రాజీయే ఉత్తమం | negotiations is the best way to resolve Ayodhya dispute: Supreme Court | Sakshi
Sakshi News home page

రాజీయే ఉత్తమం

Published Wed, Mar 22 2017 1:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రాజీయే ఉత్తమం - Sakshi

రాజీయే ఉత్తమం

- అయోధ్య వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచన
- ‘రామ జన్మభూమి–బాబ్రీ మసీదు’ వివాదం భావోద్వేగాలతో ముడిపడింది
- ఇరువర్గాలు కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న ప్రధాన న్యాయమూర్తి
- అర్థవంతమైన, చిత్తశుద్ధితో కూడిన చర్చలు అవసరమన్న న్యాయస్థానం
- తీర్పును స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు
- చర్చలకు సిద్ధమన్న ఆర్‌ఎస్‌ఎస్, బాబ్రీ కమిటీ


న్యూఢిల్లీ:
అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి– బాబ్రీ మసీదు స్థల వివాదం పరిష్కారం కోసం సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. మతంతో పాటు సున్నితమైన భావోద్వేగాలు కేసుతో ముడిపడినందున చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమని కోర్టు అభిప్రాయపడింది. ఇరు వర్గాలు కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ స్పష్టం చేశారు. కేసును త్వరగా విచారించాలంటూ పిటిషనర్‌ సుబ్రహ్మణ్య స్వామి అభ్యర్థనపై స్పందిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

‘ఈ అంశాలు మత, భావోద్వేగాలతో ముడిపడ్డవి. వివాదానికి ముగింపు పలికేందుకు ఈ అంశాలపై అన్ని వర్గాలు కలిసి కూర్చుని అంగీకారానికి రావచ్చు.  ఈ అంశాల్ని ఉమ్మడిగా పరిష్కరించుకుంటేనే ఉత్తమం. కలిసి కూర్చుని సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరపవచ్చు’ అని చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ల ధర్మాసనం సలహాలిచ్చింది. అర్థవంతమైన, చిత్తశుద్ధితో కూడిన చర్చల కోసం కక్షిదారులు ‘కొంత ఇచ్చి కొంత పుచ్చుకునే’ విధానం అవలంభించాలని కోరింది. ఆ మేరకు రామ జన్మభూమి– బాబ్రీ మసీదు స్థల వివాదంలో అంగీకారం కుదిరేలా తాజాగా ప్రయత్నించాలని పిటిషనర్‌కు సూచించింది.

అవసరమైతే నేను కూడా చర్చల్లో పాల్గొంటా: సీజేఐ
‘అవసరమైతే వివాదం పరిష్కారానికి మధ్యవర్తిని ఎన్నుకోండి. చర్చల కోసం ఎంచుకున్న మధ్యవర్తులతో పాటు నేను కూడా చర్చల్లో పాల్గొనాలని ఇరు వర్గాలు కోరితే అందుకు సిద్ధం. మా సోదర న్యాయమూర్తుల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి’ అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇరు వర్గాలు కోరితే కీలక మధ్యవర్తిని కూడా నియమిస్తామని సీజేఐ హామీనిచ్చారు. కేసుకు సంబంధించిన కక్షిదారులందర్నీ సంప్రదించి, రాజీ విషయంలో వారి అభిప్రాయమేంటో కోర్టుకు తెలపాలని సుబ్రహ్మణ్యస్వామికి ప్రధాన న్యాయమూర్తి సూచించారు.

రామ మందిర నిర్మాణానికి అనుమతివ్వాలన్న స్వామి..
వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి అనుమతి వ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అభ్యర్థన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాదాన్ని త్వరగా విచారించాల్సిన అవసరముందని, కేసులో హైకోర్టు తీర్పు వెలువరించి ఆరేళ్లు గడిచిందని, అందువల్ల వీలైనంత వేగంగా విచారణ కొనసాగించాలని స్వామి కోరారు. న్యాయపరమైన నిర్ణయానికి అనుకూలమంటూ ముస్లిం నేతలు తనకు చెప్పారంటూ ఆయన కోర్టుకు వెల్లడించారు. అయోధ్య వివాదంలో తనను కూడా కక్షిదారుగా చేర్చాలంటూ గతేడాది ఫిబ్రవరి 26న సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును కోరారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ నేతృత్వంలో ధర్మాసనం అందుకు అనుమతిస్తూ.. స్వామి పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి అనుమతివ్వాలని, అలాగే తన పిటిషన్‌ను త్వరగా విచారించాలని స్వామి ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

మసీదును వేరే చోటుకి మార్చొచ్చు: పిటిషన్‌లో స్వామి
ఇస్లామిక్‌ దేశాల్లో అనుసరిస్తున్న విధానాల ప్రకారం రోడ్ల నిర్మాణం వంటి ప్రజా ప్రయోజనాల కోసం మసీదును వేరే స్థలానికి మార్చవచ్చని, అయితే ఒకసారి హిందూ ఆలయాన్ని నిర్మించాక దాన్ని ముట్టుకోకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంను కోరారు. వివాదాస్పద స్థలానికి సంబంధించి 2.77 ఎకరాల్ని సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌ లల్లాలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

తీర్పుపై ఎవరేమన్నారంటే..
ఆహ్వానించదగ్గ పరిణామం: బీజేపీ
సుప్రీం సూచన ఆహ్వానించదగ్గ పరిణామమని, ఇరు వర్గాలు కోర్టు వెలుపల వివాదాన్ని పరిష్కరించుకోవాలని బీజేపీ ప్రతినిధి సంబిత్‌ పాత్రా చెప్పారు. సున్నిత అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఇరుపార్టీలు చర్చలు జరపాలని సూచించారు. సుప్రీంకోర్టు చాలా మంచి సూచన చేసిందని, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడంతో మున్ముందు సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయని బీజేపీ ఎంపీ వినత్‌ కతియార్‌ అన్నారు.

ఏకాభిప్రాయ పరిష్కారం అవసరం: కాంగ్రెస్‌
అయోధ్య వివాదంలో ఏకాభిప్రాయంతో కూడిన పరిష్కారం అవసరమని, దీర్ఘకాలంలో శాంతి, సామరస్యాల సాధనకు అది ఉపయోగపడుతుం దని కాంగ్రెస్‌ అభిప్రాయ పడింది. ఇరువైపులా పరస్పర అంగీకారంతో కూడిన ఏకాభిప్రాయానికి రావాలని ఆ పార్టీ ముఖ్య ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు.  

అందరి సహకారంతో ఆలయం: ఆరెస్సెస్‌
సుప్రీంకోర్టు సూచనను ఆరెస్సెస్‌ స్వాగతిస్తూ.. వివాదం వీలైనంత త్వరగా పరిష్కారం కావాలని, అలాగే అందరి సహకారంతో రామ మందిరం నిర్మించాలని కోరింది.  తాము కేసులో కక్షిదారు కాకపోయినా.. ధర్మ సంసద్‌ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా సమర్థిస్తామని చెప్పింది.

సీజేఐ మధ్యవర్తిత్వం: బాబ్రీ యాక్షన్‌ కమిటీ
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని, ఆయన్ని నమ్ముతున్నామని బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీ స్పష్టం చేసింది. అలాగే కేసు పరిష్కారానికి ఒక బృందాన్ని నియమించేందుకూ సిద్ధమని, అయితే కోర్టు వెలు పల ఏకాభిప్రాయం సాధ్యం కాదని పేర్కొంది.  

మందిరం కోసం చట్టం: వీహెచ్‌పీ
రామమందిరం నిర్మాణ కోసం కేంద్రం చట్టం తీసుకురావాలని విశ్వ హిందూ పరిషత్‌ చీఫ్‌ ప్రవీణ్‌ తొగాడియా కోరారు. వివాదాస్పద స్థలం ‘భగవాన్‌ రామ్‌’కు చెందినదని, ఆ స్థలంలో రాముడి ఆలయం నిర్మించాలని పేర్కొన్నారు.  

మధ్యవర్తిని సూచించాలని కోరా: స్వామి
రామ జన్మభూమిలో రామ మందిరాన్ని తప్పక నిర్మించాలని, సరయూ నది అవతలి వైపు మసీ దు ఉండాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. మధ్యవర్తిని సూచించాలని సుప్రీం కోర్టును కోరానని, మార్చి 31లోపు నిర్ణయం వెలువడవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

సుప్రీం నిర్ణయం కోసం చూస్తున్నా: ఒవైసీ
బాబ్రీ మసీదు కూల్చివేతపై పెండింగ్‌లో ఉన్న ధిక్కార పిటిషన్‌పై కోర్టు నిర్ణయం తీసుకుంటుం దని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు. కేసును రోజు వారీ విచారణ జరిపేలా సుప్రీంను కోరాలని సూచించారు.

అయోధ్య మందిరం వివాదం: 1528 నుంచి 2017 వరకు
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
488 ఏళ్ల అయోధ్య పరిణామాల్లో ముఖ్యమైనవి కొన్ని..
1528: ప్రస్తుత యూపీలో అవధ్‌లోని అయోధ్యలో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ సైనికాధికారి మీర్‌ బాకీ తాష్‌కండీ మసీదు నిర్మించాడు. శ్రీరాముడి జన్మస్థానంలోని గుడి కూల్చేసి, దానిపై మసీదుకట్టారని హిందువులు నమ్ముతున్నారు.
1853: అయోధ్యలో ఈ వివాదం కారణంగా తొలి మతఘర్షణ జరిగింది.
1859: ఈ కట్టడం చుట్టూ బ్రిటిష్‌ సర్కారు కంచె వేసి, హిందువులు, ముస్లింల ప్రార్థనల కోసం రెండుగా విభజించింది.
1949: సీతారాముల విగ్రహాలు మసీదులో కనిపించాయి. ముస్లింలు నిరసన తెలిపాక, ఇది తమదని వాదిస్తూ హిందువుల తరఫున మహంత్‌ పరమహంస్‌ రామచంద్రదాస్, ముస్లింల తరఫున హషీం అన్సారీ కోర్టుకెక్కారు. ప్రభుత్వం దీన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించి, గేట్లకు తాళాలేసింది.
1950: విగ్రహపూజకు అనుమతించాలని రామచంద్రదాస్, గోపాల్‌సింగ్‌ విశారద్‌లు ఫైజాబాద్‌ కోర్టును కోరారు. లోపలి ప్రాంగణానికి తాళాలున్నా, బయట పూజకు అనుమతించింది.
1961: మసీదు తమదంటూ యూపీ సెంట్రల్‌ సున్నీ వక్ఫ్‌బోర్డు కేసు వేసింది.
1984: రామజన్మభూమిని ‘విముక్తి’ చేయడానికి వీహెచ్‌పీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు. ఉద్యమ బాధ్యత అడ్వాణీకి అప్పగింత.
1986: హిందువులు ప్రార్థన కోసం మసీదు గేట్లు తెరవాలని ఫైజాబాద్‌ జిల్లా జడ్జీ ఆదేశించారు. ముస్లింలు బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీ ఏర్పాటు చేశారు.
1989: వివాదాస్పద మసీదును ఆనుకుని ఉన్న స్థలంలో ఆలయ నిర్మాణానికి ‘శిలాన్యాస్‌’కు వీహెచ్‌పీకి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం అనుమతించాక, వీహెచ్‌పీ ఉద్యమాన్ని ఉధృతం చేసిం ది. తర్వాత కేసు అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ.
1990: ఆలయానికి ప్రజల మద్దతు కూడగట్టడానికి అడ్వాణీ గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభం.
1990: అక్టోబర్‌ 23న బిహార్‌లోని సమస్తిపూర్‌లో రథయాత్రను సీఎం లాలూ ఆదేశాలపై నిలిపివేశాక, అడ్వాణీని అరెస్టు చేశారు. అరెస్టుకు నిరసనగా వీపీ సింగ్‌ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించాక జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ బలం లోక్‌సభలో పెరిగింది.
1992: డిసెంబర్‌ 6న సంఘ్‌ పరివార్‌ సంస్థలు సమీకరించిన ‘కరసేవకులు’ మసీదును కూలగొట్టి, తాత్కాలిక గుడి ఏర్పాటు చేశారు. అప్పటి పీవీ ప్రభుత్వం ఈ ‘గుడి’ని తొలగించకుండానే యథాస్థితి కొనసాగేలా హైకోర్టు అనుమతి కోరింది.
1993: ముంబైలో మత ఘర్షణలు జరిగాయి. ముస్లింలు ఎక్కువ మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా ముంబైలో మార్చి 12న పన్నెండు చోట్ల జరిపిన బాంబు పేలుళ్లలో దాదాపు 900 మంది ప్రాణాలు కోల్పోయారు.
2002: ఫిబ్రవరిలో అయోధ్య నుంచి అహ్మదాబాద్‌ వస్తున్న సబర్మతీ రైల్లో కరసేవకులున్న బో గీలపై గోధ్రాలో జరిగిన దాడిలో 58 మంది మ రణించారు. దీంతో గుజరాత్‌లో చెలరేగిన అల్ల ర్లు 2వేల మంది ముస్లింలను బలిగొన్నాయి.
2003: మార్చి5న అలహాబాద్‌ హైకోర్టు భారత పురావస్తు పరిశోధనా సంస్థను మసీదు నిర్మించి న చోట పూర్వం రాముడి గుడి ఉందో లేదో కనుగొనేందుకు తవ్వకాలకు ఆదేశించింది.
2003: వివాదాస్పద స్థలంలో జరిపిన తవ్వకాల్లో పదో శతాబ్దంనాటి ఆలయ అవశేషాలు కనిపించాయని చెబుతూ ఆగస్టు 22న పురావస్తు శాఖ నివేదిక సమర్పించింది.
2010: మందిర్‌–మసీదు వివాదంపై హైకోర్టు తన తీర్పు వాయిదావేసింది. సమస్యను ఇరు పక్షాలూ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించింది.
2010: వివాదాస్పద స్థలాన్ని 3 భాగాలు చేసి సున్నీవక్ఫ్‌ బోర్డు, నిర్మోహీ అఖఢా, ‘రాం లల్లా’ తరఫు సంస్థకు పంచుతూ అలహాబాద్‌ హైకోర్టు సెప్టెంబర్‌ 30న తీర్పునిచ్చింది.
2011: ఈ తీర్పును సవాలుచేస్తూ హిందూ, ముస్లిం సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాక, అలహాబాద్‌ హైకోర్టు తీర్పు అమలును సుప్రీంకోర్టు నిలిపివేస్తూ మేలో ఆదేశాలిచ్చింది.
2016: ఆలయం నిర్మించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ విచారణకు ఫిబ్రవరి 26న సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement