సచిన్, సీఎన్ఆర్ రావుకు భారతరత్న ప్రదానం
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రమేష్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావులు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో దర్బార్ హాల్లో ప్రణబ్ ముఖర్జీ మంగళవారం వీరికి అవార్డులు ప్రదానం చేశారు. వీరితో పాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 41 మందికి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు.
సచిన్ గత ఏడాది రిటైర్మెంట్ అయిన రోజునే ప్రభుత్వం అతనితో పాటు ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావుకు దేశ అత్యున్నత పౌరపురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రికెట్ కెరీర్ అరంగేట్రంతోనే రికార్డుల్లోకెక్కిన సచిన్...ఈ అవార్డు అందుకుంటున్న తొలి క్రీడాకారుడుగా రికార్డులకెక్కాడు. సచిన్, రావులిద్దరూ ఇదివరకే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన 'పద్మ విభూషణ్' అందుకున్నారు. భారత రత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సచిన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.