ఎమ్మెల్యే మిస్.. రావత్ గుండెల్లో రైళ్ల పరుగు?
డెహ్రాడూన్: బలపరీక్ష సమయంలో సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యే కనిపించకుండా పోవడంతో ఉత్తరాఖండ్ పదవీచ్యుత సీఎం హరీశ్ రావత్ గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయి. ఎమ్మెల్యేలంతా ఒక చోట ఉండగా రేఖా ఆర్యా అనే ఎమ్మెల్యే మాత్రం టచ్ లో లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో రావత్ కు కాస్త కంగారు మొదలైనట్లు సమాచారం.
ప్రస్తుత దేశ రాజకీయాల్లో సంచనలం సృష్టించిన ఉత్తరాఖండ్ వ్యవహారానికి నేడు తెరపడనుంది. మరికొద్ది గంటల్లో రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నేత, హరీశ్ రావత్ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ పరీక్ష అనంతరం రావత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేక బీజేపీ వంతా అనే విషయం స్పష్టం కానుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కూడా ముస్సోరిలోని ఓ రిసార్ట్ లో ఉంచినట్లు సమాచారం. వీరంతా అసెంబ్లీకి గంట ప్రయాణం దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎక్కడ బీజేపీ తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తుందోనన్న భయంతోనే వారిని ప్రత్యేకంగా రిసార్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేఖా ఆర్యా మాత్రం తోటి ఎమ్మెల్యేలతో లేకుండా పోయారు. అసలు ఆమె టచ్ లోనే లేకుండా పోయినట్లు చెప్తున్నారు. కానీ, మరో కాంగ్రెస్ నేత శిల్పి అరోరా మాత్రం ఆర్యా కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నారని, ఆమె రావత్ కు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్తున్నారు. ఓ రకంగా నేడు బలపరీక్షలో రావత్ గట్టెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 70 మంది ఉండే ఉత్తరాఖండ్ అసెంబ్లీ బలం 9 మందిపై అనర్హతతో 61కి పడిపోయింది.
రావత్ ప్రభుత్వం గట్టెక్కాలంటే 31 మంది బలం అవసరం. 9 మంది అనర్హులవడంతో 27కు పరిమితమైన కాంగ్రెస్‌కు ఇద్దరు బీఎస్పీ, ఒక యూకేడీ, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తుండడంతో రావత్ కూటమి బలం 33గా ఉంది. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖా ఆర్యా అందుబాటులో లేకుండా పోవడంతో కాస్తంత ఉత్కంఠను తలపించనుంది.
అయితే, హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు సమర్థన రావత్కు భారీగా ఊరటనిచ్చే అవకాశం ఉంది. కాగా, బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉదయం 11 నుంచి ఒంటిగంట మధ్య పరీక్ష నిర్వహిస్తారు. తనవైపు 34 మంది ఉన్నారని తప్పక గట్టెక్కుతామని రావత్ ఇప్పటికే చెప్పారు. అయితే, ఈ పరీక్ష పూర్తయ్యే వరకు రావత్ గుండెల్లో రైల్లు పరుగెత్తడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.