Ayodhya Case
-
రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ..
అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థలంలో నూతన రామమందిరాన్ని నిర్మించారు. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 2024, జనవరి 22న జరగనుంది. అత్యంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం వీక్షించనుంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రత్యేక అతిథులు అయోధ్యకు తరలిరానున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత సామాన్య భక్తులు కూడా చారిత్రాత్మక రామాలయాన్ని సందర్శించుకోగలుగుతారు. అయితే అయోధ్య రామాలయం నిర్మాణం వెనుకున్న పలు సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుందాం. అది.. 1528వ సంవత్సరం బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి కమాండర్ మీర్ బాకీ నిర్మించారు. మీర్ బాకీ ఈ మసీదుకు బాబ్రీ అని పేరు పెట్టారు. 1885 అయోధ్య రామజన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది. బాబ్రీ మసీదు పక్కనే రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్ రఘువర్‌దాస్ ఫైజాబాద్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 1949 వివాదాస్పద నిర్మాణంలోని మధ్య గోపురం కింద రామ్ లల్లా విగ్రహం కనిపించింది. ఆ తర్వాత స్థానికులు ఆ ప్రదేశంలో పూజలు చేయడం ప్రారంభించారు. 1950 గోపాల్ సింగ్ విశారద్ అనే పండితుడు ఇక్కడ పూజలు చేసే హక్కును డిమాండ్ చేస్తూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు నేపధ్యంలో హిందువులు ఆలయంలో పూజించే హక్కును పొందారు. 1950 పరమహంస రామచంద్ర దాస్ ఆ ప్రాంతంలో విగ్రహాలను ఉంచి, పూజించేందుకు అనుమతించాంటూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఇదే రామ మందిర ఉద్యమానికి నాంది పలికింది. 1959 వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్మోహి అఖారా కోర్టు మెట్లు ఎక్కింది. 1981 యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ఆ ప్రాంతం స్వాధీనంపై కేసు వేసింది. 1986 ఫిబ్రవరి ఒకటిన హిందువులు పూజించేందుకు ఈ స్థలాన్ని తెరవాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1989 హైకోర్టు నుంచి కూడా హిందువులకు ఉపశమనం లభించింది. ఆగస్టు 14న ఈ కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. 1992 డిసెంబర్ 6న ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురయ్యింది. దీంతో రామమందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది. 2002 ఈ వ్యవహారం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. 2010 అలహాబాద్ హైకోర్టు సెప్టెంబరు 30న తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాకు మూడు సమాన భాగాలుగా విభజించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. 2011 మే 9న అలహాబాద్ హైకోర్టు ఈ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2018 ఫిబ్రవరి 8న సివిల్ అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. 2019 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యింది. 2019 ఆగస్టు 6న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది. 2019, ఆగస్టు 16న విచారణ పూర్తయిన తర్వాత ధర్మాసనం నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా తీర్పునిచ్చింది. హిందూ పక్షం 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని దక్కించుకుంది. మసీదు కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లిం వర్గానికి అందించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు తదనంతరం అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యింది. -
అయోధ్య కేసును సవాలుగా స్వీకరించా!
న్యూఢిల్లీ: అయోధ్య కేసును సవాలుగా స్వీకరించి పరిష్కరించానని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తెలిపారు. జస్టిస్ ఫర్ ద జడ్జ్ పేరిట రాసిన ఆత్మకథను ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయోధ్య తీర్పు, రాజ్యసభ నామినేషన్, ఎన్ఆర్సీ, కొలీజియం తదితర పలు అంశాలపై ఇండియా టుడే, ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆయా అంశాలపై రంజన్ అభిప్రాయాలు ఆయన మాటల్లో.. అయోధ్య తీర్పు: అయోధ్య కేసును నేను వెలికితీయలేదు. నా ముందున్న న్యాయమూర్తి ఒక తేదీని ఈ కేసుకు కేటాయించారు. ఆ తేదీ వచ్చినప్పుడు నేను పదవిలో ఉన్నాను. ఆ సమయంలో తప్పుకొని పోవడం లేదా ధైర్యంగా కేసును పరిష్కరించడమనే ఆప్షన్లు నాముందున్నాయి. నేనే ధైర్యంగా పరిష్కారానికి యత్నించాను. లైంగిక వేధింపుల ఆరోపణ: నిజానికి ఆ బెంచ్‌పై నేను ఉండకుండా ఉండాల్సింది. కానీ 45ఏళ్లు కష్టపడి సంపాదించిన పేరు ఒక్కరాత్రిలో ధ్వంసమవుతుంటే చూస్తూ ఊరుకోలేం! సీజేఐ కూడా మానవమాత్రుడే! మీడియా మరింత అప్రమత్తతతో ఉండాలనే ఆ బెంచ్ తీర్పునిచ్చింది. కానీ మీడియా మాత్రం సీజేఐ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకున్నారని వార్తలు రాసింది. అందుకే ఆ బెంచ్‌లో నేను లేకుండా బాగుండేదని అనుకున్నా. జడ్జీల మీడియా సమావేశం: పాత్రికేయ సమావేశం నిర్వహించడం నా ఆలోచనే! బహుశా నేను తప్పుగా ఊహించి ఉండవచ్చు. మా నలుగురు న్యాయ మూర్తుల ఆలోచనలను అప్పటి సీజేఐకి అర్థమయ్యేలా చెప్పాలన్న ప్రయత్నం చివరకు విఫలమైంది. అయితే ఇలాంటి మీడియా సమావేశాల్లో అదే మొదటిది, చివరిది కావాలని నా ఆశ. రాజ్యసభ నామినేషన్: అయోధ్య తీర్పుకు ప్రతిఫలంగా కేంద్రం నాకు రాజ్యసభ సీటిచ్చిందన్న ఆరోపణలన్నీ నిరాధారాలే! రిటైర్డ్ జడ్జీలు గవర్నర్, మానవహక్కుల కమిషన్ చైర్మన్, లాకమిషన్ చైర్మన్ పదవులకు అర్హులు. వీటిని స్వీకరించమనా మీ సూచన? నా నామినేషన్ అధికరణ 80 ప్రకారం జరిగిన అంశం. ఇందులో తప్పేమీ లేదు. రాజ్యసభకు ఎంపికైనప్పటినుంచి ఒక్క పైసా తీసుకోలేదు. స్వంత ఖర్చులతో సభ్యత్వ నిర్వహణ చేస్తున్నాను. రఫేల్ తీర్పు: రఫేల్ తీర్పు ముందు ప్రధాని సుప్రీంకోర్టుకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వచ్చారు. ఈ సమావేశానికి బిమ్స్టెక్ దేశాల ప్రధాన న్యాయమూర్తులను ఆహ్వానించారు. ఆ సమావేశంలో ప్రధానితో సెల్ఫీలకు పోటీపడిన కొందరు జడ్జీలు ఇప్పుడు అదే ప్రధానిపై విమర్శలు గుప్పిస్తూ హడావుడి చేస్తున్నారు. కొలీజియం: ప్రతి వ్యవస్థలో మంచిచెడులుంటాయి. సీజేఐగా కొలీజియంలో నాకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. కొలీజియంలో సుదీర్ఘ చర్చల అనంతరం ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయడం జరుగుతుంది. -
మరోసారి తెరపైకి అయోధ్య కేసు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మసీదు కూల్చివేత స్థలంలో నూతన రామమందిరం రూపుదిద్దుకుంటున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు ముందు దాఖలైన పిటిషన్ బీజేపీ సీనియర్ నేతల్లో గుబులు రేపుతోంది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ (92), మురళీ మనోహార్ జోషీ (86), ఉమాభారతి, కళ్యాణ్ సింగ్, వీహెచ్‌పీ నేత వినయ్ కటియార్లతో పాటు మొత్తం 32 మంది నిర్ధోషులుగా తేల్చుతూ లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అయోధ్యకు చెందిన ఇద్దరు వ్యక్తులు సవాలు చేశారు. స్థానికులైన హాజీ మహ్మద్ అహ్మద్ (74), సయ్యద్ అల్కఖ్ అహ్మద్ (81) అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ శుక్రవారం అలహాబాద్ హైకోర్టు ముందు ఓ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పును పునఃసమీక్షించాలని పిటిషన్లో కోరారు. (వృద్ధ నేతను వెంటాడుతున్న బాబ్రీ విధ్వంసం) కాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయగా.. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ సమయంలో 17 మంది చనిపోయారు. మిగిలిన 32 మందిని నిర్దోషులని సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు ప్రకటించింది. మసీదు కూల్చివేతకు నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎలాంటి స్పష్టమైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. పైగా, అందులో రామ్‌లల్లా విగ్రహం ఉన్నందున, ఆ నిర్మాణాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్ నేత దివంగత అశోక్‌సింఘాల్ ప్రయత్నించారని దాదాపు 2,300 పేజీల తీర్పులో సీబీఐ న్యాయమూర్తి ఎస్కే యాదవ్ వెల్లడించారు. నిందితులంతా రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సమయంలో కూల్చివేత ఘటన నాటి వార్తాకథనాలను కానీ, వీడియో క్యాసెట్లను న్యాయమూర్తి సాక్ష్యాలుగా పరిగణించలేదు. (ఎదురుదెబ్బ: ఎన్డీయేలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!) ఒరిజినల్ కాపీలు కానందున వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేదన్నారు. కోర్టుకు సమర్పించిన వీడియోలు కూడా స్పష్టంగా లేవన్నారు. అలాగే, నెగెటివ్స్ సమర్పించనందున, ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా సాక్ష్యాలుగా పరిగణించలేమన్నారు. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని సుప్రీంకోర్టు 2019 నవంబర్‌లో చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని నాటి సీజే రంజన్ గొగోయ్ తీర్పులో పేర్కొన్నారు. ఆ 32 మంది వీరే.. 1, ఎల్కే అడ్వాణీ, 2. మురళీ మనోహర్ జోషి, 3. కళ్యాణ్ సింగ్, 4. ఉమాభారతి, 5. వినయ్ కతియార్, 6. సాక్షి మహరాజ్, 7. సాధ్వి రితంబర, 8. మహంత్ నృత్య గోపాల్ దాస్, 9. రామ్‌విలాస్ వేదాంతి, 10. చంపత్ రాయ్, 11. సతీష్ ప్రధాన్, 12. ధరమ్ దాస్, 13. బ్రిజ్ భూషణ్ సింగ్, 14. పవన్ కుమార్ పాండే, 15. జై భగవాన్ గోయల్, 16. లల్లూ సింగ్, 17. జైభాన్ సింగ్ పావాయా, 18. ఆచార్య ధర్మేంద్ర దేవ్, 19. రాంజీ గుప్తా, 20. ప్రకాశ్ శర్మ, 21. ధర్మేంద్ర సింగ్ గుర్జార్, 22. ఆర్ఎం శ్రీవాస్తవ, 23. సతీష్ ప్రధాన్ కరసేవకులు: 24. రామ్ చంద్ర ఖత్రి, 25. సుధీర్ కక్కర్, 26. అమన్ నాథ్ గోయల్, 27. సంతోష్ దుబే, 28. వినయ్ కుమార్ రాయ్, 29. కమలేష్ త్రిపాఠి, 30. గంధి యాదవ్, 31, విజయ్ బహదూర్ సింగ్, 32. నవీన్ భాయ్ శుక్లా. -
బాబ్రీ విధ్వంసం కేసు: నేడే తుదితీర్పు
లక్నో: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 1992 బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం నేడు తుదితీర్పు వెలువరించనుంది. తీర్పు వెలువరించే రోజు నాటికి జీవించి ఉన్న 32 మంది ముద్దాయిలు కూడా కోర్టు ఎదుట హాజరుకావాలని సీబీఐ జడ్జి ఎస్కే యాదవ్ 16వ తేదీన ఆదేశించారు. ముద్దాయిల్లో మాజీ ఉపప్రధాని ఎల్కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రులు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, వినయ్ కతియార్, సాధ్వి రితంబర ఉన్నారు. తీర్పునిచ్చే రోజు కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ కోర్టులో హాజరవుతారో లేదో తెలియరాలేదు. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా బాబ్రీ విధ్వంసం జరిగింది. రాజస్తాన్ గవర్నర్‌గా పదవీ కాలం ముగియగానే గత సెప్టెంబర్ నుంచి, ఆయనపై విచారణ కొనసాగింది.(చదవండి: నూతన శకానికి నాందీ క్షణం) విచారణ జరుగుతుండగానే 16 మంది మరణం కాగా 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీబీఐ విచారించింది. ఈ క్రమంలో సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించింది. -
అయోధ్యలో బాబ్రీ ఆస్పత్రి: నిజమెంత?
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా వివాదాల్లో నానుతూ వచ్చిన అయోధ్య వివాదాస్పద స్థలం(2.77 ఎకరాలు) రాముడిదేనని సుప్రీం కోర్టు గతేడాది సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి గానూ ముస్లింలకు (సున్నీ వక్ఫ్ బోర్డుకు) ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా సున్నీ వక్ఫ్ బోర్డుకు భూమి కేటాయించింది. దీంతో రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి. అందులో భాగంగా ఆగస్టు 5న అయోధ్యలో భూమి పూజ కూడా జరిగింది. ఈ క్రమంలో అయోధ్యలో సున్నీ వక్ఫ్ బోర్డు తమకు కేటాయించిన భూమిలో బాబ్రీ ఆస్పత్రి కడుతోందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. (ఆ భూమి తీసుకుంటాం: సున్నీ వక్ఫ్‌బోర్డు) ఎయిమ్స్ తరహాలో నిర్మించనున్న ఈ ఆసుపత్రికి ప్రముఖ వైద్యుడు డా. కఫీల్ ఖాన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారన్నది సదరు పోస్టుల సారాంశం. ఆ ఆసుపత్రి ఎలా ఉండబోతుందో తెలిపేందుకు నమూనా ఫొటోలను కూడా జత చేశారు. ఇదంతా నిజమేనని భ్రమ పడిన ముస్లిం వ్యక్తులు ఈ సందేశం అందరికీ చేరాలని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వైరల్ వార్తపై స్పందించిన సున్నీ వక్ఫ్ బోర్డు ఇది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. తమకు కేటాయించిన 5 ఎకరాల్లో ఏం నిర్మించాలనే విషయంపై ఇంకా నిర్ధారణకు రాలేమని స్పష్టం చేసింది. (రామ మందిరానికి షారుక్ రూ.5 కోట్ల విరాళం?) నిజం: అయోధ్యలో సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించిన ఐదు ఎకరాల్లో బాబ్రీ ఆస్పత్రి కట్టడం లేదు. -
భారత్‌లో లౌకికవాదం ఓడిన రోజు: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరకావడంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోదీ హిందుత్వవాదానికి పునాది వేశారని విమర్శించారు. బుధవారం ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. దేశ ప్రధానికి ఏ ఒక్క మతంపై ప్రేమ ఉండకూడని వ్యాఖ్యానించారు . ఒక మందిరం కానీ, ఒక మసీదు కానీ దేశానికి ప్రతీక కాబోవన్నారు. అయోధ్య వివాదంలో బీజేపీ, సంఘ్‌పరివార్ సుప్రీంకోర్టుకు అసత్యాలు చెప్పారని ఆరోపించారు. (చదవండి: బాబ్రీ మసీదు ఉండేది, ఉంటుంది: ఒవైసీ) కాగా, అంతకు ముందు ట్వీటర్ వేదికగా కూడా బీజేపీ ప్రభుత్వంపై ఒవైసీ మండిపడ్డారు. ‘బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, కచ్చితంగా ఉంటుంది’అనే అర్థం వచ్చేలా బాబ్రీ జిందా హై అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో ట్వీట్ చేశారు. కాగా, రామ మందిరం భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సైతం గతంలో అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుపట్టిన సంగతి తెలిసిందే. (చదవండి : రాముడు అందరి వాడు : ప్రధాని మోదీ) అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం విధితమే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు స్థలం కేటాయించింది. ఇక బుధవారం హిందువుల చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణానికి సంబంధించిన తొలి అడుగు పడుతున్న నేపథ్యంలో అయోధ్య రామనామ స్మరణతో మార్మోగిపోతోంది. అక్కడికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తొలుత రామజన్మ భూమిలో రామ్‌లల్లా దర్శనం చేసుకుని.. భూమి పూజ కార్యక్రంలో పాల్గొన్నారు. -
హిందుత్వవాదానికి మోదీ పునాది వేశారు
-
అయోధ్యలో భూమి పూజ: ఒవైసీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎన్నటికీ తుడిచిపెట్టుకు పోదని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరుగుతున్న వేళ మరోసారి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘‘బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, కచ్చితంగా ఉంటుంది కూడా’’అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాగా ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఒవైసీ గతంలో ప్రధాని మోదీని విమర్శించిన విషయం తెలిసిందే. అదే విధంగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ఓ క్రిమినల్స్ గుంపు ధ్వంసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించినప్పటికీ తాను బతికున్నంత కాలం బాబ్రీ మసీదు ఎపిసోడ్ ముగిసిపోదని హెచ్చరించారు. రామ మందిర భూమి పూజ నిర్వహించకూడదని విజ్ఞప్తి చేశారు.(లైవ్ అప్డేట్స్; అయోధ్యలో భూమిపూజ) కాగా అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు స్థలం కేటాయించింది. ఇక బుధవారం హిందువుల చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణానికి సంబంధించిన తొలి అడుగు పడుతున్న నేపథ్యంలో అయోధ్య రామనామ స్మరణతో మార్మోగిపోతోంది. అక్కడికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తొలుత రామజన్మ భూమిలో రామ్‌లల్లా దర్శనం చేసుకుని.. భూమి పూజ కార్యక్రంలో పాల్గొన్నారు. #BabriMasjid thi, hai aur rahegi inshallah #BabriZindaHai pic.twitter.com/RIhWyUjcYT — Asaduddin Owaisi (@asadowaisi) August 5, 2020 -
భూమిపూజకు అయోధ్య సిద్దం
అయోధ్య: రామ మందిర నిర్మాణానికి సంబంధించి బుధవారం జరిగే భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య పట్టణం సర్వాంగ సుందరంగా సిద్ధమయింది. బారికేడ్లు, బలగాలతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పలువురు స్థానికులు తమ ఇళ్లకు, దుకాణాలకు కొత్త రంగులు వేసుకున్నారు. పలు చోట్ల భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి 175 మందిని మాత్రమే ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పట్టణానికి చేరుకుని, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. కార్యక్రమం జరిగే ప్రాంతానికి ఎవరూ రావద్దని స్థానికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎవరూ అయోధ్యకు రావద్దని కోరారు. మొత్తం శంకుస్థాపన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం జరుపుతామని, ప్రజలంతా ఇళ్లలోనే ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని అభ్యర్థించారు. అయోధ్యకు వెళ్లే రహదారులకు ఇరువైపులా రామ మందిర నమూనా చిత్రాలను, రామ్‌లల్లా చిత్రాలను అలంకరించారు. అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయ ప్రాంతం మంగళవారం పోలీసు సైరన్లతో, ఆలయం నుంచి వినిపించే భజనలతో హోరెత్తిపోయింది. ఆ ఆలయాన్ని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. పోలీసులు అయోధ్యకు వెళ్లే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల మొబైల్ నంబర్ సహా ప్రతీ వివరం తెలుసుకుంటున్నారు. కోవిడ్–19 ప్రొటోకాల్‌ను అందరూ పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని సీనియర్ ఎస్పీ దీపక్ కుమార్ తెలిపారు. ఆహ్వానం లేకుండా బయటివ్యక్తులెవరూ అయోధ్యలో అడుగుపెట్టకుండా చూసుకుంటున్నామన్నారు. అలాగే, పట్టణంలో నలుగురికి మించి గుమికూడకుండా ఆంక్షలు విధించామని తెలిపారు. బయటివారెవరూ పట్టణంలో లేరని నిర్ధారించుకునేందుకు.. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని వివరించారు. భూమి పూజ మినహా పట్టణంలో మరే ఇతర మతపరమైన కార్యక్రమం నిర్వహించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే, ఆలయాలు, మసీదులు, ప్రార్థనామందిరాలు తెరిచే ఉంటాయి. భూమి పూజలో ప్రధాని అయోధ్యలో బుధవారం ‘శ్రీ రామ జన్మభూమి మందిర్’ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటున్నారని ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ఆ కార్యక్రమం కన్నాముందు హనుమాన్ గఢీ ఆలయంలో జరిగే పూజలో పాల్గొంటారని తెలిపింది. ‘అక్కడి నుంచి శ్రీ రామ జన్మభూమికి వెళ్లి అక్కడ భగవాన్ శ్రీ రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ను దర్శించుకుని, పూజలు నిర్వహిస్తారు’ అని వెల్లడించింది. ఆ ప్రాంగణంలో ఒక పారిజాత మొక్కను కూడా నాటుతారని పీఎంఓ తెలిపింది. ఆ తరువాత భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది. భూమి పూజ సందర్భంగా శిలాఫలకాన్ని, స్మారక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరిస్తారని తెలిపింది. హనుమాన్ గఢీలో ప్రథమ పూజ ఆనవాయితీ ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని అయోధ్యలోని ప్రముఖ హనుమాన్ గఢీ ఆలయంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రామ మందిరం భూమిపూజకు ముందుగా ప్రధాని హనుమాన్ ఆలయంలో పూజలు చేయనున్నారు. శ్రీరాముడి దర్శనానికి ముందుగా ఎవరైనా రామభక్త ఆంజనేయుడికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కరోనా వైరస్ ప్రొటోకాల్ కారణంగా తాము ప్రధానితో మాట్లాడేందుకు కూడా అవకాశం లేదని ఆలయ పూజారి మహంత్ రాజు దాస్ తెలిపారు. 72 మెట్లుండే హనుమాన్ గఢీ ఆలయం ఉత్తర భారతంలో అత్యంత ప్రముఖమైందిగా పేరు. ఈ ఆలయంలో బాల ఆంజనేయుడు తన తల్లి అంజనీ దేవి ఒడిలో కూర్చుని ఉంటాడు. రావణుడిపై విజయం సాధించిన అనంతరం శ్రీరాముడు ఈ ప్రదేశాన్ని ఆంజనేయుడు నివసించేందుకు ఇచ్చాడు. అందుకే దీనిని హనుమాన్ గఢీ లేదా హనుమాన్ కోట్ అంటారు. 12:30 గంటలకు భూమిపూజ ప్రారంభం 12:40 గంటలకు పునాది రాయి పూజ 175 మందికే ఆహ్వానం అయోధ్యలో ప్రధాని 3 గంటలు న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం భూమిపూజలో పాల్గొనే ప్రధాని మోదీ పర్యటన వివరాలను అధికారులు విడుదల చేశారు. బుధవారం ఆయన అయోధ్యలో దాదాపు మూడు గంటలపాటు గడుపుతారు. ఈ సందర్భంగా మొదట ఆయన హనుమాన్ ఆలయాన్ని సందర్శించుకుంటారు. భూమిపూజ కార్యక్రమానికి ఆలయ ట్రస్టు 175 మందికి ఆహ్వానాలు పంపించింది. వీరిలో వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన 135 మంది సాధువులు ఉన్నారు. బీజేపీ కురువృద్ధ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, న్యాయవాది పరాశరన్ తదితర ప్రముఖులతో సంప్రదింపులు జరిపిన మీదటే ఆహ్వాన జాబితా రూపొందించినట్లు ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు. తమిళనాడు నుంచి వచ్చిన సాధువులు శ్రీరామ్ అని తమిళంలో రాసి ఉన్న 5 కిలోల బరువైన బంగారు ఇటుక, 20 కిలోల వెండి ఇటుకను ఆలయ ట్రస్టుకు బహూకరించారని ఆయన వెల్లడించారు. బుధవారం ఉ.9.35 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ప్రధాని 10.35 గంటలకు లక్నో విమానాశ్రయానికి 10.40 గంటలకు హెలికాప్టర్లో అయోధ్యకు 11.30 గంటలకు అయోధ్యలోని సాకేత్ విమానాశ్రయానికి 11.40 గంటలకు హనుమాన్ గర్హిలో పూజలు 12 గంటలకు రామజన్మభూమిలో రామ్‌లల్లా దర్శనం 12.15 గంటలకు ప్రతిపాదిత ఆలయ ప్రాంగణంలో మొక్క నాటుతారు 12.30 గంటలకు భూమిపూజ ప్రారంభం 12.40 గంటలకు భూమిపూజ పునాదిరాయి పూజ 1.10 గంటలకు స్వామి నృత్యగోపాల్ దాస్ తదితర రామజన్మభూమి ట్రస్టు సభ్యులతో సమావేశం 2.05 గంటలకు అయోధ్య నుంచి హెలికాప్టర్లో తిరుగుప్రయాణం 2.20 గంటలకు లక్నో నుంచి ఢిల్లీకి ప్రయాణం. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సయోధ్యకు అంకురార్పణ
అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాలంటూ అలుపెరగని రీతిలో దశాబ్దాలుగా పోరాడు తున్నవారి స్వప్నం ఈడేరబోతోంది. బుధవారం ఆ నగరంలో మూడు గంటలపాటు జరిగే భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీసహా 174మంది ఆహ్వానితులు పాల్గొంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి పంజా విసిరిన పర్యవసానంగా ఇలా తక్కువమందితో నిరాడంబరంగా ఆ కార్యక్ర మాన్ని ముగిస్తున్నారు. లేనట్టయితే ఇవాళ్టి రోజున అయోధ్య లక్షలాదిమంది జనసందోహంతో హోరె త్తిపోయేది. బాబ్రీ మసీదు వున్న ప్రాంతం రామ జన్మభూమి అని, దాని స్థానంలో రామమందిరం నిర్మించాలని జన్‌సంఘ్‌గా వున్నప్పటి నుంచి బీజేపీ రాజకీయంగా పోరాడుతూ వుంది. అంతకు చాన్నాళ్లముందే... అంటే 1885 డిసెంబర్లో వలసపాలకుల హయాంలోనే తొలిసారి సివిల్ కేసు దాఖలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949 చివరిలో అయోధ్య అదనపు నగర మేజిస్ట్రేట్ కోర్టులో ఈ వివాదంపై విచారణ జరిగింది. ఈ వ్యాజ్య పరంపర ఇలా కొనసాగుతుండగానే న్యాయ స్థానాల వెలుపల ఇరువర్గాలమధ్యా సామరస్యపూర్వక పరిష్కారం కోసం ప్రయత్నించినవారు కూడా లేకపోలేదు. 1990లో స్వల్పకాలం ప్రధానిగా ఉన్న చంద్రశేఖర్, 1992లో అప్పటి ప్రధాని పీవీ నర సింహారావు, 2003లో నాటి ప్రధాని వాజపేయి ఈ మార్గంలో ప్రయత్నించారు. ఇతర ప్రయత్నాల సంగతలా వుంచి పీవీ హయాంలో ఆయన సలహాదారుగా పనిచేసిన పీవీఆర్కే ప్రసాద్, తాంత్రికుడు చంద్రస్వామి పీఠాధిపతులతో, హిందూ మత పెద్దలతో, ముస్లిం సంఘాలతో మాట్లాడారు. ఆ సంభా షణలు కొంతవరకూ ఫలించిన దాఖలాలు కూడా కనబడ్డాయని, కానీ చివరకు అది కాస్తా మూలన పడిపోయిందని చెబుతారు. నిరుడు మార్చిలో సుప్రీంకోర్టు సైతం ఇలాంటి మధ్యవర్తిత్వ ప్రయత్నం చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫకీర్ మహ మ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచులతో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ అన్ని పక్షాలతో చర్చించి ఒక ఒప్పందాన్ని రూపొందించింది. అయితే కొన్ని పక్షాలు మాత్రమే దానికి అంగీకరించాయి. ఆ పక్షాలు కూడా షరతులు విధించాయి. అయితే మధ్యవర్తిత్వాలు సర్వ సాధారణంగా ఆస్తుల పంపకాలు, స్థల యజమానుల మధ్య వుండే సరిహద్దు తగాదాలు వగైరాల్లో చెల్లుబాటవుతుంది. పరస్పరం తలపడేవారు ఏదో ఒక దశలో కోర్టు వివాదాలతో విసిగిపోయి కొంద రిని పెద్దమనుషులుగా అంగీకరించి, వారి తీర్పునకు తలొగ్గుతారు. కానీ రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం మౌలికంగా మతపరమైన మనోభావాలతో, విశ్వాసాలతో ముడిపడి వున్న సమస్య. అక్కడ అంతక్రితం వున్న రామమందిరాన్ని బాబర్ ధ్వంసం చేయించి, దానిపై మసీదు కట్టాడన్నది రామ మందిరం నిర్మించాలని పోరాడినవారి వాదన. ఈ వివాదం రాజకీయంగా మాత్రమే కాదు... సామాజికంగా కూడా కల్లోలం సృష్టించింది. తన మధ్యవర్తిత్వ ప్రయత్నం ఫలించలేదని గ్రహించాక సుప్రీంకోర్టు నిరుడు నవంబర్ 9న తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామమందిర నిర్మాణానికి అప్పగించా లని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. ఒక ట్రస్టు ఆధ్వర్యంలో మందిర నిర్మాణం పనులు జరగాలని నిర్దేశించింది. మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం కేటాయించా లని కేంద్రాన్ని ఆదేశించింది. దేశంలో విద్వేషపూరిత పరిణామాలకు దారితీసిన ఒక సంక్లిష్ట సమస్య సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో పరిసమాప్తమైంది. అన్ని వర్గాలూ ఈ తీర్పును స్వాగతిం చాయి. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చొరవ, పట్టుదల వల్లే ఈ చిక్కుముడి వీడింది. చివరి దశలో కూడా ఇది యధాప్రకారం వాయిదా పడేలా చూడాలని కొన్ని పక్షాలు ప్రయత్నించాయి. 40 రోజులపాటు నిర్నిరోధంగా సాగిన వాదప్రతివాదాల క్రమంలో ఉద్వే గాలు చోటుచేసుకున్నాయి. కోపతాపాలు మిన్నంటాయి. సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పువల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న భయాందోళనలు అందరిలోనూ ఉన్నాయి. బాబ్రీ మసీదు విధ్వంçసం అనంతరం ఎన్నో విషాదకర పరిణామాలు చూసి ఉండటం వల్ల అవి సహజమే. కానీ ఏళ్లు గడుస్తున్నకొద్దీ అందరిలోనూ పరిణతి వచ్చింది. పరస్పర ఘర్షణల వల్ల ఒరిగేదేమీలేదన్న అవగాహన ఏర్పడింది. అందుకే ఎక్కడా ఆగ్రహావేశాలు కట్టుదాటలేదు. అంతా ప్రశాంతంగా గడిచిపోయింది. కాలం మారేకొద్దీ ఎలాంటి ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియాలంటే రామ జన్మభూమి ఉద్యమాన్ని చూడాలి. తన రథయాత్రతో ఆ ఉద్యమానికి ఆయువు పోసి, అది దేశవ్యాప్తమయ్యేందుకు బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ కారకులు. ఆ రథయాత్రవల్లే బీజేపీ దేశం నలుమూలలా బలపడింది. కానీ ఇప్పుడు జరిగే భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన తన ఇంట్లో టెలివిజన్ సెట్లో వీక్షించవలసి వస్తోంది. కరోనా కారణంగా 90 ఏళ్లు పైబడి వయస్సున్నవారిని అనుమతించరాదని నిర్ణయించినందువల్లే ఆయనను ఆహ్వానించలేదని నిర్వాహకులు చెబుతున్నారు. అప్పట్లో ప్రధాన పాత్రధారులైన నేతలు మురళీ మనోహర్ జోషి, కల్యాణ్‌సింగ్, ఉమాభారతిలకు ఆహ్వానం అందినా వారు నిరాకరించడం ఆసక్తికరమైన విషయం. ఉమాభారతి అయోధ్య వెళ్తున్నా, కార్యక్రమానికి హాజరుకాబోనని ఇప్పటికే చెప్పారు. అడ్వాణీ రథయాత్ర గుజరాత్ వచ్చినప్పుడు ఆ కార్యక్ర మానికి నిర్వాహకుడిగా ఉండి పెద్దగా వార్తలకెక్కని నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రధాని హోదాలో భూమి పూజలో కీలక భూమిక పోషించబోతున్నారు. మన దేశంలో రామకోవెల లేని ఊరు, వాడా వుండదు. రాముడు కోట్లాదిమంది హిందువులకు ఆరాధ్యుడు కావొచ్చుగానీ, రామాయణం చాటి చెప్పిన విలువలు కాలావధుల్ని దాటి పరివ్యాప్తమయ్యాయి. కులాలు, మతాలు, జాతులకు అతీ తంగా అందరికీ ఆదర్శనీయమైనవిగా నిలిచాయి. అయోధ్యలో నిర్మాణం కాబోయే రామ మందిరం సైతం ఆ విలువల స్ఫూర్తికి అద్దం పట్టేలా రూపుదిద్దుకుంటుందని ఆశించాలి. -
కలియుగ ఊర్మిళ : 28 ఏళ్ల ఉపవాసం ముగింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఓ మహిళ 28 సంవత్సరాలుగా చేస్తున్న నిరాహార దీక్షకు ముగింపు లభించనుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన ఊర్మిళ చతుర్వేది అనే 81 సంవత్సరాల మహిళ అయోధ్యలో డిసెంబర్ 6, 1992లో వివాదాస్పద కట్టడం నేలమట్టమైనప్పటి నుంచి ఉపవాస దీక్షకు పూనుకున్నారు. అయోధ్యలో రాముడికి మళ్లీ గుడి కట్టిన అనంతరం మాత్రమే ఆహారం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు.వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రోజు ఆమె ఎంతో ఆనందించారు. అమె కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఎంతగా వేడుకున్నా ఆమె తన ఉపవాస దీక్షను మాత్రం విరమించలేదు. తాను అయోధ్యకు వెళ్లి ఆ శ్రీరాముని మందిరాన్ని దర్శించడం తనకు పునర్జన్మ వంటిదని ఆమె అన్నారు. భూమిపూజ అనంతరం అయోధ్యకు వెళ్లి, సరయూ నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపవాస దీక్ష విరమిస్తానని ఊర్మిళ స్పష్టంచేశారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ‘‘శ్రీరాముడు తన భక్తులను ఎప్పటికీ నిరాశ పరచడు. త్రేతాయుగం నాటి శబరి అయినా ఈ యుగం నాటి ఊర్మిళమ్మ (ఊర్మిళ చతుర్వేది) అయినా! అమ్మా, మీ భక్తికి ప్రణమిల్లుతున్నాను. పూర్తి భారతదేశం మీకు వందనాలు అర్పిస్తోంది! జై శ్రీరాం!’’ అని ట్వీట్ చేశారు. -
అయోధ్య రామాలయం: అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామాలయ నిర్మాణం శంకుస్థాపనకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలింది. దేశమంతా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ఘట్టం బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణ పోరాట చరిత్రలో ముందుభాగంలో ఉన్న బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆలయ శంకుస్థాపన నేపథ్యంలో మంగళవారం రాత్రి ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తన కల సాకారమైన రోజు ఇదని సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేయడం చరిత్రాత్మకమని అన్నారు. ‘అయోధ్యలో రామమందిర నిర్మాణం నాతో సహా భారతీయులందరికీ ఒక ఉద్వేగపూరిత క్షణం. రామజన్మభూమి లో మందిర నిర్మాణం బీజేపీ కల. రథయాత్ర ద్వారా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొనడం ద్వారా నా ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వహించా. సుప్రీంకోర్టు తీర్పుతో సామరస్య వాతావరణంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం శుభపరిణామం. ఈ సామరస్యపూర్వక వాతావరణం భారతీయుల మధ్య కలకాలం నిలబడాలి. భారతీయ నాగరికత వారసత్వానికి రాముడు ఒక ఆదర్శం. రామమందిర నిర్మాణం రామరాజ్యానికి ఆదర్శంగా నిలవాలి. సుపరిపాలన, అందరికీ న్యాయం, సిరి సంపదలకు రామ రాజ్యమే ఒక ఉదాహరణ. రాముడి సద్గుణాలను అందరూ అలవర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా అద్వానీతో పాటు మురళీమనోహర్ జోషీతో పాటు మరికొందరు వీడియో కన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ కార్యక్రమానికి హాజరుకానున్నారు. -
అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం..
సాక్షి, ముంబై : దశాబ్దాల న్యాయ పోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముందడుగు పడింది. ఆగస్ట్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామాలయ నిర్మాణం కార్యక్రమం ప్రారంభంకాబోతుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రాముడి గుడి శంకుస్థాపన కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. దీని కోసం అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాభవుతోంది. మరోవైపు కరోనా వ్యాప్తి దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిధులను ఆహ్వానించాలని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. అయితే అయోధ్య రామాలయ నిర్మాణం కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పోరాటం కొనసాగించిన శివసేనను శంకుస్థాపన కార్యక్రమానికి దూరంగా పెట్టడం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నెల 5న జరగబోయే భూమిపూజ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకోనే కీలక ఘట్టానికి తమను ఆహ్వానించలేదని సేనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (మోదీ శపథం: 28 ఏళ్ల తరువాత తొలిసారి) బీజేపీ మూల సిద్ధాంతమైన హిందుత్వ ఎజెండాను భుజనాకెత్తుకున్న శివసేన మొదటి నుంచీ రామాలయ నిర్మాణం కోసం పాడుపడిందని, దేశంలోని హిందువుల ఆకాంక్షను నెరవేర్చడం కోసం అహర్నిశలు కృషి చేసిందని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల పాటు బాల్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో రామాలయ నిర్మాణం కొరకు న్యాయపోరాటంతో పాటు రాజకీయ పోరాటం చేశామంటారు. హిందుత్వ ఎజెండానే ధ్వేయంగా పురుడుపోసుకున్న శివసేనకు తొలుత నాయకత్వం వహించిన బాల్‌ఠాక్రే కరుడుగట్టిన హిందుత్వవాదిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తాజాగా అయోధ్యలో శంకుస్థాపన సందర్భంగా శివసేన సీనియర్ నేతలు, బాల్‌ఠాక్రే సహచరులు చంద్రకాంత్ ఖైరే, సూర్యకాంత్ మహడీక్, విశ్వనాథ్, విజయ్ దరువాలే వంటి నేతలు ఓ జాతీయ మీడియాతో ముచ్చటించారు. (అయోధ్య రామాలయ భూమిపూజపై భిన్న స్వరాలు) ‘మహారాష్ట్ర రాజకీయాలను కను సైగలతో శాసించిన బాలా సాహేబ్.. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, అటల్ బిహరీ వాజ్‌పేయీలతో కలిసి మందిర నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారు. 1993లో బాబ్రీ మసీదు కూల్చివేతలో కరసేవలతో పాటు, శివసేన కార్యకర్తలు, నేతల పాత్ర ఎంతో ఉంది. ఆ కేసు విచారణలో భాగంగా సీబీఐ మొదటిసారి నమోదు చేసిన చార్జ్‌షీట్‌లో 48 మంది పేర్లు ఉంటే వారిలో బాల్‌ఠాక్రేతో పాటు మరో పదిమంది కూడా ఉన్నారు. రామాలయ నిర్మాణం కొరకు ఠాక్రే తన చివరిశ్వాస వరకూ పోరాటం చేశారు. ఆయన మరణం అనంతరం బాల్ ఠాక్రే బాటలోనే ఉద్ధవ్ నడిచారు. బీజేపీతో రాజకీయ పరమైన దోస్తీ కొనసాగిస్తూనే.. అయోధ్య కోసం కొట్టాడారు. కోర్టుల్లో కేసుల విచారణ సాగుతున్నా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రామాలయం నిర్మాణం చేపట్టాలని ఠాక్రే అనేకసార్లు డిమాండ్ చేశారు. (భారీగా ఆలయ నిర్మాణం) వేయిమంది సేన కార్యకర్తలతో ఉద్ధవ్ అయోధ్యలో సైతం పర్యటించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణాల నేపథ్యంలో శివసేనపై బీజేపీ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. బీజేపీ తమను తక్కువ అంచనా వేయడం కారణంగానే సిద్ధాంత పరమైన విభేదాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కానీ శివసేన హిందుత్వ ఎజెండా మాత్రం ఎప్పటికీ మారదు. రామాలయ నిర్మాణ శంకుస్థాపక కార్యక్రమానికి ఠాక్రేను ఆహ్వానించకపోవడం నిజంగానే అవమానం. తాను చేసిన కృషి ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసు. అయోధ్య పోరాట చరిత్రలో మమ్మల్ని ఎప్పటికీ తొలగించలేరు’ అని పేర్కొన్నారు. -
మోదీ శపథం: 28 ఏళ్ల తరువాత తొలిసారి
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతా ఉత్కంఠ ఎదురుచూస్తున్న రామమందిర భూమిపూజ కార్యక్రమానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాభవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈనెల 5న రామమందిరానికి శంకుస్థాపన జరుగునుంది. దీని కోసం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అయితే దాదాపు 28 ఏళ్ల అనంతరం నరేంద్ర మోదీ అయోధ్యకు రావడం గమనార్హం. 1992లో అయోధ్య రామాలయం నిర్మించాలని, కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుతూ నరేంద్ర మోదీ తిరంగా యాత్రను చేపట్టారు. దీనిలో భాగంగానే అదే ఏడాది జనవరిలో తొలిసారి అయోధ్యకు చేరుకున్నారు. (రామాలయ పూజకు రాజకీయ రంగు) ఆయనతో పాటు అప్పటి ఉత్తర ప్రదేశ్ బీజేపీ చీప్ మురళీమనోహర్ జోషీ, పలువురు పార్టీ సీనియర్లు మోదీ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా అయోధ్యను సందర్శించిన మోదీ.. మరోసారి ఇక్కడికి వస్తే అది మందిర నిర్మాణం జరిగాకే వస్తానంటూ శపథం చేశారు. ఈ విషయాన్ని ఆనాడు మోదీ వెంట ఉన్న ఓ నాయకుడు చెప్పారు. సరిగ్గా 28 ఏళ్ల తరువాత అయోధ్య వివాదం సమసిపోవడంతో ప్రధానమంత్రి హోదాలో మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు. మోదీ ఆనాటి పర్యటన సంబందించిన ఫోటోసైతం బయయపడింది. కాగా మోదీ హయాంలోనే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. (బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు) -
రామాలయ పూజకు రాజకీయ రంగు
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల ఆకాంక్ష అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓవైపు చకచకా ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు భూమి పూజపై రాజకీయ విమర్శలు వేడెక్కుతున్నాయి. ఆగస్ట్ 5 జరగబోయే రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది బీజేపీ సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, పూర్వ సంఘ్ నేతలను సైతం కీలక ఘట్టానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయ ప్రారంభ కార్యక్రమంపై భిన్న స్వరాలతో పాటు రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లౌకిక రాజ్యమైన భారతదేశంలో ఓ వర్గానికి చెందిన దేవాలయ పూజా కార్యక్రమానికి ప్రధానమంత్రి ఎలా హాజరవుతారంటూ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలతో రాజకీయ వేడిని లేపారు. (భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక) మరోవైపు ఆలయ శంకుస్థాపక కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడ్డ ఉద్ధవ్ ఠాక్రే పేరు లేదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలో కరోనా ఉధృతి దృష్ట్యా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆల్‌లైన్ వేదికగా జరపాలన్న ఠాక్రే వ్యాఖ్యలపై మోహన్ భగవత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో ఠాక్రేకు ఆహ్వానం అందకపోవడం పట్ల శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ముంబై వర్గాల సమాచారం. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శివసేన ఎంతో పాటుపడిందని, ఎన్నో కార్యక్రమాలకు ఠాక్రే పిలుపునిచ్చారని గుర్తుచేస్తున్నారు. ఇదిలావుండగా.. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆలయ నిర్మాణం చేపట్టడంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం పలు వ్యాఖ్యలు చేశారు. (ప్రధాని మోదీపై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు) రామాలయ నిర్మాణంతో కరోనా అంతమయిపోతుందన్న భ్రమను కొంతమంది నేతలు కల్పిస్తున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. అంతేకాకుండా దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభంలో లేనిపోని హడావిడిని ప్రదర్మిస్తున్నారని బీజేపీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాగా ఆగస్ట్ 5 జరగబోయే భూమిపూజ కార్యక్రమానికి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పటినే ఆహ్వానాలను పంపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతీ, కళ్యాస్ సింగ్, యోగి ఆదిత్యానాథ్, మోహన్ భగవత్‌లకు ఆహ్వానం పంపింది. అలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలు సైతం హాజరవుతారని సమాచారం. -
ప్రధాని మోదీపై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లౌకిక సూత్రానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ దేశ ప్రధానిగా బాధ్యతలు స్పీకరించారని, ఇప్పుడు ఆ ప్రమాణాన్ని ఉల్లంఘింస్తున్నారని మండిపడ్డారు. అయోధ్య రామమందిర భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మోదీ వెళ్లడంపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ఓ క్రిమినల్స్ గుంపు ధ్వంసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం ట్విటర్ వేదికగా ఓవైసీ పోస్ట్ చేశారు. లౌకికతత్వమనేది రాజ్యాంగంలో ముఖ్యభాగమని దానిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలని హితవుపలికారు. (అయోధ్యలో ‘కాలనాళిక’) కాగా ఆగస్ట్ 5న అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 250 మంది అతిధులు సైతం శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందుకోనున్నారు. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ఆహ్వానించకపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. మందిర నిర్మాణం కోసం ఠాక్రే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు రామాలయ పూజ సందర్భంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందువులు పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టిని అయోధ్యకు తీసుకువస్తున్నారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా భూమిపూజ నిర్వహిస్తున్నామని, ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని రామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ ఓ ప్రకటనలో తెలిపారు. Attending Bhumi Pujan in official capacity will be a violation of @PMOIndia‘s constitutional oath. Secularism is part of the Basic Structure of Constitution We can’t forget that for over 400 years Babri stood in Ayodhya & it was demolished by a criminal mob in 1992 https://t.co/qt2RCvJOK1 — Asaduddin Owaisi (@asadowaisi) July 28, 2020 -
ప్రధాని మోదీ అయోధ్య పర్యటన ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ప్రధాని అయోధ్య పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్ట్ 5న ఉదయం జరిగే భూమి పూజ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారని సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చైర్మన్ మోదీకి ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ప్రధానితో పాటు మరో 250 మంది అతిథులు కూడా హాజరుకాన్నారు. కేంద్ర మంత్రులను, ఉత్తర ప్రదేశ్ మంత్రులతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందు పరిషత్ సీనియర్ ప్రతినిధులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను కూడా భూమి పూజ కోసం ఆహ్వానించనున్నారు. (భూమి పూజకు 250 మంది అతిథులు) -
వృద్ధ నేతను వెంటాడుతున్న బాబ్రీ విధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ కురు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (92) తన రాజకీయ జీవితంలో వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జనతా పార్టీ బీజేపీగా మార్పు, ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించి అయోధ్య రామందిరం కోసం చేసిన కృషి, పోరాటం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే 1992 నాటి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ.. ఆ కేసు నుంచి బయటపడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రపతి పదవికి సీనియర్ నేతను నామినేట్ చేస్తారని అంతా ఊహించారు. కానీ మోదీ సర్కార్ మాత్రం ఆ సాహసం చేయలేకపోయింది. ఓ విధంగా అద్వానీకి ఊహించని షాక్‌గానే పలువురు వర్ణించారు. కేసుల కారణంగనే ఆయనకు ఆ పదవి దక్కలేదని కొందరు విశ్లేషించారు. బాబ్రీ కేసులో వాంగ్మూలం.. అద్వానీ చిరకాల స్వప్నం అయోధ్య మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్ట్ 3 లేదా 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునాది రాయిని వేయనున్నారు. దీని కోసం ఆలయ ట్రస్ట్ ఇప్పటికే మోదీకి ప్రత్యేక ఆహ్వానాన్ని సైతం పంపింది. ఆయనతో మరో 50 మందిని సైతం ఆహ్వానించనున్నట్లు కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే బాబ్రీ కుట్రలో కేసులో ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి తదితరుల వాంగ్మూలాల నమోదుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేదీలను ఖరారు చేసింది. ఈనెల 23వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వినిపించే వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేయనుందని ప్రత్యేక న్యాయమూర్తి ఎస్.కె.యాదవ్ తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న మొత్తం 32 మంది తమ వాదనను వినిపించవచ్చన్నారు. (బాబ్రీ విధ్వంసం: విచారణ ఆపండి) కేసు కొట్టేయండి.. ఈ క్రమంలో అద్వానీ, మురళి మనోహర్ జోషిపై నమోదైన బాబ్రీ మసీదు కేసును కొట్టేయాల్సిందిగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ చేసే సమయంలోపు ఈ కేసును కొట్టేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అద్వానీ, జోషి, ఇతర బీజేపీ నాయకులు బాబ్రీ మసీదును కూల్చారని కొంతమంది ఆరోపిస్తున్నారని, కానీ ఈ ఘటనతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆలయ పునర్నిర్మానానికే పనిచేసినట్లు వెల్లడించారు. మరోవైపు అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను మూసివేస్తే మంచిదని ‘రామ జన్మభూమి’ కేసులో ప్రధాన పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీ లక్నో సీబీఐ కోర్టుని కోరారు. అయోధ్య భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తుది తీర్పును వెలువరించిందని, ఈ సమయంలో మళ్లీ బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ చేపట్టడం అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సున్నితమైన అంశం కాబట్టి సీబీఐ తీర్పు దేశంలో మరోసారి రాజకీయ వైరుధ్యాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుది తీర్పుకు గడువు.. మరోవైపు బాబ్రీ విధ్వంసం కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. తుది తీర్పును వెలువరించాలని సుప్రీంకోర్టు ఇటీవల లక్నో సీబీఐ న్యాయస్థానాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ ఆగస్ట్ 31లోపు విచారణను పూర్తిచేయాలని గడువు విధించింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో అద్వానీతో పాటు, సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, కళ్యాన్ సింగ్, ఉమా భారతి వంటి పలువురు నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
మందిర నిర్మాణంపై పవార్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : హిందువుల చిరకాల స్వప్పం అయోధ్య రామాలయ నిర్మాణానికి చకచక ఏర్పాటు జరుగుతున్న తరుణంలో నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంటే కొందరు వ్యక్తులు మాత్రం ఆలయ నిర్మాణంతోనే వైరస్‌ను అంతం చేయవచ్చన్న భ్రమల్లో ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ పౌరులంతా కరోనా ప్రతాపానికి భయాందోళనకు గురవుతుంటే ఇలాంటి క్లిష్ట సమయంలో అయోధ్య మందిర నిర్మాణానికి లేనిపోని ఆత్రుత ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేఖరి మందిర భూమి పూజ కార్యక్రమంపై ప్రశ్నించగా పవర్ ఈ విధంగా స్పందించారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండా ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. (మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణం) కాగా రామ మందిర నిర్మాణానికి ఆలయ కమిటీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ తొలివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మోదీతో పాటు మరో 250 మంది ప్రముఖులకు ఆహ్వానం పంపనున్నారు. దీని కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన.. ఆలయ నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హిందువుల చిరకాల స్వప్పమైన ఆలయాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని ఇదివరకే ప్రకటించారు. -
రామమందిర భూమి పూజకు తేదీ ఖరారు
లక్నో : హిందువులు అత్యంత ప్రతిష్టాత్మంగా భావిస్తున్న అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ఆలయ అధికారులు, హిందుమత పెద్దలు సుదీర్ఘ చర్చల అనంతరం జూలై 29న భూమి పూజ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒకవేళ అది సాధ్యం ఆగస్ట్ 5న దివ్యమైన ముహూర్తం ఉందని అదే రోజున శంకుస్థాపన చేసి తీరాల్సిందేనని సంకల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల ఈ కీలక ఘట్టాన్ని జరిపించాలని రామాలయ పెద్దలు నిర్ణయించారు. మోదీకి త్వరలోనే ఆహ్వానాన్ని సైతం పంపనున్నారు. (బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు) కాగా ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతున్న అయోధ్య రామమందిర భూ వివాదానికి గత ఏడాది సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ముగింపు పలికిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరలోనే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రయత్నించినా.. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. అనంతరం కొంత వెసులుబాటు కల్పించడం నెల రోజులుగా భూమిని చదును చేసే పనులు చేపడుతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే మరో నెల రోజుల్లోనే కీలక ఘట్టం ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. -
బాబ్రీ విధ్వంసం: విచారణ ఆపండి
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను మూసివేస్తే మంచిదని ‘రామ జన్మభూమి’ కేసులో ప్రధాన పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీ లక్నో సీబీఐ కోర్టుని కోరారు. అయోధ్య భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తుది తీర్పును వెలువరించిందని, ఈ సమయంలో మళ్లీ బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ చేపట్టడం అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సున్నితమైన అంశం కాబట్టి సీబీఐ తీర్పు దేశంలో మరోసారి రాజకీయ వైరుధ్యాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా బాబ్రీ మసీదు విధ్వంసంపై బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. (బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు) ఈ కేసుకు సంబంధించి ఆగస్ట్ 31లోపు పూర్తి చేయాలని విచారణ పూర్తి చేసి తుది తీర్పును వెలువరించాలని ఇటీవల దేశ అత్యుతున్న న్యాయస్థాం లక్నో సీబీఐ కోర్టుకు డెడ్‌లైన్ విధించింది. ఈ నేపథ్యంలో జూన్ 4న వీరంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకానున్నారు. దీనిపై శనివారం మీడియాతో మాట్లాడిన ఇక్బాల్ అన్సారీ.. వివాదం ఇప్పటికే సమసిపోయిన నేపథ్యంలో విచారణను ఆపేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పుపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని తెలిపారు. బాబ్రీ కూల్చివేత అంశం రాజకీయ అంశాలతో ముడిపడి ఉందని, ఇలాంటి సున్నితమైన కేసును సీబీఐ ఇక మూసివేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. కాగా అయోధ్య వివాదంపై తీర్పును వెలువరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును వెలువరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘1992 డిసెంబర్ 6న కరసేవకులు వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం. మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్ మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ముస్లిం వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది’ అంటూ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణను ముగించాలని సుప్రీంకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించింది. -
బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : హిందూవులు చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓ వైపు అడుగులు పడుతున్న వేళ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్ట్ 31లోపు పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ పూర్తి చేసి తుది తీర్పును కూడా వెలువరించాలని కోర్టు తెలిపింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్ కూడా ఉన్నారు. కరసేవకులను రెచ్చగొట్టి కుట్రపూరితంగానే మసీదును కూల్చివేశారని (కుట్ర) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 28 ఏళ్ల పాటు కోర్టుల్లో విచారణ సాగుతున్న ఈ కేసును సుప్రీంకోర్టు తాజాగా తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. (అయోధ్య తీర్పు: అద్వానీకి జైలుశిక్ష తప్పదా?) అయోధ్య వివాదంపై తీర్పును వెలువరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును వెలువరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘1992 డిసెంబర్ 6న కరసేవకులు వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం. మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్ మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ముస్లిం వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది’ అంటూ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణను ముగించాలని సుప్రీంకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించింది. (5 శతాబ్దాల సమస్య!) సీబీఐ కేసులో బీజేపీ అగ్రనేతలు.. 1992 డిసెంబర్ 6న సాయంత్రం (బాబ్రీ మసీదు కూల్చివేత) స్థానిక పోలీస్ స్టేషన్లో 198/92 నెంబర్‌తో మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్ కూడా ఉన్నారు. అయితే 2003 సెప్టెంబర్ 19న రాయ్‌బరేలీలోని స్పెషల్ మెడిస్ట్రేట్ అద్వానీ, జోషీలకు విచారణ నుంచి విముక్తి కల్పించింది. అయితే దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2017లో తీర్పును వెలువరిస్తూ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ, జోషీ, ఉప భారతి, కళ్యాణ్ సింగ్‌లను కూడా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీబీఐ వీరందరినీ విచారించనుంది. కేసు విచారణ తుది దశతో ఉన్న నేపథ్యంలో.. నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_381238725.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాజ్యసభకు మాజీ సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ని కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి రిటైర్మెంట్తో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్ గొగోయ్‌ని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. గత ఏడాది నవంబర్ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. అదే నెలలో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. రఫేల్ ఫైటర్ జెట్స్ కేసును, శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసును కూడా ఆయన విచారించారు. అయోధ్య కేసులో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని ఆయన తీర్పునిచ్చారు. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. సీజేఐగా పదవీకాలంలో లైంగిక వేధింపుల ఆరోపణ సహా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. రఫేల్ ఫైటర్ జెట్ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన ధర్మాసనానికి కూడా జస్టిస్ గొగొయే నేతృత్వం వహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకే వస్తుందని సంచలన తీర్పునిచ్చింది కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే. ఎన్నార్సీ ప్రక్రియను సమీక్షించిన బెంచ్‌కు కూడా జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించారు. రాజ్యసభకు నామినేట్ అవుతున్న తొలి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆయనే కావడం విశేషం. మాజీ సీజేఐ రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కానీ, ఆయన నామినేటెడ్ సభ్యుడు కాదు. కాంగ్రెస్ తరఫున ఎగువ సభకు ఎన్నికయ్యారు. -
ఆ భూమి తీసుకుంటాం: సున్నీ వక్ఫ్‌బోర్డు
లక్నో: అయోధ్య జిల్లాలో మసీదు నిర్మాణం కోసం తమకు కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్లు సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు సోమవారం పేర్కొంది. ఈ స్థలంలో మసీదు నిర్మాణంతో పాటుగా.. ఇండో- ఇస్లామిక్ పరిశోధన సంస్థ, ఆస్పత్రి, గ్రంథాలయం నిర్మిస్తామని తెలిపింది. ఈ మేరకు త్వరలోనే మసీదు నిర్మాణానికై ట్రస్టు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు స్థలం కేటాయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని తాము స్వీకరిస్తున్నామని సున్నీవక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫరూఖీ సోమవారం తెలిపారు. బోర్డు సభ్యులతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘త్వరలోనే ట్రస్టు ఏర్పాటు చేస్తాం. మసీదుకు ఏ పేరు పెట్టాలన్న విషయాన్ని ట్రస్టు నిర్ణయిస్తుంది. బోర్డుతో ఆ విషయాలకు ఎటువంటి సంబంధం ఉండబోదు. మసీదుతో పాటు లైబ్రరీ, పరిశోధన సంస్థ, ఆస్పత్రి.. నిర్మించడంతో పాటుగా.. భూమిని అన్నిరకాలుగా వినియోగించుకుంటాం. స్థానికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మసీదు ఎంత విస్తీర్ణంలో నిర్మించాలో నిర్ణయిస్తారు’’అని పేర్కొన్నారు. కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.(రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్) -
అమోధ్య ట్రస్ట్ ఏర్పాటు
-
రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మరో ముందడుగు పడింది. మందిర నిర్మాణ పర్యవేక్షణకు ఒక స్వతంత్ర సంస్థ(ట్రస్ట్) ఏర్పాటైంది. అత్యద్భుతంగా మందిర నిర్మాణం జరిపేందుకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించారు. మందిర నిర్మాణానికి ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ‘అయోధ్య’ తీర్పులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. 3 నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, ఆ గడువు ఫిబ్రవరి 9తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం.. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రధాని ఈ ప్రకటన చేశారు. ‘ఒక ముఖ్యమైన, చరిత్రాత్మక అంశంపై మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. ఇది లక్షలాది ప్రజలలాగే నా హృదయానికి కూడా చాలా దగ్గరైన విషయం. దీనిపై ప్రకటన చేసే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటూ ట్రస్ట్ ఏర్పాటుపై ప్రధాని ప్రకటన చేశారు. అయోధ్యలో రామ మందిర అభివృద్ధి కోసం ఒక విస్తృత పథకాన్ని సిద్ధం చేశామన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామన్నారు. శ్రీరాముడి జన్మస్థలంలో అద్భుతమైన రామాలయ నిర్మాణానికి భారతీయులంతా సహకరించాలని మోదీ కోరారు. ప్రధాని ప్రకటన సందర్భంగా అధికార పక్ష సభ్యులు జై శ్రీరాం నినాదాలతో సభను హోరెత్తించారు. అయోధ్య తీర్పు అనంతరం దేశ ప్రజలంతా ప్రజాస్వామ్య విధివిధానాలపై గొప్ప విశ్వాసాన్ని చూపారని, అందుకు 130 కోట్ల భారతీయులకు సెల్యూట్ చేస్తున్నానని మోదీ తెలిపారు. భారత్‌లో అన్ని మతాల వారు ఒక ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉంటారన్నారు. మన సంస్కృతిలోనే ఆ వసుధైక కుటుంబ భావన ఉందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ మార్గంలో తన ప్రభుత్వం పయనిస్తోందన్నారు. ఒక దళితుడు సహా 15 మంది ట్రస్టీలు రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్ట్‌లో 15 మంది సభ్యులుంటారని, వారిలో ఒకరు దళిత వర్గానికి చెందినవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ట్రస్ట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ‘లక్షలాది భక్తుల కోరిక త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్నా. రాముడు జన్మించిన పుణ్యక్షేత్రంలో భక్తులు పూజలు చేసుకునే అవకాశం త్వరలోనే లభించనుంది’ అన్నారు. అయితే, ట్రస్టీల పేర్లను ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కాగా, రామ మందిర నిర్మాణం గతంలో ‘రామజన్మభూమి న్యాస్’ ప్రతిపాదించిన నమూనాలో ఉంటుందని ఆశిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ పేర్కొన్నారు. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాలు మసీదు నిర్మాణం కోసం అయోధ్య జిల్లాలో సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తూ యూపీ సర్కార్ నిర్ణయించింది. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవేపై ఈ స్థలాన్ని కేటాయించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. కాగా, రామాలయ నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడానికి తన అనుమతి అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. -
రామ మందిర నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన సభలో మాట్లాడుతూ... ‘‘నవంబరు 9న వచ్చిన తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించింది. అయోధ్య ట్రస్టు ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉదయం కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నా. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి.. ట్రస్టును ఏర్పాటు చేశాం. దీనికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రగా నామకరణం చేశాం. మందిర నిర్మాణం కోసం 67.703 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించాం. ఈ ట్రస్టు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది’’అని స్పష్టం చేశారు. అదే విధంగా.. భారతదేశంలో నివసిస్తున్న అన్ని మతాల ప్రజలు వసుదైక కుటుంబంలో భాగమేనని పేర్కొన్నారు. కాగా దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల్లో భాగమైన రామ మందిర నిర్మాణానికి ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకంది. ఇక ఈ చారిత్రాత్మక తీర్పును భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకగ్రీవంగా వెలువరించిన విషయం తెలిసిందే. (అయోధ్య తీర్పుపై సుప్రీం కీలక నిర్ణయం) -
దిశ నుంచి ఢిల్లీ వరకు సంచలనాలు
పౌర ఆగ్రహం పొగలు సెగలు కక్కింది. రేపిస్టులపైనా, అక్కరకు రాని చట్టాలపైనా.. పాలకులపైనా, ప్రమాదకరంగా మారిన పర్యావరణంపైనా.. అవినీతి, అసమానతలపైనా... యువతరం పిడికిలి బిగించి కదం తొక్కింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి.. భారత్ నుంచి హాంకాంగ్ వరకు ఈ ఏడాది నిరసనలు మిన్నంటాయి. అలాగే దేశంలో సార్వత్రిక ఎన్నికలపై చర్చకు తెరలేపుతూ ప్రారంభమైన 2019వ ఏడాది అనేక సంచలన సంఘటనలకూ వేదికగా నిలిచింది. భారత ప్రజానికంతో పాటు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు దశాబ్దాల నుంచి ఎటూ తెగని వివాదంగా మిగిలిపోయిన అయోధ్య రామమందిర స్థల వివాదానికి కూడా ఈ ఏడాదిలో పూర్థిస్థాయి పరిష్కారం దొరికింది. కశ్మీర్ అంశంతో పాటు ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టం వంటి పార్లమెంట్ చట్టాలకు 2019 చోటిచ్చింది. నిర్భయ ఉదంతాన్ని మరోసారి జ్ఞాపకం చేసేలా హైదరాబాద్‌లో అత్యంత దారుణంగా జరిగిన దిశ సంఘటన ఈ ఏడాదిలో అత్యంత సంచలనంగా మారింది. కేంద్రంలో రెండోసారి బీజేపీ ఈ ఏడాది ప్రథమార్థంలో అత్యధికంగా చర్చనీయాంశమైన అంశం సార్వత్రిక ఎన్నికలు. భారత్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు సైతం భారత్ ఎన్నికలను ఆసక్తికరంగా గమనించాయి. మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏకంగా 303 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఎన్డీయే కూటమి మొత్తం 352 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. దీంతో రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ప్రధాన పత్రిపక్షం కాంగ్రెస్ కేవలం 52 స్థానాలకు పరిమితం కాగా.. రెండు సీట్ల తేడాతో ప్రతిపక్ష హోదాకు దూరమయ్యింది. యూపీఏ కూటమికి 91 సీట్లు దక్కగా ఇతరులు 99 స్థానాల్లో విజయం సాధించారు. పార్టీలవారీగా చూస్తే.. డీఎంకే 23, వైఎస్సార్సీపీ, టీఎంసీ 22, శివసేన 18, జేడీయూ 16 సీట్లలో విజయం సాధించాయి. ఎస్పీకి 5, బీఎస్పీకి 10 సీట్లు మాత్ర మే దక్కాయి. ఇక సీపీఎం 3, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందాయి. అయోధ్య.. రాముడిదే దేశంలో సరికొత్త రాజకీయ చర్చకకు కేంద్రబిందువైన వివాదస్పద అయోధ్య రామమందిర, బాబ్రీ మసీదు స్థలంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని నవంబర్ 9న ఇచ్చిన తీర్పులో తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి అయోధ్యలో సున్నీ వక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల స్థలం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు ముస్లిం సంఘాల ప్రతినిధిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును సవాలు చేస్తూ ముస్లిం పర్సనల్ లాబోర్డుతో సహా, పలువురు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన సీజే ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధార్మాసనం వాటన్నింటినీ కొట్టివేసింది. సుప్రీం తీర్పే అంతిమమైనదని స్పష్టంచేసింది. పుల్వామా ఉగ్రదాడి.. జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఫిబ్రవరి 14 న మధ్యాహాం 3.30 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో దేశం ఒక్ససారిగా ఉలిక్కిపడింది. జవాన్ల మృతికి కారణమైన పాక్‌కు తగిన బుద్ది చెప్పాలని యావత దేశం ముక్త కంఠంతో నినదించింది. విధుల్లో చేరేందుకు 2,547 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపు 78 వాహనాల్లో శ్రీనగర్‌కు బయలుదేరిన సమయంలో ఈదారుణ ఘటన చోటుచేసుకుంది. సర్జికల్ స్ట్రైక్ 2. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై తెల్లవారు ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. దీనిపై దేశవ్యాప్తంగా భారత ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అజిత్ దోవల్‌కి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. భారత వైమానిక దాడులను ధృవీకరించిన పాక్.. ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది. ఎమ్మెల్యేనే ఉన్నావ్ దోషి.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవితఖైదు శిక్షను విధించింది. తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాలిక కిడ్నాప్.. అత్యాచారం.. బాధితురాలి తండ్రి లాకప్ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఏడాది జూలై 28న బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మరణించారు. న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. సుప్రీంకోర్టు జోక్యంతో అన్ని కేసులను లక్నో నుంచి ఆగస్టు 1వ తేదీన ఢిల్లీకి బదిలీ చేశారు. మహారాష్ట్రలో సరికొత్త చరిత్ర.. దేశంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు మహారాష్ట్ర వేదికగా నిలిచింది. పార్టీలో చీలికలు, గవర్నర్ అర్థరాత్రి ప్రకటనలు, తెల్లవారుజామున ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారాలు, దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం వంటి ఆసక్తికర పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు సంచలనం సృష్టించాయి. బాలీవుడ్ సినిమా స్థాయి ట్విస్ట్‌లను ఛేదించుకుంటూ హిందుత్వ పార్టీగా పేరొందిన శివసేన.. లౌకిక భావాజాలం గల కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఠాక్రే కుటుంబం నుంచి సీఎం పీఠం అధిరోహించిన తొలి వ్యక్తిగా ఉద్ధవ్ చరిత్ర సృష్టించారు. అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు. ఎన్నికల ముందు కూటమి కట్టిన బీజేపీ-శివసేన మధ్య పదవుల పంపకాలతో విభేదాలు ఏర్పాడ్డాయి. దీంతో తన దారి తనదంటూ 30 ఏళ్ల మిత్రబంధానికి ముగింపు పలికిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ను మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో సరికొత్త రాజకీయ అధ్యాయానికి పునాది వేసింది. కన్నడలో కూలిన కుమార సర్కార్.. దేశమంతా ఎంతో ఉత్కంఠరేపిన కర్ణాటక రాజకీయ సంక్షోభం ఈ ఏడాది రాజకీయపరంగా అత్యంత చర్చనీయాశంగా మారింది. అసెంబ్లీ బలపరీక్షలో జేడీఎస్- కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి పాలవడంతో కుమారస్వామి సర్కార్ కుప్పకూలింది. జూలై 23న జరిగిన విశ్వాస పరీక్షలో 15 మంది రెబల్స్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో కుమారస్వామి ఓటమిపాలైంది. ఓటింగ్ జరిగిన సమయంలో సభలో మొత్తం 204 మంది సభ్యులున్నారు. 15 రెబల్స్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 99కి పడిపోయింది. మరోవైపు బీజేపీ సభ్యులు 105 మంది సభకు హాజరయ్యారు. దీంతో 14 నెలల సంకీర్ణ ప్రభుత్వ పాలన ముగిసింది.ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చక్రంతిప్పన 15 మంది రెబల్స్‌పై స్పీకర్ రమేష్ కుమార అనర్హత వేటు వేయడం సంచలనం సృష్టించింది. అనంతరం గవర్నర్ ఆహ్వానం మేరకు బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడియూరప్ప కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలు తీర్పును వెలువరించారు. 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా 12 స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకుంది. చంద్రయాన్-2 విఫలం చంద్రుడి భూ ఉపరితలంపై పరిశోధనలు జరిపేందుకు అక్కడికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పంపించిన ఉపగ్రహం ‘చంద్రయాన్–2’ చివరి నిమిషంలో విఫలమైంది. జులై 22న జీఎస్ఎల్వీ మార్క్ III-M1 వాహక నౌక ద్వారా చంద్రుడిపై పంపారు... తర్వాత దీని కక్ష్యను ఐదుసార్లు పెంచుకుంటూ పోయి 276 x 1,42,975 కిలోమీటర్లకు చేర్చారు. తర్వాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయింది.. సెప్టెంబరు 7 అర్ధరాత్రి చంద్రుడి ఉపరితలంపై దిగుతూ 500 మీటర్ల దూరంలో ఉండగా ల్యాండర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పూర్తిగా సంబందాలు తెగిపోయాయి. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ.978కోట్లు ఖర్చయింది. ఆర్టికల్ 370.. రద్దు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం రెండోసారి అధికారం చేపట్టిన 90 రోజుల్లోనే అత్యంత సంచలన, సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. దశాబ్దాల సంఘ్ పరివార్ కలను, ఎన్నికల హామీని నెరవేరుస్తూ, కశ్మీర్లో 72 ఏళ్ల నుంచి నలుగుతున్న వేర్పాటువాదం, ఉగ్రవాదం సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులేస్తూ.. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణాలను రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. పౌరసత్వ ప్రకంపనలు.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ దేశ వ్యాప్తంగా నిరసలనకు కేంద్రబిందువుగా నిలిచింది. చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి.. పోలీసుల తూటాలు ఆందోళనకారుల గుండెల్లో దిగాయి. పౌరుల ప్రాణాలు పోయినా.. జనం రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా దీని ప్రభావం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్‌లో ఎక్కువగా కనిపించింది. ఆందోళన సందర్భంగా యూపీలో 16 మంది పౌరులు మరణించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు, సిక్కులకు, జైనులకు, బౌద్ధులకు, పార్శీలకు, క్రైస్తవులకు దేశంలో పౌరసత్వం కల్పించడం ఈ చట్టం ముఖ్య సారాంశం. అస్సాం ఎన్నార్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రకటించిన ఎన్ఆర్సీని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. తొలుత ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు (ఎన్నార్సీ) తుది ముసాయిదాను విడుదల చేసింది. మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 2,89,83,677 మందిని భారతీయులుగా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. దరఖాస్తుదారుల్లోని 40.07లక్షల మంది తమ అస్సామీ గుర్తింపును చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంది. దీంతో తుది ముసాయిదాతో 40 లక్షల మందికి పైగా ప్రజల భవితవ్యం అనిశ్చితిలో పడింది. కాగా దేశ వ్యాప్తంగా కూడా ఎన్నార్సీని అమలు చేస్తామని బీజేపీ పదేపదే ప్రకటిస్తోంది. దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాఫీ డే వీజీ సిద్ధార్థ మృతి.. సౌమ్యుడు, వివాదరహితునిగా పేరుపొందిన కేఫె కాఫీ డే (సీసీడీ) అధినేత వీజీ సిద్ధార్థ మరణించారు. నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కాఫీ ఎస్టేట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి ఆరంగంలో మేటిగా నిలిచారు. జూలై 29న సిద్ధార్థ అదృశ్యమయ్యారు. తాను కొద్దిదూరం నడిచి వస్తానని చెప్పి, డ్రైవర్‌ను బ్రిడ్జి సమీపంలో కారు ఆపమని చెప్పిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. అరగంట గడిచినా సిద్ధార్థ కారు దగ్గరకు రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో డ్రైవర్ బెంగళూరులోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం జూలై 31న నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. చిన్మయి శ్రీపాద (మీటూ) పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని.. ‘మీటూ’ ఉద్యమం ద్వారా పలువురు బాధితులు బట్టయలు చేశారు. ఇండియాలో బాలీవుడ్ నటితనుశ్రీ దత్తా ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని గాయని చిన్మయి దక్షిణాదిన ముందుండి నడిపించారు. 18 ఏళ్ల వయసులో... ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. చిన్మయి స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా... పలువురు ‘ప్రముఖులు’ చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అంతేకాదు పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. హాంగ్.. కాగుతోంది.. ఒక దేశం రెండు వ్యవస్థలు ఉంటే ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఏడాది హాంకాంగ్‌లో ఎగిసిన నిరసనలు. తమ దేశంపై సుదీర్ఘకాలంగా సాగుతున్న చైనా పెత్తనాన్ని హాంకాంగ్‌వాసులు సహించలేకపోతున్నారు. చైనాలో హాంకాంగ్ భాగమైనప్పటికీ అక్కడ ప్రజలు తమను చైనీయులు అనడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు. అలాంటిది నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒక బిల్లుపై వచ్చిన ప్రతిపాదనలతో హాంకాంగ్‌లో నిరసనల అగ్గి రాజుకుంది. ఈ బిల్లుతో హాంకాంగ్‌లో నిందితుల్ని చైనాలో విచారించే అవకాశం కలుగుతుంది. దీంతో రైట్ వింగ్ యాక్టివిస్టులు భగ్గుమన్నారు. హాంకాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ రోడ్డెక్కారు. జూన్ నుంచి ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రరూపం దాల్చాయి. మొత్తానికి బిల్లుపై చైనా ప్రభుత్వం వెనక్కి తగ్గినా ఆ ఆందోళనలిప్పుడు హాంకాంగ్ స్వాతంత్య్ర పోరాటానికి దారి తీశాయి. అమెజాన్ ఆడవుల్లో కార్చిచ్చు అమెజాన్ అడవుల మంటలపై ప్రపంచస్థాయి ఆగ్రహం..! ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం అగ్నికి ఆహుతి అవుతుండటంపై ప్రపంచ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అమెజాన్ అడవులు కాలిపోతున్నాయనే వార్తలు ప్రపంచ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిలో అధిక భాగం అంటే 20 శాతం ఆక్సిజన్ మనకు అమెజాన్ అడవుల నుంచే లభిస్తోంది. అమెజాన్ అడవులు కాలిపోవడం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై కొత్త చర్చకు దారి తీసింది. పర్యావరణవేత్తలు, మేధావులు ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో అమెజాన్ అడవుల్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు యుద్ద విమానాలను ఫ్రాన్స్ అధికారులు రంగంలోకి దించారు. శ్రీలంక మారణహోమం క్రెస్తవులకు ప్రధానమైన ఈస్టర్ పండుగనాడు ద్వీపదేశం శ్రీలంకలో నరహంతకులు మారణహోమం సృష్టించారు. శ్రీలంక రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఏప్రిల్ 21న జరిగిన మొత్తం 8 వరుస పేలుళ్లలో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లలో మొత్తం 33 మంది విదేశీయులు మరణించగా వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. మిగిలిన 21 మంది విదేశీయుల మృతదేహాలను గుర్తించేపనిలో ఉన్నామని శ్రీలంక అధికారులు వెల్లడించారు. ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో సామూహికంగా ప్రార్థనలు చేసుకుంటుండగా ఈ పేలుళ్లు సంభవించాయి. మొత్తం 3 చర్చిలు, మూడు హోటళ్లు, జూ వద్ద, మరో ఇంట్లో దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారు. దిశా.. తూటా చెప్పిన తీర్పు రేపిస్టులకు వ్యతిరేకంగా మన తెలుగు గడ్డపై జరిగిన ఉద్యమం యావత్ దేశానికి పాకింది. డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఈ ఏడాది దేశంలో ప్రకంపనలు రేపింది. నవంబర్ 27 రాత్రి షాద్‌నగర్‌లో ఒక అమాయకురాలిపై వలపన్ని టోల్ ప్లాజాకు కూతవేటు దూరంలో నలుగురు మృగాళ్లు అత్యాచారం చేయడమే కాకుండా, బతికుండగానే పెట్రోల్ పోసి తగులబెట్టడం సామాన్యుల్ని దహించి వేసింది. జనం స్వచ్ఛందంగా రోడ్డెక్కారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రేపిస్టులకి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. 2012లో నిర్భయ ఉదంతం తర్వాత అత్యాచారాలకు వ్యతిరేకంగా యువతరం స్వచ్ఛందంగా కదిలిరావడం ఇదే. దిశపై అఘాయిత్యం జరిగి వారం తిరక్కుండానే డిసెంబర్ 6న నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా అక్కడక్కడ నిరసన స్వరాలు వినిపించినప్పటికీ సామాన్యులు శభాష్ అన్నారు. మన న్యాయవ్యవస్థలో జరిగే జాప్యం పట్ల ప్రజలు ఎంత విసిగిపోయారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిల భద్రత గాల్లో దీపంలా మారడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి.. అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం అత్యాచారం కేసుల్లో 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష విధిస్తారు. తహసీల్దార్ సజీవ దహనం రాష్ట్ర రాజధాని శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయంలోనే హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు మూడు రోజులపాటు విధుల్లోకి రాకుండా నిరసనలు చేపట్టారు. మంటల్లో తీవ్రంగా గాయ పడిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్యలు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. రైతు కూర సురేశ్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు ఆర్టీసీ సమ్మె.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ.. 2011లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకలజనుల సమ్మె తరువాత మరోసారి అంతటి మహా ఉద్యమాన్ని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత వారు చేపట్టిన తొలి సమ్మె ఇది. డిమాండ్లను నెరవేర్చాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 52 రోజుల పాటు చేపట్టిన ఆర్టీసీ సమ్మె మహా ఉద్యమంగా సాగింది. కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం ఏమాత్రం తగ్గకపోగా, విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. అంతేకాదు ఉద్యమం సందర్భంగా దాదాపు 30 మంది కార్మికులు వివిధ రూపాల్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత్యంతరం లేక సమ్మెను విరమిస్తున్నట్లు కార్మికులు ప్రకటించారు. వారి విజ్ఞప్తి మేరకు కార్మికులందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. కార్మికుల ఉద్యమం తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం.. ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం మొదలైంది. ‘ప్రజాసంకల్ప యాత్ర’ సుదీర్ఘ పాదయాత్ర అనంతరం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాల్లో గెలిచి కొత్త చరిత్రను సృష్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 30 గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. సంక్షేమ పథకాలే ప్రధానం ఎజెండాగా ప్రచారం చేసిన వైఎస్ జగన్.. ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరునెల్లలోనే హామీలను అమలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. చరిత్ర ఎన్నడూ లేని విధంగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ఈ ఎన్నికల్లో కేవలం 21 సీట్లకు పరిమితమైంది. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో సైతం వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 25 స్థానాల్లో 22 ఎంపీ సీట్లు కైవలం చేసుకుంది. టీడీపీ మూడు స్థానాలు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అమరావతిలో శాసన రాజధాని(లెజిస్లేటివ్ క్యాపిటల్), విశాఖలో పరిపాలన రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో న్యాయ రాజధాని(జ్యుడీషియల్ క్యాపిటల్) ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ డిసెంబర్ 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు సూచనలు చేసింది. విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, వేసవిలో అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్ కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం.. కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది. వరద ముంపులేని ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని.. రాజధాని కార్యకలాపాల్ని వికేంద్రీకరించాలని సలహానిచ్చింది. కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది. -సురేష్ అల్లిక (వెబ్‌డెస్క్ ప్రత్యేకం) -
‘అయోధ్య’ రివ్యూ పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగిపోయింది. నవంబర్ 9వ తేదీన వెలువరించిన చారిత్రక తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లన్నిటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పు సమీక్ష కోరుతూ దాఖలైన మొత్తం 19 పిటిషన్లకు ఎలాంటి విచారణార్హత లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘రివ్యూకోసం దాఖలైన పిటిషన్లను, జత చేసిన పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాం. వీటికి ఎలాంటి ప్రాతిపదిక లేదని భావిస్తున్నాం. అందుకే ఈ పిటిషన్లన్నిటినీ తిరస్కరిస్తున్నాం’ అంటూ వాస్తవ కక్షిదారులు వేసిన 10 పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ఈ ధర్మాసనం పేర్కొంది. తీర్పుపై సమీక్ష కోరేందుకు అనుమతించాలంటూ మూడోపక్షం(థర్డ్ పార్టీ) దాఖలు చేసిన 9 పిటిషన్లను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. ఇందులోని 10 పిటిషన్లు వాస్తవ కక్షిదారులవి కాగా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, దాని మద్దతుతో వేసినవి 8, హక్కుల కార్యకర్తలు 40 మంది కలిసి వేసిన మరో పిటిషన్ ఉన్నాయి. వీటితోపాటు అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్, నిర్మోహి అఖాడా వేసిన రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఆఖరి చాన్స్ ‘క్యూరేటివ్’ అన్ని రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టు తిరస్కరణకు గురికావడంతో కక్షిదారులకు ఇక ఒకే ఒక్క అవకాశం మిగిలి ఉంది. అదే క్యూరేటివ్ పిటిషన్. తీర్పులో ఏవైనా లోపాలున్నాయని అత్యున్నత న్యాయస్థానం భావించిన పక్షంలో వాటిని సవరించేందుకు క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. పునస్సమీక్షకు తగిన ఆధారాలున్నాయని న్యాయస్థానం భావించినా, విచారణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. -
అయోధ్య రివ్యూ పిటిషన్లపై సుప్రీం కీలక నిర్ణయం
-
అయోధ్య తీర్పుపై సుప్రీం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య కేసులో సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన 18 రివ్యూ పిటషన్లను సర్వోన్నత న్యాయస్ధానం తిరస్కరించింది. నవంబర్ 9న వెలువరించిన నిర్ణయమే తుది తీర్పని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత నెలలో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డు, నిర్మోహి అఖారా సైతం రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. అయోధ్య తీర్పును సవాల్ చేస్తూ 40 మంది సామాజిక కార్యకర్తలు సైతం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు అయోధ్యలో ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని సుప్రీం కోర్టు దాఖలు చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేసింది. -
మనోళ్లు గూగుల్‌ను ఏమడిగారో తెలుసా?
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 అంటే ఏమిటి ?, అయోధ్య కేసు ఏమిటి ?, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అంటే ఏమిటి ? ఇవీ గూగుల్‌ను భారతీయులు ఎక్కువగా అడిగిన ప్రశ్నలు. 2019ఏడాదికిగాను వీటి గురించే అత్యధికంగా వెదికారని గూగుల్ 2019 నివేదిక తెలిపింది. ఎగ్జిట్ పోల్స్, బ్లాక్‌హోల్, హౌడీ–మోడీలను శోధించారు. క్రికెట్ వరల్డ్ కప్‌తోపాటు లోక్‌సభ ఎన్నికల గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారు. ఓటేయడం ఎలా ? ఓటరు లిస్టులో పేరును ఎలా చూసుకోవాలి వంటి ప్రశ్నలను గూగుల్‌ను అడిగారు. చంద్రయాన్–2, నీట్ ఫలితాలు, పీఎం కిసాన్ యోజన, కబీర్ సింగ్, అవెంజర్స్ ఎండ్ గేమ్, కెప్టెన్ మార్వెల్ గురించీ వెదికారు. వ్యక్తుల గురించి చేసిన శోధనలో.. ‘ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్’ తొలిర్యాంక్ సాధించారు. తర్వాత లతా మంగేష్కర్, యువరాజ్ సింగ్, ‘సూపర్ 30’ ఆనంద్‡ వంటివారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగాచూస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీవీ షో గురించి వెదికారు. -
అయోధ్య తీర్పు : రివ్యూ పిటిషన్లపై తేల్చనున్న సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసులో వెలువడిన తీర్పుపై రివ్యూ పిటిషన్లను బహిరంగ న్యాయస్ధానంలో విచారణకు చేపట్టాలా లేదా అనే అంశంపై అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సర్వోన్నత న్యాయస్ధానం గురువారం అంతర్గత విచారణ చేపట్టనుంది. బహిరంగ విచారణకు సుప్రీంకోర్టు మొగ్గుచూపితే అన్ని రివ్యూ పిటిషన్లను విచారణకు ముందుకు రానుండగా, వీటిని ప్రోత్సహించరాదని నిర్ణయిస్తే రివ్యూ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చనుంది. రామజన్మభూమి-బాబ్రీమసీదు భూ వివాదం కేసులో నవంబర్ 9న సుప్రీం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇప్పటివరకూ ఏడు పిటిషన్లు సర్వోన్నత న్యాయస్ధానం ముందుకు వచ్చాయి. అయోధ్య తీర్పును సవాల్ చేస్తూ సోమవారం 40 మంది సామాజిక కార్యకర్తలు సైతం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు అయోధ్యలో ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని సుప్రీం కోర్టు దాఖలు చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత నెలలో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. -
అయోధ్య కేసు; ధావన్‌కు ఉద్వాసన
న్యూఢిల్లీ: రామ జన్మభూమి –బాబ్రీమసీదు కేసులో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్‌కు ముస్లిం పక్షాలు ఉద్వాసన పలికాయి. అనారోగ్యంతో ఉన్నానంటూ అర్థం లేని కారణం చూపి ఈ కేసు నుంచి తప్పించారని న్యాయవాది రాజీవ్ ధావన్ మంగళవారం వెల్లడించారు. ‘బాబ్రీ కేసు నుంచి నన్ను తప్పించినట్లు కక్షిదారైన జమియత్ ఉలేమా– ఇ– హింద్ ప్రతినిధి ఏవోఆర్ (అడ్వొకేట్ ఆన్ రికార్డు) ఎజాజ్ మక్బూల్ తెలపగా వెంటనే అంగీకరించా. ఈ కేసులో నా జోక్యం ఉండదు’అని అన్నారు. ‘నన్ను తొలగించేందుకు ఎజాజ్‌కు అధికారం ఉంది. కానీ, నాకు ఆరోగ్యం బాగోలేని కారణంగానే తీసేసినట్లు పేర్కొనడం అర్థం లేనిది. అనారోగ్యంతో ఉంటే ఇతర కేసులను ఎలా డీల్ చేస్తున్నా?’అని ప్రశ్నించారు. కాగా, అయోధ్యలో రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలైంది. తీర్పులో కొన్ని తప్పులున్నాయని, వాటిని సవరించాలని కోరుతూ సోమవారం మౌలానా సయ్యద్ అషాద్ రషీది, జామియత్ ఉలేమా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. -
‘అయోధ్య’పై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. తీర్పులో కొన్ని తప్పులున్నాయని, వాటిని సవరించాలని కోరుతూ సోమవారం మౌలానా సయ్యద్ అషాద్ రషీది, జామియత్ ఉలేమా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. సయ్యద్ రషీది తొలి పిటిషన్‌దారు ఎం సిద్ధిఖీకి చట్టబద్ధ వారసుడు. ‘ఆ స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాలని తీర్పునివ్వడం ద్వారానే నిజమైన న్యాయం జరిగినట్లవుతుంది’ అని 93 పేజీల ఆ రివ్యూ పిటిషన్లో పేర్కొన్నారు. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరగాలని, ప్రతిగా, ముస్లింల తరఫున సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 9న సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ : అయోధ్యలోని వివాదస్పద స్థలంపై సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమైత్ ఉలేమా ఇ హింద్ సంస్థ సోమవారం సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంపై ఆ సంస్థ చీఫ్ మౌలానా అర్షద్ మదాని మాట్లాడుతూ.. దేశంలోని మెజారిటీ ముస్లింలు అయోధ్య పై సుప్రీం వెలువరించిన తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. కొందరు మాత్రమే రివ్యూ పిటిషన్ వద్దనుకుంటున్నారని చెప్పారు. అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం కోర్టు తమకు ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. అయోధ్య కేసులో.. మందిరాన్ని కూల్చి మసీదును నిర్మించారనేది వివాదస్పద అంశమని ఆర్షద్ తెలిపారు. కానీ ఆ ఆరోపణలకు ఆధారాలు లేవని కోర్టు కూడా చెప్పిందని అన్నారు. కానీ తీర్పు మాత్రం అందుకు వ్యతిరేకంగా వెలువడిందన్నారు. అందువల్లే తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, సుప్రీం అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన తరువాత దాఖలైన తొలి రివ్యూ పిటిషన్ ఇదే. మరోవైపు 99 శాతం ముస్లింలు అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని కోరుకుంటున్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) ఆదివారం పేర్కొంది. డిసెంబర్ 9 వ తేదీన రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఏఐఎంపీఎల్బీ వెల్లడించింది. అయితే ముస్లింల తరఫున పిటిషన్‌దారు అయిన సున్నీ వక్ఫ్ బోర్డు అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని స్పష్టం చేసింది. కాగా, అత్యంత సున్నితమైన అయోధ్య కేసులో సుప్రీం కోర్టు నవంబర్ 9వ తేదీన కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని సుప్రీం కోర్టు ఆ తీర్పులో పేర్కొంది. రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. -
రివ్యూనే కోరుకుంటున్నారు!
లక్నో: అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేయాలనే దేశంలోని 99 శాతం ముస్లింలు కోరుకుంటున్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) పేర్కొంది. రామజన్మభూమి– బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి నవంబర్ 9న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదును కూల్చిన స్థలంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరగాలని, మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే మరో చోట సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే, ముస్లింల తరఫు పిటిషన్‌దారు అయిన సున్నీ వక్ఫ్‌బోర్డు ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని స్పష్టం చేసింది. కానీ, ఏఐఎంపీఎల్బీ మాత్రం డిసెంబర్ 9న రివ్యూ పిటిషన్ దాఖలవుతుందని పేర్కొంది. తాజాగా, ఆదివారం ఏఐఎంపీఎల్బీ ప్రధాన కార్యదర్శి మౌలానా వాలి రహ్మానీ మాట్లాడుతూ.. ‘99% ముస్లింలు రివ్యూ పిటిషన్ వేయాలనే కోరుకుంటున్నారు. ముస్లింలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు తరువాత.. వారిలో ఆ నమ్మకం తగ్గింది’ అని వ్యాఖ్యానించారు. రివ్యూ పిటిషన్ వేసినా.. ఆ పిటిషన్‌ను కొట్టేస్తారనే అనుమానం తమకుందన్నారు. పిటిషన్ వేయడం తమ హక్కు అని, సుప్రీంకోర్టు తీర్పులో వైరుద్ధ్యాలున్నాయన్నారు. ఉద్రిక్తతలు సృష్టించాలనే.. అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలన్న నిర్ణయాన్ని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తప్పుబట్టారు. పిటిషన్ వేయడం ద్వారా సమాజంలో విభజనపూరిత, ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడేలా చేయాలనుకుంటున్నాయని ఏఐఎంపీఎల్బీ, జమాయిత్ సంస్థలపై మండిపడ్డారు. ‘ముస్లింలు బాబ్రీని కాదు.. ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం కోరుకుంటున్నార’న్నారు. ఆర్థికంపై దృష్టిపెట్టండి రివ్యూ పటిషన్ వేయాలన్న నిర్ణయాన్ని గతంలో అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం వహించిన శ్రీశ్రీ రవిశంకర్ కూడా తప్పుబట్టారు. ఆ వివాదాన్ని మర్చిపోయి, హిందూ, ముస్లింలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. -
9లోగా ‘అయోధ్య’ రివ్యూ పిటిషన్
లక్నో: అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు– రామ జన్మభూమి కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డిసెంబర్ 9లోపు రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) బుధవారం ప్రకటించింది. సుప్రీంతీర్పును సమీక్షించబోమని సున్నీ వక్ఫ్ బోర్డు మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఏఐఎంపీఎల్బీ తాజాగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. నవంబరు 17న జరిగిన బోర్డు సమావేశంలోనే రివ్యూ పిటిషన్‌పై తీర్మానించామని, సమీక్ష కోరేందుకు తమకు డిసెంబరు 9వరకు సమయం ఉందని ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ తెలిపారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశమున్న ముస్లిం వర్గాలను అయోధ్య పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని, కేసుల్లో ఇరికించి జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని జలానీ ఆరోపించారు. అయోధ్య పోలీసుల తీరును పిటిషన్లో తాము సుప్రీంకోర్టుకు నివేదిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. మసీదు నిర్మాణానికి ప్రభుత్వమిచ్చే ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు నిరాకరిస్తే దాన్ని తమకు ఇవ్వాల్సిందిగా కోరతామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు బుధవారం తెలిపింది. అయితే ఆ స్థలాన్ని తాము మసీదు నిర్మాణానికి కాకుండా ఆసుపత్రిని నిర్మించేందుకు వినియోగిస్తామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ వసీమ్ రిజ్వీ తెలిపారు. అయోధ్య తీర్పుకు సంబంధించి రివ్యూ పిటిషన్ ముసాయిదా తయారైందని ప్రముఖ ముస్లిం సంస్థలు తెలిపాయి. డిసెంబరు 3 లేదా 4 తేదీల్లో జమాయత్ ఉలేమా ఏ హింద్ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. -
సుప్రీం తీర్పుపై రాజీ తప్పదా?
ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ పునాదులపై బాబ్రీ మసీదును నిర్మించారనడానికి చారిత్రక, పురావస్తు ఆధారాలు లేవని తాము భావిస్తున్నప్పటికీ, హిందూ సోదరులు మాత్రం అది రామజన్మ స్థానమేనని నమ్ముతున్నందువల్ల దాన్ని వారికి సంతోషంగా అప్పగిస్తామని ఆనాడు ముస్లిం పక్షం చెప్పి ఉంటే తదనంతర చరిత్రలో ఏం జరిగివుండేది అనేది మన ఊహకు అందదు. అదే జరిగి ఉంటే రామాలయం, బాబ్రీమసీదు వివాదం శాశ్వత ప్రాతిపదికన శాంతియుతంగా ముగిసిపోయి ఉండేది. పైగా 1980ల నుంచి మనం దేశవ్యాప్తంగా చూస్తూ వస్తున్న మతపరమైన ఘర్షణలు తగ్గుముఖం పట్టి ఉండేవని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును కూడా ముస్లిం పక్షం వ్యతిరేకిస్తే హిందుత్వ సంస్థలకు, వారి భావజాలానికి అంతకు మించిన బలం మరొకటి ఉండబోదనే చెప్పాలి. దశాబ్దాలుగా వివాదాస్పదంగా నలుగుతున్న అయోధ్య, బాబ్రీమసీదు సమస్యపై విచారణను ముగించాక, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తుది తీర్పుపై పలువురు న్యాయపరమైన విమర్శలు సాగిస్తున్నారు. ప్రత్యేకించి ఈ తీర్పులో కనిపిస్తున్న కొన్ని అతి స్పష్టమైన పరస్పర విరుద్ధమైన, అసంగతమైన అంశాలు విమర్శలకు దారితీస్తున్నాయి. నాలుగు శతాబ్దాలుగా ఉనికిలో ఉంటూ వచ్చిన బాబ్రీమసీదును లేక దాని కొత్త నిర్మాణాన్ని తన మూల స్థానం నుంచి తరలించి అయోధ్యలోని ‘కీలకమైన స్థలం’లో అయిదెకరాల విస్తీర్ణంలో నిర్మించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయితే మనం ఒకసారి 1980లలోకి మళ్లీ అడుగుపెట్టి చూసినట్లయితే సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కొన్ని అంశాలను దాచి ఉంచినట్లు తెలుస్తుంది. రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం జాతీయ ఎజెండాగా ఆవిర్భవించడం 1980లలోనే ప్రారంభమైంది. వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని తమకు అప్పగించినట్లయితే, బాబ్రీమసీదు మొత్తం నిర్మాణాన్ని చెక్కు చెదరకుండా ప్రస్తుత ప్రాంతానికి మరీ దూరంగా కాకుండా సమీపంలోని మరొక చోటికి సురక్షితంగా తరలిస్తామని ఆనాడు వివాదంలో భాగమై ఉన్న హిందూ పక్షం ప్రతిపాదించింది. ముస్లింల వ్యతిరేకతతో మూలమలుపు ఈజిప్టులో అస్వన్ డ్యామ్ కట్టడానికి వీలుగా ఒక పురాతన కట్టడాన్ని 1950లలో మరొక చోటికి సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా తరలించారు. అయోధ్య వివాదంలో హిందూ పక్షం కూడా సరిగ్గా దీన్నే ప్రతిపాదించింది. అయితే మతపరంగా, రాజకీయపరంగా రెండురకాలుగా ముస్లిం పక్షం ఈ తిరస్కరించింది. ఒకప్పుడు అల్లా నివాసస్థలంగా భావించిన భూమిలోంచి ఒక ముక్కను తీసుకోవడం అనే అంశంపై తాము చర్చించలేమని ముస్లిం పక్షం వాదిం చింది. ఇక రెండోది ఏమిటంటే ఒకసారి హిందూ పక్షం నుంచి వస్తున్న ఈ డిమాండును అంగీకరించినట్లయితే అనేక ఇతర వివాదాస్పద ప్రాంతాల్లోనూ ఇదేరకమైన డిమాండ్లను తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి కాశీ, మధుర ప్రాంతాలు ఈ సమస్య బారిన పడకతప్పదని ముస్లిం పక్షం భావన. అయితే సుప్రీంకోర్టు ఈ వివాదంపై ఇటీవలే వెలువరించిన తీర్పు... పైన పేర్కొన్న తొలి అంశాన్ని స్పష్టంగా తిరస్కరించింది. పైగా 1991లో తీసుకొచ్చిన ఒక చట్టం రెండో అంశం విషయంలో కూడా తలుపులు మూసివేసింది. అయోధ్య కాకుండా ఇతర ప్రాంతాల్లో మందిర్–మసీదు వంటి వివాదాలు తలెత్తకుండా 1991 నాటి చట్టం అడ్డుకట్టలు వేసింది. అయితే భవిష్యత్తు రాజకీయ మలుపులు, పరిణామాలు దాని మనుగడకు హామీ ఇవ్వలేవు. ప్రస్తుత కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 370 కింద కశ్మీర్‌కు ఇచ్చిన పవిత్రమైన హక్కులను కూడా ఒక్క కలంపోటుతో రద్దుచేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు, 1991నాటి చట్టాన్ని దాటి ముందుకెళ్లడానికి దానికి ఎంత కాలం పడుతుంది? పైగా 1991 నాటి ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవడంపై భారీ ఎత్తున ప్రజా సమీకరణ చేపట్టడం కేంద్రానికి సాధ్యపడుతుంది కూడా. రామాలయాన్ని కాదు కదా... మరే దేవాలయాన్ని కూడా బాబ్రీమసీదు నిర్మాణం కోసం కూల్చివేశారనడానికి ఎలాంటి చారిత్రక, పురావస్తు ఆధారాలు లేనప్పటికీ (నాతో సహా అనేకమంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, వాస్తవానికి భారత పురావస్తు శాఖ సర్వే రిపోర్టులో కూడా బాబ్రీమసీదు కోసం రామాలయాన్ని నిర్మూలించలేదనే వాదిస్తూ వచ్చారు. అయితే మసీదు ప్రాంతంలో జరిగిన తవ్వకాల్లో ఇస్లాంకు సంబంధించినది కాకుండా ఇతర చిహ్నాలు కనిపించాయని ఒక సర్వే నివేదించింది. ఇదే సుప్రీంకోర్టు తీర్పునకు గట్టి ప్రాతిపదిక కల్పించింది), హిందూ సోదరులు మాత్రం అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతం రామ జన్మస్థలం అని బలంగా నమ్ముతున్నందువల్ల, ఇతర దేవాలయాల విషయంలో అలాంటి డిమాండును చేయబోమన్న ప్రాతిపదికన భారీ స్థాయి రామాలయాన్ని నిర్మించుకోవడానికి గాను వివాదాస్పద స్థలాన్ని హిందువులకు సంతోషంగా అప్పగిస్తామని లేదా కనీసం దానికి సంసిద్ధతను తెలుపుతామని చెబుతూ ఆనాడు ముస్లిం పక్షం తన ముందుకు వచ్చిన ఆ ప్రతిపాదనను ఆమోదించి ఉంటే తదనంతర భారత సామాజిక చరిత్రలో ఏం జరిగి ఉండేది లేక ఏం జరిగి ఉండదు అనేది మన ఊహకు కూడా అంది ఉండదు. మత ఘర్షణలు దాని ఫలితమే! అయితే ముస్లిం పక్షం ఆనాడే అలా అంగీకరించి ఉన్నట్లయితే, అయోధ్య రామాలయం, బాబ్రీమసీదు వివాదం శాశ్వత ప్రాతిపదికన శాంతియుతంగా ముగిసిపోయి ఉండేది. అంతేకాకుండా 1980ల నాటి నుంచి మనం దేశవ్యాప్తంగా చూస్తూ వస్తున్న మతపరమైన ఘర్షణలు తగ్గుముఖం పట్టి ఉండేవని ఘంటాపథంగా చెప్పవచ్చు. దీనివల్ల జరిగి ఉండే మరో ముఖ్య ఫలితం ఏదంటే, భారతీయ జనతా పార్టీ కానీ సంఘ్ పరివార్ కానీ ఈనాడు ఇంత ప్రతిష్టను సాధించి ఉండవు. భారత రాజకీయాల్లో, సమాజంలో ఇప్పుడున్నంత ప్రాధాన్యతా శక్తిగా అవి తయారై ఉండవు. నిజానికి ఆనాడు ముస్లింలు ఆ పని చేసి ఉంటే.. త్యాగాన్ని, సహనాన్ని ప్రబోధించే భారతీయ నీతి సూత్రాలను గౌరవించిన వారుగా వారు ప్రశంసలు అందుకుని ఉండేవారు. ఇతరులకు ఇవ్వడం అనే గుణాన్ని ప్రదర్శించడం ద్వారా ముస్లింలు విజేతలై ఉండేవారు. ఆ రోజు వారు ఆ పని చేసి ఉంటే కనీసం రెండింట్లో ఒకటైనా మంచి ఫలితాన్ని తీసుకుని వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు అందుకు అవకాశమే లేకుండా పోయింది. చరిత్రను మలుపు తిప్పే శిఖరాలవైపు గొప్ప దార్శనికత కలిగిన నాయకులు మాత్రమే తమ సామాజిక వర్గాలను నడిపించగలరు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు సరిగా కానీ తప్పుగా కానీ రాజీకి సంబంధించి మతపరమైన, రాజకీయపరమైన భూమికలను తోసిపుచ్చడమే కాకుండా తనుకు తానుగా మరొక రాజీ మార్గాన్ని ప్రతిపాదించింది. బాబ్రీమసీదును కూల్చివేయడం చట్టవిరుద్దం అని నొక్కిచెబుతూ, అయోధ్య పట్టణంలోనే మసీదుకోసం కీలక ప్రాంతంలో అయిదు ఎకరాల స్థలం ఇవ్వాలన్నది సుప్రీంకోర్టు సూచించిన కొత్త రాజీ. అయితే ముస్లిం కమ్యూనిటీ నాయకత్వం ఈ రాజీ ప్రతిపాదనను ఆమోదించవచ్చు, లేక తిరస్కరించవచ్చు అని కూడా సుప్రీం కోర్టు సూచించింది. ఒక మతాన్ని వేరుచేయడం ప్రమాదకరం ఆ ప్రకారంగానే అయోధ్య వివాదం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సమీక్ష కోరనున్నట్లు తెలిపింది. ఇది దాని రాజ్యాంగ హక్కు కూడా. కానీ అదే సమయంలో సుప్రీంకోర్టు అయోధ్య కేసులో ముస్లిం పక్షానికి ప్రతిపాదించిన అయిదు ఎకరాల భూమిని ముస్లిం లాబోర్డు తిరస్కరించడానికి కూడా వీలుంది.అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు భారతదేశంలోని ముస్లింలందరికీ ఏకైక సంరక్షక వ్యవస్థగా తన్ను తాను ప్రకటించుకుంటున్నట్లు కనిపిస్తుంది. పైగా షరియత్ వ్యవస్థపై దాని అజమాయిషీ అనేది భారత రాజ్యాంగం నుంచి దానికి ఒక విధమైన స్వతంత్రతను కలిగించింది. అందుకే షా బానో కేసు వంటి అంశాల్లో ఇది ముస్లిం కమ్యూనిటీపై భారం మోపింది. దేశంలో హిందుత్వ భావనలు అసాధారణంగా పెరిగిపోవడానికి కూడా ఇదే మూలం అని కూడా చెప్పాలి. ‘ముస్లిం’లు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించడం కంటే హిందుత్వ సంస్థలకు, వారి భావజాలానికి మించిన బలం మరొకటి ఉండబోదనే చెప్పాలి. వీరి భావజాలానికి కీలకమైన అంశం ఏదంటే ముస్లిం కమ్యూనిటీని ఇతరుల నుంచి వేరుపర్చడమే. హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు ఈ దేశంలో క్రియాశీలకమైన పరిష్కారం కాని శత్రుత్వంగా మారిపోయాయి. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ప్రతిపాదించిన కొత్త రాజీ మార్గాన్ని ముస్లింలు తిరస్కరించడం అంటే మేము వర్సెస్ వారు అనే ప్రస్తుతం బలపడిన భావాన్ని మరింతగా పెంచి పోషించడానికే ఉపయోగపడుతుంది. ఈ మేము వర్సెస్ వారు భావజాలం వల్ల బాధితులైనవారు ఉభయపక్షాల్లోనూ ఉంటున్నారు. కానీ ఇలాంటి ప్రతి సందర్భంలోనూ ఒక పక్షమే అధిక మూల్యాన్ని చెల్లిస్తూ వచ్చిందని తప్పక గమనించాలి. వ్యాసకర్త: హర్బన్స్ ముఖియా ప్రొఫెసర్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ -
‘అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచొద్దు’
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే విషయమై పునర్ ఆలోచించాలని బాలీవుడ్ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షాతో పాటు దేశంలోని వందకు పైగా ముస్లిం ప్రముఖులు కోరారు. అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచితే ముస్లిం కమ్యూనిటీకి హాని కలుగుతుందని అభిప్రాయపడుతూ మంగళవారం వారు ఒక ప్రకటనను విడుదల చేశారు. రివ్యూ పిటిషన్ దాఖలు విషయమై మరోసారి ఆలోచించాలంటూ సంతకాల సేకరణ చేపట్టారు. ఇందులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన లాయర్లు, పత్రికా విలేకరులు, సామాజిక కార్యకర్తలు, నటులు, వ్యాపారవేత్తలు, సంగీతకారులతో పాటు విద్యార్థులు ఉన్నారు. అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచడం ద్వారా భారత ముస్లిం సామాజిక వర్గానికి హాని కలుగుతుందని తాము గట్టిగా నమ్ముతున్నామని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రకటనపై సంతకం చేసిన వారిలో సినీ రచయిత అంజుమ్ రాజ్బలి, జర్నలిస్ట్ జావేద్ ఆనంద్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. కాగా అయోధ్యలోని వివాదాస్పద భూమి (2.77) ఎకరాలు హిందువులకే చెందుతుందని సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీవక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని ఆదేశించిన సంగతి విధితమే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) నవంబర్ 17న ప్రకటించింది. -
రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి రావాలని ఎన్నడూ అనుకోలేదని ప్రధాని మోదీ వెల్లడించారు. కానీ, ప్రస్తుతం రాజకీయాల్లో ఒక భాగమై, దేశ ప్రజలకు సాధ్యమైనంత మేరకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సహనం, సంయమనం, పరిణతి చూపిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ప్రధాని ఆకాశవాణిలో మాసాంతపు ‘మన్ కీ బాత్’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ (నేషనల్ కేడెట్ కార్ప్స్) కేడెట్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ‘రాజకీయాల్లోకి ప్రవేశించాలని కానీ, రాజకీయాల గురించి కానీ ఎన్నడూ ఆలోచించలేదు. కానీ, ఇప్పుడు రాజకీయ నేతగా మారా. దేశ సంక్షేమం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నా. దేశ సేవకే పూర్తిగా అంకితమైపోయా’అని ప్రధాని తెలిపారు. ‘చదవడం నాకు చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతా. అప్పుడప్పుడు సినిమాలు, చాలా తక్కువగా టీవీ చూస్తుంటా. కానీ, గూగుల్ ప్రభావం పుస్తక పఠనంపై పడింది. ఏ విషయం గురించి అయినా గూగుల్‌లో వెంటనే తెలుసుకోవచ్చు. అందుకే పుస్తకాలు చదవడం తగ్గిపోయింది’ అని అన్నారు. ‘పాఠశాల రోజుల్లో ఎన్సీసీ కేడెట్‌గా చాలా క్రమశిక్షణతో ఉండేవాడిని. అందుకే ఎన్నడూ శిక్షకు గురికాలేదు. ఓసారి చెట్టు కొమ్మపై గాలిపటం దారంలో ఇరుక్కున్న పావురాన్ని రక్షించేందుకు చెట్టెక్కా. పై అధికారి నన్ను శిక్షిస్తారని అక్కడున్న వారంతా అనుకున్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు’అని చిన్ననాటి ఘటనను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. అయోధ్య తీర్పు అనంతర పరిస్థితులపై ప్రధాని మాట్లాడుతూ.. ‘జాతి ప్రయోజనాలకే పెద్దపీట అని 130 కోట్ల మంది దేశ ప్రజలు మరోసారి నిరూపించారు. ఆ తీర్పును విశాల హృదయంతో ఆహ్వానించారు. సహనం, సంయమనం, పరిణతి చూపిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ఐకమత్యం, శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. విశాఖ స్కూబా డైవర్లకు ప్రధాని ప్రత్యేక ప్రశంసలు పర్యావరణం, సుముద్ర జీవుల పరిరక్షణకు విశాఖకు చెందిన ‘ప్లాటిపస్ ఎస్కేప్’అనే సంస్థకు చెందిన స్కూబా డైవర్లు చేస్తున్న కృషిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ వీరిని మన్ కీ బాత్‌లో ప్రశంసిం చారు. వీరు తీరానికి 100 మీటర్ల దూరంలో సుముద్ర గర్భం లోపలికి వెళ్లి అక్కడ పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను తొలగిస్తున్నారని, రెండు వారాల్లో 4 వేల కేజీల ప్లాస్టిక్‌ను తొలగించినట్లు తనకు తెలిసిందని ప్రధాని వివరించారు. ఈ ప్రక్రియలో స్కూబా డైవర్లకు స్థానికులు సహకరిస్తున్నారని, వీరి చిరు ప్రయత్నం ఇప్పుడు ఉద్యమంగా మారుతోందన్నారు. -
'చారిత్రక తీర్పుతో న్యాయవ్యవస్థపై గౌరవం పెరిగింది'
న్యూఢిల్లీ : అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన తర్వాత ప్రజలు చూపిన సహనం, నిగ్రహం, పరిపక్వతను పరిశీలిస్తే జాతి ప్రయోజనాల కంటే మాకు ఏది ముఖ్యం కాదని రుజువు చేసి చూపారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన మన కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. చారిత్రక తీర్పు తర్వాత దేశం కొత్తం మార్గం, కొత్త సంకల్పంతో ముందుకు సాగుతుందని తెలిపారు. కొత్త సంకల్పంతో అడుగులు వేస్తున్న దేశానికి శాంతి, ఐక్యత, సద్భావన వంటి అనుభూతులను పంచుతూ ముందుకు సాగాలనేది తన కోరిక అని మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా మన్‌కీబాత్‌లో అయోధ్య సమస్యపై 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. అప్పటి ప్రభుత్వం, సమాజం, ప్రజలు సహృద్భావం, శాంతి సామరస్యాన్ని ఎలా కొనసాగించారో ఆయన గుర్తు చేశారు. ఈసారి కూడా నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు 130 కోట్ల మంది భారతీయులు శాంతి, ఐక్యతను పెంపొందించుకొని మెలిగిన తీరు తనకు సంతోషం కలిగించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు అయోధ్య వివాదం పై సుదీర్ఘ న్యాయ పోరాటం ముగిసిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో దేశ ప్రజలకు మరోసారి న్యాయవ్యవస్థ పై అపారమైన గౌరవం పెరిగిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. నిజమైన అర్థంతో తీర్పును వెల్లడించి సుప్రీకోర్టు న్యాయవ్యవస్థ చరిత్రలో మరో మైలురాయిని అధిగమించిందని మోదీ పేర్కొన్నారు. -
అయోధ్య తీర్పు జాప్యానికి ఆ పార్టీయే కారణం!
లాతెహర్ (జార్ఖండ్): అయోధ్య రామమందిరం విషయంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. అయోధ్య తీర్పు జాప్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన నిందించారు. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు సంబంధించిన 2.77 ఎకరాల భూమిని పూర్తిగా బాలరాముడికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయోధ్యలోని ప్రముఖ ప్రదేశంలో ముస్లింలు మసీదు కట్టుకోవడానికి ఐదు ఎకరాలను ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో జార్ఖండ్ లాతెహర్‌లో గురువారం అమిత్ షా ప్రసంగిస్తూ.. ఈ అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే అయోధ్య తీర్పు జాప్యానికి కారణమైందని విమర్శించారు. ‘అయోధ్యలో రామమందిరం కట్టాలా? వద్దా? మీరే చెప్పండి. కానీ, కాంగ్రెస్ ఈ కేసు విచారణ జరగకుండా చూసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించడంతో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది’ అని షా అన్నారు. గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కృషి చేయలేదని, మోదీ సర్కారు ప్రతి ఆదివాసీ బ్లాకులోనూ ఏకలవ్య స్కూళ్లను ఏర్పాటుచేసి.. గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్నారని షా తెలిపారు. -
రక్షణ కల్పించలేం: అయోధ్య పర్యటన రద్దు!
సాక్షి, ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అయోధ్య పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. ఈనెల 24న అయోధ్య రామమందిర నిర్మాణ ప్రాంతాన్ని ఆయన సందర్శిస్తారని పార్టీ వర్గాల ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ.. ఠాక్రే అయోధ్యలో పర్యటిస్తారని తెలిపింది. అయితే ఠాక్రేకు తాము రక్షణ కల్పించలేమని, ఆయన పర్యటనకు అనుమతిని నిరాకరిస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా తెలిపినట్లు సమాచారం. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఆయన బిజీగా ఉన్నాయని, ఆ కారణంతోనే అయోధ్య పర్యటన వాయిదా వేశారనే మరో వార్త కూడా వినిపిస్తోంది. కానీ పార్టీ వర్గాలు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. -
అయోధ్య తీర్పు: యశ్వంత్ సంచలన వ్యాఖ్యలు
ముంబై : అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీజేపీ మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తప్పుబట్టారు. అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై లిటరేచర్ ఫెస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ ఇది కచ్చితంగా తప్పుడు తీర్పే. ఇందులో ఎన్నో లొసుగులు ఉన్నాయి. అయితే ముస్లిం వర్గం ఈ తీర్పును ఆమోదించాలని కోరుతున్నా. జరిగిందేదో జరిగిపోయింది. ముందుకు సాగాల్సిందే తప్పదు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత మరో తీర్పు ఇచ్చే అవకాశం ఉండదు’ అని పేర్కొన్నారు. అదే విధంగా బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో ఎల్కే అద్వానీ, మరికొంత మంది బీజేపీ సీనియర్ నేతలు తొలుత పశ్చాత్తాపం వ్యక్తం చేసినా.. ఆ తర్వాత రామ మందిర నిర్మాణ ఉద్యమం ద్వారా వచ్చిన కీర్తి కారణంగా ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారని చెప్పుకొచ్చారు. కాగా అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి రామ్‌లల్లాకే చెందుతుందని మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా అయోధ్యలోనే ముస్లింల కోసం మసీదు నిర్మాణానికై ఐదెకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తొలుత ఈ తీర్పును స్వాగతించిన ముస్లిం లా బోర్డు.. తీర్పును సవాలు చేయబోమని స్పష్టం చేసింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆదివారం సంచలన ప్రకటన చేసింది. అదే విధంగా తమకు కేటాయిస్తామన్న ఐదెకరాల భూమి కూడా అవసరం లేదని తేల్చిచెప్పింది. -
అయోధ్య తీర్పు: ముస్లిం లా బోర్డు సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపీఎల్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఎఐఎంపీఎల్బీ నిర్ణయించింది. అలాగే మసీదు కోసం కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో ఇవ్వబోయే ఐదెకరాల భూమిని కూడా ముస్లిం లా బోర్డు నిరాకరించింది. తమకు ఆ భూమి అవసరం లేదని తేల్చిచెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుపై సమీక్షించిన బోర్డు సభ్యులు.. తీర్పును సవాలు చేయాలని నిర్ణయించారు. ఆదివారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ, మత పెద్దలు, అయోధ్య కేసులో ముస్లిం పక్షాలతో లక్నోలోని నద్వా కళాశాలలో సమావేశం అయ్యారు. భేటీ అనంతరం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్ ఎప్పుడు వేయాలనేది మాత్రం వారు వెల్లడించలేదు. వారి తరఫున న్యాయవాదులతో మాట్లాడిన అనంతరం తేదీని వెల్లడిస్తామని తెలిపారు. వీరితో భేటీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా పాల్గొన్నారు. కాగా అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలుకుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. అలాగే అయోధ్యలోనే ముస్లింలు మసీదు నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం వారికి ఐదెకరాల భూమిని కేటాయించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును పలు ముస్లిం సంఘాలు మినహా.. దేశంలోని అన్ని వర్గాల వారు స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఎఐఎంపీఎల్బీ దాఖలు చేయబోయే సమీక్ష పిటిషన్‌ను సుప్రీం పరిగణిస్తుందా లేక విచారణకు నిరాకరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
సీజేఐ గొగోయ్‌కి వీడ్కోలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ హోదాలో శుక్రవారమే ఆయనకు చివరి వర్కింగ్ డే. 2018, అక్టోబర్ 3న సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి న్యాయవ్యవస్థలో ఈ స్థాయికి ఎదిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. వివాదం.. సుప్రీంకోర్టులోని ఒక ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా వెంటనే స్పందించిన జస్టిస్ గొగోయ్.. ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీ వేశారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఆ కమిటీలో ఇద్దరు మహిళా జడ్జీలు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిర బెనర్జీలకు స్థానం కల్పించారు. విచారణ అనంతరం ఆ కమిటీ జస్టిస్ గొగోయ్‌కి క్లీన్చిట్ ఇచ్చింది. తిరుగుబాటు.. 2018 జనవరిలో నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి సంచలనం సృష్టించిన నలుగురు సీనియర్ జడ్జీల్లో(గ్యాంగ్ ఆఫ్ ఫోర్) జస్టిస్ గొగోయ్ కూడా ఒకరు. కేసుల కేటాయింపులో సీనియర్ న్యాయమూర్తులపై వివక్షకు పాల్పడుతున్నారంటూ జస్టిస్ మిశ్రాకు వ్యతిరేకంగా నాడు జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ లోకూర్‌లు గళం విప్పిన విషయం తెలిసిందే. ఇటీవలి కీలక తీర్పులు జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని పలు ధర్మాసనాలు కీలక తీర్పులను వెలువరించాయి. వాటిలో ముఖ్యమైనది, అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడికే చెందుతుందని స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పు. శతాబ్దాల వివాదానికి ఆ తీర్పు తెర దించింది. రఫేల్ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్, శబరిమల సహా సంబంధిత వివాదాలను విస్తృత ధర్మాసనానికి నివేదించడం, ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు తదితరాలు వీటిలో కొన్ని. జస్టిస్ గొగోయ్ శుక్రవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి హోదాలో చివరిసారి సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్ 1లో కొద్దిసేపు ఆశీనులయ్యారు. కానీ కేసుల విచారణేదీ చేపట్టలేదు. అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లి.. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. శుక్రవారం 650 మంది హైకోర్టు జడ్జీలతో, 15 వేల మంది న్యాయాధికారులతో సీజేఐ జస్టిస్ గొగోయ్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి రికార్డు సృష్టించారు. వృత్తి జీవితంలో సవాళ్లను తాను కోరుకున్నానని ఈ సందర్భంగా జస్టిస్ గొగోయ్ వారికి చెప్పారు. కష్టాల వల్ల పట్టుదల మరింత పెరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం న్యూఢిల్లీ: పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) వీడ్కోలు పలికింది. ఆదివారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్ గొగోయ్‌కి శుక్రవారమే చివరి పనిదినం కావడంతో బార్ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు పలుకుతూ సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో ఎవరూ ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. అట్టహాసాలు లేకుండా, నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే సహా అత్యున్నత న్యాయస్థానంలోని దాదాపు అందరు జడ్జీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్ గొగోయ్ ఆకాంక్ష మేరకే ఈ కార్యక్రమాన్ని సింపుల్‌గా నిర్వహిస్తున్నామని ఎస్సీబీఏ కార్యదర్శి ప్రీతి సింగ్ వెల్లడించారు. సుప్రీంకోర్టులో పనిచేసిన అత్యున్నత న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగోయ్ ఒకరని ఎస్సీబీఏ అధ్యక్షుడు రాకేశ్‌ఖన్నా ప్రశంసించారు. జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణల పక్కన కూర్చున్న జస్టిస్ గొగోయ్.. ఇతర న్యాయమూర్తులతో కబుర్లు చెబుతూ, న్యాయవాదుల నుంచి బొకేలు స్వీకరిస్తూ సరదాగా కనిపించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు కూడా జడ్జీలతో పాటు కూర్చున్నారు. -
కోర్టు తీర్పు తర్వాత అయోధ్య ఎలా ఉంది?
-
తీర్పు తర్వాత అయోధ్య ఎలా ఉంది?
లక్నో: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇప్పుడు అందరి దృష్టి రామ మందిరం నిర్మాణంపై పడింది. మందిరం పనులు ఎప్పుడు ఎలా చేపడతారు.. ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పట్లో పూర్తవుతాయి? అన్నవిషయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేది సంక్రాంతికా.. లేక శ్రీరామనవమికా అనే విషయంలో స్పష్టత లేకపోయినా అయోధ్యలో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా సాధువులు, భక్తులతో కోలాహలంగా ఉంది. ఇన్నాళ్లూ ఆలయ నిర్మాణంపై స్థానికుల్లో కొంత సందిగ్ధత నెలకొన్నా సుప్రీం తీర్పు సంతోషాన్ని ఇస్తోందంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో వాతావరణమంతా ప్రశాంతగా మారింది. పవిత్ర సరయూ నది తీరంలో ఉన్న రాముడి జన్మస్థలంగా భావించే అయోధ్య పట్టణానికి భక్తులు భారీగా పొటెత్తున్నారు. ఆలయ నిర్మాణానికి కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల వరకు పడుతుందని శిల్పులు చెబుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. -
మందిర నిర్మాణం: షియా బోర్డు భారీ విరాళం
లక్నో: అయోధ్య వివాదం ముగిసి పోయిన నేపథ్యంలో రామమందిర నిర్మాణానికి సర్వం సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి తామూ చేయూతనిస్తామని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ముందుకొచ్చింది. మందిర నిర్మాణం కొరకు రూ.51000 విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు షియా సెంట్రల్ బోర్డు చీఫ్ వసీం రిజ్వీ శుక్రవారం తెలిపారు. రామ మందిర నిర్మాణానికి తాము అనుకూలమని అన్నారు. కాగా వివాదాస్పద రామ మందిర- బాబ్రీ మసీదు భూమిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద భూమిని మందిర నిర్మాణానికి కేటాయించి, మసీదుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో దశాబ్దాలుగా హిందూ సంఘాలు చేస్తున్న మందిర నిర్మాణ ప్రయత్నానికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. త్వరలోకే కేంద్ర ప్రభుత్వ అయోధ్య ట్రస్ట్‌నూ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే చర్యలు, సంప్రదింపులను ప్రారంభించింది. -
శబరిమల, రాఫెల్‌పై తీర్పు నేడే
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నెలకొన్న అయో«ధ్య వివాదంపై ఇటీవల తుది తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు మరో మూడు కీలక అంశాలపై తీర్పు ఇవ్వనుంది. శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం, రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో అక్రమాలు, రాఫెల్ తీర్పుపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణ పిటిషన్లపై గురువారం తీర్పునివ్వనుంది. శబరిమల వివాదం.. శబరిమలలో ఉన్న ప్రముఖ అయ్యప్పస్వామి ఆలయంలోకి రుతుక్రమం (10 నుంచి 50 మధ్య వయస్సు)లోని స్త్రీల ప్రవేశంపై నిషేధం ఉంది. ఆలయంలోకి అన్ని వయస్సుల స్త్రీలను అనుమతిస్తూ 2018, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ధర్మాసనం వీటిపై విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వులో ఉంచింది. రఫేల్ వివాదం రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ 2018 డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఈ కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలతో, ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. అలాగే రాఫెల్‌పై సుప్రీంకోర్టును తప్పుగా అన్వయిస్తూ ‘కాపలాదారు దొంగ’అని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణపై పిటిషన్‌పై కూడా ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. -
అయోధ్య తీర్పు: తెరపైకి కొత్త డిమాండ్!
లక్నో : గతంలో అయోధ్యలో ప్రభుత్వం సేకరించిన 67 ఎకరాల్లోనే మసీదు నిర్మాణానికి కూడా భూమిని కేటాయించాలని ముస్లిం వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా జరగని పక్షంలో తమకు ఐదెకరాల భూమి అక్కర్లేదని స్పష్టం చేశాయి. దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ క్రమంలో తొలుత సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించిన ముస్లిం లా బోర్డు.. అటుపిమ్మట చర్చల అనంతరం తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొంది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని స్పష్టం చేసింది. దీంతో మసీదు నిర్మాణానికి స్థల కేటాయింపు విషయమై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో ప్రధాన కక్షిదారు ఇక్బాల్ అన్సారీ మాట్లాడుతూ.. ఒకవేళ తమకు భూమి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే.. తాము కోరిన చోటే కేటాయించాలని పేర్కొన్నారు. ‘మాకు అనువైన చోట.. ఆ 67 ఎకరాల్లోనే స్థలం కేటాయించాలి. అప్పుడే మేం దానిని స్వీకరిస్తాం. లేదంటే తిరస్కరిస్తాం. బయటకు వెళ్లండి. అక్కడే మసీదు నిర్మించుకోండి అనడం సరైంది కాదు కదా’ అని పేర్కొన్నారు. ఇక ఈ వివాదంలో మరో కక్షిదారు హాజీ మహబూబ్, అయోధ్య మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్ హాజీ అసద్ అహ్మద్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘ మాకు ఇలాంటి తాయిలాలు అక్కర్లేదు. మేము అడిగిన చోట మసీదు నిర్మాణానికి భూమి ఇస్తారా లేదా అన్న విషయం స్పష్టం చేయాలి’ అని అసద్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఇక మరికొంత మంది ముస్లిం పెద్దలు మాట్లాడుతూ.. ‘మా మనోభావాలను కోర్టు, ప్రభుత్వాలు గౌరవించినట్లయితే 18వ శతాబ్దానికి చెందిన సూఫీ సాధువు ఖాజీ ఖుద్వా సమాధి ఉన్న ప్రాంతంలోనే భూమి కేటాయించాలి. మేం ఇన్నాళ్లు బాబ్రీ మసీదు కోసమే పోరాడాం. భూమి కోసం కాదు. మేం కోరిన చోట భూమి ఇవ్వనట్లయితే.. మాకు కేటాయిస్తానన్న భూమిని రామ మందిర నిర్మాణం కోసం ఇచ్చేస్తాం’ అని పేర్కొంటున్నారు. మరోవైపు యూసఫ్ ఖాన్ అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టు తీర్పుతో దశాబ్దాల వివాదానికి తెరపడిందని హర్షం వ్యక్తం చేశారు. ‘మేం ప్రార్థనలు చేసుకునేందుకు అయోధ్యలో ఇప్పటికే ఎన్నో మసీదులు ఉన్నాయి. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇంతటితో ఈ వివాదం ముగిసింది. మసీదు నిర్మాణం కోసం భూమి అక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు తమకు కేటాయించిన భూమి విషయమై చర్చించేందుకు సున్నీ వక్ఫ్‌బోర్డు నవంబరు 26న లక్నోలో సమావేశం కానుంది. -
శివసేన మోసం చేసింది: కిషన్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఏడాది భారత్‌లో ‘నో మనీ ఫర్ టెర్రర్’ మీద అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ హోం మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... ‘ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకూడదు’ అనే నినాదంతో మెల్బోర్న్లో సమావేశం జరిగిందని తెలిపారు. 71 దేశాలకు చెందిన అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ సమావేశాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదే విధంగా ఉగ్రవాదులకు సహాయం చేసే బ్యాంకులేవైనా సరే వాటిపై చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో దాయాది దేశం పాకిస్తాన్ తీరును ఆయన ప్రస్తావించారు. ‘పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి డ్రగ్స్ విక్రయించి ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తుంది. దొంగ నోట్లను కూడా ముద్రించి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కారణంగా మనం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. తీర్పును అందరూ స్వాగతించారు.. నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘సబ్ కె సాథ్ సబ్ కె విశ్వాస్’ పేరిట అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి.. అన్నివర్గాల ప్రజలు విశ్వాసం పొందుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. ‘కాంగ్రెస్ సుస్థిరమైన పాలన అందించలేకపోయింది. ఏనాడు కూడా ప్రజల ఏకాభిప్రాయం సాధించలేకపోయింది. అయితే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రామజన్మ భూమి అంశం పట్ల కేంద్రం తన వైఖరిని, ప్రతిపాదనను ధైర్యంగా సుప్రీంకోర్టు ముందుంచింది. అయోధ్య అంశంపై తీర్పును అన్ని వర్గాలు స్వాగతించాయి’ అని పేర్కొన్నారు. అదే విధంగా అభివృద్ధి సాధించే దిశగా కేంద్రం గట్టిగా కృషి చేస్తోందని తెలిపారు. ఆహార భద్రత, విద్యాహక్కును సమర్థవంతగా అమలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా కేంద్ర మంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. రానున్న రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. శివసేన మోసం చేసింది.. ‘మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సివచ్చింది. బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటించి శివసేనతో పొత్తు పెట్టుకుంది. అయితే శివసేన మోసం చేసింది. నిజానికి బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసి ఉంటే అత్యధిక స్థానాల్లో గెలిచి ఉండేది’ అని కిషన్‌రెడ్డి మహా రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ‘స్కూళ్ళు తెరిచాం, పర్యాటకులను అనుమతించాం. 90 శాతం జమ్మూ కశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కేవలం18 పోలీసు స్టేషన్ల పరిధిలో ఉద్రిక్త వాతావరణం ఉంద’ని చెప్పారు. -
అయోధ్య తీర్పు: ‘వారికి పెన్షన్ ఇవ్వాలి’
న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేతలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కరసేవకులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్ చేసింది. 1992లో జరిగిన అయోధ్య ఉద్యమంలో మరణించిన రామభక్తులకు అమరవీరుల హోదా ఇవ్వాలని విఙ్ఞప్తి చేసింది. అదే విధంగా ఉద్యమంలో పాల్గొన్న వారిని ధార్మిక సేనానులుగా గుర్తించి పెన్షన్ ఇవ్వడంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని కోరింది. ఇది కరసేవకులు తెలియక చేసిన తప్పిదమని.. కాబట్టి వారిపై కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసింది. ఈ మేరకు హిందూ మహాసభ చీఫ్ స్వామి చక్రపాణి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మంగళవారం లేఖ రాశారు. ‘నవంబరు 9న రాంలల్లాకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. కాబట్టి అక్కడ మందిరం ఉందనే విషయం స్పష్టమైంది. కాబట్టి కరసేవకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. అయెధ్య ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. స్వాతంత్ర్య సమరయోధుల వలె ధార్మిక సేనానులకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు అందించాలి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నేను ఈ మూడు డిమాండ్లు మీ ముందు ఉంచుతున్నాను’ అని చక్రపాణి లేఖలో పేర్కొన్నారు. కాగా అయోధ్యలో వివాదాస్పందగా మారిన రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సర్వోన్నత న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించిన విషయం విదితమే. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకే చెందుతుందని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు... మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే 5 ఎకరాలు సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే తొలుత సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సున్నీ వక్ఫ్ బోర్డు.. అనంతరం తాము తీర్పును స్వాగతిస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య వివాదానికి తెరపడింది. ఇక భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. -
అయోధ్య ‘ట్రస్ట్’పై అధికారుల అధ్యయనం
న్యూఢిల్లీ: అయోధ్యలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలను కేంద్రం ప్రారంభించింది. ట్రస్ట్ ఏర్పాటు చేసేందుకు, సభ్యుల నియామకంతో పాటు విధి విధానాలను నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు తీర్పును ఒక అధికారుల బృందం అధ్యయనం చేస్తోంది. ఇందుకు న్యాయ శాఖ, అటార్నీ జనరల్ సలహాలను తీసుకోనున్నామని సంబంధిత అధికారులు వెల్లడించారు. ‘ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించిన కీలక విధివిధానాలను రూపొందించేందుకు ఒక అధికారుల బృందం ఏర్పాటైంది. సుప్రీంకోర్టు తీర్పును ఆ బృందం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా∙ట్రస్ట్‌ను ఏర్పాటు చేసేందుకు తీర్పులోని సాంకేతికాంశాలు, ఇతర కీలక భావనలను పరిగణనలోకి తీసుకుంటున్నారు’ అని వివరించారు. ఆ ట్రస్ట్‌కు నోడల్ కేంద్రంగా హోం శాఖ వ్యవహరిస్తుందా? లేక కేంద్ర సాంస్కృతిక శాఖ వ్యవహరిస్తుందా? అనే విషయంలోనూ స్పష్టత లేదు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలోనే రామమందిర నిర్మాణం జరగాలని, అందుకు ఒక ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు శనివారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మందిర నిర్మాణం, సంబంధిత కార్యక్రమాల నిర్వహణ.. మొదలైన అధికారాలు ట్రస్ట్‌కు ఉండాలని కోర్టు పేర్కొంది. ‘రివ్యూ’పై త్వరలో నిర్ణయం వివాదాస్పద స్థలం రాముడిదేనంటూ శనివారం సుప్రీం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే విషయంపై ఈ ఆదివారం నిర్ణయం తీసుకుంటామని సున్నీ వక్ఫ్ బోర్డ్ తరఫున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది జఫర్యాబ్ జిలానీ సోమవారం వెల్లడించారు. 17న జరిగే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సమావేశంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలా? వద్దా అనేది నిర్ణయిస్తామన్నారు. -
అయోధ్య తీర్పు : ఆమె కల సాకారమైంది..!
జబల్పూర్: శ్రీరాముని వెంట వనవాసానికి వెళ్లిన తన భర్త లక్ష్మణుడు తిరిగి వచ్చే వరకు ఊర్మిళ 14 ఏళ్లపాటు నిద్రలోనే గడిపినట్లు రామాయణం చెబుతోంది. అది అప్పటి ఊర్మిళ కథ. అదేవిధంగా, రామాలయం నిర్మాణానికి దారులు పడే వరకు సాధారణ ఆహారం తినబోనంటూ దీక్షబూనారు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన నేటి ఊర్మిళ. అయోధ్యలో రామమందిరం కల సాకారం కావాలని ఎదురుచూస్తున్న వారిలో సంస్కృత ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఊర్మిళా చతుర్వేది(81) ఒకరు. 1992లో బాబ్రీ మసీదు కూల్చేసిన రోజు నుంచి సాధారణ ఆహారం తీసుకోవడం మానేశారు. 27 ఏళ్లుగా పాలు, పండ్లనే తీసుకుంటున్నారు. అయోధ్య వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఊర్మిళ తిరిగి సాధారణ ఆహారం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. సరయూ తీరంలో కార్తీక పౌర్ణమి మంగళవారం కార్తీక పౌర్ణమి కావడంతో లక్షలాది మంది భక్తులు అయోధ్యలోని సరయూనదిలో కార్తీక దీపోత్సవాన్ని జరుపుకోనున్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో అధికారులు.. ఘజియాబాద్‌లోని ఆయోధ్య ద్వారం వద్ద నుంచి అయోధ్య నగరం వరకు 4 కిలోమీటర్ల పొడవునా కట్టుదిట్టమైన భద్రత కలి్పంచారు. ఆ వైపుగా వాహనాల రాకపోకలను నిషేధించారు. -
అయోధ్య తీర్పు : సోంపురా డిజైన్లోనే ఆలయం?
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రకాంత్ సోంపురా.. అయోధ్య తీర్పు వెలువడిన కొద్ది గంటలకే ఈయన పేరు పతాక శీర్షికల్లో చేరిపోయింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితమే డిజైన్ రూపొందించిన శిల్పి ఈయనే. గుజరాత్ వాసి అయిన చంద్రకాంత్ సోంపురా(78) 1989లో నాటి విశ్వహిందూ పరిషత్ చీఫ్ అశోక్ సింఘాల్ వినతి మేరకు రామాలయ నిర్మాణానికి డిజైన్ గీశారు. 1990లో అలహాబాద్‌లో కుంభ మేళా సమయంలో సమావేశమైన సాధువులు ఈ ఆకృతికి సమ్మతించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన రాతి స్తంభాలను మలిచేందుకు ప్రత్యేక కార్యశాల ఏర్పాటు చేశారు. ఈ డిజైన్‌లో పేర్కొన్న విధంగా శిల్పులు శిల్పాలు, స్తంభాల్లో 40 శాతం వరకు ఇప్పటికే చెక్కారు. నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే కనీసం రెండున్నరేళ్లు పడుతుందని చంద్రకాంత్ వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ట్రస్ట్ ఏర్పాటు, వనరుల సమీకరణకు కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. రామ మందిర నిర్మాణ నినాదానికి తోడుగా ఈ నమూనానే ఇంటింటికీ చేరింది. అందుకే ఇదే డిజైన్‌తో ఆలయం రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో నమూనా రూపొందించి, మళ్లీ దానికి తగిన రీతిలో రాయి సమకూర్చుకోవడం వంటి అంశాలు ఇమిడి ఉన్నందున తగు సమయం పట్టే అవకాశం ఉంది. పైగా చంద్రకాంత్ సోంపురా కుటుంబమే దేశ విదేశాల్లోని వందలాది ఆలయాలకు నమూనాలను అందించింది. చంద్రకాంత్ సోంపురా తండ్రి ప్రభాకర్ సోంపురా గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయానికి, మథురలోని శ్రీకృష్ణ ఆలయానికి డిజైన్ అందించారు. చంద్రకాంత్ సోంపురా స్వయంగా 100 ఆలయాలకు శిల్పిగా వ్యవహరించారు. ఇందులో గుజరాత్‌లోని స్వామి నారాయణ్ మందిర్ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ఆలయ పనులు ప్రారంభమవుతాయని, వచ్చే శ్రీరామనవమికి ఆలయ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వీహెచ్‌పీ నేతలు అంటున్నారు. సోంపురా రూపొందించిన నమూనా ఇలా ► ఆలయ నిర్మాణానికి ఆరున్నర ఎకరాల స్థలం అవసరం. ► ఉత్తర భారతంలో ప్రఖ్యాతి గాంచిన ‘నగర’ శైలిలో ఆలయం ఉంటుంది. ► గర్భ గృహం, అంత్రల్, మహా మండపం, రంగ మండపం, ప్రవేశ మండపం.. ఇలా ఐదు భాగాలుగా ఉంటుంది. వీటి గుండానే రాముడి దర్శనం ఉంటుంది. ► గర్భ గృహానికి ఒక ద్వారం, మహా మండపానికి 7 ద్వారాలు ఉంటాయి. ► ఈ ఆకృతిలో ఆలయ నిర్మాణానికి 2.75 లక్షల ఘనపుటడుగుల రాయి అవసరం. ఇప్పటికే 1.25 లక్షల ఘనపుటడుగుల రాయిని చెక్కారు. ► ఈ నమూనా ప్రకారం 270 అడుగుల పొడవు, 126 అడుగుల వెడల్పు, 132 అడుగుల ఎత్తుతో ప్రధాన ఆలయ కట్టడం ఉంటుంది. ఇందులో 81 అడుగుల మేర గోపుర శిఖరం ఉంటుంది. ► 212 స్తంభాలతో నిర్మాణం ఉంటుంది. ► ప్రధాన ఆలయం రెండంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో బాల రాముడి విగ్రహం, మొదటి అంతస్తులో రామ దర్బారు ఉంటుంది. ఆ పైన ఆలయ శిఖరం ఉంటుంది. ► ప్రధాన ఆలయానికి ఒకవైపు కథా కుంజ్ ఉంటుంది. ► రాజస్తాన్ రాష్ట్రంలోని భరత్పూర్ జిల్లా బన్సి పహార్పూర్ నుంచి తెచ్చిన గులాబీ రంగు రాయితో ఇప్పటికే దాదాపు 40 శాతం మేర శిల్పాల పనులు పూర్తయ్యాయి. ► ఆలయ నిర్మాణంలో స్టీలు అవసరం లేదు. -
రామమందిరానికి శంకుస్థాపన ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడిదేనన్న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో రామమందిరం నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో రామమందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఆసక్తి రేపుతుండగా.. వచ్చే ఏడాది శ్రీరామనవమి సందర్భంగా లాంఛనంగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయవచ్చునని తెలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పట్టణంలో రామమందిర నిర్మాణం ప్రారంభమవుతుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బాబ్రీ మసీదు-రామజన్మభూమి భూవివాదం కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల భూమి బాలరాముడి (రామ్ లల్లా విరాజమాన్)కి చెందుతుందని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటయ్యాక వీహెచ్‌పీ.. రామ జన్మభూమి న్యాస్‌తో కలసి వీలైనంత వేగంగా నిర్మాణం ప్రారంభించే ఆలోచనలో ఉంది. వీహెచ్‌పీ అనేక ప్రణాళికలు సిద్ధం చేసినా.. అందులో అత్యధికుల మనోభావాలు, విశ్వాసాలకు అనుగుణంగా ఉండే నిర్మాణ బ్లూ ప్రింట్‌పైనే దృష్టి కేంద్రీకరించింది. రామ మందిరం నిర్మాణానికి కనిష్టంగా నాలుగేళ్లు ఆలయ నిర్మాణాన్ని మొత్తం రెండంతస్తుల్లో చేపట్టేలా ప్లాన్ సిద్ధంగా ఉంది. మొదటి అంతస్తులోనే శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇక ఆలయ పైభాగాన శిఖరం ఉండనుంది. గుడి ఎత్తు 128 అడుగులు, వెడల్పు 140 అడుగులు, పొడవు 270 అడుగులతో నిర్మించనున్నారు. రెండంతస్తుల్లో మొత్తం 212 స్తంభాలు ఉంటాయి. ప్రతీ అంతస్తులో 106 స్తంభాలుంటాయి. ఏళ్లుగా గుడి నిర్మాణానికి అవసరమైన స్తంభాలు, ద్వారాలను శిల్పులు చెక్కుతున్నారు. ఆలయ పునాదిలో ఎక్కడా స్టీల్ వినియోగం లేకుండా చేపట్టనున్నారు. మొత్తం ఆలయ నిర్మాణానికి 1.75 లక్షల ఘనపు అడుగుల ఇసుకరాతి అవసరమవుతుందని భావిస్తున్నారు. ఆలయానికి సింగ్ ద్వార్, నృత్య మండపం, రంగ మండపం, పూజా మండపం, గర్భగుడితో కలిపి మొత్తం ఐదు ప్రవేశ ద్వారాలు ఉండనున్నాయి. మొత్తం ఆలయ నిర్మాణానికి తక్కువలో తక్కువగా నాలుగేళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు. ‘ఇంత సమయంలోనే నిర్మాణం పూర్తవుతుందని నేను హామీ ఇవ్వలేను. కానీ న్యాయ సంబంధిత పనులన్నీ పూర్తవగానే నిర్మాణం ప్రారంభమవుతుందని భావిస్తున్నా’అని అంతర్జాతీయ వీహెచ్‌పీ(ఐవీహెచ్‌పీ) అధ్యక్షుడు అలోక్‌కుమార్ వెల్లడించారు. -
అయోధ్య తీర్పు : నేషనల్ హెరాల్డ్ క్షమాపణలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్ క్షమాపణలు చెప్పింది. అయోధ్య వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కించపరుస్తూ ఆ పత్రిక ఎడిటోరియల్ ప్రచురించడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘అయోధ్యలో హిందువులు ఎప్పటికీ పూజలు చేయలేరు’ అనే టైటిల్‌తో నేషనల్ హెరాల్డ్ ఎడిటోరియల్ ప్రచురించింది. దాంతోపాటు 1992 నాటి అయోధ్య, 2019 లో సుప్రీంకోర్టుగా అవతరించిందని చూపుతూ కార్టూన్ కూడా వేసింది. ‘బెత్తం ఎవరి చేతిలో ఉంటే వారిదే ఎద్దు’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ‘ఒత్తిడి.. హింస.. రక్తపాతంతో నిర్మించిన గుడిలో దేవుడు ఉంటాడా..? అలాంటి చోట ఎవరైనా పూజలు చేయగలరా..? అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ వివాదాస్పద ఎడిటోరియల్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది పక్కా పాకిస్తాన్ నిధులతో నడిచే పత్రిక అని కామెంట్లు చేశారు. అపెక్స్ కోర్టు తీర్పును అవమాని పరిచిన నేషనల్ హెరాల్డ్ యాజమాన్యం శిక్షించాలని కొందరు వ్యాఖ్యానించారు. దీంతో దిగొచ్చిన పత్రికా యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎవరి మనోభావాలైన దెబ్బతింటే క్షమించాలని పేర్కొంటూ ఓ ఆర్టికల్ ప్రచురించింది. వివాదాస్పద ఆర్టికల్‌కు సంబంధించిన ఉద్దేశాలు ఆ రచయిత వ్యక్తిగతమని వెల్లడించింది. సుప్రీం కోర్టు తీర్పు హర్షించదగ్గదని చెప్తూనే.. తన పత్రికలో కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కిందని బీజేపీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు తెలుస్తూనే ఉన్నాయని ఎద్దేవా చేసింది. నేషనల్ హెరాల్డ్‌ను భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1938లో స్థాపించారు. -
అయోధ్య ప్రశాంతం
లక్నో/అయోధ్య/న్యూఢిల్లీ: శతాబ్దాల నాటి మందిరం–మసీదు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు అనంతరం దేశవ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ హిందూ ముస్లిం నేతలతో సమావేశమై తీర్పు అనంతర పరిస్థితులపై చర్చించారు. కీలక తీర్పు వెలువరించిన ధర్మాసనంలోని జడ్జీల భద్రత కోసం అధికారులు ముందుజాగ్రత్తగా మరిన్ని చర్యలు తీసుకున్నారు. కాగా, కోర్టు తీర్పు ప్రకారం మసీదు కోసం ఐదెకరాల భూమిపై చర్చించేందుకు ఈ నెల 26న సున్నీ వక్ఫ్‌బోర్డు సమావేశం కానుంది. ఆలయ పట్టణం అయోధ్యలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసు బలగాల గస్తీ, తనిఖీలు కొనసాగుతున్నా పట్టణంలోని ప్రధాన ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి తిరిగి మొదలయింది. తీర్పు సందర్భంగా శనివారం నాటి ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులకు బదులుగా ఉత్సాహ పూరిత వాతావరణం కనిపించింది. హనుమాన్ గర్హి, నయాఘాట్ల వద్ద జరిగే శ్రీరామ, హనుమాన్ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సుప్రీం తీర్పు, తదనంతర పరిణామాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రికాబ్‌గంజ్ తదితర ప్రాంతాల ప్రజలు వార్తా పత్రికలు చదివేందుకు ఆసక్తి చూపారు. ‘మాకిది చాలా అరుదైన, కొత్త శుభోదయం, ప్రత్యేకమైన ఆదివారం. అయోధ్య వివాదం శాశ్వతంగా పరిష్కారం కావడం ఎంతో ఊరట కలిగించింది’ అని అయోధ్యలోని ఓ హోటల్ మేనేజర్ సందీప్ సింగ్ అన్నారు. ‘రామ్‌లల్లాకు అనుకూలంగా తీర్పు రావడంతో పూలు, పూలదండలకు బాగా డిమాండ్ పెరుగుతుందని వారణాసి తదితర నగరాల నుంచి అదనంగా తెప్పిస్తున్నాం’ అని పూల దుకాణం యజమాని అనూప్ తెలిపారు. శనివారం హోం మంత్రి బిజీబిజీ తీర్పు వెలువడిన శనివారం హోం మంత్రి అమిత్ షా మిగతా కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకున్నారు. తీర్పు అనంతర పరిస్థితులపై వివిధ రాష్ట్రాల సీఎంలు, సీనియర్ పోలీసులు, నిఘా విభాగాల అధికారులతో ఆయన రోజంతా మాట్లాడారని అధికార వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితులపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ ప్రముఖ హిందు, ముస్లిం నేతలతో సమావేశమయ్యారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మత పెద్దలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యూపీలో 77 మంది అరెస్ట్ ఉత్తరప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన 77 మందిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 34 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా సామాజిక మాధ్యమాల్లోని 8,275 పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోగా, అందులో 4,563 పోస్టులు ఆదివారం పోస్టు చేసినవిగా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోనూ అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 26న సున్నీ వక్ఫ్ బోర్డు భేటీ మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించేందుకు సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు ఈనెల 26వ తేదీన సమావేశం కానుంది. ఆ ఐదెకరాల భూమిని తీసుకోవాలా వద్దా అనే విషయమై ఆ సమావేశంలో నిర్ణయిస్తామని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జఫర్ ఫరూఖీ తెలిపారు. ‘కోర్టు తీర్పును సవాల్ చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే, మసీదు కోసం ఆ స్థలాన్ని తీసుకోరాదని కొందరు.. ఆ స్థలంలో విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పక్కనే మసీదు నిర్మిస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. దీనిపై వివరంగా చర్చిస్తాం’అని ఫరూఖీ వెల్లడించారు. జడ్జీలకు భద్రత పెంపు అయోధ్య కేసు తీర్పును ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు జడ్జీలకు భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది. ‘ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, కాబోయే సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల నివాసాల వద్ద అదనపు బలగాలను మోహరించాం. వీరి నివాసాలకు దారితీసే రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశాం. ఈ జడ్జీల వాహనాల వెంట సాయుధ బలగాలతో ఎస్కార్ట్ వాహనం ఉంటుంది’అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 7 భాషలు, 533 డాక్యుమెంట్లు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య భూవివాదానికి సంబంధించిన తీర్పు కోసం సుప్రీంకోర్టు భారీ కసరత్తే చేసింది. సంస్కృతం, హిందీ, ఉర్దూ, పర్షియన్, టర్కిష్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లోని చరిత్ర, సంస్కృతి, పురావస్తు, మత పుస్తకాలను తిరగేసింది. ఇవేకాక మత సంబంధిత కావ్యాలు, యాత్రా వర్ణనలు, పురావస్తు నివేదికలు, బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందరి చిత్రాలు, గెజిటీర్లు, స్థూపాలపై గల శాసనాల అనువాదాలు, ఇలా 533 డాక్యుమెంట్లను పరిశీలించింది. -
హిందూ, ముస్లిం మత పెద్దలతో దోవల్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య తీర్పు నేపథ్యంలో హిందూ ముస్లిం మత పెద్దలతో ఆదివారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఢిల్లీలో భేటీ అయ్యారు. యోగా గురు బాబా రాందేవ్, స్వామి పరమాత్మానంద్, స్వామి చిదానంద్ సరస్వతి, అవదేశానంద మహరాజ్, షియా క్లరిక్ మౌలానా కల్బేజవాద్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తీర్పు తదనంతర పరిణామాలపై చర్చించారు. ప్రతిష్ఠాత్మక కేసులో తీర్పు వెలువడిన సందర్భంగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరక్కుండా ఇరువర్గాలు సంయమనం పాటించిన తీరును అజిత్ దోవల్ ప్రశంసించారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడంతోపాటు భవిష్యత్‌లోనూ సామరస్యంగా వ్యవహరించాలని సంయుక్త తీర్మానం ఆమోదించాయి. -
అయోధ్య తీర్పు: అద్వానీకి జైలుశిక్ష తప్పదా?
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలుగా సాగుతున్న అయోధ్య రామమందిర-బాబ్రీ మసీదు వివాదాస్పద భూ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించడంతో దేశ వ్యాప్తంగా హిందూసంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు వర్గాల మధ్య నలుగుతూ వస్తున్న వివాదానికి ముగింపు పలికి.. న్యాయ వ్యవస్థ సరికొత్త చరిత్రను సృష్టించిందని సంబరపడుతున్నారు. అయోధ్య వివాదంపై తీర్పును వెలువరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం చేసిన వాఖ్యలు పలువురి గుండెల్లో రైలు పరిగెత్తుస్తున్నాయి. ‘1992 డిసెంబర్ 6న కరసేవకులు వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం. మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్ మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ముస్లిం వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది’ అంటూ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ కోర్టులో 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీబీఐ కేసుపై పడింది. బాబ్రీ మసీదు కూల్చివేశారన్న ఆరోపణలతో 40 మంది సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరికొంత మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. (‘అయోధ్య’ రామయ్యదే..!) సీబీఐ కేసులో అద్వానీ.. 1992 డిసెంబర్ 6న సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో 198/92 నెంబర్‌తో మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్ కూడా ఉన్నారు. అయితే 2003 సెప్టెంబర్ 19న రాయ్‌బరేలీలోని స్పెషల్ మెడిస్ట్రేట్ అద్వానీ, జోషీలకు విచారణ నుంచి విముక్తి కల్పించింది. అయితే దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2017లో తీర్పును వెలువరిస్తూ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ, జోషీ, ఉప భారతి, కళ్యాణ్ సింగ్‌లను కూడా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే తాజాగా అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తూ.. మసీదు కూల్చివేతను చట్టవిరుద్ధమైనదిగా వర్ణించింది. ఈ నేపథ్యంలో కేసును విచారిస్తున్న సీబీఐ విచారణను మరింత వేగవంతం చేసింది. దీనిపై పూర్తి నివేదికను త్వరలోనే సుప్రీం ధర్మాసనం ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీంతో మసీదు కూల్చివేత కేసు ఎదుర్కొంటున్న అద్వానీ మరోసారి సీబీఐ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని పలువురు పరిశీలకు అభిప్రాయపడుతున్నారు. కేసు విచారణ తుది దశతో ఉన్న నేపథ్యంలో.. నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషీ, కళ్యాణ్ సింగ్, ఉమ భారతీ కూడా విచారణను ఎదుర్కొన్నారు. దీనిలో భాగంగానే మొన్నటి వరకు రాజస్తాన్ గవర్నర్‌గా ఉన్న కళ్యాణ్ సింగ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించినట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా తీర్పు నేపథ్యంలో విచారణను సీబీఐ ఎలా డీల్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. లిబర్హాన్ కమిషన్.. అయితే 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీమసీదు కూల్చివేత ఘటనపై విచారణకు అప్పటి కేంద్ర ప్రభుత్వం లిబర్హాన్ కమిషన్‌ను అదేనెల 16న ఏర్పాటు చేసింది. హర్యానా హైకోర్టులో సిట్టింగ్ జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ ఎంఎస్ లిబర్హాన్ సారథ్యంలో ఏర్పాటయిన ఈ కమిషన్‌ను... మసీదు కూల్చివేతకు దారితీసిన ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. కమిషన్‌కు తుది నివేదిక ఇవ్వటానికి ఏకంగా 16 ఏళ్ల ఆరు నెలలు పట్టింది. చివరకు 2009 జూన్ 30న కమిషన్ తన 998 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది. విచారణలో భాగంగా కమిషన్ పలువురు అగ్రశ్రేణి రాజకీయ ప్రముఖులను విచారించింది. కమిషన్ ఏం చెప్పిందంటే... ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీతోపాటు బీజేపీకి, హిందూసంస్థలకు చెందిన దాదాపు 68 మందిని ఈ నివేదిక అభిశంసించింది. అప్పటి యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని దుయ్యబట్టింది. ఇలా మత ఆధారిత రాజకీయాలు జరిపే ప్రభుత్వాలను బర్తరఫ్ చేయాలని కూడా కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాజ్‌పేయి, అద్వానీ లాంటి వాళ్లను మిధ్యా ఉదారవాదులుగా అభివర్ణించింది. వీరంతా మూకుమ్ముడిగా బాబ్రీ కూల్చివేతకు ప్రత్యక్ష, పరోక్ష బాధ్యులని స్పష్టంచేసింది. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. బాబ్రీ ఘటనలో అప్పటి కేంద్ర ప్రభుత్వానిది ఏమాత్రం దోషం లేదని కూడా కమిషన్ తెలిపింది. -
అయోధ్య తీర్పుపై సల్మాన్ తండ్రి స్పందన
ముంబై: శతాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య భూమి హక్కుల వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తుదితీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆలయనిర్మాణం కోసం మూడునెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అదేసమయంలో మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీవక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యం పలువురు ముస్లిం ప్రముఖులు స్పందిస్తూ.. తీర్పును వ్యతిరేకించారు. కొందరు మాత్రం సుప్రీం తీర్పును స్వాగతించారు. ఇందులో భాగంలో బాలీవుడ్ లెజండరీ గీత రచయిత, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్ అయోధ్య-బాబ్రీ మసీదు భూవివాదం తీర్పుపై స్పందించారు. ముస్లిం సోదరులకు మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించిన 5 ఎకరాల స్థలంలో మసీదు బదులుగా విద్యాసంస్థలు నిర్మించాలని సూచించారు. ప్రవక్త వివరించిన విధంగా ఇస్లాం మతంలోని రెండు ధర్మాలు.. ప్రేమ, క్షమకు ముస్లిం సోదరులు కట్టుబడి ముందుకు సాగాలన్నారు. తీర్పు ఇవ్వటం పూర్తి అయిందని, ఇక మళ్లీ ఈ వివాదాన్ని తిరగతోడకుడదన్నారు. ప్రేమ, క్షమను చూపాలన్నారు. ఇంత సున్నితమైన తీర్పు ప్రకటించిన తర్వాత దేశ వ్యాప్తంగా శాంతి, సామరస్యాన్ని కొనసాగించిన విధానం ప్రశంసనీయమన్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం పరిష్కరించబడటాన్ని స్వాగతిస్తున్నానని సలీమ్ తెలిపారు. కాగా ముస్లింలు దీని గురించి వ్యతిరేకంగా చర్చింటానికి బదులుగా.. తమ ప్రాథమిక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. తీర్పు ప్రకారం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో ముస్లిం పిల్లల విద్యకు ఉపయోగపడే.. పాఠశాల, కాలేజీలు నిర్మిస్తే మంచిదన్నారు. అదే విధంగా ముస్లింల అసలు సమస్య సరైన విద్యలేకపోవడమని.. కావున అయోధ్య తీర్పుకు స్వస్తిపలికి కొత్త ఆరంభానికి నాందిపలకాలన్నారు. నమాజు ఎక్కడైన పరిశుభ్రమైన ప్రదేశంలో చేసుకోవచ్చు.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలకు నాణ్యమైన విద్యకోసం పాఠశాలు, కాలేజీలు చాలా అవసరమన్నారు. సుమారు 22 కోట్లమంది ముస్లింలు నాణ్యమైన విద్యను పొందేలేకపోతున్నారని తెలిపారు. విద్యతో చాలా సమస్యలు పరిష్కరించబడుతాయని సలీమ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శాంతి కోసం పాటుపతున్నారని.. ఆయన విధానాల్ని అంగీకరిస్తానని తెలిపారు. తమకు(ముస్లిం) శాంతి అవసరమని, భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. కాగా బాలీవుడ్ గీత రయిచతల్లో సలీమ్-జావేద్ ద్వయం పలు బ్లాక్ బాస్టర్ చిత్రాల పాటలకు సాహిత్యం అందించిన విషయం తెలిసిందే. -
అయోధ్యపై అభ్యంతరకర పోస్టులు : 37 మందిపై కేసు
లక్నో : అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ అంశంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన 37 మందిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయోధ్య తీర్పుపై అభ్యంతరకరంగా ఉన్న 3,712 సోషల్ మీడియా పోస్టులను తామిప్పటికే తొలగించామని, మరికొన్ని ప్రొఫైల్స్‌ను డిలీట్ చేశామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు అయోధ్య సహా యూపీలోని అన్ని ప్రాంతాల్లో తీర్పు నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్ధలకు సోమవారం వరకూ సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ రాజధానిలో హైటెక్ కంట్రోల్ రూమ్ నుంచి శాంతి భద్రతల పరిస్ధితిని పర్యవేక్షించారు. అయోధ్య కేసులో తీర్పు వెలువడిన క్రమంలో మీడియా, సోషల్ మీడియా ఇతర మార్గాల్లో వెల్లడయ్యే సమాచారానికి అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు తొలిసారిగా ఎమర్జన్సీ ఆపరేషన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని యూపీ డీజీపీ ఓపీ సింగ్ వెల్లడించారు. -
అయోధ్య తీర్పును వ్యతిరేకించిన జస్టిస్ గంగూలీ
సాక్షి, న్యూఢిల్లీ : దీర్ఘకాలంగా నలుగుతున్న అయోధ్య వివాదానికి స్వస్తిపలుకుతూ సుప్రీం కోర్టు వివాదాస్పద భూమిని రామజన్మ న్యాస్‌కు అప్పగిస్తూ వెలువరించిన తీర్పు పట్ల సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఏకే గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణం కోసం కేంద్రానికి అప్పగించాలన్న సర్వోన్నత న్యాయస్ధాన నిర్ణయం మైనారిటీల దృష్టిలో సరైంది కాదని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుతో తాను కలత చెందానని ఆయన చెప్పారు. ‘రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ హక్కులు ప్రసాదించింది. అయితే ఈ కేసులో మైనారిటీలకు న్యాయం జరగలేద’ని రిటైర్డ్ జస్టిస్ గంగూలీ వ్యాఖ్యానించారు. బాబ్రీమసీదును కూల్చివేశారనేది కాదనలేని విషయమని, సుప్రీం కోర్టు సైతం తన తీర్పులో బాబ్రీ విధ్వంసం చట్టవిరుద్ధమని స్పష్టం చేసిందని అన్నారు. దీన్నిబట్టి చూస్తే సుప్రీం తీర్పుతో మైనారిటీలకు అన్యాయం జరిగిందన్నది స్పష్టమని చెప్పారు. -
అయోధ్య తీర్పు : పాక్ స్పందనపై ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : రామజన్మభూమి-బాబ్రీమసీద్ వివాద కేసుపై సుప్రీం కోర్టు తీర్పు పట్ల పాకిస్తాన్ స్పందనను భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్ స్పందన అవాంఛనీయం, అసందర్భమని తోసిపుచ్చింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని విద్వేషపూరిత వాతావరణం వ్యాప్తిం చేసేందుకే పాకిస్తాన్ ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. భారత్‌కు సంబంధించిన అంతర్గత వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పాక్ వ్యాఖ్యానించిన తీరు దురుద్దేశపూరితంగా ఉందని, అసందర్భంగా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ మాట్లాడుతూ సంతోషకర సమయాన సున్నితత్వం లేని వైఖరి చూపడం పట్ల విచారం వెలిబుచ్చుతున్నట్టు పేర్కొన్నారు. కాగా అయోధ్యలో వివాదాస్పద భూమిని రామజన్మ న్యాస్‌కు అప్పగిస్తూ మసీదుకు ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలం ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు శనివారం చారిత్రక తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఆ ఐదుగురు న్యాయమూర్తులేవరు?
-
‘అయోధ్య’ రామయ్యదే..!
-
ఈ తీర్పు రాసిందెవరు?
న్యూఢిల్లీ: సాధారణంగా తీర్పు వెలువరించే సమయంలో ధర్మాసనం తరఫున ఆ తీర్పును రాసిన న్యాయమూర్తి ఎవరో కూడా ప్రకటిస్తారు. ఒకరికి మించిన న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనాలు తీర్పు ఇచ్చే సమయంలో తీర్పును రాసిన జడ్జీ పేరును ప్రకటించడం సంప్రదాయం. కానీ అయోధ్య తీర్పు విషయంలో ఈ సంప్రదాయాన్ని పాటించకపోవడం విశేషం. అయోధ్య కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారించింది. (చదవండి : ‘అయోధ్య’ రామయ్యదే..!) కోర్టుహాల్లో 1045 పేజీలున్న తుది తీర్పులోని కీలక అంశాలను జస్టిస్ గొగోయ్ చదివి వినిపించారు. తీర్పుతో పాటు 116 పేజీల అనుబంధాన్ని కూడా ప్రత్యేకంగా ఇవ్వడం ఈ తీర్పులోని మరో విశేషం. అయోధ్యలోని ప్రస్తుత వివాదాస్పద స్థలమే శ్రీరాముడి జన్మస్థలమని విశ్వసించేందుకు ఆధారాలేంటనే విషయాన్ని కూలంకశంగా ఆ అనుబంధంలో వివరించారు. ఆ అనుబంధ రచయిత ఎవరో కూడా మిస్టరీగానే ఉంచడం కొనమెరుపు. (చదవండి : ఉత్కంఠ క్షణాలు) -
విగ్రహాలు ‘ప్రత్యక్షం’.. గోరఖ్‌నాథ్ పరోక్షం!
1949లో తొమ్మిది రోజుల పాటు రామచరిత మానస్‌ను పారాయణం చేశారు. చివర్లో బాబ్రీ మసీదులో రాముడు, సీత విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి! ఫలితంగా బాబ్రీ మసీదుని మూసివేశారు. ఈ పారాయణం చేసింది, అప్పటి రామ జన్మభూమి ఉద్యమానికి నాయకత్వం వహించింది మహంత్ దిగ్విజయ్ నాథ్. ఈ సంఘటనే నాథ్ని హిందూమహాసభలో తిరుగులేని నాయకుడిని చేసింది. తరవాత హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఎంపికై, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 1967లో గోరఖ్‌పూర్ ఎంపీగా గెలిచారు. నిజానికి 1921లోనే దిగ్విజయ్నాథ్ కాంగ్రెస్‌లో చేరి, చౌరీచౌరా సంఘటనలో కీలకపాత్ర పోషించారు. అదే ఘటనలో ఆరెస్టయ్యారు. తరవాత హిందుత్వ వాదులతో కలిసి పనిచేస్తూ హిందూ మహాసభలో చేరారు. హిందూ మహాసభ సభ్యుడు గాడ్సేని మహాత్మాగాంధీ హత్యకు ఉసిగొల్పారన్న నేరారోపణపై నాథ్ 9 నెలల పాటు జైల్లో గడిపారు. బయటికి వచ్చాకే రామజన్మభూమి ఉద్యమాన్ని ఆరంభించారు. మఠం నుంచి రాజకీయాల్లోకి... గోరఖ్‌నాథ్ మఠం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంది. 11వ శతాబ్దారంభంలో హిందూ యోగి, సాధువు యోగి గోరఖ్‌నాథ్ దీనికి బీజం వేశారు. దిగ్విజయ్నాథ్ తరవాత ఆయన వారసుడు మహంత్ అవైద్యనాథ్ 1962, 1967, 1969, 1974, 1977లో మణిరామ్ స్వతంత్ర ఎమ్మెల్యేగా, 1970, 1989లో గోరఖ్‌పూర్ ఎంపీగా ఎన్నికయ్యారు. సంఘ్ పరివార్ స్వయంగా రామజన్మభూమి ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో అవైద్యనాథ్ బీజేపీలో చేరి గోరఖ్‌పూర్ ఎంపీగా 1991, 1996లో ఎన్నికయ్యారు. ఇదే మఠం నుంచి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 1998 నుంచి ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉంటూ∙ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అయ్యారు. బాబ్రీ కూల్చివేతలోనూ యోగి ఆదిత్యనాథ్ పాత్ర కీలకమని చెబుతారు. మూలవిరాట్టునాయర్... రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదానికి మూలవిరాట్టు ఎవరైనా ఉన్నారంటే 1949 నాటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కె.కె.కె.నాయర్ అనే యూపీ అధికారి. కృష్ణకుమార్ కరుణాకరన్ నాయర్ కేరళ వాస్తవ్యుడు. కేరళలోని అలెప్పీలో పుట్టి, మద్రాస్ యూనివర్సిటీలో బారాసెనీ కాలేజీలోనూ, అలీగఢ్ యూనివర్సిటీలోనూ, లండన్‌లోనూ ఉన్నత విద్యనభ్యసించారు. 1930లో ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో చేరారు. నాయర్ ఉత్తరప్రదేశ్‌లో వివిధ పదవుల్లో పనిచేశారు. 1949లో ఫైజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. 1949లో గోరఖ్‌నాథ్ మఠం సభ్యుల రామచరిత మానస్ పారాయణం సందర్భంగా బాబ్రీ మసీదులోని ప్రధాన గుమ్మటంలోపల హిందూ దేవతా విగ్రహాలు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాయి. దీనిపై విచారణ జరిపిన నాటి ప్రభుత్వం విగ్రహాలను మసీదులో పెట్టడంలో నాటి జిల్లా అధికారి నాయర్ కీలక సూత్రధారి అని నిర్ధారించింది. సంఘటన జరిగిన క్షణాల్లోనే నాయర్ అక్కడికి చేరుకున్నారని, విగ్రహాలు పెట్టి, వ్యవహారమంతా పూర్తయ్యాకే పై అధికారులకు సమాచారమిచ్చారని ఆరోపణలొచ్చాయి. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలను అక్కడి నుంచి తరలించాలని, నాయర్‌ని పదవి నుంచి తొలగించాలని ఆదేశించారు. నాయర్ పదవిని వదిలి నేరుగా హిందూ మహాసభలో చేరారు. ఈ చర్యతో హిందూత్వ వాదుల్లో కె.కె.నాయర్ హీరోగా మారాడు. నాల్గవ లోక్‌సభలో భారతీయ జనసంఘ్ పార్టీ తరఫున పోటీ చేసి నాయర్ గెలిచారు కూడా. మందిరం.. మసీదు 1528 నుంచి 2019 వరకూ...డేట్ టు డేట్ 1528: మొఘల్ చక్రవర్తి బాబర్ కమాండర్ మిర్ బక్వి బాబ్రీ మసీదును నిర్మించారు. 1885: బాబ్రీ మసీదు ప్రాంతానికి పక్కనే దేవాలయ నిర్మాణానికి అనుమతివ్వాల్సిందిగా ఫైజాబాద్ కోర్టులో మహంత్ రఘుబీర్ దాస్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత. డిసెంబర్ 22–23, 1949: బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షం. హిందువులు దీనిని స్వయంభూగా భావించారు. పూజలకు ప్రయత్నించడం ప్రారంభించారు. విగ్రహాలను తీసుకుని వచ్చి అక్కడ పెట్టారని కొందరి ఆరోపణ. 1950: విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతివ్వాలని ఫైజాబాద్ కోర్టును కోరిన గోపాల్ విశారద్, పరమహంస రామచంద్రదాస్. 1959: వివాదాస్పద స్థలాన్ని తమ అధీనం చేయాలని కేసు వేసిన నిర్మోహీ అఖాడా. 1961: బాబ్రీ మసీదులోని విగ్రహాలను తొలగించడంతోపాటు వివాదాస్పద స్థలం తమకు చెందినదిగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించిన యూపీ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు. 1984: రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్. ఫిబ్రవరి 1, 1986: రామ్‌లల్లా విగ్రహాలకు పూజలు చేసేందుకు హిందువులకు అనుమతిస్తూ ఫైజాబాద్ సెషన్స్ కోర్టు తీర్పు. నిరసన తెలిపేందుకు బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ఏర్పాటు. ఆగస్టు 14, 1989: అలహాబాద్ హైకోర్టుకు స్థల వివాదం. వివాదాస్పద స్థలానికి సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం. నవంబర్ 9, 1989: వివాదాస్పద రామ జన్మభూమి స్థలం సమీపంలో శిలాన్యాస్ నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్‌కు అనుమతిస్తూ అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వ నిర్ణయం. సెప్టెంబర్ 1990: భవ్య రామమందిర నిర్మాణం లక్ష్యంగా గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి భారతీయ జనతాపార్టీ నేత ఎల్.కె.అద్వానీ రథయాత్ర ప్రారంభం. డిసెంబర్ 6, 1992: కరసేవకుల చేతుల్లో నేలమట్టమైన బాబ్రీ మసీదు. చెలరేగిన హింస. డిసెంబర్ 16, 1992: బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై విచారణకు జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ఏర్పాటు. 1993: రామజన్మభూమి తాలూకూ వివాదాస్పద స్థలంతోపాటు పరిసరాల్లోని సుమారు 67 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న పి.వి.నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం. 1994 : స్థల స్వాధీనానికి సుప్రీంకోర్టు సమర్థింపు. ఇస్లామ్ మతంలో మసీదు ఒక భాగం కాదంటూ డాక్టర్ ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఏప్రిల్ 2002: వివాదాస్పద రామజన్మభూమి స్థల యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టులో విచారణ ప్రారంభం. మార్చి 2003: కేంద్రం స్వాధీనం చేసుకన్న భూమిలో మతపరమైన కార్యకలాపాలపై సుప్రీంకోర్టు నిషేధం. 2005: వివాదాస్పద స్థలంపై పేలుడు పదార్థాలు నిండిన జీపుతో ఉగ్రవాదుల దాడి. ఎదురు కాల్పుల్లో అందరూ హతం. 2009: ప్రభుత్వానికి జస్టిస్ లిబర్హాన్ కమిషన్ నివేదిక సెప్టెంబర్ 30, 2010: సున్నీ వక్ఫ్ బోర్డ్, రామ్‌లీలా, నిర్మోహీ అఖాడాకు సమానంగా స్థలాన్ని విభజించాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశం. మే 2011: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ç14 పిటిషన్లు దాఖలు. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం. మార్చి 2017: అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జె.ఎస్.ఖేహర్ సూచన. ఆగస్టు 2017: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన త్రిసభ్య బెంచ్ విచారణ ప్రారంభం. సెప్టెంబర్ 2018: 1994 నాటి ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పును పునః పరిశీలించాలన్న పిటిషనర్ల అప్పీళ్లపై విచారించిన సుప్రీంకోర్టు. విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించరాదంటూ 2:1 తేడాతో న్యాయమూర్తుల తీర్మానం. జనవరి 8, 2019: అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్. ఎస్.ఎ.బొబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లతో ధర్మాసనం. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించిన చీఫ్ జస్టిస్. జనవరి 10, 2019: విచారణ బెంచ్‌లో తాను ఉండరాదని జస్టిస్ యు.యు. లలిత్ నిర్ణయం. దీంతో బెంచ్ పునర్వ్యవస్థీకరణ. జస్టిస్ ఎన్.వి. నారాయణ, జస్టిస్ యు.యు.లలిత్ స్థానంలోకి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్. మార్చి 8, 2019: కోర్టు పర్యవేక్షణలో ఉండే మధ్యవర్తిత్వ కమిటీకి వివాదాస్పద అంశం. అక్టోబర్ 2019: సమస్య సామరస్య పరిష్కారంలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్.ఎం.ఐ.ఖలీఫుల్లా నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీ విఫలం. నివేదిక సమర్పణ. ఆగస్టు 6, 2019: రోజూవారీ విచారణకు చేపట్టిన ధర్మాసనం. అక్టోబర్ 16, 2019: తుదితీర్పు రిజర్వ్. నవంబర్ 9, 2019: వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం తీర్పు బాబర్ ఆదేశాల మేరకు మసీదు నిర్మాణం జరిగిందంటూ గోడలపై ఉన్న శాసనాలు చెబుతున్నాయి. రాముడు జన్మించిన ప్రాంతంలో దేవాలయాన్ని కూల్చివేసి ఆ శిథిలాలపై మసీదు కట్టారన్నది స్థానికులు చెప్పే మాట. 1717: మసీదు స్థలాన్ని కొనుగోలు చేసి రాముడికి దఖలు చేసిన రాజ్‌పూత్ వంశీకుడు జై సింగ్ –2. మసీదు బయట రాముడి విగ్రహాలకు పూజలు. 1768: బాబ్రీ మసీదును ఔరంగజేబు నిర్మించారని కొందరు, బాబర్ కట్టించాడని మరికొందరు స్థానికులు చెప్పినట్లు రికార్డు నమోదు చేసిన జెసూట్ పూజారి జోసెఫ్ టీఫెన్ట్హాలర్. 1853:బాబ్రీ–మందిర్ వివాదంపై దేశంలో తొలిసారి మతఘర్షణలు నమోదు. 1859: బాబ్రీ మసీదు ప్రాంతంలో హిందువులు, ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు కంచె రూపంలో వేర్వేరు ప్రాంతాలను కేటాయించిన బ్రిటిష్ ప్రభుత్వం. సుమారు 90 ఏళ్లు ఈ పద్ధతి కొనసాగింపు. శనివారం అయోధ్యలోని ఓ ఆలయంలో సీతారాముల విగ్రహాలకు నమస్కరిస్తున్న ఓ భక్తురాలు బాబ్రీ మసీదులో పూజలు చేస్తున్న దృశ్యం (ఫైల్) -
5 శతాబ్దాల సమస్య!
2019 నవంబర్ 9న ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును దేశమంతా స్వాగతించింది. అయోధ్య వివాదం పూర్వాపరాలపై సమగ్ర కథనమిది. అయోధ్యలో 1528లో మొఘల్ సామ్రాజ్య సైనికాధికారి మిర్ బాకీ తాష్కేండీ బాబ్రీ మసీదును నిర్మించాడు. హిందువుల పవిత్రంగా భావించే ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఈ మసీదును నిర్మించారనేది వివాదం. 1853–55లో ఈ కట్టడం విషయంలో తొలిసారి ఘర్షణలు చెలరేగడంతో అప్పట్లోనే మసీదు బయటి ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు, లోపలి భాగంలో ముస్లింల ప్రార్థనలకు వీలు కల్పిస్తూ ఓ గోడ నిర్మించారు. తొలి కేసు 1885లో... బాబ్రీ మసీదు ప్రాంగణంలోని ఛబుత్రా జన్మస్థాన్‌లో దేవాలయ నిర్మాణానికి అనుమతివ్వాలంటూ, జన్మస్థాన్‌కు మహంత్‌గా ప్రకటించుకున్న రఘుబర్ దాస్ ఫైజాబాద్ సబ్ జడ్జి కోర్టులో సివిల్ కేసు వేశారు. అయోధ్య న్యాయపోరాటానికి అదే ఆద్యం. స్టేట్ ఆఫ్ ఇండియా కార్యదర్శిని ప్రతివాదిగా చేరుస్తూ దాఖలైన ఈ కేసులో... ఆలయ నిర్మాణాన్ని మసీదు సంరక్షకుడు అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని రఘుబర్ దాస్ కోరారు. 1885 డిసెంబర్ 24న ఫైజాబాద్ సబ్ జడ్జీ కోర్టు న్యాయమూర్తి పండిట్ హరికిషన్ సింగ్ ఈ కేసు కొట్టివేస్తూ... ఆలయ నిర్మాణానికి అనుమతిస్తే ఏదో ఒక రోజు క్రిమినల్ కేసులు దాఖలు కావడంతోపాటు వేల మంది హత్యకు గురయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు. ఆ తీర్పును సవాలు చేస్తూ రఘుబర్‌దాస్ జిల్లా కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి కల్నల్ ఎఫ్.ఇ.ఎ.ఛామెయిర్ కేసు కొట్టేశారు. హిందువుల పవిత్ర స్థలంపై ఓ మసీదు నిర్మించడం దురదృష్టకరమని, ఈ ఘటన ఎప్పుడో 356 ఏళ్ల క్రితం జరిగింది కాబట్టి అప్పుడు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే సమయం మించిపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. యథాతథ స్థితిని కొనసాగించాలని మాత్రమే ఇప్పుడు చెప్పగలమని స్పష్టం చేశారు. రఘుబర్ దాస్ దీన్ని అప్పటి ప్రావిన్స్ ప్రధాన కేంద్రమైన అవధ్ న్యాయస్థానంలోనూ సవాలు చేసినా ఫలితం లేకపోయింది. విభజనతో రాజుకున్న వివాదం... దేశ విభజనతో అయోధ్య వివాదం మరోసారి రాజుకుంది. 1949 డిసెంబర్ 22 రాత్రి బాబ్రీ మసీదులోని ప్రధాన గుమ్మటం లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. అఖిల భారతీయ రామాయణ్ మహాసభ తొమ్మిది రోజులపాటు అఖండ రామాయణ కీర్తన (రామచరిత మానస్ పఠనం) జరిపాక ఈ అద్భుతం చోటు చేసుకుందని, మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయని చెబుతారు. కొందరు వీటిని రహస్యంగా లోపలపెట్టారని కూడా చెబుతారు. ఆ రోజు శుక్రవారం కావడంతో మసీదులో ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో ముస్లింలు చేరడం యాదృచ్ఛికం. దీనిపై అయోధ్య అడిషనల్ సిటీ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ మొదలైంది. విగ్రహాలున్న కట్టడానికి తాళం వేయాలని జస్టిస్ మార్కండేయ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మసీదులోకి ప్రవేశించే హక్కును ముస్లింలు కోల్పోగా, పూజలు చేసుకునే అవకాశం హిందువులకు దక్కింది. కోర్టు నియమించిన నలుగురు పూజారుల ద్వారా పక్క గేటు నుంచి విగ్రహాలను సందర్శించేందుకు వీలు ఏర్పడింది. 1950లో సివిల్ వ్యాజ్యం... రాముడి విగ్రహాలను తొలగించకుండా అయోధ్యకు చెందిన ఐదుగురు ముస్లిం అధికారులను నిరోధించాలని, దర్శనానికి తనకు హక్కు ఉన్నట్లుగా ప్రకటించాలని గోపాల్ సింగ్ విశారద్ 1950లో సివిల్ వ్యాజ్యం వేయడంతో వివాదం మలుపు తిగింది. విచారణ జరిపిన న్యాయమూర్తి ఎన్.ఎన్.ఛద్దా ఇందుకు అనుమతించారు. పైకోర్టులూ ఈ తీర్పును సమర్థించాయి. 1955లో రాష్ట్ర హైకోర్టు కూడా కింది కోర్టుల తీర్పులను బలపరిచింది. ఈ దశలోనే నిర్మోహీ అఖాడా మసీదు ప్రాంతాన్ని తమకివ్వాలని కేసు వేయగా, 1961 డిసెంబరులో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు స్థల యాజమాన్య హక్కులపై తొలి సివిల్ కేసు వేసింది. వీటిపై అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ ఏర్పాటు... 1950–51లో విగ్రçహాల పూజలపై ఆంక్షల్ని సడలించాలని స్థానిక న్యాయవాది ఒకరు 1986లో ఫైజాబాద్ మున్సిఫ్ కోర్టులో తాజా కేసు వేయడం బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ ఏర్పాటుకు కారణమైంది. మున్సిఫ్ కోర్టు ఈ కేసును కొట్టేయటంతో అప్పీల్ చేశారు. ఫైజాబాద్ జిల్లా జడ్జి కె.ఎం.పాండే తీర్పునిస్తూ తాళాలు, గేట్లు తొలగించడం వల్ల నష్టమేమీ లేదన్నారు. ఈ తీర్పు వెలువడిన గంట లోపే జిల్లా యంత్రాంగం తాళాలు తొలగించడం అవతలి వర్గాల్లో అనుమానాలు రేకెత్తించింది. మూడు భాగాలుగా విభజన... 1994లో మసీదు ప్రాంతాన్ని కేంద్రం స్వాధీనం చేసుకునేందుకు వీలు ఏర్పడింది. మసీదు కూల్చివేత నేపథ్యంలో ఆ స్థలాన్ని కేంద్రం ప్రత్యేక చట్టం ద్వారా స్వాధీనం చేసుకోవడం సబబేనని, సెక్యులరిజం భావనకిది వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో 2002 ఏప్రిల్‌లో అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమికి యజమాని ఎవరనేది తేల్చేందుకు అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. జస్టిస్ ఖాన్, జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ ధరమ్వీర్ శర్మలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, రామ్ లల్లా, నిర్మోహీ అఖాడాలకు మూడు సమాన భాగాలుగా చేస్తూ 2010లో తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును మూడు వర్గాలు çసుప్రీం కోర్టులో సవాలు చేశాయి. ఈ ముగ్గురితోపాటు మరో 11 మంది వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కలిపి విచారించి తాజా తీర్పు వెలువరించింది. ప్రభుత్వంలో మార్పు.. రథయాత్ర మొదలైన కొద్ది నెలలకు యూపీలో, కేంద్రంలో ప్రభుత్వాలు మారాయి. యూపీలో బీజేపీ అధికారం చేపట్టగా, కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైంది. పర్యాటకాభివృద్ధి పేరుతో యూపీ ప్రభుత్వం వివాదాస్పద కట్టడం సమీపంలోని అనేక నిర్మాణాల్ని కూల్చేసింది. 1992 డిసెంబర్ 6న గంటల వ్యవధిలోనే కరసేవకుల చేతిలో బాబ్రీ మసీదు ధ్వంసమైంది. దీంతో యూపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 8న పారా మిలటరీ బలగాలు వివాదాస్పద స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. రాముడి విగ్రహాలకు పూజలు నిలిచిపోయాయి. కానీ.. ఆ రోజు సాయంత్రం పూజలు మళ్లీ మొదలయ్యాయి. అప్పటి నుంచి పూజలు కొనసాగుతున్నా భక్తులకు దర్శనాలు మాత్రం లేకుండా పోయాయి. -
తీర్పుకిది సరైన సమయం కాదు: పాక్
ఇస్లామాబాద్: ఓ వైపు కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వ్యాఖ్యానించారు. ఈ చర్యతో తాను బాధకు గురయ్యానని చెప్పారు. సంతోషకరమైన సమయంలో ఇలాంటి సున్నిత అంశంపై తీర్పు సరి కాదని అన్నారు. సిక్కుల మత గురువైన గురునానక్ జయంతి ఉత్సవాల సందర్భంగా మరికొంత కాలం ఆగి తీర్పు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు. భారతీయ ముస్లింలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారని, తాజా తీర్పుతో వారు మరింత ఒత్తిడికి లోనవుతారని అన్నారు. పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ ఈ తీర్పును అన్యాయపు తీర్పుగా అభివర్ణించారు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ శాఖలో ప్రధాన మంత్రి ఇమ్రాన్ అసిస్టెంట్ ఫిర్దౌస్ ఆషిఖ్ అవాన్ సుప్రీంకోర్టును కేంద్రం నడుపుతోందంటూ వ్యాఖ్యానిం చారు. ఓ వైపు పాక్ కర్తార్‌పూర్‌తో మైనారిటీల హక్కులకు రక్షణ కల్పిస్తుంటే, భారత్ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని అన్నారు. -
తీర్పుపై సంతృప్తి లేదు!
సాక్షి, హైదరాబాద్: అయోధ్య–బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు అసంతృప్తి కలిగించిందని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం హైదరాబాద్ శాస్త్రీపురంలోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. బాబ్రీ మసీదుపై సున్నీ వక్ఫ్ బోర్డు న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించారన్నారు. తమ పోరాటం న్యాయమైన, చట్టపరమైన హక్కుల కోసమేనని, ఐదెకరాల భూమి కేటాయింపు అక్కర్లేదని, మసీదుపై రాజీపడే సమస్యే లేదని స్పష్టంచేశారు. ‘‘బాబ్రీ మసీదుకు ఐదువందల సంవత్సరాల చరిత్ర ఉంది. భవిష్యత్తు తరాలకు సైతం బాబ్రీ మసీదు అక్కడ ఉండేదని మేం చెబుతాం. 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదును కూల్చివేసిన వారినే... ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించమని సుప్రీంకోర్టు చెబుతోంది. ఒకవేళ బాబ్రీ మసీదు కూల్చివేతకు గురి కాకుంటే తీర్పు ఏం వచ్చేది?. దేశంలో అనేక ఇతర మసీదులు ఉన్నాయని, వీటిపై కూడా సంఘ్ పరివార్ దావా వేసింది. ఆ సందర్భాల్లో కూడా ఈ తీర్పును ఉదహరిస్తారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం అయోధ్య నుంచి ప్రారంభమవుతోందని దుయ్య బట్టారు. రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, హక్కుల కోసం చివరిదాకా పోరాడతామని పేర్కొన్నారు. తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ వైఖరి ప్రకారం నడుచుకుంటామన్నారు. ‘సుప్రీంకోర్టు సుప్రీం. దాని తీర్పు ఫైనల్. కాకపోతే అన్నివేళలా అది కరెక్టేనని అనుకోలేం’ అన్నారాయన. అయోధ్య వివాదంలో కాంగ్రెస్ తీరును కూడా అసద్ తప్పుబట్టారు. ఆ పార్టీ వల్లే బాబ్రీ మసీదు చేజారిందని, ఆ పార్టీ నిజమైన రంగును బహిర్గతం చేసిందని విమర్శించారు. -
ఒకరి గెలుపు... మరొకరి ఓటమి కానేకాదు!
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ఒకరి విజయంగా... మరొకరి పరాజయంగా చూడకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు దేశచరిత్రలో నూతనాధ్యాయమన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత బలమని మరోమారు నిరూపితమైందని, తీర్పును సమాజంలోని అన్నివర్గాలు సహృదయంతో ఆమోదించడమే ఇందుకు నిదర్శమని చెప్పారాయన. అయోధ్యపై సుప్రీం తీర్పు నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్ 9న బెర్లిన్ గోడ కూలిన ఘటనను ఆయన గుర్తు చేశారు. ఈ రోజే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమవుతోందని కూడా చెప్పారు. ఇది అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలనే సందేశం అందిన రోజని ఆయన చెప్పారు. అనవసర భయాలు, విద్వేషాలు, నెగిటివ్ ఆలోచనలు వదిలి జనమంతా సరికొత్త భారతావని నిర్మాణానికి కలిసిరావాలన్నారు. న్యాయ చరిత్రలో సువర్ణాధ్యాయం వందల ఏళ్లుగా నలుగుతున్న కీలక అంశంపై కోర్టు ఇచ్చిన తీర్పును మోదీ ప్రస్తుతించారు. ఈ విషయమై రోజూ విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని దేశమంతా కోరిందని, సుప్రీంకోర్టు ఈ కోరికను సమర్ధవంతంగా నెరవేర్చిందని తెలిపారు. ఈ రోజు భారత న్యాయచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం అందరి వాదనలు ఓపికతో విని ఏకాభిప్రాయ తీర్పునిచ్చిందన్నారు. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాదం తరాలుగా సాగుతూ వస్తోందని, కానీ తాజా తీర్పుతో కొత్త భారతావని నిర్మాణానికి పూనుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు మన ప్రజాస్వామ్యం ఎంత బలమైందో, ఎంత గొప్పదో ప్రపంచమంతా మరోమారు గుర్తిస్తుందన్నారు. ఇకపై అంతటా శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. డ్రోన్లతో నిఘా.. అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసు శాఖ అప్రమత్తమయింది. ప్రత్యేక నిఘా కోసం డ్రోన్లను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ పౌరులు శాంతి, సామరస్యపూర్వకంగా మెలగాలని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో కార్యకలాపాలను కూడా గమనిస్తామని, వాటిని వాడేటప్పుడు జాగ్రత్తగా వివేకంతో వాడాలని, ఎవరూ ఎటువంటి అసత్యాలు గానీ, విద్వేషపూరిత ప్రచారం గానీ చేయవద్దని సూచించారు. ► యావద్భారత విజయం అయోధ్యపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇవ్వడం శుభపరిణామం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం దొరికింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. యావద్భారతం సాధించిన విజయం. కేసు విషయంలో గతాన్ని పక్కనపెట్టి ఐకమత్యంగా ముందుకెళ్తూ.. శాంతి, సామరస్యాలతో కూడిన భారత నిర్మాణంలో అందరం భాగస్వామ్యం కావాలి. మన సంస్కృతి, ఘనమైన వారసత్వాన్ని కాపాడుకొనేందుకు కృషి చేయాలి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ► సంయమనం పాటించాలి సాక్షి, అమరావతి: అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన తర్వాతే తుది తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ► ఈ తీర్పు ఓ మైలురాయి అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పును స్వాగతి స్తున్నాం. ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుంది. దేశ ఐక్యత, సమగ్రతను మరింత బలోపేతం చేస్తుంది. ఈ తీర్పును అన్ని వర్గాలు, మతాలు ప్రశాంత చిత్తంతో అంగీకరించాలి. ఒకే భారతదేశం– ప్రశస్త భారతదేశం నినాదానికి కట్టుబడి ఉండాలి. శ్రీరామ జన్మభూమి కోసం పోరాడిన సంస్థలకు, సాధు సమాజానికి, అసంఖ్యాక ప్రజలకు కృతజ్ఞతలు. హోంమంత్రి అమిత్ షా ► రాముడు అయోధ్యలో పుట్టాడని రుజువైంది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడు పుట్టాడన్నది నిర్వివా దాంశం. సుప్రీంకోర్టు తీర్పుతో అదే విషయం మరోసారి రుజువైంది. కోర్టు తీర్పు సంతోషం కలిగించింది. కంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్ ఆలయం మాదిరిగా అయోధ్యలో రామాలయం విశాలంగా ఉండాలి. శ్రీరాముని ఆశీస్సులు యావత్ భారతావనికి ఉండాలని ఆకాంక్షిస్తున్నా. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి ► అంతిమ విజయం ఈ తీర్పును ఆర్ఎస్ఎస్ స్వాగతిస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు సరైన ముగింపు పలికింది. ఈ తీర్పు దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉంది. సత్యం, న్యాయం అంతిమంగా గెలుస్తాయని నిరూపించింది. విభేదాలను మరిచి రామాలయ నిర్మాణానికి పనిచేయాలి. అయోధ్యకు సంబంధించి చారిత్రక ఆధారాలున్నందునే ముందుండి పోరాడాం. మథుర, వారణాసిలోని ఆలయాలకు సంబంధించిన ఇలాంటి వివాదాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోబోదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ► ఇరు వర్గాలకు ఊరట అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో హిందూ ముస్లిం వర్గాలకు ఊరట, సంతోషం కలిగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్య నుంచి హిందువులు, ముస్లింలకు సంతృప్తి కలిగించింది’అని ట్విట్టర్లో తెలిపారు. మసీదు నిర్మాణంలో ముస్లిం సోదరులకు హిందూ సోదరులు సాయం చేయడం ద్వారా ఐక్యతా భావం చూపాలి. అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీలో రవి శంకర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. శ్రీశ్రీ రవి శంకర్ -
‘అయోధ్య’ రామయ్యదే..!
న్యాయం, సౌభ్రాతృత్వం, మత విశ్వాసాలపై సమాన గౌరవం తదితర రాజ్యాంగ విలువలు ప్రతిఫలించేలా తీర్పును లిఖించామని భావిస్తున్నాం. 1949, డిసెంబర్ 22 అర్ధరాత్రి రాముడి విగ్రహాలు ఉంచడం, 1992లో మసీదును కూల్చడం.. రెండూ తప్పులే.. ఆ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని మత విశ్వాసాలను భారత రాజ్యాంగం సమంగా గౌరవిస్తుంది. సహనం, పరస్పర గౌరవంతో కలిసి మెలిసి జీవించడం ద్వారా భారత లౌకిక భావన మరింత బలోపేతమవుతుంది.-తీర్పు వెలువరించినన్యాయమూర్తులు సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఒకవంక.. తదనంతర పరిణామాలపై ఆందోళన మరోవంక ఉన్న నేపథ్యంలో... కిక్కిరిసిన కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తుది తీర్పును వెలువరించారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ సభ్యులుగా ఉన్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ఏకగ్రీవంగా ప్రకటించింది. 1045 పేజీల తీర్పులోని కీలకాంశాలను జస్టిస్ గొగోయ్ చదివి విన్పించారు. వివాదాస్పద స్థలం శ్రీరాముడి జన్మస్థలమేనన్న హిందువుల అచంచల విశ్వాసాన్ని కొట్టిపారేయలేమని, అలాగే, బాబ్రీ మసీదు కూల్చివేత ద్వారా జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ‘జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయపాలన సాగే లౌకిక దేశంలో మసీదును కోల్పోయిన నష్టానికి ముస్లింలకు తగిన పరిహారం ఇవ్వడాన్ని కోర్టు పట్టించుకోకపోతే న్యాయం జయించినట్లు కాదు’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘ఆ తప్పుకు పరిహారంగా.. అయోధ్యలోనే మసీదు నిర్మాణం కోసం ఐదేకరాల స్థలాన్ని ముస్లింలకు కేటాయించాలి’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ స్థలాన్ని 1993 నాటి అయోధ్య చట్టం ద్వారా సేకరించిన భూమి నుంచి కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు అప్పగించాలని సూచించింది. ‘వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అ«దీనంలో ఉంటుంది. అనంతరం కేంద్రం నియమించిన ట్రస్ట్‌కు ఆ భూమిని అప్పగిస్తారు. రామ మందిర నిర్మాణాన్ని ఆ ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది’ అని ధర్మాసనం వివరించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు తప్పు వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డ్, రామ్ లల్లాలకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచి్చన తీర్పును రాజ్యాంగ ధర్మాసనం తప్పుబట్టింది. ఆ వివాదాస్పద భూమి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉందని గుర్తు చేసింది. ‘కూలి్చవేతకు గురైన బాబ్రీమసీదుకు అడుగున తమ తవ్వకాల్లో ఒక హిందూ నిర్మాణ శైలితో ఉన్న నిర్మాణం బయటపడిందని పురావస్తు శాఖ పేర్కొంది. అది ఇస్లామిక్ నిర్మాణంలా లేదు అని కూడా చెప్పింది’ అని వివరించింది. ఐదుగురు జడ్జీలు.. 40 రోజులు 2010నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కలీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచుల మధ్యవర్తిత్వ కమిటీ కూడా ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది. చివరగా, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 40 రోజుల పాటు ఏకబిగిన విచారణ జరిపి ఈ అక్టోబర్ 16న తీర్పు రిజర్వ్‌లో పెట్టింది. తుది తీర్పును శనివారం ప్రకటించింది. ‘హిందూ’ ఆధారాలు మెరుగ్గా ఉన్నాయి.. వివాదాస్పద భూమి తమకే చెందుతుందనేందుకు హిందు వర్గాలు చూపిన ఆధారాలు.. ముస్లిం వర్గాలు చూపిన ఆధారాల కన్నా మెరు గ్గా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ‘1857 లో కంచెను నిర్మించినప్పటికీ.. మసీదు బయటి ప్రాంగణంలో హిందువుల పూజలు నిరంతరాయంగా కొనసాగాయని నిర్ధారణ అయింది. ఆ ప్రాంతం హిందువుల అ«దీనంలో ఉందనేందు కు సాక్ష్యాధారాలున్నాయి. 1857లో అవధ్ రాజ్యాన్ని బ్రిటిషర్లు స్వా«దీనం చేసుకున్న నాటి ముందు నుంచి ఆ నిర్మాణం లోపలి ప్రాంగణంలోనూ హిందువులు పూజలు చేశారనేందుకే ఎక్కువ ఆధారాలున్నాయి. కాగా, 16వ శతాబ్దంలో నిర్మాణం జరుపుకున్నప్పటి నుంచి 1857 వరకు ఆ మసీదు అంతర్భాగం పూర్తిగా తమ అధీనంలోనే ఉందనేందుకు సరైన ఆధారాలను ముస్లింలు చూపలేకపోయారు’ అని తీర్పులో పేర్కొంది. సివిల్ దావాగానే.. ‘ఈ కేసును నమ్మకం, విశ్వాసాల ప్రాతిపదికగా విచారించలేదు. రామ్‌లల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డు అనే మూడు పార్టీల మధ్య స్థిరాస్తికి సంబంధించిన సివిల్ వివాదంగానే దీన్ని పరిగణించాం. 2.77 ఎకరాల వివాదాస్పద భూమికి వాస్తవ యజమాని ఎవరనే విషయాన్నే ప్రాతిపదికగా తీసుకున్నాం. ప్రజల భక్తివిశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా తీర్పును ఇవ్వడం లేదు. సాక్ష్యాధారాలను పరిశీలించి, వాటి ఆధారంగానే తీర్పు ప్రకటిస్తున్నాం’ అని ధర్మాసనం తేలి్చచెప్పింది. మసీదు ప్రధాన గుమ్మటం ఉన్న ప్రదేశమే రాముని జన్మస్థలమన్న హిందువుల అచంచల విశ్వాసం నిర్వివాదాంశమేనని వ్యాఖ్యానించింది. కీలకంగా ‘పురావస్తు’ ఆధారాలు! తీర్పులో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అందించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్నామని కోర్టు తెలిపింది. ‘పురావస్తు శాఖ అందించిన ఆధారాలను తేలిగ్గా, కేవలం అభిప్రాయాలుగా కొట్టిపారేయలేం. బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో నిర్మించలేదని, అప్పటికే ఉన్న ఒక హిందూ నిర్మాణాన్ని కూల్చివేసి నిర్మించారని ఏఎస్ఐ చూపిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ నిర్మాణం క్రీ.శ 12వ శతాబ్దంలో నిర్మితమైందని పేర్కొంది. క్రీ.శ 8–10 శతాబ్దాల కాలానికి చెందిన హిందూ పూజా విధానాన్ని చూపే శిథిలాలు గుర్తించింది. అయితే, ఆ నిర్మాణం హిందువుల దేవాలయమేనని ఆ ఆధారాలు నిర్ధారించలేదు’ అని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు ఇదీ.. ►2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తం రామ మందిర నిర్మాణానికే. ►‘ఈ కేసును నమ్మకం, విశ్వాసాల ప్రాతిపదికగా కాదు.. రామ్‌లల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డు అనే 3 పార్టీల మధ్య స్థిరాస్తికి సంబంధించిన సివిల్ వివాదంగా పరిగణించాం. 2.77 ఎకరాల వివాదాస్పద భూమికి వాస్తవ యజమాని ఎవరనేదే ప్రాతిపదికగా తీసుకున్నాం. భక్తి విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా తీర్పునివ్వడం లేదు. సాక్ష్యాధారాలను పరిశీలించి, వాటి ఆధా రంగానే తీర్పు ప్రకటిస్తున్నాం. మసీదు ప్రధాన గుమ్మటం ఉన్న ప్రదేశమే రాముని జన్మస్థలమన్న హిందువుల అచంచల విశ్వాసం నిర్వివాదాంశమే.. ►మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు అప్పగించాలి. ఆ భూమిని అయోధ్య చట్టం, 1993 ద్వారా సేకరించిన భూమి నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ పరస్పర సంప్రదింపుల ద్వారా అప్పగించాలి. ఈ ఆదేశాలను ఈ కోర్టుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా లభించిన అధికారాల ద్వారా ఇస్తున్నాం. ►రామ జన్మభూమిగా విశ్వసిస్తున్న ప్రదేశంలో రామ మందిర నిర్మాణ బాధ్యతలను చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలి. ట్రస్ట్ సభ్యులను కేంద్రం ఎంపిక చేయాలి. ఇందుకు కేంద్రానికి 3 నెలల గడువు ఇస్తున్నాం. ట్రస్ట్‌లో నిర్మోహి అఖాడాకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలి. ►1857లో కంచెను నిర్మించినప్పటికీ మసీదు బయటి ప్రాంగణంలో హిందువుల పూజలు నిరంతరాయంగా కొనసాగాయని నిర్ధారణ అయింది. ఆ ప్రాంతం హిందువుల అధీనంలో ఉందనేందుకు సాక్ష్యాధారాలున్నాయి. 1857లో ఔధ్ రాజ్యాన్ని బ్రిటిషర్లు స్వా«దీనం చేసుకున్న నాటి ముందు నుంచి ఆ నిర్మాణం లోపలి ప్రాంగణంలోనూ హిందువులు పూజలు చేశారనేందుకే ఎక్కువ ఆధారాలున్నాయి. కాగా, 16వ శతాబ్దంలో నిర్మాణం జరుపుకున్నప్పటి నుంచి 1857 వరకు ఆ మసీదు అంతర్భాగం పూర్తిగా తమ అధీనంలోనే ఉందనేందుకు సరైన ఆధారాలను ముస్లింలు చూపలేకపోయారు. ►ముస్లింలకు ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. వివాదాస్పద భూమి తమకే చెందుతుందనేందుకు హిందూ వర్గాలు చూపిన ఆధారాలు.. ముస్లిం వర్గాలు చూపిన ఆధారాల కన్నా మెరుగ్గా ఉన్నాయి. ►పురావస్తు శాఖ(ఏఎస్ఐ) అందించిన ఆధారాలను తేలిగ్గా, కేవలం అభిప్రాయాలుగా కొట్టిపారేయలేం. బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో నిర్మించలేదని, అప్పటికే ఉన్న ఒక హిందూ నిర్మాణాన్ని కూలగొట్టి నిర్మించారని ఏఎస్ఐ చూపిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆ హిందూ నిర్మాణం హిందువుల దేవాలయమేనని ఆ ఆధారాలు నిర్ధారించడం లేదు. ►వివాదాస్పద ప్రదేశాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి, రామ్ లల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డ్‌లకు అప్పగిస్తూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచి్చన తీర్పు సరైంది కాదు. భూ యాజమాన్య హక్కులను నిర్ధారించడంలో హైకోర్టు పొరపాటు చేసింది. వివాదాస్పద స్థలంలోని ప్రధాన భాగం 1500 గజాలు. దాన్ని మూడు భాగాలుగా విభజించడం ఆచరణ సాధ్యం కాదు. దీని వల్ల శాంతీ నెలకొనదు. గెలుపోటముల కోణంలో చూడొద్దు.. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఏ ఒక్క వర్గం గెలుపు లేదా ఓటమిగా భావించరాదు. దేశ ప్రజలంతా శాంతి సామరస్యాలతో మైత్రీభావంతో మెలగాలి. రాముడు లేదా రహీం ఎవరిని పూజించే వారైనా సరే అంతకు మించి ప్రతి ఒక్కరూ దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలి. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యకు సుప్రీంకోర్టు సామరస్యపూర్వక పరిష్కారం చూపింది. – ట్విట్టర్లో ప్రధాని మోదీ తీర్పును స్వాగతిస్తున్నాం.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. దీనిపై మరోసారి కోర్టుకు వెళ్లం. ప్రస్తుతానికి తీర్పును క్షుణ్ణంగా పరిశీలిస్తు న్నాం. త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తాం. లాయర్ ఎవరైనా తీర్పుపై సవాల్ చేస్తామని చెప్పినప్పటికీ అది సరైంది కాదు. – సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఫరూఖీ సుప్రీం తీర్పును గౌరవిస్తాం.. ‘అయోధ్యలో రామాలయం నిర్మాణంపై సానుకూలంగా ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. ఈ విషయంతో సంబంధం ఉన్న అన్ని వర్గాలు, వ్యక్తులు తీర్పునకు కట్టుబడి లౌకిక విలువలను పరిరక్షించాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన సౌభ్రాతృత్వ భావనకు కట్టుబడి ఉండాలి. ప్రజలంతా శాంతి సామరస్యాలను కాపాడాలి. పరస్పర గౌరవించుకోవడం, ఐకమత్యంతో ఉండటం వంటి మన సంప్రదాయ విలువలను గౌరవిద్దాం’ అని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమైన పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కాగా, ‘తీర్పును గౌరవిస్తున్నాం. భారతీయుల సోదరభావానికి, నమ్మకానికి, ప్రేమకు ఇదే సరైన సమయం’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తీర్పును సవాల్ చేయబోం.. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు సంతృప్తి కలిగించింది. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలకడం సంతోషదాయకం. దీనిని సవాల్ చేస్తూ మళ్లీ కోర్టులో పిటిషన్ వేయబోము. కోర్టు తీర్పు ఏదైనా సరే సరైందేనని మేం నమ్ముతున్నాం. – కక్షిదారు ఇక్బాల్ అన్సారీ -
ఉత్కంఠ క్షణాలు
సాక్షి, న్యూఢిల్లీ: తీర్పు నేపథ్యంలో శనివారం కోర్టు పరిసరాలైన తిలక్‌మార్గ్, మండిహౌస్ ప్రాంతాలు గంభీర వాతావరణాన్ని తలపించాయి. దాదాపు నలభై రోజుల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య వివాదంపై వాదనలు ఆలకించింది. తుది తీర్పు వెలువరించే ముందు సుప్రీంకోర్టులో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉదయాన్నే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. (చదవండి : ‘అయోధ్య’ రామయ్యదే..!) జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సుప్రీంకోర్టు వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకే న్యాయవాదులు భారీగా సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. సాధువులు, హిందూ, ముస్లిం మత పెద్దలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. ఉదయం 10:25 గంటలకు పోలీసుల భారీ భద్రత నడుమ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. జైశ్రీరాం నినాదాలు.. ఉదయం 10:32కి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పు చదవడం ప్రారంభించారు. 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా తీర్పు వెల్లడించారు. ఆ వెంటనే కోర్టు బయట జై శ్రీరాం నినాదాలు మిన్నంటాయి. కోర్టు తీర్పును గౌరవిస్తూ హిందూ, ముస్లింలు పలువురు ఆలింగనం చేసుకోవడం కనిపించింది. నవంబరు 15 జస్టిస్ రంజన్ గొగోయ్ అఖరి పనిదినం కావడంతో అయోధ్యపై తీర్పు 13, 14 తేదీల్లో రావచ్చని అంతా భావించారు. అయితే కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం వాద, ప్రతివాదుల్లో ఎవరికైనా రివ్యూ పిటిషన్ దాఖలు చేసే హక్కు ఉండడంతో అన్ని అంశాలను పరిశీలించి శనివారం తీర్పు వెలువరించినట్టు తెలుస్తోంది. (చదవండి : అయోధ్య తీర్పు రాసిందెవరు?) -
అది.. రాముడి జన్మస్థలమే!
న్యూఢిల్లీ: ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రధానంగా దీన్ని మత విశ్వాసాలకు సంబంధించిన వ్యాజ్యంగా కాకుండా... స్థలానికి సంబంధించిన టైటిల్ వివాధంగానే భావించింది. తమ ముందున్న సాక్ష్యాధారాలను అనుసరించి తీర్పునిచ్చింది. వీరితో ఏకీభవిస్తూనే...ఈ ఐదుగురిలో ఒక న్యాయమూర్తి మాత్రం దీన్ని హిందువుల మత విశ్వాసాలకు సంబంధించిన అంశంగా కూడా పేర్కొన్నారు. మొత్తం 1045 పేజీల తీర్పులో ఈ రెండో అభిప్రాయాన్ని దాదాపు 116 పేజీల్లో వెలువరించారు. దీన్లో ప్రధానంగా ఆయన తన ముందున్న సాక్ష్యాధారాలను మూడు కాలాలకు చెందినవిగా విభజించారు. దాని ప్రకారం మొదటిది... పురాణ కాలం. రెండోది మసీదు నిర్మించిన క్రీ.శ. 1528 నుంచి 1858 మధ్యకాలంగా పేర్కొన్నారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు కౌసల్యకు జన్మించారని రామాయణంలో చెప్పారు తప్ప ఎక్కడ జన్మించాడనేది చెప్పలేదని... కానీ రామాయణంతో దాదాపు సమానంగా భావించే రామ్చరిత్ మానస్ (1574)లో రాముడు ఈశాన్యంలో పుట్టాడనే అంశం ఉందని ఆయన పేర్కొన్నారు. స్కంధ పురాణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దాంతో పాటు తాను విచారించిన సాక్షుల్లో సిక్కు చరిత్రపై అధ్యయనం చేసినవారు... క్రీ.శ.1510 సమయంలో గురునానక్ అయోధ్యలో రామ మందిరాన్ని సందర్శించినట్లు చెప్పారని గుర్తుచేశారు. వీటన్నిటినీ బట్టి 1528లో బాబ్రీ మసీదు నిర్మించక ముందే అక్కడ నిర్మాణం ఉందనేది ధ్రువపడుతోందని ఆయన పేర్కొన్నారు. ‘‘పురాణ కాలం నుంచి ఇప్పటిదాకా జరిగిన సంఘటనల క్రమాన్ని చూస్తే మనం ఒకటి స్పష్టంగా గుర్తించవచ్చు. శ్రీ రాముడి పుట్టిన స్థలం మసీదులోని మూడు డోమ్‌ల నిర్మాణానికి అడుగున ఉందనేది హిందువుల విశ్వాసం. జన్మస్థానం మీదనే మసీదును నిర్మించారనేది వారి నమ్మకం. ప్రహరీలోపలి మసీదు ఆవరణను రెండు భాగాలుగా విభజిస్తూ బిట్రీష్ కాలంలోనే గ్రిల్స్‌తో గోడ నిర్మించారు. గ్రిల్స్‌తో నిర్మించిన ఆ ఇనుప గోడ హిందువులను మూడు డోమ్‌ల నిర్మాణంలోకి వెళ్లకుండా నిరోధించింది. బ్రిటిష్ వారి అనుమతితో అప్పటి నుంచే వెలుపలున్న రామ్ ఛబుత్రాలో పూజలు ఆరంభమయ్యాయి. ఆ ఛబుత్రా వద్ద ఆలయం నిర్మించుకోవటానికి అనుమతివ్వాలంటూ 1885లో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అయితే ఇక్కడొకటి గమనించాలి. మసీదు ఆవరణను విభజించి, హిందువులను మూడు డోమ్‌ల నిర్మాణానికి వెలుపల ఉంచినా... అది శ్రీరాముడి జన్మ స్థలమన్న వారి నమ్మకాన్ని మార్చుకోవాలని మాత్రం ఎవరూ చెప్పలేదు. శ్రీరాముడు ఆ అవరణలోనే జన్మించాడన్న విశ్వాసం వల్లే... దానికి సూచనగా అక్కడ ఛబుత్రాలో హిందువులు పూజలు చేస్తున్నారని భావించాలి. ముక్తాయింపు ఏమిటంటే... రాముడి జన్మస్థానంపైనే మసీదు నిర్మించారన్నది హిందువుల విశ్వాసం, నమ్మకం. పురాణకాలం నుంచి జరిగిన పరిణామాలు, ఆ తరవాతి కాలంలో దొరికిన మౌఖిక, లిఖితపూర్వక, చారిత్రక ఆధారాలు... ఇవన్నీ ఆ నమ్మకాన్ని ధ్రువపరుస్తున్నాయి’’అని తన తీర్పులో ఆయన పేర్కొన్నారు. 1850వ సంవత్సరం తరవాత లభ్యమైన ఆధారాలను ప్రస్తావిస్తూ... ► 1858లో అవధ్ థానేదార్ శీతల్ దూబే ఇచ్చిన నివేదికలో మసీదును మాస్క్ జన్మస్థా న్ అని పేర్కొన్నారు. అంటే ఇక్కడ మసీదు మాత్రమే కాక జన్మస్థానం ఉందని ధ్రువపరిచారు. దీన్నొక ఆధారంగా భావించవచ్చు. ► 1878లో ఫైజాబాద్ తాలూకా స్కెచ్‌ను నాటి అయోధ్య సెటిల్మెంట్ అధికారి కార్నెగీ రూపొందించారు. ఆ స్కెచ్‌లో ముస్లింలకు మక్కా, యూదులకు జెరూసలేం ఎలాగో హిందువులకు అయోధ్య అలాంటిదన్నారు. జన్మస్థాన్‌లో 1528లో బాబరు మసీదును నిర్మించినట్లు కార్నెగీ పేర్కొన్నారు. ► 1877లో ప్రచురించిన మరో అవధ్ గెజిటీర్లో హిందూ – ముస్లిం విభేదాలను సవివరంగా ప్రస్తావించారు. ► 1880లో ఎ.ఎఫ్.మిల్లిట్ ’ఫైజాబాద్ లాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ రిపోర్ట్’లో కూడా దీన్ని ప్రస్తావించారు. ► 1889లో నార్త్‌వెస్ట్ అవధ్‌కు చెందిన అర్కియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన నివేదికలో జన్మస్థానంలో అద్భుతమైన పురాతన ఆలయం ఉండేదని, దాని స్థంభాలను ముస్లింలు తమ నిర్మాణంలో కూడా వాడారని పేర్కొంది. -
ఒక తీర్పు – ఒక నమ్మకం
శ్రీరాముడు అనే పౌరాణిక పాత్ర భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద. హిందూ మతం అంటే ఏమిటో కూడా తెలియని ఈ దేశంలో పుట్టి పెరిగే వందలాది జాతులు, వేలాది తెగల మనుషులకు రాము డంటే తెలుసు. రాముడు దేవుడనీ తెలుసు. యాభయ్యే ళ్లకు పూర్వం మనదేశంలో రామాలయం లేని ఊరు ఉండేదే కాదు. శ్రీరాముడు జీవించిన కాలం త్రేతాయుగ మని చెబుతాయి మన పురాణాలు. నాటి యుగధర్మానికి విలువలకు రక్షణగా నిలబడినవాడు రాముడు. రాముని ఆదర్శాల్లో కొన్ని ఆ యుగానికి పనికివచ్చేవి మాత్రమే ఉన్నప్పటికీ సర్వకాలాలకూ పనికివచ్చేవి చాలా ఉన్నా యని మన పెద్దల నమ్మకం. ముఖ్యంగా మనిషి నడవ డిక, కుటుంబ సభ్యులతో, ప్రజలతో మెలగవలసిన తీరులో ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చెబుతారు. శ్రీరామావతారంలో మాయలూ మంత్రాలూ వుండవు. మానవీయ విలువలు మాత్రమే ఉంటాయి. అందువల్ల రాముడు మతచిహ్నం కాదు. ఈ దేశ సాంస్కృతిక చిహ్నం మాత్రమే. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని తెగల ఉమ్మడి ఆస్తి శ్రీరామచంద్రుడు. రామాయణం ఏ కొంచెం తెలిసినవాడైనా రాముడు పుట్టింది అయోధ్య లోనే అనుకుంటాడు. మన వూళ్లో రామాలయం ఉండగా లేనిది ఆయన పుట్టిన ఊళ్లో ఉంటే తప్పేమిటి అనుకుం టాడు. ఇలా అనుకునే వాళ్లలో అన్ని జీవన ప్రవాహాలకు చెందిన వాళ్లుంటారు. ఒకరకంగా ఇది భారతీయుల సమష్టి ఇచ్ఛ. ఆ ఇచ్ఛ రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో ప్రతి ఫలించింది. తీర్పును శిరసావహించిన ముస్లిం మత పెద్దలు ఆదర్శనీయులు. ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్టుగా భారతీయులు ఈ తీర్పును స్వాగతించారు. వందల ఏళ్ల వివాదానికి ముగింపు పలుకుతూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మా సనం ఏకగ్రీవంగా వెలువరించిన తీర్పుపై అనూ హ్యంగా దేశ ప్రజల్లో వెల్లడైన దాదాపు ఏకగ్రీవ స్పందన పెరిగిన మన సామాజిక పరిణతికి నిదర్శనం. మత విశ్వాసాలనూ, నమ్మకాలనూ, భావోద్వేగాలనూ గౌర విస్తూ, వాటి జోలికి వెళ్లకుండా, న్యాయపరమైన అంశాలు, సాక్ష్యాలు–ఆధారాలు ప్రాతిపదికన వాదోప వాదాలను బేరీజు వేసి ఎటువంటి గుంజాటన లేకుండా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పును ఇచ్చింది. మతాల మధ్య విషాన్ని చిమ్మి, మనుషుల మధ్య కల తలు రేపి, చరిత్రలో ఒక నెత్తుటి అధ్యాయాన్ని డిక్టేట్ చేసిన వివాదానికి ఈ తీర్పుతో ఎట్టకేలకు తెరపడిందని భావించవచ్చు. వివాదాస్పదమైన 2.77 ఎకరాల స్థలాన్ని న్యాయస్థానం ‘రాముడి’కే అప్పగించింది. మసీదు నిర్మాణంకోసం 5 ఎకరాల విలువైన భూమిని ఈ కేసులో ప్రధాన కక్షిదారైన సున్నీ వక్ఫ్‌బోర్డుకు కేటాయించాలని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిం చింది. మూడు మాసాల్లోగా ఒక ట్రస్టును ఏర్పాటుచేసి ఆలయ నిర్మాణ పనులను అప్పగించాలని కేంద్రానికి సూచించింది. ఈ తీర్పుపై ఎక్కడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అందుకు రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి–అప్పటితో పోలిస్తే విద్వేషాలు బాగా తగ్గాయి. రెండు– ఈ వివాదం దీర్ఘకాలం సాగడం మంచిది కాదన్న అభిప్రాయం అందరిలో ఏర్పడటం. ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీతోపాటు సీపీఎం మాత్రమే తీర్పును వ్యతిరేకించింది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ స్వాగతించాయి. ప్రధాన కక్షిదారులైన సున్నీ వక్ఫ్ బోర్డు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ రివ్యూ పిటీషన్ వేయకూడదని నిర్ణయం తీసుకుని, తన హుందాతనాన్ని చాటుకున్నది. బాబ్రీ మసీదు ప్రాంగణంలోని రామ్ చబూత్రలో రామమందిరం నిర్మించుకోవడానికి అనుమతి కోరుతూ 1885వ సంవత్సరంలో మహంత్ రఘువరదాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో ఒక వ్యాజ్యం వేశాడు. అప్పుడు మొదలైన న్యాయపోరాటం 134 ఏళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ నేటి సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయపరంగానే ముగింపు దశకు చేరుకోవడం విశేషం. కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలని రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. అప్పట్లో బాబ్రీ మసీద్ ఉద్యమ సమ న్వయ సంఘం(బీఎంఎంసీ) కన్వీనర్‌గా వున్న సయ్యద్ షహాబుద్దీన్ రాజీవ్‌గాంధీకి ఒక లేఖ రాశారు. రామ్ చబూత్ర ప్రాంతంలో రామమందిరం నిర్మించుకోవ చ్చనీ, బాబ్రీ మసీదు వున్న ప్రాంతాన్ని కేంద్రం అధీనం లోకి తీసుకొని రెంటి మధ్యన ఒక అడ్డు గోడ నిర్మిం చాలని, బాబ్రీ మసీదును చారిత్రక ప్రాధాన్యం వున్న కట్టడంగా గుర్తించాలని కోరారు. అదే సమయంలో బీజేపీ అగ్రనాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి, బాబ్రీ మసీదు, రామమందిరం పక్కపక్కనే ఉండేలా మరో రక మైన అభిప్రాయాన్ని ప్రకటించారు. ముస్లింలు వివా దాస్పద స్థలాన్ని సౌహార్దతా సూచకంగా హిందువు లకు అప్పగించాలి. హిందువులు మసీదును అలాగే వుంచి పక్కనే రామమందిరాన్ని నిర్మించుకోవాలి. ఈ రెండు అభిప్రాయాల్లోనూ మందిరం, మసీదు పక్క పక్కనే ఉంటాయి. ప్రభుత్వం ఆ సమయంలో కొంత క్రియాశీల కంగా వ్యవహరించి వుంటే కోర్టు బయటే ఈ వివాదంపై ఒక అంగీకారం కుదిరి ఉండేదేమో. కానీ, ప్రభుత్వం చూపిన అలక్ష్యం వల్ల తరువాతి కాలంలో దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చింది. 1986లో బాబ్రీ మసీదు తలుపులు తెరిచి హిందు వులు పూజలు చేసుకోవచ్చని ఫైజాబాద్ జిల్లా మేజి స్ట్రేట్ అనుమతులిచ్చారు. అదే సమయంలో, ఈ అంశం పార్టీ బలోపేతానికి ఉపకరించేదిగా బీజేపీ భావించి వ్యూహారచన సిద్ధం చేసింది. ముస్లిం వర్గాలు సైతం పోటీగా ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకు న్నాయి. 89 ఎన్నికల్లో బీజేపీ బలం గణనీయంగా పెరి గింది. ఆ ఎన్నికల్లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నాయక త్వంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చి మండల్ సిఫార్సులను ఆమోదిస్తూ ఓబీసీలకు రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థులూ, యువకులూ ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. సమాజంలో ఏర్పడిన అశాంతి వాతావరణాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ రామ మందిర నినాదాన్ని ఉద్యమ స్థాయికి బీజేపీ తీసుకొని పోయింది. మండల్‌కు విరుగుడుగానే బీజేపీ మందిర్‌ను ప్రయోగించిందని విమర్శలు కొన్ని వచ్చినా, వాస్తవానికి ఢిల్లీ గద్దె లక్ష్యంగానే ‘రామ’ బాణాన్ని బీజేపీ ప్రయోగిం చిందని చెప్పవచ్చు. 1984 ఎన్నికల్లో రెండు సీట్లు గెలి చిన పార్టీ 89లో 85 సీట్లకు, 91లో 120 సీట్లకు ఎగబా కడానికి ఆ బాణమే కారణం. రామమందిర నిర్మాణం కోసం అద్వానీ చేసిన రథయాత్ర కూడా బీజేపీ పునాదు లను విస్తృతం చేసింది. ఎన్నికల ప్రచారం మధ్యలో రాజీవ్ గాంధీ దారుణహత్యకు గురికాకుండా వున్నట్ల యితే, బీజేపీ బలం మరింత పెరిగి వుండేది. 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన, అనంతరం చెలరేగిన హింసా, రక్తపాతం దేశ లౌకిక త్వాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ఇప్పుడిప్పుడే ఆ పీడకలల ప్రభావం నుంచి బయటపడి దేశం కోలుకుంటున్న దశలో న్యాయస్థానం ద్వారా సమస్యకు న్యాయపరమైన పరిష్కారం లభించడం ప్రజలకు ఊరట కలిగించే విషయం. మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా న్యాయపరమైన అంశాల ప్రాతిపదికగానే ఈ తీర్పును ఇస్తున్నట్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచి ప్రకటిం చింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం బాబ్రీ మసీదు నిర్మాణం, అంతకుముందే అక్కడ ఉన్న ఒక నిర్మాణం శిథిలాలపై జరిగింది. అలాగే, వివాదాస్పద స్థలం వెలుపల ప్రాంగణంలో క్రమం తప్ప కుండా పూజలు జరుగుతున్నట్టు హిందువులు సాక్ష్యాలు సమర్పించారు. కానీ, ప్రాంగణం లోపలి భాగం ముస్లింల ఆధీనంలోనే వుందనడానికి తగిన సాక్ష్యాలు సమర్పించ లేకపోయారని ధర్మాసనం అభిప్రాయపడింది. బాబ్రీమసీదు నిర్మాణం జరిగిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలను మూడు దశలుగా న్యాయ స్థానం అభిప్రాయపడినట్టు కనిపిస్తున్నది. 1528లో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగినప్పటి నుంచి 1885 వరకు ఒక దశ. రామ్ చబూత్రలో పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని హిందువులు ఆ సంవత్సరం కోర్టులో వ్యాజ్యం వేశారు. అప్పటినుంచి 1949 వరకు ఒకదశ. బాబ్రీ మసీదులో శ్రీరాముడు, సీతాదేవిల విగ్ర హాలను పెట్టారంటూ కేసు నమోదు చేసి ప్రాంగణానికి ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం తాళాలు వేయించింది. నాటినుంచి నేటి వరకు ఉద్వేగాలు, ఉద్యమాలు, న్యాయపోరాటాలు తీవ్రమైన మూడవ దశ. అయోధ్య వివాదాస్పద భూమి మొత్తం రాముడికే చెందుతుం దంటూ ఐదుగురు న్యాయమూర్తులూ ఏకగ్రీవంగానే తీర్పునిచ్చారు. ఐదుగురిలో ఒక న్యాయమూర్తి మరిన్ని ఆధారాలను తీర్పుకు మద్దతుగా నమోదు చేశారు. 1858వ సంవత్సరంలో అవ«ద్ ఠాణేదార్ శీతల్ దూబే ఇచ్చిన నివేదికలో మసీదును మాస్క్ జన్మస్థాన్ అని పేర్కొనడాన్ని ఒక ఆధారంగా న్యాయమూర్తి పేర్కొ న్నారు. మరో ఆధారం 1878లో సెటిల్మెంట్ అధికారి కార్నెగీ గీసిన ఫైజాబాద్ తాలూకా స్కెచ్. ముస్లింలకు మక్కా, యూదులకు జెరూసలేం ఎలాగో హిందువులకు అయోధ్య అలాంటిదని స్కెచ్‌లో కార్నెగి వ్యాఖ్యానిం చాడు. 1528లో జన్మస్థాన్లోనే బాబర్ మసీదును నిర్మిం చాడని అందులో కార్నెగీ అభిప్రాయపడ్డాడు. ఆర్కియా లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాయవ్య అవధ్ విభాగం 1889 నాటి నివేదికలో జన్మస్థాన్‌లో అద్భుతమైన ఆలయం వుండేదని, దాని స్తంభాలను కూడా ముస్లింలు తమ నిర్మాణంలో వాడుకున్నారని వుంది. బాబర్ నిర్మించిన మసీదు మూడు గుమ్మటాల అడుగున శ్రీరాముని జన్మస్థలం వుందనేది అక్కడి హిందువుల ప్రగాఢ విశ్వాసం. రామజన్మస్థలం మీదనే మసీదును నిర్మించారని తరతరాలుగా వారి నమ్మిక. ఒకపక్క ఎన్ని వివాదాలు, న్యాయపోరాటాలూ ముసు రుకుంటున్నా ఇదే నమ్మకం వారిలో పరంపరాగతంగా వస్తున్నదే తప్ప ఎప్పుడూ సడలలేదు. బ్రిటీష్ కాలం లోనే ఆ ప్రాంగణాన్ని విభజించి హిందువులను మూడు గుమ్మటాలకు ఆవలనే ఉంచినా, అది శ్రీరాముని జన్మ స్థలమన్న నమ్మకంతోనే పక్కన వున్న రామ్చబూత్ర నుంచి పూజలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో వారి నమ్మకం నిలువెత్తు ఆలయంగా నిల బడిపోనున్నది. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
అయోధ్య తీర్పుపై స్పందించిన అద్వానీ
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ స్వాగతించారు. తీర్పుపై శనివారం సాయంత్రం ఆయన స్పందించారు. ‘ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. మహోన్నతమైన ఉద్యమంలో పాల్గొనే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. దేశ స్వాతంత్య్ర పోరాటం తరువాత అయోధ్య రామమందిరం కొరకు సాగిన ఉద్యమమే ఉన్నతమైనది. దానిలో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఫలితం వచ్చింది’ అని అన్నారు. కాగా అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంలో రామమందిరం నిర్మించాలని అద్వానీ పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. మందిర నిర్మాణం కొరకు గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర సైతం చేపట్టారు. ఆయన చేపట్టిన యాత్రతోనే మందిర నిర్మాణం ఉద్యమం ఊపందుకుంది. అద్వానీ బాటలోనే నడిచిన పలు హిందూసంఘాలు మందిర నిర్మాణం కొరకు మరింత ఉధృతంగా పోరాటం సాగించాయి. కాగా రథయాత్ర ముగింపు సందర్భంగానే కరసేవకులు అయోధ్యంలోని బాబ్రీ మసీదును ధ్వసం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అద్వానీ సీబీఐ విచారణను కూడా ఎదుర్కొన్నారు. కాగా దశాబ్దాలుగా సాగిన అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు నేటి తీర్పుతో ముగింపు పలికింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ ఆధీనంలో ఉంచాలని, కేంద్రం ఏర్పాటు చేసే ట్రస్ట్‌లో నిర్మోహి అఖాడాకు ప్రాతినిథ్యం కల్పించాలని సూచించింది. ఈ తీర్పుతో అద్వానీ కళ సాకారమైందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. -
సుప్రీం తీర్పు చారిత్రాత్మకం: మోదీ