
లక్నో: అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు– రామ జన్మభూమి కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డిసెంబర్ 9లోపు రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) బుధవారం ప్రకటించింది. సుప్రీంతీర్పును సమీక్షించబోమని సున్నీ వక్ఫ్ బోర్డు మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఏఐఎంపీఎల్‌బీ తాజాగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. నవంబరు 17న జరిగిన బోర్డు సమావేశంలోనే రివ్యూ పిటిషన్‌పై తీర్మానించామని, సమీక్ష కోరేందుకు తమకు డిసెంబరు 9వరకు సమయం ఉందని ఏఐఎంపీఎల్‌బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ తెలిపారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశమున్న ముస్లిం వర్గాలను అయోధ్య పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని, కేసుల్లో ఇరికించి జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని జలానీ ఆరోపించారు.
అయోధ్య పోలీసుల తీరును పిటిషన్‌లో తాము సుప్రీంకోర్టుకు నివేదిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. మసీదు నిర్మాణానికి ప్రభుత్వమిచ్చే ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు నిరాకరిస్తే దాన్ని తమకు ఇవ్వాల్సిందిగా కోరతామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు బుధవారం తెలిపింది. అయితే ఆ స్థలాన్ని తాము మసీదు నిర్మాణానికి కాకుండా ఆసుపత్రిని నిర్మించేందుకు వినియోగిస్తామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ వసీమ్ రిజ్వీ తెలిపారు. అయోధ్య తీర్పుకు సంబంధించి రివ్యూ పిటిషన్ ముసాయిదా తయారైందని ప్రముఖ ముస్లిం సంస్థలు తెలిపాయి. డిసెంబరు 3 లేదా 4 తేదీల్లో జమాయత్ ఉలేమా ఏ హింద్ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది.