సచిన్, సీఎన్‌ఆర్ రావులకు భారతరత్న | Sachin Tendulkar, eminent scientist CNR Rao get Bharat Ratna award | Sakshi
Sakshi News home page

సచిన్, సీఎన్‌ఆర్ రావులకు భారతరత్న

Published Thu, Nov 21 2013 2:11 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Sachin Tendulkar, eminent scientist CNR Rao get Bharat Ratna award

ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
 కరెంట్ అఫైర్స్ నిపుణులు
 
 
 జాతీయం
 6 రాష్ట్రాలకు పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాలు
 60,000 చ.కి.మీ పరిధిలో విస్తరించిన పశ్చిమ కనుమల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిపేయాలని ఆరు రాష్ట్రాలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నవంబర్ 14న కోరింది. ఇందులో భాగంగా మైనింగ్, క్వారీయింగ్, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు వంటివాటిని నిషేధిస్తూ కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లకు ఆదేశాలు జారీచేసింది. పశ్చిమ కనుమలపై కె.కస్తూరి రంగన్ నేతృత్వంలోని ప్యానెల్ నివేదికను ఆమోదించిన తర్వాత పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
 
 బ్రిటన్ ప్రధాని కెమెరూన్ భారత్ పర్యటన
 బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కెమెరూన్ భారత్ పర్యటనలో నవంబర్ 14న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య 2010 నుంచి వాణిజ్యం, పెట్టుబడుల్లో అత్యుత్తమ ప్రగతి చోటు చేసుకున్నట్లు నేతలు అంగీకరించారు. ద్వైపాక్షిక, ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో ప్రగతిని వారు సమీక్షించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం, యూరోజోన్‌లో కష్టనష్టాలు ఉన్నప్పటికీ భారత్-యూకే వాణిజ్యం పుంజుకోవడం పట్ల ఇరు దేశాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీలంకలో జరిగే చోగమ్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న కెమెరూన్ భారత్‌లో ఆగి న్యూఢిల్లీ, కోల్‌కతాలను సందర్శించారు.
 
 అవినీతి, నేరాలు అరికట్టడంపై సదస్సు
 సీబీఐ స్వర్ణోత్సవాల సందర్భంగా మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నవంబర్ 11 నుంచి న్యూఢిల్లీలో నిర్వహించారు. ‘అవినీతి, నేరాలు అరికట్టడంపై ఉమ్మడి వ్యూహాల రూపకల్పన’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. ఇందులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ పాలనాపరమైన నిర్ణయాలపై దర్యాప్తు చేసేటప్పుడు దర్యాప్తు సంస్థలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా, అవి అసమంజసంగా ఉండరాదని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా పేర్కొన్నారు.
 
 ఈ సదస్సులో సీబీఐ అధికారులు, 19 దేశాల నుంచి పరిశోధనాధికారులు, రాష్ట్రాలు, అవినీతి నిరోధక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై విచారణ చేపట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీర్మానం ద్వారా 1963, ఏప్రిల్ 1న సీబీఐ ఏర్పడింది. తర్వాత దీని పరిధి విస్తరిస్తూ వస్తోంది. మొదటి సీబీఐ డెరైక్టర్‌గా డీపీ కోహ్లీ పనిచేశారు. ఆయన 1963, ఏప్రిల్ 1నుంచి 1968, మే 31వరకు విధులు నిర్వర్తించారు.
 
 ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య భారత్‌కు అప్పగింత
 విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య రష్యా సముద్ర తీరంలో నవంబర్ 16న భారత నౌకాదళంలో చేరింది. రష్యా ఆధునీకరించిన ఈ నౌక అప్పగింత కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ, రష్యా ఉప ప్రధాని దిమిత్రీ రోగోజిన్ పాల్గొన్నారు. ఈ నౌక 2014, ఫిబ్రవరిలో భారత్‌కు చేరుకుంటుంది. భారత నౌకాదళంలోకెల్లా ఇది అతిపెద్ద, అతిబరువైన నౌక. దీని పొడవు 284 మీటర్లు, ఎత్తు 60 మీటర్లు, బరువు 44,500 టన్నులు. 16 మిగ్-29కె, ఆరు కామోవ్ 31, ఆరు సీకింగ్, 4 చేతక్ యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను ఇందులో మోహరింపచేయొచ్చు.
 
 దీని కొనుగోలుకు 2004లో భారత్-రష్యాల మధ్య ఒప్పందం కుదిరింది. 2008లో అప్పగించాల్సి ఉంది. నిర్మాణ వ్యయం పెరగడం కారణంగా అదనపు వ్యయంతో ఐదేళ్ల ఆలస్యంగా రష్యా.. భారత్‌కు అప్పగించింది. ఇటువంటి అత్యాధునిక విమానవాహక నౌక చేరికతో రష్యా, యూకే, ఫ్రాన్‌‌స, బ్రెజిల్ దేశాల జాబితాలో భారత్ చేరింది. ఆసియాలో ఇటువంటి నౌకగల దేశంగా భారత్ నిలుస్తోంది. రష్యా 1987లో ఈ నౌకను ‘బకు’ పేరుతో తన నౌకాదళంలో ప్రవేశపెట్టి ఆపై దీనికి అడ్మిరల్ గోర్ష్‌కోవ్ అని నామకరణం చేసింది. 1996లో తన నౌకాదళ సేవల నుంచి తొలగించాక దీన్ని ఆధునీకరించి భారత్‌కు విక్రయించింది.
 
 ప్రముఖ హిందీ రచయిత దేవ్‌సారే మృతి
 ప్రముఖ హిందీ రచయిత హరికృష్ణ దేవ్‌సారే (75) ఘజియాబాద్‌లో నవంబర్ 14న మరణించారు. పిల్లల సాహిత్యంలో ఆయన రచనలు బాగా పేరొందాయి. ఆయన 300 కు పైగా పుస్తకాలు రాశారు. హిందీ అకాడెమీ అందించే సాహిత్యకార్ సమ్మాన్‌తోపాటు అనేక పురస్కారాలను అందుకున్నారు.
 
 ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఆలయానికి శంకుస్థాపన
 ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఆలయానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నవంబర్ 13న శంకుస్థాపన చేశారు. 200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఆలయం ప్రపంచంలో ఎత్తైదిగా గుర్తింపు పొందనుంది. బీహార్ రాజధాని పాట్నాకు 120 కి.మీ దూరంలో తూర్పు చంపారన్ జిల్లాలోని కేషరియాలో ఈ విరాట్ రామాయణ్ మందిరాన్ని నిర్మిస్తున్నారు.
 
 ఆసియా - యూరప్ మంత్రుల సమావేశం
 ఆసియా- యూరప్ విదేశాంగ మంత్రుల, అధికారుల సమావేశం న్యూఢిల్లీలో న వంబర్ 11, 12 తేదీల్లో జరిగింది. ఈ 11వ ఆసియా - యూరప్ సమావేశం (ఆసెమ్)లో ‘ఆసెమ్ వృద్ధి, అభివృద్ధి కోసం భాగస్వామ్య నిర్మాణం’ అనే అంశాన్ని ఇతివృత్తంగా చేపట్టారు. ఇందులో సైబర్ క్రైమ్ ప్రధాన చర్చనీయాంశమైంది. సుస్థిర అభివృద్ధి, ఇంధన సామర్థ్యం, టెక్నాలజీలతో సహా 12 అంశాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు.
 
 ఈ సమావేశానికి 36 దేశాల విదేశాంగ మంత్రులతోపాటు మొత్తం 49 దేశాల ప్రతినిధులు, యూరోపియన్ కమిషన్, ఆసియా సెక్రటేరియట్ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచ జనాభాలో 60 శాతం జనాభా ఆసెమ్ దేశాల్లోనే ఉంది. జీడీపీలో 52 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 68 శాతం ఆసెమ్ దేశాలదే. ఆసియా, యూరప్ భాగస్వామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆసెమ్‌ను 1994లో సింగపూర్, ఫ్రాన్స్‌లు ప్రారంభించాయి. తర్వాత మొదటి సమావేశం 1996, మార్చిలో బ్యాంకాక్‌లో జరిగింది.
 
  మాల్దీవుల అధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్ ఎన్నిక
 మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఆర్థికవేత్త అబ్దుల్లా యమీన్ గయూం(54) నవంబర్ 17న ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మహ్మద్ మౌమూన్ జమీల్ ప్రమాణం చేశారు. నవంబర్ 16న జరిగిన రన్ ఆఫ్ రౌండ్ పోలింగ్‌లో అబ్దుల్లా ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అభ్యర్థిగా పోటీచేసి 51.39 శాతం ఓట్లు సాధించారు. మాజీ అధ్యక్షుడు మాల్దీవ్స్ డెమోక్రటిక్ అభ్యర్థి మహ్మద్ నషీద్‌కు 48.61 శాతం ఓట్లు లభించాయి. దాదాపు మూడు దశాబ్దాలపాటు మాల్దీవులను పాలించిన మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ సవతి సోదరుడు యమీన్.
 
 ప్రముఖ రచయిత్రి డోరిస్ లెస్సింగ్ మృతి
 నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ రచయిత్రి డోరిస్ లెస్సింగ్ (94) లండన్‌లో నవంబర్ 16న మరణించారు. ఆమెకు 2007లో సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ దక్కింది. ఆమె ‘ది గోల్డెన్ నోట్‌బుక్’తోపాటు అనేక నవలలు, నాటకాలు రాశారు. 55 పుస్తకాలు ప్రచురించారు.
 
 ఆధునిక బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
 ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత సైన్యం నవంబర్ 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో విజయవంతంగా పరీక్షించింది. బ్లాక్-3 రకానికి చెందిన ఈ క్షిపణి 290 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 300 కిలోల సంప్రదాయ ఆయుధాలను మోసుకుపోగలదు. భూమి, సముద్రం, ఆకాశం వంటి బహుళ వేదికల నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఈ క్షిపణిని ఇప్పటికే సైన్యం, నౌకాదళంలో ప్రవేశపెట్టారు.
 


సచిన్, సీఎన్‌ఆర్ రావులకు భారతరత్న
క్రికెట్ కీడాకారుడు సచిన్ టెండ్కూలర్ (40), ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు (79)లను ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డులకు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 16న ప్రకటించింది. దీన్ని చివరిసారిగా 2009లో పండిట్ భీమ్‌సేన్ జోషికి ప్రదానం చేశారు. ఇంతవరకు ఈ అవార్డును మొత్తం 41 మంది అందుకున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 1954లో ఏర్పాటు చేశారు. సర్ సి.వి.రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత భారతరత్నకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావు. ఈ అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు, అతి పిన్న వయస్కుడుగా సచిన్‌కు గుర్తింపు దక్కింది.
 
 సచిన్ టెండూల్కర్: 24 ఏళ్లుగా క్రికెట్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సచిన్ తన 200వ టెస్టుతో నవంబర్ 16న ఆట నుంచి వైదొలిగారు. అదేరోజు ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. ఇప్పటికే ఆయన పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. క్రీడా ప్రపంచంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అసలైన రాయబారి టెండ్కూలర్ అని కేంద్రం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
 
 16 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌పై కరాచీలో 1989, నవంబర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో సచిన్ టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. టెస్టుల్లో మొత్తం 15,921 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 248 నాటౌట్. అదేవిధంగా 1989, డిసెంబర్ 18న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌లో కాలుమోపారు. వన్డేల్లో మొత్తం 463 మ్యాచ్‌లు ఆడి, 18,426 పరుగులు చేశారు. ఇందులో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 200 నాటౌట్.
 
 ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు: పూర్తిపేరు చింతామణి నాగేశ రామచంద్రరావు. 2005 నుంచి ప్రధానమంత్రి శాస్త్ర సలహామండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సీఎన్‌ఆర్ రావును కేంద్రం రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఆయన సాలిడ్ స్టేట్, మెటీరియల్స్ కెమిస్ట్రీలో అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన శాస్త్రవేత్త. నాన్ మెటీరియల్స్, గ్రాఫీన్‌లపై రెండు దశాబ్దాలుగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు.
 
 ఆయన దాదాపు 1400 పరిశోధన పత్రాలు, 45 పుస్తకాలు ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా 60 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సీఎన్‌ఆర్ రావు 1934, జూన్ 30న బెంగళూరులో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చేశారు. అమెరికాలోని పర్డ్యు యూనివర్సిటీ నుంచి 1958లో పీహెచ్‌డీ అందుకున్నారు. ఐఐటీ కాన్పూర్‌లో రసాయనశాస్త్ర అధిపతిగా 13 ఏళ్లు పనిచేశారు. 1984లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు 2005లో నోబెల్ బహుమతితో సమానమైన పది లక్షల డాలర్ల డాన్ డేవిడ్ ప్రైజ్ లభించింది.
 
 
 క్రీడలు
 జొకోవిచ్‌కు ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్
 నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ టైటిల్ గెలుచుకున్నాడు. లండన్‌లో నవంబర్ 12న జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్ రఫెల్ నాదల్ (స్పెయిన్)ను జొకోవిచ్ ఓడించాడు.
 
 దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో  భారత్‌కు అగ్రస్థానం
 దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో భారత్ మొత్తం 52 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. రాంచీలో నవంబర్ 12న ముగిసిన పోటీల్లో భారత్ 20 స్వర్ణాలు, 20 రజతాలు, 12 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించింది. శ్రీలంక 10 స్వర్ణాలు, 10 రజతాలు, 14 కాంస్య పతకాలు సాధించి రెండో స్థానం దక్కించుకుంది.
 
 అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్‌గా బోల్ట్, ప్రాసెర్ - ప్రెసి
 జమైకా స్ప్రింట్ క్రీడాకారులు ఉసేస్ బోల్ట్, షెల్లీ ఆన్ ప్రాసెర్-ప్రెసిలు 2013 సంవత్సరానికి ఐఏఏఎఫ్ పురుషుల, మహిళల వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ అవార్డులను నవంబర్ 16న మాంటెకార్లోలో బహూకరించారు. ఈ అవార్డును బోల్ట్ 2008, 2009, 2011, 2012లో కూడా దక్కించుకున్నాడు.
 
 టెస్ట్ సిరీస్ విజేత ఇండియా
 వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. నవంబర్ 16న ముగిసిన రెండో టెస్టును కూడా భారత్ గెలుచుకోవడంతో సిరీస్ భారత్ వశమైంది. తన చివరి టెస్ట్‌లో సచిన్ 74 పరుగులు చేశారు. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా, ప్రజ్ఞాన్ ఓజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు.
 
 చెక్ రిపబ్లిక్‌కు డేవిస్ కప్
 ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ నిలబెట్టుకుంది. బెల్‌గ్రేడ్‌లో నవంబర్ 18న ముగిసిన ఫైనల్స్‌లో సెర్బియాను ఓడించి చెక్ రిపబ్లిక్ విజేతగా నిలిచింది.
 
 వెటెల్‌కు యూఎస్ గ్రాండ్ ప్రి టైటిల్
 రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఫార్ములావన్ యూఎస్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. నవంబర్ 18న వెస్టిన్‌లో జరిగిన రేసులో వెటెల్ మొదటి స్థానంలో నిలిచాడు. లోటస్ డ్రైవర్   గ్రోస్యెన్‌కు రెండో స్థానం దక్కింది. ఈ గెలుపుతో ఈ సీజన్‌లో వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన తొలి డ్రైవర్‌గా వెటెల్ రికార్డు నెలకొల్పాడు.
 
 టైమ్ ‘పర్సన్ ఆఫ్ ద వీక్’ సచిన్
 ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ సచిన్ టెండ్కూలర్‌ను ‘పర్సన్ ఆఫ్ ద వీక్’ గౌరవంతో సత్కరించింది. మ్యాగజైన్ ఆన్‌లైన్ పోల్‌లో సచిన్‌కు 54 (88 శాతం) ఓట్లు వచ్చాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ హెడ్ నోమిని జనెట్ యెలెన్ 13.41 శాతం, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ 6.1 శాతం ఓట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement