చిరస్మరణీయ నేత పీవీ | K Ramachandra Murthy Guest Column On PV Narasimha Rao | Sakshi
Sakshi News home page

చిరస్మరణీయ నేత పీవీ

Published Sat, Jun 27 2020 12:37 AM | Last Updated on Sat, Jun 27 2020 12:37 AM

K Ramachandra Murthy Guest Column On PV Narasimha Rao - Sakshi

ఏడు దశాబ్దాలు దాటిన స్వతంత్ర భారత దేశానికి ప్రధానమంత్రులుగా ఎందరో పని చేశారు. చరిత్రలో ఒకానొక ప్రధానమంత్రి స్థానం ఏమిటో నిర్ణయించే క్రమంలో పరిశీలనకు వచ్చే అంశాలలో యుద్ధం ప్రధానమైనది. యుద్ధం గెలిచిన ప్రధానులకు దేశప్రజల హృదయాలలో స్థిరమైన స్థానం ఉంటుంది. పాకిస్తాన్‌పైన 1965లో జరిగిన యుద్ధంలో భారత్‌ గెలిచింది కనుక నాటి ప్రధాని లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి పట్ల భారతీయులకు అపారమైన అభిమానం. 1971లో తూర్పు పాకిస్తాన్‌లో సంభవించిన తిరుగుబాటు సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన మరో యుద్ధంలో ఘనవిజయం సాధించి బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి దోహదం చేసిన ఫలితంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధిని ప్రజలు ఎప్పటికీ విజయేందిరగానే గుర్తు పెట్టుకుంటారు. కార్గిల్‌ ప్రాంతాన్ని పాకిస్తాన్‌ ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు దేశ ప్రధానిగా అటల్‌ బిహారీ వాజపేయి ఉన్నారు. పరిమితమైన యుద్ధమైనప్పటికీ పాకిస్తాన్‌ సేనలను కార్గిల్‌ నుంచి తరిమికొట్టినందుకు వాజపేయికి ప్రజలు బ్రహ్మరథం పట్టి 1999 ఎన్నికలలో గెలిపించారు.

రెండో ప్రపంచయుద్ధంలో విజేతలుగా అప్పటి ఇంగ్లండ్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్వెల్ట్, ఫ్రాన్స్‌ అధినేత చార్లెస్‌ డీగాల్‌ ఆయా దేశాల ప్రజలకు ప్రాతఃస్మరణీయులైనారు. 1962లో చైనా చేతిలో భారత్‌ చిత్తుగా ఓడిపోయింది. అప్పటి వరకూ నవభారత నిర్మాతగా, స్వాతంత్య్ర సమరయోధుడుగా, గాంధీజీ ప్రియశిష్యుడుగా, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన ప్రగతిరథ సారథిగా, అలీనోద్యమ నేతగా పేరుప్రఖ్యాతులు గడించిన నెహ్రూ చైనా చేతిలో ఓటమితో అపఖ్యాతిపాలైనారు. 1962 నవంబర్‌లో తగిలిన దెబ్బ నుంచి కోలుకోకుండానే 1964లో నెహ్రూ ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు చైనాతో భారత్‌కు సరిహద్దు యుద్ధం ఇంతటితో ఆగిపోతుందో లేక  కొనసాగుతుందో తెలియదు. అంతిమ ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉంటే ప్రధాని నరేంద్రమోదీ ప్రభ నిలిచి వెలుగుతుంది. ఒక ప్రధాని లేదా ఒక దేశాధ్యక్షుడి జీవితంలో యుద్ధం అత్యంత ప్రధానమైనది. 

యుద్ధంలో గెలిచి నిలిచిన ప్రజానాయకుల రాజకీయ జీవితాలలో అపజయాలు ఉన్నప్పటికీ చరిత్ర వాటిని పెద్దగా పట్టించుకోదు. దేశాల చరిత్రను మలుపు తిప్పినవారికి పెద్ద పీట వేస్తుంది. దేశ తొమ్మిదవ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు (పీవీ) చేసిన యుద్ధం సరిహద్దులో కాదు, విపణిలో. ప్రజల మస్తిష్కాలలో. దిగజారిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు పీవీ చేసిన పోరాటం చరి త్రాత్మకమైనది. బాబరీమసీదు విధ్వసం, జార్ఖండ్‌ ముక్తిమోర్చా పార్లమెంటు సభ్యుల కొనుగోలు వ్యవహారం, సెయెంట్‌ కిట్స్‌ కేసు,  హర్షద్‌ మెహతా ఉదంతం, లక్కూభాయ్‌ పాఠక్‌ కేసు వంటి నిందలు వచ్చినప్పటికీ ఆయన స్వయంగా కోర్టులకు హాజరై నిర్దోషిగా నిరూపించుకున్న తర్వాతనే కన్నుమూశారు. తక్కిన కేసుల సంగతి ఏమైనా, జేఎంఎం ఎంపీల ముడుపుల వ్యవహారం మాత్రం పీవీకి తెలియకుండా జరిగే అవకాశం లేదు. 1993 జులైలో లోక్‌సభలో బలపరీక్ష జరిగినప్పుడు పీవీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతుగా 244 మంది సభ్యులు ఉన్నారు. బలపరీక్షలో నెగ్గాలంటే 269 సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేయాలి. విపక్షాలలో చీలిక తెచ్చి, ఏదో ఒక చాణక్యం చేసి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవలసిన అవసరం ఉన్నదని, ఆర్థిక సంస్కరణలు గాడి తప్పకుండా ఉండాలంటే రాజ కీయ, నైతిక విలువలతో రాజీపడక తప్పదని పీవీ భావించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్, మరో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు బూటాసింగ్‌లకు ప్రభుత్వాన్ని గట్టెక్కించే బాధ్యత అప్పగిం చారు. జెఎంఎం ఎంపీలనూ, జనతాదళ్‌లో అజిత్‌ సింగ్‌ వర్గీయులనూ సుముఖులను చేసుకున్నారు. టీడీపీని చీల్చారు.

ములాయంసింగ్‌ మద్దతు సైతం స్వీకరించారు. ప్రభుత్వానికి అనుకూలంగా 265 ఓట్లూ, వ్యతిరేకంగా 251 ఓట్లూ వచ్చాయి. ఆ రోజున ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు పీవీ చేసింది నైతికంగా తప్పే అయినప్పటికీ,  అప్పుడు కనుక ప్రభుత్వం కూలిపోయి ఏ దేవగౌడ వంటి నాయకుడో ప్రధానిగా వచ్చి ఉంటే ఆర్థిక సంస్కరణలు దిశ కోల్పోయేవి. చరిత్ర మరోరకంగా ఉండేది. ఆరోపణలు కానీ, కోర్టు కేసులు కానీ, నైతిక తప్పిదాలు కానీ, బాబ్రీమసీదు వంటి కీలకమైన అంశంలో వైఫల్యం కానీ పీవీ సాధించిన ఆర్థిక విజయం ముందు దిగదుడుపే. చరిత్ర పీవీని దేశంలో లైసెన్స్‌–పర్మిట్‌ రాజ్‌ నడ్డివిరిచి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దార్శనికుడిగానే నమోదు చేస్తుంది. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన ఖ్యాతి కూడా ఆయనకు దక్కుతుంది. అందుకే ఆయనకు సముచితమైన స్థానం కేటాయిస్తుంది.

హైదరాబాద్‌ రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలో ప్రధానకార్యదర్శిగా చేరి 1951లో రాజకీయ జీవితం ఆరంభించిన పీవీ ఎంఎల్‌ఏగా, ఎంపీగా అనేక పర్యాయాలు గెలుపొందారు. రాష్ట్రమంత్రిగా పని చేశారు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు చేసి భూస్వాములు ఆగ్రహానికి గురైనారు. జైఆంధ్ర ఉద్యమం కారణంగా పదవి నుంచి వైదొలిగారు. తర్వాత ఢిల్లీ వెళ్ళి ఇందిరాగాంధీ కొలువులో ముఖ్యమైన పాత్ర పోషించారు. బహుభాషాకోవిదుడిగా, రచనావ్యాసంగంలో దిట్టగా పేరుప్రఖ్యాతులు కలిగిన పీవీ ఏఐసీసీ సమావేశాలలో తీర్మానాల రూపకల్పన బాధ్యత నిర్వహించేవారు. కాంగ్రెస్‌ నాయకుడిగా అనేక పనులు చేస్తూనే విశ్వనాథవారి వేయిపడగలు హిందీలో సహస్రఫణ్‌గా అనువదించారు.  ప్రణబ్‌ ముఖర్జీ  లేక మరెవరైనా తీర్మానం రాసినా దాన్ని చదివి పీవీ ఆమోదించిన తర్వాతే ఇందిరాగాంధీ కానీ రాజీవ్‌గాంధీ కానీ చర్చకు పెట్టేవారు కాదు. కేంద్రమంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు.

అన్ని శాఖలలో రాణించారంటే అబద్ధం అవుతుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖనూ, విదేశీ వ్యవహారాల శాఖనూ అద్భుతంగా నిర్వహించారు. ఏ శాఖ నిర్వహించినా, ఏ పని చేసినా సృజనాత్మకంగా ఆలోచించి, కొత్త పోకడలు పోవడం, అదనపు విలువను జోడించడం పీవీ ప్రత్యేకత. స్వరాష్ట్రంలో జైళ్ళ శాఖను నిర్వహించినప్పుడు బహిరంగజైలు పద్ధతికి శ్రీకారం చుట్టారు. విద్యాశాఖను పర్యవేక్షించినప్పుడు గురుకుల విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర మావన వనరుల మంత్రిగా నవోదయ పాఠశాలలు నెలకొల్పారు. విదేశాంగ మంత్రిగా వందకు పైగా దేశాలను సందర్శించడమే కాకుండా చైనాతో చాలా ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకున్నారు.

సరిహద్దు సమస్యపై చర్చలు కొనసాగిస్తూనే ఇతర రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకోవాలని ఇండియా–చైనా పీస్‌ అండ్‌ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్‌పై బీజింగ్‌లో సంతకాలు చేశారు. ఫలితంగా అప్పటి నుంచి మొన్నటి వరకూ భారత్‌–చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉంది. వాణిజ్యం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందింది. వాణిజ్యంలో పరిస్థితి చైనాకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. చైనాకు భారత్‌ ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ పది రెట్లు ఎక్కువ. నిజమే. కానీ చైనా ఎగుమతులలో 3.5 శాతం కంటే తక్కువే భారత్‌కు చేరుతున్నాయి. భారత్‌ ఎగుమతులలో 5 శాతానికి పైగా చైనాకు చేరుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ దాదాపు అయిదు రెట్లు ఎక్కువ అనే వాస్తవాన్ని గుర్తు పెట్టుకుంటే చైనా వస్తువులను బహిష్కరించాలనీ, చైనాతో వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలనీ ఎవ్వరూ వాదించరు.

చైనాతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ఎగుమతులను పెంచుకోవడం శ్రేయస్కరం. 1993లో చైనాతో పీవీ కుదుర్చుకున్న ఒప్పందం ఉభయతారకమైనది. దూరదృష్టితో చేసుకున్నది. నెహ్రూ అలీనోద్యమ నిర్మాతగా ప్రపంచ ప్రసిద్ధి గడించినప్పటికీ పక్కనే ఉన్న తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను పెద్దగా పట్టించుకోలేదు. భారత దేశానికి తూర్పు దిశగా ఉన్న సింగపూర్, మలేసియా, ఇండోనీసియా వంటి దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఆసియన్‌ టైగర్లుగా అంతర్జాతీయ విపణిలో గాండ్రిస్తుంటే ఆ దేశాలను విస్మరించడం సరి కాదని లుక్‌ ఈస్ట్‌ పాలసీని పీవీ ప్రతిపాదించారు. తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను పెంపొందించారు. వాణిజ్యం సంబంధాలను వృద్ధి చేశారు.

ఇప్పుడు నరేంద్రమోదీ సర్కార్‌ అదే పాలసీని యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీగా మరింత పదును పెట్టి అమలు చేస్తున్నది. 
ప్రధానిగా పీవీ ప్రమాణస్వీకారం చేసినప్పటి దేశ ఆర్థికస్థితి ఎట్లా ఉన్నది? రెండు వారాల దిగుమతులకు మాత్రం చెల్లించడానికి సరిపోను విదేశీమారకద్రవ్యం ప్రభుత్వ ఖజానాలో ఉంది. రెండు వారాలు దాటితే దిగుమతులకు డబ్బు చెల్లించలేని డిఫాల్టర్‌గా మిగి లిపోయే దుస్థితిలో దేశం ఉండేది. ప్రమాణస్వీకారం చేసి ఇంటికి వచ్చిన వెంటనే మన్మోహన్‌ సింగ్‌కు ఫోన్‌ చేసి పిలిపించుకున్నారు. భయపడుతున్న మన్మోహన్‌ సింగ్‌కు ధైర్యం నూరిపోసి, తాను అండగా ఉంటానని నచ్చజెప్పి ఆర్థికమంత్రిగా చేర్చుకున్నారు.

పరిశ్రమల శాఖను తన దగ్గరే ఉంచుకున్నారు. నాటి ఆర్థికశాఖ సహాయమంత్రి (అనంతరం రాజ్యసభ ఉపాధ్యక్షుడు) కురియన్‌ చేత పరిశ్రమల విధానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టించారు. రూపాయి విలువను 18 శాతం తగ్గించారు. లండన్‌ బ్యాంక్‌కి బంగారం నిల్వలు తరలించి విదేశీ మారక ద్రవ్యం సంపాదించారు. మోనోపలీస్‌ అండ్‌ రిస్ట్రిక్టివ్‌  ట్రేడ్‌ ప్రాక్టీసెస్‌ (ఎంఆర్‌ టీపీ) చట్టాన్ని రద్దు చేసి లైసెన్స్‌ –పర్మిట్‌ రాజ్‌కు భరతవాక్యం పాడారు. దిగుమతి సుంకాలనూ, ఆదాయం పన్నునూ, కార్పొరేట్‌ పన్నునూ క్రమంగా తగ్గించారు.

ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించారు. విదేశీ పెట్టుబడులను ఉదారంగా అనుమతించారు. ఫలితంగా 1992–97 ప్రణాళికా కాలంలో ఆర్థికాభివృద్ధి రేటు సగటున 6.5 శాతం సాధించారు. ఇది అపూర్వం. పీవీ అధికారంలో ఉన్న చివరి రెండేళ్ళలో ఆర్థికాభివృద్ధి రేటు 7.5 శాతం. 1991లో అడుగంటిన విదేశీమారక ద్రవ్యం 1995 నాటికి 25.1 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకున్నది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ పేరు తెచ్చుకున్నది. ఈ రోజున దేశం కరోనా కల్లోలంలో సైతం ఈ మాత్రం నిలబడి ఉందంటే అందుకు కారణం 1991లో పీవీ నాటిన బీజమే. 

పీవీ నిరాడంబరజీవి. ఆయనపైన ఎన్ని ఆరోపణలు వచ్చినా వ్యక్తిగతంగా అవినీతిపరుడని ఆయన బద్ధశత్రువులు కూడా అనరు. 1991 నాటికి సుదీర్ఘమైన తన రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి హైదరాబాద్‌ తిరిగి వచ్చి రామానందతీర్థ ఆశ్రమంలోనో, కుర్తాళం పీఠాధిపతిగానో సమాజ సేవ చేయాలనే సంకల్పంతోనే పీవీ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఎన్నికలలో మొదటి దశ పూర్తయిన తర్వాత రెండవ దశ ప్రచారంలో భాగంగా విశాఖపట్టణం నుంచి శ్రీపెరంబదూరు వెళ్ళిన రాజీవ్‌ గాంధీని ఎల్‌టీటీఈ హంతకి మానవబాంబు రూపంలో వచ్చి పాదాల దగ్గర పేలిపోయి హత్య చేసిన కారణంగా రెండవ దశ పోలిం గ్‌లో ఎక్కువ స్థానాలు సంపాదించిన కాంగ్రెస్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది.

దుఃఖంలో మునిగిపోయిన సోనియాగాంధీ నమ్మకస్తుల మాట నమ్మి ముందు శంకర్‌ దయాళ్‌ శర్మకు కబురు పెట్టారు. ప్రధానమంత్రి వంటి గురుతర బాధ్యత నిర్వహించే ఆరోగ్యం తనకు లేదని ఆయన ఆహ్వానాన్ని మృదువుగా తిరస్కరించారు. శర్మకు ముసలితనంతోపాటు ఆరోగ్యం కూడా సరిగా లేదు కనుక పీవీకి ప్రధాని బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందని అర్జున్‌సింగ్‌ చేసిన సూచనను సోనియా అమలు పరిచిందని శరద్‌ పవార్‌ తన ఆత్మకథలో రాశారు. అలెగ్జాండర్‌ ఆత్మకథ ప్రకారం పీవీ పేరు సూచించిన వ్యక్తి హక్సర్‌. తన మాట జవదాటకుండా వ్యవహరిస్తారనే ఉద్దేశంతోనే సోనియా పీవీకి అవకాశం ఇచ్చి ఉండవచ్చు.

పీవీ ప్రధానమంత్రిగా ఆత్మగౌరవంతో, స్థిరచిత్తంతో వ్యవహరిస్తూనే సోనియా పనులన్నీ చేయడానికి చిదంబరంను పురమాయించారు. కానీ అర్జున్‌సింగ్, ఎన్‌డి తివారీ, శివశంకర్, మాధవరావ్‌ సింథియా వంటి నాయకుల మాటలు విశ్వసించి పీవీ పట్ల వ్యతిరేకత పెంచుకున్న సోనియా కాంగ్రెస్‌ ప్రధానిగా ఐదేళ్ళు పని చేసిన వ్యక్తికి గౌరవం ఇవ్వలేదు. పీవీ పార్థివకాయాన్ని ఏఐసీసీ ప్రాంగణంలో ఉంచడానికి అనుమతించకుండా అవమానిం చారు. 1996లో ఘోర ఓటమి తర్వాత  కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసిన పీవీ రాజకీయంగా ఒంటరి జీవితం గడిపారు. కోర్టు కేసులు ఎదుర్కొంటూ, లాయర్‌ ఫీజు చెల్లించడానికి డబ్బులేక ఇబ్బం దిపడిన సందర్భాలు సన్నిహితులకు తెలుసు. కాంగ్రెస్‌ పార్టీ పీవీని మాజీ ప్రధానిగా కూడా గుర్తించక పోయినా దేశ ప్రజలు ఆయన చేసిన సేవను ఎన్నటికీ మరచిపోరు. ఏళ్లు గడిచినకొద్దీ దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపు పెరుగుతూ వస్తోంది. రాజకీయ జీవితం పూర్తయిం దని భావించిన తరుణంలో చరిత్ర ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన దేశానికి ఆర్థికరంగంలో నూతన దిశా నిర్దేశం చేసిన సమర్థుడైన ప్రధానిగా పీవీ చరిత్రలో నిలిచిపోతారు. 
వ్యాసకర్త: కె.రామచంద్రమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement