ఇటీవల ప్రకటించిన భారతరత్న పురస్కారాల్లో ముగ్గురికి మరణానంతరం ఇచ్చారు. ఆ ముగ్గురూ దానికి పూర్తి అర్హులు. కానీ వీటిని వారు బతికి ఉన్నప్పుడే ఇచ్చివుంటే ఎంత బాగుండేది! 53 మంది ఇప్పటివరకు ‘భారతరత్న’తో అలంకృతులయ్యారు. వారిలో 18 మందికి మరణానంతరం ప్రకటించారు. మరణానంతర ప్రదానంలోని ఇబ్బంది ఏమిటంటే, ఫలానావాళ్లకు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నకు సమాధానం ఉండదు. కర్పూరీ ఠాకూర్‌కు ఇచ్చినప్పుడు, అన్నాదురైకి ఎందుకు ఇవ్వకూడదు? మరి రాంమనోహర్ లోహియాను ఎలా విస్మరిస్తారు? మొదటి నుంచీ మరణానంతరం ఇవ్వడాన్ని ఒక నియమంగా కాక, ఒక మినహాయింపుగా మాత్రమే చూశారు. జీవించి ఉన్నప్పుడు ఇవ్వడమే భారతరత్నకు ప్రమాణంగా ఉండటం మంచిది.
చౌధురీ చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, ఎం.ఎస్. స్వామినాథన్ – ముగ్గురికీ మరణానంతరం ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడమే ఈ వ్యాసం రాయడానికి నన్ను పురిగొల్పింది. ఈ ముగ్గురూ దానికి పూర్తిగా అర్హులు, ప్రశంసించదగినవారు. వాస్తవానికి వీరికి అత్యున్నత పురస్కారం ప్రకటించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ‘సెల్యూట్’ చేసింది.
కానీ రెండు యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వాలూ లేదా రెండు ఎన్డీయే (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) ప్రభుత్వాలూ ఇన్నేళ్లుగా వీరిని ఈ రత్నాలతో ఎందుకు సత్కరించలేదనేది ప్రశ్న. నిజంగానే రత్నాలైన వీరిని దేశం కృతజ్ఞతతో అధికారికంగా కూడా అలాగే పరిగణిస్తుందనే విషయాన్ని వారి జీవితకాలంలోనే చెప్ప వలసింది కదా!
అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 1954 ఆగస్టు 15న మొదటి భారతరత్న సి. రాజగోపాలాచారికి ఇలా రాశారు: ‘మీరు మొదటి భారతరత్న అయినందుకు మేమంతా చాలా సంతోషిస్తున్నాము. చాలా ఏళ్లుగా భారత్‌కు ‘రత్నం’గా మీరు గుర్తింపు పొందారు. అది ఇప్పుడు అధికారికంగా ప్రకటించడం చాలా మంచి విషయం.’
53 మంది ఇప్పటివరకు ‘భారతరత్న’తో అలంకృతులయ్యారు. వారిలో 18 మందికి మరణానంతరం ప్రకటించారు. నేను ‘ఇప్పటి వరకు’ అని నొక్కి చెబుతున్నాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా, ఈ గుర్తింపులు వెంటవెంటనే వచ్చేస్తున్నాయి. నేను ఈ అంశంపై మరింతగా చెప్పడానికి ముందు, కొన్ని గణాంకాలను చూద్దాం.
భారతరత్న పురస్కారాలన్నింటినీ వరుస రాష్ట్రపతులే ప్రదానం చేశారు. అయినప్పటికీ ఈ విషయంలో దాదాపుగా దేశ ప్రధానులదే అధికారం. వీరిలో కొందరు ప్రధానులు తాము కూడా దీన్ని పొందారు. నెహ్రూ (1947–64) తనతో కలుపుకొని, 13 మందికి అవార్డును ప్రదానం చేశారు. గుల్జారీలాల్ నందా పరివర్తనా కాలపు బాధ్యత (1966)లో ఉన్నప్పుడు ఒక్క భారతరత్నను ఇచ్చారు.
ఇందిరా గాంధీ తన మొదటి ప్రధానమంత్రి పదవీ కాలంలో (1965–77) తనకు ఒకటి, మూడు ఇతరులకు ప్రదానం చేశారు. ఆమె రెండోసారి ప్రధానిగా ఉన్నప్పుడు (1980–84) ఇద్దరికి ఇచ్చారు. రాజీవ్ గాంధీ (1984–89) ఇద్దరికీ, వీపీ సింగ్ (1989– 90) ఇద్దరికీ, పీవీ నరసింహారావు (1991– 96) ఆరుగురికీ, ఐకే గుజ్రాల్ (1997–98) నలుగురికీ, అటల్ బిహారీ వాజ్‌పేయి (1999–2004) ఏడుగురికీ, మన్మోహన్ సింగ్ (2004–14) ముగ్గురికీ ఇచ్చారు. నరేంద్ర మోదీ (2014–) హయాంలో పదిమందికి ప్రకటించారు.
ఇప్పటివరకు అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నెహ్రూ తన పదవీ కాలంలో అత్యధిక సంఖ్యలో 13 భారతరత్నలను ప్రదానం చేశారు. నరేంద్ర మోదీ ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో పదిమందికి ఇచ్చారు. భారత రత్నలు ప్రకటించడం 1954లో ఉనికిలోకి వచ్చిందని గుర్తుంచుకుంటే, ‘సాంద్రత’ పరంగా ఇద్దరు ప్రధానులూ సమానంగా పదేళ్లలో పది మందికి ఇచ్చారు. మరణానంతరం ప్రదానం చేసిన భారతరత్నల సంఖ్యలో మాత్రం మోదీ ముందున్నారు. మరణానంతరం ప్రకటించిన 18 భారతరత్నాలలో మోదీ స్కోరు ఏడు. తదుపరి అత్యధికం పీవీ నరసింహారావుది– మూడు.
భారతరత్న అసలు ప్రకాశాన్ని రెండు పరిణామాలు ప్రభావితం చేశాయి: ఒకటి, మరణానంతరం బహూకరించడం. ముందుగా ఈ అంశాన్ని చేపడదాం. దీనిని 1955 జనవరి 15న, నాటి భారత ప్రభుత్వ గెజిట్ నంబర్ 222 ద్వారా ప్రారంభించారు. అయితే దీన్ని ఒక నియమంగా కాక, ఒక మినహాయింపుగా మాత్రమే చూశారు. ఈ ‘సడలింపు’ అమలులోకి రావడానికి పదేళ్లు పట్టింది.
1966 జనవరి 11న తాష్కెంట్‌లో అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణించిన కొన్ని గంటల్లోనే ఆయనకు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తొలి మరణానంతర భారతరత్నను ప్రకటించారు. రెండవ మరణానంతర భారతరత్నకు మరో పదేళ్లు పట్టింది. ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కె. కామరాజ్‌కు ప్రకటించారు. అయితే, ఆయన జీవించి ఉంటే, ఆయన జీవిత కాలంలో ఆమె ఆ గౌరవం ఇచ్చివుండేవారు కాదు.
కాంగ్రెస్‌వాద మూలాలతో కూడిన మరణానంతర భారతరత్న కొనసాగుతోంది. అదే సమయంలో ‘జీవించి ఉండగా’ ఇవ్వడాన్ని అధిగమించింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాల హయాంలో ప్రదానం చేసిన పదింటిలో ఏడు మరణానంతరమైనవి. అయితే ‘అర్హత’కు సంబంధించిన ప్రశ్నలు అనివార్యంగా తలెత్తు తాయి.
మరణానంతర గ్రహీతల్లో ప్రధానులు వీపీ సింగ్, చంద్రశేఖర్‌లను వదిలివేయవచ్చా? బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు ఈ పురస్కారం లభించినందున, సీఎన్ అన్నాదురైనీ, సాటిలేని ఈఎంఎస్ నంబూద్రిపాద్‌నూ విస్మరించగలమా? మరి మన కాలానికి దగ్గరగా ఉండే ఎం.కరుణానిధి, జ్యోతి బసు సంగతి? ఆచార్య వినోబా భావే మరణానంతరం పొందారు.
అలాంటప్పుడు జేబీ కృపలానీ, నరేంద్ర దేవ్ వంటి ఆచార్యులను మరచిపోగలమా? జయప్రకాశ్ నారాయణ్, నానాజీ దేశ్‌ముఖ్ వంటి రాజకీయ చింతనా పరులు మరణానంతరం పొందినప్పుడు, పెరియార్‌కు ఇవ్వకూడదా?
కల్లోల తుఫాన్‌లను దాటి దూసుకొచ్చే సముద్ర పక్షి లాంటి అరుణా అసఫ్ అలీ భారతరత్నను పొందారు. మరింత ‘తుఫాను లాంటి’ కమలాదేవీ ఛటోపాధ్యాయను వదిలివేయవచ్చా? కాంగ్రెస్ వాళ్లు ఈ ఆలోచనంటేనే విరుచుకుపడతారేమోగానీ ఏ సోషలిస్టు, ప్రజాస్వామ్యవాది రాంమనోహర్ లోహియాను మరచిపోతారు? పున రాలోచన, అధికార రాజకీయ ప్రేరణలతో ఉండే ‘ఇబ్బంది’ ఇదీ!
భారతరత్న ప్రకాశాన్ని ప్రభావితం చేసిన రెండవ పరిణామం ఏమిటంటే, దానిపై అహంభావపు స్పర్శ. నెహ్రూ, ఇందిరా గాంధీలు ఇద్దరూ తమ పదవీకాలంలో దానిని అంగీకరించకపోయి ఉంటే పురస్కార గొప్పదనాన్ని పెంచి, తమ గొప్పతనాన్నీ పెంచుకునేవారు. వారు దానిని పొందడం అంటే తమకు తామే దండలు మెడలో వేసు కున్నట్టు.
మరణానంతర ప్రదానాలు లోపాలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తితే, అధికారంలో ఉన్నప్పుడు పొందే ప్రదానాలు వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతాయి. మౌలానా ఆజాద్‌కు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు భారతరత్నను ఆఫర్ చేసినప్పుడు ఆయన ఇలా చెప్పారని ప్రతీతి: ‘మేము ఇచ్చేవాళ్లలో ఉన్నాం, తీసు కునేవాళ్లలో కాదు.’
నేను ఇలా చెప్పడం ద్వారా ఈ వ్యాసాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాను: జీవించి ఉన్నప్పుడు ఇవ్వడమే భారతరత్నకు ప్రమా ణంగా ఉండనివ్వండి. మరణానంతర ఎంపిక ఒక మినహాయింపుగా ఉండాలి. ఆమె లేదా అతను పదవిలో ఉండేవరకు ‘ఇచ్చేవారు’గానే ఉండాలి తప్ప, ‘గ్రహీత’లు కావాలని కలలు కనకూడదని ఆశిద్దాం. పదవిలో లేనట్టయితే పురస్కార విలువ పెరుగుతుంది.
అంతర్జాతీయంగానూ, జాతీయ స్థాయిలోనూ గౌరవం పొందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఇటీవల పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రశంసించారు. బహుశా ఆయనకు భారతరత్నను ప్రతిపాదించి ఉండొచ్చు, సలక్షణమైన వినమ్రతతో ఆయన తిరస్కరించి ఉండొచ్చు. ఆయనను ‘రత్నం’గా చూసిన చాలామందికి అది అధికా రికం అయినప్పుడు ఒక సంతృప్తి ఉండదా?
గోపాలకృష్ణ గాంధీ
వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మాజీ దౌత్యవేత్త
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment