అయోధ్యలో రామజన్మభూమి– బాబ్రీ మసీదుకు సంబంధించిన వివాదాస్పద స్థల యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. తాజాగా శ్రీరాముడి వారసుల అంశం తెరపైకి వచ్చింది. శ్రీరాముడి వారసులెవరైనా ఇంకా అయోధ్యలో ఉన్నారా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ విచారణలో భాగంగా ఇటీవల ప్రశ్నించడంతో రఘుకుల రాముడి వారసులం మేమేనంటూ కొన్ని రాజవంశాలు ప్రకటించాయి. ఆ వివరాలు..
కుశుడి వంశస్తులం: జైపూర్ యువరాణి దియా కుమారి
రాముడి వారసులం తామేమని జైపూర్ యువరాణి, రాజ్ సమంద్ ఎంపీ దియా కుమారి ప్రకటించారు. తమ రాజవంశీకుల చరిత్రను సుప్రీంకోర్టు ఎదుట సాక్ష్యాధారాలతో సహా రుజువుచేసేందుకు సిద్ధమన్నారు. పదేళ్ళ క్రితం జైపూర్ మహారాణి దియా కుమారి తల్లి పద్మినీదేవి కూడా తాము రాముడి వారసులమని ప్రకటించిన విషయం గమనార్హం. జైపూర్ రాజు, తన భర్త భవానీ సింగ్ కుశుడికి 309వ వంశీకుడని ఆ రోజు ఆమె ప్రకటించారు.
మాది లవుడి వంశం: సతేంద్రరాఘవ్
‘రాముడికి నిజమైన వారసులం మేమే’ అని రాజస్తాన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సత్యేంద్ర రాఘవ్ చెప్పారు. అందుకు వాల్మీకి రామాయణం లో కూడా సాక్ష్యాలున్నాయన్నారు. తాము రాము డి కుమారుడైన లవుడి తరువాత మూడవ తరానికి చెందిన బద్గుజార్ గోత్రస్తులమన్నారు. ‘బద్గుజార్ వంశం రాముడి పెద్ద కుమారుడు లవుడి వంశం. ప్రస్తు త అయోధ్యలోని నార్త్ కౌశల్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని సౌత్ కౌశల్ వరకు లవుడి సామ్రాజ్యం విస్తరించి ఉందని వాల్మీకి రామాయణం స్పష్టం చేస్తోంద’న్నారు.
మాదీ శ్రీరాముని వంశమే: మేవార్ రాజకుటుంబం
శ్రీరాముడి వంశమైన ఇక్ష్వాక వంశం వారసులం తామని మేవార్ రాజకుటుంబీకులు చెబుతున్నారు. ‘ మేము రాముని వారసులం అనేది చరిత్ర చెప్పే సత్యం. అయితే, మేం రామజన్మభూమిపై హక్కులు కోరబోం. అక్కడ రామాలయం నిర్మించాలన్నదే మా అభిమతం’ అని అరవింద్ సింగ్ మేవార్ ట్వీట్ చేశారు.
సూర్యవంశీ రాజ్‌పుత్‌లు కూడా..
‘సూర్యవంశీ రాజ్‌పుత్‌లమైన మేం కూడా శ్రీరాముడి వంశస్తులమే. ఇది సత్యం. మా వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కోర్టు కోరితే ఇస్తాం’ అని రాజస్తాన్ రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌సింగ్ కచరియావాలా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment