సచిన్ భారతరత్నపై పిటిషన్
జబల్పూర్: క్రికెట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ఇచ్చిన దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును వెనక్కు తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాణిజ్యపరమైన ప్రకటనల్లో నటిస్తూ భారీ మొత్తంలో ధనాన్నిసంపాదిస్తున్న సచిన్ కు భారతరత్న అవార్డు ఇవ్వడం సబబు కాదంటూ వికే నాస్వా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు గురువారం జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కార్, జస్టిస్ కేకే త్రివేదీలతో కూడిన న్యాయస్థానం ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. భారతరత్న అవార్డును వెనక్కు తీసుకోవడానికి సంబంధించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారంలోగా తెలియజేయాలని పేర్కొంటూ అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
క్రికెట్ లో భారత్ కు ఎనలేని సేవలందించిన సచిన్ అనేక అవార్డులు కూడా తన పేరటి లిఖించుకున్నా.. కమర్షియల్ యాడ్స్ చేస్తూ భారతరత్న అవార్డుకు అగౌరవం తెస్తున్నాడంటూ ఏకే నాస్వా పిటిషన్ లో పేర్కొన్నాడు. భారత ప్రభుత్వం సచిన్ కు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టడంలో విఫలమయ్యానని భావిస్తే ఆ అవార్డును తిరిగి అతనే స్వచ్ఛందంగా వెనక్కు ఇవ్వాలని నాస్వా డిమాండ్ చేశాడు.