ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు
ఉత్తరాఖండ్ అనర్హ ఎమ్మెల్యేలకు హైకోర్టులో భంగపాటు
♦ వారి ప్రవర్తనతో పార్టీ సభ్యత్వం వదులుకున్నట్లు రుజువైంది: హైకోర్టు
♦ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
♦ 61 మంది సభ్యులున్న అసెంబ్లీలో రావత్ వైపు 33 మంది
నైనిటాల్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో నేడు జరిగే బలపరీక్షలో ఓటేయాలనుకున్న 9 మంది అనర్హ ఎమ్మెల్యేల ఆశలు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులతో ఆవిరయ్యాయి. స్పీకర్ అనర్హత ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ వారు వేసిన పిటిషన్లను ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. వెంటనే ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడా ఊరట దక్కలేదు. ఎమ్మెల్యేల రెండు పిటిషన్లను తిరస్కరించిన హైకోర్టు ... కావాలనుకుంటే చర్యల్ని పునఃసమీక్షించమంటూ స్పీకర్‌ను ఆశ్రయించవచ్చని సూచించింది. ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరకపోయినా తమ ప్రవర్తనతో స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారని, దీంతో ఫిరాయింపుల చట్టం కింద అనర్హులయ్యారని పేర్కొంది.
సహజన్యాయసూత్రాల ప్రకారం స్పీకర్ నిర్ణయాన్ని పరిశీలించామని, రాజ్యాంగం పదో షెడ్యూల్2(1)(ఎ) పేరాలోని అంశాలు పిటిషనర్లకు వ్యతిరేకంగా ఉన్నాయని జడ్జి యూసి ధ్యానీ తన 57 పేజీల తీర్పులో చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి అనర్హ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రాన్ని ఉదహరించారు. అవిధేయత ఫిరాయింపుల చట్టం కిందకురాదని, పదో షెడ్యూల్ కింద అవిధేయతకు ఫిరాయింపుల చట్టం వర్తించదని పేర్కొన్నారు. ‘పిటిషనర్లు తమ నేత, ప్రభుత్వం పట్ల అవిధేయత చూపడంతో పాటు, తమ చర్యలతో పార్టీని వదిలిపెట్టినట్లు రుజువైంది.
అలాంటప్పుడు ద్రవ్యవినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశామంటూ ఉమ్మడి వినతిపత్రంలో చెప్పకుండా ఉండాల్సింది. నేత ను, ప్రభుత్వాన్ని విడిచిపెట్టడానికి, పార్టీని విడిచిపెట్టడానికి మధ్య సన్నని గీత మాత్రమే తేడా’ అని కోర్టు పేర్కొంది. పార్టీ సభ్యత్వం వదులుకునే పరిస్థితి రానంత వరకూ అవిధేయత ఆమోదయోగ్యమేనంది. హైకోర్టు తీర్పు తో అనర్హ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది సీఎ సుందరం విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. గత శుక్రవారం బలపరీక్షపై ఆదేశాలిచ్చిన బెంచ్‌నే ఆశ్రయించాలంటూ ఠాకూర్ సూచించారు. తర్వాత పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు మంగళవారం బలపరీక్షలో ఓటు వేసేందుకు అవకాశమివ్వాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది.
పర్యవేక్షక ఉత్తర్వుల సవరణ
నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో రావత్ ప్రభుత్వ బలపరీక్షను రాష్ట్ర ముఖ్య కార్యదర్శి(అసెంబ్లీ, పార్లమెంటరీ వ్యవహారాలు) పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత ఉత్తర్వుల ప్రకారం ముఖ్యకార్యదర్శి( అసెంబ్లీ) ఈ పరీక్షను పర్యవేక్షించాల్సి ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో సంప్రదింపుల అనంతరం ముఖ్య కార్యదర్శి(అసెంబ్లీ) అంటూ ఎవరూ లేరని తెలియడంతో కేంద్రం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం స్పష్టత ఇస్తేనే పరీక్షను పర్యవేక్షిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పారని పిటిషన్‌లో కేంద్రం పేర్కొంది.
మే 6 నాటి ఉత్తర్వుల్ని సవరించాలన్న పిటిషన్‌ను న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, శివ కీర్తి సింగ్‌ల ధర్మాసనం అంగీకరించింది. మరోవైపు ఈ పిటిషన్‌ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ముఖ్యకార్యదర్శిని అనుమతిస్తే బయటివ్యక్తులు అసెంబ్లీకి వచ్చినట్లవుతుందని, స్పీకర్ కింద పనిచేసే అసెంబ్లీ కార్యదర్శిని బలపరీక్ష పర్యవేక్షణకు అనుమతించాలని కోరింది. కోర్టు ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఉత్తరాఖండ్ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం ప్రతిపక్షాల నిరసనల మధ్యే 4 నెలల కాలానికి ఉత్తరాఖండ్ బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభ ఆమోదించింది.
రావత్ గట్టెక్కే అవకాశాలు
నేడు జరిగే అసెంబ్లీ బలపరీక్షలో రావత్ గట్టెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 70 మంది ఉండే ఉత్తరాఖండ్ అసెంబ్లీ బలం 9 మందిపై అనర్హతతో 61కి పడిపోయింది. రావత్ ప్రభుత్వం గట్టెక్కాలంటే 31 మంది బలం అవసరం. 9 మంది అనర్హులవడంతో 27కు పరిమితమైన కాంగ్రెస్‌కు ఇద్దరు బీఎస్పీ, ఒక యూకేడీ, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తుండడంతో రావత్ కూటమి బలం 33గా ఉంది. బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉదయం 11 నుంచి ఒంటిగంట మధ్య పరీక్ష నిర్వహిస్తారు. తనవైపు 34 మంది ఉన్నారని తప్పక గట్టెక్కుతామని రావత్ చెప్పారు.