అంతరిక్ష ప్రయోగాలకు ముందు ఇస్రో అధికారుల తిరుమల బాలాజీ దర్శనానిని వెళ్లడం మూఢనమ్మకమేనని భారతరత్న పురస్కారానికి ఎంపికైన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు అభిప్రాయపడ్డారు.
ఇస్రో అధికారుల తిరుపతి యాత్రపై శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావు వ్యాఖ్య
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అంతరిక్ష ప్రయోగాలకు ముందు ఇస్రో అధికారుల తిరుమల బాలాజీ దర్శనానిని వెళ్లడం మూఢనమ్మకమేనని భారతరత్న పురస్కారానికి ఎంపికైన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు అభిప్రాయపడ్డారు. అలాంటి వాటిని తాను నమ్మనని ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఇస్రో శాటిలైట్ ప్రయోగించే ముందు దాని ప్రతిరూపాన్ని వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద ఉంచడం మూఢనమ్మకం కాదా అని ఒక విలేఖరి ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. సాధారణ ప్రజల్లాగే శాస్త్రవేత్తకు కూడా వ్యవహరిస్తే ఏం చేయాలని ప్రశ్నించారు.
తనకు జ్యోతిష్యంతో సహా మరే ఇతర మూఢ నమ్మకాలూ లేవన్నారు. తాను ఐటీకి వ్యతిరేకిననే ముద్ర వేయడం సరైంది కాదన్నారు. యువత అంతా ఐటీ వైపు చూస్తుండంతో ఇతర విభాగాలు నష్టపోతున్నాయదే తన అభిప్రాయమని చెప్పారు. భారత యువతతో పట్టుదల కొరవడిందని చెప్పారు. జవహార్‌లాల్ నెహ్రూ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో బెంగళూరు విద్యార్థులు చోటు దక్కించుకోలేకపోతున్నారని, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని చెప్పారు. పరిశోధనలకు పరిశ్రమలు తోడ్పాటునివ్వాలని, పరిశోధనల ద్వారా లబ్ధి పొందుతున్న పరిశ్రమలు ఆ బాధ్యతను మోయాల్సి ఉంటుందన్నారు.