పాలకపక్షం మారుతుందా?
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
ఉత్తరాఖండ్ శాసససభ ఎన్నికల్లో నాలుగోసారి ప్రధాన జాతీయపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ పోరుకు సిద్ధమౌతున్నాయి. 2000 నవంబర్ 9న పుట్టిన ఈ రాష్ట్రం మొదటి పేరు ఉత్తరాంచల్. దశాబ్దం పోరాటం తర్వాత సొంత రాష్ట్రం సాధించుకున్న ఉత్తరాఖండీలకు రాజకీయ సుస్థిరత దొరకలేదు. ఆవిర్భావం నుంచీ ముఖ్యమంత్రుల మార్పు ఆనవాయితీగా మారింది.1996లో యూపీలో అంతర్భాగంగా ఉండగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి 22 అసెంబ్లీ సీట్ల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో శాసనసభ ఏర్పాటయింది. 2000 నవంబర్ 9న బీజేపీ నేత నిత్యానందస్వామి నాయకత్వాన మొదటి ప్రభుత్వం ప్రమాణం చేసింది. ఏడాది నిండకుండానే రాజీనామా చేసింది.
కొత్త నేత భగత్‌సింగ్ కోషియారీ నేతృత్వంలో రెండో బీజేపీ సర్కారు 2001 అక్టోబర్ 30న కొలువుదీరి మొదటి ఎన్నికల వరకూ నాలుగు నెలలు అధికారంలో ఉంది. ఇలా రెండు ప్రధాన సామాజికవర్గాలైన బ్రాహ్మణులు, రాజపుత్రులు సీఎం పదవిని పంచుకోవడం ఆరంభమైంది. మొదటి అసెంబ్లీ ఎన్నికల నాటికి(2002) నియోజకవర్గాల సంఖ్యను 70కి పెంచారు. ప్రత్యేక హోదాతో ప్రత్యేక రాష్ట్రమైన ఉత్తరాఖండ్ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పాలకపక్షానికి(కాంగ్రెస్) మెజారిటీ సీట్లు(36) లభించాయి. అంతకు ముందు యూపీ కాంగ్రెస్ సీఎంగా మూడు సార్లు పనిచేసిన బ్రాహ్మణ నేత నారాయణ్‌దత్(ఎన్డీ)తివారీ ముఖ్యమంత్రి పదవి చేపట్టి అయిదు సంవత్సరాలు సుస్థిర పాలన అందించారు. ఆ తర్వాత ఈ పదేళ్లలో 5 ఏళ్లు పూర్తికాలం ముఖ్యమంత్రి పదవిలో ఎవరూ లేరు.
16 ఏళ్లలో ఏడుగురు ముఖ్యమంత్రులు!..
బ్రిటిష్‌వారి వేసవి విడిది డెహ్రాడూన్ రాజధానిగా ఏర్పడిన ఈ చిన్న రాష్ట్రంలో గడచిన 16 ఏళ్లలో ఏడుగురు ముఖ్యమంత్రులుగా పనిచేయడం విశేషం. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 శాతం ఓట్లతో సరిగ్గా సగం(35) సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 29.6 శాతం ఓట్లతో 21 స్థానాలకు పరిమితమై ప్రతిపక్షంలో కూర్చుంది. ఇతర చిన్న పార్టీల సాయంతో మెజారిటీ కూడగట్టిన బీజేపీ ఈ అయిదేళ్లలో ఇద్దరు నేతలు జనరల్ బీసీ ఖండూరీ, రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ నాయకత్వాన మూడు ప్రభుత్వాలు నడిపింది. మొదట ఖండూరీ, రెండేళ్ల తర్వాత నిశాంక్, చివరి ఆరు నెలల్లో ఖండూరీ బీజేపీ సర్కార్లకు నేతృత్వం వహించారు. దేశంలోనే అత్యధిక శాతం బ్రాహ్మణులు(20 శాతం)ఉన్నది ఉత్తరాఖండ్‌లోనే. పైన చెప్పిన మొదటి అయిదుగురు సీఎంలలో ఒక్క కోషియారీ తప్ప మిగిలిన నలుగురూ బ్రాహ్మణులే. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించలేదు. బీఎస్పీ, ఉత్తరాఖండ్ క్రాంతిదళ్, ఓ ఇండిపెండెంట్ సాయంతో పీడీపీ పేరుతో బహుగుణ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది.
అయిదేళ్లలో నాలుగు సర్కార్లు
బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన lవిజయ్ బహుగుణకు సీఎం పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. యూపీ మాజీ కాంగ్రెస్ సీఎం హెచ్‌ఎన్ బహుగుణ కుమారుడైన విజయ్ ప్రభుత్వాధినేతగా విఫలమయ్యారు. 2013 జూన్‌లో వచ్చిన ఉత్తరాఖండ్ వరదల్లో విపరీత జన, ఆస్తి నష్టం సంభవించింది. సహాయ, పునరావాస చర్యల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది. చివరికి బహుగుణ రాజీనామా చేయకతప్పలేదు. యూపీఏ సర్కారులో మంత్రిగా ఉన్న సీనియర్ నేత హరీష్ రావత్ 2014 ఫిబ్రవరి ఒకటిన సీఎం అయ్యారు. కిందటేడాది మార్చి18న 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ్ బహుగుణ నేతృత్వంలో బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
వెంటనే బీజేపీ కేంద్ర సర్కారు రావత్ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధించింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల ఫలితంగా మళ్లీ రావత్ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు కిందటి మే 11న అధికారంలోకి వచ్చింది. ఈ సంక్షోభ సమయంలో రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించగా, మధ్యలో ఓ రోజు రావత్ సీఎంగా ఉండడం విశేషం. ఎన్డీఏ సర్కారు దూకుడు వల్ల రావత్‌కు మొదట్లో సానుభూతి లభించినా ఈ ఐదేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. 2002లో మొదలైన ఆనవాయితీ ప్రకారం పాలకపక్షం(కాంగ్రెస్) రేపు ఫిబ్రవరి 4 ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. గత డిసెంబర్ 12–22 తేదీల మధ్య జరిపిన ఇండియాటుడే–యాక్సిస్ సర్వే సైతం బీజేపీ విజయాన్నే సూచిస్తోంది. బీజేపీకి 41–46, కాంగ్రెస్‌కు 18–23 సీట్లు రావచ్చని సర్వే చెబుతోంది.