కామెంట్
ఇటీవల మరణించిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’కు అన్ని విధాలుగా అర్హుడు. ఆయన సమర్థుడైన వ్యాపారవేత్త. దార్శనిక దృక్పథమున్న పారిశ్రామివేత్త మాత్రమే కాదు... మనుషుల పట్ల సహానుభూతి, ఆప్యాయతలు కలిగిన మంచి మనిషి. రతన్ టాటాను చాలామంది కేవలం ఆరాధించలేదు; హీరోగా భావించారు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. మరణానంతరమైనా ఆయనకు భారత రత్న ఇవ్వడం ద్వారా మనల్ని మనం గౌరవించుకునే పని మొదలు కావాలి. వేర్వేరు రంగాల్లో అర్హులైన వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లకూ ఈ పుర స్కారం దక్కి ఉంటే బాగుండేది. భారత రత్న విషయంలో రాజకీయ అనుకూలతల కంటే, అర్హతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ‘భారత రత్న’కు అన్ని విధాలుగా అర్హుడే. అయితే బతికున్న రోజుల్లోనే అవార్డు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇటీవలే రతన్ టాటా మరణించిన నేపథ్యంలో మరణానంతరం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇస్తారా?
మరణానంతరమైనా సరే... రతన్ టాటాకు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలి అనేందుకు బోలెడు కారణాలు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి, ఆయన సమర్థుడైన వ్యాపారవేత్త. దార్శనిక దృక్ప థమున్న పారిశ్రామివేత్త కూడా. మనుషుల పట్ల సహానుభూతి, ఆప్యాయతలు కలిగిన మంచి మనిషి. అయితే ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్లు చాలామందే ఉన్నారు.
టాటాను వీరందరి నుంచి వేరు చేసే లక్షణం ఏదైనా ఉందీ అంటే... అది ఆయన అందరి నుండి పొందిన గౌరవం, మర్యాద, మన్ననలు. రతన్ టాటాను చాలా మంది కేవలం ఆరాధించలేదు; హీరోగా భావించారు. ఒకరకంగా చెప్పాలంటే పూజించారు అనాలి! ఇలాంటి వాళ్లు కొందరే కొందరు ఉంటారు. వారిలో రతన్ టాటా ఒకరు!
రెండో విషయం... మనం ఆదర్శంగా భావించే వ్యక్తికి లభించే గుర్తింపు కూడా ఆ స్థాయిలోనే ఉండాలని ఆశిస్తాం. ఎందుకంటే వీళ్లు కేవలం సాధకులు మాత్రమే కాదు... చాలా ప్రత్యేకమైన వాళ్లు. అందుకే దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం అలాంటి వారికి దక్కడం ఎంతైనా ఆహ్వానించదగ్గ విషయం.
దేశంలో ఇప్పటివరకూ 53 మందికి భారత రత్న పురస్కారం లభించింది. టాటా వీరందరిలోనూ ఉన్నతుడిగానే నిలుస్తారు. బి.సి. రాయ్, పి.డి. టండన్ , కె. కామరాజ్, వి.వి. గిరి, ఎం.జి. రామచంద్రన్ , రాజీవ్ గాంధీ, అరుణా అసఫ్ అలీ, గుల్జారీలాల్ నందా, గోపీనాథ్ బోర్డోలోయి, కర్పూరీ ఠాకూర్, చౌధురీ చరణ్‌సింగ్... లాంటి రాజకీయ నాయకుల విషయంలో అది నిజం కాదా?
ఇంకోలా చెబుతాను. మదర్ థెరీసా, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, అమర్త్య సేన్ , పండిట్ రవిశంకర్, లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్ , భీమ్‌సేన్ జోషీ, సచిన్ టెండూల్కర్... అందరూ భారత రత్నకు అర్హుల నుకుంటే, రతన్ టాటాకు ఎలా కాదనగలం?
వాస్తవం ఏమిటంటే... ఈ అవార్డు ఇచ్చేది రాజకీయ నాయకులు. వాళ్లు ఎక్కువగా రాజకీయ నాయకులకే ఇస్తూంటారు. ఇప్పటివరకూ అందుకున్న 53 మందిలో 18 మంది మాత్రమే ఇతర రంగాల్లో అత్యు న్నత ప్రతిభను కనబరిచినవారు. 1954 నుంచి తొలిసారిగా భారత రత్న పురస్కారం ప్రదానం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒకే ఒక్క పారిశ్రామిక వేత్త, అత్యంత అర్హుడైన జేఆర్‌డీ టాటాకు మాత్రమే ఆ అవార్డు దక్కింది. అంతే!
వేర్వేరు రంగాల్లో అర్హులైన వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లకూ ఈ పురస్కారం దక్కి ఉంటే బాగుండేదని నేను అనుకుంటూంటాను. బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్, అమితాబ్ బచ్చన్ , ఫీల్డ్ మార్షల్ మానెక్‌శా, సల్మాన్ రుష్దీ, జూబిన్ మెహతా వంటి వాళ్లు ఒక్కొక్కరూ తమ వైయక్తిక ప్రతిభతో ఆ యా రంగాల్లో అత్యున్నత శిఖరాలను అందుకున్న వారే. ప్రపంచం వీరి ప్రతిభను గుర్తించింది, కీర్తించింది. దురదృష్టవశాత్తూ మనం ఆ పని చేయలేకపోయాం.
ఇప్పటికీ సమయం మించిపోలేదు. రతన్ టాటాకు భారత రత్న ఇవ్వడం ద్వారా మనల్ని మనం గౌరవించుకునే పని మొదలు కావాలి. బి.ఆర్.అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, అబుల్ కలావ్‌ు ఆజాద్, మదన్ మోహన్ మాలవీయా వంటి వారికి మరణానంతరం దశాబ్దాల తరువాత భారత రత్న ఇవ్వగలిగినప్పుడు... 2008లో మరణించిన ఫీల్డ్ మార్షల్ మానెక్‌శాకు, 2021లోనే కన్ను మూసిన దిలీప్‌కుమార్‌తోపాటు మనతోనే ఉన్న అమితాబ్ బచ్చన్,సల్మాన్ రుష్దీ, జూబిన్ మెహతా వంటి వారిని భారత రత్నతో సత్కరించడం సాధ్యమే!
అయితే ఇక్కడ మనం ఇంకో నిష్ఠుర సత్యాన్ని అర్థం చేసు కోవాలి. భారత రత్న విషయంలో రాజకీయ అనుకూలతల కంటే అర్హతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పేర్లు అవసరం లేదు. వారి భేషజాలను దెబ్బతీయాలన్న ఆలోచన కూడా నాకు లేదు. కానీ, వారందరూ రాజకీయ నేతలే. జవహర్‌లాల్ నెహ్రూతో మొదలుపెట్టి... నరేంద్ర మోదీ వరకూ అన్ని ప్రభుత్వాలూ ఈ పని చేశాయి.
విషాదం ఏమిటంటే... మనం తరచూ కొంతమంది అనర్హులకు భారత రత్న ఇచ్చాం. ఇంకోలా చెప్పాలంటే అర్హులకు నిరాకరించాం. ఎలాగైతేనేం, ఆ అవార్డు గౌరవమైతే మసకబారింది. అర్హులకు ఇవ్వలేదు, అనర్హులకు ఇచ్చారన్న వాదాన్ని కాసేపు పక్కనపెట్టి... జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సమయం ఇదే. దేశమాత అసలు ఆణిముత్యాలను ప్రజలెప్పుడూ గుర్తుంచుకుంటారు.
సందేహం ఏమీ లేదు. రతన్ టాటా అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది సామాన్యులు ఈ విషయాన్ని మరోసారి నిర్ధ్ధరించారు. వార్తాపత్రికల్లో పేజీలకు పేజీ కథనాలు, టెలివిజన్ ఛానళ్లలో గంటల లైవ్ కవరేజీలన్నీ రతన్ టాటాపై ఈ దేశ ప్రజలకు ఉన్న అభిమానాన్ని చాటేవే! ఎవరూ కాదనలేని సత్యమిది. అలాగని రాజ్యం ఆయనను గుర్తించదంటే మాత్రం సరికాదు. నన్నడిగితే అలా చేయడం క్షమించలేనిది.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment