Tirumala balaji visit
-
11న తిరుపతికి సీఎం వైఎస్ జగన్
చిత్తూరు కలెక్టరేట్: సీఎం వైఎస్ జగన్ ఈనెల 11, 12 తేదీల్లో తిరుపతి పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు గురువారం కలెక్టరేట్‌కు సమాచారం అందింది. 11వ తేదీ మధ్యాహ్నం 2.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బర్డ్ ఆస్పత్రి ప్రారంభోత్సవం, అలిపిరి శ్రీవారి పాదాల వద్ద పైకప్పు నిర్మాణ పనులు, పాదాల మండపం వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరం ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం తిరుమలలో శిరోవస్త్రం కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బసచేస్తారు. ఇక 12వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ఎస్వీబీసీ (కన్నడ, హిందీ) చానల్స్‌ను, రూ.12కోట్లతో ఆధునీకరించిన బూందీ పోటును ప్రారంభిస్తారు. ఆ తర్వాత టీటీడీ అమలుచేస్తున్న నూతన కార్యక్రమాల ప్రజెంటేషన్, టీటీడీ–రైతు సాధికారక సంస్థ ఎంఓయూ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి తాడేపల్లికి బయల్దేరుతారు. -
ఫేక్ జర్నలిస్ట్ అరెస్ట్
తిరుమల: ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్‌నంటూ, గతకొంత కాలంగా తిరుమలలో అక్రమాలకు పాల్పడుతున్న వెంకటరమణరావు అనే వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతను నకిలీ గుర్తింపు కార్డుతో శ్రీవారి వీవీఐపీ దర్శన టోకన్లను సంపాదించి వ్యాపారవనరుగా మార్చుకున్నాడు. గత నెల తనే స్వయంగా వీవీఐపీ టోకన్లతో శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఆలయ అధికారులకు అనమానం రావటంతో, సదరు వ్యక్తిపై ఆరా తీయగా మొత్తం బండారం బయట పడింది. ఈ విషయంపై టీవీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా.. తమ ఛానల్‌కు ఆ వ్యక్తితో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ వ్యక్తి గతంలో కూడా నకిలీ గుర్తింపు కార్డు చూపించి అనేక అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
తిరుమలకు బయల్దేరిన జవహర్ రెడ్డి
సాక్షి, తిరుపతి: డాక్టర్ జవహర్ రెడ్డి శనివారం తెల్లవారుజామున అలిపిరి మార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు గానూ, ఆయన కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. కాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమిస్తూ బుధవారం రాత్రి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. జవహర్‌రెడ్డి ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొద్ది రోజుల కిందటే టీటీడీ ఈవోగా పనిచేస్తున్న అనిల్‌కుమార్ సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. -
రేపు జిల్లాకు కొత్త గవర్నర్ రాక
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 23వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. మొదటిసారిగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు గవర్నర్ షెడ్యూల్ ఆదివారం కలెక్టరేట్‌కు అందింది. గవర్నర్ పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త ఆయా శాఖల ప్రొటోకాల్ అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ ఇలా.. గవర్నర్ హరిచందన్ ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో తిరుమలకు చేరుకుని, శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల నుంచి బయలుదేరి సాయంత్రం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళతారు. -
రాష్ట్రపతికి సీఎం జగన్ సాదర స్వాగతం
సాక్షిప్రతినిధి, తిరుపతి: వీవీఐపీలతో తిరుపతి పురవీధులు శనివారం రద్దీగా మారాయి. భారత ప్రథమ పౌరుడు రామనాథ్ కోవింద్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేశారు. దేవదేవుడు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునే నిమిత్తం భారత రాష్ట్రపతి దంపతులు శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ బసంత్‌కుమార్, కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త, ఆలయ ప్రధాన అర్చకులు, ఇతర అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి, కపిలతీర్థం చేరుకుని శ్రీకపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇదివరకు నీలం సంజీవరెడ్డి, శంకర్‌దయాళ్‌శర్మ, ప్రణబ్‌ముఖర్జీ ముగ్గురు రాష్ట్రపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ జాబితాలో నాలుగో రాష్ట్రపతిగా రామనా«థ్ కోవింద్ చేరారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట భద్రత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పర్యటన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు చేపట్టింది. నలుగురు ఎస్పీ స్థాయి అధికారులు, ఆరుగురు ఏఎస్సీలు, 22 మంది డీఎస్పీలు, 35 సీఐలు, 75 మంది ఎస్ఐలు, 300 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 400 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 200 మంది స్పెషల్ పోలీసులు, 3 కంపెనీల ఏపీఎస్పీ సిబ్బంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన మరో 475 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రపతి భద్రత నిమిత్తం 1,692 మందితో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలుకుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి గంట ముందే చేరుకున్న సీఎం రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్ తిరుమల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటుండడంతో స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఎంపీలు విజయసాయిరెడ్డి, మి«థున్‌రెడ్డి వచ్చారు. రేణిగుంటకు చేరుకున్న సీఎంకు డెప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి, ఏ.శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నవాజ్‌బాషా, ఆదిమూలం, కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త, డీఐజీ క్రాంతి రాణా టాటా, ఎస్పీలు అన్బురాజన్, వెంకట అప్పలనాయుడు, తిరుపతి నగర కమిషనర్ గిరీషా తదితరులు స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన ప్రముఖులు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డెప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్‌రావు, తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, సత్యవేడు ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఏ శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నవాజ్‌బాషా, ఆదిమూలం తదితరులు స్వాగతం పలికారు. -
13న తిరుమలకు రాష్ట్రపతి రాక
సాక్షి, తిరుమల : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమల పర్యటన ఖరారైంది. శ్రీవారి దర్శనార్థం రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 13న తిరుమలకు రానున్నారు. ఆ రోజు తిరుమలలో బస చేసి.. 14న ఉదయం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పాటు తిరుమలలోనే ఉండనున్నట్లు సమాచారం. -
కాలినడకన తిరుమలకు రాహుల్
సాక్షి, తిరుపతి : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు. మెట్ల మార్గంలో ఆయన కేవలం రెండు గంటల్లో తిరుమల కొండ ఎక్కేశారు. పదేళ్ల అనంతరం రాహుల్ తిరుమల వచ్చారు. ఆయన సహచర భక్తులను పలకరిస్తూ ముందుకు సాగారు. స్వామివారి దర్శనం అనంతరం రాహుల్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్వహిస్తోన్న ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’ లో పాల్గొంటారు. ఇదిలా ఉండగా రాహుల్ శ్రీవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అంతకు ముందు ప్రత్యేక విమానంలో రేణిగుంట వచ్చిన రాహుల్ గాంధీకి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం శ్రీకృష్ణ గెస్ట్ హౌజ్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా జ్యోతిరావు పూలే సర్కిల్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తారకరామ స్టేడియం వరకు బస్ యాత్ర చేస్తారు. అనంతరం తారకరామ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. 2014 ఎన్నికల సమయంలో మోదీ సభ నిర్వహించిన ప్రాంగణంలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించడం గమనార్హం. -
దర్శనం టికెట్లు.. ఇక ఆన్లైన్లోనే!
సాక్షి,తిరుమల: సర్వదర్శనం, కాలిబాట దర్శనం, రూ.300 టికెట్ల ఆన్లైన్ దర్శనం, రూ.50 సుదర్శనం, ఆర్జిత సేవల దర్శనం.. ఇలా రోజుకు 60 వేలలోపే భక్తులను అనుమతించే వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించే విషయంపై టీటీడీ కసరత్తు చేస్తోంది. అన్ని సేవలకు కూడా ఆన్లైన్లో టికెట్లు కేటాయించి నిర్ణయించిన సమయానికే భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 20 వేలకు పెరగనున్న రూ.300 టికెట్ల కోటా ప్రస్తుతం రూ.300 టికెట్ల ఆన్లైన్ దర్శనం సజావుగా సాగుతోంది. రో జుకు మొత్తం 18 వేల టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. ఒక రోజు ముందు వేయి టికెట్లు, 14 రోజుల ముందు ఏడు వేలు , 28 రోజుల ముందు పది వేల టికెట్లు ఇస్తున్నారు. వీటిని ఆన్లైన్లో పది వేలు, టీటీడీ ఈదర్శన్ కౌంటర్లలో మూడు వేలు, పోస్టాఫీసుల్లో ఐదు వేల చొప్పున భక్తులకు కేటాయిస్తున్నారు. అత్యల్పంగా రోజూ 50 శాతం నుంచి 90 శాతం వరకు టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఐదారుశాతం మినహా భక్తులు స్వామి దర్శనానికి హాజరవుతున్నారు. ఇదే పద్ధతిలోనే మరో రెండు వేల టికెట్లు కలిపి రోజుకు మొత్తం 20 వేల టికెట్లను ఆన్లైన్లో కేటాయించాలని టీటీడీ సంకల్పించింది. రూ.300కు పెరగనున్న రూ.50 సుదర్శనం టికెట్లు? ప్రస్తుతం రోజుకు ఐదు వేల వరకు రూ.50 సుదర్శనం టికెట్లను ఇంటర్నెట్ ద్వారా భక్తులకు టీటీడీ కేటాయిస్తోంది. వీరికి దర్శనంతోపాటు రెండు లడ్డూలు ఉచితంగా అందజేస్తున్నారు. తక్కువ ధరతో టికెట్లు తీసుకోవడంతో భక్తుల గైర్హాజరీ శాతం పెరుగుతోంది. దీంతో టికెట్లు లభించని ఇతర భక్తులు దర్శనం కోల్పోయే పరిస్థితి ఉంది. దీన్ని గుర్తించిన టీటీడీ రూ.50 సుదర్శన టికెట్లను రద్దుచేసి ఇదే కోటాలోని ఐదువేల టికెట్లును రూ.300 ఆన్‌లైన్‌లోకి కలిపి భక్తులకు విక్రయించాలని భావిస్తోంది. కొత్త మార్పులకు టీటీడీ ఈవో, జేఈవో యోచన భక్తులందరికీ సంతృప్తికర దర్శనం కల్పించేందుకు అన్ని క్యూల నుంచి రోజుకు 60 వేలు మించకుండా అనుమతించే విషయంపై టీటీడీ ఈవో, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నేతృత్వంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్వ దర్శనానికి భక్తులను రద్దీని బట్టి రోజుకు సుమారు 20 నుంచి 25 వేల మంది, కాలిబాటల్లో 10 నుంచి 15 వేల మందికి దర్శనానికి వస్తున్నారు. వీరికి కూడా దర్శన విషయాల్లో నిర్ణీత సమయం కేటాయించే కొత్త పద్ధతులు, నూతన విధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
ఇస్రోది మూఢనమ్మకమే : సీఎన్ఆర్ రావు
ఇస్రో అధికారుల తిరుపతి యాత్రపై శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు వ్యాఖ్య సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అంతరిక్ష ప్రయోగాలకు ముందు ఇస్రో అధికారుల తిరుమల బాలాజీ దర్శనానిని వెళ్లడం మూఢనమ్మకమేనని భారతరత్న పురస్కారానికి ఎంపికైన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు అభిప్రాయపడ్డారు. అలాంటి వాటిని తాను నమ్మనని ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఇస్రో శాటిలైట్ ప్రయోగించే ముందు దాని ప్రతిరూపాన్ని వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద ఉంచడం మూఢనమ్మకం కాదా అని ఒక విలేఖరి ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. సాధారణ ప్రజల్లాగే శాస్త్రవేత్తకు కూడా వ్యవహరిస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. తనకు జ్యోతిష్యంతో సహా మరే ఇతర మూఢ నమ్మకాలూ లేవన్నారు. తాను ఐటీకి వ్యతిరేకిననే ముద్ర వేయడం సరైంది కాదన్నారు. యువత అంతా ఐటీ వైపు చూస్తుండంతో ఇతర విభాగాలు నష్టపోతున్నాయదే తన అభిప్రాయమని చెప్పారు. భారత యువతతో పట్టుదల కొరవడిందని చెప్పారు. జవహార్‌లాల్ నెహ్రూ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో బెంగళూరు విద్యార్థులు చోటు దక్కించుకోలేకపోతున్నారని, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని చెప్పారు. పరిశోధనలకు పరిశ్రమలు తోడ్పాటునివ్వాలని, పరిశోధనల ద్వారా లబ్ధి పొందుతున్న పరిశ్రమలు ఆ బాధ్యతను మోయాల్సి ఉంటుందన్నారు.