులో, కర్ణాటకలో ఇదే మాదిరి దాడులు జరిపించారనీ చంద్రబాబు మోదీని నిందిస్తూ రేవంత్‌రెడ్డికి తన మద్దతు మరోసారి స్పష్టంగా ప్రకటించారు. ‘ఓటుకు కోటు’ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయాలని కొంతకాలం విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆ కేసులో పాత్రధారికి పార్టీలో పెద్దపీట వేసి సూత్రధారితో గొంతుకలుపుతున్నారు. మండేలా చెప్పి నట్టు కాంగ్రెస్, టీడీపీలు దగ్గరైన నేపథ్యంలో ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులు కాంగ్రెస్‌కు మిత్రులైనారు. ఈ దాడులకు మరోకోణం ఉంది. గుజరాత్, కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌కి నిధులు సమకూర్చినట్టు మోదీకి సమాచారం ఉందట. ఆ నిధులను రేవంత్ సంబంధీకుల ద్వారా చేరవేసినట్టు తెలు సుకున్నారట. ఈ నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశం తోనే దాడులు జరిగాయంటూ ఒక కథనం ప్రచారంలో ఉంది. అంతులేని నిధులు చంద్రబాబు చేతుల్లోకి ఎట్లా వచ్చాయో తెలుసుకోవాలన్న అభిలాష మోదీకి ఉన్నట్టు లేదు. బీజేపీ సైతం ఎన్నికలలో అపారమైన నిధులు ఖర్చు చేసింది. చేయబోతోంది. అంతలేసి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ఊహించడం కష్టం కాదు. ఎన్నికల వేళ తమని విమర్శించినా ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత చంద్ర బాబు సహకారం అవసరం కావచ్చుననే ముందు చూపుతో మోదీ, అమిత్‌షాలు వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. రియల్‌పొలిటిక్ (అధికార రాజకీయం)లో అందెవేసిన చెయ్యి కనుక ఇప్పుడు విమర్శిస్తున్న బీజేపీతో ఎన్నికల తర్వాత మళ్ళీ స్నేహం చేసేందుకు చంద్రబాబుకి ఎటు వంటి అభ్యంతరం, సంకోచం ఉండబోవని బీజేపీ అధిష్ఠా నానికి తెలుసు. క్షీణ సంస్కృతి చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి పెద్దఎత్తున అధికార దుర్వినియోగం చేసి, భారీ ఖర్చు చేసి ఎన్నికలలో ధనప్రభావం విపరీ తంగా పెరగడానికి కారకులైనారు. డబ్బు ఉన్నవారికే టిక్కెట్టు. ఎన్నికైన చట్టసభ సభ్యులు ఎన్నికలలో ఖర్చు చేసిన మొత్తాన్నీ, రాబోయే ఎన్నికలలో ఖర్చు చేయవలసిన మొత్తాన్నీ సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కడం రివాజుగా మారింది. పార్టీలూ, నాయకులూ ఎవరైనా దాదాపుగా అదే సంస్కృతి దేశం అంతటా కొనసాగు తోంది. ఈ సంస్కృతికి ప్రతినిధి రేవంత్‌రెడ్డి. యువకుడూ, ఉత్సాహవంతుడూ, ధైర్యవంతుడూ, ధాటిగా మాట్లాడే శక్తి కలిగినవాడూ అయిన రేవంత్ ఈ కాలపు రాజకీయ ప్రతి నిధి. కండబలం, ధనబలం, కులబలం ఉంటేనే రాజకీయా లలో మనుగడ సాధ్యమని విశ్వసించే రాజకీయులకు ప్రతీక. రేవంత్పైన ఆదాయంపన్ను శాఖ దాడులను ఖండించిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన కాంగ్రెస్ నేతలతో షరీకై బూటకపు కేసులు బనాయింప జేశారు. అప్పుడు చట్టం తన పని తాను చేసుకొనిపోతుం దంటూ గడుసుగా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రేవంత్‌ని చూసి విలవిలలాడుతున్నారు. చంద్ర బాబుని మెప్పించేందుకు రేవంత్ జగన్మోహన్రెడ్డి గురించి ఎంత దారుణంగా మాట్లాడారో అందరికీ తెలుసు. పరిస్థితులు మారినప్పుడు వైఖరులూ మారుతాయి. తనను అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు బేలగా మాట్లా డటం కూడా ఆయన మానసిక స్థితికి అద్దం పడుతుంది. తాను చేసిన అక్రమాలు ఏమిటో ఆయన అంతరాత్మకు తెలుసు. చట్టం నిజంగానే తన పని తాను చేస్తుందనే భయం చంద్రబాబుని అప్పుడప్పుడు అశాంతికి గురి చేస్తున్నది. రేవంత్‌కి శిక్ష పడితే తన పరిస్థితి ఏమిటనే ప్రశ్న నిరంతరం వేధిస్తున్నది కాబోలు. కె. రామచంద్రమూర్తి -
ఇప్పుడు వీస్తున్న గాలి
రాజకీయాలలో నాయకులు ఉంటారు. నిర్వాహకులు ఉంటారు. నిర్వాహకులను మేనేజర్లు అంటారు. అంతకంటే పెద్ద స్థాయి ఊహించుకున్నవారు సీఈవో అని కూడా తమను తాము అభివర్ణించుకుంటారు. నాయకుడికి ఆవేశం, సాహసం, ఆత్మవిశ్వాసం, నిజాయితీ సహజ లక్షణాలై ఉంటాయి. పార్టీ ప్రయోజనాలను పరిరక్షించడం, అందు కోసం అవసరమైతే నియమనిబంధనలను ఉల్లంఘించడం, నీతినియమాలను పక్కన పెట్టడం, ఏదో ఒక విధంగా కథ నడిపించడం పార్టీ మేనేజర్లు చేసే పనులు. ముందుండి పోరాడే స్వభావం లేనివారు నాయకత్వపాత్రకు సరిపోరు. ప్రజలకు కష్టంగా తోచినప్పటికీ యదార్థం చెప్పగలవారే సిసలైన నాయకులు. నిజం చెప్పకుండా దాటవేసేవారు కానీ, అసత్యం చెప్పేవారు కానీ, అమలు చేయలేని వాగ్దా నాలు చేసేవారు కానీ ప్రజలను మభ్యపెట్టే కపట నాయకులు. సహజ నాయకులు కొత్త పోకడలు పోతారు. ప్రజల తరఫున నిలబడి పోరాడతారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యా మ్నాయంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది మాసాలకే ఎన్నికలలో ఘనవిజయం సాధించిన ఎన్‌టి రామారావు నాయకుడు. పార్టీనీ, పార్టీ ప్రభుత్వాన్నీ హస్త గతం చేసుకొని వాటిని కాపాడుకుంటూ వచ్చిన చంద్ర బాబునాయుడు దక్షత కలిగిన నిర్వాహకుడు. పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపిం చిన వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకుడు. ప్రతిపక్షంలో మగ్గు తున్న పార్టీని గెలిపించేందుకు అహర్నిశలూ కృషి చేసి, ఆసేతుహిమాచల పర్యంతం పర్యటించి అద్భుతంగా ప్రచారం చేసి అఖండ విజయం సాధించిన నరేంద్రమోదీ నాయకుడు. కొత్త పంథాలో పార్టీ పెట్టి విజయం సాధించిన ఆమ్ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ నాయకుడు. కాంగ్రెస్ అధిష్ఠానంతో విభేదించి, అత్యంత శక్తిమంతురాలైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ధిక్కరించి సొంత పార్టీ పెట్టి, కష్టనష్టాలు ఎదురైనా చలించకుండా యుద్ధ రంగంలో నిలబడిన జగన్మోహన్రెడ్డి నాయకుడు. అమలు సాధ్యం కాని వాగ్దానాలు అమలు సాధ్యం కాని వాగ్దానాలు చేయడం, అమలు చేయ బోవడం లేదని తెలిసి కూడా మాట ఇవ్వడం మంచి నాయకుడి లక్షణం కాదు. ఈ విషయంలో మోదీ, చంద్ర బాబునాయుడూ ఒకటే. ఎన్నికలలో గట్టెక్కడానికి నోటికి వచ్చిన వాగ్దానాలు ఇద్దరూ చేశారు. స్విస్‌బ్యాంకులో మూలుగుతున్న నల్లధనం తీసుకొని వచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేయిస్తా నంటూ మోదీ వాగ్దానం చెయ్యడం వంచన. కోట్ల ఉద్యో గాలు కల్పిస్తాననడం కూడా అంతే. అమలు చేసే ఉద్దేశం కూడా లేకుండా జనాన్ని ఆకట్టుకోవడానికి కులానికో వాగ్దానం చేసి, గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం శూన్యహస్తం చూపించడంలో చంద్రబాబు నేర్పరి. రైతు రుణాల మాఫీ వాగ్దానం చేస్తూ రుణాలు చెల్లించవద్దంటూ రైతులను ఉద్దేశించి ప్రకటనలు జారీ చేయడం, జాబు కావా లంటే జాబు రావాలంటూ బూటకపు వాగ్దానం చేయడం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పడం పనిగట్టుకొని మోసం చేయడమే. లోగడ ఏ ప్రధాని అభ్యర్థి కూడా మోదీలాగా అమలు సాధ్యం కాని వాగ్దానాలు చేయ లేదు. ముఖ్యమంత్రి పదవిని ఆశించి రాష్ట్ర స్థాయి నాయ కులు ఎవ్వరూ చంద్రబాబునాయుడిలాగా నెరవేర్చలేని హామీలు గుప్పించలేదు. యువకుడైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల ప్రచారంలో రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యం కాదని చెప్పారు. రుణమాఫీ వాగ్దానం చేయవలసిందిగా ఆయనపైన ఎంతమంది పార్టీ నాయ కులూ, హితైషులూ ఎన్నిరకాలుగా ఒత్తిడి తెచ్చినప్పటికీ సాధ్యం కాని హామీ ఇవ్వడం నీతిబాహ్యమనే ఉద్దేశంతో వాగ్దానం చేయలేదు. ఆ మాట ఇచ్చి ఉంటే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకోగలిగేది. కానీ హామీ అమలు చేయడం కష్టతరమై ఉండేది. హామీ ఇచ్చి గెలిచిన టీడీపీ హామీని పూర్తిగా అమలు చేయడంలో విఫల మైంది. పైగా అమలు చేశామంటూ దబాయిస్తోంది. అది వేరే విషయం. వర్తమానానికి వస్తే, వంద నియోజకవర్గాలను చుట్టి వచ్చిన పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి, అమలు చేయడం సాధ్యమని విశ్వసిం చిన తర్వాతనే మాట ఇస్తున్నారు. జగ్గంపేటలో జరిగిన బహిరంగ సభలో కొంతమంది యువకులు ప్లకార్డులు పట్టు కొని కాపు రిజర్వేషన్ల గురించి ప్రకటన చేయవలసిం దిగా కోరినప్పుడు కూడా జగన్ వాస్తవాలే మాట్లాడారు. తన చేతిలో ఉన్న పనైతే నిస్సంకోచంగా చేస్తానని చెబుతూ, సుప్రీంకోర్టు తీర్పు గురించి గుర్తు చేశారు. రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలో లేవని స్పష్టం చేశారు. అయినప్పటికీ, కాపు సమా జానికి మేలు చేయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాననీ హామీ ఇచ్చారు. కాపు కార్పొరేషన్‌కు టీడీపీ వెయ్యి కోట్ల రూపా యలు ఇస్తానని వాగ్దానం చేసి అందులో సగం కూడా ఇవ్వ లేదనీ, తాను అధికారంలోకి వస్తే అంతకు రెట్టింపు ఇస్తాననీ అన్నారు. కాపు కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వడం తన చేతిలో ఉన్న పని కనుక ఇస్తానంటూ వాగ్దానం చేయగలిగారు. ఓట్లు సంపాదించడమే పరమావధిగా చేసే బూటకపు వాగ్దానాలు రాజకీయ నాయకుడికి అపకీర్తి తెస్తాయి. మాట మీద నిల బడటం విశ్వసనీయత కలిగిన రాజకీయవాది లక్షణం. ఏమి కావాలో తేల్చుకోవాలి నాలుగున్నరేళ్ళ కిందటే రాజకీయాలలోకి వచ్చిన సినీ నటుడు పవన్ కల్యాణ్ నాయకుడికీ, నిర్వాహకుడికీ మధ్య గల వ్యత్యాసం గమనించి ఏమి కావాలో నిర్ణయించుకో వాలి. పవన్ మాటలలో నిలకడ కనిపించడం లేదు. కొన సాగింపు ఉండటం లేదు. ఉదాహరణకు ఉద్దానంలో మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ప్రజల సమస్య తీసు కుందాం. అక్కడికి అమెరికా నుంచి ఒక ప్రొఫెసర్‌ను తీసు కొని వచ్చారు. కొన్ని ప్రకటనలు చేశారు. సమస్య పరి ష్కారం కాలేదు. ప్రత్యేకహోదాపైన ఉద్యమంలోనూ అంతే. పార్లమెంటులో మోదీ ప్రభుత్వంపైన అవిశ్వాసతీర్మానం వైఎస్ఆర్సీపీ పెడితే తాను ఢిల్లీకి వెళ్ళి ప్రతిపక్షాలతో మాట్లాడి మద్దతు కూడకడతానని అన్నారు. తీరా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నం జరిగినప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు సరికదా మద్దతు మాటవరుసకు కూడా చెప్పలేదు. ఈ నెల 25వ తేదీన ప్రత్యేకహోదా కోసం వైఎస్ఆర్సీపీ రాష్ట్రబంద్‌కు పిలుపు ఇస్తే మద్దతు ప్రకటించలేదు. అవిశ్వాస తీర్మానానికి 13 సార్లు నోటీసులు ఇచ్చినా లోక్‌సభ స్పీకర్ ఆమోదించకపోతే విసిగిపోయి, ఎన్డీఏ ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచడానికి చివరి అస్త్రంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేస్తే పలాయనం చిత్తగించారంటూ విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి తగిన గౌరవం, మన్నన లేని కారణంగానూ, ప్రతిపక్ష సభ్యుల పట్ల పాలక పక్షం శత్రుభావంతో వ్యవహరిస్తున్న కారణంగానూ సమావే శాలను బహిష్కరిస్తే ముఖ్యమంత్రికి భయపడి పారిపోయా రంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులను నిందించడం రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనం. బద్ధ వైరం ఉన్న టీడీపీ కూడా చేయనట్టు జగన్‌పైన ఫ్యాక్షనిస్టు ముద్ర వేయడానికి ప్రయత్నించడం పవన్‌కల్యాణ్ మనసులో గూడుకట్టుకున్న అమిత్రభావానికి నిదర్శనం. రాజీనామాలూ, బహిష్కర ణలూ, బంద్‌లూ రాజకీయ పోరాటంలో భాగాలు. టీడీపీనీ, వైఎస్ఆర్సీపీనీ సమానంగా విమర్శిస్తే సమదూరం పాటిం చినట్టు కాదు. అధికారంలో ఉన్న పార్టీనీ, ప్రతిపక్షాన్నీ ఒకే గాట కట్టడంలో విజ్ఞత లేదు. టీడీపీని నిజంగా ఎండగట్టా లనే ఉద్దేశం పవన్ కల్యాణ్‌కి ఉంటే, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలనే పట్టుదల ఉంటే అధికార పార్టీ వైఫల్యాలని ఎత్తి చూపాలి. కట్టుబట్టలతో అమరావతికి వచ్చామంటూ చంద్రబాబు చెబుతున్నారు. అంత హడావిడిగా ఎవరో తరు ముతున్నట్టు హైదరాబాద్ నుంచి అమరావతికి ఎందుకు వచ్చారని చంద్రబాబును ప్రశ్నించాలి. పదేళ్ళు హైదరా బాద్‌లో ఉండే హక్కును వదులుకుని అమరావతికి ఎందుకు వచ్చారని అడగాలి. ఓటుకు కోట్లు కేసులో ఆయన పాత్ర ఏమిటో తెలుసుకోవాలి. 23 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ ఏలను ఎందుకు కొనుగోలు చేశారో చెప్పమనాలి. వారిలో నలుగురికి మంత్రి పదవులు ఎందుకు కట్టబెట్టవ లసి వచ్చిందో సంజాయిషీ అడగాలి. ఎన్నికల హామీలు ఏ గాలికి కొట్టుకుపోయాయో చెప్పమంటూ నిలదీయాలి. ఇసుక మాఫియా గురించీ, కాల్‌మనీ సెక్స్ రాకెట్ గురించీ ప్రశ్నిం చాలి. రాష్ట్రం ఆర్థికంగా కష్టాలలో ఉన్నదంటూ ప్రత్యేక విమానంలో విదేశీయానాలకు రూ. 170 కోట్లకు పైగా దుబారా ఎందుకు చేశారో చెప్పమనాలి. అమరావతి నగర నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా ఎందుకు పేర్చలేదనీ, సింగపూరు గొడవ ఏమిటనీ, పోలవరం ప్రాజెక్టును మూడు సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదనీ నిలదీయాలి. విజ యవాడలో దుర్గగుడి దగ్గర ఫ్లయ్‌వోవర్ ఎప్పటికి పూర్తవు తుందో చెప్పమనాలి. ఈ ప్రశ్నలు ఏవీ వేయకుండా ప్రతిపక్ష నాయకుడిని తీవ్రపదజాలంతో విమర్శించడంలో ఆంతర్యం ఏమిటి? ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి ఎదగా లని ఆశించే జనసేనాని రాజ్యసభ సీటు ఇస్తానని బాబు అనగానే ఎన్నికలలో 50, 60 స్థానాలకు పోటీ చేయాలన్న సంకల్పాన్ని విరమించుకోకూడదు. ఎన్టీఆర్‌కు రాజ్యసభ సీటు ఇస్తానని నాటి ముఖ్యమంత్రి అంజయ్య చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచనను అటక ఎక్కించలేదు. కాంగ్రెస్ పార్టీని బలపరచలేదు. పవన్ ఆంతర్యం ఏమిటి? ఏ నాయకుడు ఏమి మాట్లాడుతున్నారనే అంశం కంటే ఎందుకు మాట్లాడుతున్నారో, ఏ ప్రయోజనం ఆశించి మాట్లాడుతున్నారో ఆలోచించడం అవసరం. శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జగన్ ప్రసంగించిన బహిరంగ సభ జరిగిన సమయంలోనే ఒంగో లులో చంద్రబాబు ఆధ్వర్యంలో ‘ధర్మపోరాట’ సభ జరి గింది. ఒంగోలులో సభికులు స్తబ్దుగా కూర్చున్నారు. బాబు పక్కనే కూర్చున్న కళావెంకటరావు, తదితరుల మొహాలలో ఉత్సాహం లేదు. ఒంగోలు సభకు హాజరైన జనం కంటే పదిరెట్లు జగ్గంపేట సభలో ఉన్నారు. అక్కడ ప్రజలు ఉత్సా హంగా కేరింతలు కొడుతూ కనిపించారు. బాబు ఎప్పటి లాగే తర్జని ఊపుతూ, ఏపీలో బీజేపీ ఆటలు సాగవంటూ హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ తప్పు తెలుసుకొని అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ, బీజేపీ ఒకటేనంటూ ఏపీ పీసీసీ నాయకుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యా నించారు. తరచి చూస్తే అంతస్సూత్రం కనిపిస్తుంది. చంద్ర బాబు బీజేపీనీ, వైఎస్ఆర్సీపీనీ విమర్శిస్తూ ఉంటారు. రఘువీరారెడ్డీ అదే పని చేస్తారు. పవన్‌కల్యాణ్ కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోదనీ, సొంతంగా 175 స్థానాలకు పోటీ చేస్తుందనీ రఘువీరా చెప్పారు. పవన్‌కల్యాణ్ కూడా స్వతంత్రంగా పోటీ చేస్తానం టున్నారు. వామపక్షాల వైఖరి ఏమిటో స్పష్టంగా వెల్లడి కాలేదు. టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి కాంగ్రెస్, జనసేన ఉపయోగపడతాయి. కాంగ్రెస్ ముక్కు ఉన్నా, ఊడినా పెద్ద తేడా ఉండదు. జనసేనాని వ్యూహం వల్ల కాపు సామాజికవర్గం ప్రభావితం అవుతుందని చంద్ర బాబు అంచనా కావచ్చు. ఆ వర్గం టీడీపీపైన ఆగ్రహంతో ఊగిపోతోందని ముఖ్యమంత్రికి తెలుసు. కాపులు తనకు ఓట్లు వేయకపోయినా వైసీఆర్సీపీకి వేయకుండా చూడాల న్నది టీడీపీ అధినేత తాపత్రయం. కాపు సామాజికవర్గం పైన పవన్‌కల్యాణ్ ప్రభావం అంత బలంగా ఉంటే పెద్దాపు రంలోనూ, జగ్గంపేటలోనూ జగన్ సభలు అంత జయ ప్రదం అయ్యేవి కావు. రాజకీయాలలో ఎత్తుగడలూ, ఎన్ని కల మేనేజ్‌మెంటూ, డబ్బులూ, కులాలూ కొంతవరకు పని చేస్తాయన్న మాట నిజమే. కొంతవరకే పని చేస్తాయని గ్రహించాలి. నాయకుడు ఒక ప్రభంజనం సృష్టిస్తే, ప్రజలు ఒక పార్టీని గెలిపించాలని నిర్ణయం తీసుకుంటే ప్రత్యర్థుల ఎత్తులన్నీ చిత్తు అవుతాయని 2004, 2009 ఎన్నికలు నిరూపించాయి. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో దృశ్యాలు చూసినవారికి గాలి ఎటు వీస్తున్నదో, ఎంత బలంగా వీస్తున్నదో తెలుస్తుంది. కొందరు కొన్ని కారణాల వల్ల వాస్తవాన్ని అంగీకరించకపోవచ్చు. అంత మాత్రాన ప్రజల సంకల్పం మారదు. కె. రామచంద్రమూర్తి -
‘జుమ్లా’లో కనిపించని కోణాలెన్నో!
శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ 2019లో జరగ బోయే ఎన్నికల ప్రచారానికి డ్రెస్ రిహార్సల్స్. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంటుందో అంచనా వేయడానికి ఎన్డీఏ ప్రభుత్వంపైన మొదటిసారి పెట్టిన అవిశ్వాస తీర్మానంలో వివిధ పార్టీల నేతలు మాట్లాడిన తీరూ, ఓటింగ్ జరిగిన సరళీ ఉపయోగపడతాయి. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్ట డంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఉద్దేశం ఏమైనా, తీర్మానాన్ని వెంటనే అను మతించి వెనువెంటనే చర్చ, ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించడంలో ఎన్డీఏ ప్రభుత్వ ఎత్తుగడ ఏమైనా దేశప్రజలకు ఏ పార్టీ ‘జుమ్లా’ ఆట ఆడుతున్నదో, ఎవరి కపట నాటకం ఎటువంటిదో, ఎవరు నిజాయితీగా ప్రజల తరఫున నిలిచి పోరాడుతున్నారో తెలిసిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం పైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలోనే అవిశ్వాస తీర్మానానికి 13 సార్లు నోటీసులు ఇచ్చి అనుమతి లభించక విసిగి వేసారి పదవులకు రాజీనామా చేసిన అయిదుగురు వైఎస్ఆర్ సీపీ లోక్‌సభ సభ్యులను ఎద్దేవా చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? పైగా, టీడీపీ నోటీసు ఇచ్చిన వెంటనే దానిని అనుమతించడంలో ఎన్డీఏ సర్కార్ ఎత్తుగడ ఏమిటి? అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోదని తెలుసుననీ, ప్రత్యేకహోదాపైన చర్చ జర గాలనే ఉద్దేశంతోనే తీర్మానం పెట్టామనీ సుజనాచౌదరి అన్నారు. అమిత్ షా నోట ‘జుమ్లా’ ‘జుమ్లా’ అనే మాటను వర్తమాన రాజకీయాలలో మొదట ప్రయోగించిన వ్యక్తి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. ‘జుమ్లా’ అంటే ఉత్తిమాట, నీటిమీద రాత, మాట వరుసకు అన్న మాట అని రూఢి అయింది. విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న నల్లధనం తీసుకొని వచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తానంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగంలో చేసిన మాటను ‘చునావీ జుమ్లా’ (ఎన్నికల ప్రచారంలో మాటవరుసకి అన్న మాట)గా అమిత్ షా అభివర్ణించి ఆ మాటను పట్టుకొని వేళ్ళాడవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పటి నుంచీ ‘జుమ్లా’ అనే మాట భారత రాజకీయాలలో తరచుగా విని పిస్తున్నది. సర్జికల్ స్ట్రయిక్స్‌ను కూడా జుమ్లా స్ట్రయిక్స్ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. ‘జుమ్లా స్ట్రయిక్ నంబర్ ఏక్, జుమ్లా స్ట్రయిక్ నంబర్ దో...’ అంటూ రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపైన బాణాలు సంధించి, ప్రసంగం ముగి సిన తర్వాత మోదీ దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకొని తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చొని పక్కనున్న సభ్యుడివైపు చూసి నవ్వుతూ కన్నుగీటడంతో మోదీపై తన దాడి యావత్తూ ‘జుమ్లా స్ట్రయికే’నని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వా లంటూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రాహుల్కీ, మోదీకి మధ్య సంవాదంగా సాగిందే తప్ప ప్రత్యేకహోదా ఊసు లేదు. చర్చను ప్రారంభిస్తూ టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ తన ఇంగ్లీషు ప్రసంగపాఠాన్ని బాగా చదివారు. రామ్మోహన్నాయుడు హిందీలో, ఇంగ్లిష్‌లో ఆశువుగా మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు యువ పార్లమెంటేరియన్లకూ మంచి అవకాశం లభించడం తప్పిస్తే అవిశ్వాసతీర్మానం వల్ల రాష్ట్రానికి ఒరి గింది ఏమీలేదు. ఈ విషయం చంద్రబాబే అమరావతి మీడియా గోష్ఠిలో స్వయంగా అంగీకరించారు. పనిగట్టుకుని శనివారం ఇదే మాట చెప్పడానికి ఢిల్లీ వెళ్ళి కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీడియా గోష్ఠి నిర్వహించారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానాన్ని బలపర్చుతున్నట్టు జయదేవ్ చాలా పార్టీల పేర్లు చదివారు. ఆ పార్టీలన్నీ తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేసి ఉంటే 126 మాత్రమే పడేవి కాదు. ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా 325 ఓట్లు పడేవికావు. జయదేవ్ చదివిన పార్టీల జాబితా సైతం ‘జుమ్లా’నే అనుకోవాలి. 12 గంటల చర్చ తర్వాత ఏమి సాధించారంటే కొండను తవ్వి ఎలుకను సైతం పట్టలేక పోయారని చెప్పు కోవాలి. తక్కిన పార్టీ నాయకులు ఎవ్వరూ ప్రత్యేకహోదా గురించి ప్రస్తావిం చలేదు. ఏ పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఆ పార్టీకి ముఖ్యం. ప్రాంతీయ పార్టీల నాయకులు తమ ప్రాంతాలలోని రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడ వల్లనే అవిశ్వాసం అపహాస్యం పాలయింది. అన వసరంగా సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నామంటూ ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. ‘మా నాయకుడి చక్రానికి తుప్పు పట్టింది. చక్రం తిరగడం లేదు. పాచిక పారడం లేదు’ అని ఒక సీనియర్ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని స్వయంగా నరేంద్రమోదీనే లోక్ సభ సాక్షిగా చెప్పారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మర ల్చడానికే ఆ పార్టీ యూ–టర్న్ తీసుకొని ఎన్డీఏ నుంచి వైదొలిగి బీజేపీని విమ ర్శించడం ప్రారంభించిందని కూడా చెప్పారు. ఈ రెండు అంశాలకే ప్రధాని పరి మితమైనారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీపైన ఎంతోకొంత విమర్శ చేయకపోతే బాగుండదు కనుక ఈ రెండు మాటలూ అన్నారు. చంద్రబాబుపైన మోదీకి ఆగ్రహం లేదు. ఉంటే ఆయనకు తెలిసిన సమస్త సమాచారాన్ని విని యోగించుకొని ధ్వజమెత్తేవారు. ఓటుకు కోట్ల కేసు సంగతి ప్రధానికి జ్ఞాపకం లేకపోలేదు. పట్టిసీమలో అక్రమాల గురించి సమాచారం ఉంది. సింగపూర్ సంగ తులూ తెలుసు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి వ్యవహారాలు తెలుసుకోవడం కష్టం కాదు. టీడీపీ అధ్యక్షుడిని చులకన చేయడం ప్రధానికి ఇష్టం లేదు. చంద్రబాబును మోదీ ప్రత్యర్థిగా చూడటం లేదు. వైఎస్ఆర్సీపీ పట్ల తన వైఖరిని ప్రధాని దాచుకోలేదు. ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్ళుగా ఉద్య మిస్తున్న వైఎస్ఆర్సీపీ ‘ఉచ్చు’లో పడవద్దంటూ తాను చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ హెచ్చరించినట్టు ప్రధాని లోక్‌సభలో అన్నారు. 2014 ఫిబ్రవరిలో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ రాజ్యసభలో చేసిన ప్రత్యేకహోదా వాగ్దానం అమలు చేయాలంటూ డిమాండ్ చేయడాన్ని, దానికి అనుకూలంగా ప్రజాభిప్రా యాన్ని ప్రోది చేయడాన్ని ‘ఉచ్చు’గా అభివర్ణించడంలో ప్రధాని అసహనం స్పష్టం అవుతోంది. టీడీపీకి ఫిరాయించిన ముగ్గురు ఎంపీలపైన అనర్హత వేటు వేయాలని నోటీసు ఇచ్చి ఏళ్ళూపూళ్ళూ గడిచినా ప్రధాని కానీ, లోక్‌సభ స్పీకర్ కానీ స్పందించలేదు. 22 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలను టీడీపీ కొనుగోలు చేసినా, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టినా ప్రధాని ఆక్షేపించలేదు. మొత్తం మీద టీడీపీ పట్ల ఆపేక్ష, వైఎస్ఆర్సీపీ పట్ల ఉపేక్ష స్పష్టంగా కనిపి స్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు (కేసీఆర్) అభివృద్ధిపైన దృష్టి కేంద్రీకరిస్తే, చంద్రబాబు ఇతర విష యాలపైన దృష్టి పెట్టారని వ్యాఖ్యానించడం ద్వారా మిత్రుడిని ఎత్తిపొడవడమే కానీ గాయపరచాలనే సంకల్పం లేదు. అంతకుముందు దేశీయాంగ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బీజేపీ, టీడీపీ మైత్రీబంధం ఎంతబలమైనదో నొక్కి వక్కాణిం చారు. ‘చంద్రబాబు నాయుడితో మాకు బలమైన అనుబంధం గతంలో ఉంది. ఇప్పుడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది. ఆ బంధాన్ని తెంచడం ఎవ్వరివల్లా కాదు,’ అంటూ ఆయన ఉద్ఘాటించారు. వాస్తవానికి రాజ్‌నాథ్‌సింగ్‌కి మర్మం తెలియదు. ఆయన తన మనసులో ఉన్నమాట నిస్సంకోచంగా చెబుతారు. ప్రత్యేకహోదా నిజంగా సాధించాలని అనుకుంటే మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి సత్యాగ్రహం చేయడం రాజమార్గం. రాజకీయ పోరాటాలలో రాజీనామాను ఆయుధంగా వినియోగించే ఆనవాయితీ మనకు ఉన్నది. తమ ఎంపీల చేత రాజీనామా చేయించి కేంద్రంపైన ఒత్తిడి పెంచకపోగా రాజీనామా చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలను తప్పుపట్టడం కేవలం అదరగండపు రాజకీయం. తాను లాలూచీ పడుతూ ఎదుటివారు లాలూచీ పడుతున్నట్టు ఆరోపించడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రత్యేకత. వైఎస్ఆర్సీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన నోటీసును అనుమతించకపోవడంలో, టీడీపీ నోటీసును వెంటనే అనుమతించడంలోనూ బీజేపీ, టీడీపీ లాలూచీ స్పష్టంగా కనిపిస్తున్నది. జయదేవ్ ప్రసంగంలో కొత్త అంశం ఏముంది? అవిశ్వాసతీర్మానంపై చర్చ ప్రారంభిస్తూ గల్లా జయదేవ్ ఏమైనా కొత్త విషయం చెప్పారా? నాలుగేళ్ళుగా ధర్నాలలోనూ, బంద్లలోనూ, రాస్తారోకోలలోనూ, యువభేరి సభలలోనూ, శాసనసభ సమావేశాలలోనూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పదేపదే చెప్పిన అంశాలనే జయదేవ్ లోక్‌సభలో చదివి విని పించారు. 14వ ఆర్థిక కమిషన్ ప్రత్యేకహోదాను వద్దనలేదంటూ ఆర్థిక కమిషన్ సభ్యుడు రాసిన లేఖను జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపించినప్పుడు అధికార పక్షం అహంకారంతో పెడచెవిన పెట్టింది. ప్రత్యేకహోదా మంజూరు చేయాలంటూ కేంద్ర సర్కార్‌ను కోరుతూ శాసనసభ రెండోసారి తీర్మానం చేసినప్పుడే ప్రతిపక్ష నాయకుడు కేంద్రానికి ఒక నెల రోజులు గడువు ఇవ్వాలనీ, గడువులోగా ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఉద్యమం బాట పట్టాలనీ, అన్ని పార్టీలూ కలసికట్టుగా పోరాడాలనీ, టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలగాలనీ ఉద్ఘా టించారు. 2017 మే నెలలో ప్రధానిని కలుసుకున్నప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వా లంటూ జగన్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు సంవత్సరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేకహోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినప్పుడు అదే రోజు పొద్దుపోయిన తర్వాత అమరావతితో మీడియా గోష్ఠి నిర్వహించి చంద్ర బాబు నాయుడు ప్యాకేజీని ఆహ్వానించారు. అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడికీ, ఆర్థికమంత్రికీ శాలువలు కప్పి సన్మానించారు. ప్రధానికి ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారు. అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ సాధించిందంటూ గొప్పలు చెప్పుకున్నారు. జైట్లీ ప్రకటన చేసిన వెంటనే జగన్ మోహన్‌రెడ్డి ప్యాకేజీని తిరస్కరించమంటూ చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఆ సలహా పాటించకపోగా అడ్డంగా వాదించారు. ప్రత్యేకహోదా సంజీ విని కాదనీ, పదేళ్ళ కిందట ఆ హోదా లభించిన రాష్ట్రాలలో అభివృద్ధి ఏమీ జరగలేదనీ చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదా ప్రాణప్రదమైనదనీ, అది ఆంధ్రుల శ్వాస అనీ ప్రజలలో బలంగా నాటుకున్న తర్వాత బీజేపీతో మంతనాలు జరిపి ‘జుమ్లా’ తిరుగుబాటుకు తెరదీశారు. బీజేపీ–టీడీపీ అవగాహనలో భాగంగానే ఎన్డీఏ నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులను ఉపసంహరించుకోవడం. రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులు టీడీపీ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తూ ఉంటారు కానీ జాతీయ నాయకత్వంతో టీడీపీ అధినేతకి సత్సంబంధాలే ఉంటాయి. ముఖ్యమంత్రికీ, ప్రధానికీ చేసిన విజ్ఞప్తుల వల్ల ఫలితం లేకపోవడం, ధర్నాలలో, రాస్తారోకోలలో, బంద్‌లలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ, వామపక్షాలూ, ఇతర సంస్థల కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి జైళ్ళలో పెట్టడం, లాఠీచార్జీలు చేయించడంతో విసిగిన వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీ నామాస్త్రాన్ని ప్రయోగించింది. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిరసన వెలిబుచ్చడానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారనీ, పార్లమెంటు నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ భవన్‌కు వెళ్ళి అక్కడ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటారనీ వైఎస్ జగన్ మే 31న పాదయాత్రలోనే ప్రకటించారు. మొత్తం 25మంది ఎంపీలు రాజీనామా చేసి నిరశనదీక్ష చేస్తే కేంద్రం దిగివస్తుందని అప్పుడే చెప్పారు. ఆ తర్వాత అనేకసార్లు అదే ఉద్బోధ చేశారు. శనివారంనాడు కూడా ఆ మాటే అన్నారు. కేంద్రంపైన ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం (జూలై 24న) రాష్ట్ర బంద్ పాటించాలని పిలుపు ఇచ్చారు. టీడీపీ ఏమి చేసింది? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు మాసాలపాటు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికాసంఘాన్ని ప్రత్యేక హోదా గురించి అడగలేదు. కానీ, ప్రత్యేక హోదా కావాలంటూ అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేయించారు. తర్వాత అరుణ్ జైట్లీతో సమాలోచనలు జరిపి హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు. ప్రత్యేక ప్యాకేజీని సాధించడమే గొప్ప రాజకీయ విజయంగా చాటుకున్నారు. ప్రత్యేక హోదా అవసరం ప్రజలు గ్రహించారని తెలుసుకొని బీజేపీతో విభేదించినట్టూ, తిరుగుబాటు చేసినట్టూ ఇప్పుడు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కర్ర విరగకుండా పాము చావకుండా విన్యాసాలు చేస్తున్నారు. ప్రత్యేకహోదాను అమలు చేయకపోవడంలో బీజేపీ, టీడీపీల జమిలి మోసం ఉన్నదని ప్రజలు గ్రహించారు. నాలుగేళ్ళుగా అంటకాగుతూ వీరు సాగించిన నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అవిశ్వాసతీర్మానం పెట్టామని తెలుగుదేశం ప్రభుత్వం చాటుకుంటుంది. అది వీగిపోయింది కనుక ఇకమీదట హోదా ప్రస్తావన తీసుకొని రావద్దంటూ బీజేపీ వాదిస్తుంది. ఈ విన్యాసాల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదు. ఏదేమైనా అవిశ్వాస తీర్మానంతో ఒక్క విషయం మాత్రం నిగ్గు తేలింది. రాబోయే ఎన్నికల తర్వాత టీడీపీ, టీఆర్ఎస్లు బీజేపీకి మద్ద తుగా నిలుస్తాయని జాతీయ చానళ్ళలో వివిధ పార్టీల ప్రవక్తలు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. కె. రామచంద్రమూర్తి -
గుర్రం ఎగరావచ్చు!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కలల బేహారి. నిత్య స్వాప్నికుడు. ఇది ముమ్మాటికీ ఆరోగ్యకరమైన లక్షణం. ఏ రంగంలో ఉన్నవారైనా సరే అందరూ కలలు కనాలి. వాటి సాకారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భవించి 17 సంవత్సరాలైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్లీనరీలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ స్వప్నం గురించి మరోసారి ఉద్వేగంగా మాట్లాడారు. దేశ రాజకీయాలలో క్రియాశీలమైన పాత్ర పోషిస్తాననీ, హైదరాబాద్ నుంచే భూకంపం సృష్టిస్తాననీ స్పష్టంగా ప్రకటించారు. భారత ఆత్మగౌరవ బావుటా ఎగరేస్తానని ఎలుగెత్తి చాటారు. మంచిదే. ఒక లక్ష్యం సాధించిన విజేత వెంటనే అంతకంటే పెద్ద లక్ష్యం పెట్టుకోవడం సహజం. అసాధ్యమని చాలామంది భావించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రానికి సారథ్యం వహించిన రాజకీయ నేతకు తదుపరి లక్ష్యం దేశ రాజకీయాలపైన ప్రభావం వేయడం కావడంలో ఆశ్చర్యం లేదు. 35 సంవ త్సరాల కిందట నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సాధించిన ఘనకార్యాన్ని తానూ సాధించగలననే ఆత్మవిశ్వాసం కేసీఆర్‌కి ఉండవచ్చు. కేసీఆర్ రాజకీయ చాతుర్యం, ఎత్తుగడల విషయంలో సందేహం లేదు. కానీ కల సాకారం కావడానికి పరిస్థితులు కలిసి రావాలి. అదృష్టం కూడా అవసరం. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే మహాసేనాని. సైన్య నిర్మాణంలో, రణతంత్ర రచనలో దిట్ట. ఒకానొక సమయంలో సైన్యంలో కీలకమైన స్థానంలో ఒక అధికారిని నియమించవలసిన అవసరం ఏర్పడింది. సలహాదారులు చాలామంది అభ్యర్థులను పరీక్షించి ఒక యోధుడిని ఎంపిక చేశారు. నెపో లియన్ ఆమోదం కోరారు. పోరాట పటిమ లేదా మనోబలం లేదా గతంలో అతగాడు సాధించిన విజయాల గురించి నెపోలియన్ ప్రశ్నించలేదు. ‘అతనికి అదృష్టం కలసి వస్తుందా (ఐటజ్ఛి luఛిజుy)?,’ అని ప్రశ్నించాడట. యుద్ధాలలో విజయం సాధించాలంటే పరాక్రమం ఒక్కటే చాలదు. అదృష్టం విధిగా ఉండా లని నెపోలియన్ అభిప్రాయం. రాజకీయాలలోనూ అంతే. మర్రి చెన్నారెడ్డికి లేని అదృష్టం కేసీఆర్‌కి కలిసి వచ్చింది. జయాపజయాలు జయాపజయాలను యోధులు విశ్లేషించుకోవాలి. గుణపాఠాలు నేర్చుకోవాలి. అపజయాలకు దారితీసిన కారణాలను తెలుసుకోవడం సులువే. విజయాలను అర్థం చేసుకోవడమే కష్టం. చాలా మంది రాజకీయ నాయకులు గెలుపును అపార్థం చేసుకొని అంతా తమ ఘనతే అనుకొని అహంకారం పెంచుకొని దెబ్బ తింటారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ను సాధ్యం చేసిన పరిస్థితులనూ, తెలం గాణ రాష్ట్ర పాలనలో కొన్ని సత్ఫలితాలను సాధించడానికి సహకరించిన అంశాలనూ జాగ్రత్తగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రధాన పాత్రను ఎవ్వరూ ప్రశ్నించలేరు. ఇతర ఉద్యమ నాయ కుల పాత్ర, ప్రజల ఉద్యమస్ఫూర్తి నిశ్చయంగా తోడైనాయి. ఉద్యమ కాలంలో వివిధ ఘట్టాలలో రకరకాల వ్యక్తులు ఆయనకు సలహాలు ఇచ్చి ఉండవచ్చు. ఏ సలహా స్వీకరించాలో, దేన్ని తిరస్కరించాలో నిర్ణయించుకోవలసిందీ, దాని మంచిచెడులకు బాధ్యత వహించవలసిందీ నాయకుడే కనుక ఖ్యాతీ, అపఖ్యాతీ సైతం ఆయనకే చెందుతాయి. అంతిమ విజయం సాధించిన నేతగా కేసీఆర్‌కు కీర్తి దక్కింది. అధికారం కూడా ఆయన సొంతమే అయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు అనేకం జరిగాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం ఉవ్వెత్తున లేచి పడిన తరంగం. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అప్పటి తెలంగాణలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలలోనూ తెలంగాణ ప్రజా సమితి 10 స్థానాలు గెలుచుకున్నది. ఆ పార్టీ అదే సంవత్సరం సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. తర్వాత రెండు సంవత్సరాలు తిరగ కుండానే ‘జైఆంధ్ర’ ఉద్యమం ఎగిసిపడింది. అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ రాష్ట్ర విభజనకు ససేమిరా అన్నారు. ఉద్యమ నాయకులతో సమా లోచనలు జరిపి వారి రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చారు. ముఖ్యమంత్రులకు ఉద్వాసన చెప్పారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సుదీ ర్ఘంగా జరిగింది. ఇందిరాగాంధీకి ఉన్నన్ని పట్టింపులు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేవు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదన పట్ల సీమాంధ్ర ప్రజలకు ఏ మాత్రం అభ్యంతరం లేదంటూ అప్పటి ప్రతిపక్ష నాయ కుడు నారా చంద్రబాబునాయుడు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాయకపోతే 2009 డిసెంబర్ 9న నాటి హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించేవారు కాదు. నిర్ణాయక స్థానంలో సోనియాగాంధీ ఉండటం, ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే ప్రత్యర్థులకు నష్టం, తన పార్టీకి ప్రయోజనం కలుగుతుందని ఆమెను సలహాదారులు నమ్మించడం, వందలమంది యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఆత్మహత్య చేసు కోవడం, చిన్న రాష్ట్రాలపట్ల పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీకి సాను కూలమైన అభిప్రాయం ఉండటంతో సహా అనేక కారణాలు రాష్ట్ర విభజనకు దారి తీశాయి. ఈ వాస్తవాలన్నిటినీ క్షుణ్ణంగా, వస్తునిష్టంగా అధ్యయనం చేసి కార్యకారణ సంబంధం అర్థం చేసుకోవాలి. నేల విడిచి సాము తెలంగాణలో పరిపాలనపై ఎవరి అభిప్రాయం వారికి ఉన్నది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పాలన కంటే మెరుగనేవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. చెప్పినవన్నీ చేయలేకపోతున్నారు. కొన్నిటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జరుగుతున్న మంచి పనులన్నిటినీ తన ఖాతాలో వేసుకొని, వెనుకబాటుతనా నికీ, రైతుల ఆత్మహత్యలకూ, నిరుద్యోగ సమస్యకూ బీజేపీనీ, కాంగ్రెస్ ప్రభు త్వాలను నిందించడం రాజకీయంగా అవసరం కావచ్చు. ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇవ్వక ముందే దాని ఫలం రైతులు అనుభవిస్తున్నట్టు, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకముందే వేల ఎకరాలకు నీరు అంది స్తున్నట్టు భావించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏమిటి? మున్ముందు రైతు ఆత్మహత్యలు ఆగిపోవచ్చునేమో. కోటి ఎకరాల భూమికి సాగునీరు అందు తుందేమో. ప్రస్తుతానికైతే అవి లక్ష్యాలే. ఆకాంక్షలే. వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. అంతే కానీ తెలంగాణ రాష్ట్రంలో చేయవలసింది అంతా చేసేశాం. కనుక ఇక జాతీయ రాజకీయాలపైన దృష్టి పెడతాం అంటే కుద రదు. తమ అనుభవానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, పత్రికలు ఏమి రాసినా, టీవీ చానళ్ళు ఏమి చూపించినా ప్రజలు విశ్వసించరు. వారికి స్వీయానుభవం ప్రధానం. నేతలు నేల విడిచి సాము చేయకూడదు. ప్రస్తుతం కేసీఆర్‌ను నడిపిస్తున్న స్వప్నం ఫెడరల్ ఫ్రంట్. ఇది మహా జటిలమైనది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవ్యంగా ఉన్నట్లయితే, సుపరిపాలన అందించి, ఎన్నికల వాగ్దానాలను అమలు చేసి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఉన్నట్లయితే దేశంలో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు విషయంలో ఆయనే చొరవ తీసుకునేవారు. కానీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రికి ఊపిరి సలపనీయడం లేదు. నిద్ర పోనీయడం లేదు. చంద్రబాబు సందర్భశుద్ధీ, సమయజ్ఞతా, నిగ్రహం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. స్వవచోఘాతం నిత్యకృత్యంగా మారింది. ఏమీ లేకపోయినా ఏవేవో ఊహించుకొని ప్రజలే తనను రక్షించాలంటూ మాట్లాడు తున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయి బీజేపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వెలుపల రాజకీయం చేసే శక్తి ఆయనకు లేదు. అది కేసీఆర్‌కి కలసి వచ్చే మొదటి అంశం. దేశంలో నరేంద్ర మోదీ తర్వాత డొక్కశుద్ధి ఉండి, మూడు భాషలలో (హిందీ, ఇంగ్లిష్, తెలుగు) ధాటిగా ఉపన్యసించే శక్తి, వాగ్దేవికటాక్షం ఉన్న నేత కేసీఆర్. తెలంగాణలో తాను కొన్ని రోజులు లేకపోయినా పరిపాలనకు ఢోకా ఉండదు. కుమారుడు తారకరామారావు, మేనల్లుడు హరీశ్‌రావు సమర్థులు. తనను సవాలు చేసే నాయకులు ఎవ్వరూ పార్టీలో లేరు. అయినప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంటూ కథ నడిపిస్తానని కేసీఆర్ అంటున్నారు. ఎందరినో ఊరిస్తున్న ప్రధాని పదవి నేడు ఉదయం కేసీఆర్ చెన్నై వెళ్ళి డీఎంకే నేత కరుణానిధితో, ఆయన కుమా రుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో సమాలోచనలు జరుపుతారు. ఇటీవల లక్నోలో సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాదవ్‌ని కేటీఆర్ కలుసుకున్నారు. అఖిలేశ్ కేసీఆర్‌తో చర్చలు జరిపేందుకు మే 2న హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. మే మొదటి వారంలోనే భువనేశ్వర్ సందర్శించి ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ వేయబోతున్నారు. కాంగ్రెస్ లేని భారతదేశం (కాంగ్రెస్ ముక్త్ భారత్) అంటూ మోదీ నినదిస్తే, కాంగ్రెస్, బీజేపీ లేని భారతదేశం అన్నది కేసీఆర్ నినాదం. ఒక వేళ బీజేపీ, కాంగ్రెస్ మినహా అన్ని ప్రతిపక్షాలకూ కలిపి 293 స్థానాలు దక్కినా అవన్నీ ఒకే తాటిపైకి రావడం, సమైక్యంగా వ్యవహరించడం, ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించడం చాలా కష్టం. చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఫెడరల్ ఫ్రంట్‌లో డీఎంకే ఉంటే ఏఐఏ డీఎంకే బీజేపీతో ఉంటుంది. కేసీఆర్ నిర్మించే ఫ్రంట్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఉంటే సీపీఎం కాంగ్రెస్‌తో ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మూడు మాసాల కిందటే చైన్నై వెళ్ళి స్టాలిన్‌తో సమాలోచన జరిపారు. అఖిలేశ్‌తోనూ, మాయావతితోనూ మాట్లాడారు. ఢిల్లీలో శరద్ పవార్‌నూ, సోనియాగాంధీనీ, ఇతర ప్రతిపక్ష నేతలనూ కలుసుకున్నారు. ఆమెది కాంగ్రెస్ సహిత ఫ్రంట్. కేసీఆర్‌ది బీజేపీ, కాంగ్రెస్ ర హిత ఫ్రంట్. ఈ రెండు ఫ్రంట్లలో ఏది నిలుస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. లెక్కలు వేసి చూస్తే మమత ప్రతిపాదించే ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతో కొంత కనిపిస్తుంది. ఆమె కలలు ఆమెకు ఉన్నాయి. శరద్ పవార్ ఎన్నో సంవత్సరాలుగా ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ములాయంసింగ్ ప్రధాని పదవి కోసమే కొడుకుని లక్నో సింహాసనంపైన 2012లోనే కూర్చోబెట్టారు. జయలలితకి ప్రధాని కావా లనే ఆకాంక్ష బలంగా ఉండేది. అత్యున్నత పదవి తన జన్మహక్కు అని రాహుల్‌గాంధీ అనుకుంటారు. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌ల భాగస్వామ్యం లేకుండా, బయటి నుంచి సైతం వాటి మద్దతు లేకుండా కేవలం ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మరోసారి కేసీఆర్‌కి దక్కుతుంది. అటువంటి ప్రభుత్వానికి సారథి కేసీఆర్ అయినా ఆశ్చర్యం లేదు. రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ తెరమీదికి వస్తారనీ, ప్రభం జనం సృష్టిస్తారనీ, అట్టహాసంగా అధికారంలోకి వస్తారనీ 2013 సెప్టెంబర్ 13వ తేదీకి పూర్వం ఎవరైనా ఊహించారా? మొరార్జీ దేశాయ్, చరణ్‌సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, గుజ్రాల్ వంటి నాయకులందరూ అనూహ్యమైన పరిస్థితులలో ప్రధానులైనవారే. అటువంటప్పుడు కేసీఆర్ ఈ దేశం ముఖియా కావడం పట్ల అభ్యంతరం ఎందుకుండాలి? లక్కు ఉంటే లక్షణంగా కావచ్చు. ఆ పదవిలో ఎంత కాలం ఉంటారన్నది ఫెడరల్ ఫ్రంట్ భాగస్వాముల ప్రయో జనాలపైనా, నాయకుల అహంభావంపైనా ఆధారపడి ఉంటుంది. దిల్లీ బహుత్ దూర్ హై! కె. రామచంద్రమూర్తి -
జల్లికట్టు కనికట్టు
త్రికాలమ్ తమిళనాడు గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు జల్లికట్టు సుగ్రీవాజ్ఞ (ఆర్డినెన్స్) ముసాయిదాను ఆమోదించడంతో సముద్రతీరంలో అలజడి సద్దుమణిగింది. చెన్నై మెరీనా బీచ్ నిరసనధ్వనులతో హోరెత్తడానికీ, యువజనంతో పోటెత్తడానికీ కారణం ఏమిటి? ఈ తిరుగుబాటుకు కారకులు ఎవరు? తప్పు ఎవరిది? అమలు సాధ్యం కాని తీర్పు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానానిదా? వాటిని అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వానిదా? కోర్టు ఆదేశాలను ధిక్కరించిన ప్రజలదా? ఈ ఉదంతం నుంచి నేర్చుకోవలసిన గుణపాఠాలు ఏమిటి? సముద్రతీరంలో ఉద్యమించిన వారిలో అత్యధికులు జల్లికట్టు క్రీడను చూసి ఉండరు. ఎడ్లను తాకి ఉండరు. సోషల్ మీడియా విశ్వరూపం ఉద్యమకారులలో రైతులు తక్కువ. కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న యువతీ యువకులు ఎక్కువ. సాఫ్ట్వేర్ ఉద్యోగులూ ఉన్నారు. నినాదాలు చేయడం, ధిక్కారస్వరం వినిపించడం కనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద ప్రదర్శనలు లేవు. మెరీనాలో యువతరం సంబరం చేసుకున్నట్టు దృశ్యాలు సూచించాయి. యువ శక్తి కొట్టవచ్చినట్టు కనిపించింది. రాజకీయ నాయకులను దగ్గరికి రానీయ లేదు. సినీ తారలనూ దూరంగానే పెట్టారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తు న్నామంటూ యువతీయువకులు ఎవ్వరి నుంచీ సహాయం స్వీకరించలేదు. మదురై నుంచీ, కోయంబత్తూరు నుంచీ, ఇతర దూరప్రాంతాలనుంచీ వచ్చిన వారి కోసం భోజన ఏర్పాట్లు చేయడానికి కొందరు ముందుకు వచ్చారు. ఆత్మ గౌరవం ఉద్యమం చేస్తున్నవాళ్ళం ఇతరుల సాయం స్వీకరించలేమంటూ వారు తేల్చి చెప్పారు. ఇది సోషల్ మీడియా శక్తిని చాటిన ఉద్యమం. కేవలం సోషల్ మీడియా సందేశాలతో, పురమాయింపులతో ప్రేరణ పొంది చదువు లకూ, వ్యాపారాలకూ విరామం ప్రకటించి, ఉద్యోగాలకు సెలవు పెట్టి వేలాది మంది ఉద్యమంలో చేరారు. శాంతియుతంగా ప్రదర్శనలు జరిపారు. ఇది కేవలం జల్లికట్టు ఆటమీద మోజుతోనో, సంస్కృతీ సంప్రదాయాలపట్ల మక్కువతోనో జరిగిన పోరాటం మాత్రమే కాదు. తమ సంస్కృతినీ, సంప్ర దాయాలనూ, ప్రయోజనాలనూ, ఆత్మగౌరవాన్నీ దెబ్బతీసే చర్యలను సహించేది లేదంటూ తమిళులు మరోసారి తెగేసి చెప్పిన సందర్భం. 1930ల నుంచి 1960ల వరకూ సాగిన హిందీ వ్యతిరేక ఉద్యమంతో దీన్ని పోల్చవచ్చు. తమి ళులు హిందీ భాషకి వ్యతిరేకం కాదు. హిందీని తమపైన రుద్దడానికి వ్యతిరేకం. దక్షిణ భారత హిందీ ప్రచారసభ కేంద్ర కార్యాలయం చైన్నైలోనే ఉంది. చాలా మంది తమిళులు హిందీ నేర్చుకున్నారు. హిందీని విధిగా నేర్చుకోవాలని 1940 లలో రాజగోపాలాచారి నిర్ణయించినప్పుడూ, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు అదే విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడూ ప్రజలు వ్యతిరేకిం చారు. 1964లో హిందీని అధికార భాషగా ప్రకటించినప్పుడు తిరుగుబాటు తారస్థాయికి చేరింది. హిందీని రుద్దడాన్ని చాలా రాష్ట్రాలు వ్యతిరేకించినప్పటికీ అత్యంత ఉధృతంగా, హింసాత్మకంగా ఉద్యమం జరిగింది మద్రాసు రాష్ట్రం లోనే. ఇద్దరు విద్యార్థులు ఆత్మాహుతి చేసుకుంటే చలించిన నాటి ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తమిళ రాజ కీయాలలో తిరుగుబాటు స్వభావం ఆద్యంతం కనిపిస్తుంది. నాయకులకు పాద నమస్కారాలు చేసే దృశ్యాలూ ఆ రాష్ట్రంలోనే కనిపిస్తాయి. ఇది విచిత్రం. జస్టిస్ పార్టీ పుట్టుక, ఆత్మగౌరవ, అస్తిత్వ ఉద్యమాలు, ద్రవిడ ఉద్యమం, హిందీ పట్ల వ్యతిరేకత, ఉత్తరాది పట్ల అసమ్మతి, కేంద్రం ఆధిపత్యాన్ని సహించని నైజం, బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం–అన్నీ ఉద్వేగభరితంగా, ఉధృతంగా సాగినవే. గుండెల్లో గుబులు ఇప్పుడు తమిళనాడులో ఒకటిన్నర శతాబ్దంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని కరవు కరాళనృత్యం చేస్తోంది. కావేరీ జలాలు విడుదల చేయడానికి కర్ణాటక పేచీ పెట్టడం, ముళ్ళపెరియార్ డ్యాంను నియంత్రిస్తామంటూ కేరళ ప్రభుత్వం హెచ్చరించడం, శ్రీలంకలో తమిళులు వేల సంఖ్యలో బలైన అనంతరం కూడా వివక్షకు గురి అవుతుంటే సింహళీయుల పార్టీతో కేంద్ర ప్రభుత్వాలు స్నేహం చేయడం తమ ఆత్మగౌరవానికి భంగం కలిగినట్టు తమిళులు భావిస్తున్నారు. 1991లో రాజీవ్ హంతకులకు తమిళనాడులో మద్దతు లభించడానికి కారణం కూడా ఈ భావనే. తమిళ ప్రయోజనాల విషయంలో, స్వయం నిర్ణయాధికారాల విషయంలో ఏ మాత్రం రాజీపడని జయలలిత మరణించడం, కరుణానిధి వయోభారంతో పగ్గాలు కుమారుడు స్టాలిన్‌కు అప్పగించడంతో తమిళులలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడినట్టుంది. గుండెల్లో గుబులు పుట్టింది. తమిళుల ఆవేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ అర్థం చేసుకున్నారు. మతం పేరుతో జాతీయతాభావాన్ని ఉద్దీపింపజేయడంలో సిద్ధహస్తులైనవారికి సాంస్కృతిక ఉద్యమస్ఫూర్తి అత్యంత శక్తిమంతమైనదని తెలుసు. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వినతిని మోదీ వెంటనే ఆమోదించారు. తీర్పును పునఃపరిశీలించవలసిందిగా సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించింది. సుప్రీంకోర్టు సైతం భేషజాలకి పోకుండా వారం రోజులు గడువు మంజూరు చేసింది. జల్లికట్టు క్రీడను కొనసాగించడానికి అనుమతిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్రం ఏకీభవించింది. ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. అన్ని ఆమోదాలూ, అనుమతులూ చకచకా రావడానికి కారణం తమిళ పౌరుషంపైన బాధ్యులందరిలోనూ ఉన్న అవగాహన. స్వయంనిర్ణయాధికారాల కోసం సాగిన ద్రవిడ ఉద్యమం సమసిపోయినప్పటికీ సాంస్కృతిక అస్తిత్వ భావనలు బలం గానే ఉన్నాయి. తమిళ ప్రజలు దేశంపట్ల జాతీయభావన కంటే తమ ప్రాంతం పట్ల నిబద్ధతను ఎక్కువగా ప్రదర్శిస్తారని ఆదం జీగ్‌ఫెల్డ్ 2004 సార్వత్రిక ఎన్ని కల తీరుతెన్నులను పరిశోధించి రాసిన ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్’ తీర్మానించింది. ఈ రచయిత నిర్వహించిన సర్వేలో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తమిళులలో 90 శాతంమంది దేశం కంటే తమిళనాడు పట్లనే ప్రథమ విధేయత కలిగి ఉంటామని స్పష్టం చేశారు. తమ ప్రాంతం తర్వాతనే దేశం అన్నది వారి వాదన. అమెరికా ఫస్ట్ అంటూ శుక్రవారం 45వ అధ్యక్షుడుగా ప్రమాణం స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ అమెరికా కంటే కాలి ఫోర్నియా ప్రధానం అనే ప్రజలు ఉన్నారు. సమాఖ్య స్ఫూర్తికి అది విరుద్ధం కాదు. 1950 దశకం ఆరంభంలో అవిభక్త మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవా లంటూ ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం తెలుగువారు చేసిన ఉద్యమం ఉధృతికి జవహర్లాల్ నెహ్రూ దిగివచ్చారు. ప్రాంతీయభావన ఎంత బలీయమైనదో ఇటీవల ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన ఉద్యమం నిరూపించింది. తమిళులు కానీ ఆంధ్రులు కానీ తెలంగాణ ప్రజలు కానీ దేశాన్ని వ్యతిరేకించడం లేదు. తాము భారతీయులమని సగర్వంగా చెప్పుకుంటారు. కానీ వారి ప్రాంతీయ అస్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తమ ప్రాంతాన్ని పరాయి పాలకులు ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలించినా అయిదు వేల సంవత్సరాలుగా వారి సంస్కృతీసంప్రదాయాలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వచ్చాయని తమిళులు గర్వంగా చెప్పుకుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల, అన్ని జాతుల, అన్ని భాషల సంగతీ అంతే. అదే భారతీయత. హింసాత్మక క్రీడ ప్రతి ఏటా జనవరి మాసంలో నాలుగు రోజులు జరుపుకునే సంక్రాంతి వేడుక లలో భాగం జల్లికట్టు. ఇది ప్రధానంగా మదురై, కోయంబత్తూరులో జరుపుకునే క్రీడ. ముందు వ్యవసాయం ఫలప్రదం కావడానికి దోహదం చేసిన ఎడ్లకు కృత జ్ఞతలు చెబుతూ వాటిని ఆలింగనం చేసుకునే వేడుకగా మొదలై, ఎడ్ల మధ్య పోటీగా మారి, అనంతరం పశువుకీ, మనిషికీ మధ్య పోటీగా రూపాంతరం చెందింది. పాత రోజులలో ఎద్దు కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి ఎద్దును ధైర్యంగా ఎదిరించి కొమ్ములు వంచి వాటిని తీసుకున్నవారిని ధీరులుగా గుర్తించేవారు. ఎద్దును ఓడించి ఆధిక్యం చాటుకోవడంగా మారింది. 1960లలో శివాజీగణేశన్ ఎద్దును లొంగదీసుకునే గ్రామీణ యువకుడుగా నటించిన సినిమా ఈ క్రీడపైన మోజు పెంచింది. ఎద్దును రెచ్చగొట్టడం, హింసించడం ఎక్కువైంది. జంతువులనూ, పశువులనూ ప్రేమించేవారు హింసాత్మకమైన ఈ క్రీడను నిషేధించాలంటూ కోర్టుకు వెళ్ళారు. 2014 మే 7న జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించింది. ఆ తర్వాత రెండేళ్లు కొన్ని మార్పులతో జల్లికట్టు వంటి క్రీడను అనుమతిస్తూ కేంద్ర అడవులూ, పర్యావరణ శాఖలు ప్రకటన జారీ చేశాయి. దీన్ని పశుసంక్షేమ మండలి, పశువులనూ, జంతువులనూ మానవీ యంగా చూసుకోవాలని కోరుకునే సంస్థ–పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) వ్యతిరేకించాయి. 2016 జనవరి 16న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రకటనపైన ‘స్టే' ఇచ్చింది. ‘కావాలంటే కంప్యూటర్లో ఎద్దు లతో కుస్తీ పట్టే ఆటలు ఆడుకోండి. ఎద్దులను హింసించడం ఎందుకు?’ అంటూ కేసు విచారణ దశలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. కేంద్రంపై పోరాటం సుప్రీంకోర్టు వైఖరికి నిరసనగా విద్యార్థులు ఉద్యమం ప్రారంభించారు. కళాశా లల నుంచి నేరుగా మెరీనా బీచ్‌కు చేరుకున్నారు. జల్లికట్టును అనుమతించాల న్నది ఒక్కటే వారి డిమాండ్. భూసేకరణ ఆర్డినెన్స్‌ను ఐదుసార్లు జారీ చేయిం చిన ప్రధాని మోదీకి జల్లికట్టును అనుమతిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడానికి అభ్యంతరం ఏమిటంటూ ప్రశ్నించారు. ఒక రోజు పోలీసులు హడావిడి చేశారు. స్టాలిన్ నాయకత్వంలో డిఎంకె కార్యకర్తలు వీధులలో ప్రదర్శనలు నిర్వహిం చారు. రైల్‌రోకో చేశారు. బంద్ పాటించారు. కాంగ్రెస్ సైతం సంఘీభావం ప్రక టించింది. కమల్‌హాసన్, రజనీకాంత్, ధనుష్, రెహ్మాన్, ఖుష్బూ వంటి సినీ ప్రముఖులు, దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ సంఘీభావం ప్రకటించడంతో ఉద్యమం ఊపందుకున్నది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు క్లాసులకు ఎగనామం పెట్టి మెరీనా బీచ్‌కు వెళ్ళడానికి అనుమతులు ఉన్నాయి. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వ్యతిరేకులు ఈ ఉద్యమం వెనక ఉన్నారంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మోదీని వ్యతిరేకించేవారి మద్దతు ఉన్న దని చెప్పేవారు కొందరు. జల్లికట్టుకు దళితులు దూరం ఈ క్రీడలో పాల్గొనడానికి దళితులు ప్రయత్నించిన ప్రాంతాలలో ఆటనే ఆపి వేసిన వైనాన్ని దళిత నాయకులు గుర్తు చేస్తున్నారు. దళితులు పెంచిన ఎద్దులను ఈ క్రీడలో పాల్గొనడానికి సంపన్న, ఆధిక్య కులాలు అనుమతించవు. ఫేస్బుక్ పోస్టింగ్‌లలోనూ దళిత వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ జల్లికట్టు కావా లని కోరుకునేవారికి సంఖ్యాబలం ఉంది. ప్రజలను సమీకరించే వ్యవస్థ ఉంది. జల్లికట్టు వ్యవహారంలో లబ్ధిపొందాలని కోరుకునే రాజకీయ పార్టీలు ఉన్నాయి. పన్నీర్‌సెల్వం సమయజ్ఞత ప్రదర్శించి ఢిల్లీ వెళ్ళి పరిస్థితి వివరించి ప్రధాని మద్దతు సంపాదించగలిగారు. శశికళ ముఖ్యమంత్రి కావడం మోదీకి ఇష్టం లేదనే అభిప్రాయం ఉంది. పన్నీర్‌సెల్వం బలహీనపడకుండా ప్రధాని చర్యలు తీసుకున్నారు. రాష్ట్రపతిని, సర్వోన్నత న్యాయస్థానాన్ని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం చేత ఆర్డినెన్స్ జారీ చేయించడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో న్యాయస్థానాలను తప్పుపట్టడానికి లేదు. చట్టం ప్రకారం నిర్ణ యాలు ప్రకటించడం వాటి వి«ధ్యుక్తధర్మం. సవ్యంగా అమలు కానీ వరకట్న నిషేధం చట్టాన్నీ, అవినీతి నిరోధక చట్టాన్నీ అమలు చేయాలని కోరినట్టే తమిళ నాడులో జల్లికట్లు, ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ళపందాలూ, మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పందాలూ నిషేధించడం నాగరిక సమాజంలో అవసరమని కోర్టు భావించింది. జల్లికట్టు ఆడాలనుకునేవారు ఎడ్లను హింసించకుండా, దేశవాళీ పశుసంపద వృద్ధి కావడానికి వీలుగా ఈ క్రీడను మలచుకోవాలి. ఇందులోని పాశవికతను పరిహరించాలి. పశువులను హింసించడం అమానవీయమంటూ ప్రచారం చేయడం ద్వారా ఇటువంటి క్రీడలను సంస్కరించే ప్రయత్నం జంతు పేమికులు చేయాలి. సంప్రదాయలనూ, ఆచారాలనూ రక్షించుకుంటూనే మారుతున్న నాగ రికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. దేశంలో వర్థిల్లుతున్న వైవి ధ్యాన్ని గౌరవించడం దేశ సమైక్యతకీ, సమగ్రతకీ దోహదం చేస్తుంది. ఎవరు తెగే వరకూ లాగినా అందరూ నష్టపోతారు. బాధ్యతాయుతమైన స్థానాలలో ఉన్న వారు ఈ విషయంలో విజ్ఞత ప్రదర్శించడం అభినందనీయం. కె. రామచంద్రమూర్తి -
గొప్ప సంస్కరణకు గండి కొట్టకండి
త్రికాలమ్: ‘మీకు అక్కడ భూములు ఉన్నాయా? మీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదా?’ ‘లేదు. పిటిషనర్లు రైతులు కాదు. జర్నలిస్టులు’ ‘మరి మీకేం సంబంధం?’ ‘రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విదేశీ ప్రభుత్వాలతో, విదేశాలలోని ప్రైవేటు కంపెనీలతో సంబంధాలు పెట్టుకుంటున్నది. భారీ ఎత్తున అప్పులు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చు కుంటున్నది. ఇది రాజ్యాంగ విరుద్ధం’ ‘ఆ విషయం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది.’ ‘(ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో సారవంత మైన భూములను రైతుల నుంచి సేకరిస్తున్నది. కేంద్రం నియమించిన శివరామ కష్ణన్ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసింది.’ ‘మీరు మెట్టభూములు చూపించకపోయారా? రాజధాని నిర్మించడం మీకు ఇష్టం లేదా? భూములు కోల్పోయిన రైతులు వచ్చినప్పుడు చూద్దాం. మీ పిటి షన్లో పస లేదు. అందువల్ల కొట్టేస్తున్నాం’. ప్రముఖ సంపాదకుడు ఏబికే ప్రసాద్, ‘లీడర్’ పత్రిక సంపాదకుడు రమణ మూర్తి, జర్నలిస్టు–న్యాయవాది శ్రవణ్‌కుమార్‌లు దాఖలు చేసిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పీఐఎల్–జనహితవ్యాజ్యం)ను పరిశీలించకుండానే కొట్టివేసే ముందు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకుర్కూ, పిటిషనర్ల తరఫు న్యాయ వాదులకూ మధ్య జరిగిన సంభాషణ స్థూలంగా ఇది. పీఐఎల్ ఒక బెడదా? ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఖన్వీల్కర్ కూడా పీఠంపై ఉన్నారు. డివై చంద్రచూడ్ తండ్రి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ జనహితవ్యాజ్యాలను విశేషంగా ప్రోత్సహిం చిన న్యాయకోవిదుడు. జస్టిస్ ఠాకుర్‌కు పీఐఎల్ వేస్తున్నవారి పట్ల కొంత అసహనం ఉన్నమాట బహిరంగ రహస్యం. కుప్పలుతెప్పలుగా పేరుకుపో తున్న కేసులు ప్రధాన న్యాయమూర్తిని కలవరపెడుతున్నాయి. న్యాయమూ ర్తుల సంఖ్య పెరగడం లేదు. పీఐఎల్ వేస్తున్నవారిలో కొందరు ప్రజాప్రయో జనం కాకుండా నిగూఢమైన స్వార్థ ప్రయోజనాలు ఆశించేవారున్నారు. వారిని నిరోధించే మార్గం సూచించవలసిందిగా సుప్రీంకోర్టు కేంద్ర న్యాయశాఖను కోరింది. న్యాయశాఖ ఆ పనిపైన దష్టి పెట్టింది. ఐపీఎల్‌ను వ్యవస్థీకతం చేసిన న్యాయకోవిదులలో ప్రథముడు జస్టిస్ పీఎన్ భగవతి ఈ విషయంలో న్యాయ శాఖతో సహకరిస్తున్నారు. మరో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి విఆర్ కష్ణ య్యర్ 2014 డిసెంబర్ 4న నిర్యాణం చెందే వరకూ సహకారం అందించారు. పీఐఎల్‌కు ప్రణబ్ బాసట జనహితవ్యాజ్యంలో అగ్రగామిగా జస్టిస్ భగవతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభివర్ణించారు. లోకాయుక్త్లను సాధికారికం చేయడంలోనూ, పేదలకు న్యాయ సహాయం అందించడంలోనూ జస్టిస్ భగవతి చేసిన సేవలు విలువైనవంటూ ప్రశంసించారు. జస్టిస్ భగవతి రాసిన ‘మై ట్రిస్ట్ విత్ జస్టిస్‘ని 2012 డిసెంబర్ 13న నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కబీర్ రాష్ట్రపతి భవన్లో ఆవిష్కరించిన సందర్భంగా ప్రణబ్ జనహితవ్యాజ్యం పేదప్రజలకూ, అణగా రిన వర్గాలకూ, న్యాయస్థానాల గడప ఎక్కలేని అమాయకులకూ వరప్రసాద మనే రీతిలో మాట్లాడారు. సుపరిపాలనకు సైతం ఇది దోహదం చేస్తుంది. అనేక జనహితవ్యాజ్యాలలో సర్వోన్నత న్యాయస్థానం గొప్ప తీర్పులు ఇచ్చిన ఫలితంగానే సమాజంలో అట్టడుగు వర్గాలకు ఎంతో కొంత న్యాయం జరుగుతోంది. చట్టసభలూ, పాలనావ్యవస్థల కంటే ఎక్కువగా న్యాయవ్యవస్థ పైన జనసామాన్యానికి ఇప్పటికీ విశ్వాసం మిగిలి ఉండటానికి కారణం రాజ్యాం గాన్ని అన్వయించడంలో, ప్రాథమిక హక్కులను అమలు చేయడంలో సామాజిక కోణాన్ని న్యాయమూర్తులు దష్టిలో పెట్టుకోవడమే. పీఐఎల్ వంటి సంస్కర ణను ప్రవేశపెట్టడమే. జస్టిస్ భగవతి, ఓ చిన్నప్పరెడ్డి, వైవి చంద్రచూడ్, వీఆర్ కష్ణయ్యర్, డీఏ దేశాయ్, జీవన్‌రెడ్డి వంటి దిగ్గజాలు అధోజగత్తులో అలమ టిస్తున్నవారికి న్యాయసహాయం అందించే పరమ లక్ష్యంతో అహరహం కృషి చేసిన కారణంగానే న్యాయవ్యవస్థలో ఇప్పటికీ కొన్ని మానవీయ విలువలు మిగిలి ఉన్నాయి. పీఐఎల్‌ను పరిశీలించకుండానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి తిరస్కరించడం దిగువ కోర్టులకు ఆదర్శంగా నిలుస్తుంది. నోరులేనివారి తరఫున జనహితవ్యాజ్యం దాఖలైతే దానిని పరిశీలించడానికి సైతం హైకోర్టుల న్యాయమూర్తులు నిరాకరిస్తారు. ఇది పేదవారికి అన్యాయం, అపకారం చేసి నట్టే. సుప్రీంకోర్టు చాలా సంవత్సరాలుగా ఎంతో శ్రమించి సాధించిన సంస్క రణను నీరుగార్చడమే. వరిష్ఠ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ ఆరు దశాబ్దాలుగా కొన్ని విలువలకు కట్టుబడి అసిధారావ్రతం చేస్తున్న వరిష్ఠ సంపాదకుడని ప్రధాన న్యాయమూర్తికి తెలియకపోవచ్చు. ఏబీకే తెలుగు పాత్రికేయుడు కావడం, ప్రధాన న్యాయమూర్తికి తెలుగు రాష్ట్రాలతో, తెలుగు జర్నలిజంతో పరిచయం లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. సమాజ శ్రేయస్సే పరమావధిగా ఏబీకే సాగిస్తున్న అక్షరయానం గురించి స్పష్టంగా తెలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతి రైతుల తరఫున ఆయన కోర్టుకు వెళ్ళడాన్ని ఉన్మాదంగా అభివర్ణిం చడం కేవలం అహంకారం. ఉన్మాదం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారు. అర్ణవ్ గోస్వామి, బర్ఖాదత్ వంటి ఇంగ్లీషు టీవీ జర్నలిస్టులు పీఐఎల్ వేసి ఉంటే జస్టిస్ ఠాకుర్ నిర్ణయం ఎట్లా ఉండేదో. రైతుల పక్షాన దాఖలైన ఐపీఎల్‌ను ఒక్క క్షణం పరిశీలించినా కేసు ప్రాధాన్యం ప్రధాన న్యాయమూర్తికి తెలిసి ఉండేది. నష్టపోయిన రైతులు పిటిషన్ వేసినప్పుడు చూద్దాం అంటూ జస్టిస్ ఠాకుర్ అన్నారు. సుప్రీంకోర్టులో ఒక రోజు ప్రభావవంతంగా వాదించేందుకు అయిదు లక్షల రూపాయల దాకా పారితోషికం చెల్లించుకోవాలంటే ఎవరు భరించగలరు? జన హితవ్యాజ్యం ద్వారా ఫీజు లేకుండా వాదించే సామాజిక స్పహ కలిగిన అడ్వ కేట్ల సహకారంతో రైతుల సమస్యలనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డ గోలుగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలను ప్రశ్నించే ఉద్దేశంతో వేసిన పీఐఎల్‌ను ప్రధాన న్యాయమూర్తి పరిశీలించి ఉంటే ప్రజలకు కొండంత మేలు జరిగేది. జనహితవ్యాజ్యం లక్ష్యం నెరవేరేది. ఈ విషయంలో ఠాకుర్ ఒక్కరే కాదు. మాజీ ప్రధాన న్యాయమూర్తి కపా డియా సైతం బూటకపు ఐపీఎల్‌ను నిరోధించేందుకు జరిమానా విధించాలని ప్రతిపాదించారు. పీఐఎల్ విలువ జస్టిస్ కపాడియాకు బాగా తెలుసు. పీఐఎల్æ కారణంగానే 2008 నాటి స్పెక్ట్రమ్ కేటాయింపులలో (2–జీ)కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జస్టిస్ కపాడియానే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కార్యాచరణను నియంత్రించారు. అమరావతి రైతుల తరఫున పీఐఎల్ వేసిన ఏబీకేకు లోకస్ స్టాండై (అర్హత) లేదని నిర్ణయించిన ప్రధాన న్యాయమూర్తి ఠాకుర్ బీజేపీ నాయకుడు అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వేసిన పీఐఎల్‌ను ఆసరా చేసుకొని 2016 మే 12న కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటీసు జారీ చేశారు. లా కమిషన్ సిఫార్సు చేసినట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను రెట్టింపు చేయవలసిందిగా న్యాయ మంత్రిత్వ శాఖకూ, ఆర్థిక మంత్రిత్వ శాఖకూ నోటీసు పంపించారు. ఇది నిశ్చయంగా ప్రజాప్రయోజనం దృష్టిలో పెట్టుకొని చేసినదే. అందుకే ప్రజలకు మేలుచేసే పీఐఎల్‌ను తిరస్కరించడం సమంజసం కాదు. పేదలకు న్యాయసహాయం సమాజంలో పేదలకూ, నోరు లేనివారికీ న్యాయం అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతోనే సుప్రీంకోర్టు పీఐఎల్‌ను వ్యూహాత్మకంగా ఆవిష్కరించింది. ఆత్య యిక పరిస్థితిలో దెబ్బతిన్న న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను పునరుద్ధరించే క్రమంలో కొందరు సామాజిక స్పహ కలిగిన న్యాయమూర్తులు న్యాయవ్యవస్థను పేద లకు చేరువ చేసేందుకు నడుం బిగించారు. పేదలకు న్యాయసహాయం చేసేం దుకు సోషల్ యాక్షన్ లిటిగేషన్ (సామాజిక వ్యాజ్యం)ను ఒక సాధనంగా వినియోగించుకోవాలంటూ జస్టిస్ కష్ణయ్యర్, జస్టిస్ భగవతి 1977లోనే ఒక నివేదిక ప్రచురించారు. ఆ తర్వాత తమకు వచ్చిన లేఖలనే పిటిషన్లుగా సూమోటోగా స్వీకరించి సామాన్యుల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ టాడా ఖైదీల కష్టాలను వర్ణిస్తూ ఒక న్యాయమూర్తికి రాసిన లేఖను పీఐఎల్గా స్వీకరించారు. ఈ సమ యంలోనే న్యాయవ్యవస్థ ప్రభుత్వ చర్యలను సమీక్షించడం ద్వారా చురుకైన పాత్ర పోషించడం ప్రారంభించింది. రాజ్యాంగంలోని 21వ అధికరణ స్వభా వంలో వచ్చిన మార్పు గుర్తించగలిగితే జనహితవ్యాజ్యం రూపకల్పన క్రమం అర్థం అవుతుంది. ఏ వ్యక్తి జీవితానికీ, వ్యక్తిగత స్వేచ్ఛకూ (చట్టం పరిమితులకు లోబడి) భంగం కలగకూడదని ఈ అధికరణ నిర్దేశిస్తుంది. అంటే, చట్టం అను మతించినంత వరకూ వ్యక్తిగత స్వేచ్ఛపై పరిమితులు విధించవచ్చునని అప్పటి వరకూ న్యాయవ్యవస్థ విశ్వసించేది. ప్రభుత్వం చట్టం తెచ్చినా, ఆర్డినెన్స్ జారీ చేసినా ముందస్తు అరెస్టు, నిర్బంధం రాజ్యాంగ సమ్మతమేనని ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ అన్వయాన్ని మేనకాగాంధీ కేసు మార్చివేసింది. రాజ్యాంగం 14, 19, 21 అధికరణలలో స్పష్టం చేసిన విధంగా 21వ అధికరణ హామీ ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించే విషయంలో హేతు బద్ధంగా, ధర్మబద్ధంగా, సమంజసంగా వ్యవహరించవలసి ఉంటుందంటూ న్యాయస్థానాలు భాష్యం చెప్పడం ప్రారంభించాయి. 14వ అధికరణ చట్టం ఎదుట అందరూ సమానమే అన్న హామీ ఇచ్చింది. భావప్రకటనకూ, శాంతి యుత సమావేశాల నిర్వహణకూ, ఉద్యమాలు నిర్వహించడానికీ, బతుకుతెరువు కోసం పని చేయడానికీ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక స్వేచ్ఛలన్నీ 19వ అధికరణలో ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం క్రమంగా ఈ హక్కుల మధ్య అంతస్సూత్రాన్ని ఆవిష్కరించింది. ప్రభుత్వ చర్యల వల్ల ఈ హక్కులలో దేనికి భంగం వాటిల్లినా ప్రభుత్వం నిగ్రహం పాటించవలసి ఉంటుంది. చట్టం నిర్ణయించిన పద్ధతి (procedure established by law) అని భారత రాజ్యాంగ నిర్మాతలు అంటే దానిని అమెరికా రాజ్యాంగంలో ఉన్న సరైన పద్ధతి (డ్యూప్రా సెస్) అనే మాటను తీసుకొని నికరమైన పద్ధతి (substantiative due process) అనే మాటను న్యాయస్థానాలు 21వ అధికరణలో చేర్చాయి. ఆత్య యిక పరిస్థితిలో దేశం అనుభవాలను దష్టిలో పెట్టుకొని న్యాయవ్యవస్థ ఈ జాగ్రత్తలు అవసరమని భావించి ఉండవచ్చు. మేనకాగాంధీ కేసులో తీర్పు దరిమిలా జీవించే హక్కు, వ్వక్తిగత స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను ఉదారంగా అన్వయించడం మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా పీఐఎల్ అనే సాధనం ద్వారానే జరిగాయని గుర్తించాలి. రాజ్యాంగం మూడవ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకూ, నాలుగో భాగంలో సమకూర్చిన ఆదేశిక సూత్రాలకూ మధ్య సమన్వయం సాధిస్తూ రాజ్యాంగాన్ని ప్రజలకు అనుకూ లంగా అన్వయించే ప్రయత్నం జరిగింది. ‘రాజ్యాంగం మూడు, నాలుగో భాగా లలోని అంశాలు పరస్పర పూరకాలే కానీ పరస్పరం సంబంధం లేని అంశాలు కావు’ అంటూ ఉన్నికష్ణన్, జేపీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జస్టిస్ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ఆదేశిక సూత్రాలను అమలు పరచడానికి ఉపకరించే సాధనాలే ప్రాథమిక హక్కులు’ అంటూ ప్రబోధించారు. పైగా సామాజిక విప్లవం సాధించడానికీ, సంకేమ రాజ్యం స్థాపించడానికీ ఆదేశిక సూత్రాలనూ, ప్రాథమిక హక్కులనూ జమిలిగా సద్వినియోగం చేసుకోవాలంటూ కేశవానంద భారతి కేసులో న్యాయమూర్తులు ఉద్ఘాటించారు. 21వ అధికరణ పరిధిని సుప్రీం కోర్టు క్రమంగా విస్తరించింది. తిండికీ, బట్టకీ, గూడుకూ లోపం లేకుండా ఆరో గ్యంగా, గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు కల్పిస్తేనే ఆ హక్కు అమలు జరుగు తున్నట్టు అర్థమంటూ జస్టిస్ భగవతి స్పష్టం చేశారు. పీఐఎల్ వల్ల ప్రయోజనాలు వోల్గా టెల్లిస్ అనే జర్నలిస్టు బాంబే మునిసిపల్ కార్పొరేషన్‌పైన వేసిన పీఐఎల్ ఆధారంగానే రోడ్డు పక్కన పేవ్మెంట్ల మీద నివసించేవారిని భారీ నిర్మాణాల కోసం బడా కాంట్రాక్టర్లు బలవంతంగా మరో చోటికి తరలించే ప్రయత్నం ఆగిపోయింది. వోల్గా ‘లోకస్ స్టాండై’ని నాటి న్యాయస్థానం ప్రశ్నించలేదు. బిహార్ జైళ్ళలో సంవత్సరాల తరబడి మగ్గుతున్న అండర్ ట్రయిల్ ఖైదీల దుస్థితిని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన వరుస కథనాలు న్యాయస్థానం దష్టికి తీసుకువెళ్ళాయి. ‘వేగంగా విచారించే హక్కు’ అండర్ ట్రయిల్స్‌కి ఆ విధంగానే సంక్రమించింది. మరో జర్నలిస్టు షీలా బర్సే ముంబయ్ మహా నగరంలోని జైళ్ళలో అష్టకష్టాలు పడుతున్న మహిళా ఖైదీల ఘోషను న్యాయ స్థానానికి పీఐఎల్ ద్వారా వినిపించారు. షీలా ‘లోకస్ స్టాండై’ని న్యాయస్థానం ప్రశ్నించలేదు. ఆమె కషి ఫలితంగానే మహిళా ఖైదీలను ప్రత్యేక గదులలో ఉంచాలనీ, వారికి కాపలాగా మహిళా గార్డులే ఉండాలనీ సుప్రీంకోర్టు ఆదేశిం చింది. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి సత్వరం వైద్యం చేసి తీరా లంటూ సుప్రీంకోర్టు ఆసుపత్రులనూ, ప్రభుత్వాలనూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడానికి దారి తీసింది కూడా జనహితవ్యాజ్యమే. సుప్రీంకోర్టు చొరవ ఫలితంగా పీఐఎల్ వేసే వ్యక్తుల లేదా సంస్థల అర్హత (లోకస్ స్టాండై)ని ప్రశ్నించడం తగ్గించారు. ఢిల్లీలో ఆసియా క్రీడోత్సవం (ఏసియన్ గేమ్స్)కోసం కట్టడాలను నిర్మించడానికి సంబంధించిన కార్యకలాపాలలో బాల కార్మికులను వినియోగించడాన్ని ప్రశ్నిస్తూ పీపుల్స్ యూనియన్ ఆఫ్ డెమాక్రాటిక్ రైట్స్ భారత ప్రభుత్వంపైన వేసిన పీఐఎల్ ఫలితంగా బాలకార్మికులను వినియోగిం చడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నారు. పర్యావరణవేత్త ఎంసీ మెహతా వేసిన అనేక పీఐఎల్‌ల ధర్మమా అని గంగానది కాలుష్య నివారణకూ, తాజ్ మహల్ పరిసర ప్రాంతాలలో కాలుష్య కారకాల తొలగింపునకూ, ఢిల్లీ మునిసి పల్ కార్పొరేషన్ పరిధి నుంచి కాలుష్య కారక పరిశ్రమలను దూరంగా తరలించడానికీ దారి తీశాయి. విశాఖపట్టణం కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త, మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రభుత్వ సంస్థల ఆగడాలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాలలో పీఐఎల్ ద్వారా నిర్విరామంగా పోరాడు తున్నారు. పర్యావరణంతో ఒక ఐఏఎస్ అధికారికి ఏమి సంబంధం అని ఆయనను ఇంతవరకూ ఏ న్యాయస్థానం కూడా ప్రశ్నించలేదు. ఉన్నత పదవులలో ఉన్న అధికారులపైనా , రాజకీయ నాయకులపైనా రోజుకు కనీసం రెండు లేఖాస్త్రాలు సంధిస్తారు ఆయన. విద్యాసంస్థలలో విద్యార్థులకు రోజూ భోజనం ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకం సవ్యంగా అమలు జరగడం లేదని పీఐఎల్ వస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సక్రమంగా పథకం అమలు కావడానికి అవసరమైన ఆదేశాలను సంబంధిత అధికారులకు సుప్రీం కోర్టు జారీ చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత విద్యార్థులకు స్వాలర్ షిప్పులు చెల్లించే విషయంలో 1956 కంటే ముందు తెలంగాణ ప్రాంతంలో స్థిరపడినవారి పిల్లలకే చెల్లిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంటే 1956 నుంచి 2013 వరకూ తెలంగాణలో స్థిరపడినవారి పిల్లలు స్కాలర్‌షిప్‌లకు అర్హులు కారు. ఈ జీవోను సవాలు చేస్తూ ఒక పీఐఎల్ దాఖలైతే హైకోర్టు విచారించింది. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది సత్యప్రసాద్ వాదించారు. తెలంగాణ ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ప్రజల చేతిలో పాశుపతాస్త్రం జనహితవ్యాజ్యం వల్ల సమాజానికి సమకూరిన ప్రయోజనాలు ఏమిటో, వాటి ప్రాముఖ్యం ఏమిటో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలియదని భావించ లేము. అదే సమయంలో అసందర్భపు పీఐఎల్‌లు న్యాయాధికారుల సమ యాన్ని వధా చేస్తున్న సంగతీ నిజమే. ఉదాహరణకు మొన్న మార్చి 11న ఠాకుర్ నాలుగు పీఐఎల్‌లు తిరస్కరించారు. వాటిలో ఒకటి ఇండియా పేరును భారత్‌గా మార్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. మరొ కటి 32 సంవత్సరాల కిందట జరిగిన సిక్కుల ఊచకోతకు సంబంధించింది. మూడోది ప్రవాస భారతీయుడు దినేశ్ ఠాకుర్ వేసింది. ఔషధ పరిశ్రమలను క్రమబద్ధం చేయాలంటూ ఆయన విన్నవించారు. ‘మీరు ప్రచారం కోసం ఇక్కడి వచ్చి హడావుడి చేస్తున్నారు’ అంటూ ఆయనను ప్రధాన న్యాయమూర్తి మంద లించారు. నాలుగో ‘పిల్’ కూడా ఇటువంటిదే. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పీపీఐఎల్) వేసిన పీఐఎల్ పరిశీలిస్తూ ‘మీకు ఇదే పనా? (Are you a professional litigant?) అని సూటిగా అడిగారు. ఇది ప్రముఖ న్యాయ వాది ప్రశాంత్ భూషణ్ నాయకత్వంలో పని చేస్తున్న సంస్థ. స్పెక్ట్రమ్ కేటా యింపుల (2–జీ) కుంభకోణం వెలుగు చూడటానికి ఈ సంస్థ పీఐఎల్ ద్వారా చేసిన పోరాటమే కారణం. ఈ సంస్థ ఖాతాలో అనేక విజయాలు నమోదై ఉన్నాయి. అనవసరపు పీఐఎల్‌ల పట్ల జస్టిస్ ఠాకుర్ ఆగ్రహాన్ని అర్థం చేసు కోవచ్చు. అపరిష్కతంగా మిగిలిపోతున్న కేసుల భారం పెరిగిపోతున్నదనీ, మరింత మంది న్యాయాధికారులను నియమించాలనీ ఆయన ప్రభుత్వానికి పదే పదే చెబుతున్నారు. ఒక సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో ఈ సమ స్యను ప్రస్తావించి కంటతడి పెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని న్యాయమూర్తుల నియామకం గురించి ప్రస్తావించకపోవడం పట్ల బహి రంగంగానే ఆక్షేపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచవలసిందే. న్యాయమూర్తుల నియామకాన్ని వేగవంతం చేయవల సిందే. పేదప్రజల చేతిలో ఉన్న పాశుపతాస్త్రం పీఐఎల్. మొత్తం కేసులలో పీఐఎల్ కేసులు ఒక్క శాతానికి మించి ఉండవని హిమాచల్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు మన్మత్సింగ్ అధ్యయనంలో తేలింది. అన్ని పీఐఎల్ కేసులనూ ఒకే గాట కట్టకుండా పలుకున్న కేసులను గుర్తించి వాటిని విచారణకు స్వీకరించే వడపోత వ్యవస్థను నిర్మించుకోవలసిన అవసరం ఉన్నది. అంతేకానీ 1980ల నుంచి సుప్రీంకోర్టుకు వన్నె తెచ్చిన ఎందరో మహానుభావులు, ప్రాతఃస్మరణీ యులు పేదప్రజల హక్కులకు రక్షణ కల్పించే మహత్తరమైన ఆశయంతో రూపొందించిన జనహితవ్యాజ్యాన్ని నీరుగార్చే ప్రయత్నం హానికరం. - కె.రామచంద్రమూర్తి సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్ -
నీతిలేని రాజకీయం
త్రికాలమ్ వెంకయ్యనాయుడు అపారమైన అనుభవం కలిగిన జాతీయ నాయకుడు. తాను రాజకీయాలలో ఎన్నడూ రాజీపడలేదని శుక్రవారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ఆత్మీయ సభలో సగర్వంగా ప్రకటించారు. లౌక్యం పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపుల పరంపరను నిలిపివేయాలని చంద్రబాబునాయుడికీ, కేసీఆర్‌కీ గట్టిగా హితవు చెప్పగలిగితే వెంకయ్య నాయుడి స్థాయికి తగినట్టు ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలి. వెంకయ్యనాయుడు చొరవ తీసుకోవాలి. గమ్యం, మార్గం రెండూ ముఖ్యమేనన్నాడు మహాత్మాగాంధీ. మార్గం ఏదైనా గమ్యం చేరడం ప్రధానమని భావిస్తున్నారు పదవీ రాజకీయాలలో ఆరితేరిన ఈ తరం రాజకీయ నాయకులు. సుఖేందర్‌రెడ్డి, తదితర నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేర్చుకుంటూ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఒకానొక రహస్యాన్ని వెల్లడిం చారు. 2014 ఎన్నికలలో తన పార్టీకి 119 స్థానాల అసెంబ్లీలో 63 స్థానాలతో మెజారిటీ వచ్చిన అనంతరం కూడా తనను పదవీ స్వీకారం చేయనీయకుండా అడ్డుకొని రాష్ట్రపతి పాలన విధించేలా చూసేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లు కుట్ర చేశాయనీ, తనకు ఈ విషయం ఎంఐఎం నాయకుడు అస దుద్దీన్ ఒవైసీ సకాలంలో చెప్పి ఆదుకున్నారనీ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందంటూ ఆ రోజుల్లో పీసీసీ బాధ్యుడు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించి నట్టు కూడా గుర్తు చేశారు. ఈ కుట్రను ఛేదించే క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీ శాసనసభ్యులను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నామంటూ కేసీఆర్ సమర్థించుకున్నారు. పొరుగున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సైతం యథాశక్తి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నప్పటికీ చట్ట ఉల్లంఘనను సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. పార్టీ ఫిరాయింపులు కొత్తకాదు. ఇది టీడీపీ లేదా టీఆర్ఎస్లు కనిపెట్టిన కొత్త విద్య కాదు. ‘ఆయారాం, గయారాం’ సంస్కృతి 1960-70లో కాంగ్రెస్ హయాంలోనే వేళ్ళూనుకుంది. ఈ దుష్ట సంస్కృతిని అంతం చేయడానికి 1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం, 2003లో అటల్ బిహారీ వాజపేయి సర్కార్ చేసిన రాజ్యాంగ సవరణలు సరిపోవడం లేదు. 1985 నాటి 52వ రాజ్యాంగ సవరణ చట్టంలోని లోపాలను రాజకీయవాదులు యథేచ్ఛగా వినియోగించు కొని భ్రష్ట రాజకీయాలను అందలం ఎక్కించిన తర్వాత 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. ఇందులో ఉన్న ప్రధానమైన లోపాన్ని రాజకీయవాదులు పూర్తిగా వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ సభ్యులను టీఆర్ఎస్లో చేర్చుకోవడాన్ని రాజకీయ పునరేకీకరణగా అభివర్ణిస్తూ, లోగడ 16 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులలో 10 మందిని కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ రాజశేఖరరెడ్డి చేర్చుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రతిపక్ష నేత జానారెడ్డిని కేసీఆర్ ప్రశ్నించారు. నాడు వైఎస్ చేశారు కనుక, కాంగ్రెస్, టీడీపీలు కుట్ర చేశాయి కనుక ప్రతిపక్షాల నుంచి శాసనసభ్యులను పార్టీ ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తే తప్పులేదని కేసీఆర్ అభిప్రాయం. దెబ్బకు దెబ్బ తీయడం, రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడం, ప్రతిపక్షం కుట్రను ఛేదించడం కోసం ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిం చినా పర్వాలేదనే భావన. చట్టాలలోని లొసుగులను ఉపయోగించు కోని రాజకీయ నాయకులు ఈ రోజుల్లో ఎక్కడా కనిపించరు. ఆపద్ధర్మం చట్టసభలలో మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నించకూడదు. కొన్ని పార్టీలు కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే మంచిదే. మెజారిటీ లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వం వెలుపల ఉండే రాజకీయ పక్షాల మద్దతు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకె గుజ్రాల్ ప్రధానులుగా ఒక్కొక్కరు సంవత్సరం కూడా పూర్తి చేయకపోవడానికి కారణం సొంతబలం లేకపోవడం, అరువుబలంపైన ఆధారపడటం. ఇటువంటి పరిస్థితులలో ఆపద్ధ ర్మంగా చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భం కూడా ఉంది. 1991లో రాజీవ్‌గాంధీ హత్య తర్వాత పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రతిసారీ పీవీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ళపాటూ నడిపించాలనే సంకల్పంతో పీవీ టీడీపీ పార్లమెంటరీ పార్టీని చీల్చారు. జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులనూ సుముఖులను చేసుకున్నారు. నీతిబాహ్యమైన రాజకీయం ఎందుకు చేశారని ప్రశ్నించినప్పుడు దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టాలంటే రాజకీయ సుస్థిరత అత్యవసరమంటూ పీవీ సమర్థించుకున్నారు. టీఆర్ఎస్ శాసనభ్యులను ఎందుకు కాంగ్రెస్‌లో చేర్చుకు న్నారని వైఎస్‌ను అడిగితే తెలంగాణ రాష్ట్ర సాధనే ఎజెండాగా ఉన్న టీఆర్ఎస్ను బలహీన పరచడానికి ఆ పని చేశానని చెప్పారు. అదే టీఆర్ఎస్తో అధిష్టానం ఒత్తిడి మేరకు 2004లో పొత్తు పెట్టుకున్న వైఎస్ 2009లో అధిష్టానం ఎంత గట్టిగా చెప్పినా అంగీకరించకుండా టీఆర్ఎస్తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేశారు. అది రిస్కు అని తెలిసినా సమైక్యవాదిగా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకూడదని వైఎస్ గట్టిగా భావించారు. అప్పుడు చంద్రబాబునాయుడు నాయకత్వంలోని టీడీపీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. పీవీ, వైఎస్‌ల నిర్ణయాలు సరైనవని సమర్థించడం ఉద్దేశం కాదు. వారు చేసింది రాజ్యాంగ ఉల్లంఘనే. వారు అనుసరించిన మార్గం అక్రమమైనదే. కానీ పార్టీ ఫిరాయిం పులను ప్రోత్సహించడానికి వారికి మంచో చెడో ఒక లక్ష్యం అంటూ ఉంది. అటువంటి లక్ష్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ముమ్మరమైన ఫిరాయింపుల వెనుక కనిపించదు. ఎన్నికలలో మెజారిటీ సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నవారికి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్న తాపత్రయం ఎందుకు? ప్రతిపక్షం లేకపోవడం అధికారపక్షానికీ నష్టదాయకమే. లాభదా యకం కానేకాదు. విమర్శలను స్వాగతించినప్పుడే విధానాలలోనూ, ఆచరణ లోనూ దొర్లుతున్న పొరపాట్లు తెలుస్తాయి. దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. స్వపక్షంలో భజనపరులు అధికం. మంత్రివర్గ సహచరులు డూడూ బసవన్నలే. మీడియా సంస్థలది వీరవిధేయత. ప్రతిపక్షాన్ని శత్రుపక్షంగా భావిస్తున్నారు. ఇక నిజానిజాలు తెలుసుకునే అవకాశం పాలకులకు ఎక్కడ? ఫిరాయింపుల విషయంలో నైతికత ఒక అంశమైతే రాజ్యాంగ స్ఫూర్తి మరో అంశం. చంద్రబాబునాయుడు ఫిరాయింపుల వంటి కార్యక్రమం 1995లో ఎన్టీఆర్‌ను గద్దె దించినప్పుడే ప్రారంభించారు. రాజ్యసభ ఎన్నికలలో ప్రతి పక్షాన్ని దెబ్బతీయాలనో, మరో ఉద్దేశంతోనో వందల కోట్లు ఖర్చు చేసి ఇరవై మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలకు కండువా కప్పారు. నియోజకవర్గాలలో పాత నాయకులూ, కొత్త నాయకులూ కొట్టుకుంటున్నారు. ఫిరాయింపుల వల్ల టీడీపీ సాధించింది ఏమిటో అర్థంకాదు. ప్రతిపక్ష సభ్యులను కొంతమందిని పార్టీకి దూరం చేసినంత మాత్రాన ప్రజలలో వ్యతిరేకత సమసిపోతుందా? ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రతిపక్ష ఎంఎల్ఏలను ఆకర్షించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రజలకు ఎటువంటి సంకేతాలు పంపుతుంది? 175 స్థానాల అసెంబ్లీలో వందకుపైగా సీట్లతో మెజారిటీ ఉన్నప్పుడు పరిపాలనపైన దృష్టిపెట్టకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేం దుకు కృషి చేయకుండా, నిరర్థకమైన ఫిరాయింపుల వ్యవహారం నెత్తికెత్తుకోవ డాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఫిరాయించిన ఎంఎల్ఏల చేత రాజీనామా చేయించి టీడీపీ టికెట్టుపైన గెలిపించి ఉంటే రాజ్యాంగాన్ని గౌరవిం చినట్టు అయ్యేది. ప్రజల ఆమోదం పొందినట్టయ్యేది. ఆ దమ్ము ఫిరాయించిన వారికీ లేదు. వారిని ప్రోత్సహించినవారికీ లేదు. చారిత్రక స్పృహ తెలంగాణ రాష్ట్ర సాధనకు పద్నాలుగు సంవత్సరాలు అలుపెరుగని పోరాటం అహింసాత్మకంగా సాగించిన సారథిగా, కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కి చరిత్రలో ఇప్పటికే ప్రత్యేక స్థానం ఉంది. పార్టీ ఫిరాయింపులకు తెగబడకుండా సుస్థిర పాలన అందిస్తూ, ప్రతిపక్షాలను కలుపుకొని సాగుతూ బంగారు తెలంగాణ స్వప్న సాకారానికి కృషి చేస్తే ఆయన రాజనీతిజ్ఞుడుగా ఎదిగి, ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచే అవకాశం ఉండేది. ఎంఎల్ఏల సంఖ్య పెరిగినంత మాత్రాన టీఆర్ఎస్కు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకోవడంలో ఎవ్వరూ వెనకాడరు కనుక, చట్టాలలోని లోపాలను సవరించుకోవాలి. రాజ్యాంగం పదో షెడ్యూ లులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏడవ పేరాలో పార్లమెంటు, శాసన సభ, శాసనమండలి నిర్ణయాలలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదంటూ స్పష్టంగా ఉన్నది. చట్టసభల సభ్యులు తమ అధికారాలను న్యాయస్థానాలకు అప్పగించడం ఇష్టం లేనికారణంగా పెట్టిన నిబంధన ఇది. వాస్తవానికి స్పీకర్‌ది రాజ్యాంగపరమైన పదవి (constitutional office) కాగా, ఇప్పుడు పూర్తిగా రాజకీయ పదవి (political office)గా మారింది. అధినేతల అభీష్టానికి భిన్నంగా సభాపతులు వ్యవహరించే రోజులు ఎప్పుడో పోయాయి. అందుకే స్పీకర్ పదవిలో ఉన్నవారు మంత్రి పదవికోసం అంగలార్చడం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలంటే పార్టీ ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉన్నదంటూ సుప్రీం కోర్టు రాజ్యాంగపీఠం 2007లో రాజేంద్రసింగ్ రాణా వర్సెస్ స్వామిప్రసాద్ మౌర్య కేసులో స్పష్టం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే కదా న్యాయవ్యవస్థ సమీక్షించేది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా పాలకపక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తే న్యాయస్థానాలు చేయగలిగింది ఏమీ లేదు. అందుక నే స్పీకర్లు నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రలోభాలకు ఆశపడి ఎవరు పార్టీ ఫిరాయించినా అది రాజ్యాంగ ఉల్లం ఘనే. కారణాలు ఏమైనా అది ప్రజాస్వామ్య వ్యవస్థపైన ఖడ్గప్రహారమే. ప్రమా దకరమైన ఈ ధోరణిని అరికట్టాలంటే పార్టీ మారిన ఎంపీలపైనా, ఎంఎల్ఏ లపైనా, ఎంఎల్సీలపైనా అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ నుంచి ఎన్ని కల సంఘానికి బదిలీ చేయాలి. ఎన్నికల సంఘం సైతం పారదర్శకంగా, కాలవ్యవధికి లోబడి వ్యవహరించే విధంగా విధివిధానాలు రూపొందించాలి. వెంకయ్యకో విన్నపం వెంకయ్యనాయుడు అపారమైన అనుభవం కలిగిన జాతీయ నాయకుడు. తాను రాజకీయాలలో ఎన్నడూ రాజీపడలేదని శుక్రవారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ఆత్మీయ సభలో సగర్వంగా ప్రకటించారు. లౌక్యం పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపుల పరంపరను నిలిపివేయాలని చంద్రబాబునాయుడికీ, కేసీఆర్‌కీ గట్టిగా హితవు చెప్పగలిగితే వెంకయ్యనాయుడి స్థాయికి తగినట్టు ఉండేది. పార్టీ ఫిరాయించిన క్షణంలోనే పదవి పోవాలంటూ ఆయన చెప్పిన మాటలను చట్టబ ద్ధం చేస్తూ పార్లమెంటు వ్యవహారాల మంత్రి హోదాలో మరో రాజ్యాంగ సవరణ తెచ్చేందుకు నడుం బిగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణదానం చేసిన వారవుతారు. పదవులకోసం, డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ ఫిరా యించే ధోరణి యథేచ్ఛగా కొనసాగుతున్న కారణంగా ప్రతిపక్షాల మనుగడ ప్రశ్నార్థకం అవుతోంది. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలి. వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవాలి. - కె.రామచంద్రమూర్తి -
ఫలించిన ‘మహా’తంత్రం
త్రికాలమ్ పదమూడేళ్ళ ఉద్యమం అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించు కున్నప్పటికీ, సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించి కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అందని ద్రాక్షగా మిగిలిపోవడం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్)కి మింగుడు పడని వాస్తవం. శుక్రవారం నాడు వెల్లడైన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ జైత్రయాత్రను పరిపూర్ణం చేశాయి. ఇక్కడ సున్నా నుంచి 99 స్థానాలకు వారు ఎదిగారు. 2014 ఎన్నికలలో తాను హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనలు నిర్వహించి వంద ఎన్నికల సభలలో ప్రసంగించి నిర్విరామంగా ప్రచారం చేసి సాధించిన విజయం కంటే కుమారుడు కె. తారకరామారావు (కేటీఆర్) జీహెచ్ఎంసీ ఎన్నికలలో అసాధారణమైన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించి అపూర్వమైన రీతిలో నమోదు చేసిన గెలుపు ఎక్కువ విలువైనది. కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అన్న విషయం ముఖ్యమంత్రి తనయ చెప్పక ముందే అందరికీ తెలిసిపోయింది. రెండున్నర వేల సంవత్సరాల కిందట చైనీస్ యుద్ధతంత్ర నిపుణుడూ, సేనానీ సన్ జూ రాసిన ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ను కేసీఆర్ చదివే ఉంటారు. 'The supreme art of the war is to subdue the enemy without fighting (యుద్ధం చేయకుండానే శత్రువుపైన ఆధిక్యం సంపాదించడం అత్యున్న తమైన యుద్ధతంత్రం)’అంటాడు సన్ జూ. 2014 సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాద్ మహానగర ప్రాంతంలో ఉన్న 24 అసెంబ్లీ స్థానాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి కేవలం మూడు స్థానాలు దక్కినప్పుడే కేసీఆర్ మనస్సులో ఎట్లాగైనా సరే హైదరాబాద్‌ని జయించాలనే సంకల్పం చెప్పుకొని ఉంటారు. అప్పటి నుంచే ఆయన ఒక వ్యూహం ప్రకారం జీహెచ్ఎంసీపైన పట్టు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రతిపక్షాల శక్తిని హరించి వాటిని చిత్తు చేయడానికి అవసరమైన అన్ని ఎత్తులూ వేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (తెదేపా)లలో పలుకున్న నాయకులకు కండువా కప్పి గులాబీ దండులో చేర్చుకున్నారు. ఉలుకున్న నాయకులు తనకు సన్నిహితులని నమ్మించి వారి పార్టీ సహచరులలో అనుమానాలు ప్రబలే విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి కానీ, జీవన్‌రెడ్డి కానీ, తెదేపా నేత దయాకర రావు కానీ కేసీఆర్‌పైన చీటికీమాటికీ కాలుదువ్వకపోవడానికి కారణం ఆయన వారిని శాసన సభలోనూ, బయటా గౌరవంగా సంబోధించడం, ఆత్మీయంగా ప్రస్తావించడం. కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు ఎట్లాగూ ఉన్నాయి. దీనికి తోడు అధికారపార్టీతో కొందరు నాయకులు కుమ్మక్కు అవుతున్నారనీ, అందుకే ప్రభుత్వంపైన దాడి చేయడంలేదనే అనుమానాలు అనైక్యతను మరింత పెంచాయి. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ విభాగం అధ్యక్షుడు దానం నాగేందర్ కూడా తెరాస నాయకత్వంతో చర్చలు జరిపి తనకు అనుకూలమైన వాతా వరణం లేని కారణంగానే పార్టీ ఫిరాయించ కుండా కాంగ్రెస్‌లో కొనసాగారనే వార్తలు మీడియాలో వచ్చాయి. అందుకే, కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసే మానసిక స్థితిలో లేదు. సమరానికి ముందే ఓటమిని అంగీకరించింది. ప్రతిపక్షాల చిత్తుకు వ్యూహం తెదేపా నుంచి కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి సీనియర్ నాయకులను పార్టీలో చేర్చుకోవడం వెనుక వ్యూహం ఉంది. అదే విధంగా దయాకరరావును చేర్చుకోకపోవడంలోనూ ఎత్తుగడ ఉంది. తెదేపాను దెబ్బతీయడానికి కేసీఆర్‌కు కలసి వచ్చిన అంశం ‘ఓటుకు కోట్లు’ కేసు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని తెలంగాణ తెదేపా నిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం, జీహెచ్ఎంసీ ప్రచార బాధ్యతలను ఆయనకే అప్పగించడం, ఆయనను వెంట బెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎన్నికల సభలలో ప్రసంగించడాన్ని హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులు సైతం అనైతికంగా, అవమానకరంగా భావించి ఉంటారు. ఏ మాత్రం వెరపు లేకుండా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు వారికి వెగటు కలిగించి ఉండాలి. ఎన్నికల ప్రచారం చివరి అంకంలో సికింద్రాబాద్‌లోని కవాతు మైదానంలో తెరాస బహిరంగ సభలో తెదేపా అధ్యక్షుడిని ఉద్దేశించి కేసీఆర్ ‘నీకు ఇక్కడేం పని? నీ పదమూడు జిల్లాలూ ఊడ్చుకో, పో’ అంటూ ఎద్దేవా చేసినా పల్లెత్తు మాట అనకుండా ప్రచారం ముగించుకొని వెళ్ళిపోయిన చంద్రబాబునాయుడు యుద్ధంలో లేనట్టే లెక్క. జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెరాస అద్భుతమైన విజయం సాధించడానికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు. మురికివాడలలో నివసించే ప్రజలకు రెండు పడక గదుల ఫ్లాట్లు ఇస్తామనే వాగ్దానం, నాణ్యమైన విద్యుచ్ఛక్తిని నిరంత రంగా సరఫరా చేస్తామని చెప్పడం, నాలుగు ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తామంటూ ప్రకటించడం, మరి రెండు మంచినీటి చెరువులను నగరంలో నిర్మిస్తామంటూ హామీ ఇవ్వడం, శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామంటూ నమ్మబలకడం వంటి కారణాలు చాలా కనిపిస్తాయి. మురికివాడలలో నివిసిస్తున్న ప్రజలను బస్సులలో తీసు కొని వెళ్ళి ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన రెండు పడకగదుల ఫ్లాట్లను చూపించడం ద్వారా అటువంటి ప్లాట్లు ఏదో ఒక రోజు తమకూ వస్తాయనే విశ్వాసం వారిలో కలిగించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాగ్దానాలు కొన్ని అమలు చేయకుండా, కొన్ని అరకొరగా అమలు చేసి, భూసేకరణ పేరు మీద రైతులను అశాంతికి గురి చేసిన చంద్రబాబునాయుడు తన సమస్యలతోనే సతమతం అవుతున్నారనీ, హైదరాబాద్‌లో ఆయన వచ్చి చేసేదేమీ ఉండదనే అభిప్రాయానికి హైదరా బాద్‌లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రాంత ప్రజలందరూ వచ్చి ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు. కేటీఆర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించడం ఒక ఎత్తు. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలలో అనర్గళంగా మాట్లాడుతూ, నగరం అంతా కలియతిరుగుతూ మొత్తం 150 వార్డులనూ చుట్టి ప్రచారం చేసిన 39 ఏళ్ళ కేటీఆర్ వయస్సుకు మించిన పరిణతి ప్రదర్శించారు. తండ్రి ఇచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్న తీరు అభినందనీయం. టిక్కెట్టు ఆశించి భంగపడిన దాదాపు 600 మంది తిరుగుబాటు అభ్యర్థులకు నచ్చజెప్పి తన పక్షాన ఉంచుకోగలిగారు. మంచి వాచకం ఒక్కటే సరిపోదు. చెప్పదల చుకున్నది స్పష్టంగా చెప్పగలగాలి. సందర్భశుద్ధి తెలియాలి. ఉదాహరణకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండో సారి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడ దీక్షలో కూర్చున్నవారికి సంఘీభావం ప్రకటించారు. రాత్రంతా వారి మధ్యే గడిపారు. మర్నాడు సభలో మాట్లాడుతూ, 'I thank Rohit's mother for inviting me for the function' (ఈ ఫంక్షన్‌కు నన్ను ఆహ్వానించినందుకు రోహిత్ తల్లికి ధన్యవాదాలు) అనడం ఎంత ఎబ్బెట్టుగా ఉన్నదో ఇంగితం ఉన్నవారికి ఎవరికైనా అర్థం అవుతుంది. భారీ బహిరంగ సభల అక్కర లేదు టెలివిజన్, సోషల్ మీడియా వర్ధిల్లుతున్న కాలంలో నాయకులు స్పష్టంగా, సూటిగా, అర్థవంతంగా మాట్లాడటం చాలా అవసరం. అధికారంలో ఉన్నవారిని అదేపనిగా నిందించడం లేదా వారిపై ధ్వజమెత్తడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజల సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరనీ, వాటిని పరిష్కరించే శక్తియుక్తులు పుష్కలంగా ఉన్నాయనే విశ్వాసం ఓటర్లలో కలిగించాలి. కేవలం వాగ్ధాటి సరిపోదు.విశ్వసనీయత చాలా అవసరం. 2014 సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోదీ సృష్టించిన ప్రభంజనాన్ని ఆయనే అపార్థం చేసుకున్నారు. కేవలం తన వాగ్ధాటి కారణంగా, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టినందు వల్లా ప్రజలు భారతీయ జనతా పార్టీ (భాజపా) అభ్యర్థులను గెలిపించారని ఆయన భావించారు. యూపీఏతో విసిగి పోయిన ప్రజలు మెరుగైనా పాలన వస్తుందనే ఆశతో ప్రత్యామ్నాయంగా కనిపించిన భాజపాకి ఓట్లు వేశారని ఆయన అర్థం చేసుకోలేదు. అందుకే, ఢిల్లీలో, బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో సార్వత్రిక ఎన్నికల ప్రసంగాల ధోరణే కొనసాగించారు. ఆయన ఒక్కరే బిహార్‌లో విస్తృతంగా పర్యటించి అనేక ఎన్నికల సభలలో ధాటిగా ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీనీ, నెహ్రూ వంశాన్నీ ఘాటుగా విమర్శించారు. లాలూ ప్రసాద్‌నీ, నితీశ్ కుమార్నీ ఉతికి ఆరేశారు. ప్రయోజనం? శూన్యం. తాము ఆశించిన తీరులో ఎన్డీఏ ప్రభుత్వం పాలించడం లేదనేది ప్రజల స్వీయానుభవం. కేవలం ఉపన్యాసాలు విని మోసపోకూడదని వారు నిర్ణయించుకున్నారు. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ కూటమిని గెలిపించారు. బిహార్ ప్రజల నిర్ణయం సరైనదా కాదా అన్నది కాలం నిర్ధారిస్తుంది. కానీ తన చారిత్రక విజయాన్ని మోదీ అర్థం చేసుకున్న పద్ధతి సరైనది కాదని బిహార్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. కేసీఆర్‌కూ, కేటీఆర్‌కూ క్షేత్రజ్ఞానం ఉంది. ప్రజలనాడి తెలుసు. ఇంతటి భారీ ఆధిక్యంతో గెలిచి అపరిమితమైన అధికారం చేతుల్లో ఉన్నప్పుడు సంయమనం కోల్పోకుండా వివేకంగా, వినయంగా వ్యవహరించగల నాయకులకే భవిష్యత్తు ఉంటుంది. ప్రజల మనోభావాలు ఎప్పటికీ ఒకే విధంగా ఉండవు. వారి స్వానుభవం ఎప్పటికప్పుడు వారి ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఈ వాస్తవాన్ని గ్రహించడమే నాయకులకు రక్ష. -కె.రామచంద్రమూర్తి -
ఉన్నత విద్య విలవిల
త్రికాలమ్ ఎంసెట్ కౌన్నిలింగ్ వ్యవహారాన్ని తెగేవరకూ లాగిన ఫలితంగా సెకండ్ కౌన్సిలింగ్ లేక విద్యార్థులు నష్టపోయారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ కీచులాడుకుంటుంటే తమ భవిష్యత్తు ఏమైపోతుం దోనన్న భయంతో పొరుగు రాష్ట్రాలలోని విద్యాలయాలలో చేరిన తెలుగు విద్యార్థులు అనేకమంది. ఈ విపరిణామం చూసిన తర్వాతనైనా సిగ్గుపడి పద్ధతి మార్చుకోవలసిన రాజకీయ నాయకులూ, ఉన్నతాధికారులూ మొండి వైఖరినే కొనసాగించారు. ఒక రాష్ట్రాన్ని ఎట్లా విభజించకూడదో యూపీఏ ప్రభుత్వం ‘ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్’ ద్వారా చేసి చూపిస్తే, రాష్ట్రం చీలిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలూ ఎట్లా వ్యవహరించకూడదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలూ, కేంద్రం ఎట్లా నిర్లిప్తంగా ఉండకూడదో ఎన్డీఏ సర్కారూ నిరూపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో నినాదాలైన నీరూ, నిధులూ, నియామకాలు వివాదాలుగా వర్థిల్లడమే కాకుండా అనేక ఇతర అంశాలలో సైతం అగ్గి రగులుతూనే ఉంది. రెండు రాష్ట్రాల పాలకులు పరస్పరం సహకరించుకోకుండా, గౌరవించు కోకుండా, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించకుండా గట్టు పంచాయితీలు పెట్టుకొని కోర్టులకు ఎక్కి, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రజల జీవితాలను కష్టభూయిష్టం చేస్తున్నారు. గోటితో పోయే వాటిని రోకలికి కూడా లొంగకుండా చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నలిగి విపరీతంగా నష్టపోతున్నవారిలో ఏ పాపం ఎరుగని విద్యార్థులది ప్రథమస్థానం. ఉమ్మడి వ్యవస్థలుగా ఉంటూ రెండు రాష్ట్రాలకూ సేవ చేయవలసిన సంస్థలలో అన్నిటికంటే అధికంగా భ్రష్టపట్టింది ఉన్నత విద్యామండలి. పునర్వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్లోని 27వ అంశం ఉన్నత విద్యా మండలికి సంబంధించింది. అంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ, రెండు రాష్ట్రాల మంత్రులనూ, అధికారులనూ సంప్రదిస్తూ ఉన్నత విద్యారంగంలో ప్రమాణాలు పెంపొందించడానికి ప్రయత్నించాలి. విభజనకు పూర్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అనే పేరున్నది కనుక విభజన తర్వాత కూడా పదమూడు జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే అది జవాబుదారీగా ఉండాలనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదిస్తే లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తే సరిపోతుందనీ, తెలంగాణ ప్రభు త్వం, ప్రజలు, విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విధంగా విధిగా నడుచుకోవాలనే తప్పుడు అవగాహనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి వ్యవహరించారు. పేచీ మొదలయింది ఇలా... జగదీశ్వరరెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి హోదాలో కబురు పెడితే ఆయనను కలుసుకోవడానికి వేణుగోపాలరెడ్డి నిరాకరించినప్పుడే విభజన చట్టాన్ని అపార్థం చేసుకున్నారనీ, పెడార్థం తీస్తున్నారనీ అర్థమైపోయింది. ఇవి వేణుగోపాలరెడ్డి ఆలోచనలో లేక ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి గంటా శ్రీనివాస రావు పట్టింపో లేక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నిశ్చయమో తెలియదు కానీ తెలంగాణ మంత్రితో, తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శితో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే విశేషాధికారాలు విభజన చట్టం ఆం.ప్ర. ఉన్నత విద్యామండలికి ఇచ్చిందని చట్టాన్ని తప్పుగా అన్వయిం చుకున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వాన్ని లెక్కచేయలేదు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఒక ఉన్నత విద్యామండలిని ప్రొఫెసర్ పాపిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసింది. కనీసం ఆ మండలితో సమన్వయం చేసుకున్నా విద్యార్థులకు నష్టం జరిగేది కాదు. తెలంగాణ విద్యామండలిని గుర్తించడానికి ఆం.ప్ర. ఉన్నత విద్యామండలి నిరాకరించింది. ఎంసెట్ కౌన్నిలింగ్ వ్యవహారాన్ని తెగేవరకూ లాగిన ఫలితంగా సెకండ్ కౌన్సిలింగ్ లేక విద్యార్థులు నష్టపోయారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ కీచులాడుకుంటుంటే తమ భవిష్యత్తు ఏమైపోతుందోనన్న భయంతో పొరుగు రాష్ట్రాలలోని విద్యాలయాలలో చేరిన తెలుగు విద్యార్థులు అనేకమంది. ఈ విపరిణామం చూసిన తర్వాతనైనా సిగ్గుపడి పద్ధతి మార్చుకోవలసిన రాజకీయ నాయకులూ, ఉన్నతాధికారులూ మొండి వైఖరినే కొనసాగించారు. ఉన్నతాధికారుల పంపిణీ పూర్తి కాని కారణంగా, రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితుల దృష్ట్యా ఎంసెట్ కౌన్సిలింగ్ జరుపుకోవడానికి వీలుగా గడువును అక్టోబరు 31 వరకూ పొడిగించాలంటూ తెలంగాణ ప్రభు త్వం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. గతంలో సుప్రీంకోర్టు ప్రతి సంవత్సరం ఆగస్టు చివరికల్లా కౌన్సిలింగ్ పూర్తి చేసి సెప్టెంబరు మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలని తీర్పు ఇచ్చింది. ఇందుకు మినహాయింపు కావాలంటూ 2013లో ఆంధ్రప్రభుత్వం చేసిన అభ్యర్థనకు అత్యున్నత న్యాయ స్థానం అంగీకరించింది. అదే పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడం, ఆగస్టు చివరికల్లా కౌన్సిలింగ్ పూర్తి చేస్తానంటూ చెప్పడంతో సుప్రీంకోర్టు అందుకు అంగీకరించింది. ఇంటర్ బోర్డు ఆదర్శం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా రామశంకర్‌నాయక్ ఉన్న కాలంలో ఆయన రెండు ప్రాంతాల విధులనూ, నిధులనూ రాష్ట్ర విభజనకు పూర్వమే పంచారు. ఆయన దూరదృష్టి కారణంగా విభజన అనంతరం కూడా ఎటువంటి ఇబ్బందులూ, సమస్యలూ, పేచీలూ లేకుండా ఇంటర్ విద్య కొనసాగుతున్నది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం సొంతంగా ఇంటర్ బోర్డును నెలకొల్పి శైలజారామయ్యర్‌ను కార్యదర్శిగా నియమించినప్పటికీ ఉన్నత విద్య చవిచూసిన ఒడిదుడుకులు ఇంటర్ విద్యకు ఎదురుకాలేదు. రెండు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్లు రామశంకర్‌నాయక్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించాయి. నిధుల విషయంతోనే వివాదం ముదిరింది. ఉమ్మడి మండలి ఖాతాలో ఉన్న రూ. 120 కోట్లలో 42 శాతం వాటా ఇవ్వాలంటూ లేఖలు రాసింది. జవాబు లేదు. రోజువారీ కార్యక్రమాలు జరుపుకోవడానికి తాత్కాలికంగానైనా రెండు కోట్ల రూపాయలు కావాలంటూ అభ్యర్థించినా కుదరదంటూ సమాధానం వచ్చింది. చివరికి ఆంధ్రప్రదేశ విద్యామండలి ఖాతాను స్తంభింప జేయాలంటూ ఆంధ్రాబ్యాంకును తెలంగాణ ప్రభుత్వం కోరింది. బ్యాంకు యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. సమాధానం లేదు. ఆం.ప్ర. ఉన్నత విద్యాశాఖ మాత్రం ఇది ఉమ్మడి మండలి అనీ, దీన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుందనీ, తెలంగాణ మండలిని గుర్తించజాలమనీ సమాధానం చెప్పింది. అందువల్ల ఖాతాను స్తంభింపజేయడం సాధ్యం కాదంటూ ఆంధ్రాబ్యాంకు తెలంగాణ ప్రభుత్వానికి సమాధానం చెప్పింది. బ్యాంకులు కూడా ప్రాంతీయ ధోరణితోనే వ్యవహరించినట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు ఇదే రకమైన అభ్యర్థన తెలంగాణ ప్రభుత్వం నుంచి అందితే అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ మండలికి కానీ నోటీసులు ఇవ్వకుండానే మండలి ఖాతాను ఎస్బీహెచ్ స్తంభింపజేసింది. సిబ్బంది జీతాలు ఈ ఖాతా నుంచే చెల్లించాలి కనుక మండలి అధికారులు లబోదిబో అన్నారు. మరోసారి హైకోర్టుకు వెళ్లారు. తెలంగాణ సర్కార్ చొరవ తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి, అడ్వకేట్ జనరల్ సమష్టిగా వ్యవహరించి లక్ష్యం సాధిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. విద్యామంత్రికీ పట్టలేదు. మండలి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ, విద్యామంత్రి చుట్టూ తిరిగి అలసిపోయారు. అడ్వకేట్ జనరల్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 75వ సెక్షన్ గురించీ, పదో షెడ్యూల్ గురించీ, 27వ అంశం గురించీ మాట్లాడటానికి బదులు విభజన చట్టంపై విభేదాలు వస్తే కోర్టు పరిష్కరించాలంటూ బండవాదనకు పరిమితమైనారు. ఆం.ప్ర. ఉన్నత విద్యామండలి పిటిషన్ పరిశీలనలో ఉన్నప్పుడే న్యాయమూర్తి ఎస్వి భట్టి సానుకూలంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్ర విభజన చట్టం కింద విచారణకు వచ్చే అంశాలన్నిటినీ సింగిల్ జడ్డి కాకుండా డివిజన్ బెంచి పరిశీలిస్తే సమంజసంగా ఉంటుందంటూ తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అంతటితో ఆగకుండా పదో షెడ్యూల్ కింద పేర్కొన్న ఉమ్మడి సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి కనుక వాటి నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉండకూడదనీ, ఇందుకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్‌ను వేరే న్యాయమూర్తి విలాస్ అఫ్జల్పూర్కర్తో దాఖలు చేసింది. అన్ని అభ్యర్థనలనూ పరిశీలించిన తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా తన పదవీ విరమణకు ముందు వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నది కనుక అది తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందంటూ తీర్పు ఇచ్చారు. వెంటనే తెలంగాణ విద్యామండలి అధికారులు మసాబ్ ట్యాంకు దగ్గరున్న ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా 1958లో ఉన్నతాశయాలతో ఏర్పడిన ఉన్నత విద్యా మండలి వివాదాలపాలై నవ్వులపాలయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా మండలి ఎక్కడికి పోవాలన్నది ఒక్కటే ప్రశ్న కాదు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, 2014, లోని పదో షెడ్యూల్లో పేర్కొన్న 108 ఉమ్మడి సంస్థలలో అత్యధికం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. సేన్‌గుప్తా తీర్పు ప్రకారం ఆ సంస్థలన్నిటి నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే కావాలి. కానీ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం హైదరాబాద్ నగరంలో ఉన్న సంస్థలు తెలంగాణలో ఉన్నట్టు చెప్పడం వివాదాస్పదం అవుతుంది. సేన్‌గుప్తా తీర్పు పదో షెడ్యూల్ స్ఫూర్తికి భిన్నంగా ఉంది. ఇందుకు కారణం ఏపీ అడ్వకేట్ జనలర్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలోపం కావచ్చు. ప్రభుత్వ వైఖరి కావచ్చు. రెండు రాష్ట్రాలూ సమన్వయంతో నడుచుకోవాలనీ, పదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల నిర్వాహకులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సమాలోచన చేసి రెండు రాష్ట్రాల ప్రజలకూ సేవలందించాలనీ చెప్పవలసింది పోయి, సంస్థ కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నది కనుక అది తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందంటూ తీర్పు చెప్పడం తర్కానికి అందడం లేదు. ఇది విపరీతమైన పరిణామాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. పదో షెడ్యూల్లో ఉన్న సంస్థలలో ఏవి ఏ రాష్ట్ర పరిధిలో పని చేయాలో చట్టంలోనే స్పష్టం చేసి ఉంటే ఇంత గందరగోళం ఉండేది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చొరవ తీసుకొని ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించినా ఈ పాటికి స్పష్టత వచ్చేది. సంవత్సరంలోగా రెండు రాష్ట్రాలూ కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలనీ లేదా కేంద్రం పరిష్కరించాలనీ చట్టంలోని 76వ షెడ్యూలు స్పష్టం చేసింది. కేంద్రం పట్టించుకోకపోయినా సరే, రెండు రాష్ట్రాల విద్యామంత్రులూ, ఉన్నత విద్యా మండళ్ల సంచాలకులూ ఒక చోట కూర్చొని ఉన్నత విద్యను ఎట్లా ఉద్ధరించాలో ఆలోచించాలి. -
చంద్రశాసనం కాదు, చట్టపాలన కావాలి
త్రికాలమ్ ముఖ్యమంత్రులు ఇద్దరూ ఎన్కౌంటర్ చేసిన పోలీసుల చర్యను ఎందుకు ఖండించడం లేదు? పోలీసుల ఆత్మస్థయిర్యం దెబ్బతింటుందని. పోలీసు అధికారులను మందలించే సాహసం ముఖ్యమంత్రులు, హోంమంత్రులు చేయలేకపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే రోజు రెండు ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు పదేపదే గుర్తుకొస్తున్నారు. ఒకరు బాలగోపాల్, మరొకరు కన్నబీరన్. మూడు దశాబ్దాల కిందట బాలగోపాల్ భయం పోలీసులకే కాదు, పాలకులకే కాదు, పాత్రికేయులకూ ఉండేది. ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగినా బాలగోపాల్ నాయకత్వంలో నిజనిర్థారణ బృందం ఘటన జరిగిన స్థలానికి వెళ్లిరావడం, తమ బృందం తెలుసుకున్న నిజాలను మీడియా సమావేశంలో నిర్భయంగా చెప్పడం, వాటిని పొల్లుపోకుండా రాసి ప్రచురించడం అలవాటు. క్షేత్రంలో బాలగోపాల్ పర్యటనలు ఉండేవి. న్యాయస్థానంలో కన్నబీరన్ వాద నలు జరిగేవి. ఎన్కౌంటర్ల వార్తలు రాసే పాత్రికేయులకూ, వాటిపై వ్యాఖ్యా నాలు రాసే సంపాదకులకూ, సీనియర్ జర్నలిస్టులకూ మనసులో ఒక మూల భయసందేహాలు ఉండేవి. మనం రాస్తున్న విశ్లేషణను బాలగోపాల్ ఆమోది స్తారా లేదా అవహేళన చేస్తారా అనే సంకోచం పీడిస్తూ ఉండేది. ఇప్పుడా భయం పాత్రికేయులకు లేదు. ఎన్కౌంటర్ చేసిన పోలీసుల పేర్లు ప్రకటిస్తూ వారిపైన హత్యానేరం మోపుతూ కేసు పెట్టాలంటూ బాలగోపాల్ ఉద్యమం చేస్తారనే భయం పోలీసులకూ లేదు. మానవ హక్కులను హరిస్తున్నందుకు ప్రభుత్వాన్ని ఎండగడతారనే భయం పాలకులకు లేదు. కన్నబీరన్, బాల గోపాల్, చంద్రశేఖర్ (గుంటూరు న్యాయవాది, చుండూరు కేసులో దళితుల తరఫున వాదించిన మానవ హక్కుల నేత), ఇతర పౌరహక్కుల నాయకులూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన పారదర్శక, ప్రజాస్వామ్య వాతావరణం, పోలీసులనూ, పాలకులనూ నిలదీసే సాహసం క్రమంగా హరించుకుపో యింది. బాలగోపాల్ సజీవంగా ఉంటే శేషాచలం అడవుల్లో జరిగిన నరమేధం పట్ల, ఆలేరులో పోలీసు కస్టడీలో ఉన్న ఐదుగురు ముస్లిం నిందితుల హత్య పట్ల ఎట్లా స్పందించేవారో ఊహిస్తే, ఇప్పుడు స్పందన ఎంత పేలవంగా ఉన్నదో గమనిస్తే పౌరసమాజంలో వచ్చిన మార్పు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో కూడా ఎన్కౌంటర్ చేసిన పోలీసు అధికారులపైన కేసులు పెట్టే వారు కాదు. ఎన్కౌంటర్ అంటే నిరాయుధులను పోలీసులు కాల్చి చంపడం అనే అర్థం రూఢి అయింది. కానీ ఎప్పుడు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా పోలీ సుల కథనంతో పాటు ప్రత్యక్షసాక్షుల కథనం వచ్చేది. అనంతరం రెండు మూడు రోజులకు నిజనిర్ధారణ బృందం నివేదిక వచ్చేది. ప్రజలకు వాస్తవాలు కొంతవరకైనా తెలిసేవి. ఇప్పుడు పోలీసుల కథనం మాత్రమే వస్తున్నది. ఇతర కథనాలూ, ఇతర కోణాలూ రావడం లేదు. పైగా చనిపోయినవారు నేరస్థులే నంటూ ఊహించి కథనాలు ప్రచురించడం ద్వారా పాలకులకు మద్దతు ఇచ్చే రోజులు వచ్చాయి. పాలకులను ప్రశ్నించడం పోయి, వారి కొమ్ము కాసే కాలం దాపురించింది. ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత పదిరోజులకైనా హైదరాబాద్‌లో ఇందిరాపార్కు దగ్గర ధర్నా నిర్వహించిన పౌరహక్కుల నాయకులకూ, న్యాయస్థానంలో పిటిషన్లు వేసి వాదిస్తున్న న్యాయవాదులకూ అభినందనలు. నక్సలైట్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎన్‌కౌం టర్లు తరచుగా జరిగేవి. ఎన్కౌంటర్ చేసే ముందు పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. అగ్రశ్రేణి నక్సలైట్ నాయకులను మహారాష్ట్రలో అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా అడవులలోకి తీసుకొని వచ్చి కాల్చి చంపిన ఘటన అందరికీ తెలిసిందే. శేషాచలం, ఆలేరు ఎన్కౌంటర్లలో పాల్గొన్న పోలీసులకు చట్టభయం బొత్తిగా లేదనీ, తెలివితేటలు తక్కువనీ, సరైన శిక్షణ కూడా లేదనీ మాజీ డీజీపీ ఒకరు వ్యాఖ్యానించారు. ‘నా శిక్షణలో తయారైన అధికారులు ఇంత అవివే కంగా ఎన్కౌంటర్ చేయరు’ అని అన్నారు. తెలంగాణలో పనిచేసిన పోలీసు అధికారులకు ఎన్కౌంటర్ చేసే ముందు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసు. జరిగింది ఏకపక్షం కాల్పులు కాదనీ, నిజంగా ఎన్కౌంటరేననీ నమ్మిం చేందుకు పోలీసు జవాన్లు ప్రాణాపాయం లేకుండా తొడలోనో, కాళ్లమీదో ఎముకకు తగలకుండా కాల్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. శేషాచలం అడవులలో చనిపోయిన ఇరవై మంది కూలీలలో పదకొండు మంది ఆదివాసులని జాతీ య ఎస్టీ కమిషన్ వైస్‌చైర్మన్ రవి ఠాకూర్ శనివా రం నాడు తిరుపతిలో చెప్పారు. ప్రభుత్వం, పోలీ సు అధికారులు వాదిస్తున్నట్టు కూలీలు స్మగ్లర్లు నియమించినవారే కావచ్చు. అర్ధరాత్రి అడవుల్లో చెట్లు నరికే వారు మామూలు కూలీలు కాకపోవ చ్చు. కానీ వారినీ, వారిని నియమించిన దొంగ వ్యాపారులనీ అరెస్టు చేసి న్యాయస్థానంలో బోనె క్కించి నేరం నిరూపిం చడానికి అవసరమైన యంత్రాగాన్ని సమాయ త్తం చేసుకోవాలి కానీ చొక్కాలు కూడా లేని కూలీల ఛాతిమీద కాల్చి చంపడం అమానుషం. ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక) దాఖలు చేయాలంటూ బిలాల్ నజ్కీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా ఉన్న కాలంలో ఆయనా, జస్టిస్ రఘురామ్, మరో న్యాయమూర్తి ఉన్న ధర్మాసనం నిర్ణయించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది. హైకోర్టు తీర్పుపైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సాధారణంగా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని చెబుతారు. శేషాచలంలో రాళ్లతో తమపైన దాడి చేసిన కారణంగా కూలీలను చంపివేశామని పోలీసులు చెబితే, ఆలేరులో నిందితులలో ఒకరు పోలీసు జవాను చేతిలోని రైఫిల్ లాక్కొని తమపైన కాల్పులు జరపబోతే తిరిగి కాల్చవలసి వచ్చిందని చెబుతున్నారు. రెండువాదనలలో పసలేదని ఇంగితజ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా తెలిసి పోతుంది. ఎర్రచందనం దొంగలు అటవీశాఖ అధికారులనూ, పోలీసు అధికారు లనూ హత్య చేసిన మాట వాస్తవమే. ఎర్రచందనం అపహరణను నిలువరించ వలసిన అవసరం ఉన్న మాటా కాదనలేం. వీరప్పన్కూ, ఆతని ముఠాసభ్యు లకూ ఆశ్రయం, సమాచారం ఇచ్చిన వారిపైన తమిళనాడు ప్రభుత్వం ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు. వీరప్పన్ వారసులు చాలామంది ఎర్రచందనం చెట్లు నరికించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న మాట నిజం. వీరి ఆట కట్టిం చాలంటే తమిళనాడు ప్రభుత్వంతో కలసి సంయుక్తంగా వ్యూహం రచించాలి. దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేసి కేసులు పెట్టాలి. నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించాలి. అందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకోవాలి. నేరం నిరూపించే శక్తియుక్తులు లేక, సహనం లేక నిందితులను న్యాయస్థానంలో విచారించే పని లేకుండా ఎన్‌కౌం టర్ చేయడం చట్టవిరుద్ధం. రెండు ఎన్కౌంటర్లూ బూటకమే ఆలేరు ఎన్కౌంటర్లో మరణించిన వికార్ అహ్మద్ అలియాస్ వికారుద్దీన్, సులేమాన్ ఇద్దరూ నేరాలు చేసినట్టు దాఖలాలు ఉన్నాయి. వికార్ తనను తానే జిహాదీగా పరిగణించుకొని ఫసియుద్దీన్ మాదిరి దోపిడీ చేసిన డబ్బుతో దాడులు నిర్వహించేవాడని పోలీసుల సమాచారం. అహ్మదాబాద్‌లో మకాం పెట్టి ఏకంగా నరేంద్రమోదీపైన దాడి చేయడానికి ప్రయత్నించాడనీ, అక్కడే వినయ్ యాదవ్ అనే పోలీసు కానిస్టేబుల్ని హత్య చేశాడనీ ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా ఒక కానిస్టేబుల్నీ, ఒక హోంగార్డునూ చంపాడని పోలీసుల ఆరోపణ. ఇతనిపై హైదరాబాద్‌లో కానీ అహ్మదాబాద్‌లో కానీ చార్జిషీటు దాఖలు కాలేదు. అండర్‌ట్రయల్‌గా ఉండగానే ఇతను చంచల్ గూడా జైలులో వార్డెన్‌పై చేయి చేసుకుంటే వరంగల్లు జైలుకు తరలించారు. అక్కడి నుంచి ఏప్రిల్ ఏడవ తేదీన నాంపల్లి కోర్టుకు తీసుకువస్తున్న సమ యంలో ఆలేరు దగ్గర బస్సులోనే అతడినీ, నలుగురు సహచరులనీ కాల్చి చంపారు. పద్దెనిమిది మంది సాయుధ పోలీసులు అయిదుగురు అండర్ట్ర యల్స్ వెంట ఉన్నారు. ఒక్క పోలీసు ఉద్యోగికీ చిన్న దెబ్బకూడా తగలకుండానే అయిదుగురు నిందితులనూ కాల్చిచంపడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఉగ్రవాదులను ఉపేక్షించాలని ఎవ్వరూ వాదించడం లేదు. ఎర్రచందనం దొంగలను నిరోధించవద్దని ఎవ్వరూ అనడం లేదు. పోలీసులే చట్టాన్ని చేతు లోకి తీసుకొని ఎవరిపైన అనుమానం ఉంటే వారిని కాల్చివేస్తుంటే ఇక చట్టాలెందుకు, న్యాయస్థానాలెందుకు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శేషాచలం ఎన్కౌంట ర్ని ఖండించిన దాఖలా లేదు. తమిళనాడు ముఖ్యమంత్రికి లేఖ రాస్తామ న్నారు. మెజిస్ట్రేట్‌తో దర్యాప్తు జరిపిస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారంలోకి వస్తూనే పోలీసులకు కొత్త వాహనాలు ఏర్పాటు చేశారు. వారికి అదనపు సౌకర్యాలు సమకూర్చారు. పోలీసు వ్యవస్థ పటిష్ఠంగా ఉంటేనే శాంతిభద్రతలు సజావుగా ఉంటాయంటూ అనేక సందర్భాలలో అన్నారు. మొన్న కలెక్టర్లతో విడియో కాన్ఫరెన్స్ ప్రారంభిస్తూ అన్నిటి కంటే శాంతిభద్రతల పరిరక్షణ ముఖ్యమని నొక్కి చెప్పారు. వికారుద్దీన్ బృందం హత్యని ముఖ్యమంత్రి బహిరంగంగా ఖండించలేదు. వారి మరణంపై దర్యాప్తు జరిపించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ (సిట్)ను నియమిస్తామని ప్రక టించారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ ఎన్కౌంటర్ చేసిన పోలీసుల చర్యను ఎం దుకు ఖండించడం లేదు? పోలీసుల ఆత్మస్థయిర్యం దెబ్బతింటుందని. పోలీసు అధికారులను మందలించే సాహసం ముఖ్యమంత్రులు, హోంమంత్రులు చేయ లేకపోతున్నారు. ‘మీకూ, మావోయిస్టులకూ మధ్యా, మీకూ, ఉగ్రవాదులకూ మధ్య మేము లేకపోతే మీ పని ఖాళీ’ అంటూ పోలీసు అధికారులు న్యాయమూ ర్తులనూ, రాజకీయ నాయకులనూ, ఐఏఎస్ అధికారులనూ హెచ్చరించే పరిస్థి తులున్నాయి. అందువల్ల ఎన్కౌంటర్ చేయడం అనవసరమనీ, చట్టబా హ్యమనీ, నేరమనీ స్పష్టంగా తెలిసినప్పటికీ పోలీసు అధికారులను తప్పు పట్టడానికి పాలకులు సిద్ధంగా లేరు. శేషాచలం ఎన్కౌంటర్ తీవ్రత దృష్ట్యా దాని దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను హైకోర్టు స్వీకరించింది. రెండు ఎన్‌కౌం టర్లపైనా పదవిలో ఉన్న న్యాయమూర్తుల చేత దర్యాప్తు జరిపించి నిజం నిగ్గు తేల్చాలి. చట్టంతో నిమిత్తం లేకుండా వ్యక్తిగత ఎజెండాతో ఎవరు వ్యవహరిం చినా అప్రజాస్వామికమే. చంద్రబాబునాయుడినీ, చంద్రశేఖరరావునీ ముఖ్య మంత్రులుగా ప్రజలు ఎన్నుకున్నది చంద్రశాసనం అమలు చేయాలని కాదు. చట్టపాలన అమలు చేయాలని. చట్టాలని ఉపయోగించుకొని జనరంజకంగా పాలించాలని. చట్టాలు చాలకపోతే కొత్త చట్టాలు చేసుకోవచ్చును కానీ ఉన్న చట్టాలను ఉల్లంఘించడం, జీవించే హక్కును కాలరాయడం శిక్షార్హమైన నేరం. -
పాక్ సైన్యం నెత్తుటి క్రీడ
త్రికాలమ్ లఖ్వీని విడుదల చేయడాన్ని అమెరికా ప్రభుత్వం ఖండించింది. ఇంకా చాలా దేశాలు పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని గుర్తిస్తున్నాయి. పాకిస్తాన్‌ను ఒంటరి చేయడం ఇండియాకు మాత్రమే సాధ్యమయ్యే పనికాదు. అందుకు పాకిస్తాన్ సైన్యం దండిగా సహకరిస్తున్నది కనుక భారత్‌కు బెంగ అనవసరం. పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగి స్తూనే, చర్చలు జరుపుతూనే ఉండవచ్చు. కానీ వాటిపైన పెద్దగా ఆశలు పెట్టుకోనక్కరలేదు. తమ దేశం ముక్కలు చెక్కలు కావాలో, శాంతిసుస్థిరతలతో విలసిల్లాలో తేల్చుకోవలసింది పాకిస్తాన్ సైన్యం మాత్రమే. ‘సరిహద్దులలో మన జవాన్ల తలలు తెగిపడుతుంటే యూపీఏ సర్కార్ చేతులు ముడుచుకొని కూర్చున్నది. చేతకాని ప్రభుత్వం, చేతన లేని ప్రధాని దేశానికి అరిష్టం.’ అంటూ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారసభలలో చేసిన గర్జన బీజేపీకి అనేక లక్షల ఓట్లు సంపాదించి ఉంటుంది. మన్మోహన్ సింగ్ స్థానంలో నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా సరిహద్దులో పరిస్థితి మారలేదు. పాకిస్తాన్ వైఖరి మార బోదు. భారత్-పాకిస్థాన్ సంబంధాలపైన అవగాహన ఉన్నవారికి ఈ సంగతి తెలుసు. 2008 నవంబర్ 26న పది మంది పాకిస్తానీ ఉగ్రదాడులను ముంబ య్‌లో దాడులు చేయడాన్ని కరాచీలో ఉంటూ మొబైల్ సందేశాలతో నడిపిం చిన లష్కరే తయ్యబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీని కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేసినప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం ఏమి చేస్తున్నదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని బీజేపీ నాయకులు తిరుగుదాడికి దిగారు. వాస్తవం ఏమంటే ఎవరు అధికా రంలో ఉన్నప్పటికీ ఈ విషయంలో తక్షణం చేయగలిగింది ఏమీలేదు. ఆవేశం తగ్గించుకొని ఆలోచన పెంచుకుంటే, పాకిస్తాన్ నిజస్వరూపం అర్థం చేసుకోవ డానికి ప్రయత్నిస్తే మన నిస్సహాయ స్థితి బోధపడుతుంది. భారత్ మాత్రమే కాదు, అమెరికా సైతం నిధులు కుమ్మరించినా ఫలితం లేక ఎవరికి చెప్పుకో వాలో తెలియక పాకిస్తాన్ మాయాజాలంలో పడిపోయి కొట్టుకుంటోంది. ఈ క్రీడ వల్ల పాకిస్తాన్‌కి ఏైమైనా ప్రయోజనమా? శూన్యం. పైగా అపారమైన నష్టం. ఆత్మహత్యాసదృశం. ఇస్లామీయవాదం ఆయుధంగా... ఇస్లామీయవాదాన్ని తలకెక్కించుకొని, దానిని ఒక ఆయుధంగా ప్రయోగిస్తూ పబ్బం గడుపుకోవడమే విదేశాంగ విధానంగా పాకిస్తాన్ కొనసాగిస్తున్నది. పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే 1947లోనే గిరిజనుల ముసుగులో కశ్మీర్‌పై దాడి చేసింది మొదలు లఖ్వీ విడుదల దాకా పరిశీలిస్తే స్పష్టమైన వ్యూహం కని పిస్తుంది. పాకిస్తాన్లో ప్రభుత్వాలు మారినా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు మారినా ఈ వ్యూహం మాత్రం మారడం లేదు. అమలు చేస్తున్నది సైన్యం కనుక. సేనాధిపతులందరికీ ఇస్లామీయ శక్తులను వినియోగించడం ద్వారా దేశంలో ఆధిపత్యం చెలాయించడం, ప్రభుత్వాన్నీ, కోర్టులనూ అదు పులో పెట్టుకోవడం అలవాటైనది కనుక ఈ విధానం మారదు. లఖ్వీ జైలులో ఉన్నా, జైలు వెలుపల ఉన్నా ఇండియాకు సంబంధిం చినంత వరకూ తేడా లేదు. దాడులు చేయించాలంటే జైలులో ఉండి కూడా ప్రణాళిక రచించి అమలు చేసే అవకాశం లఖ్వీబోటి ఉగ్రవాదులకు ఉన్నది. జైలులో ఉంటూనే తండ్రి కాగలిగిన లఖ్వీ ఏమైనా చేయగలడు. పాకిస్తాన్ పాలక వ్యవస్థ అటువంటి వెసులుబాటు ఉగ్రవాదులకు కల్పిస్తున్నది. దావూద్ ఇబ్రహీం దర్జాగా తిరుగుతున్నా, లష్కరే తయ్యబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ హీరోలాగా సంచరిస్తున్నా షరీఫ్ సర్కార్‌కు అభ్యంతరం లేదు. దేశ రాజధాని సమీపంలో అల్‌ఖాయిదా అధినేత ఒసామాబిన్ లాదెన్ను రహ స్యంగా (అమెరికా మట్టుపెట్టేవరకూ)దాచిన సైనిక వ్యవస్థ అది. ముంబయ్‌లో 166 మందిని పాక్ ఉగ్రవాదులు చంపిన ఘటన ప్రభుత్వ వైఖరిని కానీ సైన్యం ధోరణిని కానీ ఇసుమంతైనా మార్చలేదు. పాకిస్తాన్ సైన్యం పోడకలపై పుస్తకం రాసిన క్రిస్టియన్ ఫెయిర్ విశ్లేషణ ప్రకారం ఉగ్రవాదాన్ని పోషిస్తూనే ఉగ్రవాదం వల్ల నష్టబోతున్న దేశంగా గుర్తిం పు పొందడం, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తున్న దేశంగా అమెరికా నుంచీ, ఇతర పాశ్చాత్య దేశాల నుంచీ అపారమైన ఆర్థిక సహాయం పొందడం పాకిస్తాన్ పాటిస్తున్న విదేశాంగ నీతి. అణ్వస్త్రాలు తయారు చేయడం ద్వారా ఇండియా ముందరి కాళ్ళకు బంధం వేయగలిగింది పాకిస్తాన్. లష్కరే తయ్య బాను అమెరికా నిషేధించిన తర్వాత ఆ సంస్థ తన కార్యకలాపాలను జమాత్ ఉద్ దవా, జైషే మహమ్మద్‌ల ద్వారా కొనసాగిస్తోంది. ఈ రెండు సంస్థలూ కలిసి మొత్తం 162 దాడులు జరిపి 1,132 మంది పౌరులను చంపినట్టూ, 2, 423 మందిని గాయపరచినట్టూ అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్శిటీ పరిశోధనలో తేలింది. ఈ ఉగ్రవాద సంస్థలపైన పాకిస్తాన్లో అదుపాజ్ఞలు లేవు. క్రిస్టియన్ ఫెయిర్ అంచనా ప్రకారం ఇంతవరకూ అమెరికా పాకిస్తాన్ ప్రభుత్వానికీ, సైన్యానికీ 31 వందల కోట్ల డాలర్లు ఉచితంగా ఇచ్చింది. బదులుగా అమెరికాకు ఓరిగింది ఏమిటి? అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియెట్ యూనియన్ను తరిమివేయడం ఒక్కటే అగ్రరాజ్యం సాధించిన విజయం. ఆ క్రమంలో పాకిస్తాన్‌తో కలిసి అమెరికా సృష్టించిన ఉగ్రవాదులు తాలిబాన్. వారి దాడులలో అఫ్ఘానిస్తాన్‌లోని అమెరికా సైనికులూ, మిత్రదేశాల సైనికులూ, ఆఫ్ఘాన్ సైనికులూ వేలమంది చనిపోయారు. తాలిబాన్ పాకిస్తాన్లో సైతం నెత్తుడి క్రీడ కొనసాగిస్తున్నది. తాలిబ్లను నిలువరించేందుకు చేసిన ప్రయ త్నంలో పాకిస్తాన్ సైనికులు సైతం మరణిస్తున్నారు. ఫ్రాంకెన్‌స్టీన్ అనే శాస్త్రవేత్త సృష్టించిన పెనుభూతం ఆ శాస్త్రవేత్తనే బలితీసుకున్నట్టు పాకిస్తాన్ తయారు చేసిన తాలిబాన్ ఆ దేశానికే ప్రమాదంగా పరిణమించింది. పొరుగుదేశం కనుకా, కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది కనుకా పాకిస్తాన్ ఉగ్ర వాద విధానం ప్రభావం నుంచి తప్పించుకోవడం భారత్‌కు సాధ్యం కాకపో వచ్చు. అటల్ బిహారీ వాజపేయి చెప్పినట్టు మన పొరుగున ఎవరు ఉండాలో మనం నిర్ణయించుకునే అవకాశం లేదు. పాకిస్తాన్ అస్తిత్వానికి ఏర్పడుతున్న ముప్పును గ్రహించి ఉగ్రవాదాన్ని అణచివేయాలని ఆ దేశంలోని సైన్యాధిప తులు నిర్ణయించుకుంటే తప్పించి ఈ విపత్తు తొలగిపోయే అవకాశం లేదు. ఉగ్రవాదం నుంచి తనను తాను కాపాడుకోవడానికే ఇండియా ప్రయత్నించాలి. పాకిస్తాన్‌పైన అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచడానికి దౌత్యపరంగా కృషి చేస్తూనే కశ్మీరీల హృదయాలు గెలుచుకునే మార్గం అన్వేషించాలి. ఇది అనుకు న్నంత సులభం కాదు. క శ్మీర్ లోయలో భారత వ్యతిరేకత తీవ్రంగా ఉంది. పాకిస్తాన్ పట్ల ప్రేమ తగ్గుతున్నది కానీ భారత్ పట్ల సుముఖత పెరగడం లేదు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ నాయకత్వంలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం అనుసరించే విధానాలు జనరంజకంగా ఉంటే, ప్రజలలో కొన్నేళ్ళుగా పేరుకొని పోయిన వ్యతిరేక భావం తగ్గించగలిగితే, భారత్‌లో భాగంగా ఉండటమే శ్రేయస్కరమనీ, లాభదాయకమనే అభిప్రాయం కశ్మీరీల మనస్సులో బలంగా నాటుకుంటే పాకిస్తాన్ చేయగలిగిన హాని ఏమీ లేదు. ఇందుకు భిన్నంగా పరిణామాలు సంభవించి, విభేదాల కారణంగా పీడీపీ-బీజేపీ ప్రభుత్వం కూలి పోయి రాజకీయ అనిశ్చితి చోటు చేసుకుంటే పరిస్థితి మరోసారి దిగజారు తుంది. పాకిస్తాన్ అటు అఫ్ఘానిస్తాన్‌పై పోరాటానికి తాలిబాన్‌ను ప్రేరేపిస్తూనే ఇటు కశ్మీర్‌ను వశం చేసుకోవడానికి ఇస్లామీయవాదాన్ని వినియోగించుకుం టుంది. దీనికి విరుగుడు ఢిల్లీలో లేదు. శ్రీనగర్‌లో ఉంది. ముఫ్తీ ప్రభుత్వం పనితీరులో ఉంది. కశ్మీర్లో తిరిగి కుంపటి రాజేసే అవకాశం పాకిస్తాన్‌కు ఇవ్వనంత వరకూ లఖ్వీ వంటి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉండదు. కశ్మీరీల సహకారం, భాగస్వామ్యం లేకుండా ఆ లోయలో అశాంతిని రగిలించడం ఉగ్రవాదుల వల్ల కాదు. పాక్ సైన్యం బరితెగింపు భారత్‌లో మారణహోమం సాగించి, విధ్వంసం సృష్టించిన పేరుమోసిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, రాచమర్యాదలు చేయడం, పాక్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేందుకు సదుపాయం కల్పించడం పాకిస్తాన్ సైన్యం బరితెగింపునకు నిదర్శనాలు. లఖ్వీని విడుదల చేయడాన్ని అమెరికా ప్రభుత్వం ఖండించింది. ఇంకా చాలా దేశాలు పాకిస్తాన్ నిజ స్వరూ పాన్ని గుర్తిస్తున్నాయి. పాకిస్తాన్‌ను ఒంటరి చేయడం ఇండియాకు మాత్రమే సాధ్యమయ్యే పనికాదు. అందుకు పాకిస్తాన్ సైన్యం దండిగా సహకరిస్తున్నది కనుక భారత్‌కు బెంగ అనవసరం. పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగి స్తూనే, చర్చలు జరుపుతూనే ఉండవచ్చు. కానీ వాటిపైన పెద్దగా ఆశలు పెట్టుకోనక్కరలేదు. తమ దేశం ముక్కలు చెక్కలు కావాలో, శాంతిసుస్థిరతలతో విలసిల్లాలో తేల్చుకోవలసింది పాకిస్తాన్ సైన్యం మాత్రమే. సైన్యాధికారుల వైఖరి మారనంతవరకూ పాకిస్తాన్ ప్రజలు సైతం నిస్సహాయులే. ఇస్లామీయ శక్తులనూ, తాలిబాన్‌నూ వినియోగించుకొని అఫ్ఘానిస్తాన్‌ను జయించాలనే తాపత్రయం, కశ్మీర్‌ను కాజేయాలన్న కాంక్ష వీడకపోతే పాకిస్తాన్ ఉనికికే ప్రమా దం. ఇది ఇండియా స్వాగతించవలసిన దృశ్యం కాదు. పాకిస్తాన్ ప్రజలు క్షేమంగా, సంతోషంగా ఉండాలనే భారతీయులంతా అభిలషించాలి. పాకిస్తాన్ సైన్యం ఆత్మాహుతి చేసుకోవడాన్ని నివారించే శక్తి సైతం ఇండియాకు లేదు. అదే విషాదం. -
సమష్టి నాయకత్వం మిథ్య!
త్రికాలమ్ తెలంగాణ ఉద్యమంలో భుజం కలిపి నడిచిన కోదండరాంని కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూరంగా పెట్టడానికి కారణం ఏమిటి? కోడెల శివప్రసాద్‌కి మంత్రిపదవి ఇవ్వకుండా స్పీకర్‌గా కూర్చోబెట్టడానికి చంద్రబాబుకి ఉన్న సమస్య ఏమిటి? పైకి ఎంత ధైర్యంగా కనిపించినప్పటికీ అభద్రతాభావం నాయకులను వెన్నాడుతుంటుంది. లోక్‌సత్తాకి సత్తా లేకపోయినప్పటికీ ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ తనతో ఏకీభవించేందుకు నిరాకరించిన చిరకాల సహచరులు వర్మ, శ్రీనివాసరావులపై బహిష్కరణ వేటు వేశారు. ప్రజాస్వామ్యం, సమష్టి నాయకత్వం మన మనస్తత్వానికి పొసగే ఆదర్శాలు కావేమో! మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా నాయకులందరూ సమానస్థాయిలో సమాలోచనలు జరిపి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు లేవు. ప్రజాదరణ పొందిన అధినాయకుడిని ఇతర నాయకులు అనుసరించడమే కానీ అందరూ కలిసి ఆలోచించి ఆమోదించిన తీర్మానం అంటూ ఉండదు. శనివారంనాడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ మండలి సమావేశం జరిగిన తీరూ, పార్టీ వ్యవస్థాపక సభ్యులైన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ ఆనంద్ కుమార్; ప్రొఫెసర్ అజిత్ ఝాలను పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి బర్తరఫ్ చేసిన విధానం గమనించినవారికి ఆశ్చర్యం కలిగి ఉండదు. ఆవేదన చాలామందికి కలిగి ఉంటుంది. రెండేళ్లు జయప్రదంగా మనగలగడమే కాకుండా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అపూర్వ విజయాన్ని నమోదు చేసుకొని చరిత్ర సృష్టించిన పార్టీ సంఘటితమై, విస్తరించాల్సిన తరుణంలో విభేదాలతో కొట్టుమిట్టాడటం, చీలిక దశకు చేరుకోవడం విషాదం. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ నాయకులు చెప్పుకున్న సంకల్పం ఆచరణ సాధ్యమైనది కాకపోవడం. 1952 నుంచి దేశంలో జరుగుతున్న ఎన్నికలను క్రమంగా ధనబల ం, కులబల ం,కండబల ం భ్రష్ట పట్టించిన తర్వాత స్వచ్ఛమైన, పరిశుద్ధమైన జనహితమైన రాజకీయం చేస్తామంటూ అరవింద్ కేజ్రీవాల్ ముందుకు వచ్చినప్పుడు సాధ్యాసాధ్యాలపైన అనుమానాలు ఉన్నప్పటికీ అత్యధికులు ఆహ్వానించారు. గుర్రం ఎగరా వచ్చు అన్నట్టు అద్భుతం జరగావచ్చునని ఆశగా ఎదురు చూశారు. ఆప్ జాతీయ మండలి సమావేశంలో కొంతమంది సభ్యులను కొట్టినట్టు ప్రశాంత భూషణ్ ఆరోపించారు. అయినప్పటికీ ఆప్ కండబలంపైన ఆధారపడిన పార్టీ కాదు. కులగణాంకాలు పరిగణించి ఎన్నికలలో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇచ్చిన పార్టీ కాదు. ఎన్నికల ఖర్చుకోసం చందాలు వసూలు చేసినప్పటికీ చందాదారుల పేర్లూ, చందాల మొత్తాల వివరాలూ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు పెట్టారు. ఆ మాత్రం నిష్టగా, నియమబద్ధంగా, ఆదర్శవంతంగా ఎన్నికల సమయంలో వ్యవహరించడమే అపూర్వం. ఆప్ దేశమంతటా విస్తరించాలనీ, ప్రత్యామ్నాయ రాజకీయాలకు విశాల వేదిక కావాలనీ ఆకాంక్షించినవారు కోట్ల మంది ఉన్నారు. వారందరికీ తాజా పరిణామాలు ఆశాభంగం కలిగించి ఉంటాయి. గుండెలు బరువెక్కి ఉంటాయి. నిరాధారమైన ఆరోపణలు సహచరుల విమర్శలను సహృదయంతో స్వీకరించి దిద్దుబాటు చర్యలు తీసుకునే సహనం, సంయమనం చాలా తక్కువ మంది నాయకులకు ఉంటుంది. యాదవ్, భూషణ్‌లు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినారనీ, పార్టీని ఓడించే ప్రయత్నం చేశారనీ అధికారవర్గం చేసిన ఆరోపణలను నిరూపించలేదు. వారిద్దరూ రాజీనామా పత్రాలు సమర్పించారన్నది కూడా సత్యదూరం. పార్టీ కన్వీనర్ పదవి నుంచి కేజ్రీవాల్ తప్పుకోవాలని వారిద్దరూ పట్టుపట్టారంటూ వచ్చిన ఆరోపణలు నిరాధారమని తేలింది. వారికి సంజాయిషీ నోటీసులు ఇవ్వలేదు. జాతీయ మండలి సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అసలు విషయం ఏమిటంటే సమాన స్థాయి కలిగిన ముగ్గురు నాయకులు కలసి పార్టీని నడిపించడం సాధ్యం కాదని తేల్చారు. ఇందులో ఎవరిది తప్పో, ఎవరిది కుట్రో, ఎవరు బలైనారో, ఎవరు బలిచేశారో ఎప్పటికీ తేలకపోవచ్చు. కానీ జరిగిన పరిణామాలలో మాత్రం వింత లేదు. ఇది చాలా సహజమైన పర్యవసానం. ఉద్యమాలు నడిపిన నాయకులకూ, ఉద్యమాల తర్వాత అధికారంలోకి వచ్చిన నాయకులకూ ఆత్మవిశ్వాసం అధికం. తమ అభిప్రాయమే సరైనదనే గాఢమైన నమ్మకం వారికి ఉంటుంది. అందుకు భిన్నంగా ఎవరైనా మాట్లాడినా, వాదించినా సహించే శక్తి ఉండదు. మహామహా నాయకులే స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న సహచరులను భరించలేకపోయారు. తనతో విభేదించి పార్టీ నుంచి నిష్ర్కమించినవారిని కూడా వెనక్కి పిలిపించుకొని మంత్రి పదవులు ఇచ్చిన సంస్కారం లెనిన్ ప్రదర్శించాడు. సలహాలు స్వీకరించే సహృదయం లేని స్టాలిన్ సహచరులను శత్రువులుగా పరిగణించి వారి ప్రాణాలు తీయించాడు. శాంతిప్రియుడుగా, జాతిపితగా గౌరవించే గాంధీజీ సైతం తన అభిమతానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైన సుభాష్‌చంద్ర బోస్‌ను ఉపేక్షించలేకపోయారు. ఆ పదవి నుంచి బోస్ వైదొలిగి తన అభ్యర్థి పట్టాభిసీతారామయ్య చేతికి పార్టీ పగ్గాలు వచ్చేవరకూ గాంధీ విశ్రమించలేదు. నెహ్రూ సైతం తనతో పొసగని టాండన్ చేత ఏఐసీసీ అధ్యక్ష పదవికి బలవంతంగా రాజీనామా చేయించి పార్టీ బాధ్యతలు తానే స్వీకరించారు. ఇందిరాగాంధీ 1966లో ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొద్ది మాసాలకే మొరార్జీ దేశాయ్, కామరాజ్ నాడార్, నిజలింగప్ప, సంజీవరెడ్డి, అతుల్యఘోష్ వంటి సీనియర్లను సిండికేటుగా అభివర్ణించి వారి బెడద వదిలించుకునేందుకు పార్టీని చీల్చారు. ప్రధానిగా ఉంటూనే పార్టీని గుప్పిటలో పెట్టుకున్నారు. రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు సైతం జోడు పదవులను నిర్వహించినవారే. సోనియాగాంధీకి ఎదురు చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మనగలరా? నరేంద్రమోదీ మాట కాదంటే బీజేపీలో చోటుంటుందా? ఆర్ఎస్ఎస్ వల్ల మోదీ ఎంతో కొంత రాజీపడవలసి వస్తున్నదేమో కానీ దేశంలోని ప్రాంతీయ పార్టీలకు అటువంటి ఇబ్బంది కూడా లేదు. తెలంగాణ ఉద్యమంలో భుజం కలిపి నడిచిన కోదండరాంని కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూరంగా పెట్టడానికి కారణం ఏమిటి? కోడెల శివప్రసాద్‌కి మంత్రిపదవి ఇవ్వకుండా స్పీకర్‌గా కూర్చో బెట్టడానికి చంద్రబాబు నాయుడికి ఉన్న సమస్య ఏమిటి? పైకి ఎంత ధైర్యంగా కనిపించినప్పటికీ అభద్రతాభావం నాయకులను వెన్నాడుతుంటుంది. లోక్‌సత్తాకి సత్తా (అధికారం) లేకపోయినప్పటికీ ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ తనతో ఏకీభవించేందుకు నిరాకరించిన చిరకాల సహచరులు వర్మ, శ్రీనివాసరావులపై బహిష్కరణ వేటు వేశారు. ప్రాంతీయ పార్టీ ముఖ్యనేతను విమర్శించేవారు ఆ పార్టీలో కొనసాగడం అసంభవం. ఇందుకు భిన్నంగా అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఎంతకాలం ఉండగలరు? ఆర్టీఐకి లోబడి ఉండాలంటూ, రెండు కోట్ల రూపాయల తబ్శీళ్లు చెప్పాలంటూ, పారదర్శకంగా వ్యవహరించాలంటూ, నేరచరిత్ర ఉన్నవారికి టిక్కెట్లు ఎందుకిచ్చారంటూ నిలదీసేవారు వ్యవస్థాపక సభ్యులైనా, మేధావులైనా వారిని శిరసావహించే శక్తి కేజ్రీవాల్‌కు లేదు. ఎవ్వరికీ ఉండదు. ఉండాలన్నది ఆదర్శమే కానీ ఆచరణలో కనిపించదు. తొలగిన ముసుగు ఐఐటీ పట్టభద్రుడూ, రెవెన్యూ సర్వీస్ ఉన్నతాధికారీ, మేగ్సెసే పురస్కార గ్రహీతా, అన్నా హజారే అనుంగు శిష్యుడూ, అసాధారణ సమ్మోహనశక్తి కలిగిన ప్రజానాయకుడూ అయిన కేజ్రీవాల్ అంత వరకూ తాను గౌరవించిన సహచ రులు యాదవ్, భూషణ్ గురించి అంత నీచంగా మాట్లాడటం (వారణాసి వలం టీరు ఉమేశ్ సింగ్‌తో మొబైల్లో మాట్లాడుతుండగా రికార్డు అయింది) వినిన వారికి ఏమనిపించి ఉంటుంది? కేజ్రీవాల్ ఇంతకాలం ధరించిన సంస్కారపు ముసుగు అకస్మాత్తుగా తొలగిపోయినట్టు స్పష్టమై ఉండదా? ఉమేశ్ నాయకుడిని తెగ పొగిడాడు. నరేంద్రమోడీతో పోల్చాడు. దాంతో ఉబ్బితబ్బిబ్బయిన కేజ్రీవాల్ అజాగ్రత్తగా మాటలు తూలారు. రాజకీయం, అధికార కాంక్ష నరనరానా నిండిన వ్యక్తి మాట్లాడవలసిన భాష కేజ్రీవాల్ నోటి నుంచి వెలువడింది. నా 66 మంది ఎంఎల్ఏలను తీసుకొని బయటికి పోయి వేరే పార్టీ పెట్టుకుంటా’ నంటూ బెదిరించిన కేజ్రీవాల్‌కీ, హమ్ సత్తా కేలియే నహీ, జనతా కీ సేవా కర్నే ఆయేహై (మేము అధికారంకోసం రాలేదు. ప్రజాసేవ చేసేందుకే వచ్చాం) అంటూ వినమ్రంగా పలికిన కేజ్రీవాల్‌కీ మధ్య తేడా ఏమిటి?వినమ్రంగా ఉన్నప్పుడు అధికారం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్రత లేదు. వారిద్దరినీ (యాదవ్, భూషణ్) బయటికి పంపించి తీరాల్సిందేననీ, వారితో కలసి పని చేసే ప్రశ్నే లేదనీ తెగేసి చెప్పిన కేజ్రీవాల్లో తొలిసారి నియంత కనిపిస్తున్నాడు. ఆయన అసాధారణ రాజకీయవేత్త కాదనీ సాధారణ రాజకీయ నాయకుల స్థాయిలోని వ్యక్తేననీ, ఇంతకాలం మొహంమీద అతికించుకున్న మర్యాదను తొలగించుకు న్నారనీ ఆయనే నిరూపించుకున్నారు. తనకు ఇష్టం లేనివారిని పార్టీ నుంచి సాగనంపడానికి కేజ్రీవాల్ పక్కా వ్యూహం అమలు చేసి విజయం సాధించారు. యాదవ్, భూషణ్‌లు రెండు మూడు వారాలు టీవీ చానళ్లలోనూ, మీడియా సమావేశాలలోనూ అవేశం వెలిబుచ్చవచ్చు. అన్యాయం జరిగిపోయిందంటూ ఆక్రోశం వెళ్లగక్కవచ్చు. ఆప్ ఎంఎల్ఏలు కేజ్రీవాల్‌ను వీడే అవకాశం లేదు. ఆప్ ప్రభుత్వానికి వచ్చిన ఆపదంటూ ఏమీ లేదు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనా, ప్రత్యామ్నాయ పరిపాలనా పద్ధతులను ప్రవేశపెట్టడంపైనా కేజ్రీవాల్, సిసోడియాలు దృష్టి కేంద్రీకరించాలి. మేధాపాట్కర్లాగానే మరి కొందరు ఆప్‌కు రాజీనామా చేయవచ్చు. అడ్మిరల్ రాందాస్ సైతం లోక్‌పాల్ పదవి నుంచి తప్పుకోవలసి రావచ్చు. అయినా పర్వాలేదు. కొత్త పార్టీలో, ప్రజాస్వామ్యం పాళ్లు ఎక్కువైన వ్యవస్థలో, అధినాయకుడిని ప్రశ్నించే స్థాయి కలిగిన వ్యక్తులున్న పరిస్థితిలో ఇటువంటి పెద్ద కుదుపు అనివార్యం. యాదవ్, భూషణ్‌లు భవిష్యత్తులో ఏమి చేస్తారన్నది వేరే ప్రశ్న. వారి నిష్ర్కమణతో ఆప్‌కు అవరోధాలు తొలిగిపోయినట్టే కనుక తమకు ఓటు వేసి ఢిల్లీ ప్రజలు తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం కేజ్రీవాల్‌కు ఇప్పటికీ ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయాలపైన ఆశలు ఆవిరైపోయినట్టేనా? కాలమే సమాధానం చెప్పాలి. -
ప్రతిపక్షం లేకపోతే ప్రశాంతమా? ప్రహసనమా?
త్రికాలమ్ భారత్, పాకిస్థాన్‌లు రెండు పక్షాలుగా ద్విజాతి సిద్ధాంతం (భారత దేశాన్ని విభజించింది ఈ సిద్ధాంతం ప్రాతిపదికగానే) అమలులో ఉంటే కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు లేదా స్వాతంత్య్రం ఇస్తామంటూ ఆశ పెట్టి మూడు జాతుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించవద్దంటూ వాజపేయి నెహ్రూను గట్టిగా హెచ్చరించారు. ఆ తర్వాత మూడు వారాలకే, మే 27న, నెహ్రూ గుండెపోటుతో మరణించారు. పార్లమెంటులో సంతాప తీర్మానంపైన వాజపేయి భావోద్వేగంతో మాట్లాడారు. నెహ్రూను భరతమాత కంఠాభరణంగా, ప్రపంచశాంతి దూతగా, పేదలకోసం పాటుపడిన మహానేతగా అభివర్ణించారు. ‘ప్రతిపక్షం లేకపోతే ప్రశాంతంగా ఉంది’. శాసనసభకు మొదటిసారి ఎన్నికై మంత్రివర్గంలో స్థానం పొందిన వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎంతగా అడుగంటిందో స్పష్టం చేస్తున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థపైన, సంప్రదాయాలపైన కనీస అవగాహనలేని వ్యక్తులు మంత్రులు కావడం, వారే అధికార పార్టీ ప్రధాన వ్యాఖ్యాతలు కావడం క్షీణదశకు నిదర్శనం. ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడలో హంస పురస్కార ప్రదాన సభలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్షాన్ని నిందించకుండా నిగ్రహిం చుకోలేకపోయారంటే రాజకీయాలలో అమిత్ర వైఖరి, అనారోగ్య ధోరణి ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలపైన ప్రశ్నిస్తే అక్కడ రాజధాని నిర్మాణం ప్రతిపక్షానికి ఇష్టం లేదంటూ మాట్లాడటం, పోలవరం కాకుండా పట్టినాడును పట్టుకొని ముందుకు పోవడం ఎందుకని అడిగితే, టెంటర్ల వ్యవహారం గురించి ప్రస్తావిస్తే పట్టినాడు నిర్మించి రాయలసీమకు నీరు అందించడాన్ని ప్రతిపక్షం సహించలేకపోతోందంటూ నిందమోపడం అసహనానికి పరాకాష్ఠ. పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటూ నిర్ణయించిన కేంద్రం నిధులు కేటాయించలేదు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వవలసిన ఎన్డీఏ సర్కార్ బాధ్యత నెరవేర్చడం లేదు. కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావడానికీ, నిధులు ఎక్కువ రాబట్టటానికీ విస్తృత సమావేశం నిర్వహించి అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్లాలన్న ప్రయత్నమే లేదు. శాసనసభలో ప్రతిపక్షం ఉనికిని గుర్తించి గౌరవించడానికి నిరాకరించడం, శాసనసభ వెలుపల ఉన్న ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలన్న స్పృహ లేకపోవడం శోచనీయం. పైగా ఎవరు అడ్డువచ్చినా సరే చేసి తీరుతాం, కట్టితీరుతాం అంటూ సభలో గర్జించడం సభామర్యాద కాదు. ప్రజాస్వామ్య సంస్కృతీ కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు పుట్టినిల్లయిన బ్రిటన్‌లో ప్రతిపక్షాన్ని హిజ్ (హర్) మెజెస్టీస్ లాయల్ అపోజిషన్ అంటారు. బ్రిటన్‌లో రెండు పార్టీలే ప్రధానమైనవి కనుక ప్రతిపక్ష నాయకుడిని భావి ప్రధానిగా సంభావించి మర్యాదగా సంబోధిస్తారు. ప్రతిపక్ష నాయకుడు సైతం ప్రధానితో ఎంతగా విభేదించినా మాట తూలిన సందర్భాలు అరుదు. ప్రతిపక్ష సభ్యులను ప్రజాద్రోహులంటూ నిందించే ప్రయత్నం ప్రజా స్వామ్య వ్యవస్థ వేళ్లూనుకున్న దేశాలలో జరగదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆదర్శమైన సింగపూర్‌లో సైతం అధికార పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (సీఏపీ) నాయకుడు, ప్రధాని లీ సీన్ లూంగ్కీ, వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్, ప్రతిపక్ష నాయకుడు లో థియూ ఖియాంగ్కీ మధ్య తరచు జరిగే వాదనలు వింటే సభానాయకుడూ, ప్రతిపక్ష నాయకుడు విధానాలపైన విభేదిస్తూనే ఎంత సంస్కారవంతంగా మాట్లాడవచ్చునో, ప్రత్యామ్నాయ విధానాలపైన క్షుణ్ణంగా చర్చించి సరైన నిర్ణయాలు ఎట్లా తీసుకోవచ్చునో అర్థం అవుతుంది. ఎన్టీఆర్ భవన్‌కీ, శాసనసభకీ తేడా ఏమిటి? ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్నవి మూడే పక్షాలు. అందులో రెండు పక్షాలు అధికారం పంచుకుంటున్నాయి. ఒకేఒక ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షం సభలో లేకపోతే, అధికార పక్ష సభ్యులకు ప్రభుత్వ నిర్ణయాలతో విభేదించి స్వతంత్రంగా ఆలోచించి నిస్సంకోచంగా మాట్లాడే వాతావరణం లేకపోతే సభలో జరిగేది అర్థవంతమైన చర్చ అవుతుందా? ప్రతిపక్ష నాయకుడు సభకో నమస్కారం పెట్టి సహచరులతో సహా నిష్ర్కమించిన రోజు ఒక్కటే బడ్జెట్ ప్రతిపాదనలపైన చర్చకు మిగిలింది. ఆ రోజు సభలో ఉండవలసిన నలుగురు భారతీయ జనతా పార్టీ సభ్యులూ రాష్ట్రంలో కరవు పరిస్థితులను పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు వివరించేందుకు ఢిల్లీ వెళ్లారు. అంత ముఖ్యమైన అంశంపైన చర్చ ఉన్న రోజున వారు ఢిల్లీ ప్రయాణం పెట్టుకోవలసింది కాదు. ఇక సభలో మిగిలింది తెలుగుదేశం పార్టీ సభ్యులు మాత్రమే. అప్పుడు శాసనసభకీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కీ తేడా ఏముంటుంది? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా గోష్ఠిలో చేసిన ప్రసంగాన్నీ, అసెంబ్లీలో సాగిన ఉపన్యాసాలనూ కలిపి చూసినవారికి మాత్రమే విషయం అరకొరగానైనా అర్థమై ఉంటుంది. సభను సజావుగా నిర్వహించవలసిన బాధ్యత ప్రధానంగా సభాపతిది. ఆ తర్వాత సభానాయకుడిది. సభ్యుల హక్కులనూ, ప్రతిపత్తినీ రక్షించవలసింది సభాపతే. అప్పుడే ఆయనకు సభ్యులందరినీ ఏకతాటి మీద నడిపించి సభలో ప్రజాసమస్యలపైన, ప్రభుత్వ విధానాలపైన ప్రయోజనకరమైన చర్చ నిర్వహించే అవకాశం ఉంటుంది. విభజన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుల సంఖ్య 175కు తగ్గింది కనుక బడ్జెట్ సమావేశాలను ఇదివరకటిలాగా 29 పనిదినాలు కాకుండా 17 రోజులకు తగ్గించారు. బడ్జెట్ ప్రతిపాదనలపైన చర్చకు ఆరురోజులకు బదులు, నాలుగు రోజులు కేటాయిస్తే అందులో మూడు రోజులు పట్టిసీమపైన వాదోపవాదాలకే చెల్లు. మిగిలిన ఒక్కరోజులో ప్రతిపక్షానికి గంట, ప్రభుత్వానికి గంటన్నర కేటాయించాలన్న సభాపతి నిర్ణయం సైతం సరైనది కాదు. బడ్జెట్‌తో ముడిపడిన అనేక అంశాలపైన చర్చ జరపడానికి ఆ సమయం సరిపోదు. ఇందుకు తగ్గట్టు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే మంత్రులూ, అధికారపక్ష సభ్యులూ పదే పదే అడ్డు తగలడం, అమర్యాదగా మాట్లాడటం ప్రజలకు కనపడుతున్న, వినబడుతున్న వాస్తవం. శాసనసభలో చిత్రించిన కొన్ని దృశ్యాలను ఎడిట్ చేసి ప్రతిపక్షాన్ని అపఖ్యాతిపాలు చేసే విధంగా ఎడిట్ చేసి టీవీ చానళ్లకు విడుదల చేయడం, ఆ చానళ్లు అదేపనిగా ఆ ఏకపక్ష దృశ్యాలను చూపించడం మరే ఇతర రాష్ట్రంలోనూ జరగని అఘాయిత్యం. టీవీ చానళ్లలో కనిపించిన దృశ్యాలలో ప్రతిపక్ష సభ్యురాలు రోజా హావభావాలు అభ్యంతరకరమైనవే. కానీ ఆమెను అధికారపక్షం నుంచి కవ్విస్తున్న దృశ్యాలు చూపించకుండా ఆమె వైపు దృశ్యాలు మాత్రమే చూపించడంలోనే దురుద్దేశం ఉన్నది. రెండు వైపులా దృశ్యాలు చూపించి ఉంటే ఎవరి తప్పిదం ఏమిటో ప్రజలు నిర్ణయించుకునే అవకాశం ఉండేది. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే. కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎవరు నిర్ణేతలో తెలియని పరిస్థితి కనిపిస్తున్నది. పోడియం దగ్గర ప్రతిపక్ష సభ్యులున్న దృశ్యాలను తాను విడుదల చేయలేదంటూ శాసనసభ తాత్కాలిక కార్యదర్శి సత్యనారాయణ లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. మరి ఎవరు విడుదల చేసినట్టు? స్పీకర్ అనుమతితోనే ఈ దృశ్యాలను విడుదల చేశారా? స్పీకర్ అనుమతి లేకపోతే స్పీకర్ ఏ చర్య తీసుకున్నారు లేదా తీసుకోబోతున్నారు? ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు? ఇది అంత తేలికగా తీసుకోవలసిన అంశమా? ఇది ఎవరి అరాచకమో నిగ్గుతేల్చవద్దా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే హక్కు ప్రజలకున్నది. తెలియజేయవలసిన బాధ్యత సభాపతికి ఉన్నది. రెండు శాసనసభలు, రెండు వైఖరులు ఇదే రకమైన దృశ్యం తెలంగాణ శాసనసభలోనూ కనిపించింది. రెండు కొత్త రాష్ట్రాల శాసనసభ సమావేశాలు ఒకే రోజు ప్రారంభమైనాయి. గవర్నర్ ఉభయసభలనూ ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు గొడవ చేశారు. వారితో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సభ్యులు తలబడి కలబడినట్టు కనిపించింది. జాతీయగీతం ఆలపించిన సమయంలోనూ తెలుగుదేశం పార్టీ సభ్యులు బల్లల మీద నిలబడి నినాదాలు చేస్తూ కనిపించారు. ఈ దృశ్యాలను టీవీ చానళ్లకు విడుదల చేయరాదని తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి భావించారు. మొత్తం దృశ్యాలను అన్ని పార్టీల ప్రతినిధులూ స్పీకర్‌తో కలసి చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. ఒక సందర్భంలో టేపును ఎడిట్ చేసి చూపిస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి అభ్యంతరం చెప్పారు. రెండోసారి మొత్తం టేపులన్నీ చూడటానికి అభ్యంతరం లేదంటూ అధికారపక్షం సంసిద్ధత వెలిబుచ్చింది. మొత్తంమీద అన్ని దృశ్యాలనూ చూసిన తర్వాత వాటిని చానళ్లకు విడుదల చేయకుండా సభాగౌరవాన్ని కాపాడాలని తెలంగాణ శాసనసభాపతి నిర్ణయించారు. అందుకే ఆ అభ్యంతరకర దృశ్యాలు టీవీ చానళ్లకు అందలేదు. తెలంగాణ స్పీకర్ ప్రదర్శించిన సమయజ్ఞతనూ, చొరవనూ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కూడా చూపించి ఉన్నట్లయితే ఏకపక్షంగా ఎడిట్ చేసిన విజువల్స్ టీవీ చానళ్లకు దొరికేవి కావు.. చట్టసభలలో తెలంగాణ స్పీకర్ కంటే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శివప్రసాద్ అనుభవం చాలా ఎక్కువ. ఆయనంటే వ్యక్తిగతంగా నాకు గౌరవం ఉంది. ఎందుచేతనో చాలా సందర్భాలలో ఆయన నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్టు కనిపిస్తున్నారు. ఉదాహరణకు సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదనేది నియమం. స్పీకర్ హోదాలో యనమల రామకృష్ణుడు, ప్రతిభాభారతి, సురేష్ రెడ్డి, తదితరలు అనేక సందర్భాలలో సభలో లేని వ్యక్తులపైన వ్యాఖ్యలు చేయరాదంటూ రూలింగ్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపైన అభాండాలు వేయకుండా, తీవ్రమైన ఆరోపణలు చేయకుండా నవ్యాంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశం ఒక్క రోజైనా జరగలేదంటే అతిశయోక్తి కాదు. జగన్మోహన్రెడ్డిని లక్ష కోట్లు అక్రమంగా సంపాదించావంటూ నిందించని రోజు లేదు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే సభానాయకుడు జోక్యం చేసుకోవచ్చు. కానీ అరడజను మంది మంత్రులు లేచి చర్చనీయాంశానికి సంబంధం లేని విషయాలు మాట్లాడి వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ తర్జని చూపుతూ స్వరం పెంచి కేకలు వేస్తూ విద్వేషం ప్రదర్శించడాన్ని సభలోఎట్లా అనుమతిస్తారు? అవినీతిపరులనీ, జైలుకు పోతారనీ, దొంగలనీ, ఫోర్ ట్వంటీలనీ, డాన్సర్లనీ చట్టసభలలో అనుమతించరాని పదజాలం యధేచ్ఛగా వాడుతుంటే నివారించవలసిన బాధ్యత సభాపతికి లేదా? తోటి సభ్యుడిని ఉద్దేశించి ‘రేయ్ పాతేస్తా’ అంటూ బెదిరించిన విజయవాడ శాసనసభ్యుడు బోండా ఉమ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్టు కూడా స్పీకర్ ప్రకటించలేదు. సభ వాయిదా పడిన తర్వాత ఆదేశాలు జారీ చేశారేమో తెలియదు కానీ మర్నాడు ఎనిమిది మంది ప్రతిపక్ష శాసనసభ్యులను సస్పెండు చేశారు. అధికార పక్షాన్ని అదుపు చేస్తూ ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించినప్పుడే ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ ఆదేశాలను శిరసావహిస్తారు. స్పీకర్‌పైన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేవరకూ వ్యవహారం వె ళ్లిందంటే సభ జరుగుతున్న తీరును ఒకసారి సమీక్షించుకోవలసి ఉంటుంది. నెహ్రూ, వాజపేయి రాజనీతిజ్ఞత 1977లో ఇందిరాగాంధీనీ, ఆమె నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీనీ చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ మొరార్జీదేశాయ్ ప్రధానిగా మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా అటల్ బిహారీ వాజపేయి సౌత్‌బ్లాక్‌లో తన కార్యాలయంలో అడుగుపెడుతూనే గోడమీద ఇదివరకు ఉన్న ఒక ఫోటో కనిపించలేదు. ఖాళీగా ఉన్న ప్రదేశం తన కార్యదర్శికి చూపించి ‘అక్కడ పండిట్జీ ఫొటో ఉండేది. ఎవరో తీసివేశారు. వెంటనే ఆ ఫొటోను తిరిగి అక్కడ పెట్టించండి’ అని ఆదేశించారట. పండిట్ నెహ్రూ ప్రధానిగా పనిచేసిన పదిహేడు సంవత్సరాలూ విదేశ వ్యవహారాల శాఖను స్వయంగా నిర్వహించారు. నెహ్రూ, వాజపేయి ప్రాణస్నేహితులు కారు. పైగా వాజపేయిని పెంచి పోషించిన జనసంఘ్‌కి నెహ్రూ అంటే ఏ మాత్రం పొసగదు. ఆయన సాంస్కృతిక మూర్తిమత్వం పట్ల జనసంఘ్‌కు అనుమానం. ఆయనపైన పాశ్చాత్య నాగరికత ప్రభావం ఎక్కువని అభిప్రాయం. కాంగ్రెస్ రాజకీయాలంటే వ్యతిరేకం. ఆర్థిక విధానాలకు పూర్తిగా ప్రతికూలం. 1964లో నెహ్రూ అస్తమించడానికి కొన్ని రోజుల ముందే (మే మొదటివారంలో) కశ్మీర్ విషయంలో వాజపేయి లోక్‌సభలో నెహ్రూను నిశితంగా విమర్శించారు. ద్విజాతీయ సిద్ధాంతానికి జనసంఘ్ వ్యతిరేకం అంటూ ఇప్పుడు మీరు త్రిజాతి సిద్ధాంతానికి ఊపిరి పోస్తున్నారంటూ దుయ్యపట్టారు. నేపథ్యం ఏమంటే, కొన్ని సంవత్సరాలుగా గృహనిర్బంధంలో ఉన్న కశ్మీర్ సింహం షేక్ అబ్దుల్లాను విడుదల చేయడమే కాకుండా కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం పాకిస్థాన్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్‌తో సమాలోచనలు జరపమంటూ ఆదేశం పంపించారు నెహ్రూ. ఈ చర్యను జనసంఘ్ గట్టిగా వ్యతిరేకించింది. ఇప్పటికీ భారత్, పాకిస్థాన్‌లు రెండు పక్షాలుగా ద్విజాతి సిద్ధాంతం (భారత దేశాన్ని విభజించింది ఈ సిద్ధాంతం ప్రాతిపదికగానే) అమలులో ఉంటే కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు లేదా స్వాతంత్య్రం ఇస్తామంటూ ఆశ పెట్టి మూడు జాతుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించవద్దంటూ వాజపేయి నెహ్రూను గట్టిగా హెచ్చరించారు. ఆ తర్వాత మూడు వారాలకే, మే 27న, నెహ్రూ గుండెపోటుతో మరణించారు. పార్లమెంటులో సంతాప తీర్మానంపైన వాజపేయి భావోద్వేగంతో మాట్లాడారు. నెహ్రూను భరతమాత కంఠాభరణంగా, ప్రపంచశాంతి దూతగా, పేదలకోసం పాటుపడిన మహానేతగా అభివర్ణించారు. ఇందులో నెహ్రూ ఔన్నత్యం కంటే వాజపేయి గొప్పదనం గుర్తించాలి. చరిత్ర పుటలలో నుంచి నెహ్రూను తొల గించడానికి నరేంద్రమోదీ ప్రయత్నించినా, రాజశేఖరరెడ్డిని మరణం తర్వాత కూడా అపఖ్యాతిపాలు చేయాలని చంద్రబాబునాయుడు ప్రయత్నించినా ప్రజల దృష్టిలో పలచనై కురచగా కనిపించేది వీరే కానీ వారికేమీ కాదు. -
ఈ సామరస్యమే శ్రీరామరక్ష
త్రికాలమ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విభజన పర్యవసానంగా సంక్రమించిన సమస్యలను పరిష్కరించుకోలేక తొమ్మిది మాసాలుగా సతమతం అవుతున్నాయి. వివాదాలు అప రిష్కృతంగానే ఉంటే, ప్రజల ఆవేశం రెచ్చగొడుతూ అసలు సమస్యల నుంచీ, అమలు కాని హామీల నుంచీ ప్రజల దృష్టి మరల్చడానికి ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రయత్నిస్తు న్నారనే ఆరోపణ రెండు రాష్ట్రాలలోనూ వినిపిస్తున్నది. జలజగడం తాత్కాలికంగానైనా పరిష్కారం కావడం సంతోషదాయకమే. కానీ పరిష్కారమైన పద్ధతి ఎవ్వరికీ గర్వకారణం కాదు. నాగార్జునసాగర్‌కు శంకుస్థాపన చేసిన తొలిప్రధాని నెహ్రూ కానీ, ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసిన ఇందిరాగాంధీ కానీ భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడతాయనీ, రెండు రాష్ట్రాల అధికారులూ, పోలీసులూ నీటికోసం సాగర్ దగ్గరే కుమ్ములాడుకుంటారనీ ఊహించి ఉండరు. దేశంలో పద్దెనిమిది పెద్ద నదులున్నాయి. వాటిలో పదిహేడు నదులు రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో ప్రవహిస్తున్నవే. అంటే పదిహేడు నదుల నీటికోసం రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. అన్ని వివాదాల కంటే అత్యంత తీవ్రతరమైనది కావేరీ జలవివాదం. సుప్రీంకోర్టు, ప్రధానమంత్రులు జోక్యం చేసుకున్నప్పటికీ కొరుకుడు పడని సమస్య. కొన్ని జలవివాదాలను ట్రిబ్యూ నళ్ళూ, ముఖ్యమంత్రులూ పరిష్కరించలేక న్యాయస్థానాలకు నిర్ణయాధికారం అప్పగించిన రాష్ట్రాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాలపైన సైతం ఎడతెగని వివాదాలు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ బచావత్ ట్రిబ్యూనల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పుల ప్రకారం జరగ వలసి ఉన్నప్పటికీ వివాదాలు అనివార్యం. ఉత్తర కర్ణాటకలో అల్మట్టి డ్యాం ఎత్తు పెంచ డాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్షేపించినప్పటికీ ట్రిబ్యూనల్ ఆమోదించింది. న్యాయ స్థానాలలో పోరాడటం, ద్వైపాక్షిక సమావేశాలలో వాదులాడు కోవడమే కానీ శుక్ర వారంనాడు నాగార్జునసాగర్‌లో జరిగినట్టు రెండు రాష్ట్రాల పోలీసులు లాఠీలతో కొట్టు కోవడం అన్నది భయం కలిగించే సరికొత్త కోణం. సాగర్ వద్ద ఫిబ్రవరి 13న కనిపించిన ఉద్రిక్త దృశ్యం జలయుద్ధాలు మొదలయ్యాయా? జనాభా పెరుగుదల, వ్యవసాయాభివృద్ధి, పట్టణీకరణ కారణంగా అభివృద్ధి చెందు తున్న దేశాలలో నీటి వినియోగం పెరిగింది. మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీటికోసమేనంటూ ప్రవీణులు హెచ్చరిస్తున్నారు. నదీజల వివాదాల గురించి ఐక్యరాజ్య సమితి ఉన్నత కార్యదర్శిగా పనిచేసిన కోఫీ అన్నన్ అనేక సందర్భాలలో భయాందోళనలు వెలిబుచ్చేవారు. ఇంతవరకూ దేశాల మధ్య యుద్ధాలు చమురు కోసమో, భూభాగం ఆక్రమించుకోవడం కోసమో లేదా రాజకీయాధిపత్యం కోసమో జరిగాయనీ ఇక మీదట మాత్రం నీటి కోసమే జరుగుతాయనీ అంటున్నారు. నైలు, గంగ, బ్రహ్మపుత్ర నదులలో ఏదైనా అంతర్జాతీయ వివాదమై యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందంటూ ప్రవీణులు భయపెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో నదీజల వివాదాలు ముదిరి పాకాన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరం. లేకపోతే నదీజలాలనూ, శాంతిభద్రతలనూ కేంద్ర ప్రభుత్వమే నిర్వహించ వలసిన పరిస్థితి ఏర్పడి సమాఖ్య స్ఫూర్తికి గండికొడుతుంది. అపోహలకు తావివ్వరాదు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విభజన పర్యవసానంగా సంక్రమించిన సమస్యలను పరిష్కరించుకోలేక తొమ్మిది మాసాలుగా సతమతం అవుతున్నాయి. వివాదాలు అప రిష్కృతంగానే ఉంటే, ప్రజల ఆవేశం రెచ్చగొడుతూ అసలు సమస్యల నుంచీ, అమలు కాని హామీల నుంచీ ప్రజల దృష్టి మరల్చడానికి ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రయత్నిస్తు న్నారనే ఆరోపణ రెండు రాష్ట్రాలలోనూ వినిపిస్తున్నది. రాజకీయ ప్రయోజనాల కోసమో, ఆధిక్య సాధన కోసమో ప్రజలను ఇబ్బంది పెట్టడం అన్యాయం. రెండు రాష్ట్రాల వాదనలను జాగ్రత్తగా గమనిస్తే సమస్యను పరిష్కరించుకోవడం కష్టం కాదని ఎవరికైనా తెలిసిపోతుంది. దీనికోసం రెండు రాష్ట్రాల అధికారులూ జలాశయం దగ్గర తోపులాటలకు దిగడం ఎందుకు? అంతటి జటిలమైన సమస్యే కనుక అయితే గవర్నర్ సమక్షంలో సమావేశం కాగానే ఎట్లా పరిష్కారమైంది? సమస్య ఉన్నదంటే ఉంటుంది లేదంటే లేదని అనుకోవాలి. రాజకీయ నాయకులు కావాలనుకుంటే వాదులాడుకో గలరు లేదంటే సామరస్యంగా పరిష్కరించుకోగలరు. ముందే మేల్కొని ఉంటే... శనివారం చూపించిన విజ్ఞత గతంలో కూడా రెండు ప్రభుత్వాలూ ప్రదర్శించి ఉంటే చాలా వివాదాలు పరిష్కారమయ్యేవి. విద్యార్థుల ఉపకార వేతనాలు. ఎంసెట్ పరీక్ష నిర్వహణ వంటి చాలా అంశాలు చిక్కుముడి పడటానికి కారణం రెండు రాష్ట్ర ప్రభు త్వాల మధ్య నెలకొన్న అమిత్ర వైఖరి. ఒక చంద్రుడి కంటే మరో చంద్రుడు సమర్థు డనీ, తెలివైనవాడిననీ నిత్యం నిరూపించుకోవలసిన మానసిక అవసరం అన్ని వివా దాల వెనుక ఉన్నట్టు కనిపిస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని తెలంగాణ ప్రభుత్వం వినియోగించి ఎడమ కాలువ ఒడ్డున గల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదం చేసిన ప్పుడు కూడా గవర్నర్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. జలవనరుల మంత్రి ఉమాభారతి మధ్యవర్తిత్వం నెరపవలసి వచ్చింది. నిజానికి తెలంగాణ పట్ల ఉమాభారతికి సానుభూతి ఉన్నదని అంటారు. విద్యుత్ అవసరాలకోసం శ్రీశైలం జలాశయం మట్టం 834 అడుగుల వరకూ తగ్గేవరకూ (854 అడుగుల కనీస మట్టం ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుపట్టింది) విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చునని పరోక్షంగా ఉమాభారతి సంకేతం ఇచ్చినప్పుడు దాన్ని తెలం గాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు బహిరంగంగా ప్రకటించడంతో ఆమెకు రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. హరీష్‌రావు ప్రకటన వెలువడగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రులు అశోక్‌గజపతి రాజుకూ, వెంకయ్యనాయుడికీ పోన్లమీద ఫోన్లు చేసి ఉమాభారతిపైన ఒత్తిడి తెచ్చారు. అప్పటి నుంచి ఆమె తెలంగాణ రాష్ట్రానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి జంకు తున్నారు. చెరువుల పునరుద్ధరణ పనికి కూడా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. ఉమా భారతి రావడం కుదరకనే దేవాదుల దగ్గర నిర్మించిన పైలాన్ ఆవిష్కరణ జరగలేదనీ, చెరువుల పునరుద్ధరణ పనులలో జాప్యానికి అది కూడా ఒక కారణమనే ధోరణిలో వార్తలు రావడం కూడా ఆమెకు చిరాకు కలిగించి ఉండవచ్చు. కనుక తాజా వివాదంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా తీర్పు చెప్పే పరిస్థితి లేదు కనుక గవర్నర్ సమక్షంలో రాజీ చేసుకున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. వాస్తవానికి సాగర్‌లో ప్రస్తుతం ఉన్న 63 టీఎంసీ నీటిలో తాగునీటి అవసరాలకు 25 టీఎంసీలు పోను తక్కిన 38 టీ ఎంసీలనే కుడి, ఎడమ కాలువలలో వదిలే అవకాశం ఉంది. ఎదురుచూస్తున్న ఒకటిన్నర లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో పంటలు రక్షించుకోవాలంటే నీరు తక్షణం విడుదల చేయడం అవసరం. ఎడమ కాలువ కింద ఖరీఫ్ పంటే ఇంకా ఒకటిన్నర లక్ష ఎకరాలలో నీటికోసం ఆవురా వురని అంటోంది. రబీ పంటకోసం నీరు కావాలి. ఒకటిన్నర లక్షల ఎకరాలలో వరి, అయిదున్నర లక్షల ఎకరాలలో అంతర్ పంటలూ ఉన్నాయి. ట్రిబ్యూనల్ కేటాయింపు లను ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వినియోగించుకున్నది. కేటాయించిన మొత్తం కంటే 40 టీఎంసీల నీరు అధికంగానే వాడుకున్నది. అయినా సరే ఇంకా కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుపడుతోంది. పంటలు రక్షించుకోవాలంటే కృష్ణ నీరు రావాలి. ఎడమ కాలువలో తెలంగాణ ప్రభుత్వం 200 క్యూసెక్కుల నీరు విడుదల చేసిందనీ, దానిలో చాలా భాగం వృధా అయిందనీ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి 322.6 టీఎంసీల నీరు కేటాయించగా ఇప్పటి వరకూ 365.75 టీఎంసీ నీరు వినియోగించుకున్నదని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అంటున్నారు. తెలంగాణకు కేటాయించిన 239 టీఎంసీలలో 149.4 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునదనీ, ఇంకా 89.5 టీఎంసీల తమ వాటా మిగిలే ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ట్రిబ్యూనల్ నదీజలాలను ప్రాజెక్టులవారీగా కేటాయిస్తుంది. తెలంగాణలో అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, కల్వ కుర్తి వంటి ప్రాజెక్టులు పూర్తయితే కేటాయించిన నీరులో దాదాపు 70 టీఎంసీలు వాడ కం ఆ ప్రాజెక్టుల ద్వారా జరిగేది. మైనర్ ఇరిగేషన్ కింద కొంత వినియోగమ య్యేది. ప్రాజెక్టులు పూర్తి కాలేదు కనుక 200 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ దగ్గరనే, ఎడమకాలువలోకి వదలడం ద్వారానే వినియోగించుకుంటానంటూ తెలంగాణ ప్రభు త్వం చేస్తున్న వాదన న్యాయసమ్మతం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటున్నది. నీటి కేటాయింపులను ట్రిబ్యూనల్ ప్రాజెక్టుల వారీగా చేస్తుంది కనుక వినియోగం కూడా ప్రాజెక్టుల వారీగానే చూపించాలన్న నిబంధన ఉంది. ఈ సామరస్యమే కావాలి! మొత్తం మీద ప్రస్తుతం కృష్ణా జలాలు తెలంగాణ ప్రాంతం కంటే ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ అవసరం. రెండు రాష్ట్రాలలో పంట ఎండిపోకూడదని ఇద్దరు ముఖ్య మం త్రులూ, ఇద్దరు ఇరిగేషన్ మంత్రులూ గవర్నర్ నరసింహన్ సమక్షంలో అంగీకరించారు కనుక సమస్య పరిష్కారమైంది. ఒకరకంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జున సాగర్‌లో నీరు విడుదల చేయడానికి ప్రయత్నించి, ఆ క్రమంలో చిన్నపాటి ఘర్షణ సృష్టించి సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికీ, గవర్నర్ దృష్టికీ తీసుకువెళ్ళడం ద్వారా అదనపు నీటిని సాధించుకున్నదనే చెప్పాలి. ఇదే అంగీకారం ఘర్షణ లేకుండా సామరస్యపూరిత వాతావరణంలో సమాలోచన ద్వారా జరిగితే తెలుగు ప్రజలు ఆనం దించేవారు. దేవినేని ఉమామహేశ్వరరావు, హరీష్‌రావు కలసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటువంటి సంక్షోభం మరోసారి తలెత్తకుండా చూసుకుంటామనీ, రెండు రాష్ట్రాలలోనూ పంటనష్టం కలగకుండా జాగ్రత్తపడతామనీ ప్రకటించినప్పుడు ఆనందించని తెలుగువారు ఉండరు. ఇదే విధంగా ఘంటా శ్రీనివాసరావూ, కడియం శ్రీహరి సమావేశమై ఎంసెట్ పరీక్షలను ఉమ్మడి నిర్వహించాలని నిర్ణయించుకుంటే, రెండు రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ళ అధ్యక్షులు వేణుగోపాలరెడ్డి, పాపిరెడ్డి కూడా ఇదే రకమైన స్నేహధోరణి ప్రదర్శిస్తే ఎంత బాగుంటుంది? గోటితో పోయే సమస్యలను పట్టుదలకు పోయి గొడ్డలిదాకా తెచ్చుకొని గవర్నర్ దగ్గరికీ, కేంద్ర మం త్రుల దగ్గరికీ పరిష్కారం కోసం పరుగులు తీయడం తెలుగుజాతికి సిగ్గుచేటు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వివేకంగా వ్యవహ రించి ఉన్నట్లయితే విద్యార్థులకూ, రైతులకూ ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. వారికి ఇంతటి మనోవేదన కలిగేది కాదు. -
ప్రశ్నించే హక్కు ప్రాణప్రదం
త్రికాలమ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలోని లోపాలను ఎత్తి చూపించడానికీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికీ, నిలదీయడానికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక వంటి ఒక బలమైన సంస్థ అవసరం. అధికారంలో ఉన్నవారిని సహజంగానే అంధకారం ఆవరిస్తుంది. బధిరత్వం ఆవహిస్తుంది. అప్రియమైనవి కనిపించవు. వినిపించవు. స్వీయానురాగం శ్రుతిమించు తుంది. రాచరికమైనా, నియంతృత్వమైనా, ప్రజాస్వా మ్యమైనా ఈ ప్రమాదం అనివార్యం. అధికారం లక్షణం అది. తెలివైన పాలకులు ఈ ప్రమాదంలో పడకుండా తమను తాము కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తారు. క్షేత్రవాస్తవికతను తెలుసుకునేందుకు రాజులు మారు వేషాలలో సంచరించేవారు. ఆధునిక యుగంలో పాలకులు వేగులమీదనో, పార్టీ కార్యకర్తలమీదనో, మీడియామీదనో ఆధారపడ తారు. నిజాలు చేదుగా ఉన్నప్పటికీ సహిస్తారు. తెలివిలేనివారు వాస్తవాలు తెలుసుకోవడానికి నిరాకరిస్తూ ఊహాలోకంలోనే విహరించాలని కోరుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకసారి ఎన్నికలలో గెలుపొంది అధికారంలోకి వచ్చిన పార్టీకీ, పార్టీ అధినేతకూ తిరిగి ఎన్నికలు జరిగే వరకూ అపరిమితమైన స్వేచ్ఛ. రాజ్యాంగం నిర్దేశిస్తున్నది కనుక మంత్రివర్గం నిర్మించాలి. శాసనసభ సమావేశాలు నిర్వహించాలి. మంత్రివర్గంలోనూ, శాసనసభలోనూ తమ మాటకు ఎదురు లేకుండా నయానో భయానో చేసుకోగలిగితే పాలకుల పని నల్లేరుమీద బండి చందమే. తెలంగాణ విద్యావంతుల వేదిక (తెవివే) ఐదవ మహాసభలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శనరెడ్డి చెప్పినట్టు రాజ్యాంగం ఏ ప్రభుత్వానికీ అధికారాలు ఇవ్వలేదు. అధికారాలు ప్రజలకు ఇచ్చింది. ప్రభుత్వాలకు కేవలం బాధ్యతలు అప్పగించింది. ప్రశ్నించే హక్కు ప్రతిపౌరుడికీ ఇచ్చింది. అభివృద్ధి చెందడానికి ఎటువంటి నమూనాను అనుసరించాలో, జాతీయ వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలో కూడా రాజ్యాంగం స్పష్టం చేసింది. ఈ వాస్తవం సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు కనుక వారి తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించవలసిన బాధ్యతను మేధావులు నిర్వహించాలి. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకే పదేళ్ళ కిందట ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విద్యావంతుల వేదికను నెలకొల్పారు. ముందు తెలంగాణ మేధావుల వేదిక అని పేరు పెట్టాలని కొందరు అన్నప్పుడు మేధావులు అనడంలో స్వాతిశయం ధ్వనిస్తుందంటూ విద్యావంతుల వేదికగా జయశంకర్ మార్పించారు. తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా ఉద్యమం అహింసాత్మకంగా జరగడానికీ, ఉద్యమలక్ష్యాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించడానికీ ఆయన అహరహం కృషి చేశారు. ఇటువంటి వేదిక ఇన్ని సంవత్సరాలు ప్రయోజనకరమైన పాత్ర పోషించడం విశేషమని మహాసభను ప్రారంభించిన స్వామి అగ్నివేశ్ ప్రశంసించారు. ఇటువంటి సంస్థలు అన్ని రాష్ట్రాలలోనూ నెలకొల్పాలని ప్రతిపాదించారు. జయశంకర్ అనంతరం ఈ వేదికకు అధ్యక్షులుగా పని చేసిన ప్రొఫెసర్ కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య ప్రజాస్వామ్య సంప్రదాయాలనూ, ఉద్యమ స్ఫూర్తినీ, నైతిక విలువలనూ కొనసాగించి తెలంగాణ సమాజానికి మార్గదర్శనం సమర్థంగా చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సంకోచించబోమనీ, ప్రజల పక్షానే కొనసాగుతామనీ, ప్రజలతోనే కలసి నడుస్తామనీ ఈ సందర్భంగా తెవివే నాయకత్వం పునరుద్ఘాటించింది. ప్రత్యేక రాష్ట్రంకోసం పుష్కరంపాటు ఉద్యమం చేసి లక్ష్యం సాధించిన తర్వాత ఎన్నికలలోనూ విజయం సాధించి 29వ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన మంచి పనులను ప్రోత్సహించాలనీ, ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటిని వ్యతిరేకించాలనీ నిర్ణయం. చెరువుల పునరుద్ధరణ, అన్ని గ్రామాలకూ తాగు నీరు సరఫరాకు వాటర్‌గ్రిడ్ వ్యవస్థ నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు చేయాలన్న సంకల్పం, దళితులకు మూడెకరాలకు తగ్గకుండా వ్యవసాయ భూమి ఇవ్వాలన్న నిర్ణయం, రెండు పడగ్గదులున్న ఇళ్ళను పేదవారికి కట్టించి ఇవ్వాలన్న ఆలోచన స్వాగతించదగినవే. వాటిని అమలు చేసే క్రమంలో తెవివే సంపూర్ణ సహకారం అదించాలి. ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఫిలింసిటీ నిర్మించడం వల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయా అంటూ అగ్నివేశ్ ప్రశ్నించడం ఈ ధోరణిలోనే. నవ తెలంగాణలో తెవివే కీలకపాత్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తెవివే ముఖ్యమైన పాత్ర పోషించింది. తెవివే నాయకత్వం, టీజాక్ నాయకత్వం దాదాపుగా ఒక్కటే. రెండు నాయకత్వాలకు స్ఫూర్తి ప్రొఫెసర్ జయశంకర్దే. ఇటువంటి పౌరసంస్థ ఆవశ్యకత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మరింత పెరిగింది. నవతెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాను జాగ్రత్తగా పరిశీలించి ఆమోదించ వలసిన అవసరం ఉంది. కీలకమైన ఈ పాత్ర పోషించడానికి తెవివే నాయకత్వం సమాయత్తం కావాలి. ప్రజల పక్షాన నిలిచి పాలకులతో కరచాలనానికీ, అవసరమైతే పాలకులపై కరవాలచాలనానికీ సిద్ధం కావాలి. కరచాలనమా, కరవాలచాలనమా అన్నది ప్రజల ప్రయోజనాలపైనా, వాటి పట్ల ప్రభుత్వ వైఖరిపైనా ఆధారపడి ఉండాలి. వ్యక్తుల ప్రయోజనాలపైన కాదు. దేశంలోని తక్కిన రాష్ట్రాలలో కూడా ఇటువంటి వ్యవస్థను నెలకొల్పడం అవసరమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అత్యవసరం. రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎదురు చెప్పేవారు ఎవ్వరూ లేరు. రాజధాని నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయాలను మంత్రివర్గం వివరంగా చర్చించిన దాఖలా లేదు. శాసనసభలోనూ చర్చ జరగడం లేదు. పైగా ‘ప్రతిపక్షమే లేదు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి’ అంటూ తెలుగుదేశం పార్టీ బాధ్యులకు ముఖ్యమంత్రి ఉద్బోధిస్తున్నారు. అంటే ప్రతిపక్షం మాట వినే పనిలేదు. స్వపక్షంలో ఎదురు చెప్పే వారు లేరు. ముఖ్యమంత్రికి ఎంతటి తెలివితేటలు ఉన్నా చర్చ లేకుండా తమ నిర్ణయాలను అమలు చేసినప్పుడు పొరబాట్లు జరిగే అవకాశం ఉంటుంది. పొరబాటు జరిగినట్టు గ్రహించేందుకు మార్గం ఏదైనా ఉండాలి. లేకపోతే తప్పుదారిలోనే ప్రయాణం సాగుతుంది. రాజధాని నిర్మాణంకోసం వేల ఎకరాల భూమిని సేకరించి, దానిలో కొంతభాగం సింగపూర్ ప్రభుత్వానికో, ఆ ప్రభుత్వం నియమించిన కొర్పొరేట్ సంస్థలకో అప్పగించి, రాజధానికి అవసరమైన భవనాలనూ, ఇతర సదుపాయాలనూ నిర్మించాలన్నది ముఖ్యమంత్రి వ్యూహంలాగా కనిపిస్తున్నది. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. కేంద్ర ప్రభుత్వం 50 వేల ఎకరాల భూమి కొనుగోలుకు అవసరమైన సొమ్ము ఇవ్వజాలదు. అందుకని ఉత్తరోత్తరా అభివృద్ధి చేసిన భూములు ఇస్తామనీ, ఎకరానికి మూడు కోట్లు వచ్చేవిధంగా చేస్తామనీ చెప్పి రైతులను నమ్మించి భూములు సమీకరించేందుకు ప్రయత్నం జరుగుతోంది. అధికారం ఉన్నది కాబట్టి భూసేకరణలో విజయం సాధించినప్పటికీ రాజధాని నిర్మాణం సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించడంలో ఔచిత్యం ఏమిటో, ఇందుకు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసిన ఆవశ్యకత ఏమిటో. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) పేరుమీద మన దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలను కాదని విదేశాలలోని కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చడం వెనుక వ్యూహం ఏమిటో కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలకు తెలియదు. తుళ్లూరు గ్రామం (ఫైల్ ఫొటో) రాయలసీమ మౌనంగా ఉంటుందా? ‘అభివృద్ధి’ అంతా తుళ్ళూరు చుట్టుపక్కలే కేంద్రీకృతం అవుతే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజల మనోభావాలు ఎట్లా ఉంటాయో అంచనా వేసే ప్రయత్నం జరగడం లేదు. ఉపముఖ్యమంత్రి కే ఇ కృష్ణమూర్తి మౌనంగా ఉన్నంత మాత్రాన రాయలసీమ అంతా మౌనంగా ఉంటుందని అనుకోవడం పొరబాటు. విశాఖపట్టణం అభివృద్ధి ఉత్తరాంధ్రకు ఊరట కలిగిస్తుందేమో కానీ అటువంటి అవకాశం రాయలసీమకు లేదు. అభివృద్ధిని వికేంద్రీకరించాలంటూ శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులను తుంగలో తొక్కి తనకు తోచిన విధంగా, తన స్వప్న సాకారం కోసం, గొప్ప రాజధాని నిర్మించారనే ఖ్యాతి గడించడంకోసం ఇంత హంగామా చేయాలా? స్వీయ, సన్నిహితుల ప్రయోజనాల గురించి ప్రస్తావించడం లేదు. రాజధాని నిర్మాణం కానీ, బాక్సైట్ ఖనిజం తవ్వకాలు కానీ, ఇతర ‘అభివృద్ధి’ కార్యక్రమాలు కానీ చర్చ లేకుండా, సమీక్ష లేకుండా అమలు జరిగితే అందమైన, ఖరీదైన రాజధాని నిర్మాణం జరగవచ్చు, ఆర్థికాభివృద్ధి కూడా సాధ్యం కావచ్చు. కానీ ఈ క్రమంలో జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ప్రభుత్వం ఆడుతున్న జూదం ప్రజల జీవితాలను ఛిద్రం చేసే ప్రమాదం ఉన్నది. ఈ హెచ్చరిక చేయడానికీ, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలోని లోపాలను ఎత్తి చూపించడానికీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికీ, నిలదీయడానికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెవివే వంటి ఒక బలమైన సంస్థ అవసరం. రాష్ట్రంలో విద్యావంతులకు కొదవ లేదు. బ్రిటిష్ పాలన కారణంగా స్వాతంత్య సిద్ధికి పూర్వమే అనేక తరాల విద్యావంతులు ఉన్న ప్రాంతం అది. త్యాగ నిరతికి కొదవ లేదు. తెలివితేటలు అపారం. వారిని ఒక వేదికపైకి తెచ్చి సామూహిక శక్తిని ఆవిష్కరించే ప్రయత్నం ఇంతవరకూ ఏ కారణంగానో జరగలేదు. ఆంధ్ర మేధావుల వేదిక పేరుతో వెలసిన సంస్థలకు తెవివేకి ఉన్నటువంటి విస్తృత ప్రజామోదం లేదు. పోరాట స్వభావం లేదు. ఇఎఎస్ శర్మ, రాణిశర్మ, కృష్ణ వంటి సామాజిక ఉద్యమకారులు పర్యావరణ పరిరక్షణకూ, హానికరమైన అభివృద్ధి నమూనాలను వ్యతిరేకించేందుకూ అంకిత భావంతో చాలా గొప్ప కృషి చేస్తున్నారు. వారి వ్యాప్తి పరిమితమైనది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రతినిధులను ఒకే తాటిమీదికి తీసుకొని వచ్చి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం ఎట్లా జరగాలో సమాలోచన జరపవలసిన అవసరం ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడానికి ముందే కొత్త రాష్ట్రం వివిధ రంగాలలో ప్రగతి సాధించాలంటే ఎటువంటి విధానాలు అమలు చేయాలో సూచించేందుకు తెవివే నాగార్జునసాగర్‌లో రెండు రోజుల మేధోమథనం నిర్వహించింది. పుస్తకం ప్రచురించింది. అటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావంతులు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వానికి అడ్డుపడటంకోసం కాదు ప్రభుత్వానికి వాస్తవాలు తెలియజెప్పడానికీ, ప్రజల ప్రయోజనాలు పరిరక్షించడానికి ఇటువంటి వేదిక ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో తక్షణావసరం. murthykondubhatla@gmail.com