అయోధ్యపై మేం రెడీ: ముస్లిం లాబోర్డు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సూచనల మేరకు అయోధ్యలో రామమందిరం అంశాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవడానికి తాము సిద్ధమని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి– బాబ్రీ మసీదు స్థల వివాదం పరిష్కారం కోసం సుప్రీంకోర్టు మంగళవారం కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. మతంతో పాటు సున్నితమైన భావోద్వేగాలు కేసుతో ముడిపడినందున చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడం ఉత్తమమని కోర్టు అభిప్రాయపడింది.
ఇరు వర్గాలు కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ స్పష్టం చేశారు. కేసును త్వరగా విచారించాలంటూ పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి అభ్యర్థనపై స్పందిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అర్థవంతమైన, చిత్తశుద్ధితో కూడిన చర్చల కోసం కక్షిదారులు ‘కొంత ఇచ్చి కొంత పుచ్చుకునే’ విధానం అవలంభించాలని కోరింది. ఆ మేరకు రామ జన్మభూమి– బాబ్రీ మసీదు స్థల వివాదంలో అంగీకారం కుదిరేలా తాజాగా ప్రయత్నించాలని పిటిషనర్‌కు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌ల ధర్మాసనం సూచించింది.
సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు చెందిన మౌలానా ఖలీద్ రషీద్ స్పందించారు. న్యాయస్థానం సూచనల మేరకు కోర్టు బయట రామమందిర వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టంచేశారు.