కె.రామచంద్రమూర్తి, ఎడిటోరియల్ డైరెక్టర్, సాక్షి
త్రికాలమ్
లఖ్వీని విడుదల చేయడాన్ని అమెరికా ప్రభుత్వం ఖండించింది. ఇంకా చాలా దేశాలు పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని గుర్తిస్తున్నాయి. పాకిస్తాన్‌ను ఒంటరి చేయడం ఇండియాకు మాత్రమే సాధ్యమయ్యే పనికాదు. అందుకు పాకిస్తాన్ సైన్యం దండిగా సహకరిస్తున్నది కనుక భారత్‌కు బెంగ అనవసరం. పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగి స్తూనే, చర్చలు జరుపుతూనే ఉండవచ్చు. కానీ వాటిపైన పెద్దగా ఆశలు పెట్టుకోనక్కరలేదు. తమ దేశం ముక్కలు చెక్కలు కావాలో, శాంతిసుస్థిరతలతో విలసిల్లాలో తేల్చుకోవలసింది పాకిస్తాన్ సైన్యం మాత్రమే.
‘సరిహద్దులలో మన జవాన్ల తలలు తెగిపడుతుంటే యూపీఏ సర్కార్ చేతులు ముడుచుకొని కూర్చున్నది. చేతకాని ప్రభుత్వం, చేతన లేని ప్రధాని దేశానికి అరిష్టం.’ అంటూ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారసభలలో చేసిన గర్జన బీజేపీకి అనేక లక్షల ఓట్లు సంపాదించి ఉంటుంది. మన్మోహన్ సింగ్ స్థానంలో నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా సరిహద్దులో పరిస్థితి మారలేదు. పాకిస్తాన్ వైఖరి మార బోదు. భారత్-పాకిస్థాన్ సంబంధాలపైన అవగాహన ఉన్నవారికి ఈ సంగతి తెలుసు. 2008 నవంబర్ 26న పది మంది పాకిస్తానీ ఉగ్రదాడులను ముంబ య్‌లో దాడులు చేయడాన్ని కరాచీలో ఉంటూ మొబైల్ సందేశాలతో నడిపిం చిన లష్కరే తయ్యబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీని కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేసినప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం ఏమి చేస్తున్నదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని బీజేపీ నాయకులు తిరుగుదాడికి దిగారు. వాస్తవం ఏమంటే ఎవరు అధికా రంలో ఉన్నప్పటికీ ఈ విషయంలో తక్షణం చేయగలిగింది ఏమీలేదు. ఆవేశం తగ్గించుకొని ఆలోచన పెంచుకుంటే, పాకిస్తాన్ నిజస్వరూపం అర్థం చేసుకోవ డానికి ప్రయత్నిస్తే మన నిస్సహాయ స్థితి బోధపడుతుంది. భారత్ మాత్రమే కాదు, అమెరికా సైతం నిధులు కుమ్మరించినా ఫలితం లేక ఎవరికి చెప్పుకో వాలో తెలియక పాకిస్తాన్ మాయాజాలంలో పడిపోయి కొట్టుకుంటోంది. ఈ క్రీడ వల్ల పాకిస్తాన్‌కి ఏైమైనా ప్రయోజనమా? శూన్యం. పైగా అపారమైన నష్టం. ఆత్మహత్యాసదృశం.
ఇస్లామీయవాదం ఆయుధంగా...
ఇస్లామీయవాదాన్ని తలకెక్కించుకొని, దానిని ఒక ఆయుధంగా ప్రయోగిస్తూ పబ్బం గడుపుకోవడమే విదేశాంగ విధానంగా పాకిస్తాన్ కొనసాగిస్తున్నది. పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే 1947లోనే గిరిజనుల ముసుగులో కశ్మీర్‌పై దాడి చేసింది మొదలు లఖ్వీ విడుదల దాకా పరిశీలిస్తే స్పష్టమైన వ్యూహం కని పిస్తుంది. పాకిస్తాన్‌లో ప్రభుత్వాలు మారినా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు మారినా ఈ వ్యూహం మాత్రం మారడం లేదు. అమలు చేస్తున్నది సైన్యం కనుక. సేనాధిపతులందరికీ ఇస్లామీయ శక్తులను వినియోగించడం ద్వారా దేశంలో ఆధిపత్యం చెలాయించడం, ప్రభుత్వాన్నీ, కోర్టులనూ అదు పులో పెట్టుకోవడం అలవాటైనది కనుక ఈ విధానం మారదు.
లఖ్వీ జైలులో ఉన్నా, జైలు వెలుపల ఉన్నా ఇండియాకు సంబంధిం చినంత వరకూ తేడా లేదు. దాడులు చేయించాలంటే జైలులో ఉండి కూడా ప్రణాళిక రచించి అమలు చేసే అవకాశం లఖ్వీబోటి ఉగ్రవాదులకు ఉన్నది. జైలులో ఉంటూనే తండ్రి కాగలిగిన లఖ్వీ ఏమైనా చేయగలడు. పాకిస్తాన్ పాలక వ్యవస్థ అటువంటి వెసులుబాటు ఉగ్రవాదులకు కల్పిస్తున్నది. దావూద్ ఇబ్రహీం దర్జాగా తిరుగుతున్నా, లష్కరే తయ్యబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ హీరోలాగా సంచరిస్తున్నా షరీఫ్ సర్కార్‌కు అభ్యంతరం లేదు. దేశ రాజధాని సమీపంలో అల్‌ఖాయిదా అధినేత ఒసామాబిన్ లాదెన్‌ను రహ స్యంగా (అమెరికా మట్టుపెట్టేవరకూ)దాచిన సైనిక వ్యవస్థ అది. ముంబయ్‌లో 166 మందిని పాక్ ఉగ్రవాదులు చంపిన ఘటన ప్రభుత్వ వైఖరిని కానీ సైన్యం ధోరణిని కానీ ఇసుమంతైనా మార్చలేదు.
పాకిస్తాన్ సైన్యం పోడకలపై పుస్తకం రాసిన క్రిస్టియన్ ఫెయిర్ విశ్లేషణ ప్రకారం ఉగ్రవాదాన్ని పోషిస్తూనే ఉగ్రవాదం వల్ల నష్టబోతున్న దేశంగా గుర్తిం పు పొందడం, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తున్న దేశంగా అమెరికా నుంచీ, ఇతర పాశ్చాత్య దేశాల నుంచీ అపారమైన ఆర్థిక సహాయం పొందడం పాకిస్తాన్ పాటిస్తున్న విదేశాంగ నీతి. అణ్వస్త్రాలు తయారు చేయడం ద్వారా ఇండియా ముందరి కాళ్ళకు బంధం వేయగలిగింది పాకిస్తాన్. లష్కరే తయ్య బాను అమెరికా నిషేధించిన తర్వాత ఆ సంస్థ తన కార్యకలాపాలను జమాత్ ఉద్ దవా, జైషే మహమ్మద్‌ల ద్వారా కొనసాగిస్తోంది. ఈ రెండు సంస్థలూ కలిసి మొత్తం 162 దాడులు జరిపి 1,132 మంది పౌరులను చంపినట్టూ, 2, 423 మందిని గాయపరచినట్టూ అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్శిటీ పరిశోధనలో తేలింది. ఈ ఉగ్రవాద సంస్థలపైన పాకిస్తాన్‌లో అదుపాజ్ఞలు లేవు. క్రిస్టియన్ ఫెయిర్ అంచనా ప్రకారం ఇంతవరకూ అమెరికా పాకిస్తాన్ ప్రభుత్వానికీ, సైన్యానికీ 31 వందల కోట్ల డాలర్లు ఉచితంగా ఇచ్చింది. బదులుగా అమెరికాకు ఓరిగింది ఏమిటి? అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియెట్ యూనియన్‌ను తరిమివేయడం ఒక్కటే అగ్రరాజ్యం సాధించిన విజయం. ఆ క్రమంలో పాకిస్తాన్‌తో కలిసి అమెరికా సృష్టించిన ఉగ్రవాదులు తాలిబాన్. వారి దాడులలో అఫ్ఘానిస్తాన్‌లోని అమెరికా సైనికులూ, మిత్రదేశాల సైనికులూ, ఆఫ్ఘాన్ సైనికులూ వేలమంది చనిపోయారు. తాలిబాన్ పాకిస్తాన్‌లో సైతం నెత్తుడి క్రీడ కొనసాగిస్తున్నది. తాలిబ్‌లను నిలువరించేందుకు చేసిన ప్రయ త్నంలో పాకిస్తాన్ సైనికులు సైతం మరణిస్తున్నారు. ఫ్రాంకెన్‌స్టీన్ అనే శాస్త్రవేత్త సృష్టించిన పెనుభూతం ఆ శాస్త్రవేత్తనే బలితీసుకున్నట్టు పాకిస్తాన్ తయారు చేసిన తాలిబాన్ ఆ దేశానికే ప్రమాదంగా పరిణమించింది. పొరుగుదేశం కనుకా, కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది కనుకా పాకిస్తాన్ ఉగ్ర వాద విధానం ప్రభావం నుంచి తప్పించుకోవడం భారత్‌కు సాధ్యం కాకపో వచ్చు. అటల్ బిహారీ వాజపేయి చెప్పినట్టు మన పొరుగున ఎవరు ఉండాలో మనం నిర్ణయించుకునే అవకాశం లేదు. పాకిస్తాన్ అస్తిత్వానికి ఏర్పడుతున్న ముప్పును గ్రహించి ఉగ్రవాదాన్ని అణచివేయాలని ఆ దేశంలోని సైన్యాధిప తులు నిర్ణయించుకుంటే తప్పించి ఈ విపత్తు తొలగిపోయే అవకాశం లేదు.
ఉగ్రవాదం నుంచి తనను తాను కాపాడుకోవడానికే ఇండియా ప్రయత్నించాలి. పాకిస్తాన్‌పైన అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచడానికి దౌత్యపరంగా కృషి చేస్తూనే కశ్మీరీల హృదయాలు గెలుచుకునే మార్గం అన్వేషించాలి. ఇది అనుకు న్నంత సులభం కాదు. క శ్మీర్ లోయలో భారత వ్యతిరేకత తీవ్రంగా ఉంది. పాకిస్తాన్ పట్ల ప్రేమ తగ్గుతున్నది కానీ భారత్ పట్ల సుముఖత పెరగడం లేదు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ నాయకత్వంలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం అనుసరించే విధానాలు జనరంజకంగా ఉంటే, ప్రజలలో కొన్నేళ్ళుగా పేరుకొని పోయిన వ్యతిరేక భావం తగ్గించగలిగితే, భారత్‌లో భాగంగా ఉండటమే శ్రేయస్కరమనీ, లాభదాయకమనే అభిప్రాయం కశ్మీరీల మనస్సులో బలంగా నాటుకుంటే పాకిస్తాన్ చేయగలిగిన హాని ఏమీ లేదు. ఇందుకు భిన్నంగా పరిణామాలు సంభవించి, విభేదాల కారణంగా పీడీపీ-బీజేపీ ప్రభుత్వం కూలి పోయి రాజకీయ అనిశ్చితి చోటు చేసుకుంటే పరిస్థితి మరోసారి దిగజారు తుంది. పాకిస్తాన్ అటు అఫ్ఘానిస్తాన్‌పై పోరాటానికి తాలిబాన్‌ను ప్రేరేపిస్తూనే ఇటు కశ్మీర్‌ను వశం చేసుకోవడానికి ఇస్లామీయవాదాన్ని వినియోగించుకుం టుంది. దీనికి విరుగుడు ఢిల్లీలో లేదు. శ్రీనగర్‌లో ఉంది. ముఫ్తీ ప్రభుత్వం పనితీరులో ఉంది. కశ్మీర్‌లో తిరిగి కుంపటి రాజేసే అవకాశం పాకిస్తాన్‌కు ఇవ్వనంత వరకూ లఖ్వీ వంటి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉండదు. కశ్మీరీల సహకారం, భాగస్వామ్యం లేకుండా ఆ లోయలో అశాంతిని రగిలించడం ఉగ్రవాదుల వల్ల కాదు.
పాక్ సైన్యం బరితెగింపు
భారత్‌లో మారణహోమం సాగించి, విధ్వంసం సృష్టించిన పేరుమోసిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, రాచమర్యాదలు చేయడం, పాక్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేందుకు సదుపాయం కల్పించడం పాకిస్తాన్ సైన్యం బరితెగింపునకు నిదర్శనాలు. లఖ్వీని విడుదల చేయడాన్ని అమెరికా ప్రభుత్వం ఖండించింది. ఇంకా చాలా దేశాలు పాకిస్తాన్ నిజ స్వరూ పాన్ని గుర్తిస్తున్నాయి. పాకిస్తాన్‌ను ఒంటరి చేయడం ఇండియాకు మాత్రమే సాధ్యమయ్యే పనికాదు. అందుకు పాకిస్తాన్ సైన్యం దండిగా సహకరిస్తున్నది కనుక భారత్‌కు బెంగ అనవసరం. పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగి స్తూనే, చర్చలు జరుపుతూనే ఉండవచ్చు. కానీ వాటిపైన పెద్దగా ఆశలు పెట్టుకోనక్కరలేదు. తమ దేశం ముక్కలు చెక్కలు కావాలో, శాంతిసుస్థిరతలతో విలసిల్లాలో తేల్చుకోవలసింది పాకిస్తాన్ సైన్యం మాత్రమే. సైన్యాధికారుల వైఖరి మారనంతవరకూ పాకిస్తాన్ ప్రజలు సైతం నిస్సహాయులే. ఇస్లామీయ శక్తులనూ, తాలిబాన్‌నూ వినియోగించుకొని అఫ్ఘానిస్తాన్‌ను జయించాలనే తాపత్రయం, కశ్మీర్‌ను కాజేయాలన్న కాంక్ష వీడకపోతే పాకిస్తాన్ ఉనికికే ప్రమా దం. ఇది ఇండియా స్వాగతించవలసిన దృశ్యం కాదు. పాకిస్తాన్ ప్రజలు క్షేమంగా, సంతోషంగా ఉండాలనే భారతీయులంతా అభిలషించాలి. పాకిస్తాన్ సైన్యం ఆత్మాహుతి చేసుకోవడాన్ని నివారించే శక్తి సైతం ఇండియాకు లేదు. అదే విషాదం.