అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం.. | Shiv Sena role in Ram temple cannot be erased | Sakshi
Sakshi News home page

అయోధ్య : మా చరిత్ర చెరిగిపోనిది

Published Sun, Aug 2 2020 1:39 PM | Last Updated on Sun, Aug 2 2020 6:43 PM

Shiv Sena role in Ram temple cannot be erased - Sakshi

సాక్షి, ముంబై : దశాబ్దాల న్యాయ పోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముందడుగు పడింది. ఆగస్ట్‌ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామాలయ నిర్మాణం కార్యక్రమం ప్రారంభంకాబోతుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రాముడి గుడి శంకుస్థాపన కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. దీని కోసం అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాభవుతోంది. మరోవైపు కరోనా వ్యాప్తి దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిధులను ఆహ్వానించాలని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ నిర్ణయించింది. అయితే అయోధ్య రామాలయ నిర్మాణం కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పోరాటం కొనసాగించిన శివసేనను శంకుస్థాపన కార్యక్రమానికి దూరంగా పెట్టడం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నెల 5న జరగబోయే భూమిపూజ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకోనే కీలక ఘట్టానికి తమను ఆహ్వానించలేదని సేనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (మోదీ శపథం: 28 ఏళ్ల తరువాత తొలిసారి)

బీజేపీ మూల సిద్ధాంతమైన హిందుత్వ ఎజెండాను భుజనాకెత్తుకున్న శివసేన మొదటి నుంచీ రామాలయ నిర్మాణం కోసం పాడుపడిందని, దేశంలోని హిందువుల ఆకాంక్షను నెరవేర్చడం కోసం అహర్నిశలు కృషి చేసిందని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల పాటు బాల్‌ఠాక్రే, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో రామాలయ నిర్మాణం కొరకు న్యాయపోరాటంతో పాటు రాజకీయ పోరాటం చేశామంటారు. హిందుత్వ ఎజెండానే ధ్వేయంగా పురుడుపోసుకున్న శివసేనకు తొలుత నాయకత్వం వహించిన బాల్‌ఠాక్రే కరుడుగట్టిన హిందుత్వవాదిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తాజాగా  అయోధ్యలో శంకుస్థాపన సందర్భంగా శివసేన సీనియర్‌ నేతలు, బాల్‌ఠాక్రే సహచరులు చంద్రకాంత్‌ ఖైరే, సూర్యకాంత్‌ మహడీక్‌, విశ్వనాథ్‌, విజయ్‌ దరువాలే వంటి నేతలు ఓ జాతీయ మీడియాతో ముచ్చటించారు. (అయోధ్య రామాలయ భూమిపూజపై భిన్న స్వరాలు)

‘మహారాష్ట్ర రాజకీయాలను కను సైగలతో శాసించిన బాలా సాహేబ్.. బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ, అటల్‌ బిహరీ వాజ్‌పేయీలతో కలిసి మందిర నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారు. 1993లో బాబ్రీ మసీదు కూల్చివేతలో కరసేవలతో పాటు, శివసేన కార్యకర్తలు, నేతల పాత్ర ఎంతో ఉంది. ఆ కేసు విచారణలో భాగంగా సీబీఐ మొదటిసారి నమోదు చేసిన చార్జ్‌షీట్‌లో 48 మంది పేర్లు ఉంటే వారిలో బాల్‌ఠాక్రేతో పాటు మరో పదిమంది కూడా ఉన్నారు. రామాలయ నిర్మాణం కొరకు ఠాక్రే తన చివరిశ్వాస వరకూ పోరాటం చేశారు. ఆయన మరణం అనంతరం బాల్‌ ఠాక్రే బాటలోనే ఉద్ధవ్‌ నడిచారు. బీజేపీతో రాజకీయ పరమైన దోస్తీ కొనసాగిస్తూనే.. అయోధ్య కోసం కొట్టాడారు. కోర్టుల్లో కేసుల విచారణ సాగుతున్నా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా రామాలయం నిర్మాణం చేపట్టాలని ఠాక్రే అనేకసార్లు డిమాండ్‌ చేశారు. (భారీగా ఆలయ నిర్మాణం)

వేయిమంది సేన కార్యకర్తలతో ఉద్ధవ్‌ అయోధ్యలో సైతం పర్యటించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణాల నేపథ్యంలో శివసేనపై బీజేపీ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. బీజేపీ తమను తక్కువ అంచనా వేయడం కారణంగానే సిద్ధాంత పరమైన విభేదాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కానీ శివసేన హిందుత్వ  ఎజెండా మాత్రం ఎప్పటికీ మారదు. రామాలయ నిర్మాణ శంకుస్థాపక కార్యక్రమానికి ఠాక్రేను ఆహ్వానించకపోవడం నిజంగానే అవమానం. తాను చేసిన కృషి ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసు. అయోధ్య పోరాట చరిత్రలో మమ్మల్ని ఎప్పటికీ తొలగించలేరు’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement