సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామాలయ నిర్మాణం శంకుస్థాపనకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలింది. దేశమంతా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ఘట్టం బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణ పోరాట చరిత్రలో ముందుభాగంలో ఉన్న బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆలయ శంకుస్థాపన నేపథ్యంలో మంగళవారం రాత్రి ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తన కల సాకారమైన రోజు ఇదని సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేయడం చరిత్రాత్మకమని అన్నారు.
‘అయోధ్యలో రామమందిర నిర్మాణం నాతో సహా భారతీయులందరికీ ఒక ఉద్వేగపూరిత క్షణం. రామజన్మభూమి లో మందిర నిర్మాణం బీజేపీ కల. రథయాత్ర ద్వారా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొనడం ద్వారా నా ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వహించా. సుప్రీంకోర్టు తీర్పుతో సామరస్య వాతావరణంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం శుభపరిణామం. ఈ సామరస్యపూర్వక వాతావరణం భారతీయుల మధ్య కలకాలం నిలబడాలి. భారతీయ నాగరికత వారసత్వానికి రాముడు ఒక ఆదర్శం. రామమందిర నిర్మాణం రామరాజ్యానికి ఆదర్శంగా నిలవాలి. సుపరిపాలన, అందరికీ న్యాయం, సిరి సంపదలకు రామ రాజ్యమే ఒక ఉదాహరణ. రాముడి సద్గుణాలను అందరూ అలవర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా అద్వానీతో పాటు మురళీమనోహర్ జోషీతో పాటు మరికొందరు వీడియో కన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment