మాట్లాడుతున్న డి.రాజా.చిత్రంలో నారాయణ
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేతలో నేరస్తునిగా ఉన్న అడ్వాణీకి భారతరత్న ఇవ్వడంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మండిపడ్డారు. హైదరాబాద్ మగ్ధూంభవన్‌లో మూడు రోజులపాటు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, తీర్మానాలు తదితర అంశాలను ఆదివారం సీపీఐ జాతీయ కార్యదర్శులు రామకృష్ట పండా, కె.నారాయణ, సయ్యద్ అజీజ్, లోక్‌సభాపక్ష నేత బినాయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి రాజా మీడియా సమావేశంలో వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలుపొందితే దేశానికి విపత్తేనని, ఈ విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజా అన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసుకుని, బీజేపీని ఓడించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఆ ప్రభుత్వ పాలసీలను విమర్శించడం ప్రతిపక్ష హక్కు అని, కానీ మోదీ, బీజేపీ ప్రతిపక్షమే ఉండకూడదని భావిస్తోందని ఆరోపించారు. రానున్న లోక్ ఎన్నికలకు తాము సన్నద్ధమవుతున్నామని, ఇండియా కూటమి కామన్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తుందని, అదే సమయంలో తమ పార్టీ తరపున మేనిఫెస్టోను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమి నేతలు గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు ఉన్నప్పటికీ రాహుల్ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే కేరళలో పోటీచేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీని ఓడించేందుకు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పనిచేస్తున్న నేపథ్యంలో కేరళలో రాహుల్ పోటీ చేయడం ఆరోగ్య వాతావరణం కాదన్నారు. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ జాతీయ సమితి ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్ కౌర్, డాక్టర్ బి.కె.కంగో, నాగేంద్రనాథ్ ఓజా, జాతీయ కార్యవర్గ సభ్యులు అనీరాజా, రాజ్యసభ సభ్యులు పి.సంతోష్ కుమార్‌లను ఈ కమిటీ సభ్యులుగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment