న్యూఢిల్లీ: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ గురువారం సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజాతో సమావేశమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌తోనూ నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం.
రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. అతిత్వరలో వివిధ పార్టీల అగ్రనేతలతో కీలక భేటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. విపక్షాలు రాష్ట్రాల స్థాయిలో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. దేశంలో మూడో కూటమి సాధ్యమేనని ఉద్ఘాటించారు. అయితే, ఈ కూటమి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏర్పడే అవకాశం ఉందన్నారు. దేశాన్ని, దేశ ప్రజల జీవితాలను కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందేనని సీతారం ఏచూరి ట్వీట్ చేశారు. బీజేపీ అరాచక పాలనతో దేశ ప్రజలంతా విసుగెత్తిపోయారని డి.రాజా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment