సచిన్‌కు నేడు ‘భారతరత్న’ ప్రదానం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ‘భారతరత్న’ పురస్కారాన్ని మంగళవారం ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో ఈ వేడుక జరుగనుంది. సచిన్ గతేడాది రిటైర్మెంట్ అయిన రోజునే భారత ప్రభుత్వం అతనితో పాటు ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావుకు దేశ అత్యున్నత పౌరపురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రికెట్ కెరీర్ అరంగేట్రంతోనే రికార్డుల్లోకెక్కిన (పిన్న వయస్కుడిగా) ఈ ముంబైకర్ నిష్ర్కమణతోనూ ఈ అవార్డు అందుకుంటున్న తొలి క్రీడాకారుడుగా రికార్డులకెక్కాడు. సచిన్, రావులిద్దరూ ఇదివరకే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ అందుకున్నారు.
వీరితో పాటు వివిధ రంగాల్లో విశేష కృషితో పద్మ పురస్కారాలకు ఎంపికైన 41 మందికి కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులను అందజేస్తారు. ‘క్రీడా ప్రపంచంలోనే సచిన్ టెండూల్కర్ గొప్ప దిగ్గజం. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను సాధించిన రికార్డులు నిరుపమానం. అతనికి అతనే సాటి. కెరీర్ అసాంతం సమున్నతమైన క్రీడాస్ఫూర్తిని చాటిన మహోన్నత వ్యక్తిత్వం సచిన్‌ది. అందువల్లే కెరీర్‌లో రికార్డులు... తన కీర్తికిరీటంలో అవార్డులు సాధించగలిగాడు’ అని కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కొనియాడింది.