
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పీహెచ్‌డీ స్కాలర్, కేరళకు చెందిన సామాజిక కార్యకర్త ఆబా మురళీధరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్8(3) ‘ఆటోమేటిక్ అనర్హత’ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఎన్నికైన ప్రజాప్రతినిధులపై నేరం రుజువైన వెంటనే అనర్హత వేటు వేయడం చట్ట విరుద్దమని పిటిషన్‌లో పేర్కొన్నారు. పరువు నష్టం కేసులో శిక్షలను చట్టం నుంచి మినహాయించాలని విన్నపించారు. ఆటోమెటిక్‌గా ప్రజాప్రతినిధుల్ని అనర్హులుగా ప్రకటించే సెక్షన్ 8 విషయంలో దిశానిర్దేశం చేయాలని మురళీధరన్ పిటిషన్‌లో కోరారు. ఈ సెక్షన్ అక్రమంగా, ఏకపక్షంగా ఉందని ఆరోపించారు.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3)ను న్యాయసమ్మతం లేకుండా రూపొందించారని, అది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల భావ స్వేచ్ఛను హరిస్తోందన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ ఓట్లతో నేతల్ని ఎన్నుకున్నారని, కానీ ఆ చట్టం వల్ల ఆ నేత తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నట్లు తన పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌పై సుప్రీం వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
కాగా 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంటూ లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజ్యాంగబద్ధమేనా?
Comments
Please login to add a commentAdd a comment