సారీ చెప్పనంతే!
సుప్రీం కోర్టు సూచనకు రాహుల్ నో
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ హత్యకేసులో ఆరెస్సెస్ పాత్ర ఉందం టూ చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పేది లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆరెస్సెస్‌కు క్షమాపణ కోరితే కేసు ముగుస్తుంద ని సుప్రీం చేసిన సూచనను రాహుల్ తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసే ప్రసక్తే లేదని.. కేసులో వాదించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు.
గురువారం ఈ కేసు విచారణ సమయంలో.. రాహుల్ క్షమాపణ చెబితే కేసు వెనక్కు తీసుకుంటామని.. పరువునష్టం దావా వేసిన ఆరెస్సెస్ భీవండి శాఖ కార్యదర్శి రాజేశ్ కుంతే సుప్రీం కోర్టుకు తెలిపారు. దీనికి కపిల్ సిబల్ ససేమిరా అన్నారు. దీంతో.. ఈ కేసులో మధ్యంతర స్టేను పొడిగిస్తూ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. రాహుల్ గాంధీ ఈ కేసులో తన ప్రతిస్పందన నాలుగువారాల్లో తెలియజేయాలని ఆదేశించింది.