ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆనందోత్సాహాలు
న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో సుప్రీం తీర్పుతో విపక్ష కూటమి ఇండియాలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. రాహుల్ గాంధీ ఎంపీగా కొనసాగడానికి అవకాశం ఏర్పడడంతో కేరళలో ఆయన నియోజకవర్గం వయనాడ్‌లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మిఠాయిలు పంచిపెట్టారు. మా నాయకుడు తిరిగి వస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు.
విద్వేషంపై ప్రేమ సాధించిన విజయమని నాయకులు వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు వెలువడిన కొద్ది సేపటికి రాహుల్ గాంధీ ఏఐసీసీ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. సత్యమేవ జయతే అంటూ పార్టీ శ్రేణులు రాహుల్‌కి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘నిజమే ఎప్పుడూ గెలుస్తుంది. ఇవాళ కాకపోతే రేపు, లేదంటే ఆ మర్నాడు.
నాకు మద్దతుగా ఉన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు. నేను ఎలా ముందుకెళ్లాలో నాకు తెలుసు. నా కర్తవ్యం ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు. నాకు సాయం చేసిన, ప్రేమ పంచిన వారందరికీ నా ధన్యవాదాలు’’ అని రాహుల్ చెప్పారు. అంతకు ముందు ఒక ట్వీట్‌లో ఏది ఏమైనా తన కర్తవ్యాన్ని తాను వీడనని దేశ సిద్ధాంతాలు, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడమే తన బాధ్యతని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఈ విజయం రాహుల్ గాంధీది మాత్రమే కాదని, ఈ దేశ ప్రజలది, ప్రజాస్వామ్యానిదని అన్నారు. సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన 24 గంటలు తిరగక ముందే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని, ఇప్పుడు దానిని ఎత్తేయడానికి ఎంత సమయం తీసుకుంటారో చూడాలని వ్యాఖ్యానించారు.
ఆ మూడు ఎక్కువ కాలం దాగవు
రాహుల్ గాంధీ తిరిగి లోక్‌సభలో అడుగుపెట్టనుండడంతో సోదరి ప్రియాంక ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఆమె తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. గౌతమ బుద్ధుని కొటేషన్‌ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సూర్యుడు, చంద్రుడు, నిజం.. ఈ మూడింటిని ఎక్కువ కాలం దాచలేరు అంటూ గౌతమ బుద్ధుడు చెప్పిన మాటల్ని ట్వీట్‌లో రాసిన ప్రియాంక సత్యమేవ జయతే అంటూ ముగించారు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో రాజకీయ పార్టీలన్నీ సుప్రీం తీర్పుని స్వాగతించాయి. పార్లమెంటులోకి తిరిగి రాహుల్ అడుగు పెట్టే రోజు కోసం చూస్తున్నామని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.
న్యాయపోరాటం కొనసాగిస్తా : పూర్ణేశ్ మోదీ
రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సుప్రీం కోర్టు తీర్పుని స్వాగతించారు. సుప్రీం తీర్పుని తాము గౌరవిస్తామని, అయితే సెషన్స్ కోర్టులో న్యాయపోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు.
సోదరుడు రాహుల్‌గాంధీ జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించడం హర్షణీయం. ఈ తీర్పుతో మన న్యాయ వ్యవస్థ మీద , ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ మీద మరింతగా విశ్వాసం పెరిగింది.
– ఎం.కె.స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి
సుప్రీం కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాను. ప్రజా స్వామ్యం, న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని ఈ తీర్పు బలపరుస్తోంది. రాహుల్‌కి, వయనాడ్ ప్రజలకి నా శుభాకాంక్షలు.
– ఎ.కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
రాహుల్ గాంధీ మళ్లీ సభలోకి అడుగు పెట్టనుండడం ఎంతో శుభవార్త. దీంతో ఇండియా కూటమి మరింత బలోపేతమవుతుంది. మాతృభూమి కోసం విపక్షాల పోరాటం మరింత ఐక్యంగా సాగి విజయం సాధించి తీరుతాం.
– మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం
Comments
Please login to add a commentAdd a comment