D. Raja
-
బాబ్రీమసీదు కూల్చివేత నేరస్తునికి భారతరత్నా?
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేతలో నేరస్తునిగా ఉన్న అడ్వాణీకి భారతరత్న ఇవ్వడంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మండిపడ్డారు. హైదరాబాద్ మగ్ధూంభవన్‌లో మూడు రోజులపాటు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, తీర్మానాలు తదితర అంశాలను ఆదివారం సీపీఐ జాతీయ కార్యదర్శులు రామకృష్ట పండా, కె.నారాయణ, సయ్యద్ అజీజ్, లోక్‌సభాపక్ష నేత బినాయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి రాజా మీడియా సమావేశంలో వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలుపొందితే దేశానికి విపత్తేనని, ఈ విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజా అన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసుకుని, బీజేపీని ఓడించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఆ ప్రభుత్వ పాలసీలను విమర్శించడం ప్రతిపక్ష హక్కు అని, కానీ మోదీ, బీజేపీ ప్రతిపక్షమే ఉండకూడదని భావిస్తోందని ఆరోపించారు. రానున్న లోక్ ఎన్నికలకు తాము సన్నద్ధమవుతున్నామని, ఇండియా కూటమి కామన్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తుందని, అదే సమయంలో తమ పార్టీ తరపున మేనిఫెస్టోను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమి నేతలు గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు ఉన్నప్పటికీ రాహుల్ ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే కేరళలో పోటీచేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీని ఓడించేందుకు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పనిచేస్తున్న నేపథ్యంలో కేరళలో రాహుల్ పోటీ చేయడం ఆరోగ్య వాతావరణం కాదన్నారు. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ జాతీయ సమితి ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్ కౌర్, డాక్టర్ బి.కె.కంగో, నాగేంద్రనాథ్ ఓజా, జాతీయ కార్యవర్గ సభ్యులు అనీరాజా, రాజ్యసభ సభ్యులు పి.సంతోష్ కుమార్‌లను ఈ కమిటీ సభ్యులుగా నియమించారు. -
విపక్షాల ఐక్యతా యత్నాలు
న్యూఢిల్లీ: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ గురువారం సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజాతో సమావేశమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌తోనూ నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. అతిత్వరలో వివిధ పార్టీల అగ్రనేతలతో కీలక భేటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. విపక్షాలు రాష్ట్రాల స్థాయిలో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. దేశంలో మూడో కూటమి సాధ్యమేనని ఉద్ఘాటించారు. అయితే, ఈ కూటమి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏర్పడే అవకాశం ఉందన్నారు. దేశాన్ని, దేశ ప్రజల జీవితాలను కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందేనని సీతారం ఏచూరి ట్వీట్ చేశారు. బీజేపీ అరాచక పాలనతో దేశ ప్రజలంతా విసుగెత్తిపోయారని డి.రాజా ట్విట్టర్లో పేర్కొన్నారు. -
భవిష్యత్ ఆశాకిరణం ఎర్రజెండాయే
సాక్షి, అమరావతి: దేశ భవిష్యత్‌కు ఆశాకి రణం ఎర్రజెండాయే అని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. రానున్న కాలంలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులంతా ఏకమై బీజేపీని నిలువరిస్తాయని చెప్పారు. సీపీఐ 24వ జాతీయ మహా సభలు శుక్రవారం విజయవాడలో ప్రారంభమ య్యాయి. తొలుత కేదారేశ్వర పేటలోని మీసాల రాజేశ్వరరావు బ్రిడ్జి నుంచి అజిత్ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు కదం తొక్కారు. అనంతరం బహిరంగ సభలో రాజా మాట్లా డుతూ.. మోదీ పాలన కంటే వాజ్‌పేయి పాలన ఎంతో బాగుందన్నారు. ఆనాటి బీజేపీ వేరని, ఇప్పటి మోదీ ఉన్న బీజేపీ వేరని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో అదానీ వంటి పెద్ద స్మగ్లర్లు అత్యంత ధనవంతుల జాబితాలోకి చేరుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కె.నారాయణ, ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. వర్షం కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో సభ అర్ధతరంగా నిలిచిపోయింది. విద్యుత్ వైర్లు కాలిపోయి మైకులు పనిచేయలేదు. వర్షం పెరగడంతో వేదికపై ఉన్న నాయకులు, దిగువన ఉన్న కార్యకర్తలు వెళ్లిపోయారు. దీంతో రాజా ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభను రద్దు చేశారు. -
వెనక్కి వెళుతున్న విమానంలా ఉంది
న్యూఢిల్లీ: మన దేశంలో ప్రస్తుత పరిస్థితి అపసవ్య దిశలో కదులుతున్న విమానంలా ఉందని.. అది ఎప్పుడైనా ప్రమాదానికి దారి తీయొచ్చని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ పేర్కొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కవితలు, లేఖలతో సంకలనం చేసిన ‘వై డూ యూ ఫియర్ మై వే సో మచ్’ పుస్తకావిష్కరణ సభలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1960వ దశకంలో సంపద, భూమి పునఃపంపిణీ కోసం నిజంగా విప్లవాత్మక ఉద్యమాలు జరిగాయని.. ప్రస్తుత నాయకులు ఉచిత పథకాలతో ఓట్లకు గాలం వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఇటీవల, నేను నా పైలట్ స్నేహితుడిని అడిగాను. 'మీరు ఒక విమానాన్ని వెనుకకు నడిపించగలరా?' అని. దానికి అతడు పెద్దగా నవ్వాడు. మన దేశంలో సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతోందని నేను చెప్పా. మన నాయకులు విమానాన్ని రివర్స్‌లో ఎగురవేస్తున్నారు. ప్రతిదీ పడిపోతోంది. పతనం దిశగా పయనిస్తున్నామ’ని అరుంధతీ రాయ్ అన్నారు. ఎంత అవమానకరం? మన దేశంలో చట్టాలు ఉన్నప్పటికీ కులం, వర్గం, లింగం, జాతి ఆధారంగా వేర్వేరుగా వర్తించబడతాయని పేర్కొన్నారు. ‘ఈ రోజు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 90 శాతం పక్షవాతం వచ్చి ఏడేళ్లుగా జైల్లో ఉన్న ఓ ప్రొఫెసర్ గురించి మాట్లాడేందుకు కలిశాం. ఇక మనం మాట్లాడాల్సిన పనిలేదు. మనం ఎలాంటి దేశంలో జీవిస్తున్నామో చెప్పడానికి ఇది చాలు.. ఇది ఎంత అవమానకరం’ అని అరుంధతీ రాయ్ అన్నారు. 90 శాతానికి పైగా శారీరక వైకల్యాలు కలిగి, వీల్‌చైర్‌ను ఉపయోగించే జిఎన్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని, దేశంపై యుద్ధం చేస్తున్నారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు 2017లో జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. (చదవండి: జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి) సాయిబాబాను విడుదల చేయాలి: రాజా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ.. జిఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్స్, అర్బన్ మావోయిస్టులుగా ముద్ర వేసి జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. శారీరక వైకల్యానికి తోడు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న తన భర్త పట్ల జైలులో అవమానవీయంగా ప్రవరిస్తున్నారని జీఎన్ సాయిబాబా సతీమణి వసంత ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు కూడా ఆయనను అనుమతించలేదని వాపోయారు. (చదవండి: పత్రికా స్వేచ్ఛ.. నానాటికీ తీసికట్టు) -
ఎర్రజెండాకు దళిత ‘స్పృహ’!
గత 95 ఏళ్లుగా భారత కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) ప్రధాన కార్యదర్శిగా ఒక్కరంటే ఒక్క దళితనేత కూడా ఎంపికైన చరిత్ర లేదు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలతో సహా ఏ పాలకపార్టీ కూడా దళితులను నాయకత్వ స్థానాల్లోకి ఎదిగించని తరుణంలో డి. రాజాకు సీపీఐ అత్యున్నత స్థానం కట్టబెట్టడంతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని సుదీర్ఘకాల పక్షపాతం నుంచి విముక్తి చేసినట్లయింది. సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి. రాజా నియామకం చారిత్రాత్మక చర్య. విజ్ఞత కలిగిన కమ్యూనిస్టుగా, సిద్ధాంతవేత్తగా, స్ఫూర్తిదాయక మూర్తిగా ఎదిగిన ఈ దళిత నాయకుడి ఎంపిక వామపక్ష–అంబేడ్కర్ వాదుల్లో ఒక నూతన స్ఫూర్తిని కలిగించే చర్య. ఈ రెండు పక్షాలతో రాజా సజీవ సంబంధాలను కొనసాగించడం భవిష్యత్ ఐక్యతకు బలం చేకూరుస్తుంది కూడా. తన సొంత ప్రతిభాపాటవాలపై ఆధారపడి ఎదిగివచ్చిన డి. రాజా అందరి ప్రశంసలకు అర్హుడు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా డి. రాజా నియామకం ఒక చారి త్రాత్మక చర్య. భారత జాతీయ కమ్యూనిస్టు నేతగానే కాకుండా, విజ్ఞత కలిగిన కమ్యూనిస్టుగా, సిద్ధాంతవేత్తగా, స్ఫూర్తిదాయక మూర్తిగా ఎది గిన దళిత నాయకుడు డి. రాజా. మండల్ అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు భారత రాజకీయ చరిత్రను మార్చివేసిన తర్వాత, వామపక్షాల నుంచి దళిత బహుజనులకు, కమ్యూనిస్టులకు మధ్య సాధికారిక స్వరంతో చర్చలు జరిపిన ఏకైక నేత డి. రాజానే. దామోదరం సంజీవయ్య తర్వాత కాంగ్రెస్ పార్టీలో సైతం పార్టీ అధ్యక్షుడిగా దళితుడికి అవకాశం ఇచ్చిన చరిత్ర లేదు. భారతీయ జనతా పార్టీ బంగారు లక్ష్మణ్‌ని పార్టీ అధ్యక్షుడిగా ప్రోత్సహించింది కానీ ఆయన తన సొంత సామర్థ్యం ప్రాతిపదికన అత్యున్నత పదవికి ఎంపిక కాలేదన్నది అందరికీ తెలిసిందే. కానీ స్టింగ్ ఆపరేషన్‌లో కేవలం లక్షరూపాయలు తీసుకుంటూ పట్టుబడిన బంగారు లక్ష్మణ్ చివరకు దాదాపుగా జైలులోనే మృతి చెందాల్సి రావడం విషాదకరం. భారత రాష్ట్రపతి పదవిలో అయిదేళ్ల పూర్తికాలం సౌఖ్యంగా గడిపిన ఏకైక దళిత నేత కె.ఆర్. నారాయణన్. ఈయన స్వతహాగా మేధావి. మరో దళిత నేత రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తుతం రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నారు కానీ ఆయన పదవీ విరమణ సమయానికి రాష్ట్రపతి పదవిపై, దేశ చిత్రపటంపై ఎలాంటి ముద్ర వేయనున్నారో చూడటానికి మనం వేచి ఉండాల్సిందే. కానీ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 1962లో తొలిసారిగా విడిపోయింది. తర్వాత మావోయిస్టు గ్రూపుల చీలికలతో మరోసారి చీలి పోయింది. ఇలా పలుసార్లు కమ్యూనిస్టు పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. తదనంతర కాలంలో సభ్యుల పరంగా, ఎన్నికల పరంగా సీపీఎం పెద్దపాత్ర పోషించినప్పటికీ సీపీఐ కమ్యూనిస్టు సిద్ధాంత చుక్కానిగా కొనసాగుతూ వస్తోంది. చారిత్రక తప్పిదానికి సవరణ మండల్ ఉద్యమం, అంబేడ్కర్ భావజాలం భారతీయ దళిత–బహుజనుల సామాజిక, రాజకీయ ప్రతిపత్తిని మార్చివేసిన తర్వాత, దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు నైతికంగా వెనుకంజ వేసి దెబ్బతిన్నాయి. 1925లో దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత దాదాపుగా గత 95 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) ప్రధాన కార్యదర్శిగా ఒక్కరంటే ఒక్క దళితనేత కూడా ఎంపికైన చరిత్ర లేదు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలతో సహా ఏ పాలకపార్టీ కూడా డి. రాజా వంటి నేతను తమ పార్టీల నిర్మాణంలో ఎదిగించని, రూపొందించని తరుణంలో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజాకు అత్యున్నత స్థానం కట్టబెట్టడం అనేది కమ్యూనిస్టు ఉద్యమాన్ని పక్షపాతం, దురభిమానాల నుంచి విముక్తి చేసినట్లయింది. డి. రాజా ఇంతటి అత్యున్నత స్థానాన్ని సాధిం చుకున్నప్పటికీ, దీనికి గాను ఆయన పార్టీని నిజంగా అభినందించాల్సి ఉంది. ఎందుకంటే సీపీఎం నేటివరకు ఒక్కరంటే ఒక్క దళిత్‌ని/ఆదివాసీని తన పొలిట్ బ్యూరోలోకి తీసుకోలేకపోయింది. కాబట్టే దళితులు, ఆదివాసులు సీపీఎం, ఆరెస్సెస్ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని భావిస్తున్నారు. సీపీఎం లాగా, ఆరెస్సెస్ కూడా తన అత్యున్నత స్థానంలోకి ఒక దళితుడిని, ఆదివాసీని ప్రోత్సహించలేదు. (బంగారు లక్ష్మణ్ మినహాయింపు). కమ్యూనిస్టులు మాటల్లో కాకుండా చేతల్లో తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దిగువ కులాలకు చెందిన ప్రజారాశులు.. ప్రతి ఒక్కరినీ వారి చేతల ద్వారానే అంచనా వేయగలిగినటువంటి తమ సొంత మేధావులను తయారు చేసుకున్నాయని కమ్యూనిస్టులు తప్పకుండా అవగాహన చేసుకోవాలి. కార్మికులు–అగ్రకుల నాయకత్వం కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రజాసముద్రంలోని అలలు వంటి వారయినట్లయితే, దాని నేతలు ఆ అలల నుంచి పుట్టుకొచ్చిన నురుగు లాంటివారని చైనా ప్రజాతంత్ర రిపబ్లిక్ తొలి ప్రధానమంత్రి చౌఎన్‌లై పేర్కొన్నారు. కానీ భారతదేశంలో తొలినుంచి జరుగుతూ వచ్చింది ఏమిటంటే దళిత బహుజన సామాజిక బృందాలనుంచి కార్మికులుగా, కర్షకులుగా, కూలీలుగా అలలు పుట్టుకొస్తే, నాయకులు మాత్రం ఆ అలలతో సంబంధం లేని ఎగువ కులాల నుంచి పుట్టుకొచ్చారు. కనీసం తొలినాళ్లనుంచి పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కమ్యూనిస్టు నాయకత్వం దళిత బహుజన శ్రేణులనుంచి పుట్టుకొచ్చి ఉంటే బాగుండేది. కానీ వారలా చేయలేదు. దీంతో కమ్యూనిస్టు పార్టీలోని ఎగువ కులాలకు చెందిన నాయకులు ఉద్దేశపూర్వకంగానే దళిత, ఆదివాసీ కార్యకర్తలను క్షేత్ర స్థాయిలోనే ఉంచి, అలలపైన నురగలాగా మారడానికి వారిని అనుమతించలేదన్న అభిప్రాయాన్ని కలిగించారు. ఈ క్రమంలో కార్మిక వర్గం వెలుపలి నుంచే మేధోనాయకత్వం పుట్టుకొస్తుందని చెప్పిన లెనిన్ సూత్రీకరణలపైనే భారతీయ కమ్యూనిస్టు నాయకులు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. ఉదాహరణకు భారతదేశంలోని బ్రాహ్మణ జనాభా ఎన్నడూ కమ్యూనిస్టు ఉద్యమ మద్దతుదారులుగా లేరు. కానీ కమ్యూనిస్టు మేధో నాయకులు మాత్రం బ్రాహ్మణులనుంచి వచ్చారు. బ్రాహ్మణులు మాత్రం ఎల్లప్పుడూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీతోనే కలిసి ఉండేవారు. ఎందుకంటే వీటి సంస్థాగత నిర్మాణాలు వారి సామాజిక–ఆధ్యాత్మిక హృదయానికి, ఆలోచనలకు అతి దగ్గరగా ఉండేవి మరి. దీనికి భిన్నంగా, దళిత్, ఓబీసీలకు చెందిన ప్రజానీకం కమ్యూనిస్టు పార్టీల పక్షాన్నే ఉండేవారు కానీ వీరినుంచి మేధోగత నాయకులు ఎదిగి వచ్చేవారు కాదు. బహుశా కమ్యూనిస్టు పార్టీల్లోని క్షేత్ర స్థాయి ప్రజానీకానికి తగిన విద్య, మేధో పరిపక్వత లేకపోవడం ఒక సమస్యే కావచ్చు. ఈ పరిమితి ఉన్నప్పటికీ, సాధారణ ప్రజా రాశులనుంచి నాయకులకు శిక్షణ నివ్వడంపై కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టి ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యా సంస్థలలో అలాంటి చక్కటి మేధోవంతమైన యువత పుట్టుకొచ్చే సమయానికి, వాటిలో అంబేడ్కరిజం బలపడింది. దీంతో దళిత్, ఓబీసీలకు చెందిన యువత వామపక్ష భావాలపైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, కమ్యూనిస్టు పార్టీల్లోని అగ్రశ్రేణి నేతలు దిగువ కులాలనుంచి నాయకులు ఆవిర్భవించడానికి అనుమతించడం లేదన్న అనుమానం క్రమేణా వారిలో పెరుగుతూ వచ్చింది. అందుకే ఆనాటి నుంచి వారు అగ్రకుల కమ్యూనిస్టు నాయకులను అనుమానించడం మొదలుపెట్టారు. అయితే డి.రాజా సీపీఐలో అత్యున్నత స్థాయికి ఎదగడం అనేది వామపక్ష అంబేడ్కర్ వాదుల్లో ఖచ్చితంగా ఒక కొత్త వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈ రెండు పక్షాలలో రాజా సజీవ సంబంధాలను కొనసాగించడం కూడా దీనికి కారణం కావచ్చు. ప్రతిభాపాటవాలతోనే ఉన్నతి పెరియార్ ఈవీఆర్ రామస్వామి కాలం నుంచి దిగువ కులాల నాయకత్వం బలంగా రూపొందిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్న తమిళనాడు నుంచి డి.రాజా పుట్టుకొచ్చారు. డీఎంకే దివంగత నేత ఎం. కరుణానిధి నాయీ బ్రాహ్మణ సామాజిక బృందం నుంచి ఎదిగివచ్చారు. (ఈయన పూర్వీకులు ఆలయ సంగీత విద్వాంసులుగా, గాయకులుగా జీవించేవారు) ఇప్పుడు డి. రాజా తమిళనాడులోని దళిత కమ్యూనిటీ నుంచి ఎదిగివచ్చారు. అయినంతమాత్రాన రాజా స్వీయ ప్రతిభను కానీ, మనసావాచా కమ్యూనిస్టు ఉద్యమాచరణకు అంకితం కావడాన్ని కానీ ఎవరూ తోసిపుచ్చలేరు. తన సొంత ప్రతిభాపాటవాలపై ఆధారపడి ఎదిగివచ్చిన రాజా అందరి ప్రశంసలకు అర్హుడు. తన సైద్ధాంతిక భూమికను వదులుకోకుండానే ఏ సామాజిక బృందంతోనైనా చర్చించగల, వ్యవహరించగల నిఖార్సయిన నేత డి. రాజా. ప్రత్యేకించి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాల్లో స్పష్టంగా కనిపించే ఒంటెత్తువాదానికి ఆయన చాలా దూరం. పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు, బృందాలను ఐక్యపరచి నేపాల్ తరహా పంథాలో భారతదేశాన్ని నడిపించగల పరిపూర్ణ వ్యక్తిత్వం ఆయనది. కమ్యూనిస్టు ఉద్యమంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి సీపీఎం కూడా ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకుంటుందని ఆశిద్దాం. ప్రొ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
హోదాపై జాప్యం ప్రజాస్వామ్యానికే మచ్చ: డి. రాజా
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా పార్లమెంట్ ఇచ్చిన హామీ అని, దేశంలోని అత్యున్నత చట్టసభ ఇచ్చిన హామీయే అమలు కాకుంటే అది ప్రజాస్వామ్యానికే మచ్చ అని సీపీఐ జాతీయనేత డి. రాజా అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. హోదాపై వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టే క్రమంలో పార్టీ ఎంపీలతో కలిసి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం సీపీఐ నేత రాజాను కలిశారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజా ఏపీకి హోదా కల్పించడంలో జాప్యం చేస్తున్నదంటూ ఎన్డీఏ సర్కారుపై మండిపడ్డారు. 'గత ప్రభుత్వం పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన బాధ్యత ప్రస్తుత ఎన్డీఏ సర్కారుదే. ఏపీ పునర్వ్యవస్థీకణ బిల్లుపై నాడు రాజ్యసభలో జరిగిన చర్చలో నేను కూడా పాల్గొన్నా. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే, కాదూ.. 10 ఏళ్లు కావాలని బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. నాటి ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ సైతం ఆ డిమాండ్ కు మద్దతు తెలిపారు. ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. మరి ఏపీకి హోదాపై జాప్యం ఎందుకు?' అని డి. రాజా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, ఆ హక్కును సాధించుకునే క్రమంలో జరుగుతున్న పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, ప్రత్యక్షంగా పోరాటాలు కూడా చేస్తుందని రాజా అన్నారు. కీలకమైన నదీ జలాల పంపకంలో ఏపీలాంటి దిగువ రాష్ట్రాలకు నష్టం జరగకుండా పంపిణీ జరగాలని, ఫిరాయింపుల చట్టంలోనూ సవరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు.