ఆ రోజు రాత్రి సచిన్ నిద్రపోలేదట!
ముంబై: సరిగ్గా ఏడేళ్ల క్రితం అనగా 2010 ఫిబ్రవరి 24వ తేదీ.. సచిన్ టెండూల్కర్‌కు, భారత క్రికెట్ అభిమానులకు ప్రత్యేకమైన రోజు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ అరుదైన రికార్డు సృష్టించింది ఈ రోజే. గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సచిన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. సచిన్ (200 నాటౌట్) అజేయ డబుల్ సెంచరీ బాదడంతో, టీమిండియా (401/3) భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించగా.. సచిన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. డబుల్ సెంచరీ చేశాక ఆ రోజు రాత్రి సచిన్ సరిగా నిద్రపోలేదట. సంతోషంతో అభినందనలు అందుకుంటూ గడిపాడు.
'మ్యాచ్ ముగిశాక హోటల్‌కు వచ్చాక అలసటగా అనిపించినా, సంతోషంతో నిద్ర రాలేదు. బెడ్‌పై మెళుకవతో గడిపాను. నా ఫోన్ చూస్తే మెసేజ్ బాక్స్ అభినందనల సందేశాలతో నిండిపోయింది. నాకు అభినందనలు తెలిపిన వారికి రిప్లే ఇస్తూ రెండు గంటలు గడిపాను. ఆ రోజు రాత్రి సరిగా నిద్రపోలేదు' అని సచిన్ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో రాసుకున్నాడు. సచిన్ తర్వాత రోహిత్ శర్మ, మార్టిన్ గుప్టిల్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్ వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు. రోహిత్ రెండుసార్లు డబుల్ సెంచరీలు బాదడం విశేషం.