
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సంవత్సర సందర్భముగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో అమెరికా నుంచి శంకర నేత్రాలయ అమెరికా అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 40 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.
అందులో భాగంగా అమెరికా నుంచి విజ్జు చిలువేరు వ్యాఖ్యాతగా 27 మార్చి 2022 నాడు జరిగిన అంతర్జాల(జూమ్) కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత ఉన్నికృష్ణన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఘంటసాల పాటలోని మాధుర్యం, దేశభక్తిని కొనియాడారు. వాగ్గేయకారుడు అన్నమయ్య తరువాత కలియుగదైవం అయినా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాడే అరుదైన అవకాశాన్ని ఘంటసాల పొందారు అని కీర్తించారు. ఈ సందర్భంగా ఘంటసాలకి భారతరత్న కోసం మీరందరు చేస్తున్న కృషిని అభినందించి తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. బాల ఇందుర్తి మాట్లాడుతూ ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవార్డుకి ఎంపిక అవ్వగా, అందులో ఒక్క తెలుగువారికి కూడా దక్కకపోవడం బాధాకరం విషయం అని అన్నారు. అతిత్వరలోనే సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు.
సింగపూర్ నుంచి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కెనడా నుండి తెలుగు అలయన్స్ అఫ్ కెనడా అధ్యక్షులు కల్పన మోటూరి, హాంగ్ కాంగ్ నుండి హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు జయ పీసపాటి, థాయిలాండ్ నుండి తెలుగు అసోసియేషన్ అఫ్ థాయిలాండ్ అధ్యక్షులు రవికుమార్ బోబ్బా, బెహ్రెయిన్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షులు శివ యెల్లపు, ఫ్రాన్స్ నుండి ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్, పారిస్ ఉపాధ్యక్షురాలు ఆన్నపూర్ణ మహేంద్ర తదితరులు పాల్గొని ఘంటసాల జీవించిన సమయంలో తామెవరు లేకపోయినా ఇప్పటికి వారి పాటలు తమ మదిలోనే ఉన్నాయని, వారు పరమపదించిన 48 సంవత్సరాలు తరువాత కూడా ఘంటసాల పాటలను ఈనాటి తరం పిల్లలతో సహా అందరు పాడుకోవడం వారి పాటలలో అమరత్వం ఉందని చెప్పడానికి నిదర్శనమని తెలిపారు.
ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం అని అభిప్రాయపడుతూ, ఇది 15 కోట్ల తెలుగువారందరికి ఆత్మ గౌరవానికి సంభందంచిన విషయం అని, ఘంటసాలకి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలని అభ్యర్ధించారు. అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరుకు అందరు సమిష్టిగా కృషి చేయాలనీ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment