Babri Masjid
-
NCERT: బాబ్రీ కాదు.. 3 గోపురాల నిర్మాణం
న్యూఢిల్లీ : హేతుబద్దీకరణ పేరుతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు, చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలోనూ అనేక మార్పులు చేసింది. ‘బాబ్రీ మసీదు’ సహా అనేక కీలక అంశాలను, చాలా సమాచారాన్ని తొలగించింది. తొలగింపులు అంశాలవారీగా.. ⇒ ‘బాబ్రీ మసీదు’ పదం తొలగింపు: పాఠ్య పుస్తకంలోంచి బాబ్రీ మసీదు అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. దాని స్థానంలో ‘మూడు గోపురాల నిర్మాణం’ను చేర్చింది. ⇒ అయోధ్య అధ్యాయం తగ్గింపు: నాలుగు పేజీలున్న అయోధ్య అధ్యాయాన్ని రెండు పేజీలకు తగ్గించింది. రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూలి్చవేత, అనంతరం జరిగిన హింస, ఆ తరువాత బీజేపీ పాలిత ప్రాంతాల్లో విధించిన రాష్ట్రప తి పాలన అంశాలను తొలగించింది. ⇒ చారిత్రక వివరాల సవరణ: బాబ్రీ మసీదుకు సంబంధించిన వివరాల్లో కూడా అనేక మార్పులు చేసింది. బాబ్రీ మసీదును 16వ శతాబ్దంలో మీర్ బాకీ నిర్మించినట్లుగా గత పుస్తకంలో ఉండగా.. 1528లో రాముడి జన్మస్థలంలో నిర్మించబడిన మూడు గోపురాల నిర్మాణంగా ఇప్పుడు పేర్కొన్నది. అంతేకాదు ఈ నిర్మాణంలో అనేక హిందూ చిహ్నాలు ఉన్నాయని, లోపలి, వెలుపలి గోడలపై శిల్పాలు ఉన్నాయని కొత్త పుస్తకం పేర్కొంది. హిందూ చిత్రాలు, విగ్రహాలను కూడా కొత్తగా ప్రస్తావించింది. ⇒ చట్టపరమైన, మతపరమైన కథనాల్లోనూ మార్పులు: ఆలయంలో పూజలు చేసుకునేందుకు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని తెరచి ఉంచాలని 1986 ఫిబ్రవరిలో ఫైజాబాద్ జిల్లా కోర్టు ఇచి్చన తీర్పును పాత పుస్తకం వివరించగా, వాటన్నింటిని తొలగించి మూడు గోపురాల నిర్మాణం, తరువాత వచి్చన మతపరమైన వైరుధ్యాలను కొత్త పుస్తకం క్లుప్తంగా ప్రస్తావించింది. వివాదాస్పద భూమి ఆలయానికే చెందుతుందంటూ 2019లో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును మాత్రం కొత్త ఎడిషన్‌లో చేర్చింది. ⇒ వార్తాపత్రికల కటింగ్స్ తీసివేత: పాత పుస్తకంలో వార్తాపత్రిక కథనాలకు సంబంధించిన అనేక ఛాయాచిత్రాలు ఉన్నాయి. వీటిలో డిసెంబర్ 7, 1992న ’బాబ్రీ మసీదు కూలి్చవేత, కేంద్రం కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం కూడా ఉంది. వీటన్నింటినీ తొలగించారు. ⇒ గుజరాత్ అల్లర్ల అధ్యాయం తొలగింపు: ప్రజాస్వామ్య హక్కుల అధ్యాయం నుంచి గుజరాత్ అల్లర్ల ప్రస్తావనను పూర్తిగా తొలగించింది. అల్లర్ల గురించి బోధించాల్సిన అవసరం లేదుఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ద్వేషం, హింస బోధనాంశాలు కావని, పాఠశాల పాఠ్యపుస్తకాలు వాటిపై దృష్టి పెట్టకూడదని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) చీఫ్ దినేష్ ప్రసాద్ సక్లానీ అన్నారు. గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీదు కూలి్చవేత గురించి బోధిస్తే పాఠశాల విద్యార్థులు హింసాత్మకంగా తయారవుతారని, అందుకే వాటిని పాఠ్యాంశాల్లోంచి తొలగించామని వెల్లడించారు. పాఠ్య పుస్తకాల్లో మార్పులు, బాబ్రీ మసీదు కూల్చివేత, తరువాత మతపరమైన హింసకు సంబంధించిన అంశాల తొలగింపులపై శనివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. సమాజంలో విద్వేషాలను సృష్టించే విధంగా బోధనలు అవసరం లేదని, చిన్నపిల్లలకు అల్లర్ల గురించిన నేరి్పంచాల్సిన అవసరం లేదని, అది ఎందుకు జరిగిందో పెద్దయ్యాక వారే తెలుసుకుంటారని చెప్పారు. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కాషాయీకరణ చేశారనే ఆరోపణలను కొట్టి పారేశారు. రామజన్మభూమికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని పాఠ్యపుస్తకాల్లో ఎందుకు చేర్చకూడదని, పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించడం విద్యార్థులకు ఎందుకు తెలియకూడదని ఆయన ప్రశ్నించారు. చరిత్రను యుద్ధభూమిగా మార్చడానికి కాకుండా విద్యార్థులకు వాస్తవాలు తెలిసేలా బోధిస్తామన్నారు. పాఠ్యపుస్తకాల పునరి్వమర్శ ప్రపంచవ్యాప్తంగా జరిగే అభ్యాసమని, ఏది మార్చాలన్నది సబ్జెక్ట్, బోధనా శాస్త్ర నిపుణులే నిర్ణయిస్తారని, తాను ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో 2014 నుంచి ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు మార్పులు చేశారు. -
బాబ్రీమసీదు కూల్చివేత నేరస్తునికి భారతరత్నా?
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేతలో నేరస్తునిగా ఉన్న అడ్వాణీకి భారతరత్న ఇవ్వడంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మండిపడ్డారు. హైదరాబాద్ మగ్ధూంభవన్‌లో మూడు రోజులపాటు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, తీర్మానాలు తదితర అంశాలను ఆదివారం సీపీఐ జాతీయ కార్యదర్శులు రామకృష్ట పండా, కె.నారాయణ, సయ్యద్ అజీజ్, లోక్‌సభాపక్ష నేత బినాయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి రాజా మీడియా సమావేశంలో వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలుపొందితే దేశానికి విపత్తేనని, ఈ విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజా అన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసుకుని, బీజేపీని ఓడించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఆ ప్రభుత్వ పాలసీలను విమర్శించడం ప్రతిపక్ష హక్కు అని, కానీ మోదీ, బీజేపీ ప్రతిపక్షమే ఉండకూడదని భావిస్తోందని ఆరోపించారు. రానున్న లోక్ ఎన్నికలకు తాము సన్నద్ధమవుతున్నామని, ఇండియా కూటమి కామన్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తుందని, అదే సమయంలో తమ పార్టీ తరపున మేనిఫెస్టోను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమి నేతలు గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు ఉన్నప్పటికీ రాహుల్ ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే కేరళలో పోటీచేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీని ఓడించేందుకు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పనిచేస్తున్న నేపథ్యంలో కేరళలో రాహుల్ పోటీ చేయడం ఆరోగ్య వాతావరణం కాదన్నారు. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ జాతీయ సమితి ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్ కౌర్, డాక్టర్ బి.కె.కంగో, నాగేంద్రనాథ్ ఓజా, జాతీయ కార్యవర్గ సభ్యులు అనీరాజా, రాజ్యసభ సభ్యులు పి.సంతోష్ కుమార్‌లను ఈ కమిటీ సభ్యులుగా నియమించారు. -
‘అయోధ్య’ మసీదు నిర్మాణానికి తుది అనుమతులు
అయోధ్య: బాబ్రీ మసీదు– రామ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుమేరకు అయోధ్య జిల్లాలో రామమందిరానికి 22 కిలోమీటర్ల దూరంలో ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి సంబంధించిన తుది అనుమతులను అయోధ్య డివిజనల్ కమిషనర్ మంజూరుచేశారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అధీనంలోని ఐదెకరాల ఆ స్థలాన్ని ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్)కు బదిలీచేసే అంశం రెండేళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో మసీదు నిర్మాణం ఆలస్యమైంది. కొద్దిరోజుల్లో భూ బదిలీ పత్రాలను ఐఐసీఎఫ్‌కు అందిస్తామని అయోధ్య డివిజినల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ శనివారం చెప్పారు. ఏప్రిల్ 21న నిర్మాణపనుల ప్రారంభ తేదీని ఖరారుచేస్తామని ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ చెప్పారు. -
బాబ్రీ మసీదు పరిమాణంలోనే కొత్త మసీదు!
లక్నో: రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో కొత్తగా నిర్మించబోయే మసీదు, గతంలో ఉన్న బాబ్రీమసీదు కొలతలతోనే ఉంటుందని మసీదు నిర్మాణ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. బాబ్రీ మసీదు స్థానంలో నూతన మసీదు నిర్మాణానికి అయోధ్యలోని ధనిపూర్ గ్రామంలో ఐదు ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలో ఒక ఆస్పత్రి, మ్యూజియం కూడా కడతామని, మ్యూజియంకు ప్రముఖ విశ్రాంత అధ్యాపకుడు పుష్పేశ్ పంత్ క్యూరేటర్‌గా ఉంటారని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(ఐఐసీఎఫ్) సెక్రటరీ అతార్ హుస్సేన్ చెప్పారు. క్యూరేటర్ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆయన అంగీకరించారన్నారు. (చదవండి: సెప్టెంబర్ 17 నుంచి మందిర నిర్మాణం) ఇక ఐదెకరాల్లో జరిగే నూతన మసీదు నిర్మాణాన్ని ఐఐసీఎఫ్ పర్యవేక్షించనుంది. ఉత్తర్‌ప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్ ఈ ట్రస్ట్‌ను ఏర్పరించింది. ఐదెకరాల్లో దాదాపు 15వేల చదరపు అడుగుల్లో మసీదు నిర్మాణం జరుగుతుందని, ఇది బాబ్రీ మసీదు ఉన్న సైజులోనే ఉంటుందని, మిగిలిన స్థలంలో ఆస్పత్రి, మ్యూజియం తదితరాలుంటాయని హుస్సేన్ చెప్పారు. ఈ ప్రాజెక్టుకు జామియా మిలియా ఇస్లామియాకు చెందిన అక్తర్ వాస్తుశిల్పిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ మొత్తం నిర్మాణం భారతీయ ఆత్మను, ఇస్లాం సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటుందని అక్తర్ చెప్పారు. -
నటి స్వర భాస్కర్‌కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు, అయోధ్య భూ వివాద కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై కించపర్చే వ్యాఖ్యల చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు ఊరట లభించింది. ఆమెపై కోర్టు ధిక్కార చర్యకు సమ్మతి తెలిపేందుకు అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ ఆదివారం తిరస్కరించారు. ఈ ప్రకటన నేరపూరిత ధిక్కారం కాదు అని ఆయన పేర్కొన్నారు. స్వర భాస్కర్ వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టుపై ఎటువంటి అభ్యంతరకర వాఖ్య లేదని, సుప్రీం అధికారాన్ని తగ్గించే ప్రయత్నం జరగలేదని ఏజీ వెల్లడించారు. అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ‘ముంబై కలెక్టివ్’ నిర్వహించిన ప్యానెల్ చర్చలో స్వర భాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది సంస్థపైదాడిగా పేర్కొంటూ ఆమెపై క్రిమినల్ ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ న్యాయవాదులు మహేక్ మహేశ్వరి, అనుజ్ సక్సేనా, ప్రకాష్ శర్మలతో కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏజీ ప్రతికూలంగా స్పందించారు. కాగా ఒక వ్యక్తిపైన అయినా కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించాలంటే కోర్టు ధిక్కార చట్టం, 1971లోని సెక్షన్ 15 ప్రకారం అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ అనుమతి అవసరం. -
అయోధ్యపై విషం కక్కిన పాకిస్తాన్
కరాచీ: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై దాయాది దేశం పాకిస్తాన్ తన అక్కసు వెళ్లగక్కింది. బాబ్రీ మసీదు స్థలంలో రామాలయం నిర్మిస్తున్నారని విమర్శలకు దిగింది. ముస్లింలపై భారత్ వివక్ష చూపుతుందనడానికి ఇదే నిదర్శనమంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ బుధవారం రాత్రి వెలురించిన ప్రకటనలో భారత్ అంతర్గత అంశాలను ప్రస్తావించింది. మసీదు స్థానంలో రాముని గుడి నిర్మించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపింది. ప్రపంచం అంతా కోవిడ్‌తో సతమతమవుతోంటే ఆర్ఎస్ఎస్, బీజేపీలు మాత్రం హిందుత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు పోరాడుతున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. (తాత్కాలిక ఆలయంలోకి రాముని విగ్రహం) కాగా అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు గతేడాది నవంబర్‌లో తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ్ లల్లాకు అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును సైతం పాక్ తప్పుపట్టింది. న్యాయం ఓడిపోయిందని వ్యాఖ్యానించింది. బాబ్రీ మసీదు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరసత్వ సవరణ పట్టిక(ఎన్నార్సీ) అంశాలు.. భారత్‌లో ముస్లింలను అణిచివేస్తున్నారనడానికి నిదర్శనంగా మారాయంటూ విషం చిమ్మింది. ఈ అంశాలన్నీ తమ అంతర్గత విషయాలని భారత్ తిప్పి కొట్టింది. (అయోధ్యలో బయటపడ్డ దేవతా విగ్రహాలు) -
ఆ భూమి తీసుకుంటాం: సున్నీ వక్ఫ్‌బోర్డు
లక్నో: అయోధ్య జిల్లాలో మసీదు నిర్మాణం కోసం తమకు కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్లు సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు సోమవారం పేర్కొంది. ఈ స్థలంలో మసీదు నిర్మాణంతో పాటుగా.. ఇండో- ఇస్లామిక్ పరిశోధన సంస్థ, ఆస్పత్రి, గ్రంథాలయం నిర్మిస్తామని తెలిపింది. ఈ మేరకు త్వరలోనే మసీదు నిర్మాణానికై ట్రస్టు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు స్థలం కేటాయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని తాము స్వీకరిస్తున్నామని సున్నీవక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫరూఖీ సోమవారం తెలిపారు. బోర్డు సభ్యులతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘త్వరలోనే ట్రస్టు ఏర్పాటు చేస్తాం. మసీదుకు ఏ పేరు పెట్టాలన్న విషయాన్ని ట్రస్టు నిర్ణయిస్తుంది. బోర్డుతో ఆ విషయాలకు ఎటువంటి సంబంధం ఉండబోదు. మసీదుతో పాటు లైబ్రరీ, పరిశోధన సంస్థ, ఆస్పత్రి.. నిర్మించడంతో పాటుగా.. భూమిని అన్నిరకాలుగా వినియోగించుకుంటాం. స్థానికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మసీదు ఎంత విస్తీర్ణంలో నిర్మించాలో నిర్ణయిస్తారు’’అని పేర్కొన్నారు. కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.(రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్) -
సమాధులపై రామాలయం నిర్మిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో స్థానిక ముస్లిం ప్రతినిధులు ఆలయ ట్రస్ట్ చైర్మన్ పరశరన్‌కు ఓ లేఖ రాశారు. బాబ్రీ మసీదు నిర్మాణ ప్రాంతంలో ముస్లింల సమాధులు ఉన్నాయని, వాటిపై రామ మందిరాన్ని నిర్మించడం సనాతన ధర్మానికి విరుద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఆలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ట్రస్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ నగర ముస్లిం ప్రజలు ట్రస్టు అధిపతి పరశరన్‌కు ఫిబ్రవరి 15న లేఖ రాశారు. రామాలయ నిర్మాణం సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉందని ఆ లేఖలో ముస్లింలు ఆరోపించారు. ధ్వంసం చేయబడ్డ బాబ్రీ మసీదు ప్రాంతంలో ముస్లింల సమాధులు ఉన్నాయని, ఆ సమాధులపై రామాలయాన్ని నిర్మించడం హిందూ సనాతన ధర్మానికి విరుద్ధమని ముస్లిం తరఫు న్యాయవాది ఎంఆర్ శంషాద్ పేర్కొన్నారు. 1885లో జరిగిన అల్లర్లలో సుమారు 75 ముస్లింలు చనిపోయారని, వారి సమాధులు అక్కడే ఉన్నాయని ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లారు. బాబ్రీ మసీదు నిర్మించిన ప్రాంతాన్ని శ్మశానవాటికగా వాడారని, అలాంటి చోట రామాలయాన్ని ఎలా నిర్మిస్తారని ఆ లేఖలో ప్రశ్నించారు. ముస్లింల సమాధులపై రాముడి జన్మస్థాన ఆలయాన్ని నిర్మిస్తారా, ఇది హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తుందా? దీనిపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. మొత్తం 67 ఎకరాల భూమిని ఆలయ నిర్మాణం కోసం వాడుకోవడాన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నట్లు న్యాయవాది లేఖలో తెలిపారు. -
అయోధ్య తీర్పుపై 6 రివ్యూ పిటిషన్లు
న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) తరఫున ఆరుగురు వేర్వేరుగా తమ లాయర్ ఎంఆర్ శంషాద్ ద్వారా శుక్రవారం ఈ ఆరు పిటిషన్లు వేశారు. కాగా, అయోధ్యలో శుక్రవారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేశాయి. మసీదుల్లో ప్రార్థనలు, ఆలయాల్లో పూజలు ప్రశాంతంగా జరిగాయి. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పురస్కరించుకుని ముస్లిం సంస్థలు ఏటా డిసెంబర్ 6వ తేదీని బ్లాక్ డేగా వ్యవహరిస్తూండగా, హిందువులు శౌర్యదినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే. -
9లోగా ‘అయోధ్య’ రివ్యూ పిటిషన్
లక్నో: అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు– రామ జన్మభూమి కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డిసెంబర్ 9లోపు రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) బుధవారం ప్రకటించింది. సుప్రీంతీర్పును సమీక్షించబోమని సున్నీ వక్ఫ్ బోర్డు మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఏఐఎంపీఎల్బీ తాజాగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. నవంబరు 17న జరిగిన బోర్డు సమావేశంలోనే రివ్యూ పిటిషన్‌పై తీర్మానించామని, సమీక్ష కోరేందుకు తమకు డిసెంబరు 9వరకు సమయం ఉందని ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ తెలిపారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశమున్న ముస్లిం వర్గాలను అయోధ్య పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని, కేసుల్లో ఇరికించి జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని జలానీ ఆరోపించారు. అయోధ్య పోలీసుల తీరును పిటిషన్లో తాము సుప్రీంకోర్టుకు నివేదిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. మసీదు నిర్మాణానికి ప్రభుత్వమిచ్చే ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు నిరాకరిస్తే దాన్ని తమకు ఇవ్వాల్సిందిగా కోరతామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు బుధవారం తెలిపింది. అయితే ఆ స్థలాన్ని తాము మసీదు నిర్మాణానికి కాకుండా ఆసుపత్రిని నిర్మించేందుకు వినియోగిస్తామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ వసీమ్ రిజ్వీ తెలిపారు. అయోధ్య తీర్పుకు సంబంధించి రివ్యూ పిటిషన్ ముసాయిదా తయారైందని ప్రముఖ ముస్లిం సంస్థలు తెలిపాయి. డిసెంబరు 3 లేదా 4 తేదీల్లో జమాయత్ ఉలేమా ఏ హింద్ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. -
అయోధ్య’పై రివ్యూ పిటిషన్ వేస్తాం
అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూపిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమీయత్ ఉలేమా ఎ హింద్ ప్రకటించాయి. లక్నో/న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి– బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ), జమీయత్ ఉలేమా ఎ హింద్ ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ మాత్రం సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమన్నారు. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించాలని, మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో వేరే చోట సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌కు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ ఐదు ఎకరాల స్థలాన్ని స్వీకరించాలా? వద్దా? అనేది నవంబర్ 26న జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూఖీ తెలిపారు. మసీదు స్థలాన్ని వదులుకోవడం షరియా ప్రకారం సరికాదని ఏఐఎంపీఎల్బీ పేర్కొంది. ఏఐఎంపీఎల్బీ సమావేశం ఆదివారం లక్నోలో జరిగింది. మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలు ఇస్తామన్న ప్రతిపాదనను అంగీకరించబోమని సమావేశం అనంతరం ఏఐఎంపీఎల్బీ స్పష్టం చేసింది. ‘అది సరైన న్యాయం కాదు.. అలాగే, మాకు జరిగిన నష్టానికి పరిహారం కాబోదు’ అని స్పష్టం చేసింది. ‘ఈ కేసులో ఏఐఎంపీఎల్బీ పిటిషన్‌దారు కాదు. కానీ పిటిషన్‌దారులకు దిశానిర్దేశం చేస్తుంది. ముస్లింల తరఫు పిటిషన్‌దారుల్లో ఐదుగురు రివ్యూ వేసేందుకే మొగ్గు చూపారు’ అని ఏఐఎంపీఎల్బీ సభ్యుడు కమల్ ఫారూఖీ తెలిపారు. ‘మసీదు స్థలం అల్లాకు చెందుతుంది. షరియా ప్రకారం ఆ స్థలాన్ని ఎవరికీ ఇవ్వకూడదు’ అని ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పలు పరస్పర విరుద్ధ అంశాలున్నాయన్నారు. ఈ కేసులో తొలుత కేసు వేసినవారిలో ఒకరైన జమీయత్ సంస్థ ఉత్తరప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం సిద్దిఖీ కూడా సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. సాక్ష్యాలపైనో లేక హేతుబద్ధతపైననో ఆధారపడి తీర్పు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అయోధ్య కేసులో ముఖ్య పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీ మాత్రం రివ్యూ పిటిషన్ వేసే ఆలోచన లేదన్నారు. ముస్లిం వర్గాల వాదనలను, అందించిన సాక్ష్యాధారాలను అంగీకరించిన సుప్రీంకోర్టు.. తీర్పు మాత్రం హిందువులకు అనుకూలంగా ఇచ్చిందని జమీయత్ సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ అన్నారు. సమావేశానికి ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ -
తీర్పుపై సంతృప్తి లేదు!
సాక్షి, హైదరాబాద్: అయోధ్య–బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు అసంతృప్తి కలిగించిందని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం హైదరాబాద్ శాస్త్రీపురంలోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. బాబ్రీ మసీదుపై సున్నీ వక్ఫ్ బోర్డు న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించారన్నారు. తమ పోరాటం న్యాయమైన, చట్టపరమైన హక్కుల కోసమేనని, ఐదెకరాల భూమి కేటాయింపు అక్కర్లేదని, మసీదుపై రాజీపడే సమస్యే లేదని స్పష్టంచేశారు. ‘‘బాబ్రీ మసీదుకు ఐదువందల సంవత్సరాల చరిత్ర ఉంది. భవిష్యత్తు తరాలకు సైతం బాబ్రీ మసీదు అక్కడ ఉండేదని మేం చెబుతాం. 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదును కూల్చివేసిన వారినే... ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించమని సుప్రీంకోర్టు చెబుతోంది. ఒకవేళ బాబ్రీ మసీదు కూల్చివేతకు గురి కాకుంటే తీర్పు ఏం వచ్చేది?. దేశంలో అనేక ఇతర మసీదులు ఉన్నాయని, వీటిపై కూడా సంఘ్ పరివార్ దావా వేసింది. ఆ సందర్భాల్లో కూడా ఈ తీర్పును ఉదహరిస్తారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం అయోధ్య నుంచి ప్రారంభమవుతోందని దుయ్య బట్టారు. రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, హక్కుల కోసం చివరిదాకా పోరాడతామని పేర్కొన్నారు. తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ వైఖరి ప్రకారం నడుచుకుంటామన్నారు. ‘సుప్రీంకోర్టు సుప్రీం. దాని తీర్పు ఫైనల్. కాకపోతే అన్నివేళలా అది కరెక్టేనని అనుకోలేం’ అన్నారాయన. అయోధ్య వివాదంలో కాంగ్రెస్ తీరును కూడా అసద్ తప్పుబట్టారు. ఆ పార్టీ వల్లే బాబ్రీ మసీదు చేజారిందని, ఆ పార్టీ నిజమైన రంగును బహిర్గతం చేసిందని విమర్శించారు. -
9 గంటల్లోనే అంతా..
న్యూఢిల్లీ: వేలల్లో పోలీసులు పహారా కాశారు. కానీ లక్షల్లో కరసేవకులు చొచ్చుకొచ్చారు. కొద్ది గంటల్లోనే బాబ్రీ మసీదు నేలమట్టమైంది. 1992, డిసెంబర్ 6న ఐదు వేల మంది కరసేవకులు ఒక్క సారిగా బాబ్రీ మసీదులోకి చొచ్చుకురావడంతో భద్రతా దళాలు చేతులెత్తేశాయట! ఆ సమయంలో అయోధ్యలో 35 కంపెనీల పీఏసీ పోలీసు బలగాలు, 195 కంపెనీల పారామిలటరీ దళాలు, నాలుగు కంపెనీలు సీఆర్పీఎఫ్, 15 బాష్ప వాయువు బృందాలు, 15 మంది పోలీసు ఇన్స్పె క్టర్లు, 30 మంది పోలీసు సబ్ ఇన్స్పెక్టర్లు, 2,300 మంది పోలీసు కానిస్టేబుళ్లు మోహరించి ఉన్నారు. అయినప్పటికీ కరసేవకుల్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని లిబర్హాన్ కమిషన్ నివేదిం చింది. రామ జన్మభూమి–బాబ్రీ మసీదును కూల్చివేసే సమయంలో దాదాపు 75 వేల నుంచి లక్షన్నర మంది కరసేవకులు ఆ ప్రాంతంలో ఉన్నారని పేర్కొంది. లిబర్హాన్ నివేదిక ప్రకారం ఆ రోజు ఏం జరిగిందంటే... ఉదయం 10:30 ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్జోషి వంటి సీనియర్ బీజేపీ నేతలు, వీహెచ్‌పీ నేతలు, సాధువులు కరసేవ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ 20 నిమిషాల సేపు గడిపి మత ప్రబోధకులు ఉపన్యాసం చేస్తున్న రామ్ కథ కుంజ్‌కి చేరారు. ఉదయం 11:45 ఫరీదాబాద్ డీఎం, ఎస్ఎస్పీ రామ జన్మభూమి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యాహ్నం 12:00 ఓ టీనేజీ యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకొని మసీదు గుమ్మటంపైకి ఎక్కాడు. అతనితో పాటు మరో 150 మంది కరసేవకులు, ఒక్కసారిగా మసీదుని చుట్టుముట్టేశారు. మధ్యాహ్నం 12:15 దాదాపు 5 వేల మంది వివాదాస్పద కట్టడంపైకి ఎక్కి కొడవళ్లు, సుత్తులు, రాడ్లతో కూల్చివేతకు దిగారు. అద్వానీ, జోషి, అశోక్ సింఘాల్ వంటి నాయకులు బయటకు వచ్చేయమని చెబుతున్నా వినలేదు. మధ్యాహ్నం 12:45 మసీదు దగ్గరకి వెళ్లడంలో పారామిలటరీ విఫలమైంది. విధ్వంసం జరుగుతున్నా బలగాలు నియంత్రించలేకపోయాయి. రాష్ట్ర పోలీసులు, ప్రావిన్షియల్ ఆర్మ్డ్ బలగాలు ఏ చర్యలూ తీసుకోలేకపోయాయి. మధ్యాహ్నం 1:55 కరసేవకులు మొదటి గుమ్మటాన్ని కూల్చేశారు. మధ్యాహ్నం 3:30 అయోధ్యలో మత ఘర్షణలు చెలరేగాయి సాయంత్రం 5:00 కట్టడం పూర్తిగా కుప్పకూలిపోయింది. సాయంత్రం 6:30 7:00 కేంద్ర కేబినెట్ సమావేశమై యూపీలో రాష్ట్రపతి పాలన విధించింది. సీఎం కల్యాణ్‌సింగ్ రాజీనామా చేశారు. రాత్రి 7:30 విగ్రహాలను యథాతథంగా వాటి స్థానంలో ఉంచారు. తాత్కాలిక రామాలయ నిర్మాణం ప్రారంభించారు. సుప్రీం అధికారాన్ని ఉపయోగించిన కోర్టు అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పునిస్తూ.. ఆర్టికల్ 142 ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని వినియోగించుకుంది. ఆలయ నిర్మాణానికి కేంద్రం ఏర్పాటు చేసే ట్రస్టులో నిర్మోహి అఖాడకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని ఈ అధికరణం ద్వారా సూచించింది. ఈ కేసులో కొన్ని పరిధుల నేపథ్యంలో నిర్మోహి అఖాడా పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చినా.. ఆర్టికల్ 142ను ఉపయోగించి అఖాడాకు ట్రస్ట్‌లో ప్రాతినిధ్యం కల్పించాలంది. ఈ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు విశేష అధికారం ఉంటుంది. ఈ ఆర్టికల్ ప్రయోగం ద్వారా ఒక్కోసారి పార్లమెంట్ చట్టాల్ని కూడా పక్కనపెట్టే అధికారం కోర్టుకు ఉంది. తన ముందు పెండింగ్‌లో ఉన్న ఏదైనా కేసులో పూర్తి న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు తన అధికారాన్ని ఉపయోగించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసే అధికారం ఆర్టికల్ 142 కల్పిస్తుంది. గతంలోనూ పలు కేసుల్లో.. 1989 భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు ఉపశమనం కోసం ఈ ఆర్టికల్‌ను ఉపయోగించారు. బాధితులకు రూ.3,337 కోట్ల పరిహారం చెల్లించాలని యూనియన్ కార్బైడ్‌ను అప్పట్లో కోర్టు ఆదేశించింది. ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి.. 1993 నుంచి కేంద్రం చేసిన బొగ్గు గనుల కేటాయింపును 2014లో సుప్రీం రద్దు చేసింది. ఈ అధికరణం మేరకు డిసెంబర్ 2016లో తీర్పునిస్తూ.. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండకూడదని ఆదేశించింది. -
అది.. రాముడి జన్మస్థలమే!
న్యూఢిల్లీ: ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రధానంగా దీన్ని మత విశ్వాసాలకు సంబంధించిన వ్యాజ్యంగా కాకుండా... స్థలానికి సంబంధించిన టైటిల్ వివాధంగానే భావించింది. తమ ముందున్న సాక్ష్యాధారాలను అనుసరించి తీర్పునిచ్చింది. వీరితో ఏకీభవిస్తూనే...ఈ ఐదుగురిలో ఒక న్యాయమూర్తి మాత్రం దీన్ని హిందువుల మత విశ్వాసాలకు సంబంధించిన అంశంగా కూడా పేర్కొన్నారు. మొత్తం 1045 పేజీల తీర్పులో ఈ రెండో అభిప్రాయాన్ని దాదాపు 116 పేజీల్లో వెలువరించారు. దీన్లో ప్రధానంగా ఆయన తన ముందున్న సాక్ష్యాధారాలను మూడు కాలాలకు చెందినవిగా విభజించారు. దాని ప్రకారం మొదటిది... పురాణ కాలం. రెండోది మసీదు నిర్మించిన క్రీ.శ. 1528 నుంచి 1858 మధ్యకాలంగా పేర్కొన్నారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు కౌసల్యకు జన్మించారని రామాయణంలో చెప్పారు తప్ప ఎక్కడ జన్మించాడనేది చెప్పలేదని... కానీ రామాయణంతో దాదాపు సమానంగా భావించే రామ్చరిత్ మానస్ (1574)లో రాముడు ఈశాన్యంలో పుట్టాడనే అంశం ఉందని ఆయన పేర్కొన్నారు. స్కంధ పురాణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దాంతో పాటు తాను విచారించిన సాక్షుల్లో సిక్కు చరిత్రపై అధ్యయనం చేసినవారు... క్రీ.శ.1510 సమయంలో గురునానక్ అయోధ్యలో రామ మందిరాన్ని సందర్శించినట్లు చెప్పారని గుర్తుచేశారు. వీటన్నిటినీ బట్టి 1528లో బాబ్రీ మసీదు నిర్మించక ముందే అక్కడ నిర్మాణం ఉందనేది ధ్రువపడుతోందని ఆయన పేర్కొన్నారు. ‘‘పురాణ కాలం నుంచి ఇప్పటిదాకా జరిగిన సంఘటనల క్రమాన్ని చూస్తే మనం ఒకటి స్పష్టంగా గుర్తించవచ్చు. శ్రీ రాముడి పుట్టిన స్థలం మసీదులోని మూడు డోమ్‌ల నిర్మాణానికి అడుగున ఉందనేది హిందువుల విశ్వాసం. జన్మస్థానం మీదనే మసీదును నిర్మించారనేది వారి నమ్మకం. ప్రహరీలోపలి మసీదు ఆవరణను రెండు భాగాలుగా విభజిస్తూ బిట్రీష్ కాలంలోనే గ్రిల్స్‌తో గోడ నిర్మించారు. గ్రిల్స్‌తో నిర్మించిన ఆ ఇనుప గోడ హిందువులను మూడు డోమ్‌ల నిర్మాణంలోకి వెళ్లకుండా నిరోధించింది. బ్రిటిష్ వారి అనుమతితో అప్పటి నుంచే వెలుపలున్న రామ్ ఛబుత్రాలో పూజలు ఆరంభమయ్యాయి. ఆ ఛబుత్రా వద్ద ఆలయం నిర్మించుకోవటానికి అనుమతివ్వాలంటూ 1885లో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అయితే ఇక్కడొకటి గమనించాలి. మసీదు ఆవరణను విభజించి, హిందువులను మూడు డోమ్‌ల నిర్మాణానికి వెలుపల ఉంచినా... అది శ్రీరాముడి జన్మ స్థలమన్న వారి నమ్మకాన్ని మార్చుకోవాలని మాత్రం ఎవరూ చెప్పలేదు. శ్రీరాముడు ఆ అవరణలోనే జన్మించాడన్న విశ్వాసం వల్లే... దానికి సూచనగా అక్కడ ఛబుత్రాలో హిందువులు పూజలు చేస్తున్నారని భావించాలి. ముక్తాయింపు ఏమిటంటే... రాముడి జన్మస్థానంపైనే మసీదు నిర్మించారన్నది హిందువుల విశ్వాసం, నమ్మకం. పురాణకాలం నుంచి జరిగిన పరిణామాలు, ఆ తరవాతి కాలంలో దొరికిన మౌఖిక, లిఖితపూర్వక, చారిత్రక ఆధారాలు... ఇవన్నీ ఆ నమ్మకాన్ని ధ్రువపరుస్తున్నాయి’’అని తన తీర్పులో ఆయన పేర్కొన్నారు. 1850వ సంవత్సరం తరవాత లభ్యమైన ఆధారాలను ప్రస్తావిస్తూ... ► 1858లో అవధ్ థానేదార్ శీతల్ దూబే ఇచ్చిన నివేదికలో మసీదును మాస్క్ జన్మస్థా న్ అని పేర్కొన్నారు. అంటే ఇక్కడ మసీదు మాత్రమే కాక జన్మస్థానం ఉందని ధ్రువపరిచారు. దీన్నొక ఆధారంగా భావించవచ్చు. ► 1878లో ఫైజాబాద్ తాలూకా స్కెచ్‌ను నాటి అయోధ్య సెటిల్మెంట్ అధికారి కార్నెగీ రూపొందించారు. ఆ స్కెచ్‌లో ముస్లింలకు మక్కా, యూదులకు జెరూసలేం ఎలాగో హిందువులకు అయోధ్య అలాంటిదన్నారు. జన్మస్థాన్‌లో 1528లో బాబరు మసీదును నిర్మించినట్లు కార్నెగీ పేర్కొన్నారు. ► 1877లో ప్రచురించిన మరో అవధ్ గెజిటీర్లో హిందూ – ముస్లిం విభేదాలను సవివరంగా ప్రస్తావించారు. ► 1880లో ఎ.ఎఫ్.మిల్లిట్ ’ఫైజాబాద్ లాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ రిపోర్ట్’లో కూడా దీన్ని ప్రస్తావించారు. ► 1889లో నార్త్‌వెస్ట్ అవధ్‌కు చెందిన అర్కియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన నివేదికలో జన్మస్థానంలో అద్భుతమైన పురాతన ఆలయం ఉండేదని, దాని స్థంభాలను ముస్లింలు తమ నిర్మాణంలో కూడా వాడారని పేర్కొంది. -
అయోధ్యలో ఆంక్షలు
అయోధ్య/న్యూఢిల్లీ: రామమందిరం–బాబ్రీ మసీదుపై నవంబర్ 17లోగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అయోధ్యలో పలు ఆంక్షలు విధించింది. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరగకుండా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈవిషయంలో ఎలక్ట్రానిక్ మీడియాలోనూ చర్చలు జరపకుండా ఆంక్షలు విధించనున్నారు. డిసెంబర్ 28 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ కాలంలో అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేస్తామని తెలిపింది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలలో అసత్యాల ప్రచారం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, తీర్పు వెలువడిన రోజు దేవతా విగ్రహాల ప్రతిష్టాపన, విజయోత్సవ ఊరేగింపులు జరపకుండా నిషేధం విధించారు. రాళ్లు సేకరించడం, కిరోసిన్, యాసిడ్ అమ్మకాలు కూడా నిలిపివేశారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ అధికారుల, పోలీసుల సెలవులను యూపీ ప్రభుత్వం రద్దుచేసింది. -
అయోధ్య వాదనలు పూర్తి
న్యూఢిల్లీ: వివాదాస్పద అయోధ్యలోని రామజన్మభూమి– బాబ్రీమసీదు స్థల యాజమాన్య హక్కులకు సంబంధించిన కేసు విచారణ సుప్రీంకోర్టులో బుధవారంతో ముగిసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు గత 40 రోజులుగా వరుసగా ఈ కేసులో హిందు, ముస్లిం వర్గాల తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. ‘ఇంక చాలు’ అంటూ బుధవారం సాయంత్రం జస్టిస్ గొగొయ్ తుది వాదనలు వినడం ముగించారు. తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. అయితే, రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో తీర్పును జస్టిస్ గొగొయ్ పదవీ విరమణ చేయనున్న నవంబర్ 17లోపు ప్రకటించే అవకాశముంది. మధ్యవర్తిత్వం ద్వారా సామరస్య పూర్వక పరిష్కారం కనుగొనడంలో హిందూ, ముస్లిం వర్గాలు విఫలమైన నేపథ్యంలో ఈ ఆగస్ట్ 6వ తేదీ నుంచి జస్టిస్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. 1950లో ఏర్పడినప్పటి నుంచి సుప్రీంకోర్టు చరిత్రలో ఎక్కువ కాలం కొనసాగిన కేసు విచారణల్లో ఇది రెండోది కావడం విశేషం. మొదటి కేసు 1973 నాటి చరిత్రాత్మక కేశవానంద భారతి కేసు. రాజ్యాంగ మౌలిక స్వరూప నిర్ధారణకు సంబంధించిన ఆ కేసు విచారణ 68 రోజులు కొనసాగింది. ఆధార్ రాజ్యాంగబద్ధతకు సంబంధించిన కేసు విచారణ 38 రోజులు జరిగింది. విచారణ సందర్భంగా హైడ్రామా విచారణ చివరి రోజు కోర్టులో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరి రోజు హిందూ, ముస్లిం వర్గాల తరఫు న్యాయవాదులు ఆవేశంగా తమ వాదనలు వినిపించారు. హిందూ మహాసభ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు అందించిన రామజన్మభూమి మ్యాప్‌ను కోర్టుహాళ్లోనే ముస్లింల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ చించేయడంతో వాతావరణం కొంత సీరియస్‌గా మారింది. బాబ్రీమసీదు గుమ్మటం(1992లో కూల్చివేతకు గురైన డోమ్) కింది భాగమే నిజానికి రాముడి జన్మస్థలం అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఒక మ్యాప్‌ను, భారతీయ, విదేశీ రచయితలు రాసిన కొన్ని పుస్తకాలను సాక్ష్యాధారాలుగా అఖిల భారత హిందూ మహాసభలోని ఒక వర్గం తరఫు న్యాయవాది వికాస్ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వీటినేం చేసుకోవాలంటూ ధర్మాసనాన్ని ప్రశ్నించారు. దానికి జస్టిస్ రంజన్ గొగొయ్.. ‘కావాలనుకుంటే ముక్కలుగా చింపేసుకోవచ్చు’ అని సమాధానమిచ్చారు. అప్పటికే వికాస్‌సింగ్ వాదనతో తీవ్రంగా విబేధించి ఉన్న ముస్లిం వర్గాల తరఫు లాయర్ రాజీవ్ ధావన్.. సీజేఐ మాటతో.. సీజేఐ అనుమతి తీసుకుని తన దగ్గరున్న ఆ మ్యాప్‌ను అక్కడే ముక్కలుగా చింపేశారు. అయితే, ఆ ఘట్టం అక్కడితో ముగియలేదు. లంచ్ బ్రేక్ తరువాత.. తాను ఆ మ్యాప్‌ను చింపేసిన విషయం వైరల్‌గా మారిందని ధర్మాసనం దృష్టికి రాజీవ్ ధావన్ తీసుకువచ్చారు. ‘నేనే కావాలని ఆ మ్యాప్‌ను చింపేశాననే ప్రచారం జరుగుతోంది’ అని చెప్పారు. ‘మీ అనుమతితోనే నేను ఆ పని చేశానన్న విషయం మీరు స్పష్టం చేయాల్సి ఉంది’ అని సీజేఐని కోరారు. ‘ఆ పేపర్లను చించే ముందు మీ అనుమతి కోరాను. అవసరం లేకపోతే చించేయండి అని మీరు చెప్పారు’ అని సీజేఐకి ధావన్ గుర్తుచేశారు. దానికి సీజేఐ.. ‘మీరు చెప్పేది కరెక్టే.. ప్రధాన న్యాయమూర్తి అనుమతితోనే ఆ మ్యాప్‌ను రాజీవ్ ధావన్ చించేశారనే వివరణ కూడా ప్రచారం కావాలి’ అని స్పష్టం చేశారు. మరోసారి మధ్యవర్తిత్వ అంశం చివరి రోజు విచారణ సందర్భంగా.. సమస్య పరిష్కారం కోసం మరోసారి మధ్యవర్తిత్వ అంశాన్ని పరిశీలించాలన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. గతంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎమ్ఐ కలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్, ప్రముఖ మధ్యవర్తి శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉన్న మధ్యవర్తిత్వ కమిటీ అయోధ్య వివాదానికి ఒక సామరస్యపూర్వక పరిష్కారం కోసం విఫలయత్నం చేసింది. ఆ కమిటీ కూడా తమ రిపోర్ట్‌ను బుధవారం సీల్డ్కవర్లో కోర్టుకు సమర్పించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చిన అనంతరం.. ఆ తీర్పును నిరసిస్తూ సుప్రీంకోర్టులో 14 వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. -
వివాదాస్పద స్థలంలో భారీ ఆలయం!
న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో బాబ్రీమసీదు నిర్మాణం కన్నా ముందు ఒక భారీ హిందూ దేవాలయం విలసిల్లిందని రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు న్యాయవాది శుక్రవారం సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఆ దేవాలయం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినదన్నారు. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థల వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతీరోజు విచారిస్తుండటం తెల్సిందే. ప్రస్తుత వివాదాస్పద ప్రాంతాన్ని 1950లో పరిశీలించిన కోర్టు కమిషనర్ నివేదికను, పురాతత్వ శాఖ నిర్ధారించిన అంశాలను తన వాదనకు సమర్ధనగా రామ్‌లల్లా తరఫు లాయర్ వైద్యనాథన్ కోర్టుకు చూపించారు. మండపంతో కూడిన పెద్ద దేవాలయం ఉందని పురాతత్వ శాఖ నిర్ధారించిందన్నారు. అది రామాలయమే అనేందుకు స్పష్టమైన సాక్ష్యాలేవీ లేవన్నారు. శివుడితో సహా పలువురి దేవుళ్ల చిత్రాలు అక్కడి గరుడ స్తంభాలపై చెక్కి ఉన్నాయని, అలాంటివి మసీదులపై ఉండవని ఆయన వాదించారు. ‘బాబ్రీమసీదు నిర్మాణానికి ముందు అక్కడ నిర్మాణం ఉందనే విషయం మాకు ముఖ్యం కాదు.. అది దేవాలయమా? కాదా? అన్నదే ముఖ్యం’ అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అక్కడ ఒక సమాధి కూడా ఉంది కదా! దానిపై ఏమంటారు?’ అని వైద్యనాథన్‌ను ప్రశ్నించింది. దాంతో, ‘ఆ సమాధి దేవాలయ అనంతర కాలానికి సంబంధించినద’ని ఆయన సమాధానమిచ్చారు. తవ్వకాల్లో పై భాగంలో సమాధి ఆనవాళ్లు ఉన్నాయని, అవి తవ్వకాల్లోని లోతైన భాగాల్లో లేవని వివరించారు. -
రాముడి వారసులున్నారా?
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం–బాబ్రీమసీదు భూ వివాదం కేసు రోజువారీ విచారణలో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీరాముడి సంతతికి చెందిన రఘువంశం వారు అయోధ్యలో ఎవరైనా ఉన్నారా? అని రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు న్యాయవాది పరాశరన్‌ను ప్రశ్నించింది. శ్రీరాముడికి, ఆయన జన్మస్థలానికి చట్టబద్ధత ఉందనీ, కాబట్టి ఆయన పేరుపై ఆస్తులు ఉండొచ్చనీ, పిటిషన్లు దాఖలు చేయొచ్చని పరాశరన్ వాదించారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం స్పందిస్తూ..‘మేం ఉత్సుకతతోనే అడుగుతున్నాం. రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇంకా అయోధ్యలోనే నివాసం ఉంటున్నారా?’ అని అడిగింది. దీంతో పరాశరన్ స్పందిస్తూ..‘దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వివరాలను మీ ముందు ఉంచుతాం’ అని జవాబిచ్చారు. జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్నవ్యక్తిగా ఎలా పరిగణిస్తారని కోర్టు ప్రశ్నించడంతో..‘ కేదర్నాథ్ ఆలయాన్నే తీసుకుంటే, అక్కడ ఎలాంటి విగ్రహం లేకపోయినా ప్రజలు పూజలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ కేసులో జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్న వ్యక్తిగా పరిగణించవచ్చు’ అని పరాశరన్ తెలిపారు. రోజువారీ విచారణ సాగుతుంది అయోధ్య భూ వివాదం కేసులో ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు రోజువారీ విచారణ చేపట్టడంపై సున్నీ వక్ఫ్ బోర్డు, ఇతర ముస్లిం పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ వ్యతిరేకించారు. ఇంతవేగంగా విచారణ జరపడం వల్ల సంబంధిత పత్రాలను అధ్యయనం చేసి విచారణకు సిద్ధం కావడం కష్టంగా ఉందని కోర్టుకు విన్నవించారు. -
అయోధ్యపై సత్వర విచారణ చేపట్టాలి
న్యూఢిల్లీ: అయోధ్య వివాద పరిష్కారం మధ్యవర్తిత్వంతోనూ పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదని, వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షిదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ ఈ మేరకు వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్వీకరించింది. ప్రాముఖ్యమున్న వివాదానికి సామరస్య పూర్వక పరిష్కారం కనుగొనే దిశగా ఎటువంటి అడుగులు పడలేదని విశారద్ తరఫున న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్‌పై సత్వరం విచారణ చేపట్టాలన్న ఆయన వినతిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. అయోధ్య సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్.ఎం.ఐ. కలీఫుల్లా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి ఆగస్టు 15వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మే 10న ఉత్తర్వులిచ్చింది. -
‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం
న్యూఢిల్లీ/చెన్నై/బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దశాబ్దాలుగా నలుగుతున్న రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కోర్టు నియమించింది. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిగా మంచి పేరు గడించిన శ్రీరామ్ పంచు ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు. మరో వారంలో మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించి 8 వారాల్లో ముగించాలని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. అయోధ్యకు 7 కిలో మీటర్ల దూరంలోని ఫైజాబాద్‌లో మధ్యవర్తిత్వ చర్చలు జరుగుతాయనీ, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చూడాలని యూపీ సర్కార్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఈ చర్చలన్నీ చాలా రహస్యంగా జరుగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. చర్చలకు సంబంధించిన వివరాలు పత్రికల్లో, టీవీల్లో రాకూడదని తాము కోరుకుంటున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అవసరమనుకుంటే ఈ మధ్యవర్తిత్వ చర్చలపై వార్తలను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా పత్రికలు, టీవీ చానళ్లను నిలువరించేలా ఆదేశాలు ఇచ్చేందుకు జస్టిస్ కలీఫుల్లాకు కోర్టు అధికారం కల్పించింది. పురోగతిపై నాలుగు వారాల్లో నివేదిక.. మధ్యవర్తిత్వ చర్చలు ప్రారంభించిన తర్వాత వాటిలో ఎంత వరకు పురోగతి వచ్చిందో తెలుపుతూ చర్చలు మొదలు పెట్టిన నాలుగు వారాల్లో ఓ నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతించడంలో న్యాయపరమైన చిక్కులేమీ తమకు కనిపించలేదని పేర్కొంది. ‘మధ్యవర్తులుగా ఎవరు ఉండాలన్న దానిపై ఈ కేసులో భాగస్వామ్య పక్షాలు ఇచ్చిన సిఫారసులను మేం పరిశీలించాం. త్రిసభ్య కమిటీని నియమించాలని నిర్ణయించాం. అవసరమనుకుంటే మరికొందరిని ఈ కమిటీలో భాగం చేసుకునేందుకు ప్రస్తుత మధ్యవర్తులకు స్వేచ్ఛనిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం ప్రతిపాదన వచ్చినప్పుడు ముస్లిం సంస్థలు దానిని సమర్థించగా, నిర్మోహి అఖాడా మినహా మిగిలిన హిందూ సంస్థలన్నీ వ్యతిరేకించాయి. అయితే మధ్యవర్తులుగా ఎవరు ఉండాలన్న దానిపై హిందూ సంస్థలు కూడా పేర్లను సిఫారసు చేశాయి. కాగా, చర్చల సమయంలో వివిధ భాగస్వామ్య పక్షాలు తెలిపే అభిప్రాయాలను అత్యంత రహస్యంగా ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో ఏమైన సమస్యలు ఎదురైనా మధ్యవర్తిత్వ కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి తెలియజేయవచ్చనీ, ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి ఏం కావాలో అడగొచ్చని కూడా న్యాయమూర్తులు తెలిపారు. అయోధ్యలో వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని నిర్మోహి అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డ్‌లకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. ఇక మధ్యవర్తిత్వంలో ఈ కేసు ఎంత వరకు తేలుతుందో వేచి చూడాల్సిందే. ఆలయ నిర్మాణం జరగాల్సిందే: బీజేపీ అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయాన్ని తాము గౌరవిస్తామనీ, అయితే రామాలయ నిర్మాణం ఒక్కటే ఈ కేసుకు పరిష్కారమని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ ‘అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మేం కట్టుబడి ఉన్నాం. మసీదును ఆలయానికి దూరంగా ఎక్కడైనా కట్టుకోవచ్చు’ అని అన్నారు. ‘సమస్యను పరిష్కరించడం ముఖ్యమే. కానీ శ్రీరామ జన్మభూమి వద్ద గుడి కట్టడం మరింత ముఖ్యం. ఎక్కువ కాలం ఈ విషయాన్ని నాన్చడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు పేర్కొన్నారు. పిటిషన్‌దారుల్లో ఒకరైన సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ ఆలయ నిర్మాణం జరగకపోవడం అన్న ప్రశ్నే లేదనీ, వీలైనంత త్వరలో గుడి కట్టాలని బీజేపీ పట్టుదలతో ఉందని చెప్పారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాం: కాంగ్రెస్ అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తెలిపింది. కేసు పరిష్కారానికి ఇదే చివరి ప్రయత్నం కావాలనీ, అన్ని పార్టీలు ఈ మధ్యవర్తిత్వంలో వచ్చే ఫలితానికి కట్టుబడి ఉండాలని ఆకాంక్షించింది. మతాలకు సంబంధించిన అంశాన్ని బీజేపీ గత 27 సంవత్సరాలుగా రాజకీయాలకు వాడుకుంటోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఈ వివాదాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ 1992 నుంచి ప్రతీ ఎన్నికలోనూ లబ్ధి పొందుతోందనీ, ఎన్నికలు పూర్తవ్వగానే ఆ అంశాన్ని మరుగున పడేస్తోందని ఆయన మండిపడ్డారు. రవిశంకర్‌కు చోటు విచారకరం మధ్యవర్తిత్వం చేసే త్రిసభ్య కమిటీలో రవిశంకర్‌కు చోటు కల్పించడం విచారకరమని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన తటస్థ వ్యక్తి కాదనీ, గతంలో ఈ అంశంపై రవిశంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. ‘వివాదాస్పద స్థలంపై ముస్లింలు మొండిపట్టు పడితే ఇండియా కూడా సిరియాలా తయారవుతుందని రవిశంకర్ 2018 నవంబర్ 4న వ్యాఖ్యానించారు. ఆయన ఏ పక్షం తరఫున ఉన్నారో గతంలోనే చెప్పారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు మధ్యవర్తిగా పెట్టడం విచారకరం’ అని ఒవైసీ అన్నారు. అయితే ఈ కేసులో మధ్యవర్తిత్వాన్ని అనుమతించాలన్న కోర్టు నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని చెప్పారు. మధ్యవర్తులు ఎవరంటే.. జస్టిస్ కలీఫుల్లా గతంలో ప్రఖ్యాత లాయర్‌గా పేరొందిన ఈయన 2016లో సుప్రీంకోర్టు జడ్జిగా 2016లో రిటైర్‌అయ్యారు. 2000 సంవత్సరంలో మద్రాసు హైకోర్టుకి శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. కశ్మీర్ హైకోర్టు సీజేగానూ చేశారు. 2012లో ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. పదవిలో ఉండగా ఎన్నో చరిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ (బీసీసీఐ)లో సంస్కరణల తీర్పు ప్రముఖమైనది. భారతీయ యూనివర్సిటీల్లో జాతకశాస్త్రంపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించే కోర్సులు ప్రవేశపెట్టడాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పారు. శ్రీశ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రపంచవ్యాప్తంగా అనుచరులున్నారు. అయోధ్య సమస్య పరిష్కారానికి ఆయన 25 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఎన్నో హిందూ, ముస్లిం సంఘాలతో మాట్లాడారు. 2017 సంవత్సరంలో ఆయన అయోధ్యలో పర్యటించి వివిధ వర్గాలతో, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. సంక్షోభాలు నెలకొన్న దేశాల్లో ఆయన శాంతి స్థాపన కోసం అంబాసిడర్‌గా పనిచేశారు. కొలంబియా, ఇరాక్, ఐవరీకోస్ట్, బిహార్‌ల్లో వివాదాల పరిష్కారానికి ఇరుపక్షాలను ఒక్క చోటికి చేర్చి నేర్పుగా సంప్రదింపులు జరపడం ఆయనకు ఎనలేని పేరు తెచ్చింది. శ్రీరామ్ పంచు సీనియర్ న్యాయవాది అయిన శ్రీరామ్ పంచు మధ్యవర్తిత్వానికి మారుపేరు. భారత న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వం అనే ప్రక్రియను ప్రవేశపెట్టింది ఆయనే. 2005లో తొలిసారిగా భారత్‌లో కోర్టు వ్యవహారాలకు సంబంధించి మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభించారు. అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాల మధ్య 500 చదరపు కిలోమీటర్లకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి శ్రీరామ్ పంచుని సుప్రీంకోర్టు మధ్యవర్తిగా నియమించింది. దేశంలో అత్యంత కీలకంగా వ్యవహరించే మధ్యవర్తుల్లో శ్రీరామ్ పంచు ఒకరిగా గుర్తింపు పొందారు. బోర్డు ఆఫ్ ఇంటర్నేషనల్ మీడియేషన్ ఇనిస్టిట్యూషన్‌కు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ కలీఫుల్లా, శ్రీశ్రీరవిశంకర్, శ్రీరామ్ పంచు -
అయోధ్యపై రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామమందిరం–బాబ్రీమసీదు భూవివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విచారించేందుకు సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లతో ఐదుగురు సభ్యులతో కొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం 2019, జనవరి 29 నుంచి ఈ కేసును విచారించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అన్ని పక్షాలకు నోటీసులు జారీచేసింది. 2010లో ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు, నిర్మోహి అఖారాకు, రామ్ లల్లాకు సమానంగా పంచాలని తీర్పు వెలువరించడం తెల్సిందే. -
అయోధ్యపై 4న సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: అయోధ్య అంశం జనవరి 4వ తేదీన సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం ఈ అంశంలో దాఖలైన పిటిషన్ల విచారణకు ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది. రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాద ప్రాంతంపై దాఖలైన 14 పిటిషన్లపై విచారణ తేదీలను ఈ ధర్మాసనం ఖరారు చేయనుంది. వివాదాస్పద ప్రాంతంలోని 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్ లల్లా సంస్థలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆధార్ తీర్పుపై రివ్యూ పిటిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ చట్టం చెల్లుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని ఇంతియాజ్ అలీ పల్సనియా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. పౌరుల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు అందించే సాధనంగా ఆధార్ చట్టం మారిపోయిందని పిటిషనర్ కోర్టుకు చెప్పారు. -
‘అయోధ్య’పై మధ్యవర్తిగా ఉంటా: రిజ్వీ
న్యూఢిల్లీ: అయోధ్యలో బాబ్రీమసీదు–రామమందిరం వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకునేందుకు వీలుగా ఇరుపక్షాలతో చర్చలు జరుపుతానని మైనారిటీల జాతీయ కమిషన్(ఎన్సీఎం) చైర్మన్ ఘయోరుల్ హసన్ రిజ్వీ తెలిపారు. రామమందిరం హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయం అయినందున ముస్లింలు పెద్దమనసు చేసుకోవాలని సూచించారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి ముస్లింలు అంగీకరిస్తే, కాశి, మధుర సహా మిగతా ప్రాంతాల్లోని మసీదుల విషయంలో హిందూసంస్థలు వెనక్కి తగ్గేలా కృషి చేస్తానన్నారు. -
‘నేనలా అంటే.. మీడియా మరోలా రాసింది’
సాక్షి, న్యూఢిల్లీ : 'బాబ్రీ మసీదు స్థలంలో ఆలయాన్ని నిజమైన హిందువు ఎవరూ కోరుకోరు’ అనే వ్యాఖ్యలపై దుమారం రేగడంతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వివరణ ఇచ్చారు. కొందరు పేరు మోసిన రాజకీయ నాయకుల సేవలో తరించే కొన్ని మీడియా సంస్థలు తన వ్యాఖ్యల్ని వక్రీకరించాయని ట్విటర్లో ఆరోపించారు. ‘రాముడు జన్మించిన చోట ఆలయం నిర్మించాలని చాలామంది హిందువులు కోరుకుంటారనీ, కానీ మరొక ప్రార్థనాలయాన్ని కూల్చి నిర్మించాలని నిజమైన హిందువు కోరుకోడు’ అని వ్యాఖ్యానించినట్టు చెప్పుకొచ్చారు. ఆదివారం చెన్నైలో జరిగిన 'ఇండియా: అంశాలు, అవకాశాలు' అనే అంశంపై హిందూ లిట్ ఫర్ లైఫ్ డైలాగ్ 2018 కార్యక్రమంలో అయోధ్యలో రామమందిర నిర్మాణంపై తన అభిప్రాయాలు మాత్రమే చెప్పానని థరూర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యాఖ్యలతో సంబంధం లేదనీ, తాను పార్టీ అధికార ప్రతినిధిని కాదని స్పష్టం చేశారు. కాగా, శశిథరూర్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ స్పందించారు. ఆలయ నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ అయోధ్యలో టెంట్లు వేసుకుని మరీ రామునికి పూజలు చేస్తున్న ప్రదేశాన్ని ఖాళీ చేయమంటారా? అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే హిందూ జపం చేసే కాంగ్రెస్ వైఖరి శశిథరూర్ వ్యాఖ్యలతో వెల్లడైందంటూ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ చురకలంటించారు. I condemn the malicious distortion of my words by some media in the service of political masters. I said: “most Hindus would want a temple at what they believe to be Ram’s birthplace. But no good Hindu would want it to be built by destroying another’s place of worship.” — Shashi Tharoor (@ShashiTharoor) 15 October 2018 -
'మందిరం కట్టకపోతే మరో సిరియాగా భారత్'
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం-బాబ్రీ మసీదు వివాదంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడం ఉత్తమమని, లేనిపక్షంలో భారత్ మరో సిరియాగా మారుతుందని హెచ్చరించారు. సిరియాలో జరుగుతున్న బాంబుదాడుల్లో అమాయక ప్రజలు, చిన్నారులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో భారత్‌లోనే సిరియాను చూడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని చెప్పారు. సిరియా నరమేధం నుంచి ముస్లింలు కొన్ని విషయాలు నేర్చుకుని, అయోధ్య వివాదంపై ఆశలు వదులుకుని వెనక్కి తగ్గడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. జాతీయ మీడియా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశంకర్ ఈ విషయాలు ప్రస్తావించారు. అయోధ్య అనేది ముస్లింలకు సంబంధించిన అంశం, ప్రాంతం కాదని వారు గుర్తించాలన్నారు. శ్రీరాముడిని అయోధ్యలో కాకుండా వేరే ప్రాంతంలో జన్మించేలా చేయడం అసాధ్యమని.. ఇలాంటి వివాదాస్పద ప్రాంతాన్ని ఇస్లాం ఎప్పటికీ కోరుకోదని చెప్పారు. హిందువులు, ముస్లింల పరస్పర ఆమోదంతో రామమందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని, వారు ఆ స్థలంలో మసీదు నిర్మించుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించేందుకు ముస్లింలు పూర్తి మద్ధతు తెలపాలని పిలుపునిచ్చారు. రామ మందిరం-బాబ్రీ మసీదు కూల్చిన ప్రాంతంలో అన్ని మతాల వారికి ఉపయోగపడే ఆసుపత్రి, లేదా ఇతరత్రా ఏదైనా నిర్మించాలని సలహా ఇచ్చారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తూ వివాదాన్ని పెంచేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య అంశంలో ప్రతి ఒక్కరూ కోర్టు తీర్పును అంగీకరించే పరిస్థితుల్లో లేరన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) బహిష్కృత సభ్యుడు సయ్యద్ సల్మాన్ హుస్సేన్ నద్వీని తాను ప్రలోభపెట్టలేదని వెల్లడించారు. షరియా చట్టం ప్రకారం మసీదును వేరే చోటుకి తరలించడం సాధ్యమేనని నద్వీ గతంలో ప్రకటన చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. -
స్థల వివాదంగా చూస్తాం
న్యూఢిల్లీ: రాజకీయంగా సున్నితమైన రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదం కేసును పూర్తిగా స్థల వివాదంగానే పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో రోజువారీ విచారణ జరపాలన్న విజ్ఞప్తిని అత్యున్నత ధర్మాసనం తిరస్కరిస్తూ సాధారణ పద్ధతిలోనే విచారిస్తామంది. 700 మందికిపైగా పేద కక్షిదారులు(ఇతర కేసుల్లో) న్యాయం కోసం వేచిఉన్నారని, వారి కేసుల్ని కూడా విచారించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో క్షక్షిదారులు కోర్టు ముందుంచిన డాక్యుమెంట్లు, సాక్ష్యాలు, ప్రాంతీయ భాషల పుస్తకాల్లోని సారాంశాన్ని ఇంగ్లిష్‌కి అనువదించి సమర్పించాలని ఆదేశించింది. విచారణను మార్చి 14కు ధర్మాసనం వాయిదా వేసింది. అలహాబాద్ హైకోర్టులో కేసు విచారణ రికార్డులకు సంబంధించిన వీడియో క్యాసెట్ల కాపీలను కక్షిదారులకు అందచేయాలని రిజిస్ట్రార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘రామ్ లల్లా విరాజ్మన్’ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదిస్తూ.. కేసులోని అవతలి వైపు కక్షిదారులు తమ వాదనల సారాంశాన్ని కోర్టుకు తెలపడంతో పాటు, తమతో పరస్పర మార్పిడి చేసుకోవాలని సూచించారు. దీనికి ప్రతివాది తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తనకు నచ్చిన విధంగా వాదిస్తానని, తాను దేని ప్రామా ణికంగా వాదించాలన్నది వారు ఆదేశించలేరని పేర్కొన్నారు. హిందూ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాది కె.పరాశరన్ వాదిస్తూ.. ‘ఈ సంఘటన త్రేతాయుగం నాటిది. 30 వేల ఏళ్ల నాటికి చెందిన ఏ సాక్ష్యాల్ని అప్పీలుదారులు తేగలరు? అందువల్ల మమ్మల్ని రికార్డుల్లోని సాక్ష్యాల వరకే పరిమితం చేయాలి’ అని విజ్ఞప్తిచేశారు. అయోధ్యలోని వివాదాస్పద భూమిని నిర్మోహి అఖారా, రామ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డులకు సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు గతంలోతీర్పునిచ్చింది. ముస్లిం నేతలతో రవిశంకర్ చర్చలు మరోవైపు అయోధ్య వివాద పరిష్కారం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ గురువారం ముస్లిం నేతలతో చర్చించారు. సున్నీ వక్ఫ్ బోర్డు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో పాటు ఇతరులు రవి శంకర్‌ను కలిసి అయోధ్య వివాదంలో కోర్టు వెలుపల రాజీకి మద్దతు తెలిపారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘వేరే ప్రాంతానికి మసీదును తరలించే ప్రతిపాదనకు వారు మద్దతు ప్రకటించారు’ అని వెల్లడించింది. -
రాముడు కోరుకున్నప్పుడే ఆలయం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస సీనియర్ నేత కపిల్ సిబల్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నరేంద్ర మెదీ అనుకున్న సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మించలేరని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయం శ్రీరాముడు కోరుకున్నప్పుడు వస్తుందని.. మోదీ అనుకున్నపుడు రాదని ఆయన చెప్పారు. ‘శ్రీరాముడిని బీజేపీ నేతలు, నరేంద్ర మోదీ నమ్ముకున్నారు.. అయితే రాముడు మాత్రం వారిని నమ్మడం లేదు’ అని సిబల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్నిన్యాయవ్యవస్థ కూడా నిరూపించింది అని ఆయన చెప్పారు. దేశంలో 2019 లోక్‌సభ ఎన్నికల తరువాత అయోధ్య-బాబ్రీ వివాదాన్ని విచారించాలన్న కపిల్ సిబల్ వాదనతో కోర్టు ఏకీభవించిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘంగా వాయిదా వేయాలని సిబల్ కోరినా.. కోర్టు మాత్రం విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న వరకూ వాయిదా వేసింది. -
హిందూ సంస్థల శౌర్య దివస్.. ముస్లింల విషాద దినం
అయోధ్య / లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేతకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ ‘శౌర్య దివస్’ పేరిట సంబరాలు నిర్వహించగా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) వంటి ముస్లిం సంస్థలు ‘విషాద దినం’గా పాటించాయి. అయోధ్యతో పాటు ఫైజాబాద్‌లో భారీసంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు. వీహెచ్‌పీ ఉత్తరప్రదేశ్‌లో పలుచోట్ల సంబరాలు నిర్వహించింది. మందిరం నిర్మాణానికి ప్రస్తుతం దేశంలో పరిస్థితి అనుకూలంగా ఉందని శ్రీరామ్ జన్మభూమి న్యాస్ చైర్మన్ మహంత్ గోపాల్‌దాస్ చెప్పారు. బాబ్రీ కూల్చివేత ఘటనలో లిబర్హాన్ కమిషన్ దోషులుగా తేల్చిన వారందరికీ కఠిన శిక్ష విధించాలని ఏఐఎంపీఎల్బీ కార్యనిర్వాహక సభ్యుడు రషీద్ డిమాండ్ చేశారు. -
బాబ్రీ విధ్వంసానికి పది కారణాలు
సాక్షి, న్యూఢిల్లీ : నేటికి సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం అంటే, 1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసిన పరిస్థితులు, వైఫల్యాలు, బాధ్యులను పది అంకెల్లో పేర్కొనవచ్చు! 1. ఎల్కే అద్వానీ 1990, సెప్టెంబర్ 25 తేదీన భారతీయ జనతా పార్టీ ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్ర బాబ్రీ మసీదు విధ్వంసానికి బీజం వేసింది. ఆయన రథ యాత్ర పలు రాష్ట్రాల్లో హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలను పెంచి అల్లర్లకు దారితీసింది. పైగా అద్వానీ బాబ్రీ మసీదు విధ్వంసం రోజున అక్కడే వేదికపై ఉన్నారు. ఆయన పక్కన పార్టీ సహచరులు మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలు ఉన్నారు. వారంతా బాబ్రీ విధ్వంసానికి కరసేవకులను ప్రోత్సహించారనే అభియోగాలు ఉన్నాయి. ఆ తర్వాత 1992, డిసెంబర్ 6వ తేదీన తన జీవితంలో అత్యంత చీకటి రోజని అద్వానీ బాధను వ్యక్తం చేశారు. ఆ బాధ నిజంగా కలిగిందా, ఆత్మవంచనా ? ఆయనకే తెలియాలి. 2. ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషద్, బజరంగ్ దళ్ ఈ సంఘాలు హిందూ, ముస్లింలు, క్రైస్తవుల మధ్య వైషమ్యాలనే సష్టించడమే కాకుండా బాబ్రీ మసీదు విధ్వంసానికి కార్యకర్తలను తరలించాయి. సాధ్వీ రిదంబర లాంటి వారు వారిలో మరింత ఆజ్యం పోశారు. ‘కహో గర్వ్‌సే హమ్ హిందూ హై, హిందుస్థాన్ హమారా హై, జో హమ్సే టక్రాయేగా, వో కుత్తేకి మౌత్ యహాపర్ దేకో మారా జాయేగా, జహా బనీ హై మసీద్, అప్నా మందిర్ వహీ బనాయింగే. బాబర్ కే హౌలాదోం, జావో పాకిస్థాన్, యా కబరిస్థాన్’ అంటూ ఆమె రెచ్చగొట్టారు. 3. పీవీ నర్సింహారావు అప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు బాబ్రీ మసీదును రక్షించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి ఉండగా, అలా చేయలేదు. జన నష్టం ఎక్కువ జరుగుతుందంటూ సాకు చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తనకిచ్చిన మాట తప్పారంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. రామ మందిరాన్ని కోరుకుంటున్న కళ్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు విధ్వంసం కాకుండా అడ్డుకుంటారని అనుకున్నాననడం అర్థరహితం. 1984లో ఢిల్లీలో సిక్కుల అల్లర్లు చెలరేగినప్పుడు కూడా వాటిని నిరోధించడంలో పీవీ విఫలం అయ్యారు. 4. కళ్యాణ్ సింగ్ ఆయన బాబ్రీ మసీదును విధ్వంసం నుంచి రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన తన బీజేపీ పార్టీతోపాటు తాను మసీదు విధ్వంసాన్ని కోరుకున్నారు. శక్తివంచన లేకుండా మసీదును పరిరక్షించేందుకు ప్రయత్నించానని చెప్పుకున్నారు. 5. శివసేన బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం ముంబైలో చెలరేగిన అల్లర్లకు శివసేనదే బాధ్యత. ఆ పార్టీ నాయకుడు తన పత్రిక ‘సామ్నా’ద్వారా అల్లర్లను ప్రేరేపించారు. నాటి అల్లర్లలో వందలాది మంది మరణించారు. శ్రీకష్ణ కమిషన్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. 6. పోలీసులు, భద్రతా దళాల వైఫల్యం అయోధ్యలో బాబ్రీ మసీదు వద్ద భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు, భద్రతా బలగాలు కరసేవకులకు భయపడి పారిపోయారు. ముంబైలో హిందూ మూకలు అల్లర్లకు పాల్పడుతుంటే కూడా మౌన ప్రేక్షకుల్లా ఉండిపోయారు. 7. కాంగ్రెస్ పార్టీ 1992, 1993లలో ఇటు కేంద్రంలో, అటు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాబ్రీ మసీదును రక్షించడంలో, ముంబై అల్లర్లను నిరోధించడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం అల్లర్లపై శ్రీకష్ణ కమిషన్‌ను వేసింది. ఆ కమిషన్ నివేదికపై కఠన చర్యలు తీసుకుంటానని ఎన్నికల మేనిఫెస్టోలో పదేపదే హామీ ఇచ్చి కూడా ఎన్నడూ ఎలాంటి చర్య తీసుకోలేదు. 8. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త విజ్ఞానం ప్రాతిపదికన వ్యవహరించాల్సిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా హిందూత్వ ఎజెండాకే మద్దతు పలికింది. పుక్కిటి పురాణాల్లో ఉన్న సరస్వతి నదికి, సింధూ నాగరికతకు లింకు ఉందని చెప్పింది. పెద్దగా తవ్వకాలు జరపకుండానే బాబ్రీ మసీదు కింద రామాలయం ఉందని తేల్చింది. 9. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ బాబ్రీ మసీదు విధ్వంసంపై 1992లోనే దర్యాప్తునకు లిబర్హాన్ కమిషన్‌ను వేశారు. అది 17 సంవత్సరాల తర్వాత, అంటే 2009లో నివేదికను సమర్పించింది. ఇంతటి ఆలస్యానికి అర్థం ఏమైనా ఉందా? 1993, అక్టోబర్‌లో సీబీఐ అద్వానీ, మురళీ మనోహర్, ఉమా భారతి సహా 21 మంది నిందితులపై బాబ్రీ విధ్వంసం కుట్రకేసును నమోదు చేసింది. ఈ కేసును సాంకేతిక కారణాలను చూపిస్తూ 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. తిరిగి ఈ కేసును 2017లో సుప్రీం కోర్టు పునరుద్ధరించింది. 21 మంది నిందితుల్లో ఇప్పటికే 8 మంది నిందితులు మరణించారు. 10. సుప్రీం కోర్టు బాబ్రీ విధ్వంసం కేసుకన్నా బాబ్రీ మసీదు వివాదం ఎన్నో ఏళ్లుగా అంటే, దాదాపు ఏడు దశాబ్దాలుగా సుప్రీం కోర్టులో నలుగుతోంది. ఇరుపక్షాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ సూచించడం తప్పా వివాదాన్ని పరిష్కరించలేకపోయింది. భూ వివాదానికి సంబంధించిన ఈ కేసు తుది విచారణను మళ్లీ ఫిబ్రవరికి వాయిదా వేసింది. -
మందిర్-మసీదు.. ముఖ్య ఘట్టాలు
రామజన్మ భూమి, బాబ్రీ మసీదుపై మంగళవారం తుది విచారణ జరగాల్సి ఉండగా.. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో రామజన్మ భూమి, బాబ్రీ మసీదుకు సంబంధించిన వివాదాలు.. ముఖ్యఘట్టాలకు సంబంధించిన వివరాలివి. రామజన్మభూమి, బాబ్రీ మసీదుకు సంబంధించి 2010లో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మొత్తం వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభవించింది. ఒక భాగం నిర్మోహి అఖారాకు, మరొక బాగం రామజన్మభూమికి, మూడో భాగం మసీదుకు కోర్టుకు కేటాయించింది. ఈ తీర్పును ఉభయపక్షాలు సుప్రీంలో సవాల్ చేశాయి. ఈ నేపథ్యంలో మసీదు వివాదానికి సంబంధించిన చారిత్రక ఘట్టాలను పరిశీలిద్దాం. బాబ్రీ మసీదు టైమ్‌లైన్ 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్ పేరు మీద మీర్ బాఖీ నిర్మించారు. 1853 : మసీదుకు సంబంధించి మొట్టమొదటి హింస జరిగిన సంవత్సరం. నిర్మోహి అఖారాకు చెందిన హిందువులు, అలాగే అవధ్ నవాబ్ అయిన వాజిద్ ఆలీ షా వర్గాలకు మధ్య ఘర్షణ జరిగినట్లు ఆధారాలున్నాయి. రామాలయాన్ని కూల్చి మసీదు కట్టారని హిందువులు తొలిసారి ఆరోపించారు. 1885 : బాబ్రీ మసీదుపై మొదటిసారిగా మహంత్ రఘుబర్‌దాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. మసీదు స్థలం రామాలయయని ఆయన కోర్టుకు తెలిపారు. 1889 : హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణ చెలరేగడంతో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం మసీదు చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. బ్రిటీష్ ప్రభుత్వం ముస్లింలకు లోపలి భాగం, హిందువులకు బయటి భాగాన్నిఅప్పగించింది. 1949 : బాబ్రీ మసీదులోకి ప్రవేశించిన కొందరు హిందువులు.. అక్కడ రాముడు, సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్టించారు. 1950 : బాబ్రీ మసీదులోని ఖాళీ ప్రాంతంలో ప్రార్థనలను చేసుకునేందుకు అనుమతించాలంటూ.. మహంత్ పరమహంస రామచంద్ర దాస్ ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఖాళీ భాగంలో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించన కోర్టు.. లోపలి భాగంలోకి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించింది. 1959 : మొత్తం స్థలాన్ని తమకు అప్పగించాలంటూ నిర్మోహి అఖారా మూడోసాకి కోర్టును అశ్రయించింది. 1961 : మసీదు ఖాళీప్రాంతాన్ని స్మశానంగా మార్చుకునేందుకు అనుమతి కోరుతూ.. సున్నీ సెంట్రల్ బోర్డు, షియా వక్ఫ్ బోర్డులు కోర్టుకెక్కాయి. 1984 : రామజన్మ భూమిలో రామాలయాన్నినిర్మించడమే లక్ష్యమంటూ బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ప్రకటన. రామాలయం నిర్మాణం కోసం ఉద్యమం మొదలు పెట్టిన అద్వానీ. 1986 : బాబ్రీ మసీదులో హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చంటూ జిల్లా కోర్టు తీర్పు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లింలు.. బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ఏర్పాటు. 1989 : విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మసీదులోని ఖాళీ స్థలంలో రామాలయం నిర్మాణానికి శిలాన్యాస్. అంతేకాక మసీదును మరో ప్రాంతానికి తరలించాలంటూ.. కోర్టులో కేసును దాఖలు చేసిన వీహెచ్‌పీ 1990 : చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కొందరు కర సేవకులు బాబ్రీ మసీదును పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ సమయంలో ప్రధాని చంద్రశేఖర్.. ఇరు వర్గాల మధ్య చర్చలతో సమస్యను పరిష్కారం కోసం ప్రయత్నాలు చేశారు. చర్చలు జరుగుతున్న సమయంలోనే బీజేపీ సీనియర్ నేత అద్వానీ రామాలయం కోసం దేశవ్యాప్తంగా రథయాత్ర మొదలు పెట్టారు. 1991 : అప్పటివరకూ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అద్వానీ రథయాత్రతో మొదటిసారి ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. దీంతో అయోధ్యలో కరసేవకుల ఉద్యమం మరింత ఉధృతమైంది. 1992 : డిసెంబర్ 6న శివసేన, వీహెచ్‌పీ, బీజేపీ కార్యకర్తలు భారీగా వివాదాస్పద ప్రాంతానికి చేరుకుని.. మసీదును కూల్చారు. ఈ సమయంలో జరిగిన అల్లర్లలో 2 వేలమందిపైగా మరణించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు జస్టిస్ లిబర్హాన్ కమిషన్‌ను నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2002 : గుజరాత్ నుంచి అయోధ్యకు రైలుతో తరలివెళుతున్న కరసేవకులపై గోధ్రా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి. 58 మంది కరసేవకుల మృతి. గోధ్రా ఘటన తరువాత చెలరేగిన అల్లర్లలో సుమారు 1000 మంది మరణించారు. 2002 : బాబ్రీ మసీదు ప్రాంతంపై సర్వే చేయాలంటూ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించిన హైకోర్టు. 2003: బాబ్రీ మసీదు ప్రాంతంలో సర్వే పనులు మొదలు పెట్టిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. మసీదు కింది భాగంలో ఆలయం ఉన్నట్లు తేల్చిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. 2009 : బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించి ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్ నివేదిక కేంద్రానికి సమర్పించింది. ఇందులో బీజేపీ అగ్రనేత అద్వానీ సహా మరో 68 మందిని దోషులుగా తేల్చింది. 2010 : బాబ్రీ మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు మొదటిసారి తీర్పును వెలవరించింది. మొత్తం వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించి.. నిర్మోహి అఖారాకు, రామజన్మభూమికి, మసీదుకు కేటాయిస్తూ తీర్పును ప్రకటించింది. ఈ తీర్పును ఇరు వర్గాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. 2011 : అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. యథాతథ స్థితిని కొనసాగించాలన్న సుప్రీం. 2014 : నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఎన్నికల్లో ఘనవిజయం. 2015 : అయోధ్యలో రామమందిర నిర్మాణం లక్ష్యంగా వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా రాళ్ల సేకరణ. సరిగ్గా రెండు నెలల తరువాత రెండు ట్రక్కుల రాళ్లు వివాదాస్పద ప్రాంతానికి చేరుకున్నాయి. మోదీ ప్రభుత్వం అనుమతిస్తే రామాలయాన్ని నిర్మిస్తామంటూ.. మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రకటన. 2017 : అమోధ్య ధ్వంసానికి సంబంధించి అద్వానీపై తిరిగి కేసును రీ ఓపెన్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు. 2017 : ఉత్తర్‌ప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ 2017 మార్చి 21 : బాబ్రీ మసీదు విషయం చాలా సున్నితమైనది. దీనిని కోర్టు బయటే తేల్చుకోవాలన్న సుప్రీంకోర్టు. 2017 డిసెంబర్ 5 : అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన వర్గాల వాదనలు వినేందుకు సిద్ధపడ్డ సుప్రీం కోర్టు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బాబ్రీ మసీదు విచారణను.. వచ్చే ఏడాది 8కి వాయిదా వేసిన కోర్టు. -
‘అయోధ్యలో ఆలయం... లక్నోలో మసీదు’
లక్నో: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు స్థలంపై తమ హక్కును పూర్తిగా వదులుకోవడానికి సిద్ధమనీ, అందుకు ప్రతిగా లక్నోలో మసీదు నిర్మించాలని ఆ రాష్ట్ర షియా వక్ఫ్‌బోర్డు ప్రతిపాదించింది. ఈ విషయాన్ని గత శనివారమే సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపినట్లు షియా వక్ఫ్‌బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ చెప్పారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకోడానికి ఇదే అత్యుత్తమ మార్గమనీ, లక్నోలోని హుసేనాబాద్‌లో ఎకరా స్థలంలో రాష్ట్రప్రభుత్వం మసీదును నిర్మించాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదనను సున్నీ వక్ఫ్‌బోర్డు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. హక్కును వదులుకుంటామని షియా వక్ఫ్‌బోర్డు చెబుతోందనీ, బాబ్రీ మసీదు స్థలంపై దానికి అసలు హక్కు ఎక్కడుందని సున్నీ వక్ఫ్‌బోర్డు ప్రశ్నించింది. -
‘బాబ్రీ’ పై కీలక వాదోపవాదాలు
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో మంగళవారం సుప్రీంకోర్టులో కీలక వాదోపవాదాలు జరిగాయి. వివాదాస్పద స్థలానికి సమీపంలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే మసీదు నిర్మించాలని షియా బోర్డు మంగళవారం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. ఒకే చోట రామమందిరం, మసీదు ఉంటే అది వివాదాలకు దారితీస్తుందని షియా వక్ఫ్ బోర్డు ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇతర భాగస్వాములందరితో కూడిన కమిటీ దశాబ్ధాల నాటి ఈ వివాదానికి తెరదించాలని సూచించింది. ఈ కమిటీలో ప్రధాని కార్యాలయం, యూపీ సీఎం కార్యాలయం నుంచి నామినీలకూ చోటు కల్పించాలని కోరింది. వాదోపవాదాలను పరిశీలించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 11న చేపట్టనున్నట్టు పేర్కొంది. ఇక వివాదాస్పద స్ధలాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రామ మందిరం కోసం, మరో భాగాన్ని నిర్మోహి అఖదకు, మూడో భాగాన్ని సున్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని 2010లో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొంది. కాగా, షియా వక్ఫ్ బోర్డు తాజాగా సుప్రీం ఎదుట భిన్న వాదనలు వినిపించింది. సున్ని బోర్డుకు కేటాయించిన వివాదాస్పద స్థలంలో భాగం తమకు చెందినదని షియా బోర్డు పేర్కొంది. కాగా అయోధ్య–బాబ్రీ మసీదు వివాదంలో 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను సుప్రీం కోర్టు నియమించిన విషయం తెలిసిందే. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల బెంచ్ ఈ నెల 11 నుంచి పిటిషన్ల విచారణ ప్రారంభించనుంది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని గతంలో సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖరా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని గతంలో అలహాబాద్ హైకోర్టు 2:1 మెజారిటీతో తీర్పునిచ్చిన విషయం విదితమే. -
మందిరానికి ముస్లింలు భూములిస్తున్నారు: యోగి
రామజన్మభూమి వివాదాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి కదిలించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూములిస్తామంటూ చాలా ముస్లిం సంస్థలు ముందుకొస్తున్నాయని ఆయన అయోధ్య సాక్షిగా చెప్పారు. ముఖ్యమంత్రి కాక ముందువరకు ఫైర్‌బ్రాండ్ హిందూ నాయకుడైన ఆదిత్యనాథ్.. ఇప్పుడు చాలాకాలం తర్వాత మరోసారి దీని గురించి మాట్లాడారు. ముస్లింలలో ఓ వర్గం ఆలయ నిర్మాణానికి సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా తగిన పరిష్కారం పొందేందుకు ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలకు సాయం చేయడానికి యూపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు ఆయన అయోధ్య పర్యటన సందర్భంగా హనుమాన్ గఢీ, రామ జన్మభూమి ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 84 కోసి పరిక్రమ యాత్ర త్వరలోనే పునః ప్రారంభం అవుతుందని భక్తులకు ఆయన హామీ ఇచ్చారు. ఆ యాత్రను 2013లో విశ్వహిందూ పరిషత్ ప్రారంభించిందని, కానీ గతంలోని అఖిలేష్ ప్రభుత్వం దాన్ని కొనసాగనివ్వలేదని మండిపడ్డారు. అయోధ్య రాముడి జన్మస్థలమని, అక్కడ రాంలీలా జరిగేలా ప్రభుత్వం చూస్తుందని కూడా ఆదిత్యనాథ్ చెప్పారు. రామజన్మభూమి - బాబ్రీ మసీదు ప్రాంగణం వద్ద గల తాత్కాలిక ఆలయంలో ఆయన సుమారు అరగంట సేపు గడిపారు. ఆ తర్వాత సరయూనది ఒడ్డున ప్రార్థనలు చేశారు. ఆయనతో పాటు ధరమ్ దాస్ కూడా ఉన్నారు. ఈ దాస్‌పైనే కోర్టు పలువురు బీజేపీ అగ్రనేతలతో పాటు అభియోగాలు మోపింది. లక్నోలోని ప్రత్యేక కోర్టుకు ఎల్కే అద్వానీ హాజరవడానికి ముందు వీవీఐపీ గెస్ట్‌హౌస్‌లో ఆయనను సీఎం యోగి కలిశారు. -
రామ్ లాల్లా ఆలయంలో యోగి పూజలు
-
రామ్ లాల్లా ఆలయంలో యోగి పూజలు
అయోధ్య : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ బుధవారం అయోధ్యలో పర్యటించారు. వివాదాస్పద రామ్‌జన్మస్థల్‌లో తాత్కాలికంగా నిర్మించిన రామ్ లాల్లా ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పవిత్ర సరయూ నదీతీరాన్ని పరిశీలించారు. అంతకుముందు నగరంలోని హనుమాన్ గర్హ్ ఆలయాన్ని కూడా యోగి దర్శించుకున్నారు. ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యోగి పాస్‌పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆ తర్వాత జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు సీఎం తన పర్యటన ముగించుకుని లక్నో బయల్దేరి వెళతారు. కాగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రామజన్మభూమి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఇక యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో పర్యటించడం ఇదే ప్రథమం. అలాగే ముఖ్యమంత్రి హోదాలో అయోధ్యలో పర్యటించడం గత 15ఏళ్లలో ఇదే తొలిసారి. అలాగే బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ అగ్రనేతలపై లక్నో సీబీఐ కోర్టు కుట్ర అభియోగలు నమోదు చేసిన తెల్లారే... ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో పర్యటించడం విశేషం. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, జోషి, ఉమాభారతిపై కుట్ర అభియోగాలను ఖరారు చేసిన సీబీఐ కోర్టు వారికి మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామజన్మభూమి ఆలయాన్ని సీఎం యోగి సందర్శిస్తుండటంతో ఈ అంశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. 6 డిసెంబర్ 1992న ఉత్తరప్రదేశ్‌లో అతి పురాతనమైన బాబ్రీ మసీదును నేలమట్టం అయిన విషయం విదితమే. -
సీఎం యోగి అనూహ్య అడుగులు!
నేడు అయోథ్యలో పర్యటన.. రామమందిరం సందర్శన లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ బుధవారం అయోధ్యలో పర్యటించబోతున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన మరునాడే ఆయన అయోధ్యలోని రామజన్మభూమిని సందర్శించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేసీ హిందూత్వ అజెండాను మరింత తెరపైకి తెచ్చేందుకు, రామమందిర నిర్మాణానికి మద్దతుగా యోగి ఈ పర్యటన చేపట్టినట్టు భావిస్తున్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదస్పద ప్రదేశంలో తాత్కాలికంగా నిర్మించిన రామమందిరంలో బుధవారం సీఎం యోగి పూజలు నిర్వహించబోతున్నారు. గడిచిన 15 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి ఈ ఆలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, జోషి, ఉమాభారతిపై కుట్ర అభియోగాలను ఖరారు చేసిన సీబీఐ కోర్టు వారికి మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామజన్మభూమి ఆలయాన్ని సీఎం యోగి సందర్శిస్తుండటంతో ఈ అంశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. -
బాబ్రీ కేసులో నిందితులకు బెయిల్
-
బాబ్రీ కేసులో నిందితులకు బెయిల్
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణను ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఇతర నిందితులు బీఎల్ శర్మ, మహంత్ నృత్య గోపాల్ దాస్, చంపత్ రాయ్, ధర్మదాస్లతో పాటు రామ్ విలాస్.. లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ స్పెషల్ కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. రూ 20 వేల పూచికత్తుపై ఈ ఐదుగురికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మే 22కు వాయిదా వేసింది. తనతో పాటు లక్షలాది మంది కరసేవకులు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చారని, రాముడి కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
సాధ్వి రితంభర
సాధ్వి రితంభర... ఈ పేరు ఎప్పుడో కాని ప్రముఖంగా వినిపించదు. 1992లో ఒకసారి వినిపించింది... బాబ్రీ మసీదు ధ్వంసమైనప్పుడు! మళ్లీ ఇన్నేళ్లకు ఇటీవల వినిపించింది... బాబ్రీ కేసును సుప్రీంకోర్టు తిరగదోడినప్పుడు! బాబ్రీ కేసును అలహాబాద్ కోర్టు కొట్టేశాక, అలా కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ... సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో... ‘విచారణ కొనసాగాల్సిందే’ అని సుప్రీం కోర్టు ఏప్రిల్ 19న తీర్పు చెప్పింది. అడ్వాణీ, జోషీ, ఉమాభారతి, మరికొందరితో పాటు సాధ్వి రితంభర కూడా ఇప్పుడా విచారణను ఎదుర్కోవాలి. వచ్చే రెండేళ్లలో ఎప్పుడు పిలిస్తే అప్పుడు లక్నో కోర్టుకు వెళ్లి రావాలి. ఇక్కడో విశేషం ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతున్నంత కాలం.. కేసులో నిందితులుగా ఉన్నవారు తమ పని తాము చేసుకుపోలేరు. ప్రస్తుతం సాధ్వి రితంభర పరిస్థితి అదే. ఆమెకు చాలా పనులున్నాయి. ఆమె సాధ్వి అయితే కావచ్చు కానీ, మానవ బాంధవ్యాలను వదులుకున్న తపస్విని మాత్రం కాదు. హిందూ సంస్కృతీ సంప్రదాయాల సుసంపన్నతకు కృషి చేస్తూనే... అనాథ బాలలను, మహిళలను.. ప్రేమతో, వాత్సల్యంతో చేరదీస్తున్నారు. పరాశక్తిలా, ఒక కార్యకర్తలా... హైందవ సమాజపు విలువల్ని సంరక్షించే పనిలో నిమగ్నమై ఉన్నారు. మాట అంటుకుంటుంది ముత్యమంత పసుపు ముఖమంత ఛాయ. సాధ్వి రితంభర భారతీయ సంస్కృతికి ఒక రాజకీయ ఛాయ. మాట కటువు. మనసు మృదువు. నవ్వు చంద్రోదయం. ఆగ్రహం చండప్రచండం. ప్రసంగం మహా ప్రళయం! ఉన్నది రాజకీయాల్లోనే... కానీ రాజకీయాలు పడవు. స్ట్రయిట్ ఫార్వర్డ్. సామాజిక కార్యకర్త. చెయ్యి చాస్తే పెడుతుంది. చేతినిండా ఉంటే పంచుతుంది. అమ్మాయిల్ని ఎవరైనా కన్నెత్తి చూస్తే.. కర్రెత్తుతుంది. మతాన్ని ప్రబోధిస్తుంది. మతాన్ని అనుసరిస్తుంది, ఆచరిస్తుంది. ఆమె పుట్టింది 1964 జనవరి 2 న. ఆమె ఎవరో, ఏమిటో ఈ దేశానికి తెలిసింది 1992 డిసెంబర్ 6న. అయోధ్యలో కట్టడం కూలిన రోజు అది. విశ్వ హిందూ పరిషత్‌లో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో ఆమె ఒక దుందుడుకు సభ్యురాలు. ‘దుర్గావాహిని’ (విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం) చైర్పర్సన్. దుర్గావాహిని అంటే దుర్గమ్మ సైన్యం. అసలు ఇవన్నీ కాదు. రామ కథ చెబితే రితంభరే చెప్పాలి. హత్తుకునేలా కథ... అంటుకునేలా మాట! ఇదీ ఆమె స్పెషాలిటీ. వెలుగులోంచి చీకట్లోకి బాబ్రీ కూల్చివేతతో దేశాన్ని దాదాపుగా మతకలహాల అంచుల్లోకి నడిపించిన వ్యక్తులలో సాధ్వి రితంభర కూడా ఒకరని కేసును దర్యాప్తు చేసిన లిబర్హాన్ కమిషన్ నిర్ధారించింది. బాబ్రీ ఉదంతంతో వెలుగులోకి వచ్చిన రితంభర, అదే ఉదంతంతో తనని కొన్నేళ్లపాటు కనుమరుగు చేసుకుంది. ఆమెను 1995 ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అరెస్ట్ చేశారు. అయితే అది బాబ్రీ కేసులో కాదు. మదర్ థెరిసాను ఆమె ‘మాయలాడి’ అన్నారు. యూపీ సీఎం ములాయంను ‘మ్యాన్ ఈటర్’ అన్నారు. అనేక ఇతర మతాల పట్ల ఆమె అసహనంగా ఉంటారు. క్రిస్టియన్ మిషనరీలపై ఆమె స్పీచ్ రగులుకుంది. ఒక నన్ను ముగ్గురు ఆగంతకులు చంపేశారు. పర్యవసానమే రితంభర అరెస్ట్. దుర్గా వాహిని విశ్వహిందూ పరిషత్ మహిళా విభాగమే ‘దుర్గా వాహిని’. ఈ సంస్థ చైర్పర్సన్ సాధ్వి రితంభర. సంస్థను 1991లో స్థాపించింది కూడా రింతభరే. మహిళలను శారీరకంగా, మానసికంగా దృఢపరచి, వారిలో విజ్ఞానాన్ని, వికాసాన్నీ పెంపొందించడం వాహిని ముఖ్య ధ్యేయం. ఇందులో సభ్యులుగా చేరిన యువతులకు ఆత్మరక్షణ విద్యలను నేర్పిస్తారు. యుద్ధ కళల్లో శిక్షణ ఇస్తారు. విపత్తులలో, విలయాలలో, ఇతర అత్యవసర పరిస్థితులలో దేశ ప్రజలకు ఈ దుర్గావాహిని దళం సేవలు అందిస్తుంది. అయితే ఈ సంస్థలో హిందూ అతివాద ధోరణులు కూడా కనిపిస్తుంటాయన్న విమర్శ కూడా ఉంది. ఈ విమర్శను రితంభర నవ్వుతూ స్వీకరిస్తారు. అతివాదాన్ని ఒక శక్తిగా ఆమె అభివర్ణిస్తారు. అసలు పేరు నిషా పంజాబ్‌లోని లూధియానా జిల్లాలో దొరహ అనే పట్టణం ఉంది. అక్కడ పుట్టింది సాధ్వి రితంభర. నిషా ఆమె అసలు పేరు. మిఠాయిలు తయారు చేసి అమ్మే కుటుంబం వారిది. లోయర్ మిడిల్ క్లాస్. ఆమెకు పదహారేళ్ల వయసులో ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చాడు. ఆయన పేరు యుగ పురుష మహా మండలేశ్వర స్వామీ పరమానంద గిరి జీ మహరాజ్. ఆయన్ని చూడ్డానికి వెళ్లింది నిషా కుటుంబం. ఆయన నిషాని చూశాడు. నిషా గలగలా మాట్లాడుతోంది. హైందవ సంస్కృతీ సంప్రదాయాల వ్యాప్తికి ఈ గలగలలు అవసరం అనుకున్నాడు స్వామీజీ. ఆయనతో పాటు హరిద్వార్ వెళ్లిపోయింది నిషా. స్వామీజీకి అక్కడో ఆశ్రమం ఉంది. అక్కడి నుంచి ఆయన ఇండియా అంతా పర్యటిస్తుంటారు. నిషా కూడా ఆయన వెంటే పర్యటించింది. ఎలా ప్రసంగించాలో ఆయన్ని చూసే నేర్చుకుంది. ఆ సమయంలోనే స్వామీజీ ఆమె పేరును రితంభరగా మార్చారు. రితంభర పెళ్లి చేసుకోలేదు. సాధ్విగా ఉండాలని నిశ్చయించుకుంది. ఆ తర్వాత ఆమె ప్రయాణం రాష్ట్రీయ సేవిక సమితిలోకి. ఆర్.ఎస్.ఎస్. మహిళా విభాగం అది. అందులో సభ్యురాలిగా చేరింది. తర్వాత విశ్వహిందూ పరిషత్‌లో ప్రముఖ సభ్యురాలు అయింది. పరోపకారానికి పరాశక్తి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1993లో మధురకు, బృందావనానికి సమీపంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు రితంభర. ఆశ్రమ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరకు తీసుకున్నారు. అయితే కల్యాణ్‌సింగ్ ప్రభుత్వం రద్దయి, రాష్ట్రపతి పాలన రావడంతో స్థలం స్వాధీనం కాలేదు. ఆ తర్వాత వచ్చిన ములాయం సింగ్.. స్వాధీనం కానివ్వలేదు. తిరిగి 2002లో రామ్ ప్రకాశ్ గుప్తా ముఖ్యమంత్రి అయ్యాక గాని స్థలం ఆమె చేతికి రాలేదు. గుప్తా 20 కోట్ల రూపాయల విలువైన 17 హెక్టార్ల భూమిని (42.5 ఎకరాలు) ఆమె ఏర్పాటు చేసిన పరాశక్తిపీఠం ట్రస్టుకు ఏడాదికి 1 రూపాయి రుసుము చొప్పున 99 ఏళ్ల కాలానికి రాసిచ్చారు. మహిళల్లో భక్తి భావాన్ని పెంపొందించడం, మహిళలకు కరాటే, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం నేర్పించడంతో పాటు, మహిళల్ని కాన్ఫిడెంట్‌గా తయారు చెయ్యడం ఈ శక్తిపీఠం ఆధ్వర్యంలోని బృందావన ఆశ్రమం లక్ష్యం. ఇలాంటి ఆశ్రమాలను అనా«థ బాలలు, మహిళలు, వితంతువుల కోసం ఇండోర్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో కూడా నడుపుతున్నారు రితంభర. అమ్మ రితంభర మగవాళ్లు సన్యాసులుగా మారితే... వాళ్లు సన్యాసులుగా మిగిలిపోతారంతే. మహిళ సన్యాసినిగా మారితే... తనలో అంతర్లీనంగా దాగి ఉండే మాతృత్వపు మమకారాన్ని సమాజానికి పంచుతుంది. సాధ్వి రితంభర కూడా అదేవిధంగా.. తల్లి లేని పిల్లలను చేరదీస్తున్నారు. వారికి అమ్మ ప్రేమను పంచుతున్నారు. అందుకోసమే ఉత్తరప్రదేశ్‌లో ‘వాత్సల్య గ్రామ్’ను స్థాపించారు. తల్లి ప్రేమ నిస్వార్థమైనది. షరతులు లేనిది. అలాంటి ప్రేమను కడుపున పుట్టిన బిడ్డకైతేనే పంచగలరనే భావన తుడిచేశారు రితంభర. తన మానస పుత్రిక వాత్సల్య గ్రామ్‌లో అనాథ పిల్లల సంరక్షణను చూసుకునే వారికి ఆమె చెప్పే మాట ఒక్కటే. ‘‘శ్రీకృష్ణుడిని అమితంగా ప్రేమించిన యశోద కృష్ణుడిని కనలేదు. తన కడుపున పుట్టలేదని తెలిసిన తర్వాత కూడా అంతే ప్రేమతో ఆదరించింది. తల్లిలేని పిల్లల పట్ల మన బాధ్యత కూడా అలాంటిదే. అందరూ యశోదలు కావాలి’’ అని! ఇక అనాథ పిల్లలను పెంచడంలో ఆమె చెప్పే తత్వం మహోన్నతంగా కనిపిస్తుంది. ‘‘ప్రతి బిడ్డ కూడా దేవుని అపూర్వమైన సృష్టిలో ఒక భాగం. ఆత్మ.. దైవత్వానుసారం తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి పుడుతుంది. ఆ పుట్టుకను గౌరవించాలి’’ అంటారు రితంభర. అలాగే... ‘‘అనాథ పిల్లలను చేరదీసే శరణాలయాలు కేవలం శరణార్థ శిబిరాలుగా ఉండిపోకూడదు. వాళ్లకు ఆహారం, దుస్తులు ఇచ్చి నీడ కల్పిస్తే బాధ్యత తీరిపోదు. వారిలో ఆత్మగౌరవాన్ని కాపాడాలి. తల్లి ఒడిలో ఉన్నప్పుడు కలిగే భద్రమైన భావనను కలిగించాలి. ఒక్క మాటలో... పిల్లలు ఏ ఆశ్రమంలోనో, ఎవరి ఆశ్రయంలోనో ఉన్నామని అనుకోకుండా తమ ఇంట్లో ఉన్నట్లే అనుకోవాలి’’ అంటారు అమ్మ రితంభర. -
తిరిగొచ్చిన కుట్ర కేసు!
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక దాదాపు రిటైర్మెంట్ జీవితం అనుభవిస్తున్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణి, మురళీమనోహర్ జోషిలకు బాబ్రీ మసీదు విధ్వంసం కుట్ర కేసు మళ్లీ మెడకు చుట్టుకుంది. ఆ ఇద్దరితోపాటు కేంద్ర మంత్రి ఉమాభారతి, సాధ్వి రితంబర, వినయ్ కటియార్ తదితరులు కూడా ఈ కేసు విచారణను ఎదుర్కొనవలసిందేనంటూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఇచ్చిన ఆదేశాలు ఆ నేతలందరినీ దిగ్భ్రమపరిచి ఉండాలి. ఈ కేసు న్యాయస్థానాల్లో నలుగుతున్న తీరును గమనిస్తే సామాన్యులు కూడా బిత్తర పోవాల్సిందే. దేశాన్ని ఓ కుదుపు కుదిపిన ఉదంతాలతో ముడిపడి ఉన్న కీలకమైన కేసుకే ఇలాంటి స్థితి ఏర్పడితే సాధారణ కేసుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. కేసులో మొత్తం 21మంది నిందితులుంటే అందులో బాల్ ఠాక్రే, మహంత్ అవైద్యనాథ్, అశోక్సింఘాల్సహా 8మంది మరణించారు. మరో నింది తుడు, రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్ రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నందువల్ల ఆయనపై కేసు విచారణ ప్రస్తుతానికి ఉండదు. బాబ్రీ విధ్వంసానికి సంబంధించి రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకటి– గుర్తు తెలియని కరసేవకులపై పెట్టిన కేసు. ఇది లక్నో సెషన్స్ కోర్టులో నడుస్తోంది. మరొకటి– అడ్వాణి తదితర నేతలపై పెట్టిన కేసు. ఇది రాయ్‌బరేలీ కోర్టులో కొనసాగుతోంది. భిన్న వర్గాలమధ్య విద్వేషాలు సృష్టించడం, జాతీయ సమగ్రతకు భంగం కలి గించడం, వదంతులు సృష్టించి శాంతికి భంగం కలిగించడం వంటివి నాయకులపై పెట్టిన కేసులో ఉన్నాయి. ఇది విచారణలో ఉండగా సీబీఐ 120–బి కింద కుట్రకు పాల్పడ్డారంటూ అదనపు అభియోగాన్ని మోపింది. ఒకే ఉదంతంపై రెండు కేసులు పెట్టడం, అవి రెండూ వేర్వేరు న్యాయస్థానాల్లో కొనసాగడం విచిత్రం. కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వాలేవీ ఈ విషయంలో సీబీఐకి తగిన మార్గ నిర్దేశం చేయలేక పోయాయి. ఈ రెండు కేసులనూ విలీనం చేసి విచారించమని పాతికేళ్ల తర్వాత సుప్రీంకోర్టు చెప్పాల్సివచ్చింది. ఇది సీబీఐకి చెంపపెట్టు. న్యాయస్థానాల్లో సాగిన విచారణల పరంపర సంగతలా ఉంచి వివిధ దశల్లో ఆ తీర్పులకూ, సీబీఐ అప్పీళ్లకూ మధ్య ఉన్న వ్యవధి గమనిస్తే ఆశ్చర్యం కలుగు తుంది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కరసేవకులు ధ్వంసం చేసినప్పుడు, ఈ నేతలంతా అక్కడకు సమీపంలోనే ఉన్నారని... అంతక్రితం వారు చేసిన రెచ్చ గొట్టే ప్రసంగాలే అందుకు కారణమని సీబీఐ ఆరోపించింది. 1993 అక్టోబర్‌లో సీబీఐ ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేయగా మరో ఏడేళ్లకు... అంటే 2001 మే నెలలో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. విచారణ కొనసాగుతుండగా కుట్ర కేసు పెట్టడం సరికాదంటూ సాంకేతిక కారణాలను చూపి వారిపై ఈ అభియోగాన్ని తొలగించింది. దీనిపై అప్పీల్ చేయడానికి సీబీఐ మూడేళ్ల వ్యవధి తీసుకుని 2004 నవంబర్‌లో ఆ తీర్పుపై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో సీబీఐ అప్పీల్ చేసింది. ఈలోగా ఇతర నిందితులపై సీబీఐ అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసింది. 2010లో హైకోర్టు తీర్పు వెలువరిస్తూ కింది కోర్టుతో ఏకీ భవించింది. ఈ తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పర్యవసానంగా తాజా తీర్పు వచ్చింది. కుట్ర అభియోగాన్ని పునరుద్ధరించడంతోపాటు రెండు కేసులనూ కలిపి లక్నో సెషన్స్ కోర్టులో విచారణ సాగాలని, రోజువారీ ప్రాతి పదికన విచారణ కొనసాగించి రెండేళ్లలో తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయోధ్య అనగానే కోట్లాదిమంది హిందువులకు రాముడు గుర్తుకొస్తాడు. రాముడి గురించి, అయోధ్య గురించి తెలిసినవారికి కూడా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) రామ జన్మభూమి విముక్తి పేరుతో 80వ దశకంలో ఉద్యమం ప్రారం భించేవరకూ అందుకు సంబంధించిన వివాదం నడుస్తున్నదని తెలియదు. 1528లో నాటి మొగల్ చక్రవర్తి బాబర్ అయోధ్యలో ఉన్న రామాలయాన్ని కూల్చి మసీదు కట్టించాడన్నది వీహెచ్‌పీ, బీజేపీల వాదన. 1949లో ఆ మసీదు ఆవ రణలో రాముడి విగ్రహాన్ని ఉంచడంతో రాజుకున్న స్థల వివాదం ఫైజాబాద్ సివిల్ కోర్టులో కొనసాగుతూనే ఉంది. వీహెచ్‌పీ ఉద్యమాన్ని బీజేపీ స్వీకరించాక అది మరింత తీవ్ర రూపం దాల్చింది. అంతవరకూ అంతంతమాత్రంగా ఉన్న బీజేపీ దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడానికి, అధికారంలోకి రావడానికి బాబ్రీ మసీదు వివాదం ఏ స్థాయిలో తోడ్పడిందో అందరికీ తెలుసు. దాంతోపాటే ఆ వివాదం ప్రారంభమయ్యాక దేశంలో ఏర్పడ్డ వైషమ్య భావాలు బాబ్రీ మసీదు కూల్చివేతతో పరాకాష్టకు చేరాయి. దేశవ్యాప్తంగా చెలరేగిన మత కల్లోలాల్లో 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందరో గాయాలపాల య్యారు. వేల కుటుంబాలు నిరాధారమయ్యాయి. అనంతరకాలంలో దేశంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనలకు, ఉగ్రవాద ఉదంతాలకు మూలాలు బాబ్రీ విధ్వంసంలోనే ఉన్నాయి. అడ్వాణి తదితర నేతలపై సీబీఐ పెట్టిన అభియోగాలపై ప్రత్యేక కోర్టులో ఆనాటి ఐపీఎస్ అధికారిణి అంజూగుప్తా ఇచ్చిన వాంగ్మూలం కీలకమైనది. కర సేవకులు కూల్చివేత సాగిస్తుండగా సమీపంలోనే ఉన్నారని, నివారించే ప్రయత్నం చేయకపోగా ‘పని’ పూర్తయ్యేవరకూ కదలొద్దని వారిని ఆదేశించారని ఆరోపిం చారు. పైగా విధ్వంసం పూర్తయ్యాక మిఠాయిలు పంచుకున్నారని తెలిపారు. కరసేవకులు అప్పటికప్పుడు ఉద్రేకంలో విధ్వంసానికి పూనుకున్నారని బీజేపీ నేతలు చేసిన వాదనను ఆమె తోసిపుచ్చారు. అయితే అడ్వాణి మాత్రం బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు తన జీవితంలో అత్యంత విషాదకరమైన దినమని అనంతరకాలంలో వ్యాఖ్యానించారు. ఏదేమైనా కేసు ఈ స్థాయికి చేర డానికి పాతికేళ్లు పట్టడం మన దేశంలో నెలకొన్న అవ్యవస్థకు నిదర్శనం. కనీసం దేశాన్ని కుదిపిన కీలకమైన కేసుల్లోనైనా సత్వర విచారణ సాగాలని, దోషులని తేలితే ఎంతటివారికైనా శిక్షలు పడాలని కోరుకోవడం అత్యాశేమీ కాదు. కానీ అది కూడా సాధ్యపడని స్థితి నెలకొని ఉండటం ఎంత విషాదకరం! -
‘బాబ్రీ’ కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్
-
‘బాబ్రీ’ కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్
అడ్వాణీ, జోషిలను మళ్లీ విచారించాలన్న సీబీఐ న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ తదితర నేతలను మళ్లీ విచారించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ కేసులో అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 13 మంది భాజపా నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సిందేనని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. సీబీఐ వాదనపై సుప్రీంకోర్టు స్పందిస్తూ చట్టం నుంచి తప్పించుకునేందుకు అనుమతించాలా? న్యాయం జరగకపోవడాన్ని అంగీకరించాలా? అనే ప్రశ్నలు ముఖ్యమైనవని పేర్కొంది. సుమారు 25 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో న్యాయం జరగనట్టేనని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న విశేషాధికారాలను వినియోగించి రాయ్‌బరేలీ కోర్టులో వీవీఐపీలపై ఉన్న కేసును లక్నో కోర్టుకు బదిలీ చేసి, రెండేళ్లలో విచారణ పూర్తయ్యేలా చేయాలని సుప్రీంకోర్టు యోచిస్తోంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. 1992, డిసెంబర్ 6న జరిగిన వివాదాస్పద కట్టడం కూల్చివేతకు సంబంధించి రెండు కేసులు ఉన్నాయి. మొదటిది గుర్తుతెలియని ‘కరసేవకుల’పై లక్నో కోర్టులో కేసు. రెండోది రాయ్‌బరేలీ కోర్టులో అడ్వాణీ తదితర వీవీఐపీలపై ఉన్న కేసు. లక్నో కోర్టులో కరసేవకులకు వ్యతిరేకంగా ఉన్న కేసులో ఇప్పటివరకు 195 మంది సాక్షులను విచారించగా.. ఇంకా మరో 800 మందిని విచారించాల్సి ఉంది. రాయ్‌బరేలీ కోర్టులో ఇప్పటివరకు 57 మంది సాక్షులను విచారించగా.. మరో 105 మందిని విచారించాల్సి ఉంది. ఈ కేసులో భాజపా నేతలు అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా పలువురు సీనియర్ నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. మసీదు కూల్చివేతకు కుట్ర పన్నినట్లు నమోదైన ఆరోపణలను రాయ్‌బరేలీ కోర్టు తోసిపుచ్చింది. అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి తదితరులకు విముక్తి కల్పించింది. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు 2010 మే 20న ఇచ్చిన తీర్పులో సమర్థించింది. దీంతో ఈ కేసును సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. -
‘బాబ్రీ’పై సుప్రీం తీర్పును గౌరవిస్తాం
జమాతే–ఇ–ఇస్తామి హింద్ తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షుడు హన్మకొండ చౌరస్తా: బాబ్రీ మసీదు, అయోధ్య రామ మందిరం వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని జమాతే–ఇ–ఇస్లామి హింద్ తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షుడు మౌలానా హమీద్ మహ్మద్ ఖాన్ సాహెబ్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మ కొండలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబ్రీ వివాదంపై ఆరుసార్లు చర్చలు జరిగినా స్పష్టత లేక సమస్య అలాగే మిగిలిపోయిందని, గతం పునరావృతం కావద్దంటే న్యాయ స్థానమే సరైన తీర్పు చెప్పాలని, ఆ తీర్పుకు తాము కట్టుబడి ఉంటామన్నారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు ఇవ్వాలని, అప్పుడే ఆయా ఆస్తులకు రక్షణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేç Ùన్లు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీ కమిషన్‌ను నియమించడం సమంజసం కాదన్నారు. -
అయోధ్యపై మేం రెడీ: ముస్లిం లాబోర్డు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సూచనల మేరకు అయోధ్యలో రామమందిరం అంశాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవడానికి తాము సిద్ధమని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి– బాబ్రీ మసీదు స్థల వివాదం పరిష్కారం కోసం సుప్రీంకోర్టు మంగళవారం కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. మతంతో పాటు సున్నితమైన భావోద్వేగాలు కేసుతో ముడిపడినందున చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడం ఉత్తమమని కోర్టు అభిప్రాయపడింది. ఇరు వర్గాలు కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ స్పష్టం చేశారు. కేసును త్వరగా విచారించాలంటూ పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి అభ్యర్థనపై స్పందిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అర్థవంతమైన, చిత్తశుద్ధితో కూడిన చర్చల కోసం కక్షిదారులు ‘కొంత ఇచ్చి కొంత పుచ్చుకునే’ విధానం అవలంభించాలని కోరింది. ఆ మేరకు రామ జన్మభూమి– బాబ్రీ మసీదు స్థల వివాదంలో అంగీకారం కుదిరేలా తాజాగా ప్రయత్నించాలని పిటిషనర్‌కు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు చెందిన మౌలానా ఖలీద్ రషీద్ స్పందించారు. న్యాయస్థానం సూచనల మేరకు కోర్టు బయట రామమందిర వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టంచేశారు. -
రాజీయే ఉత్తమం
- అయోధ్య వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచన - ‘రామ జన్మభూమి–బాబ్రీ మసీదు’ వివాదం భావోద్వేగాలతో ముడిపడింది - ఇరువర్గాలు కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న ప్రధాన న్యాయమూర్తి - అర్థవంతమైన, చిత్తశుద్ధితో కూడిన చర్చలు అవసరమన్న న్యాయస్థానం - తీర్పును స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు - చర్చలకు సిద్ధమన్న ఆర్ఎస్ఎస్, బాబ్రీ కమిటీ న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి– బాబ్రీ మసీదు స్థల వివాదం పరిష్కారం కోసం సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. మతంతో పాటు సున్నితమైన భావోద్వేగాలు కేసుతో ముడిపడినందున చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమని కోర్టు అభిప్రాయపడింది. ఇరు వర్గాలు కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ స్పష్టం చేశారు. కేసును త్వరగా విచారించాలంటూ పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి అభ్యర్థనపై స్పందిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఈ అంశాలు మత, భావోద్వేగాలతో ముడిపడ్డవి. వివాదానికి ముగింపు పలికేందుకు ఈ అంశాలపై అన్ని వర్గాలు కలిసి కూర్చుని అంగీకారానికి రావచ్చు. ఈ అంశాల్ని ఉమ్మడిగా పరిష్కరించుకుంటేనే ఉత్తమం. కలిసి కూర్చుని సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరపవచ్చు’ అని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం సలహాలిచ్చింది. అర్థవంతమైన, చిత్తశుద్ధితో కూడిన చర్చల కోసం కక్షిదారులు ‘కొంత ఇచ్చి కొంత పుచ్చుకునే’ విధానం అవలంభించాలని కోరింది. ఆ మేరకు రామ జన్మభూమి– బాబ్రీ మసీదు స్థల వివాదంలో అంగీకారం కుదిరేలా తాజాగా ప్రయత్నించాలని పిటిషనర్‌కు సూచించింది. అవసరమైతే నేను కూడా చర్చల్లో పాల్గొంటా: సీజేఐ ‘అవసరమైతే వివాదం పరిష్కారానికి మధ్యవర్తిని ఎన్నుకోండి. చర్చల కోసం ఎంచుకున్న మధ్యవర్తులతో పాటు నేను కూడా చర్చల్లో పాల్గొనాలని ఇరు వర్గాలు కోరితే అందుకు సిద్ధం. మా సోదర న్యాయమూర్తుల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి’ అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇరు వర్గాలు కోరితే కీలక మధ్యవర్తిని కూడా నియమిస్తామని సీజేఐ హామీనిచ్చారు. కేసుకు సంబంధించిన కక్షిదారులందర్నీ సంప్రదించి, రాజీ విషయంలో వారి అభిప్రాయమేంటో కోర్టుకు తెలపాలని సుబ్రహ్మణ్యస్వామికి ప్రధాన న్యాయమూర్తి సూచించారు. రామ మందిర నిర్మాణానికి అనుమతివ్వాలన్న స్వామి.. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి అనుమతి వ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అభ్యర్థన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాదాన్ని త్వరగా విచారించాల్సిన అవసరముందని, కేసులో హైకోర్టు తీర్పు వెలువరించి ఆరేళ్లు గడిచిందని, అందువల్ల వీలైనంత వేగంగా విచారణ కొనసాగించాలని స్వామి కోరారు. న్యాయపరమైన నిర్ణయానికి అనుకూలమంటూ ముస్లిం నేతలు తనకు చెప్పారంటూ ఆయన కోర్టుకు వెల్లడించారు. అయోధ్య వివాదంలో తనను కూడా కక్షిదారుగా చేర్చాలంటూ గతేడాది ఫిబ్రవరి 26న సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును కోరారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలో ధర్మాసనం అందుకు అనుమతిస్తూ.. స్వామి పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి అనుమతివ్వాలని, అలాగే తన పిటిషన్‌ను త్వరగా విచారించాలని స్వామి ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. మసీదును వేరే చోటుకి మార్చొచ్చు: పిటిషన్లో స్వామి ఇస్లామిక్ దేశాల్లో అనుసరిస్తున్న విధానాల ప్రకారం రోడ్ల నిర్మాణం వంటి ప్రజా ప్రయోజనాల కోసం మసీదును వేరే స్థలానికి మార్చవచ్చని, అయితే ఒకసారి హిందూ ఆలయాన్ని నిర్మించాక దాన్ని ముట్టుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంను కోరారు. వివాదాస్పద స్థలానికి సంబంధించి 2.77 ఎకరాల్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. తీర్పుపై ఎవరేమన్నారంటే.. ఆహ్వానించదగ్గ పరిణామం: బీజేపీ సుప్రీం సూచన ఆహ్వానించదగ్గ పరిణామమని, ఇరు వర్గాలు కోర్టు వెలుపల వివాదాన్ని పరిష్కరించుకోవాలని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా చెప్పారు. సున్నిత అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఇరుపార్టీలు చర్చలు జరపాలని సూచించారు. సుప్రీంకోర్టు చాలా మంచి సూచన చేసిందని, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడంతో మున్ముందు సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయని బీజేపీ ఎంపీ వినత్ కతియార్ అన్నారు. ఏకాభిప్రాయ పరిష్కారం అవసరం: కాంగ్రెస్ అయోధ్య వివాదంలో ఏకాభిప్రాయంతో కూడిన పరిష్కారం అవసరమని, దీర్ఘకాలంలో శాంతి, సామరస్యాల సాధనకు అది ఉపయోగపడుతుం దని కాంగ్రెస్ అభిప్రాయ పడింది. ఇరువైపులా పరస్పర అంగీకారంతో కూడిన ఏకాభిప్రాయానికి రావాలని ఆ పార్టీ ముఖ్య ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. అందరి సహకారంతో ఆలయం: ఆరెస్సెస్ సుప్రీంకోర్టు సూచనను ఆరెస్సెస్ స్వాగతిస్తూ.. వివాదం వీలైనంత త్వరగా పరిష్కారం కావాలని, అలాగే అందరి సహకారంతో రామ మందిరం నిర్మించాలని కోరింది. తాము కేసులో కక్షిదారు కాకపోయినా.. ధర్మ సంసద్ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా సమర్థిస్తామని చెప్పింది. సీజేఐ మధ్యవర్తిత్వం: బాబ్రీ యాక్షన్ కమిటీ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని, ఆయన్ని నమ్ముతున్నామని బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. అలాగే కేసు పరిష్కారానికి ఒక బృందాన్ని నియమించేందుకూ సిద్ధమని, అయితే కోర్టు వెలు పల ఏకాభిప్రాయం సాధ్యం కాదని పేర్కొంది. మందిరం కోసం చట్టం: వీహెచ్‌పీ రామమందిరం నిర్మాణ కోసం కేంద్రం చట్టం తీసుకురావాలని విశ్వ హిందూ పరిషత్ చీఫ్ ప్రవీణ్ తొగాడియా కోరారు. వివాదాస్పద స్థలం ‘భగవాన్ రామ్’కు చెందినదని, ఆ స్థలంలో రాముడి ఆలయం నిర్మించాలని పేర్కొన్నారు. మధ్యవర్తిని సూచించాలని కోరా: స్వామి రామ జన్మభూమిలో రామ మందిరాన్ని తప్పక నిర్మించాలని, సరయూ నది అవతలి వైపు మసీ దు ఉండాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. మధ్యవర్తిని సూచించాలని సుప్రీం కోర్టును కోరానని, మార్చి 31లోపు నిర్ణయం వెలువడవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం నిర్ణయం కోసం చూస్తున్నా: ఒవైసీ బాబ్రీ మసీదు కూల్చివేతపై పెండింగ్‌లో ఉన్న ధిక్కార పిటిషన్‌పై కోర్టు నిర్ణయం తీసుకుంటుం దని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు. కేసును రోజు వారీ విచారణ జరిపేలా సుప్రీంను కోరాలని సూచించారు. అయోధ్య మందిరం వివాదం: 1528 నుంచి 2017 వరకు (సాక్షి నాలెడ్జ్ సెంటర్) 488 ఏళ్ల అయోధ్య పరిణామాల్లో ముఖ్యమైనవి కొన్ని.. ⇒ 1528: ప్రస్తుత యూపీలో అవధ్లోని అయోధ్యలో మొఘల్ చక్రవర్తి బాబర్ సైనికాధికారి మీర్ బాకీ తాష్కండీ మసీదు నిర్మించాడు. శ్రీరాముడి జన్మస్థానంలోని గుడి కూల్చేసి, దానిపై మసీదుకట్టారని హిందువులు నమ్ముతున్నారు. ⇒ 1853: అయోధ్యలో ఈ వివాదం కారణంగా తొలి మతఘర్షణ జరిగింది. ⇒ 1859: ఈ కట్టడం చుట్టూ బ్రిటిష్ సర్కారు కంచె వేసి, హిందువులు, ముస్లింల ప్రార్థనల కోసం రెండుగా విభజించింది. ⇒ 1949: సీతారాముల విగ్రహాలు మసీదులో కనిపించాయి. ముస్లింలు నిరసన తెలిపాక, ఇది తమదని వాదిస్తూ హిందువుల తరఫున మహంత్ పరమహంస్ రామచంద్రదాస్, ముస్లింల తరఫున హషీం అన్సారీ కోర్టుకెక్కారు. ప్రభుత్వం దీన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించి, గేట్లకు తాళాలేసింది. ⇒ 1950: విగ్రహపూజకు అనుమతించాలని రామచంద్రదాస్, గోపాల్‌సింగ్ విశారద్లు ఫైజాబాద్ కోర్టును కోరారు. లోపలి ప్రాంగణానికి తాళాలున్నా, బయట పూజకు అనుమతించింది. ⇒ 1961: మసీదు తమదంటూ యూపీ సెంట్రల్ సున్నీ వక్ఫ్‌బోర్డు కేసు వేసింది. ⇒ 1984: రామజన్మభూమిని ‘విముక్తి’ చేయడానికి వీహెచ్‌పీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు. ఉద్యమ బాధ్యత అడ్వాణీకి అప్పగింత. ⇒ 1986: హిందువులు ప్రార్థన కోసం మసీదు గేట్లు తెరవాలని ఫైజాబాద్ జిల్లా జడ్జీ ఆదేశించారు. ముస్లింలు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ⇒ 1989: వివాదాస్పద మసీదును ఆనుకుని ఉన్న స్థలంలో ఆలయ నిర్మాణానికి ‘శిలాన్యాస్’కు వీహెచ్‌పీకి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం అనుమతించాక, వీహెచ్‌పీ ఉద్యమాన్ని ఉధృతం చేసిం ది. తర్వాత కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ. ⇒ 1990: ఆలయానికి ప్రజల మద్దతు కూడగట్టడానికి అడ్వాణీ గుజరాత్‌లోని సోమ్‌నాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభం. ⇒ 1990: అక్టోబర్ 23న బిహార్‌లోని సమస్తిపూర్‌లో రథయాత్రను సీఎం లాలూ ఆదేశాలపై నిలిపివేశాక, అడ్వాణీని అరెస్టు చేశారు. అరెస్టుకు నిరసనగా వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించాక జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ బలం లోక్‌సభలో పెరిగింది. ⇒ 1992: డిసెంబర్ 6న సంఘ్ పరివార్ సంస్థలు సమీకరించిన ‘కరసేవకులు’ మసీదును కూలగొట్టి, తాత్కాలిక గుడి ఏర్పాటు చేశారు. అప్పటి పీవీ ప్రభుత్వం ఈ ‘గుడి’ని తొలగించకుండానే యథాస్థితి కొనసాగేలా హైకోర్టు అనుమతి కోరింది. ⇒ 1993: ముంబైలో మత ఘర్షణలు జరిగాయి. ముస్లింలు ఎక్కువ మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా ముంబైలో మార్చి 12న పన్నెండు చోట్ల జరిపిన బాంబు పేలుళ్లలో దాదాపు 900 మంది ప్రాణాలు కోల్పోయారు. ⇒ 2002: ఫిబ్రవరిలో అయోధ్య నుంచి అహ్మదాబాద్ వస్తున్న సబర్మతీ రైల్లో కరసేవకులున్న బో గీలపై గోధ్రాలో జరిగిన దాడిలో 58 మంది మ రణించారు. దీంతో గుజరాత్లో చెలరేగిన అల్ల ర్లు 2వేల మంది ముస్లింలను బలిగొన్నాయి. ⇒ 2003: మార్చి5న అలహాబాద్ హైకోర్టు భారత పురావస్తు పరిశోధనా సంస్థను మసీదు నిర్మించి న చోట పూర్వం రాముడి గుడి ఉందో లేదో కనుగొనేందుకు తవ్వకాలకు ఆదేశించింది. ⇒ 2003: వివాదాస్పద స్థలంలో జరిపిన తవ్వకాల్లో పదో శతాబ్దంనాటి ఆలయ అవశేషాలు కనిపించాయని చెబుతూ ఆగస్టు 22న పురావస్తు శాఖ నివేదిక సమర్పించింది. ⇒ 2010: మందిర్–మసీదు వివాదంపై హైకోర్టు తన తీర్పు వాయిదావేసింది. సమస్యను ఇరు పక్షాలూ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ⇒ 2010: వివాదాస్పద స్థలాన్ని 3 భాగాలు చేసి సున్నీవక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖఢా, ‘రాం లల్లా’ తరఫు సంస్థకు పంచుతూ అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30న తీర్పునిచ్చింది. ⇒ 2011: ఈ తీర్పును సవాలుచేస్తూ హిందూ, ముస్లిం సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాక, అలహాబాద్ హైకోర్టు తీర్పు అమలును సుప్రీంకోర్టు నిలిపివేస్తూ మేలో ఆదేశాలిచ్చింది. ⇒ 2016: ఆలయం నిర్మించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ విచారణకు ఫిబ్రవరి 26న సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. -
అయోధ్యకు అటు ఇటు
-
రామమందిరం నిర్మాణం ఇప్పట్లో కాదా?
న్యూఢిల్లీ: ‘ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అడ్డుగా ఉన్న అవరోధాలను క్రమంగా అధిగమించి ఆలయ నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తుంది’ అని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటారు? ఆ దిశగా ఆయన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కోర్టు పరిధిలోఉన్న ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు? అన్న అంశంపై అప్పుడే హిందుత్వ వాదుల్లో చర్చ ప్రారంభమైంది. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని బలంగా కోరుకుంటున్న హిందూ నాయకుల్లో ఆధిత్యనాథ్ ఒకరనే విషయంలో ఎలాంటి సందేహం లేకపోయినా, గతంలో రామమందిరం ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లిన దిగ్విజయ్నాథ్, అవైద్యనాథ్ లాంటి కరడుగట్టిన నాయకుడేమీ కాదు. రామమందిరం నిర్మాణ అంశాన్ని చేతనావస్థలో ఉంచేందుకు, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ఎన్నికల్లో బీజీపీ కాకుండా ఎస్పీ, బీఎస్పీలు విజయం సాధించినట్లయితే అయోధ్య శ్మశానంగా మారుతుందని కూడా ఆయన ఓటర్లను హెచ్చరించారు. గోరక్‌పూర్‌లోని గోరక్షకపీఠం మందిరానికి 1935 నుంచి 1969వరకు మహంత్‌గా పనిచేసిన దిగ్విజయ్నాథ్ మొట్టమొదటగా అయోధ్యలోని బాబ్రీ మసీదు మొత్తాన్ని రామమందిరంగా మార్చాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి విస్తృత ప్రచారాన్ని కల్పించారు. ఆ తర్వాత 1949, డిసెంబర్ 22వ తేదీ రాత్రి బాబ్రీ మసీదులోకి వెళ్లి రాముడి విగ్రహాన్ని అనూహ్యంగా ప్రతిష్టించారు. అప్పటి హిందూ మహాసభ ప్రముఖ నాయకుల్లో ఒకరైన హిందూ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్, ఆయన అనుచరుల అండతో ఆయన ఆయన ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని రహస్యంగా గావించారు. దిగ్విజయ్నాథ్ మరణానంతరం ఆయన శిష్యుడు అవైద్యనాథ్ (ప్రస్తుత ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ గురువు) భారతీయ జనతా పార్టీ అండతో రామ మందిర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అది చివరకు 1992, డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసింది. 1989లో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళాలో విశ్వహిందూ పరిషద్ ఆధ్వర్యంలో జరిగిన సాధువుల సమ్మేళనంలో ప్రసంగించడం ద్వారా అవైద్యనాథ్ రామ మందిరం ఉద్యమానికి ఊపును తీసుకొచ్చారు. ‘అనవసరమైన సంఘర్షణను నివారించేందుకు మరోచోట రామాలయాన్ని నిర్మించుకోవాల్సిందిగా ముస్లిం పెద్దలు సూచించడం ఎలా ఉందంటే రావణుడితో యుద్ధాన్ని నివారించేందుకు మరో సీతను వెతుక్కోవాల్సిందిగా రాముడికి సూచించినట్లుగా ఉంది’ అంటూ ఆయన నాడు చేసిన వ్యాఖ్యలు సాధువులకు స్ఫూర్తినిచ్చాయి. మహంత్ అవైద్యనాథ్ సహా ఉమా భారతి, సాధ్వీ రితంబరి, పరమహంస రామచందర్ దాస్, ఆచార్య ధర్మేంధ్ర దేవ్, బీఎల్ శర్మ తదితరులు ఉద్రేకపూరిత ప్రసంగాల ద్వారా బాబ్రీ మసీదు విధ్వంసానకి కారణమయ్యారంటూ లిబర్హాన్ కమిషన్ తప్పుపట్టినా వారికి ఎలాంటి శిక్షలు పడలేదు. 2014లో అవైద్యనాథ్ మరణించగా, ఆయన రెండు దశాబ్దాల ముందే, అంటే 1994లోనే తన వారుసుడిగా యోగి ఆధిత్యనాథ్‌ను ప్రకటించారు. ఇప్పుడు ఆయన నేతత్వంలో రామ మందిరం నిర్మాణం ఊపందుకుంటుందని హిందూత్వవాదులు భావిస్తున్నారు. అభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇస్తామంటున్న బీజేపీ రామ మందిరం జోలికి వెళ్లే అవకాశం లేదు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందున వెళ్లాల్సిన అవసరం కూడా కనిపించడం లేదు. కోర్టు కేసులు ముందుగా పరిష్కారం కావాలంటూ కాలయాపన చేసి, 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల నాటికి రామ మందిరం నిర్మాణ అంశాన్ని ప్రధాన డిమాండ్‌గా ముందుకు తీసుకొస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
పీవీ మంచి చేశారు.. చెడూ చేశారు!: అన్సారీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన విధానాలతో దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కొనియాడారు. 1991లో ఆర్థిక వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు దేశాన్ని మార్చివేశాయన్నారు. అయితే ఆయన తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాల ప్రతికూల పర్యవసానాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనను నిలువరించడంలో విఫలమయ్యారని, అప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇంకా దేశాన్ని వీడలేదన్నారు. వినయ్ సీతాపతి రచించిన‘హాఫ్ లయన్-హౌ పీవీ నరసింహారావు ట్రాన్స్‌ఫామ్డ్ ఇండియా’ పుస్తకావిష్కరణ సభలో అన్సారీ మాట్లాడారు. -
బాబ్రీ, గోద్రాలవల్ల ‘ఉగ్ర’ ఆకర్షణ
న్యూఢిల్లీ: పలువురు భారతీయ యువకులు అల్ కాయిదా ఉగ్రవాదసంస్థ వైపు ఆకర్షితులవడానికి బాబ్రీ మసీదు విధ్వంసం(1992), గోద్రా అల్లర్లు(2002) కారణమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక విభాగం దాఖలు చేసిన చార్జిషీట్లో ఈ విషయాన్ని పేర్కొంది. బాబ్రీ విధ్వంసం, గోద్రా అల్లర్లు తరువాతే పలువురు భారతీయ యువకులు అల్ కాయిదాలో చేరారని, భారత ఉపఖండంలో అల్‌కాయిదా(ఏక్యూఐఎస్) ఏర్పాటుకు యత్నిస్తున్నారని 17 మంది నిందితులపై దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొంది. వివిధ మసీదుల్లో జిహాద్ ఉపన్యాసాలు చేసే సందర్భంగా సయ్యద్ అంజార్ షా(అరెస్టైన నిందితుడు), మహ్మద్ ఉమర్(పరారీలో ఉన్న మరో నిందితుడు)ను కలిశాడని, భారత్‌లో ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించి చర్చించుకున్నారని, ప్రత్యేకించి గోద్రా, బాబ్రీ అంశాలపై చర్చించారని పేర్కొంది. -
‘డాక్టర్ బాంబ్’కు జీవితఖైదే
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 43 బాంబు పేలుళ్లకు పాల్పడిన, ‘డాక్టర్ బాంబ్’గా పిలిచే జలీస్ అన్సారీకి జీవితఖైదే సరైందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజస్థాన్‌లో విధ్వంసానికి సంబంధించి అన్సారీ సహా 11 మందికి రాజస్తాన్‌లోని అజ్మీర్ న్యాయస్థానం విధించిన ఈ శిక్షను బుధవారం సుప్రీంకోర్టు సమర్థించింది. తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్(టీఐఎం) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అన్సారీ సృష్టించిన విధ్వంసాలు నగరంలోనూ ఐదు ఉన్నాయి. అన్సారీతో పాటు అప్పట్లో నగరంలో నివసించిన అబ్దుల్ కరీం తుండా సైతం ఇందులో కీలకపాత్ర పోషించాడు. తుండాను 2012లో ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ముంబై ఏటీఎస్ అధికారులు 2010 అక్టోబర్‌లో గోల్కొండ ప్రాంతంలో అరెస్ట్ చేసిన మహారాష్ట్ర వాసి సయ్యద్ ముసద్ధిఖ్ వహీదుద్దీన్ ఖాద్రీ సైతం ఇతడి ప్రధాన అనుచరుడే. ముంబైకి అన్సారీ ముంబాయ్ వర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1992లో బాబ్రీ విధ్వంసానికి ప్రతీకారంగా తుండా, అన్సారీ, కోల్‌కతాకు చెందిన అబ్దుల్లా మసూద్, వరంగల్ వాసి ఆజం ఘోరీ కలసి టీఐఎంను స్థాపించారు. ఈ మాడ్యుల్ 1993-94ల్లో రాజస్తాన్, మహారాష్ట్ర, హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 43 బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఈ మాడ్యుల్ టార్గెట్ చేసిన వాటిలో రైళ్లు, రైల్వేస్టేషన్లే ఎక్కువ. 1993లో అన్సారీ తన మాడ్యుల్ సాయంతో రాజస్తాన్, మహారాష్ట్రతో పాటు నగరంలోని ఐదు ప్రాంతాల్లో పేలుళ్లకు ఒడిగట్టి.. నలుగురి ప్రాణాలు తీశాడు. తక్కువ ప్రభావం గల బాంబులను తయారు చేయడంలో దిట్ట అయిన అన్సారీని పోలీసు, నిఘా వర్గాలు ‘డాక్టర్ బాంబ్’ అనే పేరుతో పిలుస్తుంటాయి. 1994 జనవరి 12న ముంబై పోలీసులు అన్సారీని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పీటీ వారెంట్‌పై అజ్మీర్ తరలించారు. అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉండటంతో సిటీలోని కేసులు పెండింగ్‌లో ఉండిపోయాయి. 2012లో రాజస్తాన్‌లోని కేసుల విచారణ పూర్తికావడంతో ఆ పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చి మళ్లీ తీసుకువెళ్లారు. అన్సారీపై హైదరాబాద్‌లో నమోదైన కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. నగరంలో టీఐఎం ఘాతుకాలివి... 12.08.1993: అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ జంక్షన్ బాక్స్‌పై బాంబు విసిరారు. సుబ్బారాయుడు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఇదే రోజు హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో మరో బాంబు పేలింది. 12.09.1993: సికింద్రాబాద్‌లోని రైల్వే రిజర్వేషన్ కాంప్లెక్స్ క్యాష్ రూమ్ వద్ద పేలుడు. బాలాజీ, బాలసుబ్రహ్మణ్యం అనే ఇద్దరు మణించారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. 22.10.1993: నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద పేలుడు. ఇందులో మహ్మద్ పాషా అనే వ్యక్తి మరణించగా.. యూసుఫుద్దీన్, మల్లమ్మ తదితరులు గాయపడ్డారు. 6.12.1993: మల్కాజ్గిరి పరిధిలోని మౌలాలీ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్స్‌పై ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను టార్గెట్ చేసుకుని బాంబు పేల్చగా.. ఓ వ్యక్తి మరణించాడు. మరికొందరు గాయపడ్డారు. -
హిందువులు కల్యాణి బిర్యానీ తినాలంటే ఎలా ఉంటుంది?
* మనుషుల కంటే గోవులను రక్షించే ప్రభుత్వం * ప్రపంచ పర్యటనలకే ప్రధాని మోదీ పరిమితం * బాబ్రీ మసీదు కూల్చివేత నిరసన సభలో అసదుద్దీన్ సాక్షి, హైదరాబాద్: ‘ముస్లింలు సహనం ప్రదర్శించేందుకు బహిరంగంగా పంది మాంసం తిని చూపించాలని త్రిపుర గవర్నర్ వ్యాఖానించారని.. తాను హిందువులు సహనం చూపిం చేందుకు కల్యాణి బిర్యానీ తినాల్సి ఉంటుంది‘ అంటే ఎలా ఉంటుందని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాం మైదానంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘గోవు మాసం తింటే మనుషులను చంపుతారా..? మనిషి ప్రాణాల కంటే జంతువుల ప్రాణాలు ముఖ్యమా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రజల ప్రాణాల కంటే గోవులను రక్షించే ప్రభుత్వంగా తయారైందని ఎద్దేవా చేశారు. దేశ సరిహద్దులో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా...నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటుతున్నా.. ఆ ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. కేవలం ప్రపంచ పర్యటనలో మోదీ తేలియాడుతున్నారని విమర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు బీఫ్ విందు నిర్వహిస్తున్నారని, పప్పుల ధరల కంటే మాంసం ధరలు తక్కువగా ఉన్నప్పుడు నిరుపేదలు తినకుండా ఎలా ఉంటారన్నారు. ప్రజా స్వామ్య దేశంలో ఏ వ్యక్తికైనా ఏదైనా తినే స్వేచ్ఛ ఉందన్నారు. హిందుస్థాన్ హిందువులది, ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని అసోం గవర్నర్ వాఖ్యానించడాన్ని అసద్ తప్పు పట్టారు. దేశం అందరిదనీ, అలాంటప్పుడు పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్తామని అసదుద్దీన్ ప్రశ్నించారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్, హిందూ వాహిణీలు ముస్లిం జనాభా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తుయ విమర్శించారు. దమ్ముంటే స్వామీజీలు పెళ్లి చేసుకొని ఒకరిని పుట్టించి చూపించాలని సవాల్ చేశారు. దేశంలో ప్రస్తుతం సహనం..అసహనం గురించి చర్చ జరుగుతోందని, ప్రముఖ సాహిత్య వేత్తలు కూడా తమ అవార్డులను వెనక్కి ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఐఎస్ఎస్తో ఇస్లాంకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఆముదం తాగిస్తాం కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆముదం తాగించి తీరుతామని అసద్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను 70 ఏళ్లు మోసం చేసింది చాలక ఇటీవల బెంగళూర్ ఎన్నికల ప్రచారంలో నిజాం దక్కన్‌ను ద్రోహిగా వర్ణించారని ఆరోపించారు. నిజాం చేసిన సేవలు మరిచి తప్పుడు ప్రచారం చేయడం సహించరానిదన్నారు. కాంగ్రెస్‌కు ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరించిందని అసద్ ఆరోపించారు. బీజేపీ తొలి ప్రధాని వాజ్‌పేయి కాదని, పీవీ నర్సింహారావు అని విమర్శించారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బరిలో దిగుతామని ప్రకటించారు. -
వారిని ఎందుకు వదిలేశారు..
న్యూఢిల్లీ: ముంబై వరుస బాంబుపేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను ఖరారు చేయడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తంచేసిన ఒవైసీ.. మెమన్ మరణశిక్షపై విమర్శలు గుప్పించారు. యాకూబ్ మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. బుధవారం అతనికి మరణశిక్షను ఖరారుచేసింది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దోషులకు శిక్ష పడాల్సిందే.. మరి బాబ్రీ మసీదును కూల్చేసిన విధ్వంసకుల మాటేమిటని ప్రశ్నించారు. వారికి శిక్షలు ఎందుకు విధించరని ప్రశ్నించారు. ఒకవైపు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, బియాంత్ సింగ్ హంతకులకు శిక్షలు తగ్గిస్తూ, మరోవైపు మెమన్‌కు శిక్ష ఖరారు చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు. అయితే అందరూ సంయమనం పాటించాలని.. చట్టాలను, కోర్టులను గౌరవించాలన్నారు. శాంతి భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రాజకీయ మద్దతు లేనందువల్లే యాకూబ్‌కు ఉరిశిక్షను విధించారనేదే ఇప్పటికీ తన అభిప్రాయమన్నారు. యాకూబ్ పోలీసుల ముందు లొంగిపోయి, కీలకమైన సమాచారం అందించాడన్నారు. అయినా అప్పటి ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు యాకూబ్‌కు న్యాయం చేయలేదని, మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాం జెఠ్మలానీ ,శతృఘ్నసిన్హా తదితరులు కూడా యాకూబ్ మెమన్ ఉరిశిక్షను వ్యతిరేకిస్తున్నారని ఒవైసీ గుర్తు చేశారు. -
‘బాబ్రీ విధ్వంసంలో పాత్రకు ప్రతిఫలం’
లక్నో: పీవీకి ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించనున్న స్మారకం.. బాబ్రీ మసీదు విధ్వంసం, దాని స్థానంలో తాత్కాలిక రామమందిర నిర్మాణంలో ఆరెస్సెస్‌తో ఆయన లోపాయికారీ అవగాహనకు ప్రతిఫలమని యూపీ మంత్రి ఆజమ్ ఖాన్ విమర్శించారు. ఈ స్మారకంతో కేంద్రం బాబ్రీ విధ్వంసాన్ని దేశచరిత్రలో భాగం చేయాలనుకుంటోందన్నారు. -
అద్వానీకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : బీజేపీ అగ్రనేత ఎల్‌కె. అద్వానీకి మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసు నుంచి విముక్తిపై న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. అద్వానీతో పాటుమురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్, ఉమాభారతితో పాటు వీహెచ్‌పీ నేతలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో న్యాయస్థానం వివరణ కోరింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కాగా బాబ్రీ కేసు నుంచి అలహాబాద్ కోర్టు అద్వానీకి విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కేసు నుంచి అద్వానీ సహా 19 మందికి ఉపసమనం కల్పిస్తూ అలహాబాద్ హైకోర్టు వెలువరించిన తీర్పును సిబిఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారన్న కేసు నుంచి అద్వానీ, కల్యాణ్ సింగ్, ఉమాభారతి, వినయ్ కటియార్, మురళీ మనోహర్ జోషి తదితరులకు అలహాబాద్ హైకోర్టు ఉపశమనం కల్పించింది. సతీష్ ప్రధాన్, సిఆర్ బన్సల్, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్, సాధ్వీ రితంబర, విహెచ్ దాల్మియా, మహంత్ అవైధ్యనాథ్, ఆర్వి వేదాంతి, పరమ్ హాన్స్ రామ్ చంద్రదాస్, జగదీష్ ముని మహారాజ్, బిఎల్ శర్మ, నృత్యగోపాల్ దాస్, ధరమ్‌దాస్, సతీష్ నాగర్, మరేశ్వర్ సావే పేర్లను తొలగించారు. మరణానంతరం బాల్ థాకరే పేరును జాబితాలోంచి తీసివేశారు. -
నిరసన హోరు
బాబ్రీ మసీదు కూల్చివేత దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో శనివారం నిరసనలు హోరెత్తాయి. బాబ్రీ మసీదు పున ర్నిర్మాణం కాంక్షిస్తూ మైనారిటీ సంఘాలు, రామాలయం నిర్మాణం లక్ష్యంగా హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పోటాపోటీ ఆందోళనలు ఎక్కడ ఉద్రిక్తతను రేపుతాయోనన్న ఉత్కంఠ నడుమ పోలీసులు విధుల్ని నిర్వర్తించి చివరకు ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి, చెన్నై: బాబ్రీ మసీదు కూల్చి వేసిన రోజు అంటే పోలీసులకు హైటెన్షన్. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాలు, అన్ని మతాలకు చెందిన ఆలయాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రతతో వ్యవహరించారు. తనిఖీలు ముమ్మరం చేసి అప్రమత్తంగా వ్యవహరించడంతో బ్లాక్ డే కేవలం నిరసనలతో గడిచింది. అయితే, హిందూ సంఘాలు ఈ సారి రామాలయం నిర్మాణం నినాదంతో ఆందోళనలకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. అనుమతులు లేకుండా నిరసనలు తెలియజేసిన హిందూ సంఘాల్ని పలు చోట్ల పోలీసులు అరెస్టు చేయడంతో బ్లాక్ డే ప్రశాంతగా గడిచింది. నల్లచొక్కాలతో...: బాబ్రీ మసీదు పున ర్నిర్మాణం, జాతీయ సమైక్యతను కాంక్షిస్తూ మైనారిటీ సంఘా లు, పార్టీలు నిరసనలతో హోరెత్తించాయి. తమిళనా డు ముస్లిం మున్నేట్ర కళగం, తమిళనాడు ముస్లిం లీగ్, తమిళనాడు తౌపిక్ జమాత్, మనిదనేయ మక్కల్ కట్చి, ఎస్డీపీఐ, ఐఎన్టీజే తదితర సం ఘాలు, పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. నల్ల చొక్కాల్ని ధరించి తమ నిరసనల్ని తెలియజేశారు. చెన్నై నగంరలో నాలుగు చోట్ల నిరసనలు సాగాయి. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం నేత అబూబక్కర్ నేతృత్వంలో జరిగిన నిరసనలో శ్రీలంక తమిళుల పరిరక్షణ కమిటీ నేత పల నెడుమారన్, మనిమారణ్ సైతం పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారు. ఇదే వేదిక మీద చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతీయ సమైక్యతను, సర్వమత సామరస్యాన్ని చాటే విధంగా వస్త్రాల్ని ధరించి తమ ఐక్యతను చాటుకోవడం విశేషం. తమను ఎవ్వరూ విడదీయలేరని, తాము భారతీయులం, జాతీయ సమైక్యతకు పాటుపడుతామని నినదించారు. చెన్నైలో జరిగిన నిరసనలకు పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు సైతం తరలి వచ్చారు.రామాలయం లక్ష్యం: అయోధ్యలో రామాలయం నిర్మాణమే లక్ష్యంగా పిలుపునిస్తూ హిందూ సంఘా లు ఆందోళనకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, హిందూ మున్నని, విశ్వహిందూ పరిషత్‌ల నేతృత్వంలో నిరసనలు సాగాయి. రామాలయం నిర్మా ణం నినాదంతో ఫ్లకార్డులను చేత బట్టి ఆందోళనల కు దిగారు. పలు చోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా నిరసనలు చేపట్టిన హిందూ సంఘాల్ని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో ఎగ్మూర్, తాంబ రం, మాధవరంలలో ఈ నిరసనలు సాగాయి. ముందస్తు అనుమతులు లేకుండా నిరసనలు చేపట్టినందుకు గాను 200 మంది హిందూ సంఘాల నాయకుల్ని అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేశారు. -
బ్లాక్ డేకు భారీ బందోబస్తు
*జంట కమిషనరేట్లలో 144 సెక్షన్ *పాతబస్తీలో పోలీసు బలగాల మోహరింపు హైదరాబాద్ : బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన డిసెంబర్ ఆరో తేదీని బ్లాక్‌డేగా ప్రకటిస్తున్నట్లు ఎంఐఎం, ఎంబీటీ పార్టీలు పిలుపునివ్వగా బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ నేతలు విజయ్ దివస్‌గా నిర్వహించాలని పిలుపునిచ్చాయి. రెండు కార్యక్రమాలూ ఇరు వర్గాల మనోభావాలకు సంబంధించిన అంశాలతో ముడి పడి ఉండటంతో జంట కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు పాతబస్తీలో దుకాణాలు మూసివేశారు. శనివారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించారు. వ్యక్తులు, వస్తువులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేయాలని జంట పోలీసు కమిషనర్లు ఎం. మహేందర్‌రెడ్డి, సీవీ. ఆనంద్‌లు ప్రజలకు ఒక ప్రకటనలో సూచించారు. పాతబస్తీతోపాటు అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాలు, గతంలో ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తోపాటు తెలంగాణ స్పెషల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలను రంగంలోకి దింపారు. పోలీస్ స్టేషన్లకు హెచ్చరికలు జారీ చేశారు. పాతబస్తీలో సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ కమిషనర్ మహేందర్‌రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డిలు పర్యటించి బందోబస్తును పర్యవేక్షించారు. పుకార్లను నమ్మొద్దు ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మొద్దు. ఎస్సెమ్మెస్, వాట్సాప్ తదితర ప్రచార సాధనాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఫొటోలు పంపించొద్దు. పుకార్లు పుట్టించేవారి గురించి సమాచారం ఇవ్వండి. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు. -మహేందర్‌రెడ్డి శాంతియుతంగా జరపండి బ్లాక్ డేను శాంతియుతంగా జరుపుకోవాలి. బలవంతంగా ఎవరి దుకాణాలు మూయించొద్దు. ఘర్షణలకు తావులేకుండా ప్రార్థనలు మాత్రమే చేసుకోవాలి. శాంతియుతంగా బంద్, బ్లాక్‌డేను విజయవంతం చేయాలి. -ఎంఐఎం, ఎంబీటీ -
బ్లాక్‌డే అలర్ట్
* నిఘా కట్టుదిట్టం * రైల్వే స్టేషన్లలో భద్రత పెంపు * అటు బాబ్రీ కోసం.. ఇటు రామాలయం కోసం.. * పోటాపోటీనిరసనలకు పిలుపు సాక్షి, చెన్నై: బాబ్రీ మసీదు కూల్చి వేత దినం బ్లాక్ డేని పురస్కరించుకుని రాష్ట్రంలో భద్రతను పటిష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుది ట్టం చేశారు. రైల్వే స్టేషన్లలో నిఘాను మూడింతలు పెంచారు. కాగా బాబ్రీ మసీదు పునర్నిర్మాణం కోసం మైనారిటీ సంఘాలు, రామాలయం నిర్మాణం కోసం హిందూ సంఘాలు పోటాపోటీగా నిరసనలకు పిలుపునిచ్చారుు. బాబ్రీ మసీదు కూల్చి వేసిన రోజు డిసెంబర్ ఆరవ తేదీని బ్లాక్ డేగా అనుసరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా ఈ రోజు వస్తున్నదంటే చాలు టెన్షన్ తప్పదు. భద్రతను కట్టుదిట్టం చేస్తారు. తనిఖీలు ముమ్మరం చేస్తారు. ఆ రోజు గడిస్తే చాలు పోలీసులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. అయితే, ఈ ఏడాది మునుపెన్నడూలేని రీతిలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు కారణంగా రాష్ట్రంలో ఇటీవల కాలంగా వెలుగు చూస్తున్న సంఘ విద్రోహ శక్తుల కదలికలే. కేంద్రం నుంచి వస్తున్న హెచ్చరికలు, తాజా పరిణామాలు వెరసి రాష్ట్రంలో ఏవైనా విధ్వంసాలకు వ్యూహ రచన జరిగిందా..? అన్న అనుమానాలు బయలు దేరాయి. తనిఖీలు ముమ్మరం శనివారం బాబ్రీ డే కావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, విమానాశ్రయ పరిసరాల్లో భద్రతను పెంచారు. ప్రతి ప్రయాణికుడ్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు, ప్రత్యేకంగా తమిళనాడు స్పెషల్ పోలీసు, సాయుధ రిజర్వు పోలీసుల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచారు. అలాగే, జాతీయ, రాష్ట్ర రహదారుల్లో, అన్ని నగరాల్లోని రోడ్లలో పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. లాడ్జీలు, హోటళ్లలో అనుమానితులెవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో, వినోద కేంద్రాల్లో, మాల్స్‌లలో, సెంట్రల్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లలో, కోయంబేడు బస్టాండులో పోలీసులు అను నిత్యం నిఘాతో వ్యవహరిస్తున్నారు. రైళ్లల్లో, బస్సులలో పార్శిళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నిరసనలు : ప్రతి ఏటా బ్లాక్ డే రోజున మైనారిటీ సంఘాలు నిరసనలు చేపట్టడం పరిపాటే. బాబ్రీ మసీదు పునర్నిర్మాణం నినాదంతో, శాంతి స్థాపన పిలుపుతో ఆయా సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాయి. అయితే, ఈ నిరసనలకు అడ్డుకట్ట వేయాలంటూ కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఇందుకు కోర్టు నిరాకరించింది. దీంతో తమ దైన శైలిలో నిరసనలకు మైనారిటీ సంఘాలు సిద్ధమయ్యాయి. ఇక, తాము సైతం అంటూ రామాలయం నిర్మాణం పిలుపుతో నిరసనలకు హిందూ సంఘాలు పిలుపు నిచ్చాయి. తాంబరం, పల్లావరం తదితర ప్రాంతాల్లో పోటాపోటీగా నిరసనలకు పిలుపునిచ్చారుు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
బాంబు స్క్వాడ్ తనిఖీలు
కైకలూరు : బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు డిసెంబర్ ఆరో తేదీ (బ్లాక్ డే)ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా కైకలూరులో శుక్రవారం రాత్రి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఎస్పీ విజయ్‌కుమార్ ఆదేశాలతో గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో నాలుగు బృందాలుగా ఈ తనిఖీలు చేశారు. కైకలూరు ైరె ల్వే స్టేషన్లో జిల్లాకు చెందిన ‘మిక్కి’ డాగ్‌తో అణువణువు పరిశీలించారు. బాంబు స్క్వాడ్ టీం మోతి, నాగభూషణం, నాగరాజు, డాగ్ స్క్వాడ్ సీహెచ్‌వీవీ సూర్యనారాయణ తనిఖీల్లో పాల్గొన్నారు. బాంబు డిస్పోజబుల్ పరికరాలు, డాగ్ అన్వేషణను చూసిన ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. -
అధికారం దక్కలేదనే దిగ్విజయ్ అక్కసు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంతోపాటు పలు రాష్ట్రాల్లో అధికారం దక్కలేదన్న అక్కసుతోనే ముస్లింలపై కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్‌సింగ్ విషం గక్కుతున్నాడని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దుయ్యబట్టారు. సోమవారం రాత్రి బాబ్రీ మసీదు విధ్వంస దినం పురస్కరించుకొని ముస్లిం ఐక్య ఫోరం ఆధ్వర్యంలో దారుస్సలాం మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ 65 ఏళ్లుగా ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూనే ఉందన్నారు. ఏకంగా ఆ పార్టీ అగ్రనేత దిగ్విజయ్‌సింగ్ ఇటీవల ముస్లింల పక్షాన గళం విప్పుతున్న అసద్, అక్బర్లు విషపు నాగులని వ్యాఖ్యానించడం విచారకరమన్నారు. తాము విషపు నాగులమైతే.. మీరు రామచిలుకలా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయడం, మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు స్థానాలను కైవసం చేసుకోవడం మింగుడుపడక..దిగ్విజయ్ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారన్నారు. మధ్యప్రదేశ్‌లో మూడు పర్యాయాలు కాంగ్రెస్ ఎందుకు అపజయం పాలైందని, అక్కడ ఒక్క ముస్లిం ఎమ్మెల్యేనైనా గెలిపించారా అని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బరిలో దిగితీరుతామని ఆయన ప్రకటించారు. బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్‌యాదవ్ కూడా తమను వివాదాస్పద ప్రసంగాల నేతలంటూ రెచ్చగొడుతున్నారని, బీహార్‌లోని సీమాంచల్‌లో అడుగిడి తీరుతామని వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తమను రాకుండా అడ్డుకోలేరని, ఇప్పటికే 15 జిల్లాల్లో పార్టీ శాఖలున్నాయని చెప్పారు. ముస్లిం ఐక్య ఫోరం కన్వీనర్ మౌలానా అబ్ధూల్ రహీమ్ ఖురేషీ అధ్యక్షతన జరిగిన సభలో ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం ప్రోఫెసర్ డాక్టర్ ఎస్.ఆలమ్ ఖాస్మీ, మతపెద్దలు, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. -
బాబ్రీ కేసులో ఇద్దరు బీజేపీ ఎంపీలకు వారెంట్లు
న్యూఢిల్లీ: అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇద్దరు బీజేపీ పార్లమెంటు సభ్యులు సహా ఆరుగురు నిందితులకు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. బీజేపీ ఎంపీలు సాక్షి మహారాజ్, బ్రిజ్ భూషణ్ శరణ్లతోపాటుగా, మరో నలుగురికి వారెంట్లు జారీ చేస్తూ లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శశిమౌలి తివారీ ఉత్తర్వు జారీ చేశారు. నిందితులు అమర్నాథ్ గోయల్, జై భగవాన్ గోయల్, పవన్ కుమార్ పాండే, రాంచంద్ర ఖత్రీలకు కూడా వారెంట్లు జారీ అయ్యాయి. సోమవారం కేసు విచారణకు నిందితులుగానీ, వారి న్యాయవాదులుగానీ కోర్టుకు హాజరు కాలేదు. నిందితులంతా ఈ నెల 19న విచారణకు హాజరుకావాలంటూ, వారు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని సీబీఐని కూడా ప్రత్యేక కోర్టు ఆదేశించింది. -
ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు : బాబ్రీ మసీదుతో పాటే వారణాసి, మధురైలోని మసీదులనూ కూల్చాల్చి ఉందని, అయితే ఆ లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదని శ్రీరామ సేన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈరోజు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆ రెండు మసీదులు కూల్చివేసేందుకు శ్రీరామసేన ప్రణాళికను రచిస్తోందన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి కోబ్రాపోస్ట్ వెబ్సైట్ చెప్పింది అక్షరాల సత్యమని పేర్కొన్నారు. పథకం ప్రకారం జరిగిన ఆ ఘటనలో తాను కూడా సభ్యుడనన్నారు. సంఘ్ పరివార్ ముందస్తు పథకంలో భాగంగానే బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగిందని, దీనిని బీజేపీ తప్పక ఒప్పుకోవాల్సిందేనన్నారు. శ్రీరాముని సేవ కోసం తాను ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నానని, ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. -
పథకం ప్రకారమే బాబ్రీ విధ్వంసం
తమ స్టింగ్ ఆపరేషన్‌లో తేలినట్లు కోబ్రాపోస్ట్ వెల్లడి చాలా నెలల ముందే కరసేవకులకు కూల్చివేతలో శిక్షణ సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల వే ళ మళ్లీ బాబ్రీపై చిచ్చు రేగింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఆవేశపూరిత హిందూ అల్లరిమూక చర్య కాదని, పక్కా పథకం ప్రకారం జరిపిన విధ్వంసమని తమ స్టింగ్ ఆపరేషన్‌లో తేలినట్లు కోబ్రాపోస్ట్ వెబ్సైట్ వెల్లడించింది. వెబ్సైట్ ఎడిటర్ అనిరుధ్ బహాల్ శుక్రవారమిక్కడ విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ‘ఆపరేషన్ జన్మభూమి’ పేరుతో రెండేళ్లపాటు జరిపిన స్టింగ్ ఆపరేషన్ వివరాలను బయటపెట్టారు. తమ వలంటీర్లు పక్కా పథకం ప్రకారం, శిక్షణ పొందాకే మసీదును కూల్చారని బీజేపీ, వీహెచ్‌పీ, శివసేన నేతలు చెప్పినట్లున్న ఇంటర్వ్యూలను ప్రదర్శించారు. ఆపరేషన్‌లో భాగంగా బాబ్రీ కూల్చివేత కుట్ర, అమలుతో సంబంధమున్న 23 మందితో కోబ్రాపోస్ట్ అసోసియేట్ ఎడిటర్ కె.ఆశీష్ మాట్లాడారని, అయోధ్య ఉద్యమంపై పుస్తకం రాస్తానంటూ వారిని కలుసుకున్నారని చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ చేసిన వారిలో 12 మంది బజరంగ్దళ్, బీజేపీ, వీహెచ్‌పీలకు, ఐదుగురు శివసేన, మిగతావారు ఇతర హిందూ సంస్థలకు చెందిన వారన్నారు. బీజేపీ నేతల్లో ఉమాభారతి, కల్యాణ్‌సింగ్ ఉన్నారని తెలిపారు. కోబ్రాపోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును పక్క పథకం ప్రకారం నేలమట్టం చేశారు. దీనికి వీహెచ్‌పీ, శివసేనలు విడివిడిగా రహస్యంగా ప్రభుత్వ సంస్థలకు ఏమాత్రం తెలియకుండా కుట్ర పన్నాయి. వలంటీర్లకు చాలా నెలలముందే శిక్షణ ఇచ్చాయి. వీహెచ్‌పీ యువజన విభాగమైన బజరంగ్దళ్ వలంటీర్లు గుజరాత్‌లోని సుర్ఖేజ్లో, శివసేన వలంటీర్లుమధ్యప్రదేశ్లోని భింద్, మెరోనాల్లో శిక్షణ పొందారు. వీహెచ్‌పీ లక్ష్మణసేన పేరుతో 1,200 మంది ఆరెస్సెస్ కార్యకర్తలను కూడగట్టింది. శివసేన కూడా అయోధ్యలో ప్రతాప్సేన పేరుతో స్థానికులను సమీకరించింది. సంప్రదాయ పద్ధతుల్లో మసీదును కూల్చలేకపోతే డైనమైట్ వాడాలని శివసేన పథకం వేసింది. బీహార్‌కు చెందిన ఓ టీం పెట్రోల్ బాంబు వాడాలనుకుంది. ఆర్ఎస్ఎస్ ఆత్మాహుతి దళాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇంటర్వ్యూ ఇచ్చినవారు అద్వానీ, ఎం.ఎం.జోషి, ఉమాభారతిలు విధ్వంసానికి కుట్ర పన్నినట్లు చెప్పారు. విధ్వంసం గురించి నాటి యూపీ సీఎం కల్యాణ్‌సింగ్, ప్రధాని పివీ, శివసేన చీఫ్ బాల్ ఠాక్రేలకు ముందే తెలుసు. అది కాంగ్రెస్ పోస్ట్... బీజేపీ కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ కాంగ్రెస్ ప్రాయోజిత పోస్ట్ అని అని బీజేపీ ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లను చీల్చడానికి , అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ కుట్రపన్నుతోందన్నారు. -
బాబ్రీ మసీదు పునర్నిర్మించాలి
నిజామాబాద్, న్యూస్‌లైన్: బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని డి మాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో శుక్రవారం ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ ప్రాంతంలో మధ్యాహ్నం వరకు వ్యాపార సముదాయాల ను మూసివేశారు. ఈ సందర్భంగా ముస్లిం పర్సనల్ లా కమిటీ అధ్యక్షులు మౌలానా స య్యద్ వలీఉల్లా ఖాస్మీ మాట్లాడుతూ కొందరి మతవాదుల దుశ్చర్యవల్ల 6 డిసెంబర్ 1992న ఉత్తరప్రదేశ్‌లో అతి పురాతనమైన బాబ్రీ మసీదును నేలమట్టం అయ్యిందన్నారు. ఆ చర్యను నిరసిస్తూ ప్రతి ఏడు బ్లాక్‌డే నిర్వహిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరుగకుండా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో ము స్లిం పర్సనల్ లా కమిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ గఫార్, మహ్మద్ మన్జూర్ అహ్మద్, మహ్మద్ ఫాజిల్ అహ్మద్, ఎంఏ.ఖాదర్, మహ్మద్ యూసూఫ్, హబాబ్అహ్మద్, డమీరోద్దీన్, రహ్మతుల్లా ఖాన్ అల్మాస్, తదితరులు పాల్గొన్నారు. -
బాబ్రీ మసీదును పునర్నిర్మించేవరకూ పోరాటం: అసదుద్దీన్
నాందేడ్, న్యూస్‌లైన్: అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్నిర్మించే వరకు ఎంఐఎం పోరాటం చేస్తుందని ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. శుక్రవారం రాత్రి పర్భణీ జిల్లాలోని నూతన్ మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ముస్లింలపై వివక్ష కొనసాగుతోందని, ఉగ్రవాదులుగా పోలీసులు పరిగణిస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీలను చిత్తుగా ఓడించి తమ సత్తా చాటుతామన్నారు. దేశ వ్యవస్థలో మార్పునకు ఎం ఐఎంను నమ్ముకోవాలని కోరారు. రాజకీయ పార్టీలు సొంత ప్రయోజనాలకే ముస్లింలను వాడుకున్నాయని ఆరోపించారు. పట్టుబడ్డ ఉగ్ర వాదులందరినీ మీడియా ముందుకు తీసుకుచ్చి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ప్రశ్నిస్తే ఎవరు ఉగ్రవాదులో బయటపడుతుందన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే గుజరాత్ తరహాలోనే దేశంలోని ముస్లింలకు భద్రత లేకుండా పోతుందన్నారు. తమ పార్టీని గెలిపిస్తే ముస్లింలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
అద్వానీపై బాబ్లీ కేసును వేగవంతం చేయనున్న సీబీఐ
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసుకు సంబంధించి ఎల్.కె. అద్వానీపై నమోదైన కేసును సీబీఐ వేగవంతం చేయనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో సీబీఐ వాదనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకారం తెలపడంతో కేసు గడువు సమయాన్ని డిసెంబర్ నుంచి అక్టోబర్ మొదటి వారానికి మార్చింది. జీఎస్ సంఘ్వీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును మంగళవారం విచారణకు స్వీకరించింది. అక్టోబర్ మొదటి వారంలో విచారణ పూర్తి చేస్తామన్న సీబీఐ వాదనలకు అద్వానీ తరుపు న్యాయవాదులు కూడా అంగీకారం తెలిపారు. ఈ కేసును గతంలో విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు, అలహాబాద్ హైకోర్టులో సీబీఐ వాదనను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీంలో సీబీఐ తరుపున వాదించిన పీవీరావు.. బాబ్రీ మసీదు కేసు విచారణ కోర్టు ఇచ్చిన గడువు కంటే ముందుగా సెప్టెంబర్ లోనే పూర్తి చేయాలనుకున్నామని, కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగిందన్నారు. డిసెంబర్ వరకూ సమయం ఉన్నా, అక్టోబర్ తొలి వారంలో విచారణ పూర్తి చేస్తామన్న సీబీఐ వాదనను అద్వానీ తరుపు న్యాయవాది కె.కె.వేణుగోపాలరావు కూడా అంగీకారం తెలిపారు. -
‘బాబ్రీ’ కూల్చివేత నాటి రాష్ట్రపతికి తెలుసు
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదును కూల్చివేత పథకం అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మకు తెలుసునని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ సోమవారం ఢిల్లీలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. అయోధ్యలో 1992 డిసెంబర్ 6న బీజేపీ నేతృత్వంలో కరసేవకులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. బాబ్రీ మసీదును కూల్చివేయాలని బీజేపీ, దాని మద్దతుదారులు నిర్ణయం తీసుకోవడంతో 1992 డిసెంబర్ 4న తమ పార్టీ నాయకులతో కలసి తాను అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మను కలుసుకున్నానని, మసీదు కూల్చివేతను నివారించేందుకు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఈ మేరకు ఆయనకు లేఖ ఇచ్చామని, లేఖ అందుకున్న ఆయన దానిని చదివి, కాసేపు ఇటూ అటూ చూసి, మీరు ఎవరికీ చెప్పవద్దు... మసీదు కచ్చితంగా కూలిపోతుందని చెప్పారని తెలిపారు. ఈ అంశంపై అప్పటి ప్రభుత్వంతో మాట్లాడేందుకు తాను ఎంతగా ప్రయత్నించినా, ఎవరూ తన మాట వినిపించుకోలేదని, చివరకు డిసెంబర్ 6న మసీదు కూల్చివేత జరిగిందని అన్నారు. దీనిపై ఒక పుస్తకాన్ని రాయాలని సంకల్పించి, కొన్ని పేజీలు రాశానని, అయితే, పలువురు నాయకుల చరిత్ర బట్టబయలవుతుందని సన్నిహితులు చెప్పడంతో దాన్ని విరమించుకున్నానని చెప్పారు.