Bharat Ratna award
-
మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర శాసనసభ తరఫున విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా వివిధ హోదాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. మన్మోహన్‌కు నివాళి అర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు సభ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్. 1991–96 మధ్య మన పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. ఆర్థిక స్థితిగతుల దశదిశను మార్చిన సంస్కరణల అమల్లో కీలక పాత్ర పోషించారు. ఆ పునాదులతోనే నేడు భారతదేశం ప్రపంచంతో పోటీపడుతోంది. ఆయన దార్శనికత, కృషిని అంతా స్మరించుకోవాలి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ విగ్రహం మన్మోహన్సింగ్ దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణకు చేసిన సేవలకు శాసనసభ అపార కృతజ్ఞతలు తెలియజేస్తోంది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చిన గొప్ప నేత మన్మోహన్. రాజ్యసభలో రాజ్యాంగ సవరణపై వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందన్న గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు మన్మోహన్ వ్యూహాత్మకంగా ప్రకటన చేయడంతోనే తెలంగాణ ఏర్పడింది. నాటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఆయనతో మాట్లాడి సమన్వయపర్చారు. రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్‌గా, తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో ఆమోదింప జేసిన సారథిగా ఆయనను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ ప్రజల తరఫున రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు సోనియాకు ఎంత రుణపడి ఉంటారో మన్మోహన్‌కూ అంతే రుణపడి ఉంటారు. గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించుకుందాం. ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేసుకుందాం. తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం.. నేను మన్మోహన్ మరణవార్త తెలిసి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి ఆయన కుటుంబాన్ని కలిసి తెలంగాణ సీఎంగా పరిచయం చేసుకున్నాను. మన్మోహన్ సతీమణి నాతో మాట్లాడారు. ‘మన్మోహన్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చారు. ఆయనకు తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి.’ అని ఆమె చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన మన్మోహన్.. తన కుటుంబాన్ని అత్యంత నిరాడంబరంగా నడిపించారు. ఆయనను కోల్పోవడం వారి కుటుంబానికే కాదు యావత్ దేశానికి, ప్రపంచానికి తీరని లోటు. మౌనంగా ఉంటారని, మౌన ముని అని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా విమర్శించినా సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా, జీవిత లక్ష్యంగా చేసుకున్న గొప్ప వ్యక్తి మన్మోహన్. నేను, ఉత్తమ్, కోమటిరెడ్డి ఎంపీలుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ధర్నా చేస్తుంటే.. మన్మోహన్ కూడా మా మధ్య కూర్చుని నిరసన తెలిపారు. మాకు జీవితకాలం గుర్తుండిపోయే ఘటన అది. గొప్ప మానవతావాదం చూపారు ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహార భద్రత వంటి నిర్ణయాలతో మన్మోహన్ చరిత్ర సృష్టించారు. గతంలో ప్రభుత్వాలు యజమానులతో సంబంధం లేకుండా భూములను తీసుకునేవి. కానీ కేవలం భూమి కోల్పోయేవారికే కాకుండా కులవృత్తులు, చేతువృత్తులపై ఆధారపడిన వారు, ఇళ్లు లేనివారికి సహాయ పునరావాసం అందేలా 2013లో భూసేకరణ చట్టం తెచ్చి గొప్ప మానవతావాదం చూపించారు. 2006లో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడంతో ఆదివాసులు, గిరిజనులకు పోడుభూములకు పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. గొప్ప పరిపాలన అందించడానికి అంబేడ్కర్ రాజ్యాంగం ఇచ్చి పునాదులు వేయగా.. ఆ స్ఫూర్తితో మన్మోహన్ చట్టాలు తెచ్చి ప్రజలకు మేలు చేశారు..’’ అని సీఎం రేవంత్ కొనియాడారు. -
భారత రత్న ఇవ్వాల్సిన మనిషి
ఇటీవల మరణించిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’కు అన్ని విధాలుగా అర్హుడు. ఆయన సమర్థుడైన వ్యాపారవేత్త. దార్శనిక దృక్పథమున్న పారిశ్రామివేత్త మాత్రమే కాదు... మనుషుల పట్ల సహానుభూతి, ఆప్యాయతలు కలిగిన మంచి మనిషి. రతన్ టాటాను చాలామంది కేవలం ఆరాధించలేదు; హీరోగా భావించారు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. మరణానంతరమైనా ఆయనకు భారత రత్న ఇవ్వడం ద్వారా మనల్ని మనం గౌరవించుకునే పని మొదలు కావాలి. వేర్వేరు రంగాల్లో అర్హులైన వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లకూ ఈ పుర స్కారం దక్కి ఉంటే బాగుండేది. భారత రత్న విషయంలో రాజకీయ అనుకూలతల కంటే, అర్హతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ‘భారత రత్న’కు అన్ని విధాలుగా అర్హుడే. అయితే బతికున్న రోజుల్లోనే అవార్డు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇటీవలే రతన్ టాటా మరణించిన నేపథ్యంలో మరణానంతరం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇస్తారా?మరణానంతరమైనా సరే... రతన్ టాటాకు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలి అనేందుకు బోలెడు కారణాలు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి, ఆయన సమర్థుడైన వ్యాపారవేత్త. దార్శనిక దృక్ప థమున్న పారిశ్రామివేత్త కూడా. మనుషుల పట్ల సహానుభూతి, ఆప్యాయతలు కలిగిన మంచి మనిషి. అయితే ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్లు చాలామందే ఉన్నారు. టాటాను వీరందరి నుంచి వేరు చేసే లక్షణం ఏదైనా ఉందీ అంటే... అది ఆయన అందరి నుండి పొందిన గౌరవం, మర్యాద, మన్ననలు. రతన్ టాటాను చాలా మంది కేవలం ఆరాధించలేదు; హీరోగా భావించారు. ఒకరకంగా చెప్పాలంటే పూజించారు అనాలి! ఇలాంటి వాళ్లు కొందరే కొందరు ఉంటారు. వారిలో రతన్ టాటా ఒకరు!రెండో విషయం... మనం ఆదర్శంగా భావించే వ్యక్తికి లభించే గుర్తింపు కూడా ఆ స్థాయిలోనే ఉండాలని ఆశిస్తాం. ఎందుకంటే వీళ్లు కేవలం సాధకులు మాత్రమే కాదు... చాలా ప్రత్యేకమైన వాళ్లు. అందుకే దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం అలాంటి వారికి దక్కడం ఎంతైనా ఆహ్వానించదగ్గ విషయం.దేశంలో ఇప్పటివరకూ 53 మందికి భారత రత్న పురస్కారం లభించింది. టాటా వీరందరిలోనూ ఉన్నతుడిగానే నిలుస్తారు. బి.సి. రాయ్, పి.డి. టండన్ , కె. కామరాజ్, వి.వి. గిరి, ఎం.జి. రామచంద్రన్ , రాజీవ్ గాంధీ, అరుణా అసఫ్ అలీ, గుల్జారీలాల్ నందా, గోపీనాథ్ బోర్డోలోయి, కర్పూరీ ఠాకూర్, చౌధురీ చరణ్‌సింగ్... లాంటి రాజకీయ నాయకుల విషయంలో అది నిజం కాదా?ఇంకోలా చెబుతాను. మదర్ థెరీసా, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, అమర్త్య సేన్ , పండిట్ రవిశంకర్, లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్ , భీమ్సేన్ జోషీ, సచిన్ టెండూల్కర్... అందరూ భారత రత్నకు అర్హుల నుకుంటే, రతన్ టాటాకు ఎలా కాదనగలం?వాస్తవం ఏమిటంటే... ఈ అవార్డు ఇచ్చేది రాజకీయ నాయకులు. వాళ్లు ఎక్కువగా రాజకీయ నాయకులకే ఇస్తూంటారు. ఇప్పటివరకూ అందుకున్న 53 మందిలో 18 మంది మాత్రమే ఇతర రంగాల్లో అత్యు న్నత ప్రతిభను కనబరిచినవారు. 1954 నుంచి తొలిసారిగా భారత రత్న పురస్కారం ప్రదానం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒకే ఒక్క పారిశ్రామిక వేత్త, అత్యంత అర్హుడైన జేఆర్డీ టాటాకు మాత్రమే ఆ అవార్డు దక్కింది. అంతే!వేర్వేరు రంగాల్లో అర్హులైన వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లకూ ఈ పురస్కారం దక్కి ఉంటే బాగుండేదని నేను అనుకుంటూంటాను. బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్, అమితాబ్ బచ్చన్ , ఫీల్డ్ మార్షల్ మానెక్‌శా, సల్మాన్ రుష్దీ, జూబిన్ మెహతా వంటి వాళ్లు ఒక్కొక్కరూ తమ వైయక్తిక ప్రతిభతో ఆ యా రంగాల్లో అత్యున్నత శిఖరాలను అందుకున్న వారే. ప్రపంచం వీరి ప్రతిభను గుర్తించింది, కీర్తించింది. దురదృష్టవశాత్తూ మనం ఆ పని చేయలేకపోయాం.ఇప్పటికీ సమయం మించిపోలేదు. రతన్ టాటాకు భారత రత్న ఇవ్వడం ద్వారా మనల్ని మనం గౌరవించుకునే పని మొదలు కావాలి. బి.ఆర్.అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, అబుల్ కలావ్‌ు ఆజాద్, మదన్ మోహన్ మాలవీయా వంటి వారికి మరణానంతరం దశాబ్దాల తరువాత భారత రత్న ఇవ్వగలిగినప్పుడు... 2008లో మరణించిన ఫీల్డ్ మార్షల్ మానెక్శాకు, 2021లోనే కన్ను మూసిన దిలీప్‌కుమార్‌తోపాటు మనతోనే ఉన్న అమితాబ్ బచ్చన్,సల్మాన్ రుష్దీ, జూబిన్ మెహతా వంటి వారిని భారత రత్నతో సత్కరించడం సాధ్యమే! అయితే ఇక్కడ మనం ఇంకో నిష్ఠుర సత్యాన్ని అర్థం చేసు కోవాలి. భారత రత్న విషయంలో రాజకీయ అనుకూలతల కంటే అర్హతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పేర్లు అవసరం లేదు. వారి భేషజాలను దెబ్బతీయాలన్న ఆలోచన కూడా నాకు లేదు. కానీ, వారందరూ రాజకీయ నేతలే. జవహర్లాల్ నెహ్రూతో మొదలుపెట్టి... నరేంద్ర మోదీ వరకూ అన్ని ప్రభుత్వాలూ ఈ పని చేశాయి.విషాదం ఏమిటంటే... మనం తరచూ కొంతమంది అనర్హులకు భారత రత్న ఇచ్చాం. ఇంకోలా చెప్పాలంటే అర్హులకు నిరాకరించాం. ఎలాగైతేనేం, ఆ అవార్డు గౌరవమైతే మసకబారింది. అర్హులకు ఇవ్వలేదు, అనర్హులకు ఇచ్చారన్న వాదాన్ని కాసేపు పక్కనపెట్టి... జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సమయం ఇదే. దేశమాత అసలు ఆణిముత్యాలను ప్రజలెప్పుడూ గుర్తుంచుకుంటారు. సందేహం ఏమీ లేదు. రతన్ టాటా అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది సామాన్యులు ఈ విషయాన్ని మరోసారి నిర్ధ్ధరించారు. వార్తాపత్రికల్లో పేజీలకు పేజీ కథనాలు, టెలివిజన్ ఛానళ్లలో గంటల లైవ్ కవరేజీలన్నీ రతన్ టాటాపై ఈ దేశ ప్రజలకు ఉన్న అభిమానాన్ని చాటేవే! ఎవరూ కాదనలేని సత్యమిది. అలాగని రాజ్యం ఆయనను గుర్తించదంటే మాత్రం సరికాదు. నన్నడిగితే అలా చేయడం క్షమించలేనిది.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అద్వానీకి భారతరత్న అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి, ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ భారతరత్న అందుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆదివారం అద్వానీకి భారతరత్నను ప్రదానం చేశారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ కలిసి ఆదివారం అద్వానీ ఇంటికి వెళ్లారు. అనంతరం, అద్వానీకి భారతరత్నను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, వెంకయ్యనాయుడు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక, నిన్న (శనివారం) పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్నలను అందజేసిన విషయం తెలిసిందే. #WATCH | President Droupadi Murmu confers Bharat Ratna upon veteran BJP leader LK Advani at the latter's residence in Delhi. Prime Minister Narendra Modi, Vice President Jagdeep Dhankhar, former Vice President M. Venkaiah Naidu are also present on this occasion. pic.twitter.com/eYSPoTNSPL — ANI (@ANI) March 31, 2024 -
పీవీ, చరణ్ సింగ్ సహా నలుగురికి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్లకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌదరి, ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరఫున కుమారుడు రాంనాథ్ ఠాకూర్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. -
రాష్ట్రపతి భవన్ లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం
-
భారతరత్న ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్బంగా ఇటీవల భారతరత్న పొందిన వారు అవార్డులను స్వీకరించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్.. అలాగే, ఎమ్ఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌ను మరణానంతరం భారతరత్న అవార్డు వరించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు. చౌదరి చరణ్ సింగ్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు జయంత్ చౌదరి. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్. స్వామినాథన్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమార్తె డాక్టర్ నిత్య. #WATCH | President Droupadi Murmu confers Bharat Ratna upon former PM Chaudhary Charan Singh (posthumously) The award was received by Chaudhary Charan Singh's grandson Jayant Singh pic.twitter.com/uaNUOAdz0N — ANI (@ANI) March 30, 2024 అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ. దీంతో, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ రేపు(ఆదివారం) ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందించనున్నారు. #WATCH | President Droupadi Murmu presents the Bharat Ratna award to former PM PV Narasimha Rao (posthumously) The award was received by his son PV Prabhakar Rao pic.twitter.com/le4Re9viLM — ANI (@ANI) March 30, 2024 అయితే, ఇటీవలే ఐదుగురికి కేంద్రం భారతరత్న అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగానే నేడు భారతరత్నల ప్రదానం జరిగింది. ఇక, ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు నాయకులు పాల్గొన్నారు. పీవీ కుటుంబ సభ్యుల హర్షం.. పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం సంతోషంగా ఉంది -శారద, పీవీ నరసింహారావు కూతురు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సరైన దిశలో నడిపించారు. ఆయన చేసిన కృషికి భారతరత్న అవార్డు నిదర్శనం. నరేంద్ర మోదీకి ధన్యవాదాలు.- జస్టిస్ శ్రవణ్ కుమార్, పీవీ మనవడు యూపీఏ హయంలోనే పీవీకి భారతరత్న రావాలి. అవార్డు ఆలస్యం అయినా, ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించడం సంతోషం. పీవీ నరసింహారావుకు అనేక అవమానాలు జరిగాయి. ఆయన చేసిన మంచి పనులు కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు- సుభాష్ , పీవీ.మనవడు. -
మరణానంతర ప్రదానం మంచిదేనా?
ఇటీవల ప్రకటించిన భారతరత్న పురస్కారాల్లో ముగ్గురికి మరణానంతరం ఇచ్చారు. ఆ ముగ్గురూ దానికి పూర్తి అర్హులు. కానీ వీటిని వారు బతికి ఉన్నప్పుడే ఇచ్చివుంటే ఎంత బాగుండేది! 53 మంది ఇప్పటివరకు ‘భారతరత్న’తో అలంకృతులయ్యారు. వారిలో 18 మందికి మరణానంతరం ప్రకటించారు. మరణానంతర ప్రదానంలోని ఇబ్బంది ఏమిటంటే, ఫలానావాళ్లకు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నకు సమాధానం ఉండదు. కర్పూరీ ఠాకూర్‌కు ఇచ్చినప్పుడు, అన్నాదురైకి ఎందుకు ఇవ్వకూడదు? మరి రాంమనోహర్ లోహియాను ఎలా విస్మరిస్తారు? మొదటి నుంచీ మరణానంతరం ఇవ్వడాన్ని ఒక నియమంగా కాక, ఒక మినహాయింపుగా మాత్రమే చూశారు. జీవించి ఉన్నప్పుడు ఇవ్వడమే భారతరత్నకు ప్రమాణంగా ఉండటం మంచిది. చౌధురీ చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, ఎం.ఎస్. స్వామినాథన్ – ముగ్గురికీ మరణానంతరం ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడమే ఈ వ్యాసం రాయడానికి నన్ను పురిగొల్పింది. ఈ ముగ్గురూ దానికి పూర్తిగా అర్హులు, ప్రశంసించదగినవారు. వాస్తవానికి వీరికి అత్యున్నత పురస్కారం ప్రకటించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ‘సెల్యూట్’ చేసింది. కానీ రెండు యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వాలూ లేదా రెండు ఎన్డీయే (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) ప్రభుత్వాలూ ఇన్నేళ్లుగా వీరిని ఈ రత్నాలతో ఎందుకు సత్కరించలేదనేది ప్రశ్న. నిజంగానే రత్నాలైన వీరిని దేశం కృతజ్ఞతతో అధికారికంగా కూడా అలాగే పరిగణిస్తుందనే విషయాన్ని వారి జీవితకాలంలోనే చెప్ప వలసింది కదా! అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 1954 ఆగస్టు 15న మొదటి భారతరత్న సి. రాజగోపాలాచారికి ఇలా రాశారు: ‘మీరు మొదటి భారతరత్న అయినందుకు మేమంతా చాలా సంతోషిస్తున్నాము. చాలా ఏళ్లుగా భారత్‌కు ‘రత్నం’గా మీరు గుర్తింపు పొందారు. అది ఇప్పుడు అధికారికంగా ప్రకటించడం చాలా మంచి విషయం.’ 53 మంది ఇప్పటివరకు ‘భారతరత్న’తో అలంకృతులయ్యారు. వారిలో 18 మందికి మరణానంతరం ప్రకటించారు. నేను ‘ఇప్పటి వరకు’ అని నొక్కి చెబుతున్నాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా, ఈ గుర్తింపులు వెంటవెంటనే వచ్చేస్తున్నాయి. నేను ఈ అంశంపై మరింతగా చెప్పడానికి ముందు, కొన్ని గణాంకాలను చూద్దాం. భారతరత్న పురస్కారాలన్నింటినీ వరుస రాష్ట్రపతులే ప్రదానం చేశారు. అయినప్పటికీ ఈ విషయంలో దాదాపుగా దేశ ప్రధానులదే అధికారం. వీరిలో కొందరు ప్రధానులు తాము కూడా దీన్ని పొందారు. నెహ్రూ (1947–64) తనతో కలుపుకొని, 13 మందికి అవార్డును ప్రదానం చేశారు. గుల్జారీలాల్ నందా పరివర్తనా కాలపు బాధ్యత (1966)లో ఉన్నప్పుడు ఒక్క భారతరత్నను ఇచ్చారు. ఇందిరా గాంధీ తన మొదటి ప్రధానమంత్రి పదవీ కాలంలో (1965–77) తనకు ఒకటి, మూడు ఇతరులకు ప్రదానం చేశారు. ఆమె రెండోసారి ప్రధానిగా ఉన్నప్పుడు (1980–84) ఇద్దరికి ఇచ్చారు. రాజీవ్ గాంధీ (1984–89) ఇద్దరికీ, వీపీ సింగ్ (1989– 90) ఇద్దరికీ, పీవీ నరసింహారావు (1991– 96) ఆరుగురికీ, ఐకే గుజ్రాల్ (1997–98) నలుగురికీ, అటల్ బిహారీ వాజ్‌పేయి (1999–2004) ఏడుగురికీ, మన్మోహన్ సింగ్ (2004–14) ముగ్గురికీ ఇచ్చారు. నరేంద్ర మోదీ (2014–) హయాంలో పదిమందికి ప్రకటించారు. ఇప్పటివరకు అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నెహ్రూ తన పదవీ కాలంలో అత్యధిక సంఖ్యలో 13 భారతరత్నలను ప్రదానం చేశారు. నరేంద్ర మోదీ ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో పదిమందికి ఇచ్చారు. భారత రత్నలు ప్రకటించడం 1954లో ఉనికిలోకి వచ్చిందని గుర్తుంచుకుంటే, ‘సాంద్రత’ పరంగా ఇద్దరు ప్రధానులూ సమానంగా పదేళ్లలో పది మందికి ఇచ్చారు. మరణానంతరం ప్రదానం చేసిన భారతరత్నల సంఖ్యలో మాత్రం మోదీ ముందున్నారు. మరణానంతరం ప్రకటించిన 18 భారతరత్నాలలో మోదీ స్కోరు ఏడు. తదుపరి అత్యధికం పీవీ నరసింహారావుది– మూడు. భారతరత్న అసలు ప్రకాశాన్ని రెండు పరిణామాలు ప్రభావితం చేశాయి: ఒకటి, మరణానంతరం బహూకరించడం. ముందుగా ఈ అంశాన్ని చేపడదాం. దీనిని 1955 జనవరి 15న, నాటి భారత ప్రభుత్వ గెజిట్ నంబర్ 222 ద్వారా ప్రారంభించారు. అయితే దీన్ని ఒక నియమంగా కాక, ఒక మినహాయింపుగా మాత్రమే చూశారు. ఈ ‘సడలింపు’ అమలులోకి రావడానికి పదేళ్లు పట్టింది. 1966 జనవరి 11న తాష్కెంట్లో అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణించిన కొన్ని గంటల్లోనే ఆయనకు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తొలి మరణానంతర భారతరత్నను ప్రకటించారు. రెండవ మరణానంతర భారతరత్నకు మరో పదేళ్లు పట్టింది. ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కె. కామరాజ్‌కు ప్రకటించారు. అయితే, ఆయన జీవించి ఉంటే, ఆయన జీవిత కాలంలో ఆమె ఆ గౌరవం ఇచ్చివుండేవారు కాదు. కాంగ్రెస్వాద మూలాలతో కూడిన మరణానంతర భారతరత్న కొనసాగుతోంది. అదే సమయంలో ‘జీవించి ఉండగా’ ఇవ్వడాన్ని అధిగమించింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాల హయాంలో ప్రదానం చేసిన పదింటిలో ఏడు మరణానంతరమైనవి. అయితే ‘అర్హత’కు సంబంధించిన ప్రశ్నలు అనివార్యంగా తలెత్తు తాయి. మరణానంతర గ్రహీతల్లో ప్రధానులు వీపీ సింగ్, చంద్రశేఖర్‌లను వదిలివేయవచ్చా? బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు ఈ పురస్కారం లభించినందున, సీఎన్ అన్నాదురైనీ, సాటిలేని ఈఎంఎస్ నంబూద్రిపాద్నూ విస్మరించగలమా? మరి మన కాలానికి దగ్గరగా ఉండే ఎం.కరుణానిధి, జ్యోతి బసు సంగతి? ఆచార్య వినోబా భావే మరణానంతరం పొందారు. అలాంటప్పుడు జేబీ కృపలానీ, నరేంద్ర దేవ్ వంటి ఆచార్యులను మరచిపోగలమా? జయప్రకాశ్ నారాయణ్, నానాజీ దేశ్‌ముఖ్ వంటి రాజకీయ చింతనా పరులు మరణానంతరం పొందినప్పుడు, పెరియార్‌కు ఇవ్వకూడదా? కల్లోల తుఫాన్లను దాటి దూసుకొచ్చే సముద్ర పక్షి లాంటి అరుణా అసఫ్ అలీ భారతరత్నను పొందారు. మరింత ‘తుఫాను లాంటి’ కమలాదేవీ ఛటోపాధ్యాయను వదిలివేయవచ్చా? కాంగ్రెస్ వాళ్లు ఈ ఆలోచనంటేనే విరుచుకుపడతారేమోగానీ ఏ సోషలిస్టు, ప్రజాస్వామ్యవాది రాంమనోహర్ లోహియాను మరచిపోతారు? పున రాలోచన, అధికార రాజకీయ ప్రేరణలతో ఉండే ‘ఇబ్బంది’ ఇదీ! భారతరత్న ప్రకాశాన్ని ప్రభావితం చేసిన రెండవ పరిణామం ఏమిటంటే, దానిపై అహంభావపు స్పర్శ. నెహ్రూ, ఇందిరా గాంధీలు ఇద్దరూ తమ పదవీకాలంలో దానిని అంగీకరించకపోయి ఉంటే పురస్కార గొప్పదనాన్ని పెంచి, తమ గొప్పతనాన్నీ పెంచుకునేవారు. వారు దానిని పొందడం అంటే తమకు తామే దండలు మెడలో వేసు కున్నట్టు. మరణానంతర ప్రదానాలు లోపాలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తితే, అధికారంలో ఉన్నప్పుడు పొందే ప్రదానాలు వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతాయి. మౌలానా ఆజాద్‌కు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు భారతరత్నను ఆఫర్ చేసినప్పుడు ఆయన ఇలా చెప్పారని ప్రతీతి: ‘మేము ఇచ్చేవాళ్లలో ఉన్నాం, తీసు కునేవాళ్లలో కాదు.’ నేను ఇలా చెప్పడం ద్వారా ఈ వ్యాసాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాను: జీవించి ఉన్నప్పుడు ఇవ్వడమే భారతరత్నకు ప్రమా ణంగా ఉండనివ్వండి. మరణానంతర ఎంపిక ఒక మినహాయింపుగా ఉండాలి. ఆమె లేదా అతను పదవిలో ఉండేవరకు ‘ఇచ్చేవారు’గానే ఉండాలి తప్ప, ‘గ్రహీత’లు కావాలని కలలు కనకూడదని ఆశిద్దాం. పదవిలో లేనట్టయితే పురస్కార విలువ పెరుగుతుంది. అంతర్జాతీయంగానూ, జాతీయ స్థాయిలోనూ గౌరవం పొందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఇటీవల పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రశంసించారు. బహుశా ఆయనకు భారతరత్నను ప్రతిపాదించి ఉండొచ్చు, సలక్షణమైన వినమ్రతతో ఆయన తిరస్కరించి ఉండొచ్చు. ఆయనను ‘రత్నం’గా చూసిన చాలామందికి అది అధికా రికం అయినప్పుడు ఒక సంతృప్తి ఉండదా? గోపాలకృష్ణ గాంధీ వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మాజీ దౌత్యవేత్త (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
రైతు ప్రధానికి సముచిత గౌరవం
పేదవర్గాలకు ఎనలేని సేవలందించిన భారత మాజీ ప్రధానమంత్రి దివంగత చరణ్ సింగ్‌కు ఆయన చనిపోయిన 45 ఏళ్ళ తర్వాత కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ అవార్డుకు ఎంపిక చేయటం హర్ష ణీయం. అదే విధంగా తెలుగుజాతికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన ఎన్టీ రామా రావుకు కూడా భారతరత్న ఇస్తే సముచితంగా ఉంటుంది. 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఓడించటంలో చరణ్ సింగ్‌ది ప్రధానపాత్ర. వాస్త వానికి 1971 ఎన్నికలలో రాయబరేలీలో ఇందిరమ్మపై పోటీచేసిన రాజ్ నారాయణ్ ఎన్నికల పిటిషన్ వేసి, అలహాబాద్ హైకోర్టులో నెగ్గడం వెనుక కూడా చరణ్‌సింగ్ చాణక్యం లేకపోలేదు. మధు లిమాయే 1977లో ఒక మాటన్నారు: ‘ఉత్తరభారతంలో రామ్ మనోహర్ లోహియా విఫలం కాగా చరణ్ సింగ్ సమర్థంగా వ్యవ సాయ కులాలను, మైనార్టీలను, వెనుకబడిన వర్గాలను గుదిగుచ్చి మాల తయారు చేయటంలో విజయం సాధించారు.’ 1937లో చరణ్ సింగ్ రెవిన్యూ మంత్రిగా ఉత్తరప్రదేశ్‌లో రైతురుణ విమోచన చట్టం తెచ్చి, రైతాంగాన్ని ఆనాడే అప్పుల బాధ నుండి బయట పడేశారు. 1979లో చరణ్‌సింగ్ ఆర్థికశాఖను చేపట్టి 1979–80 ఫిబ్రవరి 28న బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆ సందర్భంలో ఓ రోజు ఉదయం ఫిబ్రవరి మొదటివారంలో చరణ్‌సింగ్‌ను కలుద్దామని తుగ్లక్ రోడ్డుకెళ్ళాను. అప్పట్లో ఆయన ఉప ప్రధానిగా కూడా ఉన్నారు. చరణ్ సింగ్ ఇంటి ముందు మూడు కార్లున్నాయి. వాటినిండా ఫైళ్ళు మూట గట్టి నింపేస్తున్నారు. వ్యక్తిగత భద్రతాధికారి కర్తార్ సింగ్ నన్ను చూడగానే, ‘చౌధరీ సాబ్ బడ్జెట్ రూపొందించేందుకై హరియాణాలోని సూరజ్‌కుండ్‌కు వెళ్తు న్నారు. నీవు ఇక్కడే ఉండు, చౌధరీసాబ్ బయటకు రాగానే కనపడ’ మని సలహా చెప్పారు. వాకిలి వద్దే నిలుచున్నాను. చౌధరీ బయటకు రాగానే నన్ను చూసి ‘ఏమిటింత ప్రొద్దున్నే వచ్చావు. గొడ్డుచలిలో?’ అని వాకబు చేశారు. ‘రెండు, మూడు సమస్యలున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలలో పొందుపరచాలి’ అని వివరించాను. కారు ఎక్కమన్నారు. వెనుక సీటులో చౌధరీసాబ్ పక్కన కూర్చున్నాను. ముందు సీటులో కర్తార్ సింగ్ కూర్చున్నారు. రైతులు పండించే పొగాకుపై ఎక్సైజ్ సుంకం రద్దుచేయవలసిన అవసరాన్ని వివరించాను. అదే మాదిరి పేదవారు వాడుకొనే అల్యూమినియం పాత్రలపై కూడా సుంకం తొలగించాలని వివరించాను. దానికి సంబంధించిన వివరాలతో, ముసాయిదా పత్రాన్ని కూడా తయారు చేశానని చెప్పాను. ఆ పత్రాలు లాక్కొని తన ఫైలులో పెట్టుకొన్నారు. ఆ రెంటినీ బడ్జెట్ ప్రతిపాదనలలో పొందుపరిచారు. చాలా ఆశ్చర్యమేసింది. అంతకు ముందు బడ్జెట్లు రూపొందించే కసరత్తులో భాగంగా సలహాల కోసం బొంబాయి వెళ్ళి ఆర్థికవేత్తలు, ప్రణాళికా నిపుణులు, పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వారు, పాలనాదక్షులతో చర్చలు జరిపితే బడ్జెట్ మరింత నాణ్యంగా రూపొందించడానికి ఉపయోగపడగలదని సూచించాను. సరేనన్నారు. బొంబాయి సమావేశంలో పాల్గొన్న పెద్దలు చెప్పినవన్నీ జాగ్రత్తగా రికార్డు చేయించి, ఆ కాగితాలు తీసుకొని ఆ సూచనలలో ప్రతి ఒక్కదానికీ పూర్తి వ్యతిరేకంగా బడ్జెట్ ప్రతిపాద నల్లో చేర్చారు. ‘బొంబాయిలోని వారంతా బడా బాబులు. వారు చెప్పినదానికి పూర్తి వ్యతిరేకంగా చేస్తే, మనం సరైన మార్గంలో ఉన్నట్లు! మనం చేసిన పని బాగుందని వారు కితాబిస్తే మనం ఎక్కడో తప్పు చేశామని అర్థం! అని గీతోపదేశం చేశారు. 1979 జులైలో జనతాపార్టీ చీలిపోయింది. మొరార్జీ స్థానంలో చరణ్ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. ఆయన కాలంలో లోక్ సభ రద్దయి, మధ్యంతర ఎన్నికలు ప్రకటించారు. డీసీఎం అధిపతి అయిన భరత్ రామ్ భారత వాణిజ్య, పారిశ్రామిక మండలి అధ్యక్షులుగా చరణ్ సింగ్ దగ్గరకు వెళ్లి ఆయనకు ఎన్నికల నిధి ఇవ్వజూపారు. ఏమిటిదని అడిగారు చరణ్ సింగ్. ‘ఏమీ లేదు – ఇది మామూలే. ప్రతి ఎన్నికల సమయంలోనూ ప్రధానమంత్రు లందరికీ మేము ఇలాగే సమర్పించుకొంటుంటాం. ఇందులో కొత్త ఏమీలేదు. ఇప్పుడు ప్రధాని కుర్చీలో మీరు కూర్చున్నారు గనుక మీకు సమర్పిస్తున్నాం’ అన్నారు. ‘ఏమిటీ నాకు డబ్బులిస్తావా? పోలీసులకు అప్ప జెబుతాను. నేను రైతుల దగ్గరికెళ్ళి రూపాయి – రూపాయి అడుక్కొంటాను గానీ, పారిశ్రామికవేత్తల విరాళాలతో ఎలక్షన్‌కు వెళ్తానా?’ అని కోపగించారు చరణ్ సింగ్. భరత్ రామ్ రాష్ట్రపతి భవన్ కెళ్ళి రాష్ట్రపతిగా ఉన్న నీలం సంజీవరెడ్డిని కలిసి ‘భలేవాడిని ప్రధాన మంత్రిగా చేశారు సార్. ఎన్నికల నిధికి ఏదో పదిరూపాయలిద్దామని వెడితే, అరెస్ట్ చేయిస్తానని వెంటబడతాడే మిటి సార్’ అని వాపోయారు. ఎమ్వీఎస్ సుబ్బరాజు, గణపా రామస్వామి రెడ్డి, దొడ్డపనేని ఇందిర జనతాపార్టీ శాసనసభ్యులు, నీలం సంజీవరెడ్డికి ఆత్మీయులు. వారు వాస్తవానికి మానసికంగా లోక్ దళ్‌కూ, చరణ్ సింగ్ భావజాలానికీ దగ్గర. వారిని పిలిపించారు సంజీవరెడ్డి. ‘ఇదెక్కడ గోలయ్యా. తుండు, తుపాకీ లేకుండా యుద్ధానికి వెళతానంటాడు. ఎవరో పెద్దమనిషి పది రూపాయ లిస్తానంటే అరెస్టు చేయిస్తానంటాడు. ఈ సిద్ధాంత మూర్ఖుడితో కూడుగాదు, మీరు కాంగ్రెస్‌లో చేరిపోండి’ అని సలహా ఇచ్చారు. అలాగే చేశారు వారు ముగ్గురూ. ప్రధానమంత్రిగా నుండగా 1979 అక్టోబరులో గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ. చౌధరీ సాబ్ ఉపన్యా సాన్ని తెలుగులోకి నేనే తర్జుమా చేశాను. ‘శివాజీ, నా ఉపన్యాసం కన్నా, నీ తర్జుమా మరింతగా శ్రోతలను ఆకట్టుకొంది. లేకుంటే సభ అంత రక్తికట్టేది కాదు’ అని సభానంతరం మనసారా అభినందించారు చరణ్ సింగ్. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఓట్ల చీలిక వల్లనే కాంగ్రెస్ నెగ్గు కొస్తున్నదనీ, ఆ పార్టీలన్నీ ఐక్యం అయితే కాంగ్రెస్ పాలన ముగు స్తుందనీ చరణ్ సింగ్ విశ్వాసం. ఆ దిశగా ఆలోచన చేసే 1974 ఆగస్టు 29న భారతీయ క్రాంతిదళ్, సోషలిస్టుపార్టీ, సంయుక్త సోషలిస్టు పార్టీలు, ముస్లిం మజ్లిస్, స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, మజ్దూర్ పార్టీ, పంజాబ్ ఖేతీ భారీ జమీందారీ యూనియన్లను విలీనం గావించి భారతీయ లోక్‌దళ్‌ను రూపొందించారు. జాతీయ స్థాయిలో నిరంతరం రైతుల కోసం పరితపించిన చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వటం ఎంతో సముచితం. కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని రైతులందరూ స్వాగతిస్తున్నారు. డా‘‘ యలమంచిలి శివాజి వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యుడు ‘ 98663 76735 -
ఎన్టీఆర్‌కూ ఇచ్చి ఉండాల్సింది: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పలువురికి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ సీఎం సీనియర్ ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ఇచ్చి ఉంటే తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచేదని ఆమె కామెంట్స్ చేశారు. కాగా, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ క్రమంలో విజయశాంతి ట్విట్టర్ వేదికగా..‘భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం. భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక శ్రీ పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించిఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని… pic.twitter.com/Q95K2oFOSC — VIJAYASHANTHI (@vijayashanthi_m) February 9, 2024 ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈ రోజున నిండుగా, మెండుగా కనబడుతోంది. ఈ బాధ్యతను భుజాలకెత్తుకుని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను. అన్ని రాజకీయ పార్టీలూ ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పీవీ నరసింహరావుకు భారతరత్న.. స్పందించిన మెగాస్టార్!
తెలంగాణ బిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ప్రకటించడంపై మెగాస్టార్ స్పందించారు. దేశానికి ఆయన చేసిన సేవలు అద్భుతమని కొనియాడారు. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా దేశ స్థితిగతులను మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..'నిజమైన దార్శనికుడు, పండితుడు, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడైన తెలుగు బిడ్డకు భారతరత్న రావడం మనందరికీ గర్వకారణం, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ఆధునిక భారతదేశాన్ని మార్చివేశారు. ప్రపంచంలో భారతదేశం ఆర్థిక శక్తిగా మారడానికి పునాది వేసిన వ్యక్తి ఆయనే. తాను చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించింది. ఇది భారతీయులందరితో పాటు తెలుగువారికి మరింత సంతోషకరమైన విషయం. ఈ గౌరవం లభించడం ఆలస్యమైనప్పటికీ.. ఇంతకు మించిన గొప్పది ఏమీ ఉండదు.' అని పోస్ట్ చేశారు. కాగా.. చిరంజీవి ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో చిరుకు జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష కనిపంచనుంది. A true visionary, scholar, polyglot, great statesman, pride of All Telugus , someone whose vision has transformed modern India by ushering in revolutionary economic reforms and laid the foundation for India to become an economic powerhouse, former Prime Minister Late Shri.PV… pic.twitter.com/hMnvCIFy6g — Chiranjeevi Konidela (@KChiruTweets) February 9, 2024 -
Bharat Ratna#Swaminathan బతికుండగా వస్తే చాలా సంతోషించేవారు
#BharatRanta M S Swaminathan భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్‌కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను కేంద్రం ప్రకటించింది.మరణానంతరం స్వామినాథన్‌కు భారతరత్న అవార్డు దక్కనుంది. దీనిపై స్వామినాథన్ కుమార్తె, మాజీ చీఫ్ సైంటిస్ట్ , డబ్ల్యూహెచ్‌వో మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్పందించారు. ఆయన జీవితకాలంలో ఈ అవార్డు దక్కి ఉంటే కచ్చితంగా సంతోషంగా ఉండేవారని అభిప్రాయ పడ్డారు. కానీ వ్యవసాయ రంగానికి, రైతులకు ఆయన చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు దక్కడంపై సంతోషంగాను, గర్వంగానూ ఉందన్నారు. కానీ ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పని చేయలేదనీ గుర్తింపుకోసం ఎదురు చూడలేదని పేర్కొన్నారు. కాలా చాలా అవార్డులు ఆయనకు దక్కాయని పేర్కొన్నారు. తను చేసిన పనికి వచ్చిన ఫలితాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. ఆయన జీవితమంతా రైతుల ప్రయోజనాల కోసం పాటు పడ్డారంటూ తండ్రి సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు. దేశంలో ఏ మూలకెళ్లినా ఆయన కలిసిన రైతులను గుర్తు పెట్టుకునేవారు. సమాజంలో రైతులు, పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేశారన్నారామె. ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్‌బర్డ్స్ కాగా దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు, అభివృద్ధికి ఆయన విశేషమైన కృషి చేసి భారత హరిత విప్లవ పితామహుడుగా పేరు తెచ్చుకున్నారు స్వామినాథన్ ఎక్కువ దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను వృద్ధి చేసి ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగులునింపారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులందుకున్నారు. అలాగే హెచ్‌కె ఫిరోడియా అవార్డ్, ది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్, ఇందిరాగాంధీ ప్రైజ్ వంటి అవార్డులతోపాటు అంతర్జాతీయ రామన్ మెగసెసె అవార్డు , ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డులను కూడా అందుకున్నారు. స్వామినాథన్ 98 ఏళ్ల వయసులో 2023 సెప్టెంబర్ 23న చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. #WATCH | On M S Swaminathan being conferred the Bharat Ratna, Former Chief Scientist and former Deputy Director General at the WHO and daughter of MS Swaminathan, Dr Soumya Swaminathan says, "I am sure that he would have also been happy if the news had come during his lifetime.… pic.twitter.com/gz3r6udKPb — ANI (@ANI) February 9, 2024 -
బాబ్రీమసీదు కూల్చివేత నేరస్తునికి భారతరత్నా?
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేతలో నేరస్తునిగా ఉన్న అడ్వాణీకి భారతరత్న ఇవ్వడంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మండిపడ్డారు. హైదరాబాద్ మగ్ధూంభవన్‌లో మూడు రోజులపాటు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, తీర్మానాలు తదితర అంశాలను ఆదివారం సీపీఐ జాతీయ కార్యదర్శులు రామకృష్ట పండా, కె.నారాయణ, సయ్యద్ అజీజ్, లోక్‌సభాపక్ష నేత బినాయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి రాజా మీడియా సమావేశంలో వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలుపొందితే దేశానికి విపత్తేనని, ఈ విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజా అన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసుకుని, బీజేపీని ఓడించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఆ ప్రభుత్వ పాలసీలను విమర్శించడం ప్రతిపక్ష హక్కు అని, కానీ మోదీ, బీజేపీ ప్రతిపక్షమే ఉండకూడదని భావిస్తోందని ఆరోపించారు. రానున్న లోక్ ఎన్నికలకు తాము సన్నద్ధమవుతున్నామని, ఇండియా కూటమి కామన్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తుందని, అదే సమయంలో తమ పార్టీ తరపున మేనిఫెస్టోను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమి నేతలు గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు ఉన్నప్పటికీ రాహుల్ ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే కేరళలో పోటీచేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీని ఓడించేందుకు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పనిచేస్తున్న నేపథ్యంలో కేరళలో రాహుల్ పోటీ చేయడం ఆరోగ్య వాతావరణం కాదన్నారు. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ జాతీయ సమితి ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్ కౌర్, డాక్టర్ బి.కె.కంగో, నాగేంద్రనాథ్ ఓజా, జాతీయ కార్యవర్గ సభ్యులు అనీరాజా, రాజ్యసభ సభ్యులు పి.సంతోష్ కుమార్‌లను ఈ కమిటీ సభ్యులుగా నియమించారు. -
L.K Advani: గమ్యం చేరని రథ యాత్రికుడు
లాల్‌కృష్ణ అడ్వాణీ. 1990ల నుంచి రెండు దశాబ్దాల పాటు దేశమంతటా మారుమోగిపోయిన పేరు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో రాజకీయ రథయాత్రలకు పర్యాయపదంగా మారిన పేరు. ఆయన చేపట్టిన ఆరు యాత్రల్లో అయోధ్య రథయాత్ర దేశ రాజకీయ ముఖచిత్రాన్నే శాశ్వతంగా మార్చేసింది. జాతీయ రాజకీయాల్లో బీజేపీపై ‘అంటరాని పార్టీ’ ముద్రను చెరిపేసింది. బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంలో వాజ్‌పేయితో పాటు అడ్వాణీది కీలకపాత్ర. వాజ్‌పేయిని భారతరత్న వరించిన తొమ్మిదేళ్లకు తాజాగా ఆయనకూ ఆ గౌరవం దక్కింది. బీజేపీకి సుదీర్ఘ కాలం అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా అడ్వాణీదే. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు నేషనల్ డెమొక్రటికల్ అలయన్స్ (ఎన్డీఏ)కు ఊపిరి పోసిందీ ఆయనే. కరాచీ నుంచి కరాచీ దాకా... అడ్వాణీ నేటి పాకిస్తాన్‌లోని కరాచీలో 1927 నవంబర్ 8న జన్మించారు. 14 ఏళ్లప్పుడే ఆరెస్సెస్‌లో చేరారు. అనంతరం జనసంఘ్ నేతగా ఎదిగారు. సహచర నేత వాజ్‌పేయితో పాటు దేశవ్యాప్త క్రేజ్ సంపాదించుకున్నారు. హిందూ హృదయ సమ్రాట్‌గా గుర్తింపు పొందారు. వాజ్‌పేయిది మితవాద ఇమేజీ కాగా అడ్వాణీ మాత్రం హిందూత్వకు పోస్టర్ బోయ్‌గా ముద్ర పడ్డారు. ఇద్దరూ కలిసి జోడెద్దులుగా బీజేపీ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. 1983లో కేవలం రెండు లోక్‌సభ సీట్లకు పరిమితమైన కాలంలో అడ్వాణీ బీజేపీ అధ్యక్ష పగ్గాలను అందుకున్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్త రామ రథయాత్ర తలపెట్టారు. 1990 సెపె్టంబర్లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి మొదలు పెట్టిన ఈ యాత్రకు బ్రహా్మండమైన స్పందన లభించింది. అరెస్టుతో యాత్ర మధ్యలోనే ఆగినా బీజేపీకి అదెంతగానో కలిసొచి్చంది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పారీ్టగా అవతరించింది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసానికి తోడు 1993 నుంచి అడ్వాణీ చేపట్టిన జనాదేశ్, స్వర్ణజయంతి, భారత్ ఉదయ్, భారత్ సురక్ష వంటి రథయాత్రలు బీజేపీని కేంద్రంలో అధికారానికి చేరువ చేశాయి. చివరికి 1996లో బీజేపీ తొలిసారిగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ వాజ్‌పేయి ప్రధాని కావడంతో అడ్వాణీ కల నెరవేరలేదు. దాంతో మితవాద ముద్ర కోసం విఫలయత్నాలు చేశారు. ఆ క్రమంలో 2005లో కరాచీ వెళ్లి మరీ జిన్నాను లౌకికవాది అంటూ పొగడటం ఆయనకు మరింత చేటు చేయడమే గాక ఆరెస్సెస్ కన్నెర్రకూ కారణమైంది. ఆ దెబ్బకు సంఘ్‌తో అడ్వాణీ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. 2009 ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యరి్థగా నిలిచినా పార్టీ పరాజయం పాలైంది. యూపీఏ ప్రభుత్వ అవినీతిపై 2011లో చివరిసారి చేసిన జనచేతన యాత్రా అడ్వాణీకి అంతగా లాభించలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అడ్వాణీకి భారతరత్న
న్యూఢిల్లీ: రాజకీయ కురు వృద్ధుడు, బీజేపీ అగ్ర నేత లాల్‌కృష్ణ అడ్వాణీ (96)కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి భవన్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం 1990లో దేశవ్యాప్త రథయాత్రతో బీజేపీకి ఊపు తెచ్చి అధికార సాధనకు బాటలు పరిచిన అడ్వాణీని, రామాలయ ప్రారం¿ోత్సవం జరిగిన కొద్ది రోజులకే భారతరత్న వరించడం విశేషం. అడ్వాణీకి ఈ సందర్భంగా మోదీ అభినందనలు తెలిపారు. ‘‘సమకాలీన రాజకీయవేత్తల్లో అత్యంత గౌరవనీయుడు అడ్వాణీ. దేశాభివృద్ధిలో ఆయనది అత్యంత కీలక పాత్ర. అచంచలమైన చిత్తశుద్ధి, అంకితభావంతో దేశానికి దశాబ్దాల పాటు సేవ చేశారు. ప్రజాస్వామ్యానికి జాతీయవాద విలువలను కూర్చిన గొప్ప నాయకుడు. అత్యంత కింది స్థాయి నుంచి మొదలై ఉప ప్రధానిగా ఎదిగారు. రాజకీయాల్లో నైతిక విలువలకు నూతన ప్రమాణాలు నెలకొల్పారు’’ అంటూ ప్రశంసించారు. ‘‘ఇది నాకెంతో భావోద్వేగపూరిత క్షణం. అడ్వాణీతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఎంతగానో నేర్చుకునే అవకాశం నాకు దక్కింది’’ అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రకటన అనంతరం అడ్వాణీకి మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తనకు అత్యున్నత పౌర పురస్కారం లభించడం పట్ల అడ్వాణీ హర్షం వెలిబుచ్చారు. ‘‘దేశం కోసమే నా జీవితమంతా ధారపోశా. నా ఆశయాలకు సిద్ధాంతాలకు దక్కిన గౌరవమిది. నాకెంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. అద్వానీతో కలిపి ఇప్పటిదాకా 50 మందికి ఈ పురస్కారం దక్కింది. పది రోజుల క్రితమే బిహార్ దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సామాజికవేత్త కర్పూరి ఠాకూర్‌కు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించడం తెలిసిందే. ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి ఈ పురస్కారం ఇవ్వవచ్చు. కానీ 1999లో మాత్రం నలుగురికి భారతరత్న ప్రకటించారు. కుటుంబ రాజకీయాలను సవాలు చేసిన అడ్వాణీ: మోదీ సంభాల్పూర్ (ఒడిశా): అడ్వాణీ ఆజన్మాంతం కుటుంబ రాజకీయాలను సవాలు చేశారని, దేశ ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ కోసం పోరాడారని మోదీ అన్నారు. బీజేపీపై అంటరాని పార్టీ ముద్రను పోగొట్టి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రాజకీయ వేదికగా తీర్చిదిద్దారని కొనియాడారు. ‘‘దివంగత ప్రధాని వాజ్పేయితోకలిసి భారత ప్రజాస్వామ్యానికి అడ్వాణీ జాతీయ విలువలద్దారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక కుటుంబ గుత్తాధిపత్యం నుంచి విముక్తం చేసేందుకు నిరంతరం పోరాడారు. ఆయనకు భారతరత్న లభించడం బీజేపీకి, దాని అసంఖ్యా కార్యకర్తలకు కూడా గొప్ప గౌరవం’’ అని ఒడిశాలోని సంభాల్పూర్ ర్యాలీలో మోదీ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, అనురాగ్ ఠాకూర్ తదితరులతో పాటు పలు పారీ్టల నాయకులు కూడా అడ్వాణీకి అభినందనలు తెలిపారు. దేశానికి, బీజేపీకి, పార్టీ సిద్ధాంతానికి ఆయన చేసిన నిస్వార్థ సేవలను వరి్ణంచేందుకు మాటలు చాలవని షా అన్నారు. తన గురువైన అద్వానీకి ఇంతటి గౌరవం దక్కడం ఆనందంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపానన్నారు. జేడీ(ఎస్) నేత కుమారస్వామి, ఎల్జేపీ (రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు అడ్వాణీకి అభినందనలు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయం కొలువుదీరిందంటే అందుకు అడ్వాణీయే కారణమని బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప అన్నారు. త్వరలో దిగిపోనున్న మోదీ సర్కారు బీజేపీ ఓటుబ్యాంకును కాపాడుకునేందుకే అడ్వానీకి భారతరత్న ప్రకటించిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. నేను ఆచరించిన విలువలకు, నా సేవలకు గుర్తింపు ‘‘భారతరత్న పురస్కారం నాకు అత్యున్నత గౌరవం మాత్రమే కాదు. నేను జీవితాంతం ఆచరించిన విలువలకు, శక్తివంచన లేకుండా అందించిన సేవలకు గుర్తింపు కూడా. దీన్ని అత్యంత వినమ్రతతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నా. 14 ఏళ్ల వయసులో కార్యకర్తగా ఆరెస్సెస్‌లో చేరిన రోజు నుంచి భరతమాతకు నిస్వార్థంగా సేవ చేయడమే లక్ష్యంగా బతికా. ఈ జీవితం నాది కాదు, దేశానిదేనన్న భావనే నన్ను ముందుకు నడిపింది. ఈ సందర్భంగా పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలను కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటున్నా. ఈ ఇద్దరు మహనీయులతో కలిసి పని చేసే అదృష్టం నాకు దక్కింది. సుదీర్ఘ ప్రజా జీవితంలో నాతో పాటు కలిసి పని చేసిన లక్షలాది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు తదితరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు భారతరత్న ప్రకటించినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. నాకు అడుగడుగునా అంతులేని ప్రేరణ శక్తిగా నిలిచిన నా కుటుంబీకులను, ముఖ్యంగా నన్ను వీడి వెళ్లిన నా భార్య కమలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. నా దేశం మరిన్ని ఘనతలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ – భారతరత్న ప్రకటన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో అడ్వాణీ. -
BharatRatna to LK Advani అద్వానీ కంట తడి, కుమార్తె రియాక్షన్
#LKAdvanBharat Ratna బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కిషన్ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈవిషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. దేశ అభివృద్ధికి అద్వానీ కృషి చిరస్మరణీయ మైందనీ, కింది స్థాయినుంచి దేశ ఉపప్రధాని స్థాయికి ఎదిగారని, దేశానికి ఎనలేని సేవలు చేశారంటూ మోదీ ప్రశంసించారు. దీంతో అద్వానీ కుటుంబం, బీజేపీ శ్రేణులతోపాటు దేశవ్యాప్తంగా అద్వానీకి శుభాకాంక్షలు వెల్లువ కురుస్తోంది. #WATCH | Daughter of veteran BJP leader LK Advani, Pratibha Advani shares sweets with him and hugs him. Government of India announced Bharat Ratna for the veteran BJP leader. pic.twitter.com/zdYrGumkAq — ANI (@ANI) February 3, 2024 ఇది ఇలా ఉంటే తన తండ్రికి దేశ అత్యున్నత పురస్కారం దక్కడంపై అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ సంతోషం ప్రకటించారు. ఢిల్లీలోని అద్వానీ నివాసంలో తండ్రిని కలిసిన ఆమె ఆయనకు లడ్డూ తినిపించిశుభాకాంక్షలందించారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ప్రత్యేక అభినందనలు తెలిపారు. “దాదా (ఎల్‌కె అద్వానీ)కి దేశ అత్యున్నత గౌరవం లభించినందుకు కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నేను నా తల్లిని చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే వ్యక్తిగత జీవితమైనా లేదా రాజకీయ జీవితమైనా ఆయన జీవితంలో ఆమె చేసిన సహకారం చాలా పెద్దది’’ అన్నారామె. అలాగే తనను ఇంత పెద్ద అవార్డుతో సత్కరించినందుకు ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపు తున్నానని తన తండ్రి చెప్పారని ప్రతిభా అద్వానీ వెల్లడించారు.ఈ విషయంలో తెలిసి తండ్రి కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు. ఆయన జీవిత కాల స్వప్నం రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా కూడా ఆయన భావోద్వేగానికి లోనయ్యారని తెలిపారు. తన జీవితంలో ఈ దశలో, ఆయన చేసిన కృషికి ఈ అద్భుతమైన గుర్తింపు లభించడం గమనించడం చాలా అద్భుతంగా ఉందని సీనియర్ బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ కుమారుడు జయంత్ అద్వానీ అన్నారు. #WATCH | Pratibha Advani, veteran BJP leader LK Advani’s daughter, reacts on Bharat Ratna for her father. She says, "The entire family and I are very happy that he has been given the highest civilian award in the country...He is very happy...He said that he dedicated his entire… pic.twitter.com/UMe1WNSldc — ANI (@ANI) February 3, 2024 కాగా గుజరాత్ ఉంచి లోక్‌సభకు ఆరుసార్లు ఎంపికయ్యారు అద్వానీ. 1991లో తొలిసారిగా ఇక్కడి నుంచి గెలుపొందిన ఆయన 2014 వరకూ లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు.. ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలి విశ్రాంతి తీసుకుంటున్నారు. -
‘భారత రత్న’ అందుకున్న ప్రముఖులెవరు?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజానేత కర్పూరి ఠాకూర్‌ను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది. ఇప్పటివరకూ 49 మంది ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారతరత్న పొందిన వారిలో క్రికెట్ గాడ్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్ పేరు కూడా ఉంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు... ఇలా పలువురు ‘భారతరత్న’ అందుకున్నారు. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం రోజున దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేస్తుంది. ఈ జాబితాలో తాజాగా ప్రముఖ గాంధేయ సోషలిస్ట్ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ పేరు కూడా చేరింది. కర్పూరి ఠాకూర్ 1970, డిసెంబర్ నుండి 1971 జూన్ వరకు తిరిగి 1977 డిసెంబర్ నుండి 1979 ఏప్రిల్ వరకు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కర్పూరి ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. భారతరత్నను ప్రదానం చేయడం 1954లో ప్రారంభమైంది. కులం, వృత్తి, హోదా, లింగ భేదం లేకుండా ఆయారంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ గౌరవం దక్కుతుంది. ఇప్పటివరకు ‘భారతరత్న’ అందుకున్నవారు 1. చక్రవర్తి రాజగోపాలాచారి (రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు)- 1954 2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (తత్వవేత్త, రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)- 1954 3. చంద్రశేఖర్ వెంకట రామన్ (భౌతిక శాస్త్రవేత్త)- 1954 4. భగవాన్ దాస్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు, తత్వవేత్త, విద్యావేత్త)- 1955 5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త, మైసూర్ దివాన్)- 1955 6. జవహర్లాల్ నెహ్రూ (స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత, భారత మాజీ ప్రధాని)- 1955 7. గోవింద్ వల్లభ్ పంత్ (స్వాతంత్ర్య సమరయోధుడు)- 1957 8. ధోండో కేశవ్ కర్వే (సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుడు)- 1958 9. బిధాన్ చంద్ర రాయ్ (వైద్యుడు, రాజకీయ నేత , పరోపకారి, విద్యావేత్త, సామాజిక కార్యకర్త) - 1961 10. పురుషోత్తం దాస్ టాండన్ (స్వాతంత్ర్య సమర యోధుడు)- 1961 11. రాజేంద్ర ప్రసాద్ (స్వాతంత్ర్య సమర యోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, పండితుడు, భారత మాజీ రాష్ట్రపతి)- 1962 12. జాకీర్ హుస్సేన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1963 13. పాండురంగ్ వామన్ కేన్ (ఇండాలజిస్ట్, సంస్కృత పండితుడు)-1963 14. లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు, భారత మాజీ ప్రధాని) – 1966 15. ఇందిరా గాంధీ (రాజకీయనేత, భారత మాజీ ప్రధానమంత్రి)-1971 16. వరాహగిరి వెంకట గిరి (స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ రాష్ట్రపతి)-1975 17. కుమారస్వామి కామరాజ్ (మరణానంతరం) (రాజకీయవేత్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి) - 1976 18. మదర్ మేరీ థెరిసా బోజాక్షియు (మదర్ థెరిసా) (మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు) - 1980 19. వినోబా భావే (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)-1983 20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)-1987 21. మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (మరణానంతరం) (రాజకీయనేతగా మారిన నటుడు)-1988 22. భీమ్ రావ్ రామ్‌జీ అంబేద్కర్ (మరణానంతరం) (సంఘ సంస్కర్త)-1990 23. నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (వర్ణవివక్ష వ్యతిరేక పోరాట నేత)- 1990 24. రాజీవ్ గాంధీ (మరణానంతరం) (రాజకీయనేత, భారత మాజీ ప్రధాని)-1991 25. సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1991 26. మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్ (స్వాతంత్ర్య పోరాట వీరుడు, భారత ప్రధాని)- 1991 27. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు)-1992 28. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా (పారిశ్రామికవేత్త)- 1992 29. సత్యజిత్ రే (చిత్ర నిర్మాత)- 1992 30. గుల్జారీ లాల్ నందా (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1997 31. అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు)- 1997 32. ఎ.పి.జె. అబ్దుల్ కలాం ( శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)-1997 33. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (కర్ణాటక శాస్త్రీయ గాయని)-1998 34. చిదంబరం సుబ్రమణ్యం (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1998 35. జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)- 1999 36. అమర్త్య సేన్ (ఆర్థికవేత్త)- 1999 37. ప్రకాష్ గోపీనాథ్ బోర్డోలోయ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు) – 1999 38. రవిశంకర్ (సితార్ వాద్యకారుడు) - 1999 39. లతా దీనానాథ్ మంగేష్కర్ (గాయని)- 2001 40. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (హిందుస్తానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్)- 2001 41. భీంసేన్ గురురాజ్ జోషి (హిందుస్తానీ క్లాసికల్ సింగర్)- 2009 42. సిఎన్ఆర్ రావు (కెమిస్ట్, ప్రొఫెసర్)- 2014 43. సచిన్ రమేష్ టెండూల్కర్ (క్రికెటర్)- 2014 44. అటల్ బిహారీ వాజ్‌పేయి (రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)- 2015 45. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) (పండితులు, విద్యా సంస్కర్త)- 2015 46. నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం) (సామాజిక కార్యకర్త)- 2019 47. భూపేంద్ర కుమార్ హజారికా (మరణానంతరం) (ప్లేబాక్ సింగర్, గేయ రచయిత, సంగీతకారుడు, కవి, చలనచిత్ర నిర్మాత) - 2019 48. ప్రణబ్ ముఖర్జీ (రాజకీయనేత, భారత మాజీ రాష్ట్రపతి)- 2019 49. కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) (రాజకీయనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి) – 2024 -
అరుదైన జన నాయకుడు
బిహార్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన (1970–71, 1977–79) కర్పూరీ ఠాకూర్ జీవితం సరళత, సామాజిక న్యాయం అనే జంట స్తంభాల చుట్టూ తిరిగింది. ఆయన సాధారణ జీవనశైలి, వినయపూర్వకమైన స్వభావం సామాన్య ప్రజలను లోతుగా ప్రభావితం చేశాయి. సామాజిక న్యాయం ఆయనకు అత్యంత ప్రియమైన అంశం. భారత సమాజాన్ని పీడిస్తున్న వ్యవస్థాగత అసమానతలను పరిష్కరించేందుకు పట్టుదలగా కృషి చేశారు. తన రాజకీయ ప్రయాణంలో వనరులు సక్రమంగా పంపిణీ అయ్యే సమాజాన్ని నిర్మించేందుకు పూనుకున్నారు. ఆయన నాయకత్వంలో, ఒకరి పుట్టుక ఒకరి విధిని నిర్ణయించని; సమగ్ర సమాజానికి పునాది వేసే విధానాల అమలు జరిగింది. దురదృష్టవశాత్తూ 64 ఏళ్ల వయసులోనే అర్ధంతరంగా మరణించినా, కోట్లాది మంది హృదయాల్లో నిలిచారు... నేడు మన ‘భారత రత్న’మై వెలిగారు. సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసి, కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీ యుడు, ‘జన్ నాయక్’ కర్పూరీ ఠాకూర్ జీ శత జయంతి నేడు. కర్పూరీ జీని కలిసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు కానీ, ఆయనతో సన్నిహితంగా పనిచేసిన కైలాసపతి మిశ్రా గారి నుండి నేను ఆయన గురించి చాలా విన్నాను. ఆయన సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలలో ఒకటైన నాయి(క్షురక) కులానికి చెందినవారు. అయినప్పటికీ ఎన్నో ఆటంకాలను అధిగమించి, అకుంఠిత దీక్షతో శ్రమించి, సమాజాభివృద్ధికి పాటుపడ్డారు. కర్పూరీ ఠాకూర్జీ జీవితం సరళత, సామాజిక న్యాయం అనే జంట స్తంభాల చుట్టూ తిరిగింది. తన చివరి శ్వాస వరకు, ఆయన సాధారణ జీవనశైలి, వినయపూర్వకమైన స్వభావం సామాన్య ప్రజల హృదయాల్లో లోతుగా ప్రతిధ్వనించాయి. ఆయన సింప్లిసిటీని హైలైట్ చేసే అనేక వృత్తాంతాలు ఉన్నాయి. తన కూతురి పెళ్లితో సహా, ప్రతీ వ్యక్తిగత వ్యవహారానికి తన సొంత డబ్బును మాత్రమే ఎలా ఖర్చు పెట్టడానికి ఇష్టపడేవారో ఆయనతో పనిచేసిన వారు గుర్తు చేసుకుంటారు. బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, రాజకీయ నాయ కుల కోసం ఒక కాలనీని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆయన మాత్రం తనకోసం ఎటువంటి భూమి గానీ, డబ్బు గానీ తీసుకోలేదు. 1988లో ఆయన మరణించినప్పుడు పలువురు నాయ కులు ఆయన గ్రామానికి వెళ్లి నివాళులర్పించారు. ఆయన ఇంటి పరి స్థితిని చూసి కన్నీళ్ల పర్యంతమయ్యారు– ఇంత మహోన్నతుని ఇల్లు ఇంత సాదాసీదాగా ఎలా ఉందా అని! ఇలా కూడా ఉంటారా? 1977లో బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన సరళతకు సంబంధించిన మరో కథనం ఇది. అప్పుడు కేంద్రంలో, బిహార్‌లో జనతా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో, లోక్‌నాయక్ జేపీ(జయప్రకాశ్ నారాయణ్) పుట్టినరోజు సందర్భంగా జనతా నాయకులు పట్నాలో గుమిగూడారు. అప్పుడు ముఖ్యమంత్రి కర్పూరీ జీ కూడా వారితో ఉన్నారు. ఆయన చిరిగిన కుర్తాతో నడిచిరావడం వాళ్లు గమనించారు. చంద్రశేఖర్ జీ(మాజీ ప్రధాన మంత్రి; జనతా పార్టీ నేత) తనదైన శైలిలో, కర్పూరీజీ కొత్త కుర్తాను కొనుగోలు చేసేందుకు కొంత డబ్బును విరాళంగా ఇవ్వాలని ప్రజలను కోరారు. అయితే, కర్పూరీ ఆ డబ్బును అంగీకరించారు కానీ దానిని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చేశారు. అదీ ఆయన గొప్పతనం! తనకు సాటి ఎవరూ లేరని ఆ ప్రవర్తనతో చాటి చెప్పారు. కర్పూరీ ఠాకూర్ సామాజిక న్యాయం కోపం పరితపించారు. ఆయన రాజకీయ ప్రయాణంలో వనరుల పంపిణీ నిష్పాక్షికంగా జరగాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ వారి సామాజిక స్థితిగతు లతో సంబంధం లేకుండా అవకాశాలను పొందాలని తపించారు. భారత సమాజాన్ని పీడిస్తున్న వ్యవస్థాగత అసమానతలను నిర్మూలించడానికి పట్టుదలతో కృషి చేశారు. తన ఆదర్శాల పట్ల ఆయనకున్న నిబద్ధత ఎలాంటిదంటే, కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్న కాలంలో జీవించినప్పటికీ, కాంగ్రెస్ తన వ్యవస్థాపక సూత్రాల నుండి వైదొలిగిందని చాలా ముందుగానే నమ్మినందున, స్పష్టమైన కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు. ఆయన ఎన్నికల జీవితం 1950ల మొదట్లో ప్రారంభమైంది. అప్పటి నుండి, శాసన సభలో గణనీయమైన శక్తిగా మారారు. కార్మి కులు, సన్నకారు రైతులు, యువకుల కష్టాలకు శక్తిమంతమైన గొంతుకై, వారి పోరాటాలకు అండగా నిలిచారు. విద్యకు కూడా ఆయన అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. తన రాజకీయ జీవితంలో పేదలకు విద్యా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎంతగానో కృషి చేశారు. ఉన్నత స్థానాలకు ఎదగాలంటే చిన్న పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలకు స్థానిక భాషలలో విద్యా బోధన అందాలని సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో వయోవృద్ధుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టారు. కర్పూరీ వ్యక్తిత్వంలో ప్రజాస్వామ్యం, చర్చోపచర్చలు, సమా వేశాలు అంతర్భాగంగా నిలిచాయి. యువకుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో మునిగితేలినప్పుడూ, మళ్లీ ఎమర్జెన్సీని కరాఖండీగా ఎదిరించి నిలిచినప్పుడూ ఈ స్ఫూర్తి కనిపిస్తుంది. ఆయనదైన ఈ ప్రత్యేక దృక్పథాన్ని జేపీ, డాక్టర్ లోహియా, చరణ్ సింగ్ వంటివారు గొప్పగా మెచ్చుకునేవారు. బహుశా కర్పూరీ ఠాకూర్ భారతదేశానికి అందించిన అత్యంత ముఖ్యమైన సహకారాలలో ఒకటి... వెనుక బడిన తరగతుల వారికి తగిన ప్రాతినిధ్యం, అవకాశాలు లభిస్తాయన్న ఆశతో వారి కోసం నిశ్చయాత్మక చర్యలను బలోపేతం చేయడం. ఆయన నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ఆయన నాయ కత్వంలో, ఒకరి పుట్టుక ఒకరి విధిని నిర్ణయించని, సమగ్ర సమాజానికి పునాది వేసే విధానాల అమలు జరిగింది. ఆయన సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారు అయినప్పటికీ, ప్రజలందరి కోసం పనిచేశారు. సంకుచిత భావాలతో పని చేయలేదు. ఆయనలో లేశ మాత్రమైనా కాఠిన్యం ఉండకపోయేది, అదే ఆయన్ని నిజమైన గొప్పవాడిగా నిలబెట్టింది. ఆయన బాటలో... గత పదేళ్లుగా, మా ప్రభుత్వం కూడా జన్ నాయక్ కర్పూరీ ఠాకూర్ భావాలు, విధానాలను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తోంది. సామాజిక సాధికారత సాధించడం లక్ష్యంగా మా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తూ, ప్రజా సంక్షేమ విధానాలు అనుసరిస్తోంది. కర్పూరీ వంటి కొద్దిమంది నాయకులను మినహాయిస్తే, సామాజిక న్యాయం కోసం ఇచ్చే పిలుపు కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే పరిమితం కావడం మన రాజకీయ వ్యవస్థ తాలూకు అతిపెద్ద విషాదాలలో ఒకటి. కర్పూరీ ఠాకూర్ విధానాల నుండి స్ఫూర్తి పొంది సమర్థవంతమైన పాలన విధానాన్ని మేము అమలు చేస్తున్నాం. గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం బారి నుంచి విముక్తి పొందారు. వీరంతా అత్యంత వెనుకబడిన వర్గా లకు చెందిన వారు. వలస పాలన నుంచి విముక్తి పొంది దాదాపు 70 ఏళ్ల తర్వాత కూడా వీరికి తగిన గుర్తింపు, గౌరవం లభించలేదు. సామాజిక న్యాయ సాధన కోసం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలి అన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం పని చేస్తోంది. మా ప్రభుత్వం సాధించిన విజయాలను చూసి కర్పూరీ ఠాకూర్ ఎంతో గర్వపడేవారని నేను నమ్మకంగా, గర్వంగా చెప్పగలను. నేడు ముద్ర రుణాల వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్న తరుణంలో కర్పూరీ ఠాకూర్ కలలుగన్న ఆర్థిక స్వావలంబన కార్య రూపం దాలుస్తోంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను పొడిగించే అదృష్టం మా ప్రభుత్వానికే దక్కింది. కర్పూరీ ఠాకూర్ చూపిన మార్గంలో పని చేస్తున్న ఓబీసీ కమిషన్‌ను (దీనిని కాంగ్రెస్ వ్యతిరేకించింది) ఏర్పాటు చేసిన ఘనత కూడా మాకు దక్కింది. మా పీఎం–విశ్వకర్మ పథకం భారతదేశం అంతటా ఓబీసీ వర్గాలకు చెందిన కోట్లాది మందికి కొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది. వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిగా నేను కర్పూరీ ఠాకూర్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దురదృష్టవశాత్తూ 64 ఏళ్ల వయసులోనే ఆయన మరణించారు. చాలా అవసరమైన సమయంలో మనకు దూరం అయ్యారు. అయినా ఆయన తన పని వల్ల కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన నిజమైన ప్రజా నాయకుడు! నరేంద్ర మోదీ భారత ప్రధాని -
కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న.. ప్రధాని మోదీ, సీఎం జగన్ హర్షం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకూర్‌ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది. నేడు ఆయన వందో జయంతి. ఠాకూర్ శతాబ్ది జయంతి ఉత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం ఈ ప్రకటన వెలువరించడం విశేషం. జననాయకుడిగా అందరికీ చిరపరిచితుడైన ఠాకూర్ బిహార్‌లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికారు. భారతరత్న పొందిన వారిలో ఠాకూర్ 49వ వ్యక్తి. చివరిసారిగా 2019 ఏడాదిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేసింది. బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తొలి కాంగ్రెసేతర సోషలిస్ట్ నేతగా చరిత్ర సృష్టించారు. బిహార్‌కు ఆయన రెండుసార్లు సీఎంగా సేవలందించారు. తొలిసారిగా సీఎంగా 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు పనిచేశారు. 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో డెప్యూటీ సీఎంగానూ చేశారు. ‘ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయానికి ప్రతిరూపం ఠాకూర్. అణగారిన వర్గాల తరఫున పోరాడి వారిలో మార్పు రావడానికి ఎంతగానో కృషిచేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని జీవన విధానంగా మార్చుకున్న మహానుభావుడు. ఈ పురస్కారం ఆయన చేసిన కృషికి మాత్రమే కాదు భావితరాలకు స్ఫూర్తిగా, గొప్ప ప్రేరణగా నిలుస్తుంది’ అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యార్థి దశలోనే స్వతంత్రపోరాటంలోకి.. ఠాకూర్ బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో కర్పూరిగ్రామ్‌లో 1924 జనవరి 24వ తేదీన జన్మించారు. ఈ గ్రామం పూర్వం బ్రిటిష్ ఇండియా పాలనలో బిహార్–ఒడిశా ప్రావిన్స్‌లో పితౌజియా పేరుతో పిలవబడేది. పితౌజియా గ్రామం పేరును ఈయన పేరిట కర్పూరిగ్రామ్‌గా మార్చారు. అతి సామాన్య నాయీ బ్రాహ్మణ రైతు కుటుంబంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు. ఠాకూర్‌కు చిన్నప్పటి నుంచి విప్లవభావాలు ఎక్కువే. కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేసి భారత స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఠాకూర్‌ను 1942, 1945లో అరెస్ట్‌చేసి జైలులో పడేసింది. స్వాతంత్య్రం సిద్ధించాక మొదట్లో గ్రామంలోని పాఠశాలలో టీచర్‌గా పనిచేశారు. రామ్ మనోహర్ లోహియాకు ప్రభావితులై రాజకీయాల్లో చేరారు. జయప్రకాశ్ నారాయణ్‌కు సన్నిహితంగా మెలిగేవారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయనతో కలసి పోరాటం చేశారు. జననాయకుడు బిహార్‌లో బీసీలకు 26 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మంగేరీ లాల్ కమిషన్ సిఫార్సులను 1978లో అమలుచేశారు. మండల్ కమిషన్‌కు ఈ సిఫార్సులే ప్రేరణగా నిలిచాయి. అత్యంత వెనుకబడిన కులాలు అనే భావనను తొలిసారిగా మంగేరీ కమిషనే తీసుకొచ్చింది. 1952లో తొలిసారిగా సోషలిస్ట్ పార్టీ తరఫున తేజ్‌పూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి బిహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. తుదిశ్వాస విడిచేదాకా ఎమ్మెల్యేగానే కొనసాగారు. 1970లో బిహార్ రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధం అమలుచేసి అందరి మన్ననలు పొందారు. రాష్ట్రంలో ఓబీసీలు రాజకీయాల్లో కీలకంగా మారడం వెనక ఈయన పాత్ర ఉంది. జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లకు ఠాకూర్ రాజకీయ గురువు. 1988లో తుదిశ్వాస విడిచారు. ఈయన కుమారుడు ప్రస్తుతం రామ్‌నాథ్ ఠాకూర్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. అణగారిన వర్గాల పెన్నిధి: మోదీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ‘ పేద, అణగారిన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా అంకితభావంతో పనిచేశారు. సమాజంలోని వివక్ష, అసమానతలు పారద్రోలి వెనకబడిన వర్గాలకు అన్నింటి అవకాశాలు దక్కేందుకు జీవితాంతం కృషిచేశారు. ఆయన నాయకత్వ దార్శనికత భారత సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై చెరగని ముద్ర వేసింది. ఈ పురస్కారం ఆయన కృషి మాత్రమేకాదు సమున్నతమైన సమసమాజ స్థాపన కోసం మనం చేసే ప్రయత్నాలకు చక్కని ప్రేరణ’’ అని మోదీ శ్లాఘించారు. సీఎం జగన్ హర్షం సామాజిక న్యాయం, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన సోషలిస్టు నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు ఆయన మరణానంతరం భారతరత్న ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న
న్యూఢిల్లీ: దివంగత బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయన 24 జనవరి, 1924 బిహార్‌లోని సమస్తీపూర్‌లో జన్మించారు. బడుగు, బలహీలన వర్గాల కోసం ఠాకూర్ చేసిన కృషికి గుర్తింపుగా.. ఆయన శత జయంతి సందర్భంగా భారతరత్న ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జననేత ‘జననాయక్’గా కర్పూరి ఠాకూర్ ప్రసిద్ధి. ఆయన రెండు సార్లు బిహార్‌కు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. మొదటి సారి 1970 డిసెంబర్ నుంచి 1971 వరకు బిహార్ సీఎంగా పనిచేశారు. రెండో సారి 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ సీఎంగా సేవలు అందించారు. కర్పూరి ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు చదవండి: Subhash Chandra Bose Jayanti Special: సుభాష్ చంద్రబోస్ ఏం చదువుకున్నారు? -
ఘంటసాలకు ‘భారతరత్న’ కార్యక్రమం: 200 టీవీ ఎపిసోడ్స్ పూర్తి
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా ఘంటశాలకు ‘భారతరత్న’ అనే నినాదంతో యూఏఎస్ఏ నుంచి శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 200 టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా అమెరికా గానకోకిల శారద ఆకునూరి వ్యాఖ్యాతగా 8 జనవరి 2023, జనవరి 8న నాడు జరిగిన అంతర్జాల (జూమ్) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పని ఒత్తిడి కారణంగా "200 వ టీవీ ఎపిసోడ్" ఉత్సవాల నిమిత్తం అమెరికాకు రాలేక పోతున్నప్పటికీ న్యూఢిల్లీ నుంచే ఘంటసాలకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుతో పాటు అనేక భాషలలో వేలాది మధురమైన పాటలు అందించిన ఘంటశాల గారి గళం ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే సుప్రభాతం కానీ, అనేక భక్తి గీతాలు కానీ, లేక భగవద్గీతగా వినినిపిస్తుందన్నీరు. వీటన్నిటికీ మించి ఈ దేశ స్వాత్రంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం లో పాల్గొన్న స్వతంత్ర పోరాట యోధుడు... చిన్నప్పుడు గాంధీజీ సిద్ధాంతాలకు స్పందించి స్వాతంత్ర పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతదేశానికి స్వాత్రంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తియైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆజాద్ కా అమృతోత్సవ్ పేరుతో ప్రపంచం అంతా కూడా ఈ ఉత్సవాలు జరగాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే ఘంటసాల శతజయంతి జన్మ ఉత్సవాలను అనేక ప్రాంతాల్లో కూడా జరపాలని నిర్ణయించామనీ, 4 డిసెంబర్ 4న, చెన్నైలో భారత ప్రభుత్వం తరపున ప్రారంభించడంతోపాటు, రానున్న రోజుల్లో ఒక సంవత్సరం పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, దేశ రాజధానిలో లాంటి అనేక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తరపున శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అనేక దేశాలలో కూడా మన ఘంటసాల అభిమానులు, కళాకారులు, అనేకమంది ప్రముఖులు వారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారనీ, మీ ప్రాంతాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. మరొక్క సారి భారత ప్రభుత్వం , సాంస్కృతిక శాఖ తరపున ఆయన ఘనమైన నివాళులర్పించారు. రక్షణ శాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి, మాట్లాడుతూ ఘంటసాల అంటే తెలియని తెలుగు వారు ఉండరు, ఉదయాన్నే లేవగానే వారి గాత్రాన్ని భక్తి గీతాల రూపంలో, భగవద్గీత రూపంలో, సినిమా పాటలు రూపంలో వింటూ ఉంటాము. చిన్నతనంలో తండ్రి గారు మరణించిన చాలా కష్టాలు పడి విజయనగం వెళ్లి వారాలు ఉండి సంగీతం నేర్చుకొని, వారికి సంగీతం నేర్పించిన గురువు గారు అయినా సీతారామ శాస్త్రి గారిని జీవితాంతం స్మరించుకున్నారు. 10వేల పైగా పాటలు, 110 ఎక్కువ సంగీత దర్శకత్వం వహించి ఆణిముత్యాల్లాంటి పాటలను అందించారు. పిన్న వయస్సులోనే దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడుగా 18 నెలల జైలు శిక్షను అనుభవించారు, తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గాయకుడు అని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో 10 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయిన బిలియనీర్ వ్యాపారవేత్త డాక్టర్ MS రెడ్డి (జున్ను రాజు), ప్రముఖ టాలీవుడ్ సినీ దర్శకుడు కోదండరామి రెడ్డి, నటుడు మురళీ మోహన్, ఘంటసాల కుటుంబం నుంచి కృష్ణకుమారి, నాటా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, TTA మాజీ అధ్యక్షుడు భరత్ మాదాడి, శంకర నేత్రాలయ ట్రస్టీ, SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు భాస్కర్ గంటి, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు, NRIVA ఛైర్మన్, డాక్టర్ జయసింహ సుంకు, శంకర నేత్రాలయ ట్రస్టీ, శ్యామ్ అప్పాలి తదితరులు పాల్గొని మాట్లాడుతూ, ఘంటసాల గారి పాటలతో వారికున్న అనుబంధాన్ని పంచుకొని ఈ సందర్భంగా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ ఆ మహనీయుడికి భారతరత్న గౌరవం దక్కాలని మనస్ఫూర్తిగా కోరారు. ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం విచారం వ్యక్తం చేశారు. ఘంటసాలకి కేంద్రం తగిన రీతిలో గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అందరూ ముక్తకంఠంతో కోరారు, అందుకు 33 దేశాల్లో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలు కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. 33 దేశాలను చేరుకోవడానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే 200 TV కార్యక్రమాలకి సాంకేతిక సహాయాన్ని అందచేసిన శ్యాం అప్పాలి, ప్రమీల గోపు, హరీష్ కోలపల్లికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలకి వ్యాఖ్యాతలుగా నిర్వహించిన శారద ఆకునూరి, రత్న కుమార్, శ్యామ్ అప్పాలి , విజు చిలువేరు, నీలిమ గడ్డమనుగు, Dr. రెడ్డి ఉరిమింది, జయ పీసపాటి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్క, శ్రీలత మగతలకు ప్రత్యేక అభినందనలందించారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు, -
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి!
ప్రముఖ సంగీత దర్శకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకి భారతరత్న ఇవ్వాలంటూ ప్రవాస భారతీయులు డిమాండ్ చేశారు. ఘంటసాల శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శంకర నేత్రాలయ (యూఎస్ఏ) అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యములో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో 2022 ఏప్రిల్ 3న జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా బాల ఇందుర్తి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవార్డుకి ఎంపిక అవ్వగా, అందులో ఒక్క తెలుగువారు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయత భువనచంద్ర, ఘంటసాల కుమార్తె శ్యామలలు ఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ న్యూస్ ఎడిటర్ అఫ్ ఇండియా ట్రిబ్యూన్ రవి పోనంగి (యూఎస్), న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ పూర్వ అధ్యక్షురాలు శ్రీలత మగతల, తెలుగు అసోసియేషన్ అఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షులు రుద్ర కొట్టు, ఇండోనేషియా తెలుగు అసోసియేషన్ ఉపాధ్యక్షులు శివరామ కృష్ణ బండారులతో పాటు ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో అనేక 53 టీవీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా రత్న కుమార్ కవుటూరు (సింగపూర్), శ్రీలత మగతల (న్యూజీలాండ్), ఆదిశేషు (ఆస్ట్రేలియా) వ్యవహరిస్తున్నారు. -
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సంవత్సర సందర్భముగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో అమెరికా నుంచి శంకర నేత్రాలయ అమెరికా అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 40 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు. అందులో భాగంగా అమెరికా నుంచి విజ్జు చిలువేరు వ్యాఖ్యాతగా 27 మార్చి 2022 నాడు జరిగిన అంతర్జాల(జూమ్) కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత ఉన్నికృష్ణన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఘంటసాల పాటలోని మాధుర్యం, దేశభక్తిని కొనియాడారు. వాగ్గేయకారుడు అన్నమయ్య తరువాత కలియుగదైవం అయినా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాడే అరుదైన అవకాశాన్ని ఘంటసాల పొందారు అని కీర్తించారు. ఈ సందర్భంగా ఘంటసాలకి భారతరత్న కోసం మీరందరు చేస్తున్న కృషిని అభినందించి తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. బాల ఇందుర్తి మాట్లాడుతూ ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవార్డుకి ఎంపిక అవ్వగా, అందులో ఒక్క తెలుగువారికి కూడా దక్కకపోవడం బాధాకరం విషయం అని అన్నారు. అతిత్వరలోనే సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. సింగపూర్ నుంచి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కెనడా నుండి తెలుగు అలయన్స్ అఫ్ కెనడా అధ్యక్షులు కల్పన మోటూరి, హాంగ్ కాంగ్ నుండి హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు జయ పీసపాటి, థాయిలాండ్ నుండి తెలుగు అసోసియేషన్ అఫ్ థాయిలాండ్ అధ్యక్షులు రవికుమార్ బోబ్బా, బెహ్రెయిన్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షులు శివ యెల్లపు, ఫ్రాన్స్ నుండి ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్, పారిస్ ఉపాధ్యక్షురాలు ఆన్నపూర్ణ మహేంద్ర తదితరులు పాల్గొని ఘంటసాల జీవించిన సమయంలో తామెవరు లేకపోయినా ఇప్పటికి వారి పాటలు తమ మదిలోనే ఉన్నాయని, వారు పరమపదించిన 48 సంవత్సరాలు తరువాత కూడా ఘంటసాల పాటలను ఈనాటి తరం పిల్లలతో సహా అందరు పాడుకోవడం వారి పాటలలో అమరత్వం ఉందని చెప్పడానికి నిదర్శనమని తెలిపారు. ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం అని అభిప్రాయపడుతూ, ఇది 15 కోట్ల తెలుగువారందరికి ఆత్మ గౌరవానికి సంభందంచిన విషయం అని, ఘంటసాలకి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలని అభ్యర్ధించారు. అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరుకు అందరు సమిష్టిగా కృషి చేయాలనీ అని తెలిపారు. -
వైఎస్సార్‌కు భారతరత్న ఇవ్వాలి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి భారత రత్న ఇవ్వాలని నెల్లూరుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని జీవీ కార్తీక ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌కు భారత రత్న ఇవ్వాలని జూలై 8న ప్రధానికి లేఖ రాసినట్లు చెప్పారు. వైఎస్సార్ రాజకీయవేత్త గానే కాకుండా డాక్టర్‌గా ఆరోగ్యశ్రీ, 108, 104 ఫ్రీ అంబులెన్స్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టిన గొప్ప మహానుభావుడని కొనియాడింది. రైతులకు ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగ చేశారని పేర్కొంది. (చదవండి: నేడు ఇడుపులపాయకు సీఎం వైఎస్ జగన్) దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని పేదల అభ్యున్నతికి వైఎస్సార్ పాటుపడ్డారని తెలిపింది. అంత గొప్ప చరిత్ర కలిగిన వైఎస్సార్‌కు భారత రత్న ఇవ్వాలని తాను ప్రధానిని కోరానని తెలిపింది. వైఎస్సార్ జీవిత చరిత్రను ప్రైమరీ స్కూల్ సిలబస్‌లో ఒక పాఠ్యాంశంగా చేర్చాలని సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేసింది. పేదల అభ్యున్నతికి ఆయన చేసిన సేవ భావితరాలకు తెలియాలంటే పాఠ్యాంశంగా చేర్చాలని కోరింది. (చదవండి: ఏపీ మరో రికార్డు..) -
పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..!
వాషింగ్టన్: భారత మాజీ ప్రధాని.. మన తెలుగు జాతి ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ప్రవాస భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని తెలుగువారంతా పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ రిమెంబరింగ్ పీవీ, రిమైండ్ పీపుల్, రిక్వెస్ట్ ఇండియన్ గవర్నమెంట్ భారతరత్న ఫర్ పవీ అంటూ మూడు ఆర్ల సిరీస్‌తో ఉద్యమంతో ముందుకు కదులుతున్నారు. ఈ మేరకు పీవీ శతాబ్ది జన్మదినం సందర్భంగా రిమెంబరింగ్ పీవీ నరసింహా రావు, రిమైండ్ పీపుల్, రిక్వెస్ట్ భారత ప్రభుత్వం భారతరత్నఫర్ పీవీ అని డిమాండ్ చేస్తు ప్రవాస భారతీయ సంఘాలు కార్యక్రమాన్ని చేపట్టాయి. అంతేగాక ఆన్లైన్ ద్వారా కూడా ఈ సంఘాలు భారతీయుల మద్దతును కోరుతున్నాయి. అనేక ప్రవాస భారతీయ సంఘాలు, సంస్థలు పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు పీవీ ఘనతను స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమాల ద్వారా పీవీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌కు మద్దతు కూడగడుతున్నాయి. అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా పీవీ నరసింహారావు గురించి తెలిసిన ప్రముఖులు, మేధావులు నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అమెరికాలోని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్( ఏఏపీఐఆర్) ఉత్తర అమెరికా తెలుగు సంఘము (టీఏఎన్‌ఏ), అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) ఉత్తర అమెరికా తెలుగు సంఘం (ఎన్ఏటీఎస్), ఉత్తర అమెరికా తెలుగు సమితి (ఎన్ఏటీఏ) సిలికాన్ ఆంధ్ర తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్), సెయింట్ లూయిస్ గుజరాత్ సమాజ్‌లతో పాటు అమెరికాకు చెందిన 81 భారతీయ సంఘాలన్నీ ముక్తకంఠంతో పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి. భారతరత్న ఫర్ పీవీ అనే అభ్యర్థనను భారత ప్రభుత్వం గుర్తించేలా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. పీవీ శత జయంతోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో ఆయనకు భారతరత్న వచ్చే వరకు తెలుగు సంఘాలు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నాయి. అంతేగాక పీవీ ప్రాముఖ్యత, భారతీయ చరిత్రలో ఆయన స్థానం వివరిస్తూ... పీవీకి భారతరత్న అనే వినతి పత్రంపై ప్రవాస సంఘాలు సంతకాలు చేశాయి. అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ సంతకాల సేకరణ ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్య నిర్వాహక బృంద సభ్యులు స్వర్ణ ప్రసాద్, గుళ్ళపల్లి శ్రీనివాస్, డాక్టర్ అశోక్ కుమార్, చింతా ప్రవీణ్, తాళ్లూరి శ్రీధర్, అశ్విన్ పటేల్, కాజా విశ్వేశ్వర రావు (సెయింట్ లూయిస్ ఎమ్ఓ), బడ్డి అశోక్, దేవబత్తిని హరి (డెట్రాయిట్, ఎమ్ఐ), మేడిచెర్ల మురళీకృష్ణ, కపిల ప్రకాష్, శరత్ చంద్ర (ఎడిసన్, ఎన్జే), పురం ప్రవీణ్ (అట్లాంటా, జీఏ), కొండెపు సుధ (డీసీ), చల్లా కవిత( వాషింగ్టన్ డీసీ),అట్లూరి శ్రీహరి (ఎల్ఏ) కల్వకోట సరస్వతి (ఓహెచ్) ఇలా చాలా మంది ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. అంతేకాదు ఈ సంద్భంగా పీవీ నరసింహారావు మీద ప్రత్యేక సంచికను కూడా వెలువరించనున్నారు. తమ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మద్దతుకై ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలూ సోషల్ మీడియాలో ప్రచురిస్తున్నారు. సాధారణ పౌరులు కూడా (petition at: https://www.change.org/CTIPetitionBharatRatna4PV) ఈ లింక్ ద్వారా సంతకం చేసి తమవంతుగా మద్దతుగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఎన్ఆర్ఐ సంస్థలు కోరుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో చూడాలంటే ఈ కింది లింక్‌లు క్లిక్ చేయండి BharatRatna4PV YouTube Channel Facebook: https://m.facebook.com/BharatRatna4PV-104140028106254 YouTube: https://youtube.com/channel/UCM3UlMkHF6rWH_KEPiCnZ6A BharatRatna4PV Short Film Teaser: https://youtu.be/KTTU2cJ9ENE -
పీవీకి భారతరత్న ఇవ్వాలి
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట సమీపంలో స్వామి రామానందతీర్థ ఔషధ కేంద్రంలో స్వామి రామానందతీర్థ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ సురభి వాణిదేవి, పరిశోధనా సంస్థ అధ్యక్షుడు పీవీ ప్రభాకర్‌రావు ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహావిష్కరణ, శత జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి హాజరయ్యారు. పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె.కేశవరావు మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహాలను ఆరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. పీవీకి భారతరత్న కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్లో ఆయన విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. పీవీ పేరుతో తెలంగాణలో త్వరలో ఆడిటోరియం నిర్మించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు వివరించారు. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ.. పీవీ శతజయంతి ఉత్సవాలు రాష్ట్రంలో నిర్వహించేం దుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. మన ప్రాంత మహనీయుల సేవలను భావి తరాలకు తెలియజేసే అవకాశం తెలంగాణ ఏర్పాటుతోనే సాధ్యమైందన్నారు.