
‘భారతరత్న’కు సచిన్ అర్హుడే
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతరత్న అవార్డుకు సచిన్ అర్హుడేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సచిన్‌కు ప్రకటించిన ఈ అవార్డు నిబంధనలకు వ్యతిరేకమంటూ మద్రాస్ హైకోర్టులో ఇటీవల న్యాయవాది కనకసబై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా సోమవారం కేంద్రం తమ వాదనను వినిపించింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేష్‌కుమార్, న్యాయమూర్తి రవిచంద్రబాబుతో కూడిన బెంచ్ సోమవారం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అదనపు సొలిసిటర్ పి.విల్సన్ ఒక ప్రకటనను సమర్పించారు. సాహిత్య, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు ఇతర రంగాల్లో విశిష్ట నైపుణ్యాన్ని కనబరిచిన వారికి సైతం భారతరత్న అవార్డును ప్రదానం చేయవచ్చంటూ 2011 నవంబరు 16న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారని ఇందులో పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు కేసును మంగళవారానికి వాయిదా వేశారు.