సచిన్ కు నిద్ర కరువైన వేళ...
ముంబై: సంచలనాల క్రికెటర్... సచిన్ టెండూల్కర్ కెరీరే ఓ చరిత్ర! ఈ చరిత్ర పుటల్లో రికార్డులెన్ని ఉన్నాయో... నిద్రలేని రాత్రులూ అన్ని ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించిన రోజు కూడా అతనికి నిద్ర కరువైంది. ఫిబ్రవరి 24, 2010... సచిన్ అభిమానులకి బాగా గుర్తుండిపోయే రోజు. గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో అతను (200 నాటౌట్) ద్విశతకంతో మరో రికార్డు సాధించాడు.
జట్టు స్కోరు 401/3 అయితే... భారత్ 153 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించింది. ఇంతటి ఘనవిజయాన్నిచ్చిన సచిన్ కు ఆ రాత్రి కంటిమీద కునుకులేదు. దానికి గల కారణాల్ని తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో ఇలా వివరించాడు... ‘హోటల్ గదికి చేరుకున్న నేను అప్పటికే బాగా అలసిపోయాను. నా ఫోన్ ను తరచి చూస్తే మెసేజ్ బాక్సంతా అభినందనలతో నిండిపోయింది. అవన్నీ చదవడం, రిప్లే ఇవ్వడానికే రెండు గంటలు పట్టింది. ఇక ఆ రాత్రయితే నిద్రలేకపోవడానికి మరో కారణం కూడా ఉంది. నా గదిలో ఉన్న లైటింగ్, బయటి వాతావరణం నన్ను నిద్రకు దూరం చేశాయి. దీంతో నాకు జాగరణ తప్పలేదు’ అని సచిన్ వెల్లడించాడు.