పోలవరానికి వారు ప్రాధాన్యత ఇవ్వలేదు
కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు 1982లో శంకుస్థాపన చేసినప్పటికీ గతంలో వివిధ పార్టీలు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం ఇక్కడ బీజేపీ నేతలు రఘురాం, విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పోలవరానికి నాబార్డు నిధులు త్వరితగతిన వచ్చేలా కృషిచేసినందుకు వెంకయ్యనాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దుపై రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు కౌంటర్‌గా వెంకయ్యనాయుడు పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థాపన దినోత్సవం. ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది.
ఈ దేశంలో ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ స్థాపించారో అది నెరవేరిందా? కాంగ్రెస్ పాలనలో అవినీతి, కుంభకోణాలు ఎందుకు జరిగాయి? నల్లధనాన్ని ఎందుకు ప్రోత్సహించారు? బినామీ చట్టాన్ని 1988 నుంచి ఎందుకు పెండింగ్‌లో పెట్టారు? 2012లో సుప్రీంకోర్టు చెప్పినా నల్లధనాన్ని ఎందుకు వెలికి తేలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి ముందుకు వెళ్లండి. బ్యాంకుకు వచ్చిన ప్రతినోటు తెల్లనోటు కాదు. పరిశీలన జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. డిసెంబర్ 30 తర్వాత కూడా నల్ల ధనం అరికట్టే ప్రయాణం కొనసాగుతుందన్నారు. 50 రోజుల తరువాత పరిస్థితులు మెరుగుపడతాయని ప్రధాని ఆనాడు చెప్పారు. డిసెంబర్ 30 అయిపోయింది కదా అనడం వివేకవంతుల లక్షణం కాదని తెలిపారు.