ఎర్రజెండాకు దళిత ‘స్పృహ’! | Kancha Ailaiah Article On New General Secretary Of CPI | Sakshi
Sakshi News home page

ఎర్రజెండాకు దళిత ‘స్పృహ’!

Published Fri, Jul 26 2019 1:12 AM | Last Updated on Fri, Jul 26 2019 1:16 AM

Kancha Ailaiah Article On New General Secretary Of CPI  - Sakshi

గత 95 ఏళ్లుగా భారత కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) ప్రధాన కార్యదర్శిగా ఒక్కరంటే ఒక్క దళితనేత కూడా ఎంపికైన చరిత్ర లేదు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలతో సహా ఏ పాలకపార్టీ కూడా దళితులను నాయకత్వ స్థానాల్లోకి ఎదిగించని తరుణంలో డి. రాజాకు సీపీఐ అత్యున్నత స్థానం కట్టబెట్టడంతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని సుదీర్ఘకాల పక్షపాతం నుంచి విముక్తి చేసినట్లయింది. సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి. రాజా నియామకం చారిత్రాత్మక చర్య. విజ్ఞత కలిగిన కమ్యూనిస్టుగా, సిద్ధాంతవేత్తగా, స్ఫూర్తిదాయక మూర్తిగా ఎదిగిన ఈ దళిత నాయకుడి ఎంపిక వామపక్ష–అంబేడ్కర్‌ వాదుల్లో ఒక నూతన స్ఫూర్తిని కలిగించే చర్య. ఈ రెండు పక్షాలతో రాజా సజీవ సంబంధాలను కొనసాగించడం భవిష్యత్‌ ఐక్యతకు బలం చేకూరుస్తుంది కూడా. తన సొంత ప్రతిభాపాటవాలపై ఆధారపడి ఎదిగివచ్చిన డి. రాజా అందరి ప్రశంసలకు అర్హుడు.

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా డి. రాజా నియామకం ఒక చారి త్రాత్మక చర్య. భారత జాతీయ కమ్యూనిస్టు నేతగానే కాకుండా, విజ్ఞత కలిగిన కమ్యూనిస్టుగా, సిద్ధాంతవేత్తగా, స్ఫూర్తిదాయక మూర్తిగా ఎది గిన దళిత నాయకుడు డి. రాజా. మండల్‌ అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు భారత రాజకీయ చరిత్రను మార్చివేసిన తర్వాత, వామపక్షాల నుంచి దళిత బహుజనులకు, కమ్యూనిస్టులకు మధ్య సాధికారిక స్వరంతో చర్చలు జరిపిన ఏకైక నేత డి. రాజానే.

దామోదరం సంజీవయ్య తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో సైతం పార్టీ అధ్యక్షుడిగా దళితుడికి అవకాశం ఇచ్చిన చరిత్ర లేదు. భారతీయ జనతా పార్టీ బంగారు లక్ష్మణ్‌ని పార్టీ అధ్యక్షుడిగా ప్రోత్సహించింది కానీ ఆయన తన సొంత సామర్థ్యం ప్రాతిపదికన అత్యున్నత పదవికి ఎంపిక కాలేదన్నది అందరికీ తెలిసిందే. కానీ స్టింగ్‌ ఆపరేషన్‌లో కేవలం లక్షరూపాయలు తీసుకుంటూ పట్టుబడిన బంగారు లక్ష్మణ్‌ చివరకు దాదాపుగా జైలులోనే మృతి చెందాల్సి రావడం విషాదకరం.

భారత రాష్ట్రపతి పదవిలో అయిదేళ్ల పూర్తికాలం సౌఖ్యంగా గడిపిన ఏకైక దళిత నేత కె.ఆర్‌. నారాయణన్‌. ఈయన స్వతహాగా మేధావి. మరో దళిత నేత రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రస్తుతం రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నారు కానీ ఆయన పదవీ విరమణ సమయానికి రాష్ట్రపతి పదవిపై, దేశ చిత్రపటంపై ఎలాంటి ముద్ర వేయనున్నారో చూడటానికి మనం వేచి ఉండాల్సిందే. కానీ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 1962లో తొలిసారిగా విడిపోయింది. తర్వాత మావోయిస్టు గ్రూపుల చీలికలతో  మరోసారి చీలి పోయింది. ఇలా పలుసార్లు కమ్యూనిస్టు పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. తదనంతర కాలంలో సభ్యుల పరంగా, ఎన్నికల పరంగా సీపీఎం పెద్దపాత్ర పోషించినప్పటికీ సీపీఐ కమ్యూనిస్టు సిద్ధాంత చుక్కానిగా కొనసాగుతూ వస్తోంది.

చారిత్రక తప్పిదానికి సవరణ
మండల్‌ ఉద్యమం, అంబేడ్కర్‌ భావజాలం భారతీయ దళిత–బహుజనుల సామాజిక, రాజకీయ ప్రతిపత్తిని మార్చివేసిన తర్వాత, దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు నైతికంగా వెనుకంజ వేసి దెబ్బతిన్నాయి. 1925లో దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత దాదాపుగా గత 95 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) ప్రధాన కార్యదర్శిగా ఒక్కరంటే ఒక్క దళితనేత కూడా ఎంపికైన చరిత్ర లేదు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలతో సహా ఏ పాలకపార్టీ కూడా డి. రాజా వంటి నేతను తమ పార్టీల నిర్మాణంలో ఎదిగించని, రూపొందించని తరుణంలో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజాకు అత్యున్నత స్థానం కట్టబెట్టడం అనేది కమ్యూనిస్టు ఉద్యమాన్ని పక్షపాతం, దురభిమానాల నుంచి విముక్తి చేసినట్లయింది. 

డి. రాజా ఇంతటి అత్యున్నత స్థానాన్ని సాధిం  చుకున్నప్పటికీ, దీనికి గాను ఆయన పార్టీని నిజంగా అభినందించాల్సి ఉంది. ఎందుకంటే సీపీఎం నేటివరకు ఒక్కరంటే ఒక్క దళిత్‌ని/ఆదివాసీని తన పొలిట్‌ బ్యూరోలోకి తీసుకోలేకపోయింది. కాబట్టే దళితులు, ఆదివాసులు సీపీఎం, ఆరెస్సెస్‌ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని భావిస్తున్నారు. సీపీఎం లాగా, ఆరెస్సెస్‌ కూడా తన అత్యున్నత స్థానంలోకి ఒక దళితుడిని, ఆదివాసీని ప్రోత్సహించలేదు. (బంగారు లక్ష్మణ్‌ మినహాయింపు). కమ్యూనిస్టులు మాటల్లో కాకుండా చేతల్లో తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దిగువ కులాలకు చెందిన ప్రజారాశులు.. ప్రతి ఒక్కరినీ వారి చేతల ద్వారానే అంచనా వేయగలిగినటువంటి తమ సొంత మేధావులను తయారు చేసుకున్నాయని కమ్యూనిస్టులు తప్పకుండా అవగాహన చేసుకోవాలి. 

కార్మికులు–అగ్రకుల నాయకత్వం
కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రజాసముద్రంలోని అలలు వంటి వారయినట్లయితే, దాని నేతలు ఆ అలల నుంచి పుట్టుకొచ్చిన నురుగు లాంటివారని చైనా ప్రజాతంత్ర రిపబ్లిక్‌ తొలి ప్రధానమంత్రి చౌఎన్‌లై పేర్కొన్నారు. కానీ భారతదేశంలో తొలినుంచి జరుగుతూ వచ్చింది ఏమిటంటే దళిత బహుజన సామాజిక బృందాలనుంచి కార్మికులుగా, కర్షకులుగా, కూలీలుగా అలలు పుట్టుకొస్తే, నాయకులు మాత్రం ఆ అలలతో సంబంధం లేని ఎగువ కులాల నుంచి పుట్టుకొచ్చారు.

కనీసం తొలినాళ్లనుంచి పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కమ్యూనిస్టు నాయకత్వం దళిత బహుజన శ్రేణులనుంచి పుట్టుకొచ్చి ఉంటే బాగుండేది. కానీ వారలా చేయలేదు. దీంతో కమ్యూనిస్టు పార్టీలోని ఎగువ కులాలకు చెందిన నాయకులు ఉద్దేశపూర్వకంగానే దళిత, ఆదివాసీ కార్యకర్తలను క్షేత్ర స్థాయిలోనే ఉంచి, అలలపైన నురగలాగా మారడానికి వారిని అనుమతించలేదన్న అభిప్రాయాన్ని కలిగించారు. ఈ క్రమంలో కార్మిక వర్గం వెలుపలి నుంచే మేధోనాయకత్వం పుట్టుకొస్తుందని చెప్పిన లెనిన్‌ సూత్రీకరణలపైనే భారతీయ కమ్యూనిస్టు నాయకులు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. ఉదాహరణకు భారతదేశంలోని బ్రాహ్మణ జనాభా ఎన్నడూ కమ్యూనిస్టు ఉద్యమ మద్దతుదారులుగా లేరు. కానీ కమ్యూనిస్టు మేధో నాయకులు మాత్రం బ్రాహ్మణులనుంచి వచ్చారు. బ్రాహ్మణులు మాత్రం ఎల్లప్పుడూ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్, భారతీయ జనతా పార్టీతోనే కలిసి ఉండేవారు. ఎందుకంటే వీటి సంస్థాగత నిర్మాణాలు వారి సామాజిక–ఆధ్యాత్మిక హృదయానికి, ఆలోచనలకు అతి దగ్గరగా ఉండేవి మరి. దీనికి భిన్నంగా, దళిత్, ఓబీసీలకు చెందిన ప్రజానీకం కమ్యూనిస్టు పార్టీల పక్షాన్నే ఉండేవారు కానీ వీరినుంచి మేధోగత నాయకులు ఎదిగి వచ్చేవారు కాదు. బహుశా కమ్యూనిస్టు పార్టీల్లోని క్షేత్ర స్థాయి ప్రజానీకానికి తగిన విద్య, మేధో పరిపక్వత లేకపోవడం ఒక సమస్యే కావచ్చు. ఈ పరిమితి ఉన్నప్పటికీ, సాధారణ ప్రజా రాశులనుంచి నాయకులకు శిక్షణ నివ్వడంపై కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టి ఉండాలి.

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యా సంస్థలలో అలాంటి చక్కటి మేధోవంతమైన యువత పుట్టుకొచ్చే సమయానికి, వాటిలో అంబేడ్కరిజం బలపడింది. దీంతో దళిత్, ఓబీసీలకు చెందిన యువత వామపక్ష భావాలపైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, కమ్యూనిస్టు పార్టీల్లోని అగ్రశ్రేణి నేతలు దిగువ కులాలనుంచి నాయకులు ఆవిర్భవించడానికి  అనుమతించడం లేదన్న అనుమానం క్రమేణా వారిలో పెరుగుతూ వచ్చింది. అందుకే ఆనాటి నుంచి వారు అగ్రకుల కమ్యూనిస్టు నాయకులను అనుమానించడం మొదలుపెట్టారు. అయితే డి.రాజా సీపీఐలో అత్యున్నత స్థాయికి ఎదగడం అనేది వామపక్ష అంబేడ్కర్‌ వాదుల్లో ఖచ్చితంగా ఒక కొత్త వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈ రెండు పక్షాలలో రాజా సజీవ సంబంధాలను కొనసాగించడం కూడా దీనికి కారణం కావచ్చు.

ప్రతిభాపాటవాలతోనే ఉన్నతి
పెరియార్‌ ఈవీఆర్‌ రామస్వామి కాలం నుంచి దిగువ కులాల నాయకత్వం బలంగా రూపొందిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్న తమిళనాడు నుంచి డి.రాజా పుట్టుకొచ్చారు. డీఎంకే దివంగత నేత ఎం. కరుణానిధి నాయీ బ్రాహ్మణ సామాజిక బృందం నుంచి ఎదిగివచ్చారు. (ఈయన పూర్వీకులు ఆలయ సంగీత విద్వాంసులుగా, గాయకులుగా జీవించేవారు) ఇప్పుడు డి. రాజా తమిళనాడులోని దళిత కమ్యూనిటీ నుంచి ఎదిగివచ్చారు. అయినంతమాత్రాన రాజా స్వీయ ప్రతిభను కానీ, మనసావాచా కమ్యూనిస్టు ఉద్యమాచరణకు అంకితం కావడాన్ని కానీ ఎవరూ తోసిపుచ్చలేరు. తన సొంత ప్రతిభాపాటవాలపై ఆధారపడి ఎదిగివచ్చిన రాజా అందరి ప్రశంసలకు అర్హుడు.

తన సైద్ధాంతిక భూమికను వదులుకోకుండానే ఏ సామాజిక బృందంతోనైనా చర్చించగల, వ్యవహరించగల నిఖార్సయిన నేత డి. రాజా. ప్రత్యేకించి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాల్లో స్పష్టంగా కనిపించే ఒంటెత్తువాదానికి ఆయన చాలా దూరం. పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు, బృందాలను ఐక్యపరచి నేపాల్‌ తరహా పంథాలో భారతదేశాన్ని నడిపించగల పరిపూర్ణ వ్యక్తిత్వం ఆయనది. కమ్యూనిస్టు ఉద్యమంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి సీపీఎం కూడా ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకుంటుందని ఆశిద్దాం.


ప్రొ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement