హోదాపై జాప్యం ప్రజాస్వామ్యానికే మచ్చ: డి. రాజా
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా పార్లమెంట్ ఇచ్చిన హామీ అని, దేశంలోని అత్యున్నత చట్టసభ ఇచ్చిన హామీయే అమలు కాకుంటే అది ప్రజాస్వామ్యానికే మచ్చ అని సీపీఐ జాతీయనేత డి. రాజా అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. హోదాపై వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టే క్రమంలో పార్టీ ఎంపీలతో కలిసి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం సీపీఐ నేత రాజాను కలిశారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజా ఏపీకి హోదా కల్పించడంలో జాప్యం చేస్తున్నదంటూ ఎన్డీఏ సర్కారుపై మండిపడ్డారు.
'గత ప్రభుత్వం పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన బాధ్యత ప్రస్తుత ఎన్డీఏ సర్కారుదే. ఏపీ పునర్వ్యవస్థీకణ బిల్లుపై నాడు రాజ్యసభలో జరిగిన చర్చలో నేను కూడా పాల్గొన్నా. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే, కాదూ.. 10 ఏళ్లు కావాలని బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. నాటి ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ సైతం ఆ డిమాండ్ కు మద్దతు తెలిపారు. ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. మరి ఏపీకి హోదాపై జాప్యం ఎందుకు?' అని డి. రాజా ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, ఆ హక్కును సాధించుకునే క్రమంలో జరుగుతున్న పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, ప్రత్యక్షంగా పోరాటాలు కూడా చేస్తుందని రాజా అన్నారు. కీలకమైన నదీ జలాల పంపకంలో ఏపీలాంటి దిగువ రాష్ట్రాలకు నష్టం జరగకుండా పంపిణీ జరగాలని, ఫిరాయింపుల చట్టంలోనూ సవరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు.