న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్ష, పార్లమెంట్ సెక్రటేరియట్ వేసిన అనర్హత వేటుపై న్యాయ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. అనర్హత వేటు నుంచి బయట పడి, ఎంపీగా కొనసాగడంతో పాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే రాహుల్ ముందు రెండు మార్గాలున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. తీర్పును పై కోర్టు కొట్టివేస్తే అనర్హత వేటూ రద్దవుతుంది. కనీసం జైలు శిక్షను రెండేళ్ల కంటే తగ్గించినా ఊరటే.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు, అంతకు మించి జైలుశిక్ష పడితేనే అనర్హత వేటు వర్తిస్తుంది. కనుక సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేసేలా, రెండేళ్ల కంటే తగ్గించేలా పై కోర్టులో వాదించి నెగ్గాల్సి ఉంటుంది. లేదంటే కనీసం శిక్ష అమలుపై స్టే తెచ్చుకున్నా ఎంపీ పదవిని కాపాడుకోవచ్చు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. రాహుల్ అప్పీల్‌ను పై కోర్టు తిరస్కరిస్తే మాత్రం మరో ఎనిమిదేళ్ల దాకా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఇది క్రిమినల్ కేసు కావడంతో నేరుగా గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించకపోవచ్చని తెలుస్తోంది.
చదవండి: రాహుల్‌పై అనర్హత వేటు.. సెప్టెంబర్‌లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక?
తొలుత సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేస్తారని, అక్కడ ఊరట దక్కకపోతే హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 11న లక్షద్వీప్ కరవట్టిలోని సెషన్స్ కోర్టు ఒక హత్యాయత్నం కేసులో ఫైజల్‌ను దోషిగా నిర్ధారించి, 10 సంవత్సరాల శిక్ష విధించింది. జైలుశిక్ష పడిన రెండు రోజులకే లక్షదీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది.
దీంతో లక్షద్వీప్ లోక్‌సభ స్థానం ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉప ఎన్నిక కోసం జనవరి 18న నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ఇంతలో మొహమ్మద్ ఫైజల్‌కు విధించిన జైలు శిక్షపై కేరళ హైకోర్టు జనవరి 25న స్టే విధించింది. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం రద్దు చేసింది. మరోవైపు హైకోర్టు నిర్ణయంపై లక్షద్వీప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై ప్రస్తుతం సుప్రీంలో విచారణ నడుస్తోంది.
చదవండి: ప్రధాని కళ్లలో భయం చూశా: రాహుల్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment