సాక్షి, న్యూఢిల్లీ/బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద ప్రేమకథ తెరపైకి వచ్చింది. అమ్మాయిది రాజకీయ నేపథ్య కుటుంబం కాగా, అబ్బాయి రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం వీరి ప్రేమకథ చర్చనీయాంశమైంది. బీజేపీకి చెందిన మాజీ మంత్రి కూతురు, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత ప్రేమించుకున్నారు. అయితే వారి సామాజిక వర్గాలు వేరే కావడంతో అమ్మాయి తండ్రి వారి పెళ్లికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా తాను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ఆమె గుల్బర్గా జిల్లా కోర్టును ఆశ్రయించారు. కానీ తన తండ్రికి ఉన్న పరపతి దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన ఆమె ఢిల్లీకి పారిపోయారు. సుప్రీం కోర్టును ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు.
చట్టబద్ధ వయస్సు వచ్చిన తర్వాత కుల, మతాలకు అతీతంగా వివాహం చేసుకున్న దంపతుల జీవితంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవద్దని గత నెలలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత కేసులో వివాహం జరగలేదు కాబట్టి ప్రేమజంటకు రక్షణ కల్పించాలని కర్ణాటక పోలీసులను ఆదేశించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పేర్లు వెల్లడించడానికి నిరాకరించిన అమ్మాయి తరఫున ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. అమ్మాయి తండ్రి, సోదరుని నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో కర్ణాటక అదనపు సాలిసిటర్ జనరల్‌కు స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఇందుకు సంబంధించి వచ్చే నెలలో విచారణ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ అంశం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment